తాగి ఊయలలూగుతాడు
ఊగి నేలపై పొర్లుతాడు
వాడికి పగలూ రాత్రీ తేడా లేదు
ఆమెకు మనసు మనసులో ఉండదు
ఫోన్ చేస్తుంది
మాట్లాడేది వాడు కాదు
వాడి ఆనుపానులు ఎవరో చెబుతారు
ఆమె బలవంతాన అలల్ని కంట్లోనే నిలిపి
అతడి కోసం వెళ్తుంది
అతడు స్పృహతెలీకుండా పడివుంటాడు
ఉచ్చతో ప్యాంటు తడిసి మట్టి అంటి
అసహ్యంగా వాసనేస్తుంటాడు
స్పృహలో లేని అతడ్ని
అతి కష్టమ్మీద లేపుతుంది
అతడి చేయి తన భుజమ్మీద వేసుకొని
అతడి నడుంచుట్టూ చేయివేసి
నవ్వుతున్న ఎన్నో చూపుల్ని
సానుభూతి చూపుతున్న ఇంకెన్నో ముఖాల్ని
తప్పించుకోడానికి గబగబా అడుగులేస్తుంది
ఆమె చేతుల్లో బలం తక్కువ
అతడి బరువును మోయడం వాటికి మహా కష్టం
పంటి బిగువున బాధని నొక్కిపెట్టి
ప్రేమించిన పాపానికి అతడిని మోస్తుంది
ఒళ్లు గుల్ల చేసుకొని అతడిని కొడుకల్లే సాకుతుంది
అతడు ఆమె బలహీనత
ఆమె అతడి బలం
తాగొచ్చిన ప్రతిసారీ
అతడికి ఆమె గొడ్డులా కనిపిస్తుంటుంది
ఇకనైనా తన జీవితాన్ని తన చేతుల్లోకి
తీసుకోవాలని అడుగెయ్యబోతుంది
తాగి తాగి అలసిసొలసిన అతడి మొహంలో
ఏం కనిపిస్తుందో
అడుగు ఆగిపోతుంది
రేపటికి మళ్లీ అదే సన్నివేశం కోసం
ఈ రాత్రికి నిద్రపోకుండా కళ్లు కాయలు చేసుకుంటుంది
జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది
లెక్క ఎక్కడో తప్పుతున్నట్లు ఉంటుంది

అతి చిన్న పదాల్లో వాస్తవ చిత్రణ ఎంత బాగా చేశారు సర్. దాదాపు ప్రతి ఇంట్లో కనబడే దృశ్యానికి అక్షరీకరణ.
థాంక్యూ ప్రగతి గారూ..
మంచి కవిత…అయితే ఇది ఇంతేనా..దీనికి విరుగుడు లేదా …ఒక రెండు వాక్యాలు చెబితే బాగుండు….
థాన్క్యూ శ్రీనివాస్. ఈ కవిత లక్ష్యం తాగుబోతు మగాడితో స్త్రీ పడే వేదనను, ఆ మూడ్ ను ప్రదర్శించడమే. విరుగుడు అనేది అందరికీ తెలిసిందే కదా. ఎంత తాగుబోతు అయినా ఆ మగాడ్ని ఆమె ప్రేమిస్తోందనీ, అందుకే క్షమించేస్తున్నదనీ అన్యాపదేశంగా చేప్పాను. అతను మారడు, ఆమె వదిలెయ్యలేదు. ఆ స్థితి కవితలో ప్రతిఫలించిందనే అనుకుంటున్నా.
వాస్తవ మే.
ఎంతో మంది తల్లులు అల్లాడుతున్నారు
అందుకే సార్, ఈ కవిత. ధన్యవాదాలు.
మద్య భారత తాన తందాన !
దేనికి కరువైనా దానికి మాత్రం కరువు ఉండదు.
మంచి కవిత సర్. ముఖ్యంగా ఎండింగ్ బాగుంది.
థాంక్స్ మహమూద్ గారూ
చాలా బాగుంది సార్.వాస్తవిక మైన సందర్భాన్ని కవిత్వంతో కట్టిపడేశారు.అభినందనలు .ఈ వెబ్ పత్రిక మీవల్ల తెలుసుకోగలిగినందుకు మీకు ధన్యవాదాలు సార్
థాంక్యూ. కళ్ల ముందు కనిపించిన, విన్న ఘటనలే ఈ కవితకు ప్రేరణ.
బావుంది దుఃఖం పెళ్ళగించి, ఇంకా ఏవో కొన్ని నెత్తుటి కన్నీళ్లు కంటి రెప్పలు దాటవు.
ఏదైనా ఓ రోజు
ఆమె ఓ దుంగ అందుకోవచ్చు. ఈ ప్రేమే అడ్డుపడకపోతే,
బావుంది సర్.
ఆ దుంగ అందుతుందనే నమ్మకం ఉంది రవి గారూ.. థాంక్యూ.
నిజాలు ఇలా మాట్లాడతాయి మీ పోయం చాలా బాగుంది సార్ , మరింత కొంచం బిగుతుగా కూడా రాయొచ్చు
కవితలో బిగువు ఉందా, లేదా అనే దానిపై నేను దృష్టి పెట్టలేదు. ఒక భావోద్వేగం ఊపేసినప్పుడు పదంటే పది నిమిషాల్లో రాసి పంపిన కవిత. మీకు నచ్చినందుకు సంతోషం.
ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా కవిత్వమే యజ్ఞ మూర్తి గారు,కవిత బాగుంది సార్
ధన్యవాదాలు గోపాలయ్య గారూ..
Good one Murthy…
వీడలేని బంధం వీడిపోని అనుబంధం. క్షమా గుణం స్త్రీల ఆభరణo. Expecting more.
థాన్క్యూ
బాగుంది. డిఫరెంట్ గ ప్రెసెంట్ చేశారు. అభినందనలు
ధన్యవాదాలు సార్.