‘మర్మ’ సంభాషణ

బాల్యం గుర్రం ఎక్కి

ఊగే పసిదనం పద్యాన్ని

ఆకాశం నదిలో కదిలే

దూదిమబ్బుల చేపపిల్లలను

పట్టుకొని బుట్టలో వెయ్యాలనుకునే అమాయకత్వాన్ని

గాలి ఉయ్యాలలో తూనీగల రెక్కలమీద

ఎగిరే చంచల బాల్యాన్ని

ఉరుకులు పెట్టే ఉడతలతో

చెంగుచెంగున దూకే కుందేళ్ళతో

కబుర్లు చెప్పే చెలికత్తెను

***

ఎర్రగుడ్డను చూచి రెచ్చిపోయిన ఎద్దు

కొమ్ములతో కుమ్మిన పోట్లు

తందూరీ పొయ్యిలో కాలుతున్న

కోడిపిల్ల మంటల జ్వాలను

యోని కుహరాన్ని యుద్ధభూమిని చేసి

పారించిన రక్త నదీ గాయాల్ని

‘అమ్మా’ అని పిలిచి ఎత్తుకోవల్సిన వాడే

అమ్మాయి తనంపై కాటువేసిన హింసా కొలిమిని

రేకులు విచ్చని మొగ్గనైనా

వాడిన పువ్వునైనా నలిపి నాశనం చేసే

కసాయి రాజ్యమిది

సజీవ దేహాల పచ్చి మాంసాన్నే

భక్షించే రాక్షసుల కొలువిది

***

ప్రతి రోజూ ఎక్కడో అక్కడ

ఏదో ఒక మహానగరం సాక్షిగానో

మారుమూల పల్లెటూరు సాక్షిగానో

పశువుల కాపరి మీదో

శిశు దేహ నది పైనో

విశాలాకాశం పందిరి కిందో

నాలుగ్గోడల నలుచదరపు పంజరంలోనో

బహిర్భూమి దారి లోనో

మామయ్యో బాబయ్యో

తాతో నాన్నో

అయిన వాడో కానివాడో

చాక్లెట్ ఇస్తాననో

కుర్ కురే ప్యాకెట్ ఇస్తాననో

ముక్కు పచ్చలారని పసిమొగ్గలపై

అత్యాచారాల మరణశయ్యలు

***

రేటింగులు కట్టే ఛానళ్ళలో

అమ్మకానికి వెలకట్టే వార్తా పత్రికలలో

కొన్ని రోజులు ఇదే సంఘటన పదేపదే

ఆ తర్వాత షరా మామూలే

రూపాయల వ్యాపారంలో మునిగి

మరపు నేర్చిన కాగితాలపై

తడియారిన అక్షరాలవడం

***

ఎంతైనా మేధావులు

వేదాంతులు మనవాళ్ళు

తామరాకు మీద నీటి బొట్లు

దేనికీ చలించని స్థితప్రజ్ఞులు

మందరపు హైమవతి

మందరపు హైమవతి: తొలి తరం ఫెమినిస్ట్ కవయిత్రి. సూర్యుడు తప్పిపోయాడు, నిషిద్దాక్షరి అనే రెండు కవితా సంపుటుల్ని తెచ్చారు. ఫ్రీవర్స్ ఫ్రంట్, సినారె, ఉమ్మడిశెట్టి అవార్డులు పొందారు. ''నీలిగోరింట తెచ్చే ప్రయత్నం లో ఉన్నారు.

5 comments

  • మంచి కవిత. హైమావతి గారి నుండి నవీన శైలీ విన్యాసం

  • మీరు ఈ కవితని విజయవాడలో చదివినప్పుడు వేదిక మీద ముఖం చిట్లిమ్చుకున్న మనుషులని చూసాను , వాస్తవం చేదుగా ఉంటాడని మరోలా మారు అక్కడ రుజువయింది కొత్తగా ఉన్నా పద్యం మరలా మీ వాసనే వేసింది .

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.