మొన్నీమధ్య Rx 100 అని ఒక సినిమా రిలీజయింది. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు. సినీమా భలే గా ఉంది. జంకు జంకుగా ఉండే కుర్ర హీరోని చాలా అందంగా ఉన్న హీరోయిన్ తన గుండెల పై పైకి లాక్కుని ముద్దులు పెట్టే సీన్లు చాలా రొమాంటిగ్గా ఉంటాయి. పెళ్ళై పిల్లలున్న వాళ్ళకే ఆ సీన్లు చాలా ఇదిగా ఉంటాయి. ఇక పదహారు, పద్దెనిమిదేళ్ళ పిల్లల సంగతి ఊహిస్తే నాకు భయమేసింది. 2018 లో వచ్చిన ఈ లాంటి సినిమాల సంగతి పక్కనపెట్టి, వాళ్లెవరన్నా ఎచటికిపోతావీ రాత్రి అనే కవితల పుస్తకం చదివితే ఇంకేమైపోతారు ? కవి వజీర్ రెహ్మాన్ ఈ కవిత్వాన్ని 1963 లో ప్రకటించాడు. అతను అక్షరాలా గుడిపాటి వెంకటా చలం అల్లుడు. కవి ఇస్మాయిల్ కి తమ్ముడు. అనామిక అన్న ఒక కవిత లో —
“భుజాలనించి జారే తడి జుట్టుని తప్పించుకుని తొంగి చూసే లేత రొమ్ములు, తెల్లనై విచ్చుకుని ఎండకి మెరిసి వొణుకుతో —
ఒంపైన నడుం కింద నీళ్ల చాటు సర్పాల మల్లే కదిలే తొడలు — కనబడీ కనబడక కవ్వించే యెవ్వనోజ్జ్వల నూగారు చీకట్లు ! “ — అంటాడు.
కూచిమంచి జగ్గకవి రాసిన చంద్ర రేఖా విలాపం అనే కావ్యమో, ప్రవరుణ్ణి మోహించిన అల్లసాని పెద్దన గారి వరూధిని వాక్చాతుర్యమో గుర్తొస్తుందా ? రావచ్చు గాక. అయితే ఇక్కడ అదే దన్నా రివర్స్ గేర్ లోనే వస్తుంది. వజీర్ రెహ్మాన్ “తలంచునే సతుల మాయలు ధీరచిత్తంబులన్” (స్థిరమైన మనస్సు గలవారిపై స్త్రీల మాయలు పనిచేయవు) అని పెద్దనామాత్యుడిలా ఏమీఅనడు. “నీ బలిష్ట రొమ్ములని మోయలేక వణికే లేత నడుం చుట్టూ చేతులు బిగించి కఠిన రాతి పెదాలని అత్యంత మొహంతో హత్తుకోవాలని ఆవేశపడి నిమిషమాగి సందేహిస్తాను ! నా ప్రేమ అర్ధ రహితమా, మానసిక దౌర్భల్యమా ? లేక జన్మాన్తర బాంధవ్యమా ! అని ” (అరుణాచలేశ్వర ద్వారపాలికతో) అంటాడు. లేదా “లవండర్ సువాసనలతో మత్తెక్కి వణికే నీ రొమ్ముల మధ్య తలదాచుకున్న ఘడియలనీ, నా పెదాల చక్కిలిగిలికి వెలిగే చనుమొనల స్పర్శా మైకాన్నీ— ఇదేం లేదనుకో, మర్చిపో, నేనేం కాదనుకో రాలేదనుకో— అని వారిస్తావు కానీ, నువ్వు లేని నన్ను ఊహించడమే భరింపరాని బాధై నేనెట్లా మరువగలను —అవును కన్నా. నిజంగా నీకిదంతా ఉత్త ఆటే. కానీ విను నాకెంత నిజమో, గుండెకెంత కోతో, నీ పాదాల చెంత.” (నీకిదంతా ఉత్త ఆట)అంటాడు. ఏమిటీ కవితా వాక్యాలు ? ఏం చెప్తున్నాయివి ? 1963 లో ఇలాంటి కవిత్వం చదివిన వాళ్ళు ఎలా ఫీలయి ఉంటారో తెలియదు గానీ ఇప్పుడు మాత్రం నోట మాట రాదు. కంటికి నిద్రా రాదు. ఫిడేల్ రాగాల డజనో (1939), నూతిలో గొంతుకలు(1955), అమృతం కురిసిన రాత్రి (1968), మహాప్రస్థానం (1950), దిగంబర కవిత్వం (1965-68) లాంటి అభ్యుదయ ఆధునిక వచన కవిత్వపు తీవ్ర ప్రభావ గాలులు వీస్తున్న రోజులలో వజీర్ రెహమాన్ ఈ సంపుటి తీసుకువచ్చాడు. అతని కవిత్వమంతా తద్విరుద్ధమైన భావ పరంపరని కొనసాగించాడు. నిద్ర రాని రాత్రో, ఆ రాత్రిలో వెన్నెల సెగలు రేపే ఏకాంతమొ, ఆ ఏకాంతం, దాహంతో మోహంతో కోరుకునే ఒక ప్రేమైక సాహచర్యమో, ఒంటరితనంలో పడి ఏడుస్తున్నట్టు, పుస్తకమంతా ఒక తాపత్రయం, తపన, అన్వేషణ ఇంకా ఏవేవో రక రకాల ఆలోచనలు. అవి మనల్ని ఫలానా చోట ఫలానా విధంగా ఉన్నామా యని భ్రమింపజేస్తున్నాయా అనిపిస్తుంది. ఒక మనిషి మీద ఉండే రకరకాల ఒత్తిళ్ల మధ్య అతని ఆకాంక్షలు, కోరికలు, నమ్మకాలు తనని ఎలా ప్రవర్తింపజేస్తున్నాయో ఆశ్చర్యం కలుగుతుంది. “నీకై మోహ వాంఛ బలీయ మహా విష సర్పం వలే పడగ విప్పినా దేహంలో నరాల మధ్య బుసలు కొట్టి తిరుగుతోంది – ఒంటరై, బతుకు శోకమై, వెర్రాశతో రగిలి తరగని బాటకేసి చూసి చూసి బరువెక్కిన కళ్ళు తెరిచి వేచి వేచి విలపిస్తాను — ఈ రాత్రి ఇంకెంత దూరమో, ప్రభో, ప్రభో, ఈ వియోగ మింకెంత కాలమో ” (మోహ విష సర్పం) అంటాడు. నిరాశ అనే కవితలో “కానీ ఏం లేదు, ఎప్పటి మల్లె ఉత్త నిస్సారంగా అవే రాత్రులు ఉదయాలు అవే బాధలు బలహీనాలు ” అంటాడు. నాక్కొంత సహజంగానూ, అసహజంగానూ జీవన వేదన గురించిన పలాయన వాక్యాలని రాశాడా కవి అనిపిస్తుంది. ఎందుకంటే, జీవితం పట్ల ఇతనికి చాలా గాఢమైన ఇష్టం అణువణువూ కనిపిస్తుంది. ఆ ఇష్టాన్ని ప్రకటించడానికి అతనే మాత్రమూ సంశయించడు. అది ఏ తీవ్ర భావ సంచయమైనా సరే వెనకాడడు. “రా నా కౌగిట్లోకి, నాపై కరుణ చూపు, ప్రేమ కాదు నువ్వే చాలు. రా నా చేతుల్లోకి నన్ను కాదనకు, రా మహా విశ్వ సామ్రాజ్ఞిలా ఒక సారి చాలు, విచ్చేసి నాకేసి వరించి శాసించి ఏలుకో, మరుక్షణం వెనక్కి మరలి పో, జ్ఞాపకాలు తుడిచేసుకో — రా నా కౌగిట్లోకి ఒకసారి చాలు, నాకదే వేనవేలు, రా , నాచేతుల్లోకి ” (రా నా కౌగిట్లోకి ) అంటాడు.
నిన్ను నువ్వు కొత్తగా తెలుసు కోవడమా, ఏదీ లేకుండా నిన్ను నీలా ఉండి పొమ్మనడమా, ఎం చెప్తున్నాడీ కవి ? “చీకటి గదిలోమూల దిండులో తల దాచుకుని దుఃఖంతో వొణికిపోతో గొంతు వెలికి వినరాకుండా కుళ్ళి ఏడ్చే నా మల్లె – ఎందుకో ఏమో నామల్లె ఏ ప్రియురాలి కోసమో ? (నా మల్లె ) అని ఏడుస్తాడు. “ఏవీ నా పెదాల నదిమిన పెదాలు, నన్ను కావలించిన హస్తాలు, కరుణించిన రొమ్ములు, ఏవంటో దుఖ్ఖ నిరాశతో ఎదురుచూస్తాను” (చపల చిత్త ) అని వెర్రితనం చూపిస్తాడు. లోపలి మనిషొకడు బయటకి కనపడే వాణ్ని కాదంటున్నట్టు కనిపిస్తాడు. లోపలి వాడొక విపరీత ఆత్మాశ్రయుడై తీరని దాహంతో విస్తారమౌతున్నట్టు, తన చుట్టు ఉన్న బంధనాలకి లోబడిన భాషలో మాట్లాడతాడు. కానీ జనరలైజ్ చేయడు. స్పెసిఫిక్ గానే మాట్లాడతాడు. అద్వితీయుడిగానే కవిత్వం చెప్తాడు. అతని శైలి మొత్తం ప్రణయ కర్పూరపు గుబాళింపు వస్తుంది. పరిపూర్ణ స్వార్ధమయ లాలస, ద్వంద్వాత్మకత ఉంటుంది. జీవితం మీద భయం కూడా కలిగి ఉన్నతనం ధ్వనిస్తుంది. ఆ భయం చేత ఒళ్ళు మరచిన తనమొకటి పిచ్చి మోహావేశ ప్రేమలాగా అనిపిస్తుంది. “నువ్వు జుట్టు విరబోస్తే భయంతో వొణుకుతాను — ప్రియా నువ్విలా జుట్టు విప్పకు, నానించి మొహం తిప్పకు, ఈ గంధ సుగంధ జ్వాలకి బంధీనై, భయంతో ఏమవుతానో నేను” (నువ్వు జుట్టు విరబోస్తే) అంటాడు. నిరపరాధమైన సిగ్గులేని తనం బాహాటంగా కొట్టొచ్చినట్టు ప్రతి కవితలో కనిపిస్తుంది. ఇదే ఇతని స్టయిలేమొ కూడా. ఇదంతా దేని కోసమయ్యా అని పుస్తకమంతా తిరగేసి తిరగేసి ఆఖరుకి ఇదంతా ఒక భావ వ్యక్తీకరణలోని ప్రత్యేక వాదమేమన్నా అయి ఉండాలనిపిస్తుంది. ఎందుకా ప్రత్యేకత ? మళ్ళీ ఆబ్జెక్టివ్, సబ్జక్టివ్ అనే వ్యత్యాసాలు గుర్తు తెచ్చుకోవాలేమో ? ఇవేమీ కాదు. వస్తూత్వం కానిది, సమస్తమూ కానిది, ఒక లోక విరుద్ధమైన దారిలో నడవడం. అంతే. ఈ విరుద్దత కూడా అతని కళాత్మక జీవన విధానంగా మనం చూడవచ్చు. అలా రాయగలగడం సాహసమూ, విలక్షణమూ కాకుండా వుండలేదు కదా ? అందుకే ఎన్ని పాపులర్ కావ్య రాజముల మధ్య నున్నా కూడా ఈ కవిత్వం తన ప్రత్యేకత తాను చాటుకుంది. దాంట్లో అతని ఫార్మ్ కే మూడొంతులు మార్కులొస్తాయి.
సొంత గొంతుకలో, సొంత దృష్టిలో తనదైన జీవితారాధన చేసిన కవిత్వం. ఏ ఇజాలూ ఆట్టే కనిపించవు. ఒట్టి అనుభవ సారాంశ కవితా సృష్టి. మార్మిక లోకంలో ఇంద్రియాల సంచారం. వాటి అనుభూతుల విశృఖలత్వం. మనం కావాలనుకునే లోకహిత దృక్పధమూ, ఐడియల్ సమాజమూ ఏవీ కనిపించవు. ఒక మహా గొప్ప సౌందర్యారాధన. కళల పట్ల అవగాహన ఉన్న కవి, తాత్వికుడిగా, భక్తుడిగా, రసాన్వేషకుడిగా, అనేక భిన్న రూపాల్లో మనకి దర్శనమిస్తాడు. అసలు దేని గురించి ఈ కవిత్వం మాట్లాడిందీ సందేహమొస్తుంది. కవితా రూపాన్ని గమనించి నప్పుడు అంతగా లేని వస్తు నిర్వహణలోని అతని చాకచక్యత మనకు సులువుగానే అర్ధమవుతుంది. పెదవులపై నవ్వొస్తుంది. అప్పుడే వ్యూహాత్మక శిల్ప శోభ వజీర్ కవిత్వాన్ని ప్రాణమయం చేసిందనిపిస్తుంది. అతను ముసలి వేశ్య గురించి రాసినా, డబ్బు, పదవీ, కీర్తి గురించి రాసినా, వాన రాత్రి అన్నా, ఏమన్నా కూడా అతన్ని అతనిలానే అర్ధం చేసుకొమ్మని శాసిస్తాడు . అది చదువరుల వ్యక్తిత్వాన్ని కొంత కలవరపెడుతుంది. తేల్చుకొమ్మంటుంది. అతని అనుభవానికి నువ్వు లొంగుతావా లేదా అన్నదే నిర్ణయమవుతుంది. ధర్మాధర్మ, యుక్తాయుక్త మీమాంసలు ఒకే లోక రీతికి లోబడని పరిమిత భావ చింతన. అదీ ఒకతని ఆధిపత్యాన్ని ఒప్పేసుకున్నట్టు కనిపించే కవిత్వమే ఇదంతా ! ఎవరిదా ఉపదేశ స్వరం ? ఇంకెవరు ? దేవుడే. లేదా దేవుడిలా ఆరాధించే గుడిపాటి వెంకటా చలమే. చలాన్ని త్రావి నిషాలో ఉన్నాన్నేను; ముట్టకు మెరుపై జ్వలిస్తాను ! తట్టకు ఉరుమై ధ్వనిస్తాను. అంటాడు. సొంతదనమూ, చలంతనమూ కలగలసిన ఈ పుస్తకం గురించి వడ్డెర చండీదాస్ “ఈ కావ్యం గొంతు చలానిది. కావ్యకర్తకి వ్యక్తిగానూ రచయత గానూ చలమంటే అపారమైన ఆరాధన ఉండి ఉండాలి. అసలీ కావ్యం పేరు లోపలి భాషతో కలవదు. అది మహా ప్రస్థానంలోని చరణం” అంటాడొక చోట. నిజమనిపిస్తుంది.
అవును, నా కవిత్వ సాధనలో చరణ చరణమూ అతని ప్రభావం, పర్యవేక్షణ నా జీవితంలో నిమిష నిమిషమూ అతని రక్షణ హస్తం, ప్రోత్సాహం నాకు, అతనిచ్చిన బలంతోనే చూపిన అతని తోవ వెంటనే, ఈ నడక నాకీ నాడు — మధురానంద కవితాకాశంలోనూ, దుర్గమ జీవన కీకారణ్యంలోనూ — అని చెప్పుకుంటాడు. చలం ప్రభావం అతన్నెంతగానో రగిల్చి వేసిందన్న సత్యం చాలా చోట్ల మనకి కనిపిస్తుంది. చలం నీలో నీ కంఠంలో పాటలో మహా దేవతా వ్యక్తి దివ్య గంభీర శాసనాసక్తి, ఒకపలుకుతో పాటతో నన్నాజ్ఞాపించి గాన లోలుణ్ణి చేసి యుగాలు జగాలు వెంట తిప్పుకుంటో — అంటాడు. చలంగారి అమ్మాయిని(పక పక) చేసుకున్నాడు కదా, ఇదంతా ఆమె పై రాసిన కవిత్వమా అనే సందేహం వొచ్చి అబ్బెబ్బే అసలిదంతా ఒక ఫలానా వ్యక్తి గురించి అని నిర్ధారణకు రాలేకపోతాము. వయుక్తిక జఠిలత వస్తువుల మీద నుంచి, ఆలాంటి వ్యక్తుల మీద నుంచి చదువరి చూపుని వేరొక లోకాల్లోకి తీసుకు వెడుతుంది “కొన్ని క్షణాలు నన్ను కాదని ఒదిలి ఒంటరిని చేసి దారిన ఎవర్నో నవ్వుతో వెంటాడితే, నీ కళ్ళు నన్ను తప్ప ఎవర్నీ చూడకుండా నిన్ను గుడ్డిని చేసి శాశ్విత బందీని చేయాలనే వెర్రి ఊహ బుసలు కొట్టి —ప్రియా నాకెంత భయమో ఎంత దుక్ఖమో” (ఈర్ష ) అన్నప్పుడు మనమొక నిర్దుష్ట తలం మీద నిలబడలేము. “ప్రియా రాత్రి ఏకాంతంలో పూల మల్లె పరిమళం మళ్ళీ నీ మోహన రూపాన్ని మనసులోకి తెస్తోంది — మళ్ళీ పాత దిగులు తలయెత్తి నరనరమూ బాధతో మీటుతొంది” (జ్ఞాపకాలు) అని అంటాడు. ఎవరి ఆంగిక సంబంధంలో ఇతని నరాలు జివు జివ్వుమని సమన్వయ పరివర్తన చెంది ఉంటాయబ్బా అనిపించక మానదు. ఇదంతా కామమేనా? ఛ ఛ కాదు కాదు. ఇదంతా విరహమూ, వెతుకులాట, ఒక సామీప్య కోరిక, సరిపోల్చుకోవడం, నిందించడమూ, బంధించడమూ కూడా అనుకుందాం. వజీర్ చాలా డిఫరెంట్ కవియన్న సత్యం అబద్దం కాదు కనుక అతని కవిత్వాన్ని కామొద్దీప కవిత్వం మాత్రమేనని అనడం తప్పవుతుంది.
వజీర్ ఈ పుస్తకంతో పాటు మనకి చాలా వివరాలిస్తాడు. ఏ కవిత ఎందుకు రాశాడో, దేని ప్రోద్బలం వల్ల రాశాడో మనకి వివరిస్తాడు. ఇలా చేసిన కవులెంత మంది ఉంటారో తెలియదు కానీ, ఇలా సమాచారం ఇవ్వగల ధైర్యం మనల్ని అబ్బుర పరుస్తుంది. అతని మీద గల వివిధ పాశ్చాత్య ప్రభావాలు మనకి అర్ధమవుతాయి. టాగూర్ని అనుకరించాననీ, హరీంద్ర చటోపాధ్యాయ కవితాధారంగా రాశానని, బుద్ధదేవ్ బోసు రాసిన థీమ్ తీసుకుని రాశానని ఏదీ దాచుకోకుండా చెప్తాడు. మనం మిగతావన్నీ మానేసి అతని రచనలోకి వెంటనే వెళ్ళిపోతాం. ఎవ్వరి ప్రభావమూ, ఎవరి ప్రోద్బలమూ, లేకుండా ఒక పూర్తి రచనా సృజన సాగుతుందని చెప్తే నిజమవదేమో? కానే కాదు. మనం ప్రకృతిని, ప్రపంచాన్నీ ప్రేరణగా తీసుకోకుండా ఎక్కడా ఒంటరిగా నిలబడలేము. సొంతంగా నైనా, ఇంకొకరి అనుభవంలోనైనా ! అది వజీర్ “ఒమర్ ఖయ్యాం” లోంచి అన్నా, జాన్ డన్నే రాసిన“డెత్ బీ నాట్ ప్రౌడ్” లోంచి అన్నా, ఉర్దూ కవి మీర్జా గాలిబ్ గారి కవిత్వంలోంచైనా — ఎక్కడా కూడా వజీర్ని కాని కవిని మనం చూడం. ఇది చాలా ప్రత్యేకత కలిగిన అంశం. వజీర్ కి చిత్ర కళ మీద, ఫోటోగ్రఫీ మీద కూడా మంచి ఆసక్తి ఉందని అతని గురించిన మాటల్లో మనకి తెలియవస్తుంది. ఒక రెండు కవితలు అతన్ని కదిలించిన పెయింటింగ్స్ నుంచి ప్రేరణ పొంది రాశానని కూడాచెప్తాడు. వాటిల్లో మాతృశోకం, ప్రేమాంజలి అన్న రెండు కవితలు ఆసక్తిగా అనిపిస్తాయి. ఒకటి కేతే కొల్లేవిట్స్ గీసిన “మదర్ అండ్చైల్డ్ ” ఆధారంగా రాస్తే మరొకటి గాగిన్ గీసిన “తహితాన్ ఉమెన్ విత్ మాంగో బ్లాసమ్స్” ఆధారం. ఆ బొమ్మల్లోని రస పోషణ వజీర్ కవిత్వంలో గాఢతని ఏమాత్రమూ తగ్గనివ్వకుండా మనల్ని ఆలోచింపజేస్తుంది. మాతృశోకంలో “ఆదిలోనే హఠాత్తుగా ఆగిందేవిటీ పాట ? ఎంజేసాడీ పాపడు ? నా వెచ్చని రొమ్ముల్ని చీకట్లో వెదికి ఏడ్చే ఈ చిన్ని నీడని విచ్చుకోక ముందే ఎందుకిలా కత్తిరించాడు ? ఎవరికీ శిక్ష ప్రభో, దేనికీ శిక్ష ? ” అంటాడు.
“ప్రేమాంజలి” అన్న కవితలో నా తనువంతా పాకి నిగూఢ ఆవేశాల్ని తాకి మర్మంగా మూల ఒదిగి నిద్రించే మోహ సర్పాలని కదిలించు ! సుఖ స్వప్నాలని రగిలించు ! చూడు నాలో నీకై వెలిసిన విరబూసిన నీడలు, నీ స్పర్శకై ఆశతో వేచి వొణుకుతో ! నీకై రేగిన, చెలరేగిన జాడలు, నీకు తోవ జేసి ఆర్ద్రమై ఆనంద నిరీక్షణలో ! ప్రియా, స్వీకరించు ఈ ప్రేమాంజలి. నీకై విచ్చుకున్న కలువ పూలు నా రొమ్ములు ” అంటాడు. ఇద్దరమ్మాయిలు చేతిలో మామిడి పూత పట్టుకుని వక్షంపై ఏ ఆచ్చాదనా లేకుండా ఉన్న పెయింటింగ్ చూస్తే మనకైతే ఇన్ని భావనలు కలగవేమో. అది కేవలం కవిగా వజీర్ అంతర్నేత్ర స్వైర విహారమే ననిపిస్తుంది నాకు. “శిక్ష” అనే కవితలో “నా శని వొదిలిందని ఆనందించే నువ్వు భయంతో హడలిపోయి వొణుకుతో పక్కనున్న ప్రియుడి కౌగిట్లో తలదాచుకోబోతే అలసి నీరసించిన అతను “మళ్లీనా” అని అసహ్యపడి నిద్ర నటించి నిన్ను దూరంగా తోసివేస్తాడు“. జాన్ డన్నే రాసిన ఈ కవిత చదివాక దీనికాధారమైన అసలు”Apparition” చదవాలనిపించి అది తిరగేశాను.
And thee, feign’d vestal, in worse arms shall see;
Then thy sick taper will begin to wink,
And he, whose thou art then, being tir’d before,
Will, if thou stir, or pinch to wake him, think
Thou call’st for more,
And in false sleep will from thee shrink; అని ఉంది.
అది అనువాదం కదా ? అనిపించింది. అంతలోనే నేటివైస్ కాబడిన ఒక కొత్త భావన మాత్రం దీన్ని అనువాదానికి పరిమితం చేయలేదనిపించింది. తెలుగులో చదివాక కూడా మళ్ళీ ఇంగ్లీషులోకి తీసుకెళ్లిన కవిత్వ శ్రద్ద, రూప చిత్రణలో సంక్లిష్ట మానసిక ప్రవర్తనని వ్యక్తపరచడంలో సారళ్యము హత్తుకుంటుంది. అందుకే ఈ కవిత్వం ఆనందంగా చదవాలనిపిస్తుంది.
“రా సాఖీ, పెదవులనందించు; మాయానంద మధువు నందించు, నీ మోహ దగ్ధ పెదవులనందించు” లాంటి ఉమర్ ఖయ్యాం కవితల్లో సూఫీ తాత్వికత, భగవంతుడి అచంచల కరుణా రసముంటుంది. “నేనే స్వర్గాన్ని, నేనే నరకాన్ని, సుఖాన్ని, దుక్ఖాన్ని, సర్వాన్ని నేనే, నానించే ఇవన్నీ ” అని ఒక జీవన ప్రతీక ద్రాక్ష రసాన్ని గొంతులోకి ఒంపుతాడు.
అలాగే “రత్నా వెళ్ళకు” అని ఒక పోయం ఉంటుంది. చలానికి ఎంతో ఆప్త మిత్రుడైన మొక్కపాటి రామ్మూర్తిగారు మరదలు రత్నమ్మను ఎంతగానో ప్రేమిస్తాడు. పొందాలనుకుంటాడు. ఆమె వేరొకర్ని పెళ్ళాడుతుంది. అతనితో వెళ్ళిపోతుంది. రామ్మూర్తిగారిలోకి దూరి వజీర్ ఈ కవితని అద్భుతంగా రాస్తాడు. “రత్నా వెళ్ళకు, వెళ్ళకతనితో నన్ను కాదని దూరమై నవ్వకలా గేలిచేసి నవ్వకతనితో కలసి, వెళ్ళకు వెళ్ళకు రత్నా వెళ్ళకు నా కౌగిలొదిలి, రత్నా నన్నిక వెత పెట్టక ఎప్పటి వలే వెన్నెట్లో నవ్వులతో, అల్లరితో, ప్రేమతో, చెలరేగి రావా నా చేతుల్లోకి; రత్నా దయచూపవా; నీకై దీనాతి హీనమై, కాలి బూడిదై కొలిచి ననన్నిట్లా నిర్దయగా నిర్లక్ష్యంతో విసర్జించి వెళ్ళక.తప్పదా, రత్నా; నీ కౌగిలి నియ్యకపో, ప్రేమని కరిణించకపో రత్నా, ధణ్యుణ్ణై మూల ఒదిగి ఉంటాను – క్షణిక తౄణీకార భాగ్యమైనా ప్రసాదించవా నాకు” అని గుండెల్ని పిండేస్తాడు. ఆనక రామ్మూర్తి గతిలేక ఆత్మహత్య చేసుకుంటాడు కూడా ! ఈ కవిత ద్వారా స్త్రీ ఆరాధనా, తోడు కోరుకోవడం, కలసి సమయాన్ని గడపాలనుకోవడంలాంటి వయుక్తిక సహేతుకత ఆకట్టుకుంటుంది. స్త్రీ శరీర భాగాల్ని విచ్చలవిడిగా ప్రస్తావించిన లక్షణం ఎక్కడా అగౌరవంగా తోచదు కానీ, వాటి అభికేంద్రక ఉపయోగంలో అతని హెచ్చరిల్లిన కాంక్షా పూరత్వం కాస్త ఇబ్బంది పెడ్తుంది. “మగువేగా మగవానికి మధురభావన” అన్నాడో సినీమా కవి. కనుక అక్కడితో ఆగిపోవటమే మేలు.
ఈ పోయెట్రీ మొత్తం చదివాక నాలోపల నిద్ర రాని రౌద్ర సముద్రం వెర్రెత్తి విలపించింది. విరహం అనిపించింది. గాల్లో చిక్కుకున్న పిచ్చిక మల్లే మనస్సు కొట్టుమిట్టాడింది. ఆయాసపడింది. ఆత్రుత పడింది. కుదురుగా నిలబడి, మళ్ళీ ఈ లోకంలోకొచ్చి నా పని నేను చేసుకోవడానికి, ఆఖరుకి కుండలోంచి మంచినీళ్లు ముంచుకుని గొంతులో పోసుకోవడాని క్కూడా బలం కూడదీసుకోవాల్సి వచ్చింది. ఆ భూతకాల వర్తమానాన్ని భరింపశక్యం కాలేదు నాకు. కాలమంతా ఉక్కిరి బిక్కిరి యైపోయింది. అయితే ఒక పరమార్ధం వెతికి, ఇది ఉంటేనే కవిత్వమనుకునే చదువరితనాన్ని ఈ పుస్తకం ఇబ్బంది పెడుతుంది. బహుశా అలా వెతకడం కూడా తప్పని తెలిసి వస్తుంది. “ఇజాలూ రాజకీయాలు వాదాలు హత్యలు యుద్ధాలు ఇంకా ఇటువంటి చెత్త చెదారం మనస్సులో పేరుకోక ముందు పండిన మొగలి పొత్తి వంటి పరిమళం గల ప్రారంభ యెవ్వనపు నిండైన ఆరోగ్యపు వాకిళ్ళ ముందు విరిసిన నందివర్ధనం పువ్వుల మధ్య నువ్వూ నేనూ కూర్చుని” అంటూ మా తిలకేయుడు ముంచెత్తిన మోహ పారవశ్య కోలాహల శబ్దం చెవుల్లో మార్మోగి పోయింది. ఈ పుస్తకంలోని కవిత్వం చదువుతుంటే ఇది భావవిప్లవమా ? రొమాంటిసిసమా? అనే రక రకాల సందేహాలొస్తాయి. నివృత్తి కావు. I feel therefore I am అని మాత్రం నిమ్మలపడలేకపోతాము. హే మృత్యో అన్న కవితలో “నీది సర్వాంతక శక్తివంతక ఘాతమా, వెర్రీ ! ఈ మైకం ఒక నిముషం. వేరెచటో మరు నిముషం — దూర సుదూర శుభ్ర ప్రభాతాన మెలకువ మళ్ళీ— లోకాన్ని ధిక్కరించి నడిచే వీరులకీ, సర్వాన్నీ పరిత్యజించిన సన్యాసులకీ నువ్వెంత హీనాతి హీనమో, ఎంతచులకనో !” అన్నపుడు నాకైతే “శిరస్సు తెగిన దీప స్తంభం లాగుంది మృత్యువు” అన్న అజంతా గుర్తొస్తాడు. ఇదంతామెటాఫిసికల్ (పారభౌతిక) పొయెట్రీనేనా ? ఇంకో సందేహం ? ఇలా ఈ కవిత్వమంతా నీలో అనేక విపరీత భావ సంచలనాలకు తెర తీస్తుంది.
“రా విరుచుకుపడు, చీకట్లో లేపు. రా, నన్ను ముంచెత్తు, నాలో మునిగిపో” (ముద్దు) లాంటివో, ” ప్రియా ఈ సంధ్య వెలుగులో ఒక సారి రావా ప్రేమాలింగనానికి — నువ్వు పర్వత రేఖవై, నేను పశ్చిమాకాశమై ” ( నువ్వూ నేనూ) అన్నా, “గగనాలు ఏలే కారుమేఘాల్ని ధిక్కరించి దిక్కులు వెదుకుతో వురుకులేసే ప్రేమోన్మత్త విద్యుల్లత మల్లే నన్నావహించు“(ఆవాహన) అన్నా —అన్నింటిలో ఒకటే పునరుక్తి. అతనొకపక్కా, సమాజమొకపక్కా అయిపోయిన సెపరేట్ ఐంద్రికత. పుస్తకం మూసేశాక భారంతో కళ్ళు మూసుకున్నాక, కృష్ణా జిల్లా గన్నవరంలో 1935, అక్టోబరు 11 న పుట్టిన ఈ మున్షీ (ముద్దు పేరు); ఉర్దూ, హిందీ, బెంగాలీ, తెలుగూ, ఇంగ్లీషు భాషల్లో ప్రవేశం పొంది, ఖర్మావసాన ఎన్నెన్ని లోకాల సంచార పరవశుడై, ఖిన్నుడై, ఏనాటి ప్రేయసివో, అప్సరసవో, మరి నా కల్పనవో — అంటూ తను కనులార చూశాడో లేదో అన్న సందేహంలో మనల్ని మాత్రం తన కవితాగ్నికెరచేసి– రాదని తెలిసీ ఆమె వెనుక “ప్రియా నువ్వెందుకిట్లా అకస్మాత్తుగా నా వెచ్చని బిగి కౌగిలొదిలి చీకట్లోకి యెగిరిపోతావు; ఎచటికి ప్రియా, ఎచటికి పోతావీ రాత్రి ?” అని పలవరిస్తూనే ఉన్నాడు.
అతను ఒంటరై దిక్కులేక ఏడుస్తున్నపుడు, ఆమె ఆ చేదు బ్రతుకు పెదవులు చీల్చి తనలోకి అతన్ని పీల్చి “ఏముందిరా సుఖం ప్రేమలో వొరేయ్ వజీర్రెహమాన్, దేనికిదంతా నువ్వు— ప్రేమలూ– కవిత్వాలు; వాళ్ళనేడ్పించడాలు!” అని ఒక నిరపాయకర జ్ఞాపకాల తీపి దగ్గర “ఇంతటితో ఆగుదాం, ఇంకేం వద్దు మనకి — ఈ జన్మకి” అనేస్తుంది.
నువ్వెళ్ళలేవూ, ఉండనూలేవు!
వజీర్ రెహ్మాన్ పై అద్భుతమైన వ్యాసం. దాచుకోదగ్గది.
ప్రస్తుత తెలుగు సాహిత్యానికి ఆల్టర్నేటివ్ నెరేటివ్స్ రావాల్సిన అవసరాన్ని గుర్తుచేసే వ్యాసం ఇది.
జీవితంలోని అన్ని పార్శ్వాలను పట్టించుకొన్నప్పుడు మాత్రమే ఇలాంటి కవత్వం వస్తుంది.
వజీర్ రెహ్మాన్ నిజంగానే సాహసి. ఏటికెదురీదిన సాహసి.
అతని రిలవెన్స్ ఈనాడు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది.
ఇది చదివాకా ఐ నీడ్ టు రివిసిట్ హిమ్. తాంక్యూ శ్రీరామ్ గారు
బాబా ఎప్పుడూ నన్ను ప్రోత్సహించేవాళ్లల్లో మొదటి వ్యక్తి.
థ్యాంక్యూ సార్
శ్రీ రామ్ పుప్పాల గారు
వజీర్ రెహమాన్ మీద వ్యాసం బావుంది .జీవితం లోని ఒక మోహ ,దుఃఖ పార్శ్వానికి ఎచటికి పొతావీ రాత్రి ఒక మచ్చు తునక . తనకేమి కావాలో తెలియని తనానికి , తన లోపల కుదురుకున్న అనేకాకనేక కాంప్లెక్స్‌ల దగ్ధ సౌందర్యానికి నడుమ నలిగిపోయిన ఒక అరాచక నిర్దయకి ఎచటికిపోతావీ రాత్రి ఒక ఉదాహరణం . మొహమూ మృత్యువూ రెండూ ఒకటే . మనిషిని నిలువనీయవు తమ లోలోపల కలిపివేసుకుంటాయి . ఆ గాఢ పరిష్వంగం లో నుండి వెలువడే ఒక బలహీనమైన కేక అది
వజీర్ గురించి రాయాలని అనిపించినపుడు తొలిసారి చదివింది మీ వ్యాఖ్యానమే సార్. అది కలిగించిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. ప్రేరణ అంటే ఇదే నెమో. థ్యాంక్యూ సార్. నా వచనంమీద నాకు నమ్మకం కలిగించారు.
వజీర్ రెహ్మాన్ ని నేను చదవలేదు.
శ్రీరామ్ గారు బాగా చదివించారు
మీరు పరకాయ చేసి రాసినట్టు ఉంది
ఈ వ్యాసాలు ఈ తరం కచ్చితంగా చదవాలి.
ప్రణయ కర్పూరపు గుబాళింపు తగిలింది.
ఈ రాత్రికి వజీర్ ను చదువుతాను
మరో 10,20 మందికి చదవమని చెబుతాను
శైలి బాగుంది.ప్రవాహ గుణం ఉంది.అభినందనలు
మిత్రమా
గోపాల్, థ్యాంక్యూ. ఇంతకన్నా ఎం చెప్పినా ఎక్కువైపోతోంది.
వజీర్ రెహ్మాన్ వాస్తవిక కోణంలోనే తన కవిత్వాన్ని పండించారు. ఇది అనుభూతి కవిత్వం. అందుకే మీరలా కదిలిపోయారు. అది చాలదా కవి తన అక్షరాలతో ఎంతలా మనల్ని స్పందించగలడో చెప్పడానికి.. ఒక్కొక్కరూ ఒక్కోలా ఒక్కో అంశాన్ని తీసుకుని కవిత్వం రాస్తారు.. అయితే వజీర్ జీ అచ్చం చలం లానే నిర్భయంగా నిస్సిగ్గుగా అనుభూతుల్ని రంగరించి ఈ కవిత్వం రాశారు. ఆస్వాదించే దానిబట్టీ కవిత్వం తూగుతుంది. మనలాంటి అనుభూతిని పొందే వారికి ఈ కవిత్వం బాగుంటుంది. కానీ కొందరికి ఇదో కవిత్వమా అనిపిస్తుంది… చలం గురించి ఇప్పటికీ ఇలా అనేవారు కోకొల్లలు.. ఆయన భావాల్ని ఆస్వాదించినవారు.. అనుభూతిని పొందినవారూ కోకొల్లలే.. అయితే ఆమె కోణంలో కవిత్వం రాసి ఉంటే మరింత పండేదనిపించింది… మీ సమీక్ష ఎప్పటిలానే బాగుంది.. మీరూ రసజ్జ్నతతోనూ అనుభూతితో.. అనురక్తితో అక్షరక్షరం ఆస్వాదించి మరీ రాశారు.. ఆ రసానుభూతినీ ఇందులో పంచారు.. అభినందనలు శ్రీరామ్ జీ..
శాంతి గారూ , యూ ఆర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్యూ
రసావేశం స్వైర విహారం చేసింది. తిలక్ ని ఉదహరించడం దగ్గర శాంతించింది. ఆసక్తిని కల్గించిన కవిత్వం. చదవాలి. అభినందనలు, ధన్యవాదాలు శ్రీరామ్.
థ్యాంక్యూ మేడం
ఓ విలక్షణత ఈ శీర్షికలో గమనిస్తే కనుమరుగు కాబడ్డ.. లేదా అలభ్యాలుగా ఉన్న వాటిని నేటి తరం సాహితీ ప్రియులకు పరిచయం చేయడం..ఇందులో శ్రీరాంగారు ఎన్నుకునే పుస్తకాల గురించి ఆసక్తిగా ఎదురుచూడడమే అవుతోంది..
. . ఈ పుస్తకం..ఇందులో వారు చర్చించిన అంశాలు చదివిన తర్వాత నే గమనించిన విషయం పంచుకోవాలనుకుంటున్నాను..సహజంగా సమీక్ష చేసేటప్పుడు రచయిత కోణంలో కవిని పరిచయం చేస్తారు..ప్రత్యేకంగా ఉన్న వాక్యాల్ని quote చేస్తారు కూడా..కానీ శ్రీరామ్ గారు కవితలో వాక్యాలు ప్రస్తావించిన తర్వాత..ఆ కవి మూడ్ ని ఆ వాక్యాలలో ఏవిధంగా అర్థం చేసుకోవాలో వివరిస్తారు…ఎంతో అధ్యయనం చేస్తే కానీ ఇది వీలుపడదని అర్థం అవుతోంది..
కవి మూడ్ ని పాఠకులకు అందివ్వడం అనే ప్రక్రియ మనకు ఆ పుస్తకాన్ని మరింత దగ్గర చేస్తుంది..అదే సమయంలో కంటెంట్ తో పాఠకుడు లీనమవుతాడు కూడా..
మునుపు రేవతీ దేవిగారి వ్యాసం లో కూడా ఇదే గమనించాను..వెంటనే చవివేట్టు చేసిన సమీక్ష అది.. పుస్తకం గురించేమీ మాట్లాడతాం…అదేంటో వ్యాసకర్త వివరించేశారు..అభినందనలు సర్..
ధన్యవాదాలు కూడా..అరుదైన పుస్తకాలు అందిస్తున్నారు..
ఇలా రహస్యాలు బయటపెడితే ఎలాగండీ ? చాలా లోతుగా చదివారు. ధన్యవాదములు. మీ విశ్లేషణ చూస్తుంటే మీరూ చెయ్ చేసుకోవచ్చ్చనిపిస్తోంది.
ట్రై వన్స్
ఒకో వాక్యం ఒక ప్రవాహపు ఒరవడై వినిపించింది.
చదివినట్టు లేదు.. విన్నట్టు గా ఉంది.
అంత చక్కగా ఉంది వ్యాసం.
ఇది చదివాక అనుభూతి చెందని మనసుండదేమో..!!
వజీర్ రెహమాన్ ద్రాక్ష రసం ఒంపలేదు.. మనసులకు తేనెలద్ది.. వాక్యాలన్నీ తేనె రంగరించి రాసి.. అచ్చు లోనికి తెచ్చి ఉంటారు.
చక్కని పుస్తకపరిచయం ఇది.
శ్రీరామ్ గారూ ఏది రాసినా ఆ ప్రవాహంలో మమ్మల్నీ ముంచేస్తారు.
ఎచటికి పోతావీరాత్రి అంటే మాత్రం ఒక్కటే చెప్పగలం..
రెహమాన్ కవితల్లో తిరగాడుతాం అంటూ చెప్తాం.
లేకుంటే ఉండనీదు..
వెళ్ళనీదు అన్నది మాత్రం నిజం.
వారు మా ఊరు (గన్నవరం) అని మీరు చెప్పేవరకూ తెలీదు..
నేను చదవాలి..
థ్యాంక్యూ అండీ.
అభినందనలు మీకు 💐 💐
థ్యాంక్యూ యామినీ గారు
మొహావేశాల,సర్పాలు బుసకొట్టి వెర్రెత్తించినా వజీర్ రెహ్మాన్ కవిత్వం.పాఠకునిలో వెర్రెత్తించే ఒక అనుభూతి లో ఆవిరిపట్టిస్తుంది.ఈ తరం కవులు వారిని తెలుసు కోవాలే తప్ప ,అనుసరించే ప్రయత్నం చేయకూడదు.వారి మీదఅప్పట్లో చలం ప్రభావమే పనిచేసిందనే చెప్పాలి.
.ఏది ఏమైనా ఒక అజ్ఞాత అనుభూతి,ప్రేమోన్మాది కవిత్వాన్ని పరిచయం చేసిన శ్రీరామ్ కు అభినందన.
ప్రతి వ్యాసం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు ధన్యవాదములు సార్
Amazing work!!
థాంక్స్ నరేన్
Superbbbb. భలే రాశారు. వంచిన తల ఎత్తకుండా చదివేలా వుంది.
థ్యాంక్యూ మేడం
శ్రీరామ్ నేను వజీర్ ను చదివాను. ఏమీ గుర్తు రావట్లేదు. ఇంతలా మర్చిపోయానా అనిపించింది ఈ విశ్లేషాత్మక పులకింతల గగుర్పాటు చదివి.
చాలా కష్టం ఇలా జాగ్రత్తగా మలుకుంటూ చెప్పడం. దేహభాషను మోహానురాగంతో కలిపి ఆయన ఎంత మత్తైన మెలకువ లోంచి చెప్పేరో మీరూ అలాగే రాయగలిగేరు
మళ్ళీ చదువుతాను వజీర్రెహమాన్ని
మీ వెన్ను తట్టు మరువలేను మేడం
మీరు ఎంపిక చేసుకునే పుస్తకాలు మామూలుగా లేవు. ఈ వ్యాసం మీ విశ్లేషణకు నిలువుటద్దం. లోతైన పరిశీలన, అంతకు మించిన జీవితావగాహన, అన్నింటికీ మించి కవిత్వం పట్ల పిచ్చి ప్రేమ- మీ వ్యాసాలలో కనిపించే మౌలిక లక్షణాలు. ఆరోజుల్లోనే అలా రాశాడంటే వజ్మీర్ ది సాధారణ గుండె కాదు. నిజం చెప్పాలంటే మీరు, వజ్మీర్ కలిసి ఈరోజు నన్ను మోహవిభ్రమలోతుల్లోకి ముంచేశారని చెప్పడానికి నాకేం భయం లేదు. ఆ పుస్తకం చదవాలని ఉంది.
సునీల్ ఆ గుండె ఎలాంటిదో ఊహకు సాధ్యం కావడం కష్టమైన పని. మీ స్కాలిస్టిక్ పరిశీలనకు థ్యాంక్యూ
పదకుసుమాలు చేబుని
సోయగాలు సొగసును వర్ణిస్తూ
తన కవితా హృదయంతో
అనంత కవి ప్రేమికులకు
మదురానుభూతిని మిగిల్చిన
ఈ కవి కోవిధుడు
ఆంద్రా బ్యాంకు వారి అంభుల పొదిలోని ఆయుధమని
కవి కళా హృదయుడు అని ఎందరికి తెలుసు ???
థ్యాంక్యూ సార్
రవి గాంచని చోటును కవి గాంచును..కవి గాంచిన భావాలను మది తెల్పును..అన్నట్టుగా ఉంది వజీర్ గారి కవిత్వం… ఇంత సున్నితమైన, సుతారమైన అంశాన్ని ఎంతో హుందాగా,ఉన్నంతగా మలిచి అందించిన తీరుకు శ్రీరాం గారికి ముందుగా అభినందనలు తెలుపవలసిందే…అభ్యుదయ ఆధునిక వచన కవిత్వపు తీవ్ర ప్రభావ గాలులు వీస్తున్న రోజులలో వజీర్ రెహమాన్ ఈ సంపుటి తీసుకురావడం ,అతనిలోని విపరీత విరహతాపం ఇక్కడ తట్టుకునుని నిలబడటం ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే..బహుశా సృష్టితత్వం ప్రేమే కావడం దీనికి ఒక కారణం కావచ్చు..ఏదిఏమైనా ఎచటికిపోతావీ రాత్రీ అంటూ చదువరులను కట్టిపడేసిన వజీర్ గారికి,ఇంత చక్కగా చిక్కని సమీక్షనందించిన శ్రీరాం గారికి మరోమారు అభినందనలు…
థ్యాంక్యూ లావణ్య గారూ.
ఒక కవితో్న్మత్త స్థితిలో ఊగిపోతూ మెలకువగా రాసిన వ్యాసమిది. ఆసాంతం కట్టి పడేసాలా వ్యాసాన్ని తీసుకెళ్ళిన శ్రీరామ్ గారూ, మీకు అభినందనలు
థ్యాంక్యూ సార్
వజీర్ డిఫరెంట్ పొయట్ ఆయన కవిత్వం గూడ సమాజానికి చాల డిఫరెంట్ గా వుంటుంది మీరు గూడ డిఫరెంటుగానే ప్రజంట్ జేసారు అభినందనలు ప్రింటు మిస్టెక్ అయి వుండ వచ్చు అది పిచ్చుక
థ్యాంక్యూ సార్
పద కుసుమాలు చేబూని
సోయగాల సొగసును వర్ణిస్తూ
తన కవితా హృదయంతో
అనంత కవి ప్రేమికులకు
మధురానుభూతిని మిగిల్చిన
ఈ తెనాలి కవి కోవిధుడు
ఆంధ్రాబ్యాంకు వారి అంభుల పొదిలోని ఆయుధమని
కవి కళా హృదయుడు అని ఎందరికి తెలుసు ???
ఆనంద్ థ్యాంక్యూ
శ్రీ పుప్పాల శ్రీరామ్ గారు మీ కవితలు అద్భుతం అపూర్వం మాటలలో చెప్పలేము. మీరు రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతమైన కవితలు రాసి మా లాంటి వారిని ఉర్రూతూగించ వలెను.
థ్యాంక్యూ సార్
పాత కాలపు రచనల్ని కొత్త తరానికి పరిచయం చేస్తున్నందుకు సంతోషం…తెలుగు కవిత కనుమరుగు ఐపోతున్న ఈ కాలంలో గతాన్ని నెమరువేసుకోవడం తప్ప పాఠకులకి వేరే దారి లేదు
థ్యాంక్యూ సార్
మోహం, ప్రేమ, రొమాన్స్….
ఈ భావాలను అన్నీ కలిపెయ్యాలో.. విడిగా ఉంచాలో ఏమీ అర్థం కానట్లు,
ఒక తీరని దాహం,
మరొక మోహం,
తీవ్ర భావోద్వేగాల మయం,
ప్రణయ కర్పూరపు గుబాళింపు,
ప్రేమోద్వేగపు నిస్సిగ్గు ఇవన్నీ కలిసిన ఒళ్ళు మరచినతనంలాంటి ఒక విశ్వ జనీనమైన ప్రేమ…ఎన్నున్నాయో!
‘ఎచటికిపోతావీ రాత్రి’ అంటూ ప్రశ్నించే ‘వజీర్ రహ్మాన్’ గురించి వివరిద్దామని శ్రీరాం గారు ఎలా ప్రయత్నించారో గానీ,
ఇది చదువుతుంటేనే నేను తప్పిపోయిన ఫీలింగ్… ఇక నిజంగా ‘వజీర్ రహ్మాన్’ ని చదివితే ఏమైపోతామో…
చాలా బాగా రాశారు శ్రీరాం గారూ…
అంతేసి తిట్లు తిట్టకండి గీతా గారు. మీ ప్రేమ కవితల కన్నా ఎక్కువ ఉద్వేగం పలికిందా వ్యాసం లో ? మీ స్వఛ్చమైన ప్రశంస కి ఫిదా ఇక్కడ !
శ్రీరామ్ గారూ… మళ్ళీ చదివాను ఇవాళ … అద్భుతమైన కవిత్వం .. నేను తిట్టటమా … మళ్ళీ మళ్ళీ తప్పిపోవచ్చు ఇది చదువుతూ …. ఉద్వేగం ఉద్వేగం .. అంతా ఉద్వేగమే …
శ్రీ రామ్ సార్….ముందుగా మీకు ధన్యవాదాలు…. మీ వ్యాసాలలో పరిచయమయ్యే కవిత్వం వర్థమాన కవులకు ఎంతో ఉపయోగపడుతుంది……
మొన్నొచ్చిన అర్జున్ రెడ్డి ….నిన్నొచ్చిన Rx 100 లాంటి సినిమాలను చూడడానికి కొంత భయంతో,ఇంకొంత ధైర్యాన్ని చేయాల్సిన పరిస్థితి… 1963 లోనే వజీర్ “ఎచటికి పోతావీరాత్రి” కవిత్వాన్ని తేవడం ఒక విధమైన తెగింపే ….అభ్యుదయ కవిత్వమే ఏలుతున్న ఆ సమయంలో ఇలాంటి పచ్చి మోహాత్మక కవిత్వాన్ని అందించి చలం అల్లుడుగా కాకుండా వారసుడనిపించుకున్నాడు…..చరిత్ర చూసినప్పుడు కూడా తెలుస్తుంది కొంతమంది రాజులు,చక్రవర్తులు కూడా ఇలా ఉన్నారని….కాలం ప్రవాహంలో ఆధునీకరణ జరుగుతుందే తప్ప వ్యక్తుల లోని ఫీల్ ఎప్పుడూ ఫీల్ గానే ఉంటుంది…….
ఇంత చక్కని వ్యాసాన్ని అందించడం కోసం మీరెంత శ్రమ పడుంటరో అర్థమవుతుంది సార్….
మరోసారి మీకు ధన్యవాదాలు…. అభినందనలు…
రాధికా, ధన్యవాదములు. మీలో సాహిత్యం పట్ల ఉన్న తహ తహ భలే ఉంటుంది. ఈ వ్యాసాలూ రాయడంలో అసలు ఘనత హెచ్చార్కె ది.
నామీద నాకే ఏమీ లేనప్పుడు, నన్ను రాయమని, రాయగలనని, రాసింది బాగుందనో, బాలేదనో ఎదో ఒకటి అని నన్ను ఇన్ని వాక్యాలు రాసేట్టు చేసాడు మిత్రుడు. ఆయన పుణ్యమంటే వ్యక్తిపూజ అంటాడు. కనుక ఇంత కన్నా ఎక్కువ చెప్పను. థ్యాంక్స్ హెచ్చ్చార్కె.
కవి నుంచి మరొక కవికి జరిగే అంతర్ముఖ ప్రయాణం చాలా గొప్పదే.. లోలోపట ఆత్మ విలోమ తత్వమ్ బయట పడుతుంది.మధనపడే మనసు కొసకి చూపు తగిలి.. బాధతో విలవిల్లాడి చేసే మౌన సంఘర్షణకి.. అడ్డు.. అదుపూ ఉండవు.. నిరంతరం ఊగిసలాటే.. అదే ఆసలైన కవిత్వ కొలమానం.. ఇలాంటి తపనలోంచి, తడుములాటలోంచి, తాపత్రయంలోంచి కొత్త ఊహకి చిగురు మొలకెత్తుతుంది.. నిజానికి అదే కవిత్వం… ఈ నెమరువేతలోంచే.. వజీర్ రెహమాన్ పుట్టాడు.తీవ్ర మానసిక వేదనతో కొట్టుమిట్టాడాడు.అలా మొదలైన ప్రయాణంలోంచే.. విమర్శకుడు పుప్పాల శ్రీరాం చిగురుతొడిగి మొలకెత్తాడు. పీల్చి పిప్పిచేసిన అరణ్యరోదనను పంటి బిగువున నొక్కిపెట్టి.. చివరికి పాఠకులకి ఎడతెగని ప్రశ్నార్థకమయ్యాడు.కాబట్టే కవిత్వ జోరు సున్నితమైన భావ సంఘర్షణతో మొదలై.. మౌన చలగాటంగా రూపుదిద్దుకుంది.ఈ చలిమంట ఇప్పట్లో చల్లారదు.చలం ఉద్రేకంలో తడిసి.. పెనుమంటగా రహస్య పోరాటం చేస్తుంది.. అప్పటిదాకా కవి నుంచి కవిని వేరుచెయ్యడం సాధ్యపడదు.. భావ తీవ్రతలో మునిగితేలి కడదాకా సంభాషణతో స్వేచ్ఛా పిపాసతో ఎగరనిద్దాం.. చిట్టచివరికి గమ్యస్థానం చేరుకుంటారో.. లేదో వేచి చూద్దాం!
రాజా, ఏమని చెప్పను నీ వ్యాఖ్యానం గురించి. గమ్య స్థానం వెతుకుతున్నాను. నేనూ వేచి చూస్తున్నా….
అద్భుతమైన వచనం. ఆయన కవిత్వానికెంత మోహపాశముందో నీ విశ్లేషణకూ అంతే వుంది. చలం లేకుండా వజీర్ రెహ్మాన్ కవిత్వానికి విశృంఖల స్వేచ్ఛావాంక్ష రాకపోయేదే. అయితే యిప్పుడు నీ పరిచయం ఆ కవికి న్యాయమైన ప్రాసంగికతను అందిస్తోంది.
నా వచనం మీద నమ్మకం కలిగిస్తున్న మిత్రుడివి. అన్నా థ్యాంక్యూ వెరీ మచ్
బావుంది
థ్యాంక్యూ
వజీర్ రెహమాన్ గారి వి చాలా తక్కువ చదివాను. మీ వ్యాసం చాలా వివరంగా ఉంది. అభినందనలు శ్రీరామ్ గారు
థ్యాంక్యూ సార్
ఇది ఏమి భాష సార్ ?