గుండెను పిండేసే చిత్రం ‘హార్ట్ అఫ్ ది సన్’

 

నటి

మాతృత్వం ఒక తియ్యటి కల. తన శరీరం లోంచి మరో చిన్ని శరీరానికి జన్మనిచ్చి, ఆ నవజాత కళ్ళల్లో మెరుపు చూసి కళ్ళు చెమ్మగిల్లే మాతృమూర్తి అనుభూతి వర్ణనాతీతం. అటువంటిది తనకిక సంతాన యోగమే లేదనీ, అది కూడా తన శారీరక లోపం వల్ల కాదనీ, తనకు తెలీకుండా తన సంరక్షకులే చేయించిన సంతాన నిరోధక శస్త్రచికిత్స వల్లనే అని తెలిసిన వనిత ఆక్రోశం ఆవేదన ఎలా ఉంటుంది? ఆ ఆవేదనకి సజీవ దర్పణం ఫ్రాన్సిస్ డెంబెర్జేర్ ఫ్రాన్స్-కెనడా చిత్రం ‘Heart of the Sun’ (1998). ఐఎండీబీ లో గొప్ప రేటింగ్ లేకపోయినా, సున్నితమైన మానవ సంవేదనను మనసుకు హత్తుకునేలా చెప్పడం వలన ఈ చిత్రం దేశ కాల పరిమితులను దాటి సార్వజనీనతను, సార్వకాలీనతను సంతరించుకుంది.

కథాకాలం గత శతాబ్దపు 30 వ దశకంలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పశ్చిమ కెనడా ప్రైరీస్ తీవ్ర ఆర్థిక  మాంద్యంలో వున్ననాటి కథ. కథానాయిక జెన్నీ మక్గ్రేన్ కెనడా ప్రైరీస్ లో ఓ ధనిక రైతును వివాహం చేసుకుని ఆనందంగా జీవిస్తోంది. ఇంత ఆనందంలోనూ ఒకే ఒక విషాదం ఆమె జీవితాన్ని దుఖమయం చేస్తోంది. అదే ఆమె మాతృత్వానికి నోచుకోలేకపోవడం. అందుకు కారణాన్ని సోదా చేస్తూ తాను ఒకప్పుడు కొన్నాళ్లపాటు ఉండిన మిషనరీ ఆసుపత్రి డాక్టర్ వద్దకు వెళుతుంది. హృదయం బ్రద్దలయ్యేటంతటి కటిక వాస్తవం తెలుస్తుందామెకక్కడ! తనకు సంరక్షకులుగా నియమించబడ్డ వారే, తనకు అపెండిసైటిస్ ఆపరేషన్ పేర ఆనాడక్కడ చేయించింది నిజానికి గర్భనిరోధక ఆపరేషన్. తనకు తెలీకుండా, తన అనుమతి లేకుండా! మతం పేర జరిగిన ఈ ఘాతుకానికి ఒక్క జేన్నీనే కాదు ఇంకా ఎంతో మంది స్త్రీలు బలయ్యారు. దానికి మతం పెట్టిన పేరు ‘eugenics’.

సున్నిత మనస్కురాలైన జెన్నీ చాలా పేద కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకోవడం, ఉన్న పొలం హరించుకుపోవడంతో ఆ కుటుంబం మరింత చితికిపోయింది. జెన్నీ తల్లి ఆమె పోషణ కోసం ఆమెను ఆ ఊరి మత గురువు ఫాదర్ ఎడ్వార్డ్ ఇంట్లో పనిమనిషిగా కుదుర్చుతుంది. మతం కోసం బలవంతంగా బ్రహ్మచర్యం పాటిస్తున్న ఆ మత గురువు జెన్నీ పట్ల ఆకర్షితుడై ఆమెతో శారీరక సంబంధానికి ‘గురై’ తన బ్రహ్మచర్యంలోని  బూటకత్వాన్ని బహిర్గత పరుచుకుంటాడు. ఆ తర్వాత అతడిలో నేరభావన ప్రవేశిస్తుంది. దీనికంతటికీ జెన్నీనే కారణమని తను నమ్మి, ఆమెను కూడా ‘దైవ భాష’లో నమ్మిస్తాడు. స్త్రీత్వమన్నది ఆమెలో లేకపోతే, తను ఆమె పట్ల ఆకర్షితుడిని కాకపోయే వాడినని అతడు అనుకుంటాడు. సమయోచితంగా ఓ ప్లాన్ వేసి, దాన్ని అమలు జరపడానికై – “జెన్నీ, నువ్వు ఒక విధంగా ఫాదర్తో, దేవుని ప్రతినిధితో వ్యభిచారించావు. అందుకు క్షమాబిక్ష  పెట్టమని దేవున్ని వేడుకో! నీకు పాపవిముక్తి జరుగుతుంది. అందుకోసమే నిన్ను ఓ చోటికి పంపిస్తాను” అంటూ దూరప్రాంతంలోని ఓ మత సంస్థకు పంపిస్తాడు. నిజానికది మత సంస్థ పేరుతో చలామణి అవుతున్న బందీఖానా లాంటి ఆసుపత్రి. అక్కడ ‘eugenics’ అమలుపరుస్తున్నారు. అంటే స్త్రీలను, అవివాహిత బాలికలను వారి అనుమతి లేకుండానే గోడ్రాళ్ళుగా మార్చేస్తుంటారు.

దర్శకుడు

ఓ గ్రీకు పదం నుండి రూపాంతరం చెందిన ‘eugenics’ అన్న మాటకు అర్థం ‘సుజననం’. ‘నరవంశ శుద్ధిశాస్త్రం’ అని తెలుగులో మరో అర్థముంది. ప్రపంచంలోని ఉత్తమ లక్షణాలు, వాంఛిత గుణాలు గల స్త్రీలే ప్రత్యుత్పత్తి చేస్తూ, అవాంఛిత లక్షణాలు గల వారు, మానసికంగా శారీరకంగా దుర్బలులు అసలు పిల్లల్ని కనలేకుండా చేస్తే బహుశా ప్రపంచం ఉత్తమ జాతితో నిండిపోతుంది కదా అన్న భావమే ‘eugenics’ వాదానికి మూలం. ఇంగ్లాండులో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ (1822-1911) సుజనన సంస్కరణోద్యమాన్ని లేవదీస్తూ ‘ప్రత్యుత్పత్తి’ అన్నది ‘ఉత్తమ జాతి’కి మాత్రమే ప్రత్యేక హక్కుగా ఉండేటట్లు రాజ్యమూ, సామాజిక సంస్థలూ జాగ్రత్త వహించాలని ప్రచారం చేశాడు. ఈ విధంగా ప్రపంచాన్ని ‘అధమ సంతతి’ నుండి కాపాడవచ్చునట!

యూరప్ ఖండంలోని అనేక దేశాల్లో ఈ అమానుష కృత్యం అమల్లోకొచ్చింది. 1930 – 70 మధ్యకాలంలో చట్టాలు కూడా చేయబడ్డాయి. ఫలితంగా స్త్రీల అనుమతి కూడా అక్కర్లేకుండా, సంతాన నిరోధక ఆపరేషన్లు చేయడం పరిపాటి అయింది. ఆర్థిక మాంద్యం వున్న ప్రాంతాల్లో మరింత కర్కశంగా అమలు చేశారు. కెనడా, అమెరికాలలో దాదాపు లక్ష మంది స్త్రీలు ఈ ఘాతుకానికి బలైనట్లు చిత్రం ఆఖర్లో వివరాలు ఇచ్చారు. నాజీ జర్మనీలో నియంత హిట్లర్ ఇలాంటి రెండు లక్షల ఆపరేషన్లు చేయించినట్లు మరో సమాచారం. ఎమర్జెన్సీ కాలంలో దేశ జనాభాను అదుపులోకి తెస్తానంటూ సంజయ్ గాంధీ అండ్ కంపెనీ బలవంతంగా జరిపించిన ‘నస్బందీ’ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ల సంగతి కూడా మనకిక్కడ గుర్తుకు వస్తుంది. నస్బందీకి గురైన ఆదివాసీల గురించి మహాశ్వేతాదేవి కథ చాలా మంది చదివే వుంటారు. వాళ్లు ‘అవాంచితులు’ అన్నమాట. ‘అధికారం’ దగ్గర ఉండడం వలన, వ్యక్తులను, సమూహాల్ని అణగదొక్కే ఆయుధంగా ‘eugenics’ ఉపయోగపడింది.

మన చిత్రకథలోని జెన్నీ ప్రకృతి ఆరాధకురాలు. అతి సహజంగా ఉండే వ్యక్తి. ఆ ఊరి చివర పర్వత భాగంలో ఓ పురాతన అమెరికన్ ఇండియన్ల పవిత్ర స్థలం ఉంది. ఆ స్థలంలో నాలుగు రకరకాల సైజుల్లో ఉన్న రాళ్ళు ఉండేవి. సూర్యుడి కటాక్షంలో వున్న ఈ భూమిపై ఒకడు ఉత్తముడు, వేరొకడు అధముడు అన్న భేదం లేకుండా అందరూ సమానంగా కలిసి మెలిసి ఉండాలన్న అర్థంలో అక్కడి ఇండియన్లు ఆ స్థలం పవిత్రతను ఆరాధించేవారు. సినిమాలో ఈ స్థలాన్ని దర్శకులు సింబాలిక్ గా ఉపయోగించారు. “సూర్యుడి హృదయం వైపు చూడు, నిజం ఏమిటో తెలుస్తుంది” అన్నది ఇండియన్ సామెత. ఆ సామెత నుండే ఈ చిత్రానికి ‘హార్ట్ ఆఫ్ ద సన్’ అని పేరు పెట్టారు. జెన్నీకి ఆ స్థలం అంటే ఇష్టం. అక్కడికి వెళ్లి ఆడుతూ పాడుతూ ఉండేది. ఈ ప్రవర్తన వలన (నశింపబడిన జాతి ప్రార్థనా స్థలంలో ఆడుకోవడం వలన) ఓ ‘ముద్ర” పడిపోతుంది. ముద్ర పడిన వ్యక్తుల్ని అనాగరికులు, కొన్నిసార్లు  ‘మంత్రగత్తెలు’గా గుర్తించి చంపేస్తుంటారు. (witch-hunt). నాగరికులు ‘నైతికత’ పేర ‘eugenics’ ప్రయోగిస్తారు. జెన్నీ విషయంలో ఆ పని చేసింది ఆమెకు సంరక్షకుడైన మత గురువే. ఇదివరకే ఆమెపై ఉన్న ముద్ర అతడి స్వార్ధానికి పనికి వచ్చింది.

చాలా ప్రతిభావంతమైన నటన అవసరమైన ఈ పాత్రను సమర్థవంతంగా పోషించింది నటి ‘క్రిస్తియానీ హిర్ట్’. చాలా ప్రీతిపాత్రుడైన భర్త, అతనికి తెలియని తన గతం, అతడు తండ్రి కాలేకపోవడానికి తనపై గతంలో జరిగిన ఘాతుకమే కారణమని తెలిసి రావడం, భర్తకు అన్యాయం చేశానన్న నేరభావన, అయినా తనను అమితంగా ప్రేమించే అతడ్ని వదులుకోలేని వివశత, మత గురువుని నిలదీయడం, నిలదీసినా ప్రయోజనమేమిటని తెలిసి రావడం – ఈ దృశ్యాలన్నిటిలోనూ  మరపురాని విధంగా నటించారామె. చిత్రం మొత్తం జెన్నీ, ఆమె భర్త, మధ్య మధ్య ఫ్లాష్ బ్యాక్ లో మత గురువు – ఈ మూడు ప్రధాన పాత్రల చుట్టూ నడుస్తుంది. మత గురువు జెన్నీపై జరిపిన ఘాతుకాన్ని ‘కంచే చేను మేయడం’గా చూపిన వైనం, జీవహింసను వ్యతిరేకించే జెన్నీ తన గతాన్ని తెలుసుకున్న తర్వాత ఓ రోజు పొలంలో కోళ్లను తినడానికి వస్తున్న తోడేలును కసిగా కాల్చి చంపడం వంటి దృశ్యాల చిత్రీకరణలు ఆకట్టుకుంటాయి. చిత్రంలో చెప్పుకోదగ్గ అంశం మరొకటి ఉంది. తన సంతాన రాహిత్యానికి కారణం తెలుసుకోడానికి ఒకప్పుడు తానుండిన మతసంస్థ ఆసుపత్రికి వెళ్ళి, అసలు విషయం తెలుసుకుని నిలువునా చితికిపోయినా, అంత విషాదంలోనూ ‘కారాగారం’ నుండి ‘ముద్ర’ పడ్డ అమ్మాయితో దొంగతనంగా తప్పించుకొని రావడం, కనీసం ఒక్కరినైనా ఆ నరకయాతన నుండి తప్పించాను కదా అని సంతృప్తి పడడం ఆశావహంగా ఉంది.

చూసిన వారికి ఎప్పటికీ గుర్తుండే ఈ సినిమాను కోల్ కతా  ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించినపుడు కలకత్తాలో మంచి సినిమాలకు ప్రేక్షకులు చూపే ఆదరణను చూసి ముగ్ధురాలైన చిత్ర సహనిర్మాత బ్రెండా లైల్స్  ప్రేక్షకులను సంభోదిస్తూ ‘జెన్నీ బాధ మనందరి బాధ. ప్రపంచంలోని ఎన్నో చీకటి కోణాల్లో ఇంకా ఎన్నెన్ని అమానుష కృత్యాలు జరుగుతున్నాయో బహుశా మనకు తెలియక పోవచ్చు’ అని అన్నారు. ఈ సినిమా దర్శకుడు తన కెరీర్లో ఎన్నో ప్రతిష్టాత్మక బహుమతులు అందుకున్నాడు.

యూజెనిక్స్ ప్రస్తుతం ఏ దేశంలోనూ అమల్లో లేదు, కానీ మానవుల (ప్రత్యేకంగా స్త్రీల) సహజ హక్కులపై బలవంతపు అమానవీయ ఘాతుకాలు ఎన్నెన్ని జరుగుతున్నాయో! ఈ చిత్రం పోస్టర్లోని కెనడా ఇండియన్ల సామెతలో చెప్పినట్లు – “నిజం నిద్ర పోవచ్చు కానీ మరణించదు.”

 

 

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.