క్రూరమైన పట్టనితనమంటే ఏమిటి?

జి.రఘురాం, విజయవాడ
ప్రశ్న 1: మార్క్సిజం గురించి నాకు నిజంగా తెలియదు. ఏమీ చదవలేదు. కానీ, సమాజంలో, పేదా – ధనికా తేడాలు వుండడం చూస్తున్నాను. వాటికి, కారణాలు వున్నాయి అని విన్నాను. మనుషుల జీవితాలు సమానం అయ్యే మార్పు నిజంగా సాధ్యం అంటారా? తేలిగ్గా అర్ధమయ్యే పుస్తకం ఏదైనా చెపుతారా?
జవాబు: ఆ సిద్ధాంతం ఏమిటో చదివితే తప్ప, మీ సందేహాలు తీరవు. ”పిల్లల కోసం ఆర్ధిక శాస్త్రం” చదవండి. దాని తర్వాత ‘కాపిటల్‌ పరిచయం’ చదవండి! ఇంకా స్పష్టత రాకపోతే, ఒరిజినల్‌ ‘కాపిటల్‌’కి తెలుగు అనువాదం చదవండి. అప్పుడు చెప్పండి మీ సందేహాలు.
ప్రశ్న 2: మార్క్సిజం ద్వారా సమానత్వ సంబంధాలు ఏర్పడతాయని మీరు నిజంగా నమ్ముతున్నారా?
జవాబు: నేనే కాదు; ఆ సిద్ధాంతం ఏమిటో చదివి తెలుసుకుంటే, మీరు కూడా పూర్తిగా అంగీకరిస్తారు.
పి.అరుణ, తెనాలి
ప్రశ్న 3: రష్యా చైనాల్లో, వెనకటి రకపు సమాజాలే వున్నాయంటారు. ఇలా ఎందుకు జరిగిందంటారు?
జవాబు: మొదట ‘మార్క్సిజం’ తెలిసి, తర్వాత ఆ దేశాల్లో పోరాటాలు ఎలా జరిగాయో తెలిస్తే, అక్కడేమైనా పొరపాట్లు జరిగాయేమో అనే సందేహాలు వస్తాయి. పొరపాట్లు కాకపోతే, పాత సమాజాలే ఎందుకు వుండిపోతాయి? ఆ పొరపాట్లు లేకుండా మనం చేసుకోలేమా – అని ఆలోచించాలి.
మల్లికార్జున్‌, మహబూబ్‌నగర్‌
ప్రశ్న 4: ఎంగెల్సు కొటేషన్‌ చదివాను. ఒక చోట, ”కౄరమైన పట్టని తనం” అని వున్నది. ఈ ‘పట్టని తనం’ ఎవరిదంటారు?
జవాబు: మనందరిదీ! సమాజంలో వున్న వాళ్ళందరిదీ! సమాజంలో మానవ సంబంధాలు అంటే, మన మధ్య శ్రమ సంబంధాలు ఎలా వున్నాయో తెలుసుకోకపోతే, కొందరు బిచ్చగాళ్ళుగా ఎందుకు బ్రతుకుతున్నారో తెలుసుకోకపోతే, అది ‘పట్టని తనమే’ కదా? పైగా, కౄరమైన పట్టని తనం! దాన్ని పట్టించుకుంటే, దాన్ని మార్చలేమా? ఎంగెల్సు, తన 24వ ఏట, రాసిన ”ఇంగ్లండులో కార్మికుల స్తితిగతులు” అనే పుస్తకంలో ఆ మాట అంటాడు.
ఆంజనేయులు, హైదరాబాద్‌
ప్రశ్న 5: మార్క్సు, ”ఫాల్టీ సోషల్‌ రెలేషన్స్‌” అన్నాడని చదివాను. అది వివరంగా తెలియదు.
జవాబు: వివరంగా తెలియాలంటే, ‘కాపిటల్‌’ పుస్తకం చదువుకోవాలి. ‘ఫాల్టీ’ అంటే, ‘తప్పుడు.’ అలా వున్నవి సామాజిక సంబంధాలు. ఒక మనిషి, తన శ్రమే గాక, ఇతరుల శ్రమని లాగి బ్రతుకుతున్నాడంటే, అది తప్పుడు సంబంధం అవదూ? వడ్డీలే తమ ఆదాయంగా బ్రతికే వాళ్ళూ, లాభాలే తమ ఆదాయంగా బ్రతికేవాళ్ళూ, ఇలా ఒక వర్గం అంతా వుంది కదా? పురుషుల మధ్య, ఎక్కువ తక్కువలు! స్త్రీల మధ్య ఎక్కువ తక్కువలు. స్త్రీ పురుషుల మధ్య ఎక్కువ తక్కువలు! ఇవన్నీ తప్పుడు సంబంధాలే కదా? అయితే, ‘సైనికుల’ శ్రమ గురించి ప్రస్తావిస్తూ, తప్పుడు సంబంధాల వల్లనే వాళ్ళ అవసరం వుంది అని ”అదనపు విలువ సిద్ధాంతాలు” అనే పుస్తకంలో అంటాడు, మార్క్సు.
షరీఫ్‌, తాడేపల్లిగూడెం
ప్రశ్న 6: మాది ఒక చిన్న షాపు. చెప్పులూ, సంచుల వంటివి బాగు చేసే షాపు. ఎప్పుడన్నా చిన్న పండగ లాంటిది వచ్చిందంటే, చందాల కోసం, రౌడీలు వచ్చి పడతారు. ఎలా ఇవ్వగలం? ఇవ్వకుండా వదిలించుకోలేము. తమాషా వినండి, ఆ రౌడీలు, పోలీసులకు చందాలు ఇవ్వవలిసిందే. మా లాంటి వాళ్ళం పోలీసులకు చెప్పుకున్నా ప్రయోజనం వుండదు. ‘వాళ్ళతో పెట్టుకోకండి; ఐదో, పదో ఇచ్చి పడెయ్యండి’ అంటారు పోలీసులు! రౌడీల గుంపు ఒక్కళ్ళే కాదు; నాలుగైదు రకాల వాళ్ళు వస్తారు. సంవత్సరంలో నాలుగైదు సార్లు! దేవుడికి చెప్పుకోకుండా ఏం చెయ్యాలో చెప్పండి మీరు! ఆ బాధ మీకు నిజంగా తెలుస్తుందా?
జవాబు: అయ్యో, ఎందుకు తెలీదు? మీరు చెప్పనివి కూడా తెలుస్తాయి. గుండెలు ఆగిపోతున్నట్టుగా వుంది. అవును, దేవుడు తప్ప ఇంకో దారి కనపడదు. అయితే, దేవుడు ఏదన్నా రక్షణ మార్గం చూపిస్తున్నాడా? అది అంతా భ్రమ! మీ షాపుల వాళ్ళందరూ ఒక సంఘం పెట్టుకోలేరా? ప్రభుత్వానికి చెప్పినా వినదు గానీ, చెప్పక తప్పదు. మీ సమస్యలన్నీ కనీసం మారు పేర్లతో పత్రికలకు రాయండి! మీ సమస్యల్ని సానుభూతితో అర్ధం చేసుకునే కమ్యూనిస్టు పార్టీ లేదా? ఆ కార్యకర్తలు మీకు దన్నుగా వుండగలరు. అలా ప్రయత్నించండి!
ఎ.సత్తిబాబు, కాకినాడ
ప్రశ్న 7: మా వ్యాపారం, పళ్ళూ, కూరగాయలు అమ్మే దుకాణం. అమ్మకాలే అక్కర లేకుండా ఇటువంటి వాటిని, అవి తయారవగానే జనం వాడుకోవచ్చని మా స్నేహితుడు ఒకాయన చెపుతూ వుంటాడు. ఈ ఉత్తరం కూడా అతను చెప్పి రాయించిందే. ఆ మాట నిజమే అని కొన్ని సార్లు అనిపిస్తుంది. పళ్ళు పండిపోతూ వుంటాయి. అమ్మకాలు జరగవు. చౌకగా అయినా అవగొట్టేయ్యాలని చూస్తాం. పక్క పక్కనే వేరే షాపులు వుంటాయి. పండిపోయిన పళ్ళు అందరికీ మిగిలిపోతాయి. మర్నాటికి అమ్మకాలు లేకపోతే కుళ్ళిపోతాయి కూడా. అసలు, అంత మగ్గిపోయిన వాటిని కొనడానికి సందేహిస్తారు. చౌకగా పడేస్తాం. అసలు, అమ్మకాల గొడవ లేకపోతే అనిపిస్తుంది, నిజంగానే. సరైన సమయాల్లో అన్నిటినీ వాడుకోవచ్చు. కుళ్ళిపోయే ప్రమాదాలే వుండవు. మరి, డబ్బుతో కొని తెచ్చిన వాటిని అమ్మకాలు లేకుండా ఎలా ఇవ్వగలం? విషయాలు అర్ధం కావడం లేదు!
జవాబు: అమ్మకాలు లేవంటే, కొనడాలూ వుండవని కదా? దీని కోసం కొంత చదవాలండీ. ప్రతీ విషయాన్నీ సహజంగానూ చూడవచ్చు; అసహజంగానూ చూడవచ్చు. ‘ఉపయోగపు విలువ’ దృష్టీ, మారకం విలువ’ దృష్టీ – అని 2 రకాలు వున్నాయి. వాటి కోసం ‘కాపిటల్‌’ చదవాలి మరి!

రంగనాయకమ్మ

1 comment

  • ప్రశ్న 6: మాది ఒక చిన్న షాపు. చెప్పులూ, సంచుల వంటివి బాగు చేసే షాపు. ఎప్పుడన్నా చిన్న పండగ లాంటిది వచ్చిందంటే, చందాల కోసం, రౌడీలు వచ్చి పడతారు. ఎలా ఇవ్వగలం? ఇవ్వకుండా వదిలించుకోలేము. తమాషా వినండి, ఆ రౌడీలు, పోలీసులకు చందాలు ఇవ్వవలిసిందే. మా లాంటి వాళ్ళం పోలీసులకు చెప్పుకున్నా ప్రయోజనం వుండదు. ‘వాళ్ళతో పెట్టుకోకండి; ఐదో, పదో ఇచ్చి పడెయ్యండి’ అంటారు పోలీసులు! రౌడీల గుంపు ఒక్కళ్ళే కాదు; నాలుగైదు రకాల వాళ్ళు వస్తారు. సంవత్సరంలో నాలుగైదు సార్లు! దేవుడికి చెప్పుకోకుండా ఏం చెయ్యాలో చెప్పండి మీరు! ఆ బాధ మీకు నిజంగా తెలుస్తుందా?
    జవాబు: అయ్యో, ఎందుకు తెలీదు? మీరు చెప్పనివి కూడా తెలుస్తాయి. గుండెలు ఆగిపోతున్నట్టుగా వుంది. అవును, దేవుడు తప్ప ఇంకో దారి కనపడదు. అయితే, దేవుడు ఏదన్నా రక్షణ మార్గం చూపిస్తున్నాడా? అది అంతా భ్రమ! మీ షాపుల వాళ్ళందరూ ఒక సంఘం పెట్టుకోలేరా? ప్రభుత్వానికి చెప్పినా వినదు గానీ, చెప్పక తప్పదు. మీ సమస్యలన్నీ కనీసం మారు పేర్లతో పత్రికలకు రాయండి! మీ సమస్యల్ని సానుభూతితో అర్ధం చేసుకునే కమ్యూనిస్టు పార్టీ లేదా? ఆ కార్యకర్తలు మీకు దన్నుగా వుండగలరు. అలా ప్రయత్నించండి! ఈ ప్రశ్న జవాబు నాకు నచ్చాయి. ఇటువంటివి అడుగుతూ ఉంటే బాగుంటుంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.