ఆమోదంలోనే ప్రమోదం

‘Don’t write him off yet; he is still alive’ అని ఒక నానుడి ఉంది. వాణ్ణి అప్పుడే తీసిపారేయద్దు; వాడింకా బతికే ఉన్నాడు అని అర్ధం. సాధారణంగా మనం చుట్టూ ఉన్నవాళ్ళని తీసిపారేస్తుంటాం. ఈ అవలక్షణం ఇంట్లోనే మొదలవుతుంది. తల్లిదండ్రులు ఒకరినొకరు మీ మొహం, నీ బొంద అనుకుంటూ ఉంటే పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. ఇంట్లో మొదలయ్యే అవలక్షణాలన్నీ పిల్లలు వీధిలోకి తీసుకెళతారు. అది ఎలా ఉన్నా, కొంచెం ఎక్కువైతే ఎదుటివాళ్ళు ప్రశాంతంగా ‘మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు; ఎవరమ్మా?’ అని అడుగుతారు. ఈ తరం పిల్లలు సరదాగా ‘మధ్యలో వాళ్ళ పేర్లెందుకు లెండి పాడుచెయ్యడం’ అనేస్తున్నారు. నిజానికి పిల్లల పెంపకం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు. అలాగే ఏ రంగంలో ఉన్నా, ఎంతటి గొప్పవాళ్ళనైనా కొంతమంది తీసిపారేస్తుంటారు. ‘సార్! ఆయనకి పద్మశ్రీ వచ్చింది; ఆవిడకి పద్మశ్రీ వచ్చింది అని హైరానా పడిపోతుంటే, ‘ఆ ఏముందండీ? ఆవిడ గొంతులో మెలొడితో కొట్టుకొచ్చేసింది. స్వరజ్ఞానం అంతంత మాత్రమే! అబ్బే! శృతి కూడా నిలవదండీ. నేనూ విన్నాను! పెద్ద గొప్పగా ఏమీ లేదు.’ ఇలా సాగదీసే వాళ్ళు కొందరుంటారు. రాళ్ళేసే వాళ్ళ గుంపులో నిలబడి రాళ్ళేసే పెద్ద మనుషులు ఉంటారు. ఇవన్నీ కూడా మానవ ప్రవర్తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తాయి. నిజానికి వాళ్ళలా మాట్లాడాలని అనుకోరు. చుట్టూ ఉన్నవారి ప్రభావం వలన మనం కూడా ఒక రాయేద్దాం అని అప్రయత్నంగా అనిపిస్తుంది. మనం పుట్టాక, మన పిల్లలు పుట్టాక, మనవలు, మనవరాళ్ళు కూడా పుట్టాక ఇంకా ఘంటసాల, బాలమురళీ కృష్ణల పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఘంటసాల బాగా పాడతారు, బాలమురళి బాగా పాడతారు అని ఇప్పుడు మెచ్చుకోవడం అజ్ఞానం. వాళ్ళ పాటలు మనకు  ఇష్టం అంతే; వాళ్ళు బాగా పాడతారని మనం సర్టిఫికెట్ ఇవ్వక్కర లేదు. విమర్శించేటప్పుడు మన స్థాయి, స్థానం ఏమిటో తెలిసి మసలుకోవాలి. అందరినీ ఒకే గాటన కట్టేయకూడదు. ‘పదుగురాడు మాట పాడియై ధర చెల్లు’ అన్నా కూడా, ఒక్కడు విమర్శ చేసినందువల్లే రాముడు భార్యనొదిలేశాడు. అది పదుగురాడిన మాట కాదు. అయినా ఎందుకు? రాజు కాబట్టి! రాజుని ప్రజలు గుడ్డిగా అనుసరిస్తారు. అందుకని వాళ్ళ ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలి. ఇంట్లో కూడా మన ప్రవర్తన పిల్లలకు తప్పుడు సూచనలిచ్చేలా ఉండకూడదు. కనీస ఆదర్శవంతంగా, మంచి చెడు తెలిసేలా ఉండాలి శ్రీరాముడంత లేకపోయినా! అప్పుడే వాళ్ళు మనల్ని తీసిపారేయకుండా ఉంటారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఇదే పరిస్థితి. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. ఇంకా చాలా కనిపెట్టాడు. మనం  వాడుకునే నిత్యావసర విద్యుత్ పరికరాలెన్నో థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టాడని అంటారు. ఆయన చేసిన పరిశోధనా పత్రాలన్నీ కాలిపోతే ఎంతో నిబ్బరంగా ‘ఇంతవరకు 10 వేల రకాలుగా బల్బు ఎలా కనిపెట్టకూడదో నాకు తెలుసు. ఇప్పుడిక కనిపెట్టడం ఈజీ’ అంటాడు. థామస్ ఆల్వా ఎడిసన్ నిజానికి  పరిశోధనా చోరుడని, అవన్నీ నికోల టెస్లా కనిపెట్టాడని అంటారు. ఇదో వాదన. ఏ కాలంలోనైనా ఇటువంటి వివాదాలు సహజమని అనిపిస్తుంటుంది. బిల్ గేట్స్ ఐబిఎం కంపెనీలో పని చేస్తున్నప్పుడు సాఫ్ట్ వేర్ చోరీ చేసి, మైక్రోసాఫ్ట్ స్థాపించాడని ఇప్పటికీ కొంతమంది గుసగుసలాడుతుంటారు. ఎదుటివారిని ఆమోదించడానికి ఎంతో మందికి అసూయ అడ్డొస్తుంటుంది. దీనివల్ల ఏ ప్రయోజనమూ లేదు. కోపం మనం తక్షణం కక్కే విషమైతే, అసూయ లోలోపల దహించివేసే slow poison. Anger is one letter short of danger; jealousy is a slow poison which will ruin the character. మనిషి ప్రవర్తనలో ఇటువంటి చీకటి కోణాలను అధిగమిస్తేనే ఒక ఆమోదయోగ్యమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకునే అవకాశం కలుగుతుంది.   

ఇక సాహిత్య రంగంలో అంతా మంచివాళ్ళే. ఎవరి రచనలు నిలబడ్డాయో వాళ్ళ గురించే మనం ఎక్కువగా మాట్లాడుకుంటూ  ఉంటాం. ఇప్పుడు ఎవరి రచనలను ఎవరు ఎక్కువ పొగుడుతారో, వారి రచనలను మాత్రమే ఉత్తమ రచనలని మాట్లాడుకుంటున్నాం. కొత్తగా ఏ రంగంలోకొచ్చేవారికైనా అయోమయమే ఆహ్వానిస్తోంది. తొలిదశలోనే గురుస్థానంలో (Mentors) ఉన్నవారు పక్కదోవ పట్టిస్తున్నారు. కవిత్వంలో అంతర్లయ నశించి కీర్తి కండూతి అంతర్వాహినిలా ప్రవహిస్తోంది. కవులూ మనుషులే కాబట్టి, ‘నిరంకుశా: కవయ:’ అని మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది కాబట్టి, కవులే వ్యక్తిత్వ వికాస నిర్మాతలు కాబట్టి వారే తమ ప్రవర్తనను స్వీయ పరిశీలన చేసుకోవాలి. రాజకీయ సాహిత్యం అనివార్యమైన ప్రక్రియే కానీ, సాహిత్య రాజకీయాలు ఆత్మహనన కార్యక్రమమని సాహితీ సృష్టికర్తలు గుర్తించాలి. ఏ సాహిత్యమైనా వ్యక్తిత్వ నిర్మాణానికే కానీ, వ్యక్తిత్వ ధ్వంసానికి దోహదం చేయరాదు. వ్యక్తుల సమూహమే సమాజం కాబట్టి, సమాజం పట్ల బాధ్యత వ్యక్తులకుంటే, సమాజం బాధ్యతాయుతంగా కనిపిస్తుంది. నేడు సాహితీ సృజన చేసే యువత అధ్యయనం, అభ్యాసం, పరిశీలన, సాధన నిరంతరం కొనసాగిస్తూ మంచి మార్గం చూపించేవారి (Mentors) అడుగుజాడల్లో నడవాలి. మనం మంచి శిష్యుడైతే మంచి గురువు (Mentor) సహజంగానే కనిపిస్తారు. సాహిత్య రంగంలో ఆమోదం ఒక భ్రమ. అందుకే ‘ఏ రీతి రచించిరేని సమకాలికులు మెచ్చరే’ అంటారొక కవి.

ఎంత తెలిసినా, ఎంత చదివినా  అందరినీ సహజ నైజంతో మనం తీసిపారేస్తుంటాం. మనల్ని కూడా తీసిపారేసే వాళ్ళు ఎక్కడో ఒక చోట తగులుతారు. ప్రతి రోజూ కర్వేపాకులా బతకాలా, రేపు అందరూ చెప్పుకునే కథలా బతకాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి.  ఇంత చెప్పారు? ఏం చెయ్యాలి మేము అనచ్చు పాఠకులు. Accept yourself as you are. Accept others as they are. ముందుగా మిమ్మల్ని మీరు ఆమోదించుకోండి. ఎదుటివారిని వారికున్న అన్ని బలహీనలతో ఆమోదించండి. The first step toward change is awareness. The second step is acceptance అంటాడు నథానియెల్ బ్రాండెన్. మార్పు వైపు పయనించే దశలో తొలి అడుగు అవగాహన. మలి అడుగు ఆమోదం. సరైన అవగాహనతో సకల జనామోదమైన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోండి. విజయం మీ వెంటపడుతుంది. విజయోస్తు!      

 

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.