పెట్టుబడి నాటకం బయట పెట్టిన బ్రెఖ్ట్

 

‘తినే రొట్టె నెలా కాల్చాలో

న్యాయమనే రొట్టెనీ

ప్రజలే కాల్చాలి

తాజాగా, మొత్తంగా, రోజూ –

  (బ్రెఖ్ట్, ద బ్రెడ్ ఆఫ్ ది పీపుల్ కవిత)

కదా-న్యాయ మందరికీ సమానంకదా?

కానీ పెట్టుబడిదారీ సమాజం లో న్యాయం అలా వుండదు.అది ధనికులకే అందుబాటులో వుంటుంది.అణచి వేయడము వారిదే.పాలనా వారిదే.అవినీతి చట్టాలు వారివే – చట్టపరమైన న్యాయం, నిజమైన న్యాయం – తేడాలుంటాయా? వుంటాయి – పెట్టుబడిదారీ విధానంలో తేడాలు తప్పక వుంటాయి. ఇలాటి వాస్తవాలను నాటక ప్రక్రియ ద్వారా మనముందుకు తెచ్చిన నాటక రచయిత బెర్టోల్ట్ బ్రెఖ్ట్.

1898 లో జర్మనీ లోని బవేరియా లో జన్మించిన బెర్టోల్ట్ బ్రెఖ్ట్ ఒక నాటకరంగ కళాకారుడు, కవి, నాటక రచయిత, నాటక సంస్కర్త. నాటకం కేవలం ఆనందకారకమే కాదు సమాజ హితాన్ని కోరేది కూడా అనే సత్యాన్ని గుర్తించి అరిస్టాటిల్ సూచించిన సంప్రదాయ నాటకానికి విభిన్నంగా సమాజాన్ని సమాజ సమస్యల్ని ఉద్దేశిస్తూ ప్రేక్షకుల్ని కూడా నాటకంలో ఒక భాగాన్ని చేసి 20 వ శతాబ్దపు నాటక రంగాన్ని ఒక మలుపు తిప్పిన మహా రచయిత. బ్రెఖ్ట్ రెండు ప్రపంచ యుద్దాల ప్రభావాల్ని అనుభవించిన సృజన శీలి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత తన తరం లో ప్రవేశించిన తీవ్ర నిరాశావాదాన్ని గమనించి తీవ్ర  బాజ్వా (బూర్జువా) వ్యతిరేక ఆలోచనావాదాన్ని అభివృద్ధి చేసిన సమాజ సంస్కర్త.

బ్రెఖ్ట్ మొదటి నుంచి కూడా మార్క్సిస్టు భావజాలంతో పెరిగిన వాడు. నాటక రంగంలో కూడా తీవ్రమైన మార్పులు కోరుకున్నాడు. 1924 నుండి 1933 వరకు అనేక నాటక దర్శకులతోను, తన సహచరులతోను పనిచేసిన అనుభవంతో  ఇర్విన్ పిస్కెటర్ తో కలిసి ‘ఎపిక్ థియేటర్’  అనే వినూత్న నాటక విధానాన్ని కనిపెట్టాడు. 1940 లో ఆయన వ్రాసిన ‘ప్రయోగాత్మక నాటకం’ పై వ్రాసిన వ్యాసం ప్రాకృతిక, భావవాద నాటకాలే కాక సమాజవాద నాటకాన్ని దాని ప్రాముఖ్యతను సూచిస్తుంది.మార్క్సిస్ట్ సిద్ధాంతమైన సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తుంది. నాటక రంగం పైన జరిగే ఊహాత్మక కధలు కాక వాస్తవిక నిజాలను ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల భాగాస్వామ్యం పెరుగుతుందనీ దానికి ‘ఎలియనేషన్’ సిద్ధాంతాన్ని ప్రతిపాదిoచాడు. ఈ ప్రక్రియలో ప్రేక్షకుడు నాటకంలోని పాత్రలతో పూర్తిగా మమేకం అవ్వకుండా తాను కేవలం ప్రేక్షకుడిని అని అక్కడ రంగస్థలం పై జరుగుతున్న నటనను అంశాలను అవగాహన చేసుకుని తన సమాజ స్థితిగతులను హేతుబద్ధంగాను భావోద్వేగాలతోను పరిశీలించి అర్థం చేసుకోగలుగుతాడు.  దీనివలన సమాజశ్రేయస్సుకు అవకాశం ఉంటుంది అని బ్రెఖ్ట్ భావించాడు.

మాములు నాటకం పాత్రల సంభాషణలతో సాగిపోతూ ఉంటుంది.  కానీ బ్రెఖ్ట్ సృష్టించిన ‘ఎపిక్ థియేటర్’ సాధారణ నాటకం లాగా నడిచి పోదు. దాని  ప్రవాహాన్ని అవరోధిస్తాడు. అందరూ అనుకుంటున్నది కాక అకస్మాత్తుగా సన్నివేశాల్ని మారుస్తూ పాటల్ని తీసుకొస్తూ నాటక వేదికపైనున్న అమరికలను అటు ఇటు చేసేసి పాత్రలపై కొత్త అర్థాల్ని సృష్టించే లైటింగ్ తో పాటు ప్రేక్షకులతో మాట్లాడుతూ ప్రేక్షకులను కూడా నాటకంలో పాత్రధారులు చేస్తూ నడుస్తుంది ఎపిక్ ధియేటర్.  నేరుగా ప్రేక్షకులతో సంభాషిస్తూ సోక్రటిక్ సంభాషణల ద్వారా ఆలోచనను రేకెత్తించే ‘డయలేక్టిక్ థియేటర్’ ను రూపొందించాడు. తిరుగుతూ వుండే వేదిక , నాటకం లోని సెట్స్, అపుడపుడూ ప్రకటనలు, – ఇలాటివి ప్రవేశ పెట్టడం ద్వారా ప్రేక్షకుడిని నిజమైన సమాజ సన్నివేశాలలో నిమగ్నం చేసి ఆలోచింప చేస్తాడు. ఇతర సంప్రదాయ వేదికలపై నటులు కోడిపిల్లను పట్టుకునే దృశ్యంలో ఊహాత్మక కోడిపిల్లను పట్టినట్లు నటిస్తే, బ్రెఖ్ట్ వేదిక మీద నిజమైన కోడిపిల్లను వదిలి దాన్ని పట్టుకునే ప్రయత్నం చూపిస్తాడు. నటులు పాత్రలను పూర్తిగా అర్ధం చేసుకుని ‘సమాజ దృక్పధం’ (జేస్టాస్) తో వేదికపై జీవించేలా చేస్తాడు.  జేస్టాస్ అంటే శారీరక సంజ్ఞలు మరియు వైఖరిల కలయిక. ఈ జేస్టాస్ వలన ఆ పాత్ర యొక్క వైఖరి లేదా వైఖరి యొక్క ఏ అంశమైనా తెలియజేయబడుతుంది. నాటకంలోని పాత్రల యొక్క ప్రేరణ, నాటక పరమైన సంభాషణలోని అంతర్గతను ‘జేస్టాస్’ బహిర్గత పరచడమే కాక పాత్ర గురించి వ్యాఖ్యానం చేయిస్తుంది.

ఫ్రాంక్ వేడ్కిండ్, కాల్ వేలన్టిన్,  చార్లీ చాప్లిన్  వంటి నటుల  వ్యంగ్య  గీతాలకు,  నాటకాలకు,  చిత్రాలకు ప్రభావితుడయ్యాడు.   1922 లో బ్రెఖ్ట్ రాసిన ‘డ్రమ్స్ ఇన్ ది మిడ్నైట్’ అనే నాటకం బ్రెఖ్ట్ జీవితాన్ని ఒక రచయిత గా మార్చి వేసింది. హెర్బర్ట్ ఇహరింగ్ అనే విమర్శకుడు  బ్రెఖ్ట్ ను ‘రాత్రికి రాత్రే జర్మన్ నాటకరంగాన్ని మార్చివేసిన రచయిత’గా మెచ్చుకున్నాడు.

వినూత్నమైన నాటక రచనాశైలికి మారుపేరైనటువంటి బ్రెఖ్ట్  రచనలు మార్క్సిస్టు భావాలు, క్యాపిటలిస్ట్ వ్యతిరేక ఆలోచనలు మరియు వీటితోపాటు కొన్ని ప్రత్యేకంగాను, విశ్వజనీనంగాను పారదర్శకంగానూ ఉండే అంశాలు ప్రతిబింబిస్తాయి. అధికారకాంక్ష,  ధనకాంక్ష, స్వార్ధపరత్వం, యుద్ధ అనుకూల శక్తులను ఎలా పెంచి పోషిస్తాయి అని మాత్రమే చెప్పడం కాక, తన నాటకాల ద్వారా ధనంచే నియంత్రించ బడిన పెట్టుబడిదారీ వ్యవస్థ సామాన్య మానవులను కూడా ఎలా స్వార్థపరులుగాను, బలహీనులుగాను తాము నమ్మే విలువను కాపాడుకోలేని వారి గాను చేస్తుంది, అనే విషయాలను చాలా విభిన్నం గాను  మరియు నర్మ గర్భంగా చెప్తాడు బ్రెఖ్ట్.

బ్రెఖ్ట్ అందరికీ నాటక రచయితగానే తెలిసినా ఒక మహాకవి. అందుకే తన నాటకాలన్నిటిలో పాటలను కవితామయంగా ప్రవేశ పెడతాడు.  దాదాపు 2000 కవితలను రచించాడు. ఎరిక్ బెంట్లీ వంటి రచయితలూ, నాటక విమర్శకులు వాటిని ఆంగ్లంలోనికి అనువదించారు. సంక్షిప్తత, స్పష్ట మైన పదచిత్రాలు, ఈయన కవిత్వపు గొప్పతనం. ఆయన కవిత్వాన్ని ప్రేమ కవితలు, యుద్ధ కవితలు, శాంతి కవితలు- ఇలా వర్గీకరించవచ్చు. ఆయన కవితలు చాలా వరకు ఆయన జీవిత కాలంలో ప్రచురించబడలేదు. మొదటిదశలోని కవితలన్నీ నాటకాలలో గీతాలుగా ప్రదర్శింప బడినవే. ఆయన కవిత్వంలో కోమలత భాష లోను, భావంలోనూ జీవం పోసుకుంటుంది. ఒక కవితలో తన తల్లిని గురించి చెప్తూ ‘ఆమె పూవులకన్నా, సీతాకోక చిలకలకన్నా తేలికైనదనీ, అంతటి కోమలతను మోయడం భూమికి కష్టమేననీ’ చెప్తాడు. 1920 ల మధ్య నుంచీ ఆయన హిట్లర్ శత్రువుల జాబితాలో చేరిపోయాడు. ‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది సిటీ ఆఫ్ మహాగోనీ’ హిట్లర్ వర్గీయులను చాలా చికాకు పెట్టింది. 1933 లో ప్రవాస జీవితం మొదలైన దగ్గర్నుంచీ డెన్మార్క్ (స్కాండినేవియా 1933-1941), యునైటెడ్ స్టేట్స్ (1941-47) లలో నివసించాడు. జర్మనీ లో అతని పుస్తకాలు నిషేధింపబడి తగులబెట్ట బడ్డాయి. 1937 – 1941మధ్య ఆయన గొప్ప కవిత్వాన్ని, కధలను, నాటకాలను, నాటక సంబంధిత వ్యాసాలను వ్రాసాడు. ఈ కవితను చూడండి:

చీకటి రోజులలో పాడడముంటుందా? ఉంటుంది,

చీకటి కాలం గురించి పాడడముంటుంది.’

 అలాగే

‘ప్రతిరోజూ తిండి కోసం నేను అబద్దాలనమ్మే మార్కెట్ కెల్తాను.

నేను బహుశా నా స్థానాన్ని అమ్మేవారి మధ్య తీసుకుంటాను.’  

నాటక రచన తగ్గింతరవాత బ్రెఖ్ట్ కవిత్వ రచన మీదనే దృష్టి సారించాడు.

బ్రెఖ్ట్ తన కవిత్వంలో యూరోపియన్ సంస్క్రతిని, నాజీలను, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల ప్రభావాలను,  తన మార్క్సిస్ట్ దృక్పధంతో విమర్శిస్తాడు.

దాదాపు 57 నాటకాలను, స్క్రీన్ ప్లే లను వ్రాసిన బ్రెఖ్ట్ రచనలలో కొన్ని ప్రముఖమైన వాటిని ఇక్కడ పరిశీలిద్దాం.

1926 లో ప్రదర్శింపబడిన ‘మేన్ ఈక్వల్స్ మాన్’  అనే నాటకం బ్రెఖ్ట్ మొదటి నాటకంగా పరిగణించవచ్చు. ఈ నాటకంలో ‘ఒక పెట్టుబడిదారీ సమాజం వ్యక్తులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది, అలాగే ఆర్థిక వ్యవస్థ కూడా ఒక వర్గానికి  చెందిన వ్యక్తుల గుర్తింపుని ఎలా మార్చివేస్తుంది’- అనే విషయాన్ని చూపిస్తాడు. ఈ నాటకంలో గేలి గే అనే మత్స్యకారుడు  ఒక సైనికుడిగా ఎలా మారాల్సి వస్తుందో చెప్తాడు.

1928 లో వ్రాయబడ్డ ‘ద త్రీ పెన్నీ ఆపేర’ 1728 లో జాన్ గే వ్రాసిన ‘బెగ్గర్స్ ఆపెరా’ పై ఆధారితమైనది. జాన్ గే తన నాటకంలో ‘పనికిమాలిన వాళ్ళు మర్యాదస్తుల్లా చెలామణి అవుతున్నార’నే విషయాన్ని చూపితే బ్రెఖ్ట్ ‘ఆ మర్యాదస్తులంతా నిజంగానే పనికిమాలిన వాళ్ళని’ చూపుతాడు. మార్క్సిస్టు పంధాలో ‘పెట్టుబడిదారీ విధానంలో చాలా వ్యతిరిక్త ధోరణులున్నాయని, పెట్టుబడి దారీ వ్యవస్థ పనికిమాలినది, నీతిమాలినదని చెప్తూ అలాటి సమాజాన్ని పడదోయాలని చెప్తాడు. జాన్ గే దుర్నీతి రాజకీయాన్ని విమర్శిస్తే బ్రెఖ్ట్ దాన్ని పెట్టుబడిదారీ సమాజంతో ముడిపెడతాడు. 1936 లో విడుదలైన చార్లీ చాప్లిన్ నటించిన ‘మోడరన్ టైమ్స్’ చిత్రం కూడా  ఆధునిక పెట్టుబడిదారీ సమాజంలో సామాన్య కార్మికుల దుర్భర జీవితాన్ని చూపెడుతుంది. ఇప్పటికీ మారని సమాజం గురించి చెప్తూ నదీమ్ గోర్దిమార్ ‘ పరిస్థితులేమీ మారలేదు. whore అనే మాట sex worker అయిందని, poverty, underdevelopment అయిందని, globalization అంటే బలవంతమైన దేశాలు మానవ వనరులు పంచుకోవడం గాను మారాయని ‘ చెప్తుంది.

ఈ నాటకంలో నాయకుడు ఉపనాయకుడు ఇద్దరు దొంగలే. ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటూ ఒకరిపై ఒకరు జయిస్తుంటారు. లంచగొండితనం, విచ్చలవిడితనం,అవినీతి – ఇవన్నీ సమాజాన్ని ,ముఖ్యంగా ధనిక వర్గాలలో ఎలా పాతుకుపోయాయో మెక్ హీత్, పోలీ పీచం పాత్రల ద్వారా తెలియచేస్తాడు. మర్యాదస్తుల్లా చెలామణీ అయేవారి అసలు స్వరూపాలు చూపిస్తాడు. వారీ మాటలు, అలవాట్లు, వాడే వస్తువులు, పరికరాలు,అన్నీ బూర్జువా లక్షణాలను చూపిస్తాయి. మార్టిన్ ఎస్లీన్ అన్నట్లుగా బ్రెఖ్ట్ పాత్రలన్నీ ‘పరస్పర విరుద్ధ లక్షణాలు కలిగి ద్వైధీ పాత్రలుగా నిలుస్తాయి.

‘మదర్ కరేజ్ అండ్ హర్ చిల్డ్రన్’ (1939)  

సమాజగతమైన అంశాలను చాలా లోతుగా మరియు సునిశితంగా ఒక కథ ద్వారా నాటక రూపంలో చర్చించేటువంటి రెండు అతి ముఖ్యమైన అతని నాటకాలు ‘మదర్ కరేజ్’(1939) మరియు ‘గుడ్ వుమన్ ఆఫ్ సేజువాన్’(1942). పాఠకులను / ప్రేక్షకులను ఒక చక్కటి కథన ప్రపంచంలోకి తీసుకు వెళ్లి రంజింపచేయడమేకాక వారు తమ చుట్టూ ఉన్న సమాజ పరిస్థితుల గురించి తీవ్రంగా ఆలోచించేట్లుగా చేస్తాయి. 1939 లో ప్రచురింపబడిన ‘మదర్ కరేజ్’ అనే నాటకం 1630 ల కాలం నాటి ఐరోపా ఖండంలోని పవిత్రయుద్ధాల కాలాన్ని నాటక కాలంగా తీసుకుని ఆనాటి సమాజంలో ఒక మహిళ కుటుంబాన్ని కాపాడుకోవడానికి పడే ఇక్కట్లు, ఆమె మనోధైర్యం, గుండెనిబ్బరం, పట్టుదలను ఎంతో ప్రతిభావంతంగా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకు పోయే విధంగా జీవితంలో తాము కూడా ఎప్పుడైనా అనుభవించే ఉంటామ’నిపించే విధంగా చిత్రీకరిస్తుంది.  

మదర్ కరేజ్ అని పిలువబడే అన్నాఫైలింగ్ తన ముగ్గురు సంతానంతో సంచార జీవనం సాగిస్తూ ఉంటుంది. యుద్ధ కాలంలో సైనికులకు అవసరం అయ్యేటువంటి చిన్న చిన్న వస్తువులను ఒక తోపుడుబండిలో అమ్ముకుంటూ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తిరుగుతూ జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. యుద్ధకాలంనాటి పరిస్థితులు తన కుటుంబానికి జీవన ఉపాధి కల్పిస్తున్నాయి అని తెలిసినప్పటికీ తన కుమారులు యుద్ధంలో భాగమవ్వడం  ఆమెకు ఇష్టం ఉండదు.

సైనికులను నియామకం చేసుకోవడానికి వచ్చిన అధికారి ‘యుద్ధం నిన్ను పోషిస్తున్నట్లు నువ్వు యుద్ధాన్ని పోషించాలి’ అని అన్నప్పుడు ఆమె తన వ్యతిరేకతను తీవ్రంగా తెలియజేస్తుంది.  అయినప్పటికీ ఆమె పెద్ద కుమారుడు ఎఇలీఫ్ ఆమె కళ్ళు కప్పి సైన్యంలో చేరడానికి వెళ్లిపోతాడు. అలాగే ఆమె రెండవ కుమారుడు సైన్యానికి సంబంధించిన ఒక కార్యాలయంలో జీతభత్యాల చెల్లింపు అధికారిగా చేరుతాడు. ఒక తల్లిగా తన కుమారుల జీవన భద్రత పట్ల తనకు కల ఆందోళనను అధిగమించడానికి ప్రయత్నిస్తూ తన చివరి సంతానం అయిన కేథరిన్ తో కలిసి పొట్ట పోసుకోవడానికి ఊరూరు తిరుగుతూ తోపుడుబండి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటుంది.  

ఆమె భయపడినట్లుగా ఆమె రెండవ కుమారుడు తనది కాని నేరానికి సైనిక అధికారులచే కోర్టుమార్షల్ చేయబడి మరణశిక్షకు గురి అవుతాడు.  కొంత డబ్బు ముట్టచెప్పడం ద్వారా తన కొడుకుని కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు అడిగినంత డబ్బులేక వారితో బేరసారాలకు దిగుతుంది.  ఆమె ఈ వ్యవహారం ఆమెను ఒక హృదయంలేని తల్లిగా చూపించినప్పటికీ ఇంకా గడప వలసిన ఆమె జీవితం మరియు తన కూతురి జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి నిర్ణయాన్ని చేసుకోలేకపోతుంది.

జీవన క్రమంలో కొంతమంది పురుషులు ఆమెను వివాహమాడి ఆమెకు ఒక స్థిరమైన జీవితాన్ని ఇవ్వడానికి  లేక తమ వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించి ఆమెకు ఒక సుస్థిరతను ఇవ్వడానికి అవకాశం చూపించినా ఆమె తన కుమార్తెను కాదని ఇలాంటి జీవితాన్నితీసుకోవడానికి అంగీకరించదు.  ప్రకృతిపరంగా, ఎన్నిఅడ్డంకులు వచ్చినా జీవితాన్ని కొనసాగించడమనే జీవన నియమాన్ని పాటిస్తూ మదర్ కరేజ్ తన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కొన్నప్పటికీ తన జీవితాన్ని తన కుమార్తె జీవితాన్ని కొనసాగించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది.  ఈ ప్రయత్నంలో భాగంగా ఆమె కొంత స్వార్థపరత్వాన్ని, కొంత కర్కశత్వాన్ని చూపవలసివచ్చినా అవన్నీ ఆమె జీవన పోరాటంలో ఒక భాగం మాత్రమే.

యుద్ధం పట్ల ఆమెకు కల ద్వైధీ భావాన్ని ఈవిధంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది.   యుద్ధంలో భాగంగా ఆమె పెద్ద కుమారుడు చనిపోగా అదే యుద్ధం వలన ఆమె కుమార్తె కూడా గాయపడుతుంది.  అలాంటి సమయంలో యుద్ధం వలన తాను తన కుటుంబం ఎంత నష్ట పోయామని బాధపడినట్లుగా యుద్ధం ముగిసి పోతుందేమో అనే వార్త వచ్చినప్పుడు తన జీవితం తన వ్యాపారం ఎలా కొనసాగుతుంది అని ఆందోళనకు ఆవిడ గురి అవుతుంది.

మనుషులను రాక్షసులుగా మార్చే యుద్ధకాంక్ష పరాకాష్టకు చేరుకున్నప్పుడు తమ పక్కగ్రామంలో ఉన్న ప్రజలు శత్రు సైనికుల చేతిలో ప్రాణాలు కోల్పోతారు అని భయంతో డప్పు మోగించడం ద్వారా వారిని హెచ్చరించే ప్రయత్నం చేయడంలో మదర్ కుమార్తె తన ప్రాణాలను కోల్పోతుంది. అటువంటి తీవ్రమైన నిరామయ పరిస్థితిలో కూడా ఆమె తన కుమార్తె దేహానికి దహన సంస్కార ప్రయత్నాలు చేసి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది.  ఈ ప్రపంచంలో ఏప్రాణి అయినా తన జీవితాన్ని కొనసాగించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మదర్ పాత్ర అలాంటి పట్టుదలకి నిదర్శనం.

“ద కకేషియన్ చాక్ సర్కిల్” (1948/9)

‘ద కకేషియన్ చాక్ సర్కిల్’ అనే నాటకం బ్రెఖ్ట్  ప్రవాస జీవితంలో ఉన్నప్పుడు వ్రాసినది. ధనిక పేద వర్గాల ప్రజలలో ప్రేమ, జీవితం పట్ల భయాల మధ్య మొగ్గు ఎటు – అనే విషయాలను స్పృశిస్తుంది. అందరికీ తెలిసినదే అయిన కధను ఒక అంశంగా నిలుపుకుని సమవాద భావనలని వివరించిన నాటకం ఇది.

20 వ శతాబ్దం లోనే గొప్ప నాటకంగా పేరుపొందిన ఈ నాటకంలో అనేక ఆసక్తికర అంశాల్ని విశ్లేషిస్తాడు.  లిహ్సిన్గో దావో వ్రాసిన ఒక చైనా నాటకం ప్రేరణ అయినప్పటికీ నాజీల కాలంలో సోషలిస్ట్ రష్యా విజయం తర్వాత కాకసస్ పర్వతాలలో ఒక లోయ గురించిన కధతో ముడిపెడుతూ భూస్వామ్య వాదం, క్రూరత్వం హింస యుద్ధాల నేపధ్యంలో ఓ ధనిక మదాంధ భూస్వామి భార్యలో లోపించిన కన్నతల్లి ప్రేమ, ఒక సేవకురాలిలో ఎలా పండిందో చెప్తూ మాతృప్రేమ అసలు స్వరూపాన్ని తెలియచేస్తాడు.  

జార్జి అనే జమిందారు హత్య తర్వాత తన సంపదను వస్త్రాలను సర్దుకోవడంలో మునిగి కన్నకొడుకుని వదిలి పారిపోతుంది నటేల్ల అనే జమిందారిణి. మైకేల్ అనే ఆ పిల్లవాడ్ని గ్రుషా అనే సేవకురాలు తీసుకుని వెళ్ళి కాపాడుతుంది.  ఆ కాపాడే ప్రయత్నంలో ఎన్ని కష్టాలు పడింది, పిల్లవానిపై ప్రేమని ఎలా వదులుకోలేక పోయిందీ, ఆ పిల్లవానికోసం తన ప్రియుడికి దూరమై ఎంత క్షోభను అనుభవించిందీ చెప్తాడు.

అజ్దక్ అనే సమ యోచన కల భ్రష్టుడు, ధనలాలసుడు అయిన న్యాయవాది చివరకు మైకేల్ ఎవరికీ చెందుతాడో చెపుతూ వివాదాస్పదమైన లోయలో పండ్ల తోటలు పెంచాలా గొర్రెలు పెంచాలా అనే విషయంతో దీనిలో కలిగిన వాదాలని ముడిపెడతాడు. ఎవరు ఆ పిల్లవాడ్ని కకేషియన్  వృత్తంలో రెండువైపులా నుంచీ చేరొకరూ బలంగా లాగి గెలుచుకుంటారో వాళ్ళకే చెందుతాడని చెప్పడంతో తన ప్రేమనంతా పోసి పెంచిన గ్రుషా ఆ పిల్లవాడికి ఎక్కడ బాధ కలుగుతుందో అని వదిలివేసి, తరువాత అజ్దాక్ ఇచ్చే తీర్పుతో గెలుచుకుంటుంది. అలాగే కాకసస్ లోయలో ఆస్తులను పెంచడం కాదు అందరూ ఆనందంగా జీవించాలని బోధిస్తాడు. ముందు ముందు రష్యన్ సామ్యవాదమే శిరోదార్యమనే విషయాన్నీ బ్రెఖ్ట్ సూచిస్తాడు.

పెట్టుబడిదారీ సమాజం మానవ అవసరాలను ఎలా డబ్బు చేసుకుంటుందో కూడా అనేక సన్నివేశాలలో వివరిస్తాడు. గ్రీకు నాటకాల్లోని ‘కోరస్’ లా మధ్యలో గాయకుల గీతాలతో పరిస్థితులను సమీక్షిస్తాడు.  పటిష్టమైన భావనలు, కదిలించే పదాలు కల పాటలతో దిశానిర్దేశం చేస్తాడు.

‘మదర్ కరేజ్’ నాటకం ప్రపంచంలో యుద్ధం మానవజీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది; ఎలా  మానవీయవిలువలను చంపివేస్తుంది; మానవులు కూడా యుద్ధాన్ని తమ స్వార్థం కోసం ఎలా పెంచిపోషిస్తారు;  రాజులు మత అధికారులు యుద్ధాన్ని తమ స్వార్థప్రయోజనాలను కాపాడుకోవడంలో ఒక సాధనంగా ఎలా ఉపయోగిస్తారు;  ఇలాంటి ప్రపంచంలో పేదవారు బ్రతకడం; జీవితంపై నమ్మకంతో తమ సంతానాన్ని ఈ భూమి పైకి తేవడం అనేది చాలా సాహసోపేతం అనే పలు అంశాలను ప్రేక్షకుల ముందు ఉంచగా ‘గుడ్ వుమన్ ఆప్ సేజువాన్’ (1942) ఇలాంటి ఈ ప్రపంచంలో ఇంకా మానవత్వం, మానవీయ విలువలైన కరుణ, ప్రేమ, దాతృత్వము, మనిషి యొక్క ప్రాధమిక మంచితనంపై నమ్మకము మొదలైనవి ఇంకా ఉన్నాయా, ఒకవేళ ఉన్నా, అవి ఈ ఆధునిక అమానవీయ ప్రపంచంలో వాటి సంపూర్ణ అర్థంలో మనగలవా అనే అంశాలను ఒక చక్కటి జానపద అంశాలను ప్రతిబింబించే కథ ద్వారా ప్రేక్షకులకు అందిస్తాడు  బ్రెఖ్ట్.

ఈ ప్రపంచంలో ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారా లేదా అని పరీక్షిస్తూ ‘ముగ్గురు దేవుళ్ళు’ సేజువాన్ అనే ఊరికి వచ్చి ఒక నీరు అమ్ముకునే వ్యక్తికి దేవుళ్ళుగా తమను పరిచయం చేసుకుని, ఆరాత్రికి తమకు బస కల్పించే మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటారా అని అడుగుతారు.  ఊరిలోని ప్రజలందరూ నీటి వ్యాపారి యొక్క విన్నపాన్ని ఎగతాళిగాను లేదా తమకు కుదరదని తిరస్కరిస్తారు. చిట్టచివరిగా ఆ ఊరిలోని షేన్ టే అనే ఒకవేశ్య తనకున్న ఒక గదిని ఆనాడు రాబోయే విటుడుని కూడా ఆపి ఆ దేవుళ్లకు బసగా ఇస్తుంది . ఎంతో సంతోషించిన వారు వెళ్లేటప్పుడు మెరుగైన జీవితం గడపమని ఆమెకు వెయ్యి వరహాలు బహుకరించి వెళతారు. ధనం, బెల్లం చుట్టూ చీమలను చేర్చినట్లు షేన్ టే తో పరిచయం ఉన్నవారందరూ ఆమె సహాయానికి చేరతారు.  వేశ్యా వృత్తిని విడిచి ఆమె తన దగ్గరున్న ధనంతో ఒక పొగాకు అమ్మే దుకాణాన్ని కొని ఆ వ్యాపారంతో జీవనం సాగిస్తూ ఉంటుంది. తన వద్దకు ఆశ్రయానికి, సహాయానికి వచ్చిన ఎవరిని తిరస్కరించదు. ఆవిధంగా షేన్ టే కు ఆ ఊరిలో ‘గుడ్ వుమన్ ఆప్ సేజువాన్’ అనే పేరు వస్తుంది.

తన సహాయాన్ని, ఆశ్రయాన్ని కోరేవారు ‘అవసరం కంటే స్వార్థంతో ఆమె మంచితనాన్ని దుర్వినియోగపరిచేవారు’ అని తెలిసినా షేన్ టే వారి పట్ల నిష్కర్షగా వ్యవహరించలేకపోతుంది.  ఆమె అద్దెకు తీసుకున్న ఇంటి యజమానురాలు కూడా షేన్ టే స్త్రీ అవడంవలన ఆమెను చులకనగా చూడడమే కాకుండా ఆర్థిక వ్యవహారాలలో షేన్ టే ను అవమానపరుస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో షేన్  టే ఒక నిరుద్యోగ యువకుని ప్రేమలోపడుతుంది. యాంగ్సన్ అనే ఆ యువకుడు ఆమె కంటే ఆమె ధనం పై ఎక్కువ ప్రేమను చూపుతాడు. ఈ విషయం షేన్ టే కు అర్థమైనా అతనిని నిరాకరించదు. మనుషులలో నిస్వార్ధాన్ని, దురాశను నిష్కర్షగా నిరాకరించి తన బలహీనతను అదుపు చేసుకోవడానికి తన చేతిలోంచి జారిపోతున్న తన జీవితాన్నిఅదుపు చేయడానికి తన కజిన్ షువా టా ను ప్రవేశపెడుతుంది.    షువా చాలా ఖచ్చితంగా షేన్ టే ను వాడుకోవడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరిని దూరంచేస్తాడు. తన ప్రియుడు యాంగ్సన్ అతను ప్రేమించే వార్తా వాహకుని ఉద్యోగం సంపాదించడానికి అవసరమైన ధన సహాయం చేసే ప్రయత్నంలో తన దుకాణము కుదువ పెట్టి 200 వరహాలు ఇచ్చినా అతను ఇంకా మూడు వందల వరహాల అవసరం ఉంది అని ఆమెను తన దుకాణం అమ్మి తనకు సహాయం చేయమని బలవంతపెడతాడు.

షేన్  టే దానికి దాదాపు అంగీకారం తెలిపే లోపల ఆమెను నివారించి షువా టా యాంగ్సన్ కోరికను తిరస్కరిస్తాడు.   ఆమె దుకాణం ఉన్న ప్రాంతంలో ఒక వ్యాపారస్తుడు ఆమెకు ఒక ఖాళీ చెక్కును ఆమె పేర ఇచ్చి ఆమె సమస్యలను పరిష్కరించి ఆమెను వివాహమాడాలని తన కోరికను వ్యక్తపరుస్తాడు.   షేన్ టే తిరస్కరించిన దుకాణదారుని ఖాళీ చెక్కులో పదివేల వరహాలు వేసి బ్యాంకులో డబ్బులు తీసుకుని ఆ ధనంతో చుట్టుప్రక్కల వారికి మెరుగైన జీవన వసతులు ఇవ్వడంతోపాటు  ఆమె వ్యాపారాన్ని సుస్థిరపరుస్తాడు ఆమె కజిన్ షువా టా. షువా ఈ వ్యవహారాలు చక్కబెట్టేటప్పుడు షేన్ టే ఆ ఊరిలో కనిపించదు. ఇంతలో ఆమె తన ప్రియుని వలన గర్భవతి అవుతుంది. ఆరు నెలల కాలం గడిచినా ఆమె కనిపించకపోవడంతో ఆమె దుకాణం నడుపుతూ మరింత ఆరోగ్యంగా బలంగా కనపడుతున్న షువా టా ను ప్రజలందరూ అతను షేన్  టే ను హత్యచేశాడు అని అనుమానిస్తారు.

యాంగ్సన్ అదే ఆరోపణను పోలీసువారికి  చేయగా వారు షువా టా ను నిర్బంధించి న్యాయస్థానంలో హాజరు పరుస్తారు.  న్యాయస్థానంలో జడ్జీల స్థానంలో ఉన్న ముగ్గురు దేవుళ్ళు అపరాధిగా ప్రవేశపెట్టబడిన షువా టా ను చూడగానే షేన్ టే గా గుర్తించి ఆశ్చర్యపోతారు. షేన్  టే గా తన మానవ విలువలు తన మంచితనాన్ని వాడుకున్న ప్రజలు షువా టాగా తన నిజాయితీని తన జీవితాన్ని సంరక్షించుకునే ప్రాకృతిక జీవన నియమాన్ని ఎలా విమర్శించారు, ఎలా తనను శత్రువుగా భావించారు అని వారికి చెప్పుకొని, బాధతో ఈ ప్రపంచంలో ఈ విధమైన మానవ మనస్తత్వానికి పరిష్కారమే లేదా అని ప్రశ్నిస్తుంది.

ముగ్గురు దేవుళ్ళు పరస్పరం వాదిoచుకొని ఈ ప్రపంచంలో మంచి వ్యక్తులు మనలేరు అని; మంచితనానికి స్థానం లేనిది వారు సృష్టించిన ఈ మానవ ప్రపంచం అని;  కాదు కాదు మానవ ప్రపంచం ఏ స్థితిలో ఉన్న దాని మంచిచెడులను తాము నిర్ణయించలేమని మనిషిగా ఆమె ఈ ప్రపంచాన్ని నిర్వహించుకోవాలని అంటారు.

ఈ నాటకాల ద్వారా బ్రెఖ్ట్  ఈ ప్రపంచంలో పూర్తిగా విభిన్నమైన మానవ విలువలను తన స్త్రీ పాత్రలు మరియు పురుష పాత్రల ద్వారా చిత్రీకరిస్తాడు. ‘కాకేషియన్ చాక్ సర్కిల్’ లోని గ్రుషా,  ‘మదర్ కరేజ్’ లోని స్త్రీ పాత్రలు అయిన అన్నాఫైలింగ్, ఎవేట్ అనే వేశ్య, ఆనా కూతురు కేథరిన్ మరియు ‘గుడ్ వుమన్’ లోని షేన్ టే ఉదారత్వము, దేవుడిచ్చిన ఈ జీవితం బ్రతకడానికి అనే వాదన  అహింస,  ప్రేమ, కరుణ, అడ్డంకులలో కూడా జీవనాన్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లడం, త్యాగము, సున్నితత్వము అనే గుణాలను ప్రదర్శిస్తే , పురుష పాత్రలు అధికార, ధన, యుద్ధకాంక్షను హింస, నిర్ణయాత్మకత, స్వార్థము, కఠినత్వము, అశాంతి, చంచలతను, కనపరుస్తారు.  

ఆధునిక నాటక పరిణామానికి బ్రెఖ్ట్ చేసిన సేవ అనిర్వచనీయం.

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

5 comments

 • Very good analysis ….congrats..

  ఈ వ్యాసం చదివాక బ్రెక్ట్ మాటలు గుర్తుకొచ్చి….

  (Brecht says “When I read Marx’s Capital I understood my plays . I want to see this book widely circulated. It wasn’t of course that I found I had unconsciously written a whole pile of Marxist plays; but this man Marx was the only spectator for my plays I‘d ever come across. ….” )

  Red salute to Brecht.

  —-థింసా

 • ఆలోచించేలా చేసిన మంచి వ్యాసం. 👌💐
  డా. దివాకర్

 • మదర్ కరేజ్ ప్రస్తావన ఇంట్స్రెస్టింగ్ గా ఉంది. చాలా ఇన్ ఫర్మేటివ్ ఎస్సేస్ రాస్తున్నారు. మంచి ప్రయత్నం సర్. బెస్ట్ విషెస్ టు యూ.

 • భారతేతర మనుషుల పేర్లని వాడేటప్పుడు ఆ పదాలని తెలుగు లిపిలో కాక ఆంగ్లంలోనే రాస్తే సరయిన స్పెల్లింగ్ తో గూగుల్లో వెతుక్కునే వీలవుతుంది. ఈ మధ్య “హిమజ్వాల” చదివేటప్పుడు అందులో షాస్సేరో అనే చిత్రకారుడి పేరుని రచయిత వాడారు. ఎంతో కష్టపడితే గూగులమ్మ దయతో ఆ ఫ్రెమ్చ్ చిత్రకారుడి పేరు రాసే విధానం Chassériau అని తెలిసింది. క్రితం శతాబ్దంలో పాపం పాఠకులు ఎంత శ్రమపడి ఉంటారో ననిపించింది.

 • చదివి స్పందించిన అందరికీ ధన్యవాదాలండీ

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.