ప్రపంచాన్ని కుదిపేస్తున్న స్త్రీల వుద్యమం: “మీ టూ”

(పైన వున్న ఫొటో: “మీ టూ” ఉద్యమ కారిణీ తరన బర్క్)

జడ్జ్ కావినాను సుప్రీం కోర్టు  జస్టీస్ గా నియమించడానికి నిరసనగా…. మహిళల నిరసన మరొక అపూర్వ ఘటన.

అమెరికా సుప్రీం కోర్టు ఆవరణలో నిరసనకారులు కనిపిస్తే చాలు అరెస్టులు సాగుతాయి.  అలాంటిది… కోపోద్రిక్తులైన వేలాది మంది స్త్రీలు అక్టోబర్ 8న శాసనోల్లంఘన (సివిల్ డిజ్ ఒబిడియన్స్)కు తెగించి, సుప్రీం కోర్టు  ఆవరణను ముంచెత్తడమే కాదు కోర్టు మెట్లెక్కి తలుపులు బాది నినదించారు. కొందరు కోర్టు భవనమెక్కి నినాదాలు చేశారు. “బాధితులను నమ్ముతాం”, “స్త్రీల మాటలు వినాలి”, “కావినా వద్దు”, “న్యాయం జరగాలి.” వంటి నినాదాలు రాసిన ప్లే కార్డ్స్ పట్టుకొని వేలాది మంది స్త్రీలు నిరసన తెలిపారు. వాషింగ్టన్ కాపిటల్ హిల్ లోనే కాక, న్యూయర్క్ లో,  దేశంలో అనేక చోట్ల నిరసన ర్యాలీలు జరిగాయి. సుప్రీం కోర్టు ముందు జరిగిన నిరసన ప్రదర్శనలో 300 మంది స్త్రీలు అరెస్టయ్యారు.

సుప్రీం కోర్టు బయట నుంచి నిరసన కారులైన స్త్రీల నినాదాలు వినిపిస్తుంటే  కోర్టు లోపల జడ్జి బ్రెట్ కావినా అమెరికా సుప్రీం కోర్టు అసోసియేట్ జస్టీస్ గా ప్రమాణ స్వీకారం చేశాడు.

దీనికి కొన్ని నిముషాల ముందు అమెరికా సెనేట్ లో జరిగిన ఓటింగులో 50/48 అత్యల్ప మెజారిటితో బ్రెట్ కావినాకు సుప్రీం కోర్టు జడ్జ్ గా ఆమోద ముద్ర లభించింది.  

సెనెట్ కమిటీ ముందు సాక్ష్యమిస్తూ కన్నీటిపర్యంతమైన డాక్టర్ క్రిష్టినా బ్లాస్సీ ఫోర్డ్

సుప్రీం కోర్టు నామినిగా బ్రెట్ కావినాను  ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ జులైలో ప్రకటించిన నాటి నుంచి  నిరసనలు వ్యక్తమయ్యాయి. కారణం, బ్రెట్ కావినా రైట్ వింగ్ ప్రతినిధి మాత్రమే కాక, అతనిపై పౌర హక్కులకు, పర్యావరణ నిబంధనలకు, తుపాకీ నియంత్రణకు, స్రీల పునరుత్పత్తి హక్కులకు వ్యతిరేకిగా ముద్రపడివుంది.

కావినా సుప్రీం కోర్టు నామినిగా ప్రతిపాదించిన తరువాత  అతను ఆ నియామకానికి అర్హుడిగా సెనేట్ ఆమోదం పొందాలి. అయితే సెనేట్ ఓటింగుకు ముందు అనవాయితీగా  సెనేట్ జ్యుడిషియరీ కమిటీ కూడా బ్రెట్ కావినాను ఇంటర్య్వూ చేయాలి . ఇది ఒక విధంగా ఒక ఉద్యోగానికి ఒక వ్యక్తిని ఎంపిక చేయడానికి జరిగే ఇంటర్య్వూలాంటిదే. ఇంటర్య్వూ మొదలైనప్పటి నుంచి హాలు లోపలే కొంతమంది స్త్రీలు బ్రెట్ కావినాకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. అది శాసనాన్ని ఉల్లంగించడమని, వారిని అరెస్ట్ చేసే వారు. పౌరహక్కుల ఉద్యమకారులు, గన్ కంట్రోల్ ను కోరే వారు, పర్యావరణ కార్యవాదులు( ఆక్టివిస్టులు),.. సెనేట్ భవనం బయట రోజూ వందలాది మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

బ్రెట్ కావినా కేవలం రైట్ వింగ్ ప్రతినిధి మాత్రమే కాదని, అతను హైస్కూల్ విద్యార్థిగా, లా కాలేజీ విద్యార్థిగా వుండగా స్త్రీలపై లైంగిక అత్యాచారానికి పాల్పడిన సందర్భాలున్నాయని, బాధితులే స్వయంగా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.  హైస్కూల్ విద్యార్థిగా వుండగా 1980లో తనను స్నేహితులతో కలిసి మానభంగం చేశాడని జులియా స్వేట్నిక్ పర్సనల్ లాయర్ ద్వారా వెల్లడిస్తే, 1982లో బ్రెట్ కావినా తనపై అత్యాచారం చేయడానికి మరో స్నేహితుడితో కలిసి ప్రయత్నించాడని కాలిఫోర్నియా యూనివర్సిటీలో సైకాలజీ బోధించే డాక్టర్ క్రిస్టినా బ్లాసీ ఫోర్డ్ ప్రకటించారు. కనెక్టికట్ రాష్ట్రంలోని ఏల్ యూనివర్సిటీలో లా చదువుతున్నప్పుడు ఒక పార్టీలో బాగా తాగి వున్న కావినా తన అంగాన్ని  ముఖంపై రుద్దాడని డెబోరా రామిర్జ్ అనే మరో స్త్రీ టీవీలకు ఇచ్చిన ఇంటర్య్వూలలో చెప్పుకున్నారు.

“మీ టూ’’ ఉద్యమం ప్రభావం

“మీ టూ’’ ఉద్యమం ప్రభావం వల్లే ఈ ముగ్గురూ స్త్రీలు బాధితులుగా ప్రపంచం ముందుకు వచ్చి చెప్పుకున్నారు. డాక్టర్ బ్లాసీ ఫోర్డ్ సెప్టెంబర్ 28న సెనేట్ జుడిషియరీ కమిటీ ముందు ఇచ్చిన సాక్ష్యంలో 36 ఏళ్ళ క్రితం జరిగిన విషయాలు నిన్ననే జరిగినట్టు  పూసగుచ్చినట్ట్లు వివరించారు. అప్పడు తన వయసు 15 అని, కావినా వయసు 17 అని, తనను రేప్ చేయబోయిన కావినా, అతని స్నేహితుడి నుంచీ తప్పించుకున్నానని, కానీ ఆ సమయంలో తనను చూసిన వాళ్ళ నవ్వులు ఇప్పటికీ తన మనోపేటికలో చెరిగిపోలేదని, మానసికంగా ఎంతో వేదనకు గురయ్యాయని, జీవితంలో చాలా పోగొట్టుకున్నానని సెనేట్ జుడిషియరీ కమిటీ ముందు వెల్లడించారు.  ఉదయం బ్లాసీ ఫోర్డ్ సాక్ష్యం ముగిశాక, కావినా కూడా సెనేట్ జుడిషియరీ కమిటీ ముందు సాక్ష్యం ఇచ్చుకున్నాడు. ఆ రోజు అమెరికాలోని అన్ని టీవీ ఛానల్స్, యూటూబ్ తో సహా లైవ్ ను ప్రసారం చేశాయి. కుటుంబ సమేతంగా టీవీలకు అతుక్కుపోయారు జనం. అందరిలో ఏం జరగబోతున్నది. సెనేట్ లో ఎంతమంది బ్రెట్ కావినాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనే ఉత్కంఠ. సెనేట్ భవనం బయట వేలాది మంది స్త్రీలతో ప్రదర్శనలు.  విచారణలకు విరామం ప్రకటించినప్పుడు కొందరు స్త్రీలు తమ సెనేటర్లను లిఫ్టుల్లో ఆపి, వాదనలకు దిగారు. బాధితుల మాటలు నమ్మాలని, కావినాకు వ్యతిరేకంగా ఓటువేయాలని విజ్ఞప్తులు చేశారు.

సెనేటర్ల మీద కార్యవాదులు తీసుకొచ్చిన వత్తిడి పనిచేసింది. నలుగురు సెనేటర్లు ఊగిసలాటతో ఉండడం కనిపించింది. ఒక రిపబ్లికన్ సెనేటర్ మాత్రం  బ్రెట్ కావినా పై ఎఫ్ బి ఐ విచారణ జరగాలని, దాని తరువాతే ఓటు వేస్తానని చెప్పడంతో ఎఫ్ బి ఐ విచారణకు ఆదేశించాడు అమెరికా ప్రెసిడెంట్. అయితే వారం లోగా ఎఫ్ బి ఐ విచారణ పూర్తి అవుతుందని గడువు విధించాడు. అయితే ఎఫ్ బి ఐ విచారణ ప్రకటన నామ మాత్రమే. ఆ వారంలో ఊగిసలాటకు గురైన సెనేటర్లు బ్రెట్ కావినాకు అనుకూలంగా ఓటు వేయడానికి తయారయ్యారు.  బ్లాసీ ఫోర్డ్ ను కానీ, మిగిలిన ఇద్దరు స్త్రీలను కానీ, కావినాను, అతని స్నేహ బృందాన్ని కానీ ఎఫ్ బి ఐ విచారించలేదు. వారం తరువాత సెనేట్ ముందుకు ఓటింగుకు వచ్చిన కావినా నామినేషన్ 50/48 తేడాతో అమోదం పొందింది. అయితే దీనితో “మీ టూ” ఉద్యమం ఇక ఆగిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తాయి. కాదు ఇప్పుడే ప్రారంభమయింది అని వక్కాణించారు “మీ టూ” ఉద్యమ కారిణి తరన బర్క్ ( Tarana burke).

ఇది కేవలం కొంతమంది మీద నేరం ఆరోపించడం కాదు. మొత్తం వ్యవస్థ పైననే నేరారోపణ చేయాల్సి వుంది. వ్యవస్థలో సాంస్కృతిక మార్పు జరగాల్సిన అవసరం ఎంతయినా వుందని “మీ టూ” ఉద్యమకారులు ప్రకటించారు. డాక్టర్ బ్లాసీ ఫోర్డ్ సాక్ష్యం వింటున్నప్పుడు తలిదండ్రులు అమ్మాయిలను మరింత జాగర్తగా వుండాలని చెబుతూనే దుర్ఘటనలు సంభవించినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని, దృఢమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలని, మనోబలంతో ముందుకు సాగాలని, అపరాజితగా నిలబడాలని ఉగ్గుపాలతో రంగరించి చెబుతూ ఉండాలనిపించిందని అభిప్రాయపడ్దారు. కావినా తనను తాను సమర్థించుకుంటూ మాట్లాడుతున్నప్పుడు అతను కూర్చున్న పద్దతి గానీ, మాట్లాడిన పద్దతిగానీ  దురహంకార పూరితంగా వున్నాయని. అబ్బాయిలను అచ్చోసిన ఆంబోతుల్లా కాకుండా మనుషుల్లా పెంచాలని, ఎదుటివారిని సహృదయంతో అర్థం చేసుకోగలిగే విధంగా మంచి నడవడిక, అణకువ కలిగి వుండేలా తలిదండ్రులు బాధ్యతగా పెంచాల్సిన అవసరం ఎంతైనా వుందని అనేకమంది తమ భావాలను ప్రకటించారు. అంతే కాదు డాక్టర్ బ్లాసీ ఫోర్డ్ మాటలు విన్నాక తనను తాను సమర్థించుకున్న తీరు చూశాక కావినా ఆ పదవికి తగడని, అతని నామినేషన్ ను ఉపసంహరించుకోవాలని 100,000 చర్చీలతో కూడిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చీస్ గ్రూప్ పిలుపునిచ్చింది. ఇదే సమయంలో కావినా తనను తాను సమర్థించుకున్న తీరు చూశామని, ఆ పదవికి అతను అర్హుడు కాడని 1,200 మంది లా ప్రొఫెసర్లు సంతకాలతో కూడిన ఒక వుత్తరాన్ని సెనేట్ కు పంపారు. కావినా చదివిన ఏల్ యూనివర్సిటీలోని విద్యార్థులు ఏకంగా నిరసన ప్రదర్శన చేశారు. ఎన్ని వైపుల నుంచి వ్యతిరేకతలు వచ్చినా  కావినా సుప్రీం కోర్టులో అసోసియేట్ జస్టీస్ కాగలిగాడు

“ మీ టూ” ఉద్యమ సెగలు అమెరికా సుప్రీం కోర్టును చుట్టుముట్టడంతో  అమెరికా ప్రజల్నే కాక ప్రపంచ ప్రజలందరి ఆలోచనల్ని ఒక కుదుపు కుదిపాయి. “మీ టూ” ఉద్యమం వల్ల కొంతమంది చెడుగును మాత్రమే వేరు చేయడం కాదని, అంతిమంగా వ్యవస్థలో సాంస్కృతిక మార్పు జరగాలని ఈ ఉద్యమ కారులు కోరుకుంటున్నారు. అంతేకాదు ఇది కొన్నాళ్లకు అలిసిపోయి అంతా సద్దుమణుగుతుందని, ఈ లోగా కొందరు తమ నేరాలకు బలి అవుతారని, ఆ బలి అయే వారిపట్ల సానుభూతి ప్రకటిస్తూ యథాతథ వాదాన్ని కొనసాగించ బూనుతారు. కొందరు “అబ్బాయులు అబ్బాయిల్లాగే వుండా”లన్నారు, మరి కొందరు “ఆడవాళ్ళేం తక్కువ కాదు. వాళ్ళూ అబ్బాయిలను హింసించిన ఒకటి రెండు సంఘటనలను ఉదహరిస్తారని, “మీ టూ” ఉద్యమకారులు వెల్లడించారు. అయితే ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని ఆలోచించినప్పుడు అధికారం, ఆర్థికబలం వున్నవాళ్లు అవి లేని వాళ్ల మీద లైంగిక హింసలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. పిల్లలు నిస్సహాయులుగా వుండడం వల్లే కదా కాథలిక్ చర్చీల్లో కొన్ని ఏళ్ళుగా ఆడ, మగ పిల్లలపై లైంగిక హింసలు జరిగాయని ఈ మధ్య వార్తలు వెల్లువెత్తాయి.

ఇది కేవలం ఏ ఒక చోటనో, కొందరు స్త్రీలు  కొందరి కోసం చేపట్టిన ఉద్యమం కాదు. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, అన్ని రంగాల్లోకి విస్తరిస్తున్నది. కారణం,-   ఈ వ్యవస్థనే స్త్రీల పట్ల నేరపూరితంగా వుందని అడుగడున ప్రతి క్షణం  నిరూపించబడుతున్నది. నేరారోపణకు గురయ్యేవారికంతా శిక్షలు పడవు. చాలా మంది తప్పించుకుంటారు. అయితే ఇన్నాళ్ళు పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ వున్నవాళ్ళు నేరారోపణలతో కాస్త బురద అంటుకుందని కడుక్కుంటారు. కొండకచో కొద్ది మందికి మాత్రమే శిక్షలు పడవచ్చు. కాని బాధితులు ముందుకు వచ్చి బహిరంగంగా తమ సమస్యను చెప్పుకోవడం వల్ల వారికి అదనంగా ఏ లాభం వుండకపోగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వుంటుంది. డాక్టర్ బ్లాసీ ఫోర్డ్ ఒక బాధ్యత గల పౌరురాలిగా స్త్రీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి అత్యున్నత న్యాయస్థానంలో వుంటే స్త్రీలకున్న హక్కులు హరించిపోగలవని, తనకు సంభవించిన దుర్ఘటనను బహిరంగం చేయడానికి ముందుకు వచ్చింది. అయినా ఇది ప్రితృస్వామిక వ్యవస్థ కనుకు కావినా అత్యున్నత పదవి అందుకున్నాడు కానీ, డాక్టర్ బ్లాసీ ఫోర్డ్ మాత్రం బెదిరింపుల నుంచి రక్షణ కోసం అజ్ఞాతంగానే వుంటోంది. 

స్త్రీలు ప్రపంచ వ్యాప్తంగా రెండవ తరగతి పౌరులుగానే ఉన్నారు. సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందిన పారిశ్రామిక యుగంలో వున్నామని అనుకోవడమే కానీ ఇంకా బానిస వ్యవస్థ తాలుకు విలువలతోనే స్త్రీలను వస్తువులు( ఆబ్జెక్ట్స్) గా చూడడం, కించపరచడం జరుగుతున్నది. ప్రతి మతం స్త్రీలను అవమానిస్తుంది. ప్రతి దేశం స్త్రీని  అసమానతలోనే వుంచుతోంది. అడుగడుగున స్త్రీకి లైంగిక హింసలు ఎదురవుతున్నాయి. అది ఇల్లు కావొచ్చు, బడి కావొచ్చు, గుడి కావొచ్చు.చర్చీ కావొచ్చు, ఆఫీసు కావచ్చు, పొలం కావొచ్చు, అడవి కావొచ్చు, కార్ఖానా కావొచ్చు. రాజకీయ రంగం కావొచ్చు, న్యాయ వ్యవస్థ, మిలిటరీ, పోలీస్ రంగం కావొచ్చు. ఫైనాన్సియల్ రంగం, యూనివర్సిటీలు, క్రీడా శాలలు, వైద్యశాలలు, సినిమా రంగం, సంగీత, నాటకశాలలు,… ఎక్కడ స్త్రీలు వుంటే అక్కడంతా … పసిపాపల నుంచి పండు ముదసలి వరకు… ఏ వయసులో వున్నా ఎప్పుడైనా   ఎక్కడైనా ఎవరైనా ఎమైనా చేయవచ్చు.  ఏ మతం, కులం, వర్గం, రంగు… అన్నీ, అంతటా… ఏదీ మినహాయింపులేదు. స్త్రీని ఒక వస్తువుగా చూసే సంస్క్రతే ఈ వ్యవస్థలో వేళ్ళూనుకొని పోయింది.       

“మీ టూ” ఉద్యమం ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రజాస్వామిక ఉద్యమమని చెప్పవచ్చు.

ప్రజలంటే కేవలం పురుషులు కాదు. స్త్రీలు, పురుషులు కలిసి ప్రజలు.

“మీ టూ” ఉద్యమం ప్రజాస్వామిక విలువల్ని దైనందిన జీవితంతో మమేకం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తింపజేస్తున్నది.

 

 

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

3 comments

  • బాగుంది వ్యాసం…కావినా కు తెలుగు రాదు కాబట్టి సరిపోయింది..లేకపోతే నా !!

  • కావినా ఉదంతం వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజల నిరసనలను పట్టించుకోవడం మానివేశాయని తెలుస్తోంది. దానికి చాలా దేశాలలో ప్రజల ఆలోచన తీరు సంకుచితత్వగా మారి సరైన నాయకులను ఎన్నుకోకపోవడమే. ఇందులో ఏ దేశానికీ మినహాయింపు లేదు.

    • థాంక్స్ జి ఎల్ ఎన్,
      ఈ వారంలో జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో ప్రజలు తమ నిరసనను బాగా ప్రకటించారు. కావినా ఉదంతంతో, “మీ టూ ” ప్రభావం వల్ల స్త్రీలు అధిక సంఖ్యలో ఎన్నికల్లో పోటీ చేయడమే కాక, ఓటింగులో కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని తమ వాళ్లను గెలిపించుకున్నారు. ఇప్పుడు ట్రంప్ కు వణుకు మొదలైంది.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.