ఈ పెద్దాళ్ళున్నారే…
ఒక దెయ్యాలు…
-బమ్మిడి జగదీశ్వరరావు
మా మంచి నేస్తాలూ...
ఒకసారి ఏమయిందంటే-
ఒకసారేంటి, చాలా సార్లు అదే అయ్యింది. ఏమయిందా?
మా చిట్టి చెల్లి చిన్నది. పొన్నది. బంగారు కన్నది.
దానికి చీకంటంటే భయం… ఆమాటకొస్తే చీకటంటే మా నాయనమ్మకీ భయమే… ఆ… చీకట్లో దెయ్యాలు తిరుగుతాయని చీకటిని చూడకుండా మా చెల్లి కళ్ళు మూసుకుంటుందా?
కళ్ళు మూసుకుంటే కూడా చీకటే కదా?… అందుకే ‘అమ్మ బాబోయ్’ అని అరుస్తుంది.
కరెంటు పోతే కూడా ఏడుస్తుంది.
‘చెల్లీ చెల్లీ ఎందుకేడుస్తావ్?’ అని అడుగుతానా?
‘బూచీ చీచీ’ అంటుంది.
అసలు చెల్లికి నిన్న మొన్నటి వరకూ భయం లేదు. ‘ఇదే ఒక దెయ్యం.. చిన్న రాక్షసి.. పిల్ల రాకాసి’ అని నాయనమ్మ ముద్దుగా ముచ్చటగా తిట్టేది కూడా.
అయితే-
అమ్మ చెల్లికి తినిపిస్తుందా? తొందరగా గటగటా ముద్దలు మింగెయ్యాలంటుంది. తన నెత్తిన లక్ష పనులు ఉన్నాయని అరుస్తుంది. అర్థం చేసుకోని చెల్లి అటూ ఇటూ పరుగులు తీస్తుంది. అందుకోబోయిన అమ్మకి ఆయాసం వస్తుంది. ఆ తర్వాత ఆవేశం వస్తుంది. ఆ తర్వాత చెల్లికి ఒక్కటి వేస్తుంది. చెల్లి ఖాతరు చెయ్యదు. దులిపేసుకు పారిపోతుంది. దెబ్బకు జడవని పిల్లలు దెయ్యానికి జడుస్తారన్న సామెత అమ్మకు తెలుసు. అదిగో బూచాడు.. ఇదిగో బూచాడు.. అంటుంది. అన్నం తినకపోతే ఎత్తుకుపోతాడు అంటుంది.
‘ఎక్కలికి? ఆకాశమ్మీలికా?’ అంటుంది బోసిపల్లు ఇవతల పెట్టి చెల్లి.
అప్పుడు అమ్మ దెయ్యాలంటుంది. చీకటి గదిలో పెడతానంటుంది. అవసరానికి నీడను చూపించి కూడా భయపెడుతుంది. అదిగదిగో అంటుంది. ఇదిగిదిగో అంటుంది. దెయ్యాలు చేసే పనులు చెప్తుంది.
చెల్లి భయపడి నోరు ‘ఆ..’ అని తెరుస్తుంది. ఒక పనై పోయిందన్నట్టు చెల్లి నోట్లో అమ్మ పేద్ద అన్నం ముద్ద కుక్కుతుంది. వాంతి చేసుకున్నా వదలదు. పైగా కావాలని వేస్తున్న వేషాలంటుంది. ‘మీ నాన్నలాంటి వేషాలే అన్నీ..’ అని అంటుంది. ‘వదిలెయ్యవే ఆకలేస్తే అదే తింటుంది’ అని నాన్నమ్మ అన్నా వదలదు. ‘పిడికెడు మెతుకులు తినకపోతే ఎలా బతుకుతుంది?’ అని కంచం నిండా అన్నం తినిపిస్తుంది.
మామూలప్పుడు ‘దెయ్యాల్లేవ్.. గియ్యాల్లేవ్’ అని నాన్న అంటారు. అన్నం తినకపోయినా చెప్పినమాట వినకపోయినా అదిగో దెయ్యమంటారు. ఇదిగో బూచంటారు. బూచికిచ్చేస్తామంటారు.
చెల్లి చాలా చిన్నది కదా?, భయపడింది. జ్వరం కూడా పెట్టుకుంది. దెయ్యాలు లేవని భయపడొద్దని చెప్పాను. వింటుంది. కానీ మళ్ళీ భయపడుతుంది. జ్వరం తగ్గితే చెల్లి నన్నే భయపెడుతుంది. నాకు తెలుసు.
చెప్పాను కదా.. చెల్లి చిన్నది. ఇవన్నీ మీకు చెప్పలేదు కదా.. అందుకే నేను చెప్పానన్నమాట!
-చిలీచ (చెల్లి తన పేరు ఇలాగే పలుకుతుంది)
నర్సరీ (వచ్చే సంవత్సరం),
సెక్షన్ –ఎ (ఏక్లాసు గదా మా చెల్లి)
రోల్ నెం. 1 (ఎందులోనయినా నెంబరు వన్నే)
భిగ్ స్కూల్ (?)

Add comment