సోలారిస్- ప్రేమకూ మానవత్వానికి ఓ మెటఫర్

అది 1979 సంవత్సరం. దేశ రాజధాని న్యూఢిల్లీలో Indian International film festival జరుగుతోంది. ప్రపంచంలోని అద్భుత చలన చిత్రాల ప్రదర్శన అని దేశం నలుమూలల నుంచి సినిమా పిచ్చివాళ్ళు చేరారు అక్కడికి. ఒక సినిమా తరువాత ఒక సినిమా ప్రదర్శితమౌతూ ఆహూతులను అబ్బురపరుస్తున్నాయి. ఇంతలో అక్కడి ‘అర్చన థియేటర్’ లో ప్రదర్శితమౌతున్న ఒక సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా చూస్తూ ప్రజలు పిచ్చి పట్టిన వారిగా మారిపోయారు. “ఫెస్టివల్ అని చెప్పి, అద్భుతమైన సినిమాలున్నాయని చెప్పి, టిక్కెట్లు కూడా కొనిపించి, అర్థం పర్థం లేని సినిమాను చూపిస్తారా ..?” అని థియేటర్ లోనే కొందరు గోల చేయటం మొదలెట్టారు. అసహనం పెరిగిపోయి సీట్ల మీద కుషన్లను చింపి పడేశారు. మరికొందరు సీట్లను విరగొట్టారు. కెమెరా ముందు నాటకీయత కనిపించకపోతే సినిమానే కాదనుకునే భారతీయ ప్రేక్షకుడికి, పాటలు, ఫైట్లు, భారీ సెట్టింగుల నడుమ పేరు మోసిన నటుల నవరసాత్మక హావభావనలూ, సెంటిమెంటల్ డైలాగులూ ఇటువంటివేవీ లేని ఒక సినిమా అసలు సినిమా ఎలా ఔతుందనిపించేలా ఉంది పరిస్థితి. సీను తరువాత సీను కదిలిపోతుంటే, కథ పరుగులు పెడుతుంటే, కథనం అరటి పండు వలిచి పెట్టినట్లు చిన్న చిన్న విషయాలను సైతం వివరించేదిలా ఉంటే , చూసి ఇదే సినిమా అనుకునే సగటు ప్రేక్షకుడికి, సినిమా ఒక కళాత్మక స్వేచ్ఛా అభివ్యక్తి రూపమని తెలిసేదెలా?. ఏదేమైనా రెండు వారాల ఫిలిం ఫెస్టివల్ ముగిసింది. బెస్ట్ ఫిలిం గా ఆ సినిమానే అవార్డులు వరించాయి. అదే రష్యన్ దర్శకుడు ఆండ్రీ టార్కోవస్కీ రాసి దర్శకత్వం వహించిన చిత్రం “సోలారిస్”. ఈ రోజుకీ ప్రపంచ సినిమా విమర్శకుల దృష్టిలో best top 10 movies లో ఈ సినిమా ఉంది. ఇకపై కూడా ఉంటుంది.

ఇది పోలిష్ నవలాకారుడు  “స్టెన్స్ లా లెమ్” రాసిన నవల ఆధారంగా తీసినా, టార్కోవస్కీ తన మానసాన్ని కథలో ప్రవేశపెట్టి తనదిగా చేసుకున్నాడు. లెమ్ ని స్వయంగా కలిసి కథను తనదిగా ఎలా మలచుకోవాలనుకున్నాడో విశదీకరించాడు. ఎంత తపన, ఎంతటి నిజాయితీ ఆ మనిషికి?. లెమ్ నవల ప్రవృత్తి మార్గంలో ఆబ్జెక్టివ్ జీవితాన్ని విశదీకరిస్తే, ఈ సినిమా నివృత్తి మార్గంలో సబ్జెక్టివ్ జీవితాన్ని దృశ్యీకరించి మనసును రోజులతరబడి ఆలోచింప చేస్తుంది. ఈ సినిమా చూసినపుడు నా భావన కూడా తెలపకపోతే టార్కోవస్కీ కళాత్మకతను నేను అవమానించినట్టే అవుతుంది. ఎందుకంటే నిజమైన కళ మనిషిని చెప్పలేనంత బలంగా తాకుతుంది. కుదిపేస్తుంది. ఈ సినిమా చూసిన రాత్రి నాకు నిద్ర పట్టనేలేదు. మౌనంగా రాత్రంతా ధ్యానాత్మక స్థితిలో భారమైన ఆలోచనలతో నిదానంగా గడిచినట్టనిపించింది. ఎంత నిదానంగా అంటే ఒక రాత్రి ఒక జీవితమయ్యేంతగా.  సినిమా పేసింగులోని టెక్నిక్ పరుగులెత్తే మనిషి మనసును స్థిమితంగా చేయలేకపోతే, సినిమా ఏం మాట్లాడుతుందో మనిషికి తెలిసేదెలాగా?. టార్కోవస్కీ నెమ్మదైన సినిమాలే తీస్తాడు. ఆ నెమ్మదితనమే తనేం చెప్పదలచాడో తెలపటానికి ఒక భూమికను ఏర్పరుస్తుందేమో. కానీ టార్కోవస్కీ ఏమీ చెప్పడు సినిమాలో. ఆ సినిమానే ఏదో, మనలోపలున్న దాన్నే మనతో చెప్పిస్తుంది. అందుకేనేమో “నిదానమైన బోరింగ్ సినిమాలను తీయలేనపుడు, నన్ను నేను షూట్ చేసుకుని చచ్చిపోతాను” అని సరదాగానే అంటాడు టార్కోవస్కీ. ఆయనకెంత నిబ్బరమంటే, ఆయన సినిమా ఆయనది మాత్రమే. ఆ పాత్రలే కావచ్చు, సంఘటనలే కావచ్చు, తన మనుషులవే. అందుకే అతడికి తనను అర్థం చేసుకునే వాళ్ళే కావాలి. సినిమా నెమ్మదిగా ఉందనో, బోర్ కొడుతూందనో అనే వారికి అతడి అవసరం లేదు, అతడికీ అటువంటి ప్రేక్షకుల అవసరం లేదు. కాబట్టి బోర్ కొడితే హాయిగా వేరే సినిమా చూచుకోండని నింపాదిగా చెప్పగలడు. అందుకే అతడికి సినిమా డబ్బును పేరును పాపులారిటీని సంపాదించి పెట్టే విషయం కాదు. ఈ సినిమాకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో టెలూరైడ్ మెడల్ వచ్చినపుడు, మెడల్ అందుకుంటూ టార్కోవస్కీ కోపంగా అంటాడు, “The cinema, she is a whore. First she charges a nickel, now she charges five dollars. When she learns to give it away, she will be free,” అని.

ఆరోజు రాత్రి నాకు ఎపుడు నిద్ర పట్టిందో తెలియదు. ఈ సినిమాలోని హారీ పాత్ర చెప్పినట్టు అది నిద్ర కూడా కాదేమో. ఆమెకు లాగే నాకు కూడా అది కేవలం నా చుట్టూతా మాత్రమే వుంది, ఎలా అంటే నాలోపల లేనట్టుగా. దూరంగా ఉన్నట్టుగా ఉంది. మనిషి నిద్ర పోయే శక్తిని కోల్పోయాడంటాడు డాక్టర్ స్నౌట్. కానీ, ఈ సినిమా లీడ్ రోల్ ఐన క్రిస్ అంటాడు, నిద్ర కనిపెట్టిన వాడికి ధన్యవాదాలు చెప్పాలని. ఎందుకంటే అది అందరినీ ఏకం చేస్తుంది. “నిండార రాజూ నిద్రించు నిద్రయునొకటే, అండమే బంటు నిద్ర అదియూనొకటే” అని అన్నమయ్య అన్నట్టుగానే, డాన్ క్విక్జోట్ “మేధావినీ సామాన్యున్నీ కలిపే నిద్ర ఒక్కటే” అన్నట్టుగానే క్రిస్ కూడా అంటాడు. నిద్రలోనే మనం మన లోపలి ప్రపంచంతో సంబంధం నెరపుతాం. క్రిస్ భార్య హారీ చనిపోయి పదేళ్ళవుతుంది. ఐనా ఆమె సోలారిస్ అనే సముద్ర గ్రహం మీద హారీకి కనిపిస్తుంది. సోలారిస్ గ్రహం మనిషిలో నిగూఢంగా దాగుండిపోయిన గుర్తులను కనులముందు భౌతికంగా తేగలదు. మనిషి లాగా కణాలతో కాకుండా న్యూట్రినోలతో గుర్తులను మనిషి రూపంలోకి తెస్తుంది. అలా క్రిస్ దగ్గరికి తిరిగి వచ్చిన హారీకి మనిషికున్నట్టు మనసు ఉంటుందా?. ఈ హారీ, చనిపోయిన హారీ ఒకరు కాదు. క్రిస్ తన ప్రేమతో మళ్ళీ ఈ హారీని మనిషిగా చేయగలిగేంత సాహసం చేస్తాడు. అది సృష్టి విరుద్ధమే. ఆమె అతడి లోనే ఉంది. బయటలేదు. ఆ స్పేస్ సెంటర్ లో తప్ప ఆమె భూమి మీద బతకలేదు. ఇదంతా క్రిస్ నిద్రలో తనలో చూసుకునే జీవితం. నేనూ అలాగే అయ్యాను. సముద్రాల మీదుగా పడవలో ప్రయాణించాను. ఆ తరువాత ఆ తడకల పడవ లోని సందుల్లోంచి యుగయుగాలుగా నిలిచి ఉంటున్న గడ్డిజాతుల్ని పక్షుల్ని చూసాను. లోయలోకి పడిపోతూన్న పడవలో సస్పెండెడ్ స్థితిలో ఉంటూ, జరుగుతున్న విపత్తును నిశ్చలంగా చూస్తూ మునిగిపోయాను. ఆ తరువాత తెడ్డు వేసుకుని మరో చిన్న పడవలో ప్రపంచం దాచి ఉంచిన ప్రకృతి అందాలన్నీ పరికించి ఇంటికి తిరిగివచ్చేసాను. అపుడే మెలకువ వచ్చింది. డాక్టర్ స్నౌట్ అన్నట్టు పిచ్చితనం వరంలా అనిపించింది. టాల్స్టాయ్ మానవ జాతి మొత్తాన్నీ ప్రేమించగలగటంలో మానవునికి ఉండే అశక్తతను చూసి భాధపడినట్లయ్యాను. మనిషికి అతి సామాన్యమైన సత్యాలు తెలియాలంటే రహస్య ప్రశ్నలుండాలి. సంతోషానికి , జీవితానికీ, ప్రేమకూ సంబంధించిన రహస్య ప్రశ్నలు. క్రిస్ అంటాడు, “ప్రేమను మనం అనుభూతి చెందగలం గానీ, వివరించలేము. ఒక తత్వాన్ని వివరించగలం. అనుభూతిని కాదు. నీవు దేన్నైతే పోగొట్టుకోబోతావో దానినే ప్రేమిస్తుంటావు. నిన్ను, ఒక స్త్రీని, అలాగే నీ దేశాన్ని. భూమికి కానీ, మనుషులకు కానీ ప్రేమ ఇంకా దొరికినట్లు లేదు. మనం ఇక్కడ(అంటే సోలారిస్ గ్రహం మీద) ప్రేమ కోసమై మనుషులను అనుభూతి చెందుతున్నాం”  అని. కానీ నన్ను నేను పరికించుకుంటే నేను ఆనందంలో ఉన్నానప్పుడు. డాక్టర్ స్నౌట్ అంటాడు, “మనిషి ఆనందంగా ఉన్నపుడు శాశ్వత సత్యాల మీమాంస గానీ, జీవిత సార్థకత గానీ పెద్దగా ఆసక్తి కలిగించలేవని. ఇవన్నీ వార్థక్యంలో అడగాల్సిన ప్రశ్నలని. మరణం వెంటాడినా ఈ శపించే ప్రశ్నలను మనిషి అడగకూడదని” నిజమే అనిపించింది. సైన్సు, విజ్ఞానం, ధైర్యం అంతా అమానవీయమైనవి. మొత్తానికి మనిషిగా ప్రేమతో భూమి మీద నిలబడ లేనివాడు, మరో గ్రహంలో లోపలున్న ప్రేమను తెలపటానికి మనుషుల కోసం, మానవత్వపు అనుభూతికోసం వెదకటం తథ్యం. అందుకే మనిషికి మానవత్వపు సార్థకత లభించేది తనను తానుగా చూచుకుని సిగ్గుపడినపుడే అంటుందీ సినిమా.

ఈ వ్యాసంలో సినిమా కథేమీ చెప్పలేదు నేను. ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ ఆర్ట్ కాదు. సబ్జెక్టివ్ ఆర్ట్. లెమ్ వంటి నాస్తికుడి కథ, టార్కోవస్కీ వంటి ఆస్తికుడికి ఎందుకు నచ్చుతుందో చెప్పలేం. కానీ టార్కోవస్కీనెవరూ ఆబ్జెక్టివ్ గా అర్థం చేసుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళంతా ఆబ్జెక్టివ్ కథను ఊహించారు. అందుకే తాను అమితంగా ప్రేమించిన కమ్యూనిస్టు రష్యా దేశం అతడిని దేశ బహిష్కరణ కు గురిచేసింది. అందుకే, ఆ ప్రేమైక జీవి కోసం నేను ఈ కథను ఇలాగా అర్థం చేసుకున్నాను. నా నిద్రలాంటి స్థితిలో దీనిని నాదిగా చేసుకున్నాను. ఇంకొకరికి ఈ కథ ఇంకోలా అనిపించవచ్చు. అర్థం కూడా కాకపోవచ్చు. కానీ కళ కు, దానిలోని మెటఫర్ కూ ఒక నిండైన సార్థకత తీసుకువచ్చిన ఆండ్రీ టార్కోవస్కీకి మాత్రం ఎప్పటికీ ఋణపడి ఉంటాను.

 

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

23 comments

 • ధన్యవాదాలు sir, మీకు బెలా తార్ సినిమాలూ నచ్చి తీరుతాయని అనుకుంటాను.

  • మిత్రమా ధన్యవాదాలు.
   ప్రపంచంలో వచ్చిన గొప్ప సినిమాలను చూడటానికి నిజానికి మనిషి జీవితం సరిపోదేమో. ఈ సొలారిస్ నన్ను ఆరు నెలల పైగా వెంటాడుతూ ఉంటుందేమో. ఇపుడిపుడే ఆండ్రీ టార్కోవస్కీని explore చేస్తూ పోతున్నాను. ఒక్కో సినిమా చూస్తూ ఎంతగా మదన పడిపోతున్నానో చెప్పలేను. ఎంత మౌనంగా సున్నితంగా తయారవుతున్నానో చెప్పలేను. గొప్ప ఆర్ట్ మనిషిని మరింత మనిషిగా మరింత సున్నితంగా చేస్తుందంటారు. అదెపుడూ వినటమే, కానీ ఇపుడు అనుభవంలోకి తెచ్చుకుంటున్నారు.
   మీరు బెలా తార్ గురించి కూడా చెప్పారు. ధన్యవాదాలు. ఇంకా తెలిసినవి కూడా చెప్పండి. తప్పక చూస్తాను.

 • Sculpting of Time ఎంత గొప్ప మాట! Tarkovsky కి మాత్రమే అది సాధ్యమే మో!

 • Mee view..Chala bagundi virinchi garu..
  Cinema ante pichi unna vallaku matrame artham avvagalige review.. By the way aa movie chudalante source link?

 • విరించి విరివింటి గారికి ధన్యవాదాలు. Slow గా నడిచే సినిమాలు నాకూ నచ్చుతాయి. ఈ సినిమా చూస్తే తెలియాలి నాకు ఎలా ఉంటుందో

 • విరించి గారు మీ సమీక్ష చదివాక ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. దర్శకుడి కోణాన్ని కూడా స్రృషించే ప్రేక్షకులు ఉన్నప్పుడే ఆ సినిమాలకు సార్ధకత.

 • విరించి గారు మీ రివ్యూ చాలా బాగుంది. సినిమా ని తప్పకుండ చూడాలనిపిస్తుంది . అలాంటి మూవీస్ మనసుని తట్టి లేపుతాయి… As well as మీ రివ్యూ లా…నైస్ రివ్యూ .. Movie link plz

 • మంచి వ్యాసం, విరించి. నిజమే. టార్కోవ్స్కి చిత్రాల్లో మనం అర్థం చీసుకునే దానికంటె అనుభూతించే అంశాలే ఎక్కువ. కేవలం ఆ వర్షాలే అలా చూస్తుండిపోతాం. ఆ ప్రకృతి దృశ్యాలు అవీ. ఇక ప్రేక్షకులు అసహానాపరులు. ఏవేవో దృశ్యాలు ఊహించి వఛ్చి భంగ పది వుంటారు. పాపం.

  • ఎంత‌ చక్కగా చెప్పారు సార్. అనుభూతి చెందడం, అనేది లేని కళ వ్యర్థం. Sacrifice సినిమాలో nervous breakdown scene ఒకటి చాలు. ఎన్ని సార్లు చూసినా అదే అనుభూతి. అదే మౌనం ఆవహిస్తుంది.

 • Tarkovsky తీసే నిదానమైన బోరింగ్ సినిమాలు చూడ్డానికి నా లాంటి నిదనమైన బోరింగ్ ప్రేక్షకులు కూడా ఉంటారు సర్.
  మీరు చెప్పింది నినమే ఒక మంచి సినిమా చూసిన రాత్రి చాలా నిదానంగా మౌనంగా గడుస్తుంది. మంచి విశ్లేషణ .తప్పకుండా ఈ సినిమా చూస్తాను.

 • ఫెంటాస్టిక్ రివ్యూ అబౌట్ సోలారిస్ … డాక్టర్ విరించి ఇస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ది ఫీల్డ్ అఫ్ narration … ఆయన ఇది రివ్యూ కాదని అన్నప్పటికీ .. థిస్ ఇస్ టూ వండర్ఫుల్ …

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.