రసూల్ మియా సవాసం

పాతింట్లో తలాకిలి కాడ మంచం మీద పండుకోనుండాడు మా కిష్ణాడ్డి తాత. అప్పటికే పదిరోజులాయ తాతకు జరమొచ్చి. పై ఎచ్చగ కాలిపోతాంది. అదీగాక మాంచి ఎండలకాలం. వాకిట్లో నుంచి వచ్చే వడగాలి ఒంట్లోని తడిని ఎగబీర్సి పోతాంది.

తాత తలగడన దిండు సరిజేసి నుదిటి మీద తడిగుడ్డేసి ‘పాడు జరం’అని గొనుక్కుంటా ఇంట్లోకి  పాయ ఎంకటమ్మవ్వ. గత పది రోజుల్నుంచి ఇదే వరస. ఆస్పత్రికి పిల్చక పోదామంటే సేతిలో సిల్లిగవ్వ లేదు. బయట యాన్నేగానీ పది పైసలు అప్పు పుట్టడంల్య. నాలుగేండ్ల నుంచి  యాటా వచ్చే కరువుతో సంసారం అప్పటికే గుల్లై పాయ. ఊర్లో యాడజూసినా బాకీలే. తీసుకున్య సెయ్ బదుల్లు గూడా తిరిగియ్యలేని గడ్డుకాలం. లెక్కున్నోళ్లు యాన్నేగానీ గడ్డన పడకుండా సైగ్గాకుండా తప్పిచ్చుకోని మసులుకుంటనారు. కంట పడ్తే ఎవడు లెక్కడుగుతాడో ఏమోనని వాళ్ల భయం వాళ్లది. కనికరం లేని కాలం వాళ్ల మీద పగబట్నెట్లుంది పరిస్థితి.

కిష్ణాడ్డి తాతకు పిల్లల్యా. పూర్వము వాళ్లు పెద్ద ఆసాములని మా నాయన సెప్తాండ్య. పిలిచ్చే పలికే కరువులు, పెద్దోళ్లు చేసిన పార్టీలతో కాలంతో పాటే ఆస్తిపాస్తులు కరిగిపాయ.  బంధు వర్గమంతా ఊరిర్సి ఎటోల్లట్ల సెట్టకొకరు పుట్టకొకరు పోతిరి. ఆఖరికి తాతొక్కడు ఊర్లో మిగిలిపాయ. వాయివరసలెట్లనో నాకు తెల్దుగానీ మేం పిల్లప్పుటాల్నుంచి తాతా… తాతా…అనే పిలుచ్చాంటిమి. మమ్మల్ను వాళ్లు గూడా మనవళ్ల మాదిరే సూచ్చాంటిరి. వాళ్లది మాది ఇరుగు పొరుగే. వాళ్లకు మంచికి సెడ్డకు మేమే పలుకుతాంటిమి. మాది ఆడికాడికి సంసారమే. మాది మాకు ఎత్తి పోసుకునేటంత ఉండ్య. ఆడికీ మా నాయన ఆడాడ లెక్క అడిగి పెట్టిండ్య. అదో ఇదో అనుకుంటానే పది రోజులు గడ్సిపాయ.

నేను మా కిష్ణాడ్డి తాత కాల్లు పిసుకుతా, అప్పుడప్పుడు ఒళ్లంతా సన్నీళ్ళ గుడ్డతో తుడుచ్చా కూచ్చున్యా . బయట్నుంచి ఎవ్రో కట్టె ఊదపొర్సుకుంటా నడుచ్చన్య చప్పుడాయ.. ఐనా ఇంత ఎండపొద్దున ఎవ్రుంటారుబ్బా అనుకుంటండగానే నెత్తి మీద టవలేసుకుని ఒక్కాలు రోంతట్లా కుంటుకుంటా రసూల్ కనపచ్చ. ఇంట్లోకి వచ్చి రాగానే నెత్తినుండే టవల్ ని సేత్తో తీస్కొని ముఖానికుండే సెమట తుర్సకుంటా ‘ అబ్బబ్బ ఏమెండ..స్స్…’అని నోటితో గాలి ఇర్సి తాత మంచం పక్కకు నర్స్య.

తాత మాత్రం మూసిన కండ్లట్లనే మూసుకునే ఉండాడు. రసూలే తన కుడిసేత్తో తాత మనికట్టు కాడ పట్టుకుని ‘అబ్బ… కాలిపోతాంది గదయ్యా…’ అన్య . ఆ గొంతులో తడిజీర పారాడినట్లనిపిచ్చ ఆ మాటలకి. ‘ఊ…’ అంటా మూలుగుతా తాత కండ్లు తెర్సి చూస్య. ‘నేన్లేయ్యా..రసూల్ ని ‘ అన్య రాని నగు కొని తెచ్చుకుంటా. ’కూచ్చో రసూల్ ‘ అంటా తాత కనుసైగజేస్య. టవల్తో ఒక్కరవ్వ అట్ట ఇదిలిచ్చి ‘కిందనే బాగుంటాదిలే’  అనుకుంటా మంచం పక్కనుండే స్తంభానికానుకుని కూచ్చుండ్య.

మల్లా రసూలే అందుకున్య. ‘నిన్న జివ్వాల కాడ అబ్బరాం కనపచ్చి సెప్య. ల్యాకపోతే నాగ్గూడా తెల్సిండేది గాదు. పదిరోజులైందంటనే! నీ పాసుగుల. ఒక్క మాటట్ల ఎవర్తోనన్నా సెప్పంపక పోతిరా. ఏందయ్యా …మనిషికంటేనా ఏదైనా..’ అంటా  తన కోరమీసాలను రొడ్డ సేత్తో దువ్వుకుండ్య. ఇది రసూల్ కు బాగా అలవాటే.

కిష్ణాడ్డి తాతేం మాటాల్ల్య. అట్లనే కండ్లు తెర్సి  పైన దంతెలపక్క సూచ్చనాడు. మాట్లాడ్డానికి సారం కూడా లేదనుకుంటా. మనిసంతా నీరసం ఆవరించి సచ్చుగా ఉండ్య.

తాతది రసూల్ది శానా పాత సవ్వాసం. మా మాటల సందున ఎప్పుడన్నా రసూల్ గురించి దొర్లినప్పుడు‘ యాయ్ …. బలె ఖచ్చితమైన మనిషిబ్బి. మాటంటే మాటె. ఎనిక్కి సల్లుకునే రకమే  గాదు.’ అనేటోడు తాత. ఆ సెప్పడం గూడా బో గర్వంగా సెప్తాండ్య. ఒక్కోతూరి నాకేమనిపిచ్చేదంటే యా జన్మలోనో ఈల్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టింటిరేమో మళ్లా ఈ జన్మలో ఇట్ల ఒకూరి కడుపున పుట్నారని’. యాదన్నా గానీ ఇద్దరిదీ ఒకే సాలు. నే సూడంగా యానాపొద్దే గానీ ఇద్దరి సందున ఒక్క దుబారా మాట గూడా దొర్లింది ల్యా.

రసూల్ వయసులో ఉన్నెప్పుడు తాత వాళ్లింటికి బో మెండుగా వచ్చాండెనట. వాళ్లకు ఇత్తనం(సెనిక్కాయ) మనిషి రసూలే.  అప్పుడు తాత గూడా మాంచి ప్రాయంలో ఉండి గొర్రు బలే వాటంగా తోల్తండెనట. ఇత్తనం కాడ తాత పగ్గాలు పట్టుకుని గొర్రు తోల్తాంటే ఎద్దులు జజ్జనక తొక్కినట్లు నడుచ్చండెనట. ఈ మారు నుంచి ఆ మారుకు నూలుపోగు పట్నెట్లు గొర్రు సాక్కంగ తోల్తాండ్యనట. ఎంత పన్జేసినా గాని ఎద్దులకు యాన్నేగానీ తూకమనిపీకుండా పని వంగగొట్టేటోడంట. శానా వాటమైన మనిషి. అటుపక్క రసూలేం తక్కువ తిండ్ల్య. ఇత్తనంలో ఆయప్పది బాగా మెదిగిన సెయ్యంట. యాన్నేగానీ ఒడుపు ల్యాకుండా అట్లని పల్చన పడకుండా సేనంతా సమంగా శానా మట్టగిత్తే వాడంట.  మా కిష్ణాడ్డి తాత గొర్రు కు తోడు రసూల్ ఒడి కట్టుకొని ఇత్తనం ఏచ్చాంటే సేండ్లో పని ఆట్లాన్నెట్లు ఉండేదంట. మోడం కురిసే వాన సినుకుల మాదిరి జడిగంలో నుంచి ఇత్తనాలు జలజల రాల్తండ నట. ఇద్దరూ కల్సి రోజుకు అలకంగా పదెకరాల ఇత్తనమేసి పొద్దు వాలక ముందే ఎద్దల్ను ఇంటికి మళ్లిచ్చే వాళ్లంట.

తాత , రసూల్ కల్సి గోరంట్ల సంతలో ఎద్దల్ను పట్టుకోని రోజంతా నర్సుకుంటా మా ఊరికి రాడం, వాళ్లిద్దరు కల్సి వర్సెత్త కోసరమని ఎద్దల బండి కట్టుకోని పొద్దుటూరు తట్టు ఏరుదాటి పోడం అయ్యన్ని తాత కతలు కతలుగా సెప్తాండ్య.  యాటాటా రంజాన్ కు రసూల్ వాళ్లింట్లో మా కిష్ణాడ్డి తాత బువ్వ తినాల్సిందేనట. అట్లనే ఉగాది పారనాపొద్జు తాత వాళ్లింట్లో రసూల్ ముక్క కొరకాల్సిందే.

‘యాడికన్నా తీస్కపొయ్యుంటిరా?’ అన్య రసూల్ నా పక్కజూసి. ‘తీసకపోల్య’  అని తల అడ్డమూపితి. ఎందుకని మాత్రం అడగల్య. అనుభవమున్య మనిషి గదా. కారణం అడిగి మనసు నొప్పించదల్చుకోల్య. కాలం బాగలేదని రసూల్ కు నాకంటే బాగా తెలుసు.

అంతలోకే ఎంకటమ్మవ్వ సెంబులో నీళ్లు తీస్కోనొచ్చ- ‘బాగుండావా రసూల్’ అనుకుంటా. ‘బాగానే ఉండామ్మా’ అన్య.  

నీళ్లు తాగుతా గాటి పక్క జూస్య రసూల్. గాటికి రెండు ఎనుములు కట్టేసి ఉండ్య. ఎద్దుల్లేని ఆ గాల్లను సూచ్చాంటే సెట్లను కొట్టేసిన వనుం మాదిరి అంతా బోసిపోయుండ్య.. అట్టం మీద రెండు సొప్ప దంట్లు తప్ప ఇంగేం కాన్రాల్య. నా పక్క జూసి తలబోసుకోడం మొదలు పెట్య.

‘గాటిపాటకాపక్క పసెద్దును కట్టేచ్చాండ్య. బలెద్దులే అది. ఎంత పన్జేసినా సరే, మాయ్టాల కాడిర్సేటప్పుడు కాలు దువ్వి ఖణా మంటా  రంకేచ్చాండ్య. దాన్తక్య దానిక్యాడ పుట్టిన్యాదో దొమ్మ గానీ. దాని కతే వేరుగా ఉండ్య ‘ అని రోంత ఉసిచ్చి తాత తట్టు సెయ్ పెట్టి కిష్ణాడ్డయ్యకు  ఆ ఎద్దంటే బో భ్రమ. కన్నబిడ్డ మాదిరి సూసుకుంటాండ్య. ఈ ఇంట్లో అది ఏడెమిదేండ్లు జేసింటాది. ఆ పొద్దు మేమిద్దరమే మట్టి బండికి పొయ్టింటిమి. రెండు తడవలు తోలి మూడో తడవకు పోచ్చండగానే సెలొచ్చి ఎద్దు అట్నే ఒరిగిపాయ. మాకు దిక్కుదెల్య. గబగబ పట్టెడ తప్పిచ్చి ఎంతజేసినా కుదరకపాయ. ఎద్దట్లనే న్యాలకొరిగిపాయ. అయ్యా… పడిపోయిన ఆ ఎద్దును పట్టుకుని ఈయప్ప సంటి పిల్లోని మాదిరి ఏర్సె . సెయ్ దాట్నాక ఏంజేచ్చాం. సొమ్ము మంది గాదనుకోవాల’ . అని మళ్లా రోంత సేపు గమ్ముగాయ రసూల్.

‘ఈయప్ప ఎద్దులన్యా మంచులన్యా అంత పానమిడుచ్చాడు. నన్ను యానాపొద్దే గాని కూలి మనిసి మాదిరి సూల్య , ఎప్పుడూ ఇంటి మంచిగానే సూస్య . యాడన్నా తగరారొచ్చిన కాడ అవతల కాపోల్లుండనీ గాక సల్లుకునింది ల్యా. రసూలంటే ఈయప్పకు అంత గురి. ఇంట్లో ఎవ్రున్యా లేకున్యా నేను జొరబడి తింటాంట్యి. నాకు వాళ్లే పెట్టాల్నే సెయ్యాల్నే అనేది ల్యా. ఐనా ఎద్దులున్యప్పుడు ఈ ఇంటి కళే వేరుగా ఉండలే. ఎప్పుడ్జూసినా ఈ ఇంటి నిండా జనం, ఎంత జేసినా తరగని పని. ఆ ఎద్దులెట్ల పాయనో…ఆ మంచులెట్ట పోతిరో…’ అన్య రసూల్.

మళ్లా మన లోకంలోకొచ్చి ‘పాడుంద్యా మ్మా…’ అన్య. ‘ఒకటి ఒంటిపూటిచ్చాంది రసూల్. యాడ మేపుతో శానా ఇబ్బందిగా ఉండాది.  అయ్యైనా ఒట్టి మేపు తిని ఎన్నాళ్లని ఇచ్చాయ్! నీళ్లమీద ఇంత తౌడో గీడో ఏసుకుంటా ఇగ్గకచ్చనాం’ అన్య. ‘అవున్లేమ్మా… , జివ్వాలగ్గూడా పొలం మీద యాన్నే గానీ సూచ్చామంటే గడ్డిపరక లేదు. ఏమంటే పైటాల దాంక దాంట్లను తిప్పకచ్చి దొడ్లో తోలి మేపేసుకుంటనాం. సేజ్జామంటే ఇంగ వేరే పనులేం ల్యాకపాయ.

ఒక్క వానన్నా కాలబడి వచ్చే యాడన్న ఇంత గడ్డో గాదమో పడ్తాది. ఎండలు తగ్గి గొడ్లకు, మంచులకు రోంతన్నా ఉసొచ్చాది. ఎది , సూజ్జామంటే సినుకు జాడే లేదే. ముందటికి ఎట్లజెయ్యాల్నో ఏమో’ అంటా నిట్టూర్చినాడు రసూల్.

ఉండు రసూల్ రోన్ని మజ్జిగన్నా తెచ్చా అని ఎంకటమ్మవ్వ ఇంట్లోకి నర్స్య. తాత లేసి మంచంపై కూచ్చుండ్య.

మజ్జిగ తాగి మూతి తుర్సుకుని మీసాలు సరిజేసుకుండ్య, రసూల్. గ్లాసు తీస్కోని ఎంకటమ్మవ్వ మళ్లా ఇంట్లోకి పాయ. రసూల్ తన అడ్డ పంచ పైకెత్తి తన పొడవాటి నిక్కర జేబులో సెయి పెట్టి రెండు పది రూపాయల నోట్ల కట్టల్ని బయటకు తీసి ‘ఏమనుకోగాకు ఇది పెట్టుకోయ్యా’  అనుకుంటా తాత సేతిలో లెక్క పెట్టి సేతులు మూస్య. మా కిష్ణాడ్డి తాతకేం అర్థం గాల్య. తేరుకుని నీరసంగా వచ్చీరాని మాటల్తో ‘ఒద్దు రసూల్ . రేపోమాపో లెక్కొచ్చాదంట. వెంకట్రాములు ( మా నాయన పేరు) యాన్నో బైటడిగి పెట్న్యాడంట. ఇన్నాల్లే ఉన్యాం. ఈ రెండ్రోజులకేమైతాది’ అన్జెప్పి లెక్క ఎనిక్కియ్యబాయ. బాగా బతికిన మనిషి రసూల్ కాడ లెక్క తీస్కోడం ఏందో సిన్నతనం ఐనట్లు. రసూల్ మంచం కాన్నుంచి రోంత యెడంగా జరిగి ‘వచ్చేమన్లేయ్య. కష్టాలు మంచులగ్గాకుంటే మాన్లకొచ్చాయా. రేపు పొద్దటూర్ కు పొయ్ సూపిచ్చుకో. ఆ లెక్కొచ్చినాక నాది నాకిచ్చురులే. లెక్కాడికి పోతాది మంచిని కాదని, అదాడికీ పోదులేయ్యా . అది మనిసి కంటే యాదీ ఎక్కువ కాదులే’ అన్య. మా కిష్ణాడ్డి తాత గూడా ఇంగేం అండ్ల్య.

అయిపొయ్న కార్యం కాడ ఎక్కువ సేపు ఉండగుర్దనుకుండెనో ఏమో ‘ఓమ్మా…ఎంకటమ్మా…పొయ్యొచ్చా మ్మా…’ అంటా అవ్వకు క్యాకేసి తలాకిలి పక్క నర్స్య.  కాళ్లకు మెట్లేసుకుని కట్టె తీసుకుని ఊదపొర్సుకుంటా ఎలబారినాడు రసూల్.

పైసా అప్పు పుట్టని ఈ గడ్డు కాలంలో , కాలంతో పాటి మారకుండా పాత సవాసాలను మతికి పెట్టుకోని,  ఇంటికొచ్చి సేతులు పట్టుకోని బంగపోయి బతిమిలాడి లెక్కిచ్చి పోతాండే ఆ మనిసి మామూలు మనిసి కాదనిపిచ్య. నేను మంచంలో నుంచి గబక్కన లేసి ఆయప్ప ఎనకల పోయి తలాకిలి పంచకు ఆనుకుని నిలబడ్తి. పోతా పోతా మళ్లా ఎనిక్కి మల్లి ‘ తాతను బాగ సూస్కో మల్ల ‘ అంటా క్యాకేసె రొడ్డ సేత్తో కోరమీసం దుక్కుంటా. నేను సరేనని తలూపితి.  అయ్యా రసూల్ మియా నువ్వు మామూలు మనిసివి కాదయ్యా అనుకుంటా లోలోపల దండం పెట్టి మనసారా ముక్కుకుంటి ‘ నువ్వు పదికాలాల పాటు సల్లంగుండాల దేవుడా’ అని.

 

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

6 comments

  • శ్రీకాంత్, మొదటి సారి ఈ రచన చదువుతూ ఓవర్ హెల్మ్ అయ్యాను. లోపలి కంటిలో కన్నీరొలికింది. సంతోషపు కన్నీరు. రసూల్ మియా వంటి దేవుళ్లు ఈ భూమ్మీద వున్నారు. తాము ఉన్నట్లు డబ్బా కొట్టుకోరంతే.

  • సీమ పల్లె భాష.. అక్కడి మనుషుల్లాగే నిష్కల్మషంగా ఉంది. అంతరించిపోతున్న ఆ యాసను,పదాల్నీ గుర్తుచేసినందుకు చాలా చాలా థ్యాంక్స్.

  • అసలు సిసలైన సీమ జీవనాన్ని కళ్లముందుంచే కథ ఇది.హ్యాట్సాఫ్ శ్రీకాంత్ అన్నా

  • బతుకు చిత్రం. యాడనో మిగిలున్న మానవత్వమే కదా లోకాన్నింకా నిలబెట్టి ఉంచుతాంది.

  • good ,హ్యాట్సాఫ్ శ్రీకాంత్ ,మిగిలున్న మానవత్వమే కదా లోకాన్నింకా నిలబెట్టి ఉంచుతాంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.