రాహుల్ కౌగిట గద్దర్?

బొమ్మ:

తెలుగునాట పాట ఆనుపానులు బాగా తెలిసుండి, తన గాత్రంతో జనులనుర్రూత లూపగలిగి వుండి … ఇంతవరకు… పాటను అమ్ముకోని గొప్ప గాయకుడు గద్దర్. ఆ గొప్పతనాన్ని ఆయన్నించి ఎవరూ తీసెయ్యలేరు. చివరికి తను కూడా దాన్ని తన నుంచి తీసెయ్యలేరు. అందుకు గాను తన మీద మనందరికీ వుండే ప్రేమ ఎన్నటికీ చెరగదు. కనీసం సొన్నాయి బాబా పాట కోసమైనా గద్దర్ చిరస్థాయి.

కొత్తగా రాహుల్ కౌగిలి వల్ల గద్దర్ కు ఏం వొరుగుతుందో ఇప్పుడిప్పుడే అంచెనా వేయలేం. అది ఆయన చాకచక్యం మీద ఆధారపడి వుంటుంది. అంత కన్న ఎక్కువగా, రాహుల్ విజయావకాశాల మీద ఆధారపడి వుంటుంది. కాంగ్రెస్ కి మళ్లీ మంచి రోజులు వొస్తే, ఈలోగా గద్దర్ తన పక్క వాళ్ళ మోసాలకు బలి కాకపోతే… ఆయన కూడా ఏం సాంస్కృతిక శాఖ మంత్రో, ఏ అకాడెమీ అధ్యక్షుడో అయిపోవచ్చు. (నాకైతే అనుమానమే ఈ నిచ్చెనమెట్ల సమాజంలో). కనీసం వాళ్ళబ్బాయికైనా చిన్న మేలేదో జరగవొచ్చు..

అంతే, అంతకు మించి ఏమీ జరగదు. ఏదో జరుగుతుందని ఆయన అంటారు. అనాలి. అది రాజకీయం. దళితులకు, పేదలకు ఏదో జరుగుతుందని అనాలి. ఊరక అనడం కాదు. ఒకనాడు భూస్వాముల గొంతులు కరకర కోస్తే పేదలకు మేలు జరుగుతుందని ఏ వీరావేశంతో అన్నాడో అంత వీరావేశంతోనూ అనాలి. లేకుంటే వోట్లు రాలవు. వోట్లు రాల్చలేకపోతే రాహుల్ కౌగిలి వుండదు. నో ఫ్రీ మీల్స్.

తను కాంగ్రెస్ లో చేరిపోయినట్లు ఆయనేమీ చెప్పలేదు. తాడి చెట్టు ఎక్కింది దూడ గడ్డి కోసం అనే చెప్పారు. చంకలో పెట్టుకు వెళ్లిన మాసిపోయిన రాజ్యాంగాన్ని కాపాడ్డం కోసమే హస్తిన పయనమని కళాత్మకంగా చెప్పారు. రాహుల్ కాకపోతే మరొకరు అన్నట్లు కూడా మాట్లాడారు. దేని కోసం? రాజ్యాంగ పరిరక్షణ కోసమట. ఉప్పుడు మోడీ రాజ్యమేలుతోంది ఆ రాజ్యాంగం కిందనే కదా? రాహుల్ వాళ్ళ నానమ్మే కదా ఒకప్పుడు అప్పటి ధిక్కారాలను జైళ్ళలో పెట్టింది, రాజ్యాంగాన్ని అసుంటా పెట్టి..

అవన్నీ వుత్తి మాటలు. పోనీ, వుత్తి రాజకీయం. వాళ్లావిడ, తన భర్త మీద కూడా బుల్లెట్లు కురిశాయి గనుక అమ్మ (సోనియా)ను కలిసి (రాజీవ్ మీద దాడి గురించి) సహానుభూతి చెబుదామనుకుందట. కలవడం కుదరకపోవడం కాస్త సింబాలిక్ అనిపిస్తోంది. గద్దర్ అనుకుంటున్న ప్రవేశం దొరకలేదనే అనిపిస్తున్నది.

గద్దర్ కు అసలీ ప్రవేశం ఎందుకన్నదే బండ ప్రశ్న. అదీ కాంగ్రెస్ లోనికి?

గద్దరయినా మరొకరైనా వ్యక్తిగత స్థాయిలో కాంగ్రెస్ ‘తో కలిసి’ పని చేయడం అంటూ ఏమీ వుండదు.

ఇప్పుడు గద్దర్ ఏ కాంగ్రెస్ తో ‘కలుస్తున్నాడో’ ఆ కాంగ్రెస్ తో గతంలో చాల మంది కలిశారు. అంతకు ముందు తాము ఏ ప్రజల బాధల పరిష్కారం కోసమై పాటు పడ్డారో ఆ బాధల పరిష్కారం కోసమే కాంగ్రెస్ తో చేరామని వాళ్ళన్నారు. వ్యవస్థను బయటి నుంచి తొలిచి అలిసిపోయాం, ఇక, లోపల్నించి తొలుచుకొస్తామన్నారు.

తొలిచి తొలిచి దానిలో కలిసిపోయారు. ఈ విషయంలో వాళ్ళ కంటె గద్దర్ మొనగాడేం కాదు.

వారు చూడనిదీ, చూసినా చెప్పనిదీ ఏమంటే… వారితో పాటు అదే కాంగ్రెస్ లో కలిసిన వారు… పేదల ఆశలకు విరుద్ధమైన వాళ్ళు… మరెందరో వున్నారు. అసలు దాని నాయకత్వమే సోషలిజం నినాదం, మత వాదం రెండింటిని కావడి కుండల్లా మోస్తున్న సాధు ముఖి. వాళ్ళందరూ… ప్రోగ్రెసివులతో సహా… ఎవరికి వాళ్ళు.. కాంగ్రెస్ పార్టీని తమ పనిముట్టుగా మార్చుకోవాలని ప్రయత్నించారు. ఎవరు గెలిచే వీలుందో వాళ్ళే గెలిచారు.

పార్టీ పేరుతో బయటికి కనిపించే వాళ్ళు కాదు, వెనుక వుండి నడిపించే ఆర్థిక శక్తులే నిర్ణేతలు. అన్ని పాలక పార్టీల వెనుకా వాళ్ళే వుంటారు. వాళ్ళలో వాళ్లు ఆడుకునే నాటకం నేటి రాజకీయం. గెలిచేది వాళ్ళే ఓడేది వాళ్ళే.

కనుక; గద్దర్ ఏమయినా చేసుకుంటే తన కోసం తాను చేసుకోవలసిందే… ఎంతో కొంత జార్జ్ ఫెర్నాండెజ్ లా. ఈయన కాంగ్రెస్ లో చేరి లోకానికి చేసేదేమీ వుండదు.

లోకానికి చేసేది ఏమీ లేకపోతే, ఆయన… తోలు కాయమిది తూట్లు తొమ్మిది తుస్సుమనుట ఖాయం అని విరాగియై కాంగ్రెస్ సత్రంలో కూర్చుంటేనేమి, బీజేపీ సత్రంలో కూర్చుంటేనేమి… మనకేల ఈ గోల అని మీరు అడగొచ్చు. అడగాల్సిన ప్రశ్నే.

లోకంలో ఇన్ని ఘోరాలు జరుగుతుండగా, ఇన్ని అన్యాయాలు జరుగుతుండగా మనసులో ప్రజా ప్రేమ వున్నవాడు చేయడానికి ఇప్పుడేం లేదా?

చేసే వాడు చేయడానికి, పాడే వాడు పాడడానికి, రాసే వాడు రాయడానికి చాల వుంది.

సో కాల్డ్ ఎగువ కులం పిల్లను ప్రేమించిన నేరానికి ఒక ప్రణయ్ శిరచ్చేదమై చచ్చిపోతాడు, ఒక మధుకర్ శిశ్నచ్చేదమై చచ్చిపోతాడు. యూనివర్సిటీ పెద్దల రాజకీయాలకు బలై ఒక రోహిత్ తనకు తాను వురేసుకుంటాడు. ఇంకెందరో ఇలాగే, నిత్యం. వీటిని ఎవరు ఎదిరించాలి. ఇంత అసమ లోకాన్ని ఎవరు సవరించాలి.

భూస్వాముల్ని గొంతులు కోశారో, వూర్నే చంపేశారో గాని భూస్వామ్యం పోయిందనే అనిపించింది. దాని విషం కోరలు పోలేదు. మతం పోలేదు. కులం పోలేదు. జనం మెదళ్ళలోంచి ఈ దయ్యాల్ని ఉఛ్ఛాటన చెయ్యడం… ఎక్కువగా భావాల లోకంలో జరగాల్సిన పని. మొహమాటం లేని పాటలతో జరగాల్సిన పని. భయపడని వ్రాతలతో జరగాల్సిన పని.

కోమట్లు స్మగ్లర్లు, గొల్ల కుర్మలు లోకానికి క్షీర దాతలు అని రెచ్చగొట్టే అబద్ధాలతో కులాల్ని ధృవీకరించి, తమ కులాలకు తాము నాయకులయ్యే చెత్త వ్రాతలు కాదు; అసలీ కులమే వొద్దు అని జనం మనస్సులలోనికి వెళ్లి గుసగుసలాడే పాటలు కావాలిప్పుడు. ఆ పని ఒక గద్దర్ చేయలడు. ఒక గోరటెంకన్న చేయగలడు, ఇంకో అందెశ్రీ చేయగలడు.

వీళ్ళు పాలక కౌగిళ్ళలో సర్దుకు పోతే, ఇక ప్రజల కోసం ప్రజల చేతనావర్తంలో నర్తించే వారెవ్వరని ఆవేదన?

ప్రజల్లో వీళ్లకు పని లేదన్నదెవ్వరు? చాల పని వుంది. కుల సామరస్యం కాదు, కుల నిర్మూలన జరగాలి. అది జరగనంత వరకు మధుకర్ లు, ప్రణయ్ లు, రోహిత్ లు మరెందరో చచ్చిపోతూనే వుంటారు. దళితుల ప్రగతికి కులం అడ్దుకట్ట పడుతూనే వుంటుంది. దళితుల లోంచి పెట్టుబడిదారులు రాకుండా ఈ వివక్ష పని చేస్తూనే వుంటుంది. ఉండీ లేని ప్రభుత్వోద్యోగ రిజర్వేషన్ల వద్దనే వాళ్ళను వుంచేస్తుంది.

రిజర్వేషన్ దళితుల, బీసీ ల రాజ్యాంగ హక్కు. దాని జోలికొచ్చే సాహసి ఎవడూ లేడు, ఊరక గొణుక్కోవలసిందే. దాని కోసం కాకుండా, అచ్చంగా దాడుల నుంచి రక్షణ కోసం, తాము కూడా పెట్టుబడిదారులైపోవడం కోసం….దళితులు కలవాలి. వాళ్ళను కలపాలి ఒక గద్దర్, ఒక గోరటెంకన్న, ఇంకా ఆత్మహత్య చేసుకోని రోహిత్ లు.

సరిగ్గా ఇందుకు, కేవలం ఇందుకే ఇటీవలి గద్దర్ చర్యను తప్పు పట్టాలి.

(ఆయన పూజారుల ముందు ఏ వోట్ల కోసం జోలె పట్టారో గాని, బహుశా అప్పుడే మొదలైంది తన పాపులారిటీ ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే కోరిక. ఇప్పటి విమర్శకులెవరైనా అప్పుడు వాయి విప్పారా? ఏమో).

బొరుసు:

సరిగ్గా ఇందుకు, కేవలం ఇందుకే ఇటీవలి గద్దర్ చర్యను తప్పు పట్టాలి. నిజమే గాని, గద్దర్ ను రాహుల్ కౌగిట చూసి అవాక్కయిన వాళ్ళు… తెలంగాణ ప్రభుత్వం రాగానే కేసీయార్ కౌంగిట చేరి పదవుల పంట కోసుకున్న వాళ్ళను చూసి ఏ వాక్కూ అయినట్టు లేరెందుకు? మన కన్సైన్సు లు అప్పుడేమయ్యాయి? పోనీ, ఆ విషవృక్షం కొమ్మలు చాచి, పూలు పూచి, విత్తనాలై.. మల్లీ మొలకలెత్తుతున్నా, ఇప్పుడు కూడా మాట్లాడని మల్లెమొగ్గలకు ఇంకా ఏ పదవీ సంపాదించని గద్దర్ మీద అంత నోరొచ్చిందేం? ఆ కూచిపూడి పిల్లవాడెవర్నో అమెరికన్ రేసిజం చంపేస్తే బాధపడినందుకే…  అదే ‘మా దళితుడైతే మాట్లాడేవారా’ అని అర్థరహితంగా ఆక్షేపించిన ప్యూర్ దళితవాదుల నోళ్ళు అక్కడే ఆగిపోయాయా?

సిద్దారెడ్డిని, నారాయణను, రాములును ఏమీ అనని వాళ్ళకు గద్దర్ మీద మాట్లాడే హక్కేంటని అదే నోళ్ళతో అడగరేం?

మాక్కూడా ఎప్పుడైనా… ఎవరో ఒకరైనా… ఏదో ఒకటైనా… అవార్డు.. ఒక కండవా పారేయకపోతారా… ఇప్పుడు మాట్లాడి పేచీ కోరు అనిపించుకోడం ఎందుకు లెద్దూ అని అనుకోడం కాదా ఇది?

ఓయ్, ఒహోయ్ గుర్తింపు ఎవరికి చేదు? పని చేసే వాళ్ళందరూ తమ పనికి గుర్తింపు కోరుకుంటారు. మీరు బాగా రాస్తున్నారు. మీరు బాగా పాడుతున్నారు. అందుకు మీకు గుర్తింపు కావాలి. ఈ రాస్తున్న నాక్కూడా కావాలి.

శిరోజాలతో పాలకుల బూట్లు తుడిచే మేధావులకు తప్పక గుర్తింపు వొస్తుంది. గుర్తింపు వొచ్చింది తమ ప్రతిభకా బూట్లు తుడిచినందుకా అనే అనుమానం వాళ్ళను బతుకంతా పీడిస్తూనే వుంటుంది. తమను తాము నిరూపించుకోడం కోసం అదే వూబిలో ఇంకా ఇంకా కూరుకు పోతూనే వుంటారు. మొదట అవార్డు, తరువాత అవార్డులను నిర్ణయించే పదవి. ప్రజాధనం ఖర్చు పెట్టే పెత్తనం. జనం డబ్బుతో ఆశ్రితులను ఆదుకునే పెత్తనం. 

ఇలా బూట్ల సొంతదార్ల ఆదరణతో ఎవరైనా మహాకవులు అయిపోతారా? అయిపోరు. అయిపోయినట్లు కనిపిస్తారు. ఒక సజీవ ఉదాహరణగా ఈ వర్గం గుగ్గురువు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారున్నారు. అంతటి ఆయన బతికుండగానే.. మరణించింది ఈ వూబిలోనే.

వీళ్ళ మీద ఈ అంచెనా చాలు. ఇదొక విస్తరిస్తున్న విషం మర్రి. దీని మీద పోరు ఇప్పుడిప్పుడే వొగిసేది కాదు. ఈ పోరు ఇప్పుడిప్పుడే ఆపాల్సిందీ కాదు. ఎప్పటికప్పుడు ఎవరికి వారు తమ కార్యాచరణను నిర్ణయించుకోవలసిందే. పాడే వాళ్ళుగానో, రాసే వాళ్ళు గానో, ప్రజా సమీకర్తలుగానో ప్రతీప శక్తులనెదిరించి నిలబడవలసిందే.

ఇది కేవలం తాత్కాలిక సమస్య కాదు. కాసేపు వీచి ఆగిపోయే గాలి కాదు. ఒక సాంస్కృతిక విశేషంగా నిలదొక్కుకుంటున్న ట్రెండ్. ఇన్నాళ్లు విప్లవాల పక్కపక్కనే వుండి ఆ స్ఫూర్తిని నిర్వీర్యం చేసిన హీన ధోరణి. ఇప్పుడిదే ప్రధాన ధోరణి అవుతున్నది. కనకనే దీన్ని పట్టించుకోవాలి.

నాణెం:

ఇది తెలంగాణాకు పరిమితం కూడా కాదు. తెలంగాణా, ఆంధ్రా ఒకే నాణానికి రెండు ముఖాలు. కొన్ని సార్లిది పై పై చూపులకు ప్రైవేట్ అఫేర్ అనిపిస్తుంది. ప్రైవేట్ పబ్లిక్ గా పబ్లిక్ ప్రైవేటుగా చక చక మారిపోతుంటాయి, కనికట్టు మనిషి చేతిలో వస్తువుల్లా.

ప్రభుత్వ పదవి లోనికి రాగానే ఒకరు మహాకవులయిపోవడం, వారి చుట్టూ ఈగలు ముసరడం ఎప్పుడూ జరిగే పనే.

పబ్లిక్, ప్రైవేటు అనేవి పరస్పరం. మ్యూచువల్. వాళ్లు వీళ్లూ కలిసి కడుతున్న ముఠాలే ఇవాళ తెలుగు సాంస్కృతిక రంగం.

ఇలాంటి సమయంలో గద్దర్ కాంగ్రెస్ స్నేహం మీద సాగే విమర్శలో చిత్తశుద్ధి స్వల్పం. ఆ విమర్శ వల్ల ఎవరికీ ఒరిగేదేమీ లేదు. అంత కన్న పైన, అంతకన్న నిర్ణయాత్మకంగా, అంతకన్న ఎక్కువ ప్రభావవంతంగా సాగుతున్న ఆత్మల అమ్మకమే నిజమైన ప్రమాదం. యువతరాన్ని కరప్ట్ చేస్తున్న ప్రమాదం. యువతరం నుంచి తిరుగుబాటు శక్తిని పీల్చేసే పనిలో పాలకులకు సాయపడే ప్రమాదం.

కామ్రేడ్స్ మన్నించాలి. అతి అతివాదం తన ఓటమితో పాటు సమాజానికీ ఒక పెను ఓటమిని తెచ్చి పెడుతుంది. తన ఓటమి సరే, తనతో పోతుంది. కాని, అది తన వునికి కోసం పెట్టుకునే రాజీ బేరాల వల్ల పుట్టే కరఫ్షన్ చాల కాలం వుంటుంది. భవిష్యత్ చొరవలను కూడా కష్టసాధ్యం చేస్తుంది.

ఒక దారిలో సాహసికులై ముందుకు పోవడమే కాదు, ఆ దారి నిష్ఫలమని తెలుస్తున్నప్పుడు తమకు, తమ ప్రజలకు నష్టం కలక్కుండా రిట్రీట్ కావడమెలాగో కూడా తెలిసున్న వారే నిక్కమైన ప్రజా కమాండర్లు. అలాంటి నాయకులే నిర్మిస్తారు నిజమైన విముక్తి వుద్యమాలు… ఎక్కడో అడవుల్లో కాదు , ఎక్కడ కీలక, నిర్ణయాత్మక జనం (క్రిటికల్ మాస్) వున్నారో అక్కడే.

అలాంటి యోధులకు లాల్ సలామ్.    

హెచ్చార్కె

17 comments

 • H R K , this is only to express my equally deep anguish about what is on display on Gaddar’s front. What a fall ! But , have we not been shown a rehearsal of this tragedy over the past some years ? Perhaps it is time for me to bid a bonvoyage to my ‘ Battleship of Music ‘. It can no more sing for the masses of this country. It can only hoot to clear the way for the rulers. Still Gaddar deserves a golden chapter in the history of art in Indian resistance. I wish my ‘ Bumble Bee ‘ ( Thufaanuthummeda ‘ ) , the best in his future endeavours!

 • ఎరయినా ఒక గుంపులోంచి బయటకు వచ్చేయటానికి కారణాలు చాలా ఉండొచ్చు.కాని గుంపులోని మిగతా సభ్యులు గెంటేయడం లేకపోతే ఇతనికి ఆగుంపు అంటే విరక్తి కలగటం. గుంపులో ఉంటే సేఫ్టి లేకపోవడం మూలంగా ఇంకొక కారణం అయి ఉండొచ్చు. బయటపడి ఇంకో గుంపులో కలవడానికి అవే ముఖ్యమైన కారణాలు. ఇందులో ఏకారణం చేత అలా అయ్యిందంటారు? లేకపోతే ఇంతకాలం ఇందులోఉండి విరక్తితో నాబ్రతుకు నాకోసమే జీవిస్తాను.ఇక ఎలాంటి సిద్ధాంతాలూ వద్దని అయినా అయుండాలి. సంపాదకీయంలో కనపడని కుళ్ళుమోత్తనం కనపడుతుంది.ఉడుకుమోత్తనం కనపడుతుంది తప్ప ఫెయిర్నెస్ లోపించింది.

  • ఆర్ కే ప్రసాద్ గారు, గద్దర్ తన గుంపు లోంచి బయటికి వొచ్చినందుకు.. వొచ్చి వుంటే… సంపాదకీయం విమర్శించడం లేదు. తనదైన రాజకీయం చేపట్టినందుకూ విమర్శించడం లేదు. చేపట్టాలని నా కోరిక. కాంగ్రెస్ లేదా ఆ తరహా రాజకీయం వల్ల ప్రజలకేం వొరగదని చెప్పాను.
   ఇక ‘వుడుకుమోత్తనం’, ‘కుళ్లుమోత్తనం’ అనే మాటలు, అబ్యూజ్ అవుతాయి, అయినా ఇక్కడ ఆమోదిస్తున్నాం. మీలా అనుకునే వాళ్ళు చాల మందే వుంటారు. వాళ్ళ ప్రాతిధ్యం వుండాలని, బయటికి గాని, లోలోపల గాని చర్చ జరగాలని.

 • ‘ఉక్కుపాదం’ నవల వీటన్నింటికి సమాధానమనుకుంటాను.

 • ప్రఖ్యాత హిందీ రచయిత ప్రేమచంద్ అన్న మాట గుర్తుకొచ్చింది . ” సారె దునియా కె సాంనే సర్ న ఝుకానే వాలా అప్నే ఔలాద్ కె సాంనే సర్ ఝుకాతా హై ” ( ఈ మహా ప్రపంచం ముందు శిరసు వంచని వాడు తన సంతానం ముందు వంచుతాడు ” ఇది ప్రస్తుతం గద్దర్ కు వర్తిస్తుంది.
  అతివాదమూ మితవాదమూ బొమ్మ బొరుసులని లెనిన్ ఇలాంటి వారిని చూచి చెప్పివుంటాడు.
  వ్యక్తిగత హింసావాద రాజకీయాలు సంస్కరణ వాదానికి దారి తీయటమంటే ఇదే కావచ్చు.
  మమతా బెనర్జీని బలపరిచీ, కె.సి.ఆర్ అందలమెక్కటానికి మెట్లు సమకూర్చటంలో బొరుసు రాజకీయం తప్ప మరేముంది?
  45 ఏళ్ల విప్లవ సాంస్కృతికోద్యమ చరిత్ర వున్న గద్దర్ , అంత వయసులేని రాహుల్ రాజకీయ కౌగిలికి తాపత్రయ పడటం విషాదం. అది నిబద్ధ కార్యకర్తలనేమీ చేయలేదు కానీ , వారి పట్ల ప్రజల నమ్మకాన్ని గౌరవాన్ని పల్చన చేస్తుంది .
  రాష్ట్రం రెండుగా చీలి పోవటం కేవలం సరిహద్దుల , నాయకత్వాల పంపిణీకే పరిమితం చేసి ఆలోచించకూడదు. సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కు వ్యతిరేకంగా సాగాల్సిన పోరాటాన్ని పద్నాలుగు సంవత్సారాలు వాయిదా వేయించి పక్క దారి పట్టించగలిగింది. అప్పటివరకూ ప్రజల పక్షాన నిలిచినా కార్యకర్తలననేకమందిని పాలక పక్షం వైపుకి గుంజుకు పోయింది. భూస్వామ్య, ధనస్వామ్య అగ్రకుల శక్తుల చుట్టూ శ్రామికులను మలుపుకోవటానికి మంచి అవకాశం ఇచ్చింది.
  ఇపుడు ఏకంగా గద్దర్ నే గుంజుకు పోయింది. ప్రజా ఉద్యమాలను విఛ్చిన్నం చేయటం లో పోస్ట్ మోడర్నిజం తాత్కాలికం గా పై చేయి సాధించింది.
  అయినా సామాజిక రాజకీయ సంక్షోభం అనివార్యంగా ప్రజలను ఆందోళనలకు, పోరాటాలకు దారి తీసే పరిణామాల వైపు నడిపిస్తుంది. .. దివికుమార్

  • దివికుమార్ గారు, థాంక్యూ. కార్మిక వర్గం తన విముక్తికి తాను నడుం కట్టకుండా కేవలం ఆందోళనలు, పోరాటాలు.. తాత్కాలికంగా అవసరమే గాని, అవి వ్యవస్థాత్మక పెను మార్పుని సాధించలేవు. వర్కర్స్ కౌన్సిల్స్ వైపు ఏ మేరకు ఆడుగు వేస్తామో ఆ మేరకే నిజ విముక్తి. పార్టీలు లేదా గ్రూపులు కూడా ఈ ప్రయత్నం చెయ్యొచ్చు అనుకుంటాను.

 • గద్దర్ గుర్తింపు కు అసలు కారణం ఆయన గతం లో ఎంచుకున్న , నమ్ముకున్న విప్లవ పంథా . హెచ్చార్ కె అన్నట్లు , రిట్రీట్ అవటం తెలియక అయోమయం లో గద్దర్ ” తన లో మిణుగు మిణుగు అంటున్న గుర్తింపు’ కు ప్రాణం నిలిపే ప్రయత్నం లో ఉన్నట్లు గా అనిపిస్తుంది. “గుర్తింపు ” అనే చాపల్యాన్ని వదులు కుంటే రిట్రీట్ అయినా ” గద్దర్ ” గద్దర్ గ మిగిలిపోయే అవకాశం ఉంది.
  గద్దర్ ను ” పాత” గద్దర్ లాగా చూడటం మానెయ్యాలి .

 • చక్రపాణి –అల్లం — రాములు గా ర ల గురించి రాశాను –నిజాలు రాయడానికి — మాట్లాడటానికి భయం దేనికి ???
  యిక గద్దర్ జి రాహుల్ తో — సిగ్గు చేటు
  రాహుల్ లో యెమి ఉందని ??రాజకీయాల లో ఒనుమాలు తెలియని — బచ్చా ??
  నెహ్రు గారి ఫ్యామిలీ వారసత్వం ఎన్నాళ్ళు ?? ఎన్ని ఏళ్ళు ??
  దేశం విడి పోవడానికి కారణం నెహ్రు గారే — నేటికి కాశ్మీర్ సమస్య మం డి పోవడానికి కారణం నెహ్రు గారే — నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పాలన లో బాగుపడ్డది — దోచుకున్నది — దొరలూ –అగ్రకులాలే –కాదా గద్దర్ గారు ???
  ఇందిరమ్మ ఏమ ర్జే నసి —
  తెలంగాణా రావడానికి అడ్డంకులు కలిపించింది కాంగ్రెస్ వాళ్ళే
  సోనియా — పి.వి మృత దేహాన్ని కాంగ్రెస్ కార్యాలయానికి రాకుండా — హైదరాబాద్ కు తరిలించిన తీరు చూడలేదా గద్దర్ గారు
  చెప్పేది — రాసేది ఒకటి –చేసేది మరొకటి ??
  ఏవి ?? ఎక్కడ మీ సిద్దాంతాలు ??
  మీరు అవకాశ వాదులు — ఊసరవెల్లులు —
  గుర్తింపు కోసం నానా గడ్డి క రుస్తూ
  చదువు కున్న దద్దమ్మ లా
  మామ ను ముంచి న అల్లుడు బాబు కు
  రాజులా — తుగ్లక్ పాలన ను చూపిస్తున్న k c ర్ కు — మీకు బేధం ఏముందని ??
  ????????????????
  బుచ్చి రెడ్డి గంగుల

  • గద్దర్ యే వ్యవస్థతో ఇంత కాలం యుద్ధం చేసాడో ఆ వ్యవస్థకే పూర్తిగా లొంగి పోయాడు. ప్రజలకు యే వ్యవస్థ అనాది నుండి శత్రువో నేడు ఆ వ్యవస్థను ఆవిష్కరించే ప్రయంత్నంలోనే గద్దర్ ఉన్నాడు. ఒక దుర్ వ్యవస్థతో రాజి పడ్డ గద్దర్ రేపు రాబోయే రోజుల్లో చెప్పే పాఠాలన్నీ సామ్రాజ్య వాదానికి ప్రాణం పోసేవిగానే ఉంటాయి. ఇక నుండి గద్దర్ సామ్రాజ్య వాదుల ముద్దు బిడ్డే!
   దాసరి రాజబాబు.

 • బుచ్చి రెడ్డి గంగుల, దాసరి రాజ బాబు, ఇతర మిత్రులకు ….
  మన ప్రాబ్లెం గద్దర్ తో కాదు. ఆయన ప్రతిభావంతుడు కావడం వల్ల స్ఫుటంగా కనిపిస్తున్నాడు. పిపీలికాలు అయ్యుండీ పాలక పాదాభివందనాలతో ఏనుగుల వేషం వేసుకుని పేదలకు హాని చేసే భ్రమలను వర్ధిల్లజేస్తున్న జనాలతోనే అసలు సమస్య. వీరిని పట్టించుకోకపోతే, విమర్శించి వీరికి ప్రత్యామ్నాయం వుందని చూపించకపోతే సాహిత్యంలో తిరుగుబాటు అనేది వుండదు. ‘జరుగుబాటు’ తప్ప.
  ఎక్కడో ఒక సారి ‘నేను కూడా అన్నాను’ అని కాదు. ఈ విమర్శ కన్సిస్టెంట్ గా కొనసాగాలని మనవి.

  • గద్దర్ ప్రతిబావంతు డు–??? కాని లాస్ట్ క్వార్టర్ లో యీ మార్పు దేనికి ??ఎందుకు ??
   యిక — నేటి తెలుగు సాహితీ లోకం లో — తిరుగుబాటు తనం ఎక్కడ ఉంది — ఎక్కువ శాతం రచయితులంతా అవకాశ వాదులు — గుర్తింపు కోసం —పద్మశ్రీ ల కోసం — డబ్బు కోసం –నేటి రాజకియవవ్యస్తాలా — గ్రూపులు —కక్షలు –పయిరవీలు — దాగుడు మూతలు
   ఆడుతూ — దారి తప్పుతూ —
   యింకా కొంతమంది రచయితులకు చెంచాలు — వంది మాగధులు –సొల్లు నాయకుడు గాళ్ళు లేకపోలేదు —
   బుచ్చి బాబు — తిలక్ — సి.వి కృష్ణారావు లాంటి రచయితలు యిపుడు ఎక్కడ ఉన్నారు సర్ //వాళ్ళు ఎన్నడు గుర్తింపు కోసం — డబ్బు కోసం ముందుకు రాలేదు — కాని నేటి రచయితలకు కావలిసింది — గుర్తింపు ??డబ్బు ?? పలుకుబడి –రాజకీయాలు చేయడం తప్ప ??
   చెప్పేవి నీతులు — రాస్తున్నది ఒకటి ??వాళ్ళు చేస్తున్నది ఒకటి —
   డబ్బు కోసం –అన్ని రంగుల ఫంక్షన్ ల కు వెళ్ళడం — శాలువలు కప్పుకోవడం –కప్పిన సంస్థను పొగడడం ??
   అమెరికా లో స్టూడెంట్స్ కు బాలశిక్ష బోదించి — ప్రోఫెస్సేర్ గా చలామణి అవుతూ
   అన్ని దేశాల నుండి విరాళాలు సేకరిస్తూ —యిదొక వ్యాపారం
   అమెరికా లో ఉన్న రచయితలు మామూలు వ్యక్తుల తో మాట్లాడారు –ఉన్నోల్లతో — తోటి తానా తందానా మిత్రులతో నే మాటలు ముచ్చట్లు ??
   పూసుక తిరుగుళ్ళు — కలువడాలు

   నిచ్చానమెట్ల సమాజం లో — డి టూర్ అయినా ప్రజాసామ్య౦ లో — గద్దర్ గారు ఏం .ఎల్ .ఏ గా గెలిచి — సాధించేది ఏమున్నదని –70 ఏళ్ళ స్వాతంత్రం — కాంగ్రెస్ ప్రబుత్వం — చేసింది ఏమిటో గద్దర్ గారికి తెలియదా ??
   ఆర్థిక వత్యాసాలు తొలిగి పోతాయా ?? కుల పిచ్చి –మతపిచ్చి అంతం అయిపోతుందా ??అంటారని తనం పోతుందా — ముస్లిమ్స్ అంటే పరాయి వాళ్ళు — మన శత్రువులు అనే భావన పోతుందా –గద్దర్ గారు

   బుచ్చి రెడ్డి గంగుల

   ఎడిటర్ గారు పర్మిషన్ యిస్తే జవాబు యివ్వగలను ****

 • Really happy that this edit provoked so many thoughts. That is necessary, more so now.
  ,please don’t go into personalities and anti group rhetoric.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.