ఐదూళ్లిమ్మనెదరా ఐదుగురికి.. ?

(తెలుగు వాళ్ళకు ఐదు రాష్ట్రాలు అనే మాట చాల మంది విని వుండరు. చలసాని ప్రసాద్ అలా అని  వుండడం తప్పేం కాదు గాని ఆశ్చర్యకరం. ఈ ఆసక్తితోనే దివికుమార్ గారి ఈ వ్యాసాన్ని ప్రచురిస్తున్నాం. – రస్తా సంపాదకవర్గం.)

 

11-10-2013నాటి ఆంధ్రజ్యోతిలో చలసాని ప్రసాద్‌ (విప్లవ రచయితల సంఘం) ”వందేళ్ళ ఆంధ్రం, వెయ్యేళ్ళ తెలుగు” అనే వ్యాసం రాసి దానికి 25-10-13న ఒక ‘దిద్దుబాటు’నూ, 23-11-2013న ‘మరో దిద్దుబాటు’నూ ప్రకటించారు. మొదటి వ్యాసంలో అర్జంటుగా ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలైపోవాలి అని మొదలుపెట్టి బెజవాడను వాళ్ళకి రాజధానిగా యిచ్చేశారు. ఎ. అప్పల్నాయుడు అన్నీ ‘మీ’ బెజవాడకేనా? అని ప్రశ్నించగానే తూచ్‌ అంటూ ఉమ్మడి రాష్ట్రాన్ని 4 సీమలుగా … తెలంగాణ, రాయలసీమ, కళింగసీమ, కోస్తాసీమలుగా, ఎంచక్కా విడిపోదామని మొదటి దిద్దుబాటును ప్రకటించారు. అద్దంకి నుండి మరొక ఉత్తరం (20.11.2013న)రాగానే, వందేళ్ళ ”ఆంధ్రం” కాకపోతే వెయ్యేళ్ళ ఆంధ్రం, వేల ఏళ్ళ తెలుగు అని రెండవ దిద్దుబాటులో రాశారు. ఇవన్నీ చూస్తుంటే ”పంచపాండవులంటే నాకు తెలియదా… మంచం కోళ్ళులాగా… మూడు అంటూ చివరికి సున్న వేసినట్లు” అనే సామెతను తల కిందులుగా గుర్తుకు తెస్తున్నారు. ఇక్కడ పంచ పాండవులనే పదాన్ని నేను ఊరికే వాడలేదు. చలసాని ప్రసాద్‌ అసలు కోరిక నేటి ఆంధ్రప్రదేశ్‌ ఐదు రాష్ట్రాలుగా విడిపోవాలనిట! ఈ మాట నేను అంటున్నదీ, ఆరోపిస్తున్నదీ కాదు. చలసాని ప్రసాద్‌ ”సాహిత్య వ్యాసాలు” అనే పుస్తకం 2008 జనవరిలో విడుదలైంది. దానికి ముందుమాట వరవరరావు రాశారు. ఆ ముందు మాటలో వరవరరావు రాసిన మాటే నేనంటున్నాను ” ఆయన (చలసాని ప్రసాద్‌) ఆంధ్రప్రదేశ్‌ ఐదు రాష్ట్రాలుగా ఏర్పడాలంటాడు” (పేజీ 20).
ఎక్కడ రాశాడో చెప్పకుండా తెలంగాణకి తెలుగు పర్యాయపదం అని కారల్‌మార్క్స్‌ చెప్పినట్టు ప్రసాద్‌ (23.11.2013న) రాశారు. హైదరాబాదులో ”శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం” (1901), హనుమకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం  (1904), ఆంధ్ర జనాభ్యుదయ సంఘం (1921), నిజామాంధ్ర మొదటి మహాసభ (1930), సురవరం ప్రతాపరెడ్డి గారి ”ఆంధ్రుల సాంఘిక చరిత్ర”…. ఇలా వీటన్ని టిలోని ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా వారు వాడినట్లూ, తెలుగు… ఆంధ్రము అనే పదాలు సమానార్థకాలుగా వాడుతూండిన చరిత్ర చలసాని దృష్టిలో లేదా? ‘ఆంధ్రము…. తెలుగు పర్యాయపదాలవుతాయి గాని ”తెలుగు… తెలంగాణము” పర్యాయపదాలెట్లా అవుతాయి? తెలుగువారు జీవించే ప్రదేశం తెలంగాణమవుతుంది. తెలుగు అనే మాట నుండి పుట్టిన పదము తెలంగాణము. అది ‘తెలుగు’కు తద్భవమవుతుందిగాని పర్యాయపదమనటం అసంకల్పితంగా జరిగిన అలవోక ప్రయోగమా? కాదనుకొంటాను. తెలుగు… ఆంధ్రము పదాల పుట్టుక, వినిమయంలో చారిత్రకంగా ముందు వెనుకలుండిగా ఈ రెంటినీ స్థిరపడిన పర్యాయపదాలుగా వందల ఏళ్లుగా సాహిత్యంలో వినియోగిస్తున్నట్టు స్పష్టంగా రుజువులున్నాయి గదా! చలసాని ప్రసాద్‌ ఎన్ని వేల యేండ్లు మనల్ని వెనక్కి తీసుకు వెళ్లినా ”ఆంధ్రము – తెలుగు” పర్యాయపదాలని చెప్పకుండా దాటవేయటమే కాక అవి వేర్వేరు అని స్ఫురించేట్లే రాశారు. అందుకు మార్క్స్‌ను కూడా సాక్ష్యం తెచ్చుకున్నారు. ఇక ఆయన కోరుకునే పంచపాండవుల్లాంటి ఐదు రాష్ట్రాల ప్రత్యేకతల గురించి మావోసూక్తుల నుండి ఏమైనా చెబుతారేమో చూడాలి.
”మా విరసంకి దేవుడు, దయ్యం, మతం, మూఢనమ్మకాలు, కులాలు వర్ణాలు లేవు. మానవులు వారి మధ్య వుండే సంబంధాలు, భావాలు, భాషలు వీటిని గణనలోకి తీసుకుంటాం” అని 20.10.13నాటి మొదటి దిద్దుబాటులో చలసాని ప్రసాద్‌ అన్నారు. భాష వుంటే జాతి కూడా వున్నట్లే గాని ”భాష – జాతి- రాజ్యము”లకు నేటి సామ్రాజ్యవాద యుగంతో గల విడదీయలేని సామాజిక బంధాన్ని ”గణనలోకి ఆయన తీసుకున్నారా?” అన్న సందేహం మిగిల్చేశారు. 20 ఏళ్ళ క్రితం ”దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు, విముక్తినీ, ప్రజల విప్లవాన్నీ కోరుకుంటున్నారు” అన్న మావో సూక్తి వొక నినాదమై తెలుగునాట గోడల నిండా కనబడేది. ఇందులో ”జాతుల విముక్తి” అనేదానికీ, ప్రసాద్‌ గారి 5 రాష్ట్రాల సిద్ధాంతానికీ గల అన్వయ సంబంధమేమిటో ఆయనే చెప్పాలి. ఈ సందర్భంగా 1984లో (తెలుగు)రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకత్వాన మదరాసులో ‘జాతుల సమస్య’పై జరిగిన అఖిల భారత స్థాయి సదస్సు నిర్ణయాలను పత్రాలనే కాక తరువాత 12 సంవత్సరాలకు (1996 ఫిబ్రవరిలో) ఢిల్లీలో తెలుగువారి నాయకత్వాన గల అఖిల భారత ప్రజాసంఘాల ప్రతిఘటనా వేదిక (ఎ.ఐ.పి.ఆర్‌.ఎఫ్‌) నిర్వహణలో ”జాతుల సమస్య”పై ప్రపంచస్థాయి (అంతర్జాతీయ) సదస్సులోని నిర్ణయాల వెలుగులో  5 రాష్ట్రాల సిద్ధాంతాన్ని విశ్లేషించి చూడాలి.
చలసాని ప్రసాద్‌ బాగా అభిమానించే స్టాలిన్‌ 1913లోనూ, 1924లోనూ జాతుల సమస్య గురించి చెప్పిన వాటిని నేనిక్కడ ప్రస్తావించటం లేదు కానీ, స్టాలిన్‌ చెప్పిన ఒక బండ సూత్రాన్ని (ఎవరిదో ఉపన్యాసంలో నేను విన్నది) ఆయనకు గుర్తు చేయాలి. ”ఎప్పుడైనా మార్గదర్శకత్వం లభించనపుడు, ఏది మంచో, ఏది చెడో  తోచక గందరగోళంగా వున్నపుడు, ఎవరిని బలపరచాలో స్పష్టంగా తెలియనపుడు శత్రువు ఏది చేస్తున్నాడో చూసి దానికి వ్యతిరేకంగా చెయ్యి” అని స్టాలిన్‌ అన్నాడట. ఇపుడు పాలక వర్గ పార్టీలన్నీ ”రాష్ట్రాన్ని విడగొట్టటమో లేక యిలాగే ‘సమైక్యంగా’ వుంచటమో” అనే గదా నేటి తెలుగు ప్రజలెదుర్కొంటున్న సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారమని ఘోషిస్తున్నాయి. సామాజిక వ్యవస్థలో (సారంలో) విప్లవాత్మకమైన మార్పులు రాకుండానే, సరిహద్దులు, పరిపాలనా యంత్రాంగంలో (రూపంలో) మార్పుల ద్వారా… ప్రజలకు జీవన భద్రతను కల్పించగలమని రకరకాలవారు ‘ఉద్యమాలై’ చెబుతున్నారు. అధికార – ప్రతిపక్ష పాత్రలన్నీ పాలక ముఠాలే నిర్వహిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అందరికన్నా ముందు ”ఒకే ఓటు రెండు రాష్ట్రాలు” అని అనటం వెనకా, కాంగ్రెసు పదేళ్లుగా రాష్ట్ర విభజన అంశాన్ని అడ్డుపెట్టుకుని పరిపాలన సాగిస్తుండటం వెనుకా ఏ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలున్నాయో విశ్లేషించి చెప్పటాన్ని వదిలి అనవసర వివాదమైన తెలుగు – ఆంధ్రం జోలికి ఎందుకు వెళ్ళటం? ఇపుడు తెలుగుజాతిని ఐదు రాష్ట్రాలుగా విడగొట్టడం ద్వారా, భారతదేశాన్ని 56 రాష్ట్రాలుగా (మొదటి దిద్దుబాటులో ఆయన సూచించిన  ప్రకారం) చేయడం వల్ల తెలుగుజాతి విముక్తి, భారతదేశ స్వాతంత్య్రం, భారత ప్రజల విప్లవం ఎలా పరిపూర్ణమవటానికి దోహదపడయి?.

శ్రీశ్రీని పదే పదే ఉటంకించే చలసాని ప్రసాద్‌, 1954లో (1955 ఎన్నికల ముందు) ”విశాలాంధ్రలో ప్రజారాజ్యమే ఘటించగా శ్రమించరా పరాక్రమించరా” అని రాసిన దానిలోని ”సారమూ – రూపమూ” గురించిన సందర్భమూ – పరిణామాల గురించి చెప్పకుండా ఎందుకు దాటవేశారు? శ్రీశ్రీ కోరిన ప్రజారాజ్యం ఏమయింది? శ్రీశ్రీ, ఆయన అభిమానులు అన్నట్టు ”దొంగ వోట్ల, దొంగ నోట్ల రాజ్యమొక రాజ్యమా, లంచగొండులేటేటి పాలనొక పాలనా?” అయింది కదా! గజదొంగలేలే ఈలాంటి రాష్ట్రాలనేనా ఐదు కావాలని ఈయన కోరుకున్నది? కూడు, గూడు, గుడ్డా, సంగతి అలా వుంచినా , కనీసం వీటిలో ఒక్క రాష్ట్రంలోనయినా తెలుగు ప్రజలకు తెలుగుభాషలోనే చదువులు, తెలుగు భాషలోనే పరిపాలనయినా అందుతాయనే హామీని ఎవరిస్తారు?

తాజా కలం: ఖమ్మంలో జరిగిన విరసం మొదటి మహాసభ కు ముందు కాలం నుండి చలసాని ప్రసాద్ కుటుంబ సభ్యులతో ,ఆయనతో నాకు సాన్నిహిత్యం వుండేది. కానీ భిన్నాభిప్రాయాలు కూడా నాటి నుండీ వుండేవి. ఆయన తో స్నేహానికి అవి ఎప్పుడూ  అడ్డు రాలేదు.

ఐదు సంవత్సరాలక్రితం రాసిన ఈ వ్యాసం అముద్రితంగా వుండిపోయింది. ఇది చలసాని ప్రసాద్ కి  మాత్రమే చెందినది కాదు.

రాష్ట్రం విడిపోయి నాలుగేళ్ళయింది. పూర్వం కాళోజీ అనుకున్నట్లు  ‘గిట్లయితదని ఎవరనుకున్నరు’? అనే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

కొన్ని రాజకీయ పదవులకోసం , ఉద్యోగాలలో ప్రమోషన్ ల కోసం, కాకుంటే అభివృద్ధి పనులలో కమీషన్ ల వాటాల కోసం తప్ప మౌలిక సమస్యలకు సమైక్య.. ప్రత్యేక పాలక ముఠాల వద్ద ఎలాంటి పరిష్కారాలు లేవు. కుళ్ళి కంపుకొడుతున్న నేటి సంక్షుభిత వ్యవస్థకు అతుకుల బొంత పరిష్కారాలు చాలవు. దివికుమార్, 13 – 10 – 2018

 

దివి కుమార్

దివి కుమార్: ఈ నెల 28 కి డెబ్బై ఏండ్ల వయసు. మెకానికల్ ఎంజీనీరింగ్ డిప్లొమాతో రాజమండ్రి పేపర్ మిల్స్ లోనూ, హైదరాబాద్ ప్రాగాటూల్స్ లోనూ, తంతి తపాలాశాఖ లోనూ పని చేసి, 13 ఏండ్ల క్రితం రిటైర్ అయ్యారు. స్పందన సాహితి (1969), విరసం తొలి మహాసభ, జనసాహితి ప్రారంభం (1975) నుంచి సాహిత్యోద్యమాలతో మమేకమవుతున్నారు. అయోధ్యలో రావణకాష్టం, ఉరి కంబం సాక్షిగా...తదితర పుస్తకాలు రాశారు, వ్యాసాలు రాస్తుంటారు. గత 37 సంవత్సరాలుగా జనసాహితి , సాహిత్య సాంస్కృతికోద్యమ సంస్థ బాధ్యత లలో ను , ప్రజాసాహితి పత్రిక నిర్వహణలో నూ వుంటున్నారు.

1 comment

  • రెండయ్యేసరికి సరిపోయింది. ఇక ఐదు కావాలి !

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.