బయం లేని చిన్ని జాన్

అనగనగా ఒక పిల్లవాడుండే వాడు. తన పేరే బయం లేని చిన్ని జాన్. ఎందుకంటే తనకసలు బయమే లేదు. తనకు ఏదన్నా బయం లేదు.

చిన్ని జాన్ ఒక సారి దేశాటన చేస్తూ చేస్తూ ఒక పూటకూళ్ళ యింటి వద్దకు వెళ్ళాడు. రాత్రికి అక్కడ వుండొచ్చా అని అడిగాడు. ‘ఇక్కడ గదులు లేవు’ అన్నాడు పూట కూళ్లింటి మనిషి. ‘కాని, ఒక ఇల్లుంది. పేద్ద భవనం. నువ్వు భయపడనంటే అక్కడికి వెళ్లి వుండొచ్చు. అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పనా’ అన్నాడతడు.

‘నేనెందుకు భయపడాలి?’అని అడిగాడు చిన్న జాన్.

‘ఆ భవంతి పేరు చెబితేనే జనాలు వొణికి చస్తారు. ఆ యింట్లోకి వెళ్లిన వాడెవ్వడూ తిరిగి రాలేదు తెల్సా. పుడింగి లెక్క రాత్రి లోపలికి వెళ్లిన వాడు ఇంక బయటికి రాడు. పొద్దున్నే మనుషులు పాడె తయారు చేసుకుని వెళ్లి మోసుకు రావల్సిందే’ అని పూసగుచ్చినట్టు చెప్పాడు పూటకూళ్లింటి మనిషి.

అప్పుడు చిన్ని జాన్ ఏం చేశాడో తెలుసా. ఒక చిన్న బుడ్డి లాంపు, ఒక వైను సీసా, ఒక మాంసం ముక్క మాత్రం తీసుకుని నేరుగా ఆ భవనం లోపలికి వెళ్లిపోయాడు,

అర్ధ రాత్రి, భవనంలో జాన్ మేజాబల్ల ముందు కూర్చుని తింటుండగా పొయ్యి గొట్టం లోంచి ‘దీన్ని కింద పడేయనా?’ అని ఒక గొంతు వినిపించింది.

‘పడెయ్’ అన్నాడు చిన్ని జాన్.

పొయ్యి గొట్టం లోంచి దొర్లుకుంటూ వొచ్చి పడింది ఒక మనిషి కాలు. చిన్ని జాన్ ఒక గ్లాసు వైన్ తాగాడు.

ఆ గొంతు మళ్లీ వినిపించింది, ‘దీన్ని కిందికి వెయ్యనా?’

‘కానియ్’ అన్నాడు చిన్ని జాన్. మనిషి మరో కాలు వొచ్చి పడింది పొయ్యిలో. చిన్ని జాన్ మాంస ముక్క కొంచెం కొరికి నమిలాడు.

‘’దీన్ని కిందికి పడెయ్యనా?’ మళ్లీ అదే గొంతు.

‘పడెయ్’ చిన్ని జాన్.ఈ సారి వొచ్చి పడింది ఒక మనిషి చెయ్యి. చిన్ని జాన్ సన్నగా ఈల వేశాడు.

‘దీన్ని కిందికి పడెయ్యనా?’

‘ఎంచక్కా పడెయ్’ ఈసారి మనిషి మరొక చెయ్యి.

‘దీన్ని కూడా పడెయ్యనా”

‘సరే’. ఈ సారి వొచ్చి పడింది ఒక మొండెం. కాళ్లు, చేతులు వెళ్లి మొండేనికి అతుక్కుకున్నాయి. చిన్ని జాన్ కళ్ళ ముందు తల లేని మనిషి నిలబడ్డాడు.

‘దీన్ని కిందికి పడెయ్యనా’ పొయ్యి గొట్టం లోంచి అదే గొంతు మళ్లీ.

‘పడెయ్’ అన్నాడు చిన్ని జాన్.

పై నుంచి దొర్లుకుంటూ వొచ్చింది మనిషి తల. అది రాగానే ఎగిరి మనిషి మొండెం మీద అతుక్కుంది. ఆ మనిషి… వావ్, అతెత్తు ఆజానుబాహుడు. చిన్ని జాన్ తన చేతిలో గ్లాసు ఎత్తి ‘నీ ఆరోగ్యం కోసం’ అంటూ వైన్ తాగేశాడు.

ఆజానుబాహుడు, ‘ లాంపు తీసుకుని నాతో రా’ అన్నాడు.

చిన్ని జాన్ లాంపు తీసుకున్నాడు గాని, కదల లేదు.

‘నువ్వు ముందు పద’ అన్నాడు ఆజానుబాహుడు.

‘కుదర్దు, నువ్వే ముందు పద’ అన్నాడు చిన్ని జాన్.

‘నీ తరువాత నేను’ ఆజానుబాహుడు ఉరుము ఉరిమినట్టు అరిచాడు.

‘నువ్వు ముందు దారి తియ్’ చిన్ని జాన్ కూడా అరిచాడు.

ఆజానుబాహుడు ముందుకు నడిచాడు. చిన్ని జాన్ లాంపు వెలుగు చూపిస్తూ వెనుక నడిచాడు. అలా వాళ్ళు గది తరువాత గది మొత్తం భవనమంతా తిరిగారు. మెట్ల కింద ఒక చోట చిన్న తలుపుంది.

‘ఆ తలుపు తెరు’ ఆజ్ఞాపించాడు ఆజానుబాహుడు.

‘నువ్వే తెరు’ ఎదురు జవాబిచ్చాడు చిన్ని జాన్.

ఆజానుబాహుడు భుజంతో తోసి తలుపు తెరిచాడు. అక్కడొక శంకు ఆకారం మెట్ల వరుస కనిపించింది.

‘కిందికి దిగు’ ఆజానుబాహుడు దారి చూపించాడు.

‘నీ తరువాతే’ అన్నాడు చిన్ని జాన్.

వాళ్ళు శంకు ఆకారం మెట్ల వరుస మీద దిగి నేలమాలిగ లోనికి వెళ్ళారు. ఆజానుబాహుడు నేల మీద పెద్ద బండ రాయిని చూపించి, ‘దాన్ని పైకెత్తు’ అన్నాడు.

‘దాన్ని నువ్వే యెత్తు’ అన్నాడు చిన్ని జాన్. ఆజానుబాహుడు ఆ బండరాయిని.. అదేదో గులక రాయి అయినట్టు తేలిగ్గా పైకెత్తాడు.

బండ కింద కుండలు, కుండల నిండా బంగారం.

‘ఈ కుండలను పైకి తీసుకురా’ ఆజ్ఞ జారీ చేశాడు ఆజానుబాహుడు.    

‘అవన్నీ నువ్వే పైకి తీసుకు రా” చిన్ని జాన్ తిరుగు జవాబు. ఆజానుబాహుడు వాటిని ఒక్కొక్కటీ పైకి తెచ్చాడు.

వాళ్లిద్దరూ తిరిగి పైన పెద్ద పొయ్యి దగ్గరికి వచ్చాక, ‘చిన్ని జాన్, ఇంక నా మీద మంత్రం పని చెయ్యదు’ అన్నాడు. ఆ మాట అంటూ వుండగానే, తన కాలు ఒకటి ఫట్ మని వూడిపోయి పొయ్యి గొట్టంలో పైకి పాకిపోయింది. ‘ఈ బంగారు కుండల్లో ఒకటి నీది’ అన్నాడు ఆజానుబాహుడు. అతడి ఒక చెయ్యి వూడిపోయి పొయ్యి గొట్టం యెక్కి పోయింది. ‘రెండో బంగారు కుండ.. నువ్వు చనిపోయావనుకుని, నిన్ను మోసుకుపోడానికి పాడె పట్టుకొచ్చిన వాహకులది’. అన్నాడు ఆ మనిషి. అతడి రెండో చెయ్యి కూడా మొదటి దాని లాగే, వూడి, పొయ్యి గొట్టంలో దూరిపోయింది. ‘మూడో బంగారు కుండ నీకెదురయ్యే మొదటి పేద వాడిది’ అన్నాడా మనిషి. అప్పుడు అతడి రెండో కాలు కూడా వూడి పొయ్యి గొట్టంలోకి పోయింది. తను నేల మీద కూర్చుండిపోయాడు. ‘ఈ భవనాన్ని నువ్వే వుంచుకో’ అన్నాడు కూర్చుని. అతడి మొండెం తల నుంచి విడిపోయి పొయ్యి గొట్టంలోకి వెళ్లి పోయింది. ‘ఈ భవనం యజమాని, అతడి పిల్లలందరూ వెళ్లిపోయారిప్పుడు’ అంటూ, తల కూడా పొయ్యిగొట్టంలోకి వెళ్లి మాయమైంది.

తెల్లారింది. వెలుగు వొచ్చీ రాకముందే ‘దేవుడా దయ తల్చు, దేవుడా దయ తల్చు’ అంటూ ఒక పాడె, దాని వాహకులు చిన్ని జాన్ శవం మోసుకెళ్దామని ఇంట్లోకి వొచ్చారు.

నింపాదిగా కిటికీ వద్ద పైపు పీలుస్తూ వాళ్ళకు స్వయంగా చిన్ని జాన్ కనబడ్డాడు,.

బయం లేని చిన్ని జాన్ ఆ తరువాత ఆ బంగారమంతటితో, ఆ భవనంలోనే సంతోషంగా జీవించాడు. ఒక రోజతడు వెనక్కి తిరిగి తన నీడను చూసుకున్నాడు. నీడను చూసుకుని, భయపడి చనిపోయాడు.

***

ఇటాలో కాల్వినో/హెచ్చార్కె

ఇటాలో కాల్వినో (1923 అక్టోబర్ 15- 1985 సెప్టెంబర్ 19): జగత్ ప్రసిద్ధ కథా, నవలా రచయిత. తన పేరూ, ఈ పుస్తకం పేరూ సూచిస్తున్నట్లే ఆయన స్వదేశం ఇటలీ. ఆయన స్వయంగా సేకరించి, తన మాటల్లో తిరిగి చెప్పిన కథల పుస్తకం “ఇటాలియన్ ఫోక్ టేల్స్'.

మాకు తెలిసి, ఆయన సొంత కథలు కొన్ని ‘ఈ మాట' వెబ్ పత్రికలో వెలువడ్డాయి.. ఇవి ఆయన సేకరించి తన చక్కని శైలిలో తిరిగి చెప్పిన ఇటాలియన్ జానపద కథలు. వీటిలోని చదివించే శైలి, ప్రగతి శీలం అబ్బురపరుస్తాయి. ఇక ముందు రస్తా సంచికల్లో ఈ కథలు ఇలాగే వరుసగా...

3 comments

  • :-)) భలే గమ్మత్తుగా వుంది. ఏదో ఒక భయం మనిషిని వదలదా?

  • భలే ఉంది కథ … ఇలాంటి దే మన చందమామలో ఓ కథ చదివాను… అంటే అది కూడా భయం మీదే..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.