కన్నీటి ముత్యాలు కష్టాల రత్నాలు: రాసీమ!

కర్నూలు, కడప,చిత్తూరు, అనంతపురం అనే నాలుగు జిల్లాల సమూహం రాయలసీమ. 1800 సంవత్సరంలో బళ్లారితో కలిపి ఐదు జిల్లాలను నిజాం నవాబు బ్రిటిష్ వారికి దత్తత ఇవ్వడంతో దత్త మండలాలుగా పేరొందింది.1928 లో కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావుచే రాయలసీమ అనే పేరు ప్రతిపాదించబడి ఆమోదం పొంది నాటి నుండి రాయలసీమగా పిలవబడుతోంది. వైభవోపేతమైన విజయనగర సామ్రాజ్య రాజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో ఉన్న ప్రాంతం కనుక రాయలసీమ అనే పేరును సంతరించుకుంది. విజయనగర సామ్రాజ్యంలో పురవీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మేవారని పుస్తకాల్లో చదువుకుంటా. అది నిజమో కాదో గాని ఇప్పుడు మాత్రం రాయలసీమ వీధుల్లో కన్నీటి ముత్యాలు, కష్టాల రత్నాలు కుప్పలు కుప్పలుగా దొరకడం ఖాయం.

స్వాతంత్రం తర్వాత 1953 లో మద్రాసు నుండి ఆంధ్ర ప్రాంతాన్ని విడదీసి బళ్లారి జిల్లాను రాయలసీమ నుండి వేరు చేసి కర్ణాటక రాష్ట్రంలో కలిపేయడంతో నాల్గు జిల్లాల సీమగా మిగిలింది.18,19 వ శతాబ్దాలలో వచ్చిన వరస కరువుల వలన సీమ పరిస్థితి దిగజారిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన భూగర్భ జలాలు, నీటి ప్రాజెక్టులలో అలసత్వం, పాలక వర్గాల చిన్న చూపు ఇవన్నీ సీమ ఆర్థిక దుస్థితికి , వెనుకబాటుతనానికి కారణాలయ్యాయి.

ఈ సంఘటనల పర్యవసానంగా ఏర్పడ్డ తీవ్ర కరువు కాటకాల వల్ల సీమ ఆర్థిక పరిస్థితులు తొందరగా దిగజారాయి. ప్రాజెక్టుల పుణ్యమాని కొన్ని ప్రాంతాలు ఆయకట్టుగా మారినా చాలా ప్రాంతాల్లో కేవలం వర్షంపై మాత్రమే ఆధారపడాలి. 1970-80 ప్రాంతాల్లో 100-120 అడుగుల లోతుల్లో ఉన్న భూగర్భ జలాలు 2018 నాటికి 300 అడుగులకు పైగా లోతుకు వెళ్లిపోయాయి. దీనికి కారణం తీవ్ర వర్షాభావం మాత్రమే కాదు అతిగా బోర్లు, బావుల నుండి నీరు తోడటం కూడా అని నిపుణులు చెబుతున్నారు.

రాయలసీమలో వర్షాలు ఎలా వున్నాయి, నదీ జలాలు ఏ మేరకు లభ్యమవుతున్నాయి, కరువు తీవ్రత ఎలా ఉంది అని చర్చించుకోవడం అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015, 16, 18 సంవత్సరాలలో ప్రకటించిన కరువు మండలాల సంఖ్య చూస్తే పరిస్టితి అర్థం అవుతుంది. ప్రధానంగా కృష్ణా, తుంగభద్ర ,పెన్నా నదీ జలాలు అందుబాటులో ఉన్నా; ఇక్కడ ఒక పంటకు కూడా నీటి కటకటే. నివారణ చర్యల్లో భాగమైన మౌలిక వసతుల సదుపాయం, సమగ్ర నీటి నిర్వహణకు చర్యలు, పారిశ్రామిక పురోగతి వంటి వాటి ఊసే వుండదు.

ప్రకాశం జిల్లా మినహా కోస్తా ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 70 శాతం  పొలాల్లో ఇరు పంటలు సాగు అవుతుండగా అదే రాయలసీమలో 15.6 శాతం సాగు భూమిలో మాత్రమే ఇరుపంటలు సాగవుతున్నాయి.అసలు ఇరిగేషన్ వ్యవస్థ ఉన్న భూమిలో కూడా కోస్తా ప్రాంతం 94 శాతం అయితే సీమలో 28.4 % మాత్రమే. ఇక్కడ కరువు విలయతాండవం చేయడానికి ప్రధాన కారణం నీటి వనరుల అలసత్వం. రాయలసీమ వాళ్లు తమ వాట నీళ్ళు వాడుకుని, ఎక్కువ అడగడం లేదు. ఇక్కడ అసలు న్యాయమైన డిమాండ్లకే గతిలేదు. కరువు ప్రాంతమైన రాయలసీమలో నాలుగు జిల్లాలకు కలిపి ఒక్క ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉండడం ఒక మంచి ఉదాహరణ.

వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా గల సీమలో  76 లక్షల ఎకరాల భూమికి గాను 18 లక్షల ఎకరాల భూమికి మాత్రమే కాల్వలు రిజర్వాయర్ల ద్వారా సాగునీరు అందుతోంది. అదే కోస్తా జిల్లాల్లో ఒక కోటి ఆరు లక్షల ఎకరాల భూమికి గాను 72 లక్షల ఎకరాల భూమికి సాగునీటి సదుపాయం ఉంది.

ఆఖరుకు యీ కరువు సమస్యను, సీమ కన్నీటి గాధను కూడా ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థల నుండి, ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు దులుపుకోవడానికి మాత్రమే వాడుకొంటుంన్నాయి. కరువు పేరుతో కేంద్రం నుంచి నిధులు అడుక్కోవడం తెలుసు కానీ నివారణ, సహాయక చర్యలు తీసుకోవాలనుకోరు. కరువు సమస్యకు పరిష్కారం గురించి ఆలోచించాలన్న స్పృహ ఉండదు. స్వాతంత్రానంతరం కాలం నుంచి కూడా ఏ పాలక పక్షమైనా కూడా కరువు మండలాల ప్రకటన, కరువు సాయం పేరిట కాసిన్ని నిధులు మంజూరు ఇలాంటి తాత్కాలిక ఉపశమనాలే గాని సమస్యకు శాశ్వత పరిష్కారం వెదికే దిశగా ఆచరణ కాదు ఆలోచన కూడా లేదు.

ప్రజలు, అదీ ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైన ప్రజలే కరువు బారిన ఎందుకు పడుతున్నారు, ఆ ప్రాంతంలో ఉన్న నీటి వనరులు, వర్షాభావ పరిస్థితులు ఏంటని ఆలోచించరు. ఉన్న నీటి వనరులు కూడా న్యాయబద్ధంగా కేటాయించడం లేదు. ఇందుకు రాజకీయ కారణాలు వుండిండొచ్చు. 52 శాసనసభ సీట్లున్న ప్రాంతంపై దృష్టి పెడితే ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ సీట్ల ప్రాంతం అయిన కోస్తాలో వ్యతిరేకత ఎదురవుతుంది అన్న భయం కావచ్చు.

ఇరిగేషన్ విషయంలో రాయలసీమ కంటే కోస్తా జిల్లాల్లో మెజారిటీ ప్రాంతం అభివృద్ధి చెందింది. కాబట్టే రాయలసీమ ప్రజలు కొత్త రాష్ట్ర అభివృద్ధిలో తమకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా ఇప్పటికే ఏడారిలా మారింది. రాబోయే రోజుల్లో సీమ ప్రజలు వర్షాల గురించి ఒకనాటి పరిస్థితులు తలుచుకుంటూ కథలుగా చెప్పుకునే రోజులు రాబోతున్నాయి.

ఇంత జరుగుతున్నా పాలకులకు ఏమి పట్టదు. వారికి ఏడవడానికి ఇంతకన్నా మంచి కారణం దొరకదనేమో కాబోలు.ఎలక్షన్లలో జనాలకు హామిలివ్వడానికి, మాటలతో మాయపుచ్చి ఓట్లెయించుకోవడానికి ఇంతకన్నా గొప్ప అవకాశం దొరకదు అనుకుంటున్నారు. యీ ప్రాంతం నుండి ఐదు మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా, చేస్తూనే వున్నా ఒరిగిందేమిటి? రాజకీయ నాయకులకు, భూస్వాములకు, వారి అనుయాయులకు లెక్కకు లేనన్ని బోర్లు ,బావులు తవ్వుకోవడానికి, ప్రభుత్వ సబ్సిడీలు పొందడానికి వాళ్ళ రాజకీయాలు ఎలాగూ అండగా వుంటాయి. నష్టపోయేది పేద రైతు కుటుంబాలే.

నూతనంగా నిర్మిస్తున్న రాజధానికి, దాని వల్ల ప్రాంతానికి జరిగే అభివృద్ధికి ప్రతిగా సీమకేం చేస్తారని అడిగే పరిస్థితి కూడా లేదు. బహుశ యీ నీటి కష్టాలు, కరువు సమస్యల ముందు ఇతరత్రా డిమాండ్లు కనిపించకపోవచ్చు. కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ,తెలుగు గంగ వంటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న పొలాలను చూసి రాయలసీమ అన్ని జిల్లాల్లో  ఇదే పరిస్థితి వుందనుకోడం మరో భ్రమ. ఉన్న యీ ప్రాజెక్టులకు కూడా నీరు కచ్చితంగా అందుతుంది అనే ఆశ ఏమి ఉండదు. ఎగువ రాష్ట్రాల్లో వచ్చే వరద నీరే గతి. వాటికీ దిన దినగండం నూరేళ్ళ ఆయుష్షే . జీవో నెం-69 దీనికి ఉదాహరణ. ప్రభుత్వాల మాటలు నీటిపై రాతలుగానే మిగిలిపోతున్నాయి కానీ ఆచరణ రూపం దాల్చడం లేదు.

కరువు తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో బతకలేక పూట గడవడానికి పిల్లల్ని, వృద్ధుల్ని సొంతూర్లలోనే వదిలేసి బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలకు వలసపోతున్నారు. అనంతపురం జిల్లాలో యీ వలసలు మరీ ఎక్కువ. ఒకప్పుడు గ్రామాల్లో ఎంతో హుందాగా బతికిన చిన్న రైతు కుటుంబాలు ఛిద్రమౌతున్నాయి. సీమలోకెల్లా అధిక కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో… నాటిన ఆరు లక్షల ఎకరాల వేరుశనగ పంట మొత్తం నష్టమే అని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

రెయిన్ గన్ల ద్వారా ఎక్కడో ఓ చోట కాసిన్ని నీళ్లు చల్లి ఫోటోలకు ఫోజులిచ్చి కరువు ప్రాంత పంటల్ని మొత్తం కాపాడానని ముఖ్యమంత్రి చెప్పుకోవడం హాస్యాస్పదం. ప్రభుత్వాధికారులు ప్రకటించిన మెట్ట ప్రాంతాల గణాంకాలు పరిశీలిస్తే యీ ప్రభుత్వ పాలనలో డొల్లతనం అర్థమవుతుంది. సీమలో కరువును రూపుమాపేందుకు రెయిన్ గన్లు, కరువు బడ్జెట్లు ఏవి పనికిరావు. ప్రభుత్వమే ప్రకటించిన కరువు మండలాలను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. 2014,15,16,18 సంవత్సరాలకు ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలు వరుసగా 238,359,301,296. వీటిలో రాయలసీమ లోని మండలాలే అధికం. సీమ జిల్లాల్లోని కరువు మండలాలు వరుసగా 196,314,298,196. తరతరాలుగా వెంటాడుతున్న కరువు సమస్యకు సమగ్ర నీటి పథకం రూపొందించడమే శాశ్వత పరిష్కారం.

ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం రాయలసీమ రైతాంగం నీటి ఉద్యమాలకు సంసిద్ధమౌతుంటే వాటికి స్పందించాల్సింది పోయి సీమ హక్కుల గురించి మాట్లాడేవారు వేర్పాటువాదులు అన్న నయవంచక ప్రకటనను ముందుకు తీసుకువస్తుంది. మా బాధ ఇది, యీ విషయంలో మాకు అన్యాయం జరుగుతోంది, మాక్కావాల్సింది ఇదీ అని అడుగుతున్న ప్రజల వాదనైనా వినకుండా ప్రాంతీయవాదం రెచ్చగొడుతున్నారనడం అమానుషం. అసలు యీ రకమయిన చిన్న చూపు వల్ల కదా తెలంగాణలో ప్రాంతీయవాదం బలపడింది. ప్రాంతీయవాదాలను రాజకీయ పార్టీలు నెత్తికి ఎత్తుకున్నాయంటే వారి రాజకీయ అవసరాలు, పదవీ కాంక్ష కారణాలు అనుకోవచ్చు. అంతేగానీ నిత్యజీవితంలో కేవలం వ్యవసాయం, కూలీ వంటి వాటిపై ఆధారపడి జీవించే సాధారణ జనాలు వేర్పాటువాదానికి మద్దతిస్తారు, వాటి కోసం రోడ్లెక్కుతారనుకోవడం అబద్ధం. అసలు ప్రాంతీయ వివక్ష చూపి ప్రజలకు ఆ భావన కల్పించేది దగాకోరు ప్రభుత్వాలే. రైతులు , రైతు సంఘాలు, సాగునీటి సాధన సంఘాలు ఉమ్మడిగా పోరాడుతున్నపుడు రాజకీయ నాయకులు మద్దతు ఇవ్వడం సహజమే. అందువల్ల ఆ పోరాటాలకు రాజకీయ రంగు పులమడం ఏ మాత్రం కరెక్టు కాదు. ఐనా ప్రస్తుత ప్రభుత్వానికి అలాగే కనపడడం రాయలసీమ ప్రజల దురదృష్టం. కేంద్రం నిధులివ్వడం లేదు అని కుంటిసాకులు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు సాధించడానికి మీరు చేస్తున్న కృషి ఏంటని ఎదురు నిలదీయాలి. అసలు సీమ సమస్యలను కేంద్రం ముందుంచి ఇక్కడి పరిస్థితులను వివరించి నివారణ చర్యలకు సాయం అడిగాలను టీడీపీ ప్రభుత్వానికి లేదు. రాష్ట్ర సమస్యలను అందులోనూ రాయలసీమ ప్రాంత కరువు, ఇతర సమస్యల గురించి ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయరు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ర్రాష్ట ప్రయోజనాలను (వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలను) తాకట్టు పెడుతున్నారు.

అంతిమంగా ఏ రాజకీయ పార్టీనైనా రాయలసీమ ప్రజలు అడగాల్సింది తాత్కాలిక హామీలు కాదు. ఎన్నికల వాగ్దానాలు వాగ్దానాలుగా మిగిలిపోకుండా రాయలసీమ కరువును సమూలంగా రూపుమాపేందుకు మీ కార్యాచరణ ఏమిటని నిలదీయాలి. రాజకీయ పార్టీలు ప్రకటించే కరువు సాయం, కరువు నిధులు వంటి వాటికి ఆశపడడం ఆత్మవంచన. 2019 ఎలక్షన్లు సమీపిస్తున్న తరుణంలో కరువు ప్యాకేజీ వంటి మాంసపు ముక్కలకు ఎగబాకకుండా సిద్దేశ్వరం అలుగు సాధన, జీవో నెం 69 రద్దు వంటి పరిష్కారాల వైపు అడుగేయాలి.                      

నిజానికి రాసీమ అభువృద్ధి కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. అభివృద్ధిలో ప్రాంతీయ సమతూకం పాటించడం కోసం ఈ మత్రిత్వ శాఖ పని చేయాలి.

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.