మునిగిపోతున్న సౌందర్యం: వెనిస్

ఉత్తర ఇటలీ లోని ఏడ్రియాటిక్ సముద్రం లోని వందకు మించి దీవులున్న  చిన్న నగరం వెనిస్. నగరం చిన్నదే కానీ దాని ప్రత్యేకత అపురూపం. చాలా మంది సాహితీవేత్తలు

” there is no city like Venice”  అంటారు.

” వెనిస్ గురించి మాట్లాడకండి ఎందుకంటే దాని అందాలను వర్ణించడానికి ఏ భాషలోనూ పదాలు లేవు”

“Venice is like eating entire box of chocolates and sweets in one go ” అని అన్నారంటే అందులో అతియోశక్తి లేదని  చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం వెనిస్ చూడాటానికి వచ్చే పర్యాటకుల సంఖ్య రెండు కోట్లు పై చిలుకు. ఆ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వెనిస్ ఎంత అందగా ఉంటుందో .

వెనిస్ గురించి క్లుప్తంగా

పర్యాటక సంస్థలు  ఇటలీ పర్యటన లో రోమ్ ను ప్రధాన ఆకర్షణగా చెప్పుతారు గాని ఉత్తర ప్రాంతం లోని Florence, cinqterr, Modena (స్పోర్ట్స్ కార్లు  ferrari , loombargni తయారీ నగరం) అద్భుతమైన ప్రకృతి అందాలకు కేరాఫ్ చిరునామాలు. గతించిన చరిత్రకు రోమ్ ఒక గొప్ప వైభోవోపేతమైన గుర్తు మాత్రమే. కాని ఇటలీ లోని Tuscan province గా  పిలువబడే ఉత్తర ప్రాంతం పర్యటిస్తే మాత్రం మనం వంద అందమైన ప్రకృతి చిత్రాల మధ్య ఉన్నట్లు ఉంటుంది. ఇక వెనిస్ గురించి చెప్పనవసరమే లేదు. మిగతా ప్రాంతాలయితే పచ్చటి అందాలకు ఆలవాలమైతే  వెనిస్ లో నీటి కాలువలను చూసాక నీరు మన శరీరానికి శక్తీ ఇచ్చే ఒక ఇంధనం మాత్రమే కాదు మన మనస్సు కు ఆహ్లాదాన్ని కలిగించే ఒక liquid nature అని భావిస్తాం .

వెనిస్ ఇటలీ ఉత్తర ప్రాంతం లోని వెనిటియాన్ ప్రాంతానికి రాజధాని. వంద పదిహేడు దీవులున్న నగరం. ఆ నగరం  నిండా వంద శాతం నీటి మీద తేలియాడే భవనాలే. ఒక దీవి నుంచి మరొక దీవికి రహదారులుగాని బాటలు కానీ వుండవు (వంద దీవుల్లో మీకు ఒక్క కారు కానీ బస్సు కానీ మోటార్ బైక్ కానీ కనిపించవు, అంతే కాదు నిషేధం కూడా) దీవులన్ని చిన్న చిన్న కాలి బాటల వంతెనలతోనే కనెక్టయి ఉంటాయి. ఇది కొంత వరకు మెరుగు గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఈ దీవులను కలిపే పెద్ద కాలువ  దారిని Grand Canal అని పిలుస్తారు. Grand canal ప్రతి దీవిని కలుపుతుంది. ఒక్కో దీవి ది ఒక్కో ప్రత్యేకం. కానీ ముఖ్యంగా సెయింట్ మార్క్స్ బసిలికా చర్చి (Saint Marks basilica church) నగిషీలు చెక్కిన గోడల కోసం, బురానో ఐలాండ్ (burano island)ను దాని రంగు రంగుల బహుళల భవనాల కోసం, డోజ్ పాలస్ (Doge palace) గత చరిత్ర గుర్తుగా, మురానో ఐలాండ్ (Murano island ) గ్లాస్ చేతి వస్తువులను తయారుచేసే పరిశ్రమలను చూడటానికి. ఇలా ఒక్కో దీవి కి ఒక్కో ప్రత్యేకత.

కానీ grand canal మధ్యలో నీటి వాహనం (WATER BUS ) లో నిలుచొని ఆ నీటిని , దీవులను ఒకటిగా చూస్తుంటే మాత్రం వంద ఇంద్రధనుస్సులను ముక్కలుముక్కలుగా విరిచి నీళ్లలో వేసినట్లుగా ఉంటుంది. సూర్యాస్తమయాన్ని   సెయింట్ మార్క్స్ చర్చి దగ్గర నుంచి చూస్తుంటే ఆకాశంలో హోలీ పండుగ జరిగినట్లే ఉంటుంది. ఇంత మంది పర్యాటకులు వస్తున్నా నీటిని మురుగు కంపు కొట్టకుండా , నీటి రంగు మారకుండా , చెత్త పేరుకపోకుండా తగిన జాగ్రత్తలే తీసుకొంటున్నారు.

గొండోలా వెనిస్ కే ప్రత్యేకం

గొండోలా పడవ ప్రయాణం వెనిస్ లో ఒక వెయ్యి సంవత్సరాల సంస్కృతి. వెనిస్ కాలువల్లో గొండోలా పడవలు తమదైన  రంగులతో , భిన్నమైన అలంకరణలతో ప్రత్యేకంగా ఉంటాయి.

వారు  వెనిస్ దీవులలో చిన్న చిన్న కాలువలలో మనల్ని సంప్రదాయబద్దంగా   తమ బల్లపరుపు పడవలలో తిప్పుతూ తమ వంశ చరిత్రను/వెనిస్ చరిత్రను పాటల రూపం లో వినిపిస్తుంటారు. గోండోలా ప్రయాణం కొంతమేరకు   ఖర్చుతో కూడుకొన్నప్పటికీ చూడతగ్గది. వెనిస్ లోని గల్లీ గల్లీలో పడవలలో తిప్పుతూ ఆ వీధి చరిత్రలను మనకు చెప్పే విధానంలో ఆ గంట ప్రయాణం చాలా మంది ఒక  అనుభవంగా చెప్పుకొంటారు.

యూరోప్ లోని ప్రతిదేశం లో లాగా ఇక్కడ కూడా భారీగా వున్న చర్చి లు, రాజ భవనాలు కొన్ని దీవులలో  కనిపిస్తాయి, opera houses కూడా కొంచెం ఎక్కువగానే వున్నాయి . డోజ్ పాలస్ , సెయింట్ మార్క్స్ చర్చి లాంటివి ఎన్ని వున్నా మనకు వెనిస్ లో మనల్ని ఆనందపరిచేది మాత్రం అక్కడి water world అనే చెప్పవచ్చు. దాని తరువాత స్థానం ‘gelato ది. gelato అంటే ఇటాలియన్ భాషలో ice cream అని అర్థం. ఇటాలియన్ ice cream లు యూరోప్ వాళ్ళని మాత్రమే  కాదు ప్రపంచంలోని ఏ దేశస్తుల మనుసులనైనా యిట్టె దోచుకొంటాయి. ఇటలీ వెళ్లిన ప్రతి ఒక్కరు తమ తిరుగు ప్రయాణం ఇటాలియన్ ఐస్క్రీమ్ ను, pizza ను మరిచిపోని మెమరీ గానే గుర్తుపెట్టుకొంటారు.

చివరిగా ఒక మాట .

మీరో అమ్మాయిని చూశారు. మీతో పాటు ఆ  అమ్మాయిని చూసిన వాళ్ళందరూ అందం లో అమ్మాయికి సాటి వచ్చే వాళ్ళు ప్రపంచం లో ఎవ్వరు లేరంటున్నారు. ఆమె ను చూడటానికి  ప్రతి రోజు లక్షలాది మంది వస్తున్నారు. అందరూ ఆమె అందాల్ని వేనోళ్ళ పొగడటమే కానీ చూస్తున్న వాళ్లందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఆమెకు మృత్యుఘడియాలు చాలా దగ్గరలో ఉన్నాయని.  చాలా తక్కువ సంవత్సరాలలోనే ఆమె కనుమరుగు కాబోతోందని తెలిస్తే ఎంతో బాధ కలుగుతుంది. కానీ ఇది వాస్తవం. ఇంతసేపు మనం మాట్లాడుకొన్నది అందమైన అమ్మాయి లాంటి వెనిస్ నగరం గురించి. సముద్రం నీటి మట్టం పెరుగుతుండంతో వెనిస్ కూడా  వంద సంవత్సరాల లోపే పూర్తిగా మునిగిపోయే ప్రమాదం వుంది. చాలా పరిశోధనలు దీనిని ఇప్పటికే నిర్దారించాయి. ఈ ప్రమాదాన్ని తప్పించటానికి ప్రభుత్వం చేపట్టిన బిలియన్ డాలర్ల ప్రాజెక్టు పాలకుల అవినీతితో బూజు పడుతోంది. దానికి తోడు అక్కడికి వస్తున్న పర్యాటకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంటే, స్థానికంగా గా నివసించే వారి సంఖ్య క్రమక్రమంగా తరిగిపోతోంది. ఓ నాడు ఒకటిన్నర లక్ష వున్న జనాభా ప్రస్తుతం యాభైవేలు.  రాబోయే రోజులలో ఇంకా తగ్గే ప్రమాదం వుంది. దానికి ప్రధాన కారణం అక్కడి కి వెల్లువలా వస్తున్న పర్యాటకులే. విపరీతమైన పర్యాటకులతో దీవులలోని ఇళ్లన్నీ హోటల్స్ గా, రెస్టారెంట్ లు గా మారిపోతున్నాయి. అద్దెకు ఇల్లు దొరకడం గగనమైపోవడంతో అక్కడి ప్రాంతీయులు వేరే మార్గం లేక అక్కడికి దగ్గరలో వున్నా మెస్ట్రీ పట్టణానికి మకాం లు మార్చుకొంటున్నారు.

ప్రతి అందం వెనుక ఒక విషాదం ఉంటుందో లేదో తెలీదు కానీ వెనిస్ అందాల ముందు మనకు ఈ విషాద చిత్రం ఆవిష్కృతమవుతుంది.

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

Add comment


Type Comments in Indian languages (Press Ctrl+g to toggle between English and Telugu OR just Click on the letter)

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.