సీమ క‌క్ష‌ల్లో కాసులేరుకునే యాపారులు!

 

అదేందో గాని లోకం చాలా విచిత్ర‌మైంది. ఫ్యాక్ష‌నిస్టులంటే జ‌నం భ‌య‌ప‌డుతారు. ఇంత వ‌ర‌కే బాగానే ఉంది. మ‌రి ఇదే ఫ్యాక్ష‌న్ చేసే క్యారెక్ట‌ర్ మాత్రం సినిమాల్లో హీరో అవుతాడు. ఎంత మందిని చంపితే అంత పాలెగాడ‌ని జ‌నం ఒక‌టేమైన ఈలలు, చ‌ప్ప‌ట్లు, అరుపుల‌తో ప్రోత్స‌హిస్తూ అభిమానిస్తారు. ఏందీ తేడా? ఎంత ఆలోచించి…చించినా నా మొద్దు బుర్ర‌కు అర్థం కావ‌డం లేదు. హిట్స్ లేక కేరీర్‌పై కారుచీక‌ట్లు క‌మ్ముకున్న‌ప్పుడు ప్ర‌తోడికి …అదిగ‌దిగో ఫ్యాక్ష‌న్ క‌థ గుర్తుకొస్తుంది. హీరోకు హిట్, ద‌ర్శ‌కుడికి పేరుప్ర‌తిష్ట‌లు, నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం. అబ్బ‌…సినిమాలో ఫ్యాక్ష‌నిస్టులంటే మ‌నసే లేని రాతిమ‌నుషుల‌ని, ప్రేమాభిమానాల‌కు నోచుకోని పాషాణ హృద‌యాల‌ని చూపినా…వాటిని ఆనందంగా చూస్తూ స‌క్సెస్ చేస్తున్న సీమ ప్రాంత‌వాసులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి.

ఈ సంద‌ర్భంగా క‌డ‌ప జిల్లాలో క‌థ‌క‌థ‌లుగా చెప్పుకునే ఓ విష‌యాన్ని మీకు చెబుతాను. క‌మ్ము బ్ర‌ద‌ర్స్ అని బుర్ర‌క‌థ పితామ‌హుల‌ను క‌డ‌ప జిల్లా క‌న్న‌ది. వారిది రాజంపేట ప్రాంతం. వారు ముస్లింలు. సీపీఐలో తుదిశ్వాస వ‌ర‌కూ ఉంటూ ప్ర‌జా క‌ళాకారులుగా జీవించారు. ఒక‌రోజు ఒక ఫ్యాక్ష‌న్ గ్రామానికి బుర్ర చెప్పేందుకు వారు వెళ్లారు. ఆ గ్రామ భూస్వామి ఎంత దుర్మార్గుడో క‌ళారూపంలో వారు చెప్పారు. బుర్ర‌క‌థ ముగిసిన త‌ర్వాత ఆ భూస్వామి మ‌నుషులు వ‌చ్చి వారిని త‌మ య‌జ‌మాని పిలుస్తున్నాడంటూ తీసుకెళ్లారు. త‌మ‌నేం చేస్తాడో అని క‌మ్ము బ్ర‌ద‌ర్స్ కాస్త భ‌యం భ‌యంతో ఆ భూస్వామి ద‌గ్గ‌రికి వెళ్లార‌ట‌. అప్పుడా భూస్వామి క‌మ్ము బ్ర‌ద‌ర్స్‌కు విందు భోజ‌నాలు ఏర్పాటు చేయ‌డంతో పాటు ఘ‌నంగా స‌న్మానించాడ‌ట‌. అయ్యా మీరు నా గురించి చెప్పింత‌ర్వాత చుట్టుప‌క్క‌ల ప‌ల్లెల్లో ఇంకే నాకొడుకు నామీద తిర‌గ‌బ‌డేందుకు సాహ‌సించ‌డ‌ని, ఈ మేలు చేసిన మిమ్మ‌ల్ను జీవితంలో ఎన్న‌డూ మ‌ర‌చిపోలేన‌ని కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నాడ‌ట‌. ఆశ్చ‌ర్య‌పోవ‌డం క‌మ్ము బ్ర‌ద‌ర్స్ వంతైంద‌ట‌.

ఇప్పుడు రాయ‌ల‌సీమ ప్రాంతంపై సినీ పెద్ద‌లు ఓ కుట్ర ప్ర‌కారం సాంస్కృతిక దాడికి పాల్ప‌డుతున్నారు. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్‌పై సినిమాలు తీయ‌డం వారికి వినోదం కావ‌చ్చు. కాని ఈ ప్రాంతానికో విషాదం. ఒక ప్రాంతం వారు తాము మంచి వారిగా చెలామ‌ణి అయ్యేందుకు త‌మ‌పై ఒక ప‌థ‌కం ప్ర‌కారం చేస్తున్న దాడిని ప‌సిగ‌ట్టి నిర‌స‌న గ‌ళాల‌ను అప్పుడ‌ప్పుడూ వినిపిస్తూనే ఉన్నారు. కాని ఈ గ‌ళాలు, క‌లాలు, క‌ళాకారులు వారి ఆగ‌డాల‌ను అడ్డుకోలేక పోతున్నాయి. మ‌రికొంత మంది పైన ఉద‌హ‌రించిన‌ట్టు…కానివ్వండి, క‌నీసం భ‌క్తి ఎటూ లేదు, భ‌యంతోనైనా ప‌బ్బం గ‌డుపుకోవ‌చ్చ‌నే భ్ర‌మ‌లో మౌనం పాటించారు.

ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తాను. అర‌వింద‌స‌మేత‌…వీర‌రాఘ‌వ సినిమా  త‌మ‌ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా ఉందంటూ రాయ‌ల‌సీమలోని వివిధ ప్ర‌జాసంఘాలు, క‌ళాకారులు నిర‌స‌న గ‌ళాలు వినిపించారు. హైద‌రాబాద్ ప్రెస్‌క్ల‌బ్ వేదిక‌గా సీమ యువ‌కులు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్న సంద‌ర్భంలో…కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు సినిమాను సినిమాగానే చూడాల‌ని సూచ‌న‌తో కూడిన హిత‌వు ప‌లికారు. అవును మీడియా ప్ర‌తినిధులు చెప్పింది నిజ‌మే. అయితే సినిమాను సినిమాగా తీస్తే ఎలాంటి ఇబ్బందులు, ఆందోళ‌న‌లు ఉండ‌వు. రాయ‌ల‌సీమ‌లో ఫ్యాక్ష‌న్ అనేది గ‌త చ‌రిత్ర‌గా చెప్పుకుంటున్న‌, రాసుకుంటున్న ప‌రిస్థితుల్లో మ‌నం బ‌తుకుతున్నాం. కానీ అర‌వింద స‌మేత‌…వీర‌రాఘ‌వ సినిమా  క‌డ‌ప జిల్లా వీర‌పునాయునిప‌ల్లె మండ‌ల ప‌రిధిలోని కొమ్మ‌ద్ది అనే గ్రామ కేంద్రంగా న‌డుస్తుంది. మాది అదే మండ‌ల ప‌రిధిలోని ఉరుటూరు అనే గ్రామం. మా ఊరికి కొమ్మ‌ద్ది స‌రిగ్గా ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలో నాకు స్నేహితులున్నారు. ఆ ఊరిలో 1989 సంవ‌త్స‌రం నాటికి హ‌త్య‌లు, ప్ర‌తీకార హ‌త్య‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ప్ర‌స్తుతం ఆ గ్రామ‌స్తులకు జ్ఞానోద‌యమై ఫ్యాక్ష‌న్‌కు సుదూరంలో మ‌న‌శ్శాంతిగా జీవ‌నం సాగిస్తున్నారు.

అర‌వింద స‌మేత…సినిమా విడుద‌లైన త‌ర్వాత ఆ గ్రామ ఫ్యాక్ష‌న్ చ‌రిత్ర గురించి తండ్రిని పోగొట్టుకున్న మిత్రుడితో లోతుగా చ‌ర్చించాను. బ‌సిరెడ్డిప‌ల్లె, కొమ్మ‌ద్ది గ్రామాల‌ను క‌లుపుకుని కొమ్మ‌ద్ది పంచాయ‌తీగా ఏర్ప‌డింది. ఆ పంచాయ‌తీకి 1960లో మొట్ట‌మొద‌ట సారిగా ఎన్నిక‌లు జ‌రిగాయి. అప్ప‌ట్లో బ‌సిరెడ్డిప‌ల్లెకు చెందిన భూస్వామి మునిరెడ్డిని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఉప‌స‌ర్పంచ్ ఎన్నిక విష‌యంలో ఆయ‌న‌తో క‌మ్యూనిస్టుల‌కు విభేదాలు వ‌చ్చాయి. వారి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు చినికిచినికి గాలివాన‌గా మారి…మునిరెడ్డిని అంత‌మొందించే వ‌ర‌కు ప‌రిస్థితులు దారి తీశాయి. అయితే మునిరెడ్డి అక్క ప్ర‌తీకారానికి పోకుండా త‌మ్ముడి కుమారుడిని డాక్ట‌ర్‌గా చ‌దివించింది. ఇప్పుడు త‌మింట్లో తొమ్మిది మంది డాక్ట‌ర్లు ఉన్నార‌ని, అప్ప‌ట్లో త‌మ్ముడి హ‌త్య‌కు ప్ర‌తీకార‌మ‌ని ర‌గిలిపోయి ఉంటే ….త‌మ కుటుంబం బ‌జారున ప‌డి ఉండేద‌ని ఆమె చెబుతారు. ఇప్పుడా తొమ్మిది మంది డాక్ట‌ర్లు దేశ‌విదేశాల్లో ఉంటూ సుఖ‌శాంతుల‌తో జీవ‌నం సాగిస్తున్నారు.

ఇప్పుడు అర‌వింద స‌మేత  విష‌యానికి వ‌స్తే సినిమా ప్రారంభ‌మే హింస‌తో మొద‌ల‌వుతుంది. వీర‌రాఘ‌వ‌రెడ్డి త‌న తండ్రితో క‌ల‌సి ఇంటికొస్తుంటే శ‌త్రువులు కాపు కాచి వంతెన వ‌ద్ద బాంబులు పేల్చుతారు. హీరో వీర‌రాఘ‌వ (జూనియ‌ర్ ఎన్టీఆర్‌) తండ్రిని కాల్చి ప‌డేస్తారు. ఈ సంద‌ర్భంగా ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు కోల్పోతారు. అలాగే మ‌రికొంత మంది చేతులుకాళ్ల‌ను పోగొట్టుకుంటారు. రాయ‌ల‌సీమ‌న్నా, మ‌రీ ముఖ్యంగా క‌డ‌ప అంటే బాంబుల‌కు, అమాన‌వీయ‌త‌కు ప్ర‌తీక‌గా సినిమాలు తీయ‌డం ఫ్యాష‌నైంది. ఇది ఫ్యాక్ష‌నిస్టుల అరాచ‌కం కంటే వంద‌ల రెట్లు ప్ర‌మాద‌క‌ర‌మైంది.

క‌డ‌ప అంటే బాంబు కాదు…అణుబాంబు కంటే శ‌క్తివంత‌మైన మేధోశ‌క్తిని, ప్ర‌కృతి సంప‌ద‌ను విరివిగా క‌లిగి ఉన్న ప్రాంతం. ప్ర‌పంచ భ‌విష్య‌త్‌ను ఎన్నో సంవ‌త్స‌రాల ముందే అంచ‌నా వేసి లోకానికి చాటి చెప్పిన వీర‌బ్ర‌హ్మం, ఆధ్యాత్మిక విప్ల‌వ‌కారుడు అన్న‌మాచార్యుడు, చిన్నిచిన్న ప‌దాల‌తో జీవిత స‌త్యాల‌ను ఆవిష్క‌రించిన వేమ‌న‌,  సాహిత్య విమ‌ర్శ‌లో రారాజు రాచ‌మ‌ల్లు రామ‌చంద్రారెడ్డిల‌కు జ‌న్మ‌నిచ్చిన పుణ్య‌భూమి ఇది. నాలుగు ద‌ఫాలు క‌డ‌ప ఎంపీగా క‌మ్యూనిస్టు నేత ఎద్దుల ఈశ్వ‌ర‌రెడ్డిని గెలిపించి దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌ల‌కు పంపిన సంస్కారం క‌డ‌ప జిల్లాది. అంతే కాదు ఆణిముత్యాల్లాంటి పాతాళ‌భైర‌వి, మిస్స‌మ్మ‌, గుణ‌సుంద‌రి, మాయాబ‌జార్‌, గుండ‌మ్మ‌క‌థ త‌దిత‌ర ప్ర‌సిద్ధ చిత్రాలను తీయ‌డంలో క‌డ‌ప జిల్లాకు చెందిన బి.నాగిరెడ్డి పాత్ర చిర‌స్మ‌ర‌ణీయం. సినిమాను సినిమాగా చూడాల‌ని చెప్పే పెద్ద మ‌నుషులు….ముందుగా సినిమాను ఎలా తీయాలో క‌డ‌ప బిడ్డ క‌ళా హృద‌యం నుంచి వెలువ‌డిన సినిమాల‌ను చూసి నేర్చుకుంటే మంచిది.

అర‌వింద స‌మేత….వీర‌రాఘ‌వ సినిమాలో “30 ఏళ్ల‌నాడు మీతాత‌ కత్తి పట్నాడంటే అది అవసరం. అదే క‌త్తి మీ నాయ‌న ఎత్తినాడంటే అది వార‌స‌త్వం. అదే క‌త్తి నువ్వు దూసినావంటే అది ల‌క్ష‌ణం” అని మ‌న‌వ‌డైన హీరోతో జేజి చెబుతుంది. కొన్ని ద‌శాబ్దాలుగా రాయ‌ల‌సీమ చుక్క నీటి బొట్టుకు నోచుకోక అల్లాడుతోంది. పంట‌లు పండ‌క రైతన్న‌లు అప్పుల పాల‌వుతూ మృత్యువును కౌగిలించుకుంటున్న ద‌య‌నీయ స్థితి. వంద‌ల ఏళ్ల‌నాడు మా తాత‌లు, అబ్బ‌లు క‌రవుతో అల్లాడారంటే అది అజ్ఞాన‌మా? అదే క‌ర‌వుబారిన మా నాయ‌న గార్లు ప‌డినారంటే చేతగానిత‌న‌మా? అదే క‌ర‌వు ర‌క్క‌సి కోర‌ల‌కు చిక్కి ఇప్పుడు మేము విల‌విల‌లాడుతున్నామంటే …అది శాప‌మా? ఇందులో ఏది నిజ‌మో శ్రీ‌మాన్ ద‌ర్శ‌క‌ర‌త్న త్రివిక్ర‌మ్ గారే సెల‌వివ్వాలి. ఇప్పుడు మా స‌మ‌స్య‌ల్లా నీళ్లు నీళ్లు నీళ్లు. మా ఆకాంక్ష‌, అవ‌స‌రం నీళ్లే.

వ‌య‌లెన్స్ అనేది రాయ‌ల‌సీమ‌ డీఎన్ఏలో ఉందంటూ ఓ పాత్ర ద్వారా ద‌ర్శ‌కుడు చెప్పిస్తాడు. వ‌య‌లెన్స్ విష‌యాన్ని త్రివిక్ర‌మ్ విజ్ఞ‌త‌కే విడిచిపెడుతూ…అవును మా క‌ర్నూలు జిల్లాలో పుట్టిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి మొట్ట మొద‌టిసారిగా, సిఫాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీష్ నిరంకుశ ప‌రిపాల‌న‌పై తిరుగుబాటు బావుటా ఎగుర వేసి నిద్ర‌లేని రాత్రుల‌ను మిగిల్చారు. చివ‌రికి ఉరికంభాన్ని ముద్దాడి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి వార‌సులుగా రాయ‌ల‌సీమ వాసులు పౌరుషాన్ని, ధిక్కార స్వ‌భావాన్ని ఆయ‌న్నుంచి స్ఫూర్తిగా పొందారు.

అంతెందుకు ఈ సినిమాకు రెండు పాట‌లు, క‌డ‌ప యాస‌ను రాసిన పెంచ‌ల్‌దాస్ గురించి త్రివిక్ర‌మ్ అన్న మాట‌ల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిద్దాం. “నేను సీమ‌వాళ్ల‌ను చాలా మందిని క‌లిశా. వాళ్లు రాయ‌ల‌సీమ నుంచి వ‌చ్చారు. కానీ వాళ్ల‌లో రాయ‌ల‌సీమ లేదు, పెంచ‌ల్‌దాస్ రాయ‌ల‌సీమ‌లో ఉన్నాడు. ఆయ‌న‌లో రాయ‌ల‌సీమ ఉంది” అని త్రివిక్ర‌మ్ అన్నాడు. మ‌రి పెంచ‌ల్‌దాస్‌ను చూసైనా రాయ‌ల‌సీమ వాసులు ఎలా ఉంటారో త్రివిక్ర‌మ్‌కు అర్థ‌మై ఉంటుంది. పెంచ‌ల్‌దాస్ నోట్లో నాలుక లేని మ‌నిషి. పాట పాడ‌టం త‌ప్ప మ‌రే జీవితం తెలియ‌ని అమాయ‌క జీవి. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే స్వాతిముత్యం సినిమాలో క‌మ‌ల‌హాస‌న్ లాంటివాడు.  అంద‌రూ పెంచ‌ల్‌దాసు లాంటి సున్నిత మ‌న‌స్కులు ఉంటార‌ని చెప్ప‌ను గానీ, సినిమాలో చూపించినంత క్రూరంగా ఉండ‌ర‌ని నేను చెప్ప‌డం కాదు….క్రైం రికార్డులే చెబుతున్నాయి. రాయ‌లసీమ‌లో లేని క‌క్ష‌ల‌ను ఉన్న‌ట్టు చూపుతూ , జ‌నాన్ని భ‌య‌పెడుతూ కాసుల‌ను ఏరుకోవ‌డం ఒక్క సినిమా వాళ్ల‌కే చెల్లు.

రాయ‌ల‌సీమ వాసుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రుస్తూ సినిమాలు తీయ‌డం ఎప్ప‌టి నుంచో అన‌వాయితీగా వ‌స్తోంది. అర‌వింద స‌మేత‌…సినిమాతో ఎండ్ అవుతుంద‌నే న‌మ్మ‌కం కూడా లేదు. చివ‌రగా సినిమా ఆఖ‌రులో పెంచ‌ల్‌దాస్ రాసిన “ఊరికి ఉత్త‌రాన దారీకి ద‌క్షిణాన నీ పెనిమిటి కూలినాడ‌మ్మా…రెడ్డెమ్మ త‌ల్లి. చ‌క్కానైన పెద్దా రెడ్డెమ్మా. న‌ల్లారేగ‌డి నేల‌లోన‌, ఎర్రాజొన్న చేల‌ల్లోన. నీ పెనిమిటి కాలినాడ‌మ్మారెడ్డ‌మ్మా త‌ల్లి. గుండెల‌వ‌సి పోయె క‌ద‌మ్మా” అంటూ భ‌ర్త హ‌త్య‌కు గుర‌య్యాడ‌నే విషాద‌క‌ర స‌మాచారాన్ని ఎంతో ఆర్ధ‌త‌తో చెబుతాడు.

రాయ‌ల‌సీమ‌కు ఉత్త‌రాన దారీకి ద‌క్షిణాన ఫ్యాక్ష‌న్ కూలింద‌మ్మా…చిత్ర‌క‌ళామ త‌ల్లి. చ‌క్కానైన పెద్దా సినిమా అమ్మా. న‌ల్లారేగ‌డి నేల‌లోన‌, ఎర్రాజొన్న చేల‌ల్లోన‌. ఆ ఫ్యాక్ష‌న్ భూతం కాలిపోయింద‌మ్మా సినిమా త‌ల్లి. గుండెల‌వ‌సిపోయెద‌మ్మా…మ‌రే క‌థ‌లు లేవ‌ని అని సీమ బిడ్డ‌లం మాదైన పాట‌ను పాడాల్సి వ‌స్తుంద‌ని కుహ‌నా ద‌ర్శ‌కుల‌ను హెచ్చ‌రిస్తూ….

సొదుం రమణా రెడ్డి

సొదుం ర‌మ‌ణారెడ్డి:  స్వస్థలం క‌డ‌ప జిల్లా వీర‌పునాయునిప‌ల్లె మండలం ఉరటూరు గ్రామం. జ‌ర్న‌లిస్టుగా 17 ఏళ్ల అనుభ‌వం. రాయ‌ల‌సీమ‌కు సాగు, తాగునీటిని సాధించే మ‌హ‌త్త‌ర కార్యానికి చాతనైన సాయం చేయాల‌ని ఆకాంక్ష.

5 comments

 • చక్కనైన,నిజాయితీతో కూడిన..వివరణాత్మక,ఆలోచనాత్మక,విశ్లేషణ.. నేను చదివిన అన్ని సమీక్షలు కంటే ది బెస్ట్ ఇది..రచయితకు అభినందనలు

 • తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, మండ్ల సుబ్బారెడ్డి ఎందరో త్యాగ జీవులను కన్న గడ్డ రాయలసీమ. సీమ డబ్బు సంచు లన్నా అలాంటి వారి గురించి సినిమా లు తీస్తే ఎంత బాగుండు.

 • వారి వ్యక్తిగత అవసరాలకు ..స్వార్థంతో కూడిన గొడవలు..హత్యలు ప్రతి ప్రాంతంలో జరుగుతాయి వాటికి ఫ్యాక్షన్ అని పేరుపెట్టి రాయలసీమ వాసులకు అదేదో వృత్తి ఐనట్లు కించపరుస్తూ ఇలా ..ఎక్కడలేవు చెప్పండి.పొలం గట్లు.. కల్లు పాకలు.. కోడిపందేళ్లు..పేకాటలు ..అక్రమ సంబంధం.. చివరిగా రాజకీయ నాయకులు వాటిని పెంచి పోషిస్తున్నారు.ఇవి ఏప్రాంతంలో లేవో చెప్పండి.ఒక రాయలసీమ ప్రాంతానికి మాత్రమే ఆపాదించడం ఎంతవరకు సమంజసం

 • నా యాబై ఏళ్ళ జీవితంలో పుట్టిన కడప జిల్లాలో 21 సంవత్సరాలు ఉన్నా. విత్తనాల కంపెనీలలో దాదాపు 25 సంవత్సరాలు ఎక్కడెక్కడో ,ఎన్నో రాష్ట్రాల్లో పనిచేసా.
  కడప యాస కోసం దప్పికగొంటా ఉంటా ఎప్పుడూ
  వెంపల్లి దగ్గర అయ్యవారిపల్లి నా స్వగ్రామం
  సంధ్యాల పొద్దు కావస్తా ఉంది జీవితానికి,
  అందుకోసమే ఈ మాండలికం కోసం కర్నూలును ఎంచుకున్నా ఇప్పుడు.
  పులిగీతం అంటే నాకు ఇష్టం మాపటేల పొద్దుకు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.