అబద్ధం

ఏ దేశమేగినా ఎందు కాలిడినా

ఒకే రాజకీయం, ఒకే అబద్దం.

వొళ్లు అటు వూపి ఇటు వూపి, పెదిమల్ని బూరాల్లా చుట్టి ఒక నాయకుడు…

జస్ట్ నిన్న తను నిస్సందేహంగా నుడివిన మాట అసలు ఎప్పుడూ అనలేదంటాడు మర్నాడు.

ఆయన పేరు ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంపు.

మరో సందర్భం లో ఆయన నరేంద్ర మోడీ లేదా చంద్రబాబు నాయుడు కావొచ్చు.

అబద్ధం విశ్వరూపి.

ప్యాటర్న్స్ లో పోలికలు స్పష్టం.

ఇది అమెరికాలో ట్రంపు గారి రాజకీయం కావొచ్చు.

ఇండియాలో బ్యాంకు నోట్ల గందరగోళంతో నల్లడబ్బు వెలికి తీసే ‘మోళీ’యం కావొచ్చు.

లేదా కేరళలో జనానికింకేం పని లేనట్టు ఆడలేడీసు ఆయ్యప్ప గుడికి వెళ్ళ గూడదని కొందరు, వెళ్ళాలని కొందరు… కోర్టు తీర్పు చుట్టూ చేస్తున్న వ్యర్థ చర్చ, ఆ చర్చను వాడుకుంటున్న రాజకీయం కావొచ్చు.

ఒకే అబద్దం చుట్టూ గిర గిర గోల్ గింగిర గోల్. ఏదో ఒక అబద్ధం చుట్టూ.

ఒక సారి కాస్త మామూలుగా, మరో సారి క్రూరంగా. డిగ్రీ అఫ్ డిఫరెన్స్.

ప్రపంచం నిజం లోంచి ఫాసిజం లోనికి పరుగు తీస్తోంది. ఎవరు సంఘం నెత్తికెక్కి ఆడుతారనేది పరుగుల పోటీకి ఇన్సెంటివ్. అందుకోసం, ఎవ్వరే గతి సిగ్గు మాలినా ఫరవాలేదెవరికీ.

మీరు విన్నారో లేదో, తెలుగు వాళ్ళు వినుండరు. ఇదేమంత పెద్ద ఇస్యూ అనిపించదు. అయ్యప్ప గుడీ ఆడాళ్ళూ మాదిరిగానే ఇదొక ‘మామూలు’ సంగతి.

అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రం సెనెటర్ ఎలిజబెత్ వారెన్… తను చెప్పుకుంటున్నట్లు ఆమెలో ఆదివాసి తెగ, చెరోకీ మూలాలు లేవని, ఉన్నట్లు నిరూపిస్తే ‘ఆమె కోరిన ఛారిటీ కి మిలియన్ డాలర్లు యిస్తాన’ని ట్రంపు సారు జబర్దస్తీ పందెం కాశాడు, ఎప్పట్లాగే వొళ్ళు వూపి, పెదిమల్ని బూరాల్లా చుట్టి.

ఈ వార్త వూరక అచ్చులో రిపోర్టయిన వార్త కాదు.

టీ వీలో పైన చెప్పిన హావభాలతో సహా ట్రంపు వాక్కులను అమెరికాలో అందరూ చూశారు.

ఆ పిచ్చి సెనెటరమ్మ దాన్ని సీరియస్ గా తీసుకుని డీ ఎన్ ఏ టెస్టులూ అవీ చేయించుకుని ఆ డాక్టర్లతో చెప్పించింది తనలో  చెరోకీ మూలాలు వున్నాయని.

మరునాడు విలేఖర్లు సారును ఆడిగారు, ‘ట్రంపూ ట్రంపూ ఇప్పుడేమంటావు’, మిలియన్ డాలర్లు ఛారిటీకి ఇస్తావా అని.

అప్పుడాయన అదే వొళ్ళు వూపి, అవే పెదిమల బూరాలతో హేళనగా నవ్వేసి… ‘ఆ మాట నేను చెప్పనేలేదు, మీరు సరిగ్గా చదవలేదు (యు డింట్ రీడ్… )’ అనేసి మరో ప్రశ్నకు వీల్లేకుండా నెత్తి మీద గొడుగు విసురుగా తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళడం చూస్తే… ఇక మన తెలుగు వాళ్ళెవరూ ఎస్వీ రంగారావుని గొప్ప నటుడని అనరు.

ఉంకో గాథ కూడా చెప్పాలి. ఇది కొంచెం హార్రర్. గుండె జబ్బులున్న వాళ్ళు చదవకండి.

సౌదీ అరేబియా అని ఒక చాల ధనిక ఎడారి దేశం వుంది. ఆ దేశానికి చాల దేశాల్లో వున్నట్లే, పక్క దేశం టర్కీ లో కూడా రాయబార కార్యాలయం వుంది.

అమెరికా లోని ‘వాషింగ్టన్ పోస్ట్’ స్పెషల్ కరెస్పాండెంట్స్ లో ఒకరు జమాల్ ఖషోగ్గీ. ఈయన ఒరిజినల్ గా సౌదీ పౌరుడు. చాల అంతర్జారతీయ పత్రికల్లో పని చేసి, పలు దేశాల పైస్థాయి నాయకుల వద్ద చనువు వున్న అనుభవజ్ఞుడు. ఆయన ఖర్మ గాలి, ప్రేమలో పడ్డాడు. గాళ్ ఫ్రెండును పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అంతకు ముందరి భార్యతో విడాకులకు సంబంధించి కాగితాలేవో కావాలి. వాటి కోసం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో సౌదీ రాయబార కార్యాలయానికి వెళ్ళాడతడు, మరింత ఖర్మ కాలి.

కాగితాలు తీసుకుని వస్తాడని గర్ల్ ఫ్రెండు బయట కాచుకుని వుంది. ఉంది. ఉంది. ఉంది. ఖషోగ్గీ అసలు రాలేదు.

తరువాత అర్థమయ్యింది అతడిక రానే రాడని. టర్కీ చొరవ వల్ల లోపల ఏం జరిగిందో తెలిసింది. ఖషోగ్గీని లోపల… సౌదీ టాప్ ఫోరెన్సిక్ నిపుణుని బృందం..  చంపేసిందని. ఊరక చంపేయడం కాదు. ఖషోగ్గీ ఇంకా ఊపిరి తీస్తుండగానే.. అతడి ఒక్కో అవయవాన్ని కోసి వేరు చేసి, తరువాత ఆ అవయవాల్ని గార్బేజ్ బ్యాగుల్లో పెట్టి బయటికి తరలించారు.

అతడికేమయ్యిందంటే…  మేమేరుగం మేమెరుగం పై వాడినడుగు అని బుకాయించారు.

ఈ బుకాయింపులు నడుస్తున్నంత సేపూ… అమెరికాలో ట్రంపు దొర గారు… అది సౌదీ హత్య అని అనలేమని, ఖషోగ్గీ ఏమయ్యాడో చెప్పలేమని బుకాయిస్తూనే వున్నాడు. ‘మా జడ్జి కావినా లాగే సౌదీ అరేబియా  ‘ఇన్నొసెంట్ అంటిల్ ప్రూవ్డ్’ అని కూడా అనేశాడు. (ఈ జడ్జి కావినా ఎవరంటారా? ఇదే పేజీల్లో ‘కాలం కన్న బిడ్డలు’ అనే ఎడిటోరియల్ చదవండి.)

చివరికి సౌదీ కాన్సలేట్ లో ఖషోగ్గీ హత్య జరిగిందని అందరికీ తెలిసి పోయాక, డొనాల్డ్ జోసెఫ్ ట్రంఫు అన్న మాటేమిటో తెలుసా? : దిసీజ్ వర్ స్ట్ కవరప్. వర్ స్ట్ కవరప్ అఫ్ ఆల్ కవరప్స్ ఇన్ ది ఎంటైర్ హిస్టరీ అఫ్ కవరప్స్’.

అంటే ఏంటి? జమాల్ ఖషోగ్గీ బతికుండగానే కోసి, ఒక్కొక్క అవయవం తీసి చంపడం కాదు ట్రంపు గారికి బాధ కలిగించేది. సౌదీయులు ఆ పనిని చక్కగా కవరప్ చేయలేదని.

రహస్యం సరిగ్గా దాచలేదని.

మోసం సరిగ్గా చేయలేదని.

అబద్ధం సరిగ్గా ఆడలేదని.

ఇంత మానవత్వ రహిత వైఖరికి కారణం ఏమిటి? సౌదీ అరేబియా వాళ్ళ నుంచి అమెరికాకు ఆయుధాల కొనుగోళ్ళ రూపంలో బోల్దంత డబ్బు ముడుతుంది. నేరుగా డొనాల్డ్ ట్రంపుకే చాల డబ్బు ముడుతుంది. ఎన్నికలప్పుడు చాల ముట్టింది కూడా.

కేవలం డబ్బు కోసం లేదా అధికారం కోసం (రెండూ ఒకటే, అవి పరస్పరం ఎక్స్ఛేంజియబుల్) ఇంత దారుణంగా మనుషులు వుండగలరు. నాయకులు  వుండగలరు. తమ లోని వారి పట్ల కూడా వాళ్ళలా వుండగలరు. ఖషోగ్గీ సౌదీ రాజరికానికి పెద్ద వ్యతిరేకి ఏమీ కాదు, చాల మైల్డ్ విమర్శకుడు. లాయల్ అపోజిషన్ మాత్రమే. నిజమైన ప్రతిపక్షం పట్ల వాళ్లు ఎలా వుంటారో ఇక చెప్పేదేముంది.

ఇలాంటి యవ్వారాలు అంతర్జాతీయం, జాతీయం మాత్రమే కాదు. రాష్ట్రీయం కూడా.

మరీ విదేశంలో వుండడం వల్ల మా దగ్గర డేటా లేదు గాని, ఈ క్రూరమైన అబద్ధం గ్రామీణం కూడా అయ్యుంటుంది. నో హోల్డ్స్ బార్డ్ అయ్యుంటుంది.

విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏకైక (కౌంటబుల్) ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్ది మీద హత్యా ప్రయత్నం జరిగింది. మనసున్న వారెవరైనా హత్యా ప్రయత్నాన్ని నేరుగా ఖండిస్తారు. నిష్పాక్షిక విచారణ జరగాలని కోరుతారు. ప్రతి పక్ష నేతకు సెక్యూరిటీ పెంచాలని కోరుతారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం ఆ పనులు చేయాల్సింది పోయి, హత్యా యత్నాన్ని ఖండించిన వాళ్ళను ఖండించాడు. అసలీ హత్యా ప్రయత్నం ప్రతిపక్షం వేసిన నాటకం అనేయడానికి ప్రయత్నించాడు. ఆ వెర్షన్ కుదరక పోతే ఎవరో వూడగొట్టిన నాగేలి వంటి సినిమా నటుడు చెప్పిన ‘ఆపరేషన్ గరుడ’ కథల వెనుక దాక్కోడానికి కూడా ముఖ్యమంత్రి ప్రయత్నించాడు. ఈ హత్యా నాటకం తన ఘనతర ముఖ్య మంత్రిత్వాన్ని కూల దోయడానికేనని… తన ముఖ్య మంత్రిత్వం ఏదుందో అది మరొకరి ప్రాణ ప్రమాదం కన్న గొప్పది అయినట్లు ప్రకటించాడు. తను ముఖ్య మంత్రిగా ఇక పట్టుమని ఏడాది కూడా వుండపోవచ్చు. దీని కోసం ఎవరేనా ప్రాణాల మీదికి తెచ్చుకుంటారా అనే ఇంగిత జ్ఞానం కూడా జనాలకు వుండదని వీళ్ళ వూహ.

నిజమే, ఏ పార్టీ అయినా ఒక్కటే ప్రజలకు. అయినా వున్నంతలో ప్రభుత్వాలను మార్చడం, తాము గొర్రెలం కామని, ప్రభుత్వాలను మార్చగలమని నిరూపించడం ద్వారా… పాలకులకు కొంతయినా చెక్ పెట్టడం ప్రజలకు అవసరం. అందువల్ల ఎన్నికల పార్టీల రాజకీయంలో కనీస ఫెయిర్ ప్లే ప్రజలకు అవసరం. ఈ మాత్రం అవకాశం లేకపోతే… ఇందిరా గాంధి కి ఎమర్జెన్సీ ఎత్తేసే అగత్యం లేదు. ఇది రాస్తున్న నా తో సహా వందల మంది పొలిటికల్ డిసెంటర్లకు జైలు నుంచి మర్యాదైన  విడుదల ఎప్పటికీ వుండేది కాదు.

ప్రజలకు నిజమైన అధికారమిచ్చే ప్రజాతంత్ర విప్లవం జరిగేదెప్పుడో తెలియదు.

అదొక టార్చువస్ పాత్.  

అంతవరకు ప్రజలకు, ప్రజాతంత్ర శక్తులకు.. ఈక్వీ డిస్టెన్స్ వైఖరిని, తటస్థత్వాన్ని, వొట్టి ప్రేక్షకత్వాన్ని బోధించడం… నిజానికి యథాతథ వాదానికి ప్రోది చేయడమే.

ఇప్పుడున్న అబద్ధం ఇలాగే  వర్ధిల్లడానికి పాలకులకు సాయపడడమే.

రాజకీయం కావొచ్చు. మతం కావొచ్చు. విశ్వవిద్యాలయం కావొచ్చు, సాహిత్యం కావొచ్చు, సంగీతం కావొచ్చు… ప్రతిదీ మరో దాన్ని ప్రభావితం చేస్తుంది.

మరే, నేను కేవలం కవిని, నన్నిలా వొదిలెయ్యండి, నేను ఎవరి చంకలోకి దూరినా పట్టించుకోకండి అనే పాత పాట ఇప్పుడు కుదరదు. చాల సార్లది ప్రజా ద్రోహం కూడా.

ప్రతి పనిలో న్యాయం అన్యాయం చూడవల్సిందే.

ప్రజల పక్షాన, ప్రగతి శీలం పక్షాన ప్రతి దాన్ని విమర్శించవలసిందే.

ఎప్పటికప్పుడు విమర్శకు నిగ్గు తేలినదే ఆస్వాద యోగ్యం. ఆచరణ యోగ్యం.

ఖషోగ్గీ సంగతి మాకెందుకండీ సౌదీ రాజధాని రియాద్ వీథులు ఎంత శుభ్రమో చూడండి, యెమెన్ పసిపిల్లల మీద కురిసే సౌదీ బాంబుల్ని చూడకండి, దొంగతనం చేస్తే చేతులు నరికే సౌదీ న్యాయ వ్యవస్థ సౌందర్యం చూడండి… అనే కొత్త ఫ్యూడల్ మస్తిష్కాలను సవాలు చేయకపోవడం అబద్దం అనే విష సర్పం పక్కలో నిద్దర పోవడమే.

ఏ రూపంలోనైనా ఎంత చిన్న పెద్ద రూపంలోనైనా… రాజకీయ, సాహిత్య, సామాజిక అనృతాల్ని ముందుగా అనృతాలని అందాం. ఆ పైన వాటిని బహిరంగంగా తిరస్కరిద్దాం.

హిపోక్రసీ మానవ జాతికి ఫస్ట్ ఎనిమీ.

29-10-2018  

హెచ్చార్కె

21 comments

 • వాస్తవ పరిస్థితులను చానా బాగా వివరించారు

 • సార్! మీరు అమెరికాలో ఉంటూ, అంతర్జాల పత్రిక నిర్వహించడం తెలుగు ప్రజలు, పత్రికా రంగం చేసుకున్న దురదృష్టం. Ofcourse! అక్కడున్నా కూడా అంతే passionతో నిర్వహిస్తూ, ఖచ్చితంగా ఒకటో తేదీ విడుదల చేయడం మీకే చెల్లు. మీ సాంకేతిక బృందమెవరో గానీ super! కనీసం ఈ ఎన్నికలయ్యేంతవరకైనా ఇక్కడకొచ్చి ఏదైనా రాయండి సార్! ఆలోచనాత్మక, నిష్పక్షపాత అక్షరాలు చదివి జనం దారిలో పడతారు. మూడు దశాబ్దాలకు పైగా మీ అభిమానిగా చిన్న విన్నపం.

 • అయ్యా, ఎక్కడ నేర్చావీ భాషా శైలీ విన్యాసం ప్రభూ! నిలబెట్టి చదివించిన సంపాదకీయం. మర్చిపోతున్న ఎనిమీలను గుర్తుజేస్తారే ? ఎంత ధైర్యం మీకు !

  • మీరు గమనించలేదా రోజు రోజు కీ పేట్రేగిపోతోంది ! ఈయన మా వయసులో ఎలా ఉండేవాడో అని కూడా అనిపిస్తుంది.

 • Two points:

  1. I fully agree with what you are saying.
  2. I think this editorial is preaching to the choir. Its utility is in question. It only serves to reaffirm, without offering a new perspective.

  It is possible that there are some people that are not aware of these facts. Still, an editorial is not meant to merely offer facts, but a perspective. It does offer a perspective, but it is well worn one.

  Think about the following:

  1. Why is the world turning to fascism? Is there a long pent up rage that is making it happen? (think about backlash. different value systems. inability to create common narratives. reducing the role of common traditional narratives without offering alternatives).
  2. Why do people prefer nationalists these days? [globalism, which was supported by traditional conservatives was attacked by the left as well as by the fascists.].
  3. Why are the poor (in most countries) prefer nationalists? [They are using the same economic rhetoric of the left. They are rejecting the social part of the progressivism. What gives?]
  4. People think truth is relative. Did years of moral relativism pave way for this? Do people see that truth is demanded only in places where it serves the speakers? [For instance, the Indianness of Warren is a bit of sham — it is so small that most people can claim that heritage. Admittedly, that is not the point, at all.]
  5. Why do the progressives feel righteous? What should they do understand the otherside? What should they do to change them?

  Your conclusion of truth being the ultimate — i can get behind that. Except that, we choose to speak the truths that we agree with. If we don’t acknowledge the truths from the other side, this call for truth will ring hollow. In fact, I go to the extent of saying that we should highlight the truths that we do not agree with — that speaks our commitment to truth. It is easy to tell the truth that we and our friends agree with.

 • మాంచి టైమింగ్ సార్ .
  ఇప్పుడున్న దేశీయ అంతర్జాతీయ పరిస్థితుల్ని ఒక్క బండ మీదికి లాక్కొచ్చి ఉతికేసారు .
  ఇక్కడ
  ఇప్పటికే ఎదో ఒక కూటమిలో లోలోపల అసహనం తో కూడిన ఈ స్టేట్మెంట్ పాస్ చేసి ఉండొచ్చు..”దిసీజ్ వర్ స్ట్ కవరప్. వర్ స్ట్ కవరప్ అఫ్ ఆల్ కవరప్స్ ఇన్ ది ఎంటైర్ హిస్టరీ అఫ్ కవరప్స్” అని.

  • రాజ శేఖర్ గారు, థాంక్యూ సో మచ్. ఫాసిజానికి పయనంలో అన్ని దేశాలది, ఒక్కో దేశంలో అధికారంలో వున్న వాళ్ళందరిది ఇప్పుడు ఒకే ప్యాటర్న్. అందులో ముఖ్యమైనవి.. బ్లేటెంట్ అబద్ధాలు, కవరప్. వైవిధ్యం ఏమైనా వుంటే అది ప్రతిపక్షం లోనే వుండడం గమనార్హం. వైవిధ్యం అనైక్యతగా కూడా పరిణమిస్తున్నదనేది వేరే విషయం.

 • ఖషోగ్గీ సంగతి మాకెందుకండీ సౌదీ రాజధాని రియాద్ వీథులు ఎంత శుభ్రమో చూడండి, యెమెన్ పసిపిల్లల మీద కురిసే సౌదీ బాంబుల్ని చూడకండి, దొంగతనం చేస్తే చేతులు నరికే సౌదీ న్యాయ వ్యవస్థ సౌందర్యం చూడండి… అనే కొత్త ఫ్యూడల్ మస్తిష్కాలను సవాలు చేయకపోవడం అబద్దం అనే విష సర్పం పక్కలో నిద్దర పోవడమే.

  ఎక్స్ల్లెంట్ రైట్ అప్ … కంగ్రాట్స్

  • థాంక్యూ సో మచ్, గీతా వెల్లంకి గారు. ఆవునండి, పాత ఫ్యూడల్ ఆలోచనలే చూస్తున్నాం… సాహిత్యంలో రాజకీయాల్లో. ఈ కొత్త ఫ్యూడల్ తలకాయల్ని సవాలు చేయక తప్పదు, లేకుంటే మహమ్మద్ బిన్ సాల్మన్ లు, డోనాల్డ్ ట్రంపులు, నాయుళ్లు, మోడీలు… వాళ్ళ ఏజెంట్లు మనల్ని ముంచేస్తారు.

 • ఇవాళ మనుషులు.. మనుషులేమిటి ప్రపంచం నడుస్తోంది హిపోక్రసీ మీదనే. చాలా కాలం తర్వాత ఉన్నత స్థాయి సంపాదకీయాలు ఈ వేదిక మీద చదువుతున్నా.

  • థాంక్యూ సో మచ్ యజ్ఞమూర్తి గారు. హిపోక్రసీని జయించే వరకు దేన్నీ జయించలేం. జయించినా, జయం నిలబడదు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.