జమీందారు గడ్డం

(అనువాదం: హెచ్చార్కె)

పోకాపాగ్లియా అనే ఊరు కొండ మీద ఉంటుంది. ఆ కొండ ఎంత నిటారుగా వుంటుందంటే, అక్కడ కోడి గుడ్డు పెడితే దొర్లుకుంటూ కొండ దిగువకు పోతుందని, వాళ్ళు కోళ్ళ తోకలకు సంచులు కట్టే వారు.

చూశారుగా పోకాపాగ్లియా జనం ఎంత తెలివైన వాళ్ళో. అయినా, వాళ్ళ గురించి ఒక సామెత అయితే ఉందనుకోండీ:

‘పోకాపాగ్లియా జనాల పద్ధతే వేరు
అక్కడ గాడిదలు ఈల వేస్తాయి,
యజమానులు ఓండ్ర పెడతారు’

అవన్నీ పోకాపాగ్లియా ప్రజల ప్రశాంత జీవితం చూసి ఓర్వలేని పొరుగూళ్ల వాళ్ళ మాటలు. పట్టించుకోనక్కర్లేదు. ఇతర్లతో పేచీలు పెట్టుకోడం పోకాపాగ్లియా వాళ్ళకు సుతరామూ ఇష్టం వుండదు.

“సర్లె సర్లె, మా మాసినో రానివ్వండి, ఎవరు ఎక్కువ ఓండ్ర పెడతారో అప్పుడు చూసుకుందాం” అనేసి వూరుకుంటారు వాళ్ళు.

మాసినో అంటే పోకాపాగ్లియాలో అందరికి భలే యిష్టం. ఊళ్లోకంతా వాడే తెలివైనోడు. శారీరకంగానైతే వూళ్లో ఎవరికన్నా బలవంతుడేం కాడు. నిజానికి,  కాస్త బక్కపీచు అనే చెప్పాలి. కాని ప్రతి విషయంలో చాల హూషారుగా వుండే వాడు. పుట్టినప్పుడు వాడెంత అర్భకంగా వుండే వాడంటే, వాడు బతకడేమోనని వాళ్ళమ్మ వాడికి వెచ్చని ద్రాక్షసారాయి లో స్నానం చేయించేది.  అలా చేస్తే కొంచెమైనా బలం పుంజుకుంటాడని అమె ఆశ. ద్రాక్ష సారాయిని వాళ్ళ నాన్న ఎర్రగా కాల్చిన గుర్రపు నాడాతో వెచ్చబరిచే వాడు. ఆ విధంగా మాసినో ద్రాక్షాసారాయి లోని సూక్ష్మతనూ, ఇనుములోని గట్టితనాన్ని సంతరించుకున్నాడు. వెచ్చని సారాయిలో స్నానమయ్యాక వాడికి చల్లని హాయిని ఇవ్వడం కోసం వాళ్ళమ్మ ఇంకా పండని చెస్ట్ నట్ పైపొట్టు మీద వూయల వూపుతూ నిద్రపుచ్చేది. ఇంకా పండని వగరు వగరు చెస్ట్ నట్ పైపొట్టు వల్ల వాడికి దేన్నైనా అర్థం చేసుకునే గుణం అబ్బింది.

మన కథ కాలానికి పోకాపాగ్లియా జనం మాసినో తిరుగు రాక కోసం ఎదురు చూస్తున్నారు. వాడు సైన్యంలో వెళ్లిపోయాక ఇంతవరకు వూరి వాళ్ళకు కన్పించలేదు. (బహుశా వాడిప్పుడు ఆఫ్రికాలో ఎక్కడో వున్నాడు.) ఇటీవల పోకాపాగ్లియాలో ఏవేవో విచిత్రాలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ అడివి నుంచి పశువులు ఇంటికి వొచ్చాక చూసుకుంటే, వాటిలో కొన్ని పశువులను మంత్రగత్తె మిసిల్లీనా ఎత్తుకుపోయి వుండేది.

మంత్రగత్తె కొండమొదలు వద్ద దాక్కుని వుంటుంది. ఆమె గట్టిగా వూపిరి పీల్చుకుంటే చాలు, ఒక ఎద్దు అమె లోపలికి వెళ్లిపోయేది. రాత్రి వేళ కారడివిలో అమె ఊర్పు వినే సరికి రైతుల పై ప్రాణాలు పైనే పోయేవి. భయంతో వాళ్ళ దంతాలు కరకరలాడేవి. నిట్ట నిలువునా పడిపోయే వారు. ఈ వ్యవహారం ఎంత మామూలయి పోయిందంటే, వాళ్లొక పాట కూడా కట్టేసుకున్నారు.

మరిచిపోకు మిసిల్లినా ను, ముసలి మంత్రగత్తెను
నీ ఎద్దులను దొంగిలించే ముందు… కోసుగా
నా మెల్లకంటితో నీ వైపు చూస్తాను, నా చూపుకే
నువ్వు నిట్టనిలువునా పడి, చచ్చూరుకుంటావు

మత్రగత్తె మిసిల్లినా రాకుండా పోకాపాగ్లియా ప్రజలు రాత్రులు పెద్ద పెద్ద మంటలు వేసుకునేవారు. ఆమె మంట దగ్గర వొంటరి రైతుని ఏమార్చి, ఒక్క వుదుటన పడగొట్టేది. అతడు పొద్దున లేచి చూసుకుంటే కొన్ని ఆవులు, ఎద్దులు కనిపించకుండా పోయేవి. అతడు తల బాదుకుని ఏడుస్తూ తన స్నేహితులకు కనిపించేవాడు. దొంగతనం అయిపోయిన పశువుల జాడ కోసం అందరూ అడివంతా ఘాలించే వారు. వాళ్ళకు మంత్రగత్తె మిసిల్లీనా వొదిలేసిన కొన్ని జుట్టు దుబ్బులు, తల పిన్నులు, అక్కడక్కడ ఆడుగుల ముద్రలు మాత్రం కన్పించేవి.

రాను రాను పరిస్థితి మరీ విషమించింది. బయటికి వొదలకపోవడం వల్ల.. కొట్టాల్లో పశువులు బక్కచిక్కి పోతున్నాయి. ఇప్పుడు వాటిని శుభ్రం చేయడానికి బ్రష్ అవసరం లేదు, చిన్న రేకు ముక్క చాలు. పచ్చగడ్డి కోసం వాటిని బయటికి తీసుకెళ్ళే ధైర్యం ఇప్పుడెవరికీ లేదు. ఎవరూ అడివిలోకి వెళ్ళే వారు కాదు. అక్కడ పెరిగే పుట్టగొడుగులు, వాటిని ఏరుకునే వాళ్లు లేక, నిజం గొడుగులంత పెద్దగా పెరిగిపోయేవి.

మంత్రగత్తె మిస్సిలినా వేరే వూళ్ళ జోలికి పోయేది కాదు. వీళ్ళలా పేచీలంటే యిష్టపడకుండా, శాంతిగా జీవించే జనాలు మరెక్కడా వుండరని ఆమెకు తెలుసు. ఈ వూళ్ళో పేద రైతులు ప్రతి రాత్రీ  వూరవాకిలి వద్ద పెద్ద మంట పెట్టే వారు. ఆడవాళ్ళు, పిల్లలు ఇళ్ళలో గడియలు పెట్టుకుని పడుకునే వారు. మగవాళ్లు మాత్రం తలలు గోక్కుంటూ, మూలుగుతూ కూర్చునే వారు. అలా తలలు గోక్కుంటూ, మూల్గుతూ చాల రోజులు గడిచిపోయాయి. జమీందారు దగ్గరికి వెళ్లి సాయం కోరాలని, నిర్ణయించుకున్నారు.

జమీందారు పోకాపాగ్లియా కు బాగా పైన బలమైన గోడలున్న గుండ్రని కోటలో వుంటాడు. గోడల మీద పదునైన గాజు పెంకులు అమర్చి వుంటాయి. ఒక ఆదివారం నాడు పోకాపాగ్లియా వాళ్ళంతా తలటోపీలు చేతుల్లో పట్టుకుని, అక్కడికి వెళ్ళారు. కోట తలుపు తట్టారు. తలుపులు తెరుచుకున్నాయి. జమీందారు గుండ్రని ఇంటి ముందు పెద్ద వసారాలో అందరూ నుంచున్నారు. ఆ ఇంటి చుట్టూ కిటికీలన్నిటికి బలమైన కమ్మీలు వున్నాయి. వసారా చుట్టురా సైనికులు కూర్చుని, మీసాలు మరింత మెరిసేలా నూనెలు రాసుకుంటూ రైతులను గదమాయించారు. వసారా ముందు భాగం లో జమీందారు కూర్చుని వున్నాడు. సైనికులు ఆతడి పొడుగాటి గడ్డం దువ్వుతున్నారు

అందరి లోకి ముసలివాడైన రైతు గుండె దిటవు చేసుకుని మాట్లాడాడు. “దొరా మేము మా కష్టమొకటి చెప్పుకుందామని ధైర్యం చేసి మీ ముందుకొచ్చినాం. మా పశువులు అడివిలోకి వెళ్తే చాలు, మంత్రగత్తె మిస్సిలినా వొచ్చేసి, పశువులను ఎత్తుకుపోతోంది.” ముసలాయన మాటలకు ఔనౌనని నిట్టూరుస్తూ, మూలుగుతూ మిగతా రైతులంతా వంత పలికారు. మూల్గులు నిట్టూర్పుల మధ్యనే ముసలాయన తాము ఎదుర్కొంటున్న పీడకలని వివరించాడు.

జమీందారు మౌనంగా విన్నాడు.

“మమ్మల్నేం చేయమంటారో ఏలిన వారి సలహా తీసుకుందామని ధైర్యం చేసి మీ దగ్గరికి వొచ్చినాం’ అన్నాడు ముసలాయన

జమీందారు మౌనంగానే వున్నాడు.

“ఏలిన వారిని సాయం అడుగుదామని ధైర్యం చేసి వొచ్చినాం, దొరా, మాకు సాయంగా కొందరు సైనికులను కేటాయిస్తే, మునుపటి లాగే పచ్చగడ్డి వున్న చోట్లకు పశువులను తీసుకెళ్ళగలుతాం” అన్నాడు ముసలాయన.

జమీందారు తల వూపాడు. “మీకు సైనికులను ఇవ్వాలంటే, వాళ్ళతో పాటు సేనా నాయకుడినీ ఇవ్వాలి… “
రైతులు ఆశగా, భయంగా వింటున్నారు..
“కాని సేనాని సాయంత్రం బయటికి వెళ్తాడే, మరి మీతో పులిజూదం ఆడేదెవరబ్బా.. “ అన్నాడు జమీందారు.

రైతులందరూ ఆయన ముందు మోకరిల్లారు. “దయదల్చండి దొరా, మాకు సాయపడండి” అని ప్రాధేయపడ్డారు. వసారాలో కూర్చున్న సైనికులు ఆవులిస్తూ, వూరక మీసాలు దువ్వుకున్నారు.

జమీందారు మళ్లీ తల వూపి అన్నాడు.

నేను జమీందారును, చెబుతున్నా ముమ్మారు
నేను యే మంత్రగత్తెనూ చూడలేదు
కనుక, మంత్రగత్తె అని ఎవరూ లేరు

ఆ మాటలతో పాటు, సైనికులు, ఇంకా ఆవులిస్తూనే, తుపాకులెత్తి, వాటిని రైతుల వైపు చూపిస్తూ, తాపీగా కదిలారు.  రైతులు వెనుదిరిగి కోట నుంచి బయటికి పరిగెత్తారు.

వాళ్ళు చాల నిరాశగా పోకపాగ్లియా వూరవాకిలి వద్దకు చేరారు, మళ్లీ. ఏం చేయాలో వాళ్ళకు తోచలేదు. కోటలో జమీందారుతో మాట్లాడిన ముసలాయన “ ఇక చేసేదేం లేదు, మన మాసినో కి కబురు పంపాలి” అన్నాడు.

అందరు కలిసి ఒక జాబు రాసి ఆఫ్రికాకు పంపించారు. ఒక రాత్రి, వాళ్ళందరూ మంట చుట్టూ కూర్చిని వుండగా మాసినో వొచ్చేశాడు. మీరు అక్కడ వుండి చూడాలి రైతుల సంతోషం. మాసినో ని కావిలించుకుని స్వాగతం చెప్పారు. పొయ్యి మీద కుండల్లో పరిమళాలు వెదజల్లుతూ ద్రాక్షసారాయి మరిగింది. “ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నువ్వు? ఏమేం చూశావు? ఇక్కడ మేమంతా ఎంత కష్టాల్లో వున్నామో నీకు తెలిసిందా అసలు” అని మాసినో వూపిరి తీసుకోకుండా మాట్లాడారు.

మాసినో వాళ్లు మాట్లాడాల్సిందల్లా మాట్లాడనిచ్చి, ఆ తరువాత నోరు విప్పాడు, “ఆఫ్రికాలో నేను నరమాంస భక్షకుల్ని చూశాను, వాళ్లు మనుషులు కాదు మిడతల దండు; ఎడారిలో, నీళ్ళ కోసం చెలిమ తవ్వడానికి పన్నెండు మీటర్ల మొయిని గోళ్లు పెంచుకున్న మనుషిని చూశాను; సముద్రంలో ఒక బూటు ఒక స్లిప్పర్ వేసుకుని, అలా మరే చేపకు వుండవు కాబట్టి తానే చేపల రాజుని అంటున్న చేపను చూశాను; సిసిలీ లో డెబ్బై మంది కొడుకులూ ఒకే ఒక కెటిల్ వున్న ఒకామెను చూశాను; నేపుల్స్ లో కదలకుండా నుంచుని, ఇతర్ల వదరుబోతు తనం వల్ల  నడుస్తున్న మనుషులను; పాపులను చూశాను రుషులను చూశాను; బలిసిన మనుషులను చూశాను ఎలకల మొయిని కూడా లేని వాళ్ళను చూశాను; చాల చాల భయపడిన మనుషులను చూశాను కాని పోకాపాగ్లియా లో వున్నంత మంది భయపడిన వాళ్లను మాత్రం చూళ్ళేదు” అన్నాడు.

పరోక్షంగా తమను పిరికివాళ్లు అనడంతో వాళ్ళకు తగలనిగూడని చోట తగిలిందేమో, రైతులు సిగ్గుగా తలలు వొంచుకున్నారు. కాని, మాసినో కి తన వూరి మనుషుల మీద కోపం లేదు. మంత్రగత్తె చేసే పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకుని, ఆ తరువాత అన్నాడు, “మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాను, అర్ధ రాత్రి గంట కొట్టగానే వెళ్లి ఆ మంత్రగత్తెను పట్టి తెస్తాను. సరేనా?”

“సరే నీ ప్రశ్నలు ఏమిటి? అడుగు త్వరగా” అన్నారు వాళ్లు.

“మొదటి ప్రశ్న క్షురకునికి: ఈ నెల రోజులుగా నీ దగ్గరికి ఎంతమంది వొచ్చారు?”

పొడుగు గడ్డాలు, పొట్టి గడ్డాలు
మెత్తని గడ్డాలు, గరుకు గడ్డాలు
నేరుగా వ్రేలాడేవి, రింగుల గడ్డాలు
అన్ని గడ్డాలూ నేను వేగిరం చేసేశాను

“సరే నువ్వు చెప్పు, చెప్పులు కుట్టే ఆయనా, ఈ నెలలో చెప్పులు బాగు చేయించుకోడానికి నీ దగ్గరికి ఎంత మంది వొచ్చారు”

చెక్క చెప్పులు, తోలు చెప్పులు
చీల తరువాత చీల అన్నీ బాగు చేసేశాను
శాటిన్ చెప్పులు బాగుచేశాను, పాము చర్మం చెప్పులు కూడా.
కాని నేను చెయ్యడానికేమీ లేదు
వాళ్ళ దగ్గర డబ్బంతా కర్చయిపోయింది

‘సరే, తాళ్ళు పేనే ఆయనా, మూడో ప్రశ్న నీకు. ఈ నెలలో నువ్వు ఎన్ని తాళ్లు అమ్మావు?

తాళ్ళు పేనే అయన చెప్పాడు:

రకరకాలు తాళ్ళు అమ్మాన్నేను
జనుము తాళ్ళు, జడలు జడలవి, పేము తాళ్లు, నూలువి.
సూదిలా సన్ననివి, మోచేయిలా లావాటివి
పందికొవ్వులా మెత్తనివి, ఇనుములా గట్టివి
ఈ నెలలో నేను తప్పులేం చేయలేదసలు

“సరే సరే” అన్నాడు మాసినో మంట పక్కన వొళ్ళు విరుచుకుంటూ. “ఇక నేను ఒకట్రెండు గంటలు నిద్రపోతా. బాగా అలిసిపోయాను కదా. అర్ధ రాత్రి నన్ను లేపండి. మంత్రగత్తె సంగతి చూద్దాం” అని టోపీ కళ్ళ మీదేసుకుని నిద్రపోయాడు.
మాసినో కు నిద్రాభంగమవుతుందని రైతులు వూపిరి తీసుకోడానికి కూడా భయపడుతూ అర్ధరాత్రి వరకు నిశ్శ్శబ్దంగా వుండిపోయారు. మాసినో అర్ధ రాత్రి తనకు తానే లేచి, ఒకసారి ఆవులించాడు. ఓ కప్పు వేడి ద్రాక్ష సారాయి తాగి, మూడు సార్లు మంటలోకి వుమ్మేశాడు. ఇంకెవరి వైపు చూడకుండా, అడివిలోకి వెళ్లిపోయాడు.
రైతులు మండుతున్న మంట వైపు చూస్తూ కూర్చుండిపోయారు. చివరి నిప్పులు కూడా  బూడిద అయిపోయాయి. అప్పుడు మాసినో ఎవరినో వెంట్రుకలు పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. మాసినో పట్టుకున్న వెంట్రుకలు ఎవరివి? ఇంకెవరివి? అది జమీందారు గడ్డం. జమీందారు కాళ్ళు చేతులు కొట్టుకుంటూ, దయదల్చండని ఏడ్చాడు.
“ఇదిగో మీ మంత్రగత్తె. ఆ వేడి ద్రాక్షరసం ఎక్కడ పెట్టారు”,  అడిగాడు మాసినో.
జమీందారు చలి దెబ్బతిన్న ఈగలా రైతుల కళ్ళ ముందు ముడుచుకుపోయి కూర్చున్నాడు
మాసినో రైతులకు ఇలా వివరించాడు:
“మీలో ఎవరూ దొంగ అయ్యే అవకాశం లేదు. మీరందరూ క్షురకుడి దగ్గరికి వెళ్ళారు. అందువల్ల పొదల్లోని వెంట్రుకలు మీవి కావడానికి వీల్లేదు. ఇక అక్కడ బలమైన పెద్ద చెప్పుల జాడలున్నాయి. మీరెప్పుడూ చెప్పులు వేసుకుని ఎరగరు. దొంగ ఏ భూతమో అయ్యుండే వీలు లేదు, భూతమైతే పశువలను కట్టేయడానికి అంతంత తాళ్ళు కొనుక్కునే అవసరం లేదు. సరే లెండి,  ఏదీ కాచిన ద్రాక్షసారాయి?”
జమీందారు నిలువెల్ల వొణికిపోయాడు. మాసినో తనను పొదల్లోంచి లాగుతున్నఫ్పుడ్డు చిందరవందర అయిన గడ్డాన్ని ఎక్కడ దాచుకుందామా అని చూస్తున్నాడు.
“మరి తను, కేవలం కంటి చూపుతో మేము మూర్ఛపోయేలా ఎలా చేశాడు?” ఒక రైతు అడిగాడు.
“తను మిమ్మల్ని గుడ్డ చుట్టిన గదతో కొట్టే వాడు. మీకు దాని విసురు మాత్రమే కనపడేది. మీ మీద దాని గుర్తులు ఏమీ మిగిలేవి కాదు. కొంచెం తలనొప్పితో నిద్ర లేచే వారు.
“మరి ఆ తలపిన్నులు?” ఇంకో రైతు అడిగాడు.
“తన గడ్డం పైకెత్తి నెత్తి మీద అమర్చుకునే వాడు. అది ముసలామె కొప్పులా కనపడేది.
అంతవరకు రైతులు నిశ్శబ్దంగా మాసినో మాటలు విన్నారు. చివరికి “వీడిని ఏం చేద్దాం” అని ప్రశ్న వొచ్చింది. “కాల్చేయండి. బతికుండ గానే చర్మం వొలిచెయ్యండి. పైన కొయ్యకు దిష్టిబొమ్మలా వ్రేలాడదియ్యండి. పీపాలో సీల్ చేసి కొండ మీంచి కిందికి దొర్లించండి. గోనె సంచిలో ఆరు పిల్లులు ఆరు కుక్కలతో వీడిని వుంచి సంచిని కుట్టేయండి”, అరుపులు , కేకలు.
“దయతల్చండి” జమీందారు మాట గొంతు దాటడం లేదు.
“బతకనివ్వండి” అన్నాడు మాసినో. తను మీరు పోగొట్టుకున్న పశువులను వెనక్కి తెస్తాడు. ఇక నుంచి మీ పశువుల కొట్టాలు శుభ్రం చేస్తాడు. ఇన్నాళ్లూ రాత్రులు ఆనందంగా అడివిలో తిరిగే వాడు కదా, ఇప్పుడు అలాగే తిరుగుతూ మీ అందరి కోసం వంట చెరకు ఏరుకొస్తాడు. ఇక ఎక్కడ తలపిన్నులు కనిపించినా ఏరుకోవద్దని మీ పిల్లలకు చెప్పండి. అవి మిసిల్లినిస్ అనే మంత్రగత్తెవి. ఇతడి తల  వెంట్రుకలు, గడ్డం ఇప్పుడే కొరిగేద్దాం.”
రైతులు మాసినో సలహా అనుసరించారు. త్వరలోనే మాసినో పోకాపాగ్లియా వొదిలేసి మళ్లీ దేశాటనకు బయల్దేరాడు. దేశాటనలో భాగంగానే మాసినో మొదటి యుద్ధంలో, మరో యుద్ధలో కూడా పాల్గొన్నాడు. అలా చాల కాలం గడిచింది. దాన్నుంచి ఒక పాట కూడా పుట్టింది:

సైనికుడా యోధుడా, ఎంత కష్టం నీ పని
పొట్టకు చెత్త తిండి, పడకకు కటికి నేల
అయినా ఫిరంగిలో  మందుగుండు కూరుతుంటావు
బూమ్- బూమ్! బూమ్-బూమ్! బూమ్ గట్టిగా!

ఇటాలో కాల్వినో/హెచ్చార్కె

ఇటాలో కాల్వినో (1923 అక్టోబర్ 15- 1985 సెప్టెంబర్ 19): జగత్ ప్రసిద్ధ కథా, నవలా రచయిత. తన పేరూ, ఈ పుస్తకం పేరూ సూచిస్తున్నట్లే ఆయన స్వదేశం ఇటలీ. ఆయన స్వయంగా సేకరించి, తన మాటల్లో తిరిగి చెప్పిన కథల పుస్తకం “ఇటాలియన్ ఫోక్ టేల్స్'.

మాకు తెలిసి, ఆయన సొంత కథలు కొన్ని ‘ఈ మాట' వెబ్ పత్రికలో వెలువడ్డాయి.. ఇవి ఆయన సేకరించి తన చక్కని శైలిలో తిరిగి చెప్పిన ఇటాలియన్ జానపద కథలు. వీటిలోని చదివించే శైలి, ప్రగతి శీలం అబ్బురపరుస్తాయి. ఇక ముందు రస్తా సంచికల్లో ఈ కథలు ఇలాగే వరుసగా...

5 comments

  • చదువుతుంంటే చిన్నపిల్లల కథలావుంంది.కాని బాగుంంది.

    • పున్నారావు గారు! థాంక్సండీ. జానపద కథలు సాధారణంగా చిన్న పిల్లల కథల్లాగే వుంటాయి. ఇవి మన లోని చిన్నపిల్లల కోసం. విషయం పెద్దవాళ్ళదే. అర్థం చేసుకునె కొద్దీ అందరు పెద్దవాళ్ళదీ, ముఖ్యంగా హిపోక్రసీకి బలవుతున్న పెద్దవాళ్ళది. 🙂

    • జనార్దనగౌడ్ గారు, థాంక్యూ. మొయిని, పశువుల కొట్టాలు, వొచ్చినాం అనే క్రియావాచకం.. మన వూళ్ళ పదాలే. గుర్తించినందుకు మరిన్ని కృతజ్ఞతలు.

  • చాలా మంచి కథను పరిచయం చేశారు హెచ్చార్కే గారూ… కృతజ్ఞతలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.