అన్నమయ్య సంకీర్తనల్లో వ్యక్తిత్వ వికాసం

సంకీర్తనా సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పాఠాలు అరుదుగా ఉంటాయి. అవి వ్యక్తిగత భావనలకే ప్రాధాన్యతనిస్తాయి. అవి ఆత్మగతం. వ్యక్తిగతం. భక్తిలాగే విజయం కూడా వ్యక్తిగతంభారతీయ సంకీర్తనా సాహిత్యమంతా భాషలోనైనా భక్తి ప్రధానంగానే ఉంటుంది. భగవంతునిపట్ల వారి వైఖరిని, చిత్తశుద్ధితో కూడిన లక్ష్యాన్ని తెలియచేస్తుంది. అది వారి నిబద్ధత. లోకం పోకడ ఎలా ఉంది? పక్క దోవలు పట్టించి లక్ష్యాన్ని చేరకుండా లోకం ఎటువంటి అవరోధాల్ని కల్పిస్తుంది? ఒక లక్ష్యం కోసం ఎంతటి నిబద్ధత కలిగి ఉండాలి? ఇటువంటి విశేషాంశాల్ని ఆధునిక జీవన వికాసానికి అవసరమైన జీవన నైపుణ్యాలు (Life skills)గా, విజయానికి అవసరమైన సరళ కౌశలాలు (Soft Skills)గా సమన్వయం చేసుకుంటే మన జీవితాలు అసమర్ధుని జీవయాత్రల్లా కాకుండా, అసమాన విజయ పధంలో పయనిస్తాయి. ఇటువంటి జీవన నైపుణ్యాలు అన్నమయ్య సంకీర్తనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

భక్తి అంటే devotion, dedication, commitment. ఒక దీర్ఘకాలిక వ్యక్తిగత, సామూహిక  లక్ష్య సాధన పట్ల చిత్తశుద్ధి, నిమగ్నత, నిబద్ధతలను భక్తి అనవచ్చు. అది కేవలం భగవంతుని పట్ల అయి ఉండాలని లేదు. భగవంతునికే అన్వయించుకుని, మానవకోటి నిరూపించలేని మోక్షం వంటి అయోమయ సమన్వయాలు చేసుకుని అయోమయంలోనే జీవించాల్సిన అవసరం లేదు. ఈ వ్యాసంలో ప్రసిద్ధి చెందిన ఒక అన్నమయ్య సంకీర్తనలోని వ్యక్తిత్వ వికాస విశేషాలను స్పృశిస్తూ, వాటినుంచి మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగిన పాఠాలేమిటో తెలుసుకుందాం.

పల్లవి:

మనుజుడై పుట్టి మనుజుని సేవించి 
అనుదినమును దుఃఖమందనేలా         ..మనుజుడై..

చరణం 1 :

జుట్టెడు కడుపుకై చొరనిచోట్లు చొచ్చి 
పట్టెడు కూటికై బతిమాలి 
పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి 
వట్టి లంపటము వదల నేరడు గాన          ..మనుజుడై..

చరణం 2 :
అందరిలో పుట్టి అందరిలో చేరి  
అందరి రూపము లటుతానై 
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి 
అందరాని పదమందె నటుగాన          ..మనుజుడై..

మనుజుడై పుట్టి మనుజుని సేవించి ; అనుదినమును దుఃఖమందనేలామనిషిగా పుట్టి మనిషిని సేవించడమేమిటి అంటారు అన్నమయ్య. నిజమే కదా! మనందరం కూడా మనిషిని సేవించడానికి సిద్ధమైపోతాం. మన కలల్ని ఉద్యోగం ఇచ్చినవాడి కాళ్ళముందు పెట్టి, వాడి కళ్ళముందే జీవితాంతం పని చెయ్యాలని నిర్ణయించుకుంటాం. ఎందుకు? నెల తిరిగేటప్పటికి ఇంత జీతమొస్తుంది; కుటుంబ జీవితం గడుస్తుందని! ఆనాటి రాజుల్ని సేవించకుండా ఆత్మాభిమానంతో జీవించినవారు అన్నమాచార్యులు. మానవ సేవ చేయడం వేరు; మనిషిని సేవించడం; ఒకరి దగ్గర సేవకుడిగా పడి ఉండటం వేరు. తనలోని స్వేచ్ఛా పిపాసను అన్నమయ్య మొదటి రెండు వాక్యాల్లోనే బల్ల గుద్దినట్టు, మొహం పగిలేట్టు చెప్పాడు. మనిషిని సేవిస్తే ఏమొస్తుంది? దు:ఖం వస్తుంది. జీతం సరిగ్గా ఇవ్వడు. వీలైనన్ని ఎక్కువ పనిగంటలు పనిచేయాలని కోరుకుంటాడు. తన మాటే వినాలని పంతం పడతాడు. ఇటువంటి వాడి దగ్గర పని చేయడం కన్నా దు:ఖం ఏముంటుంది?   

జుట్టెడు కడుపుకై చొరనిచోట్లు చొచ్చి;  పట్టెడు కూటికై బతిమాలి జుట్టెడు అంటే జానెడు పొట్ట కోసం ఎక్కడెక్కడో తిరుగుతాం. వెళ్ళకూడని చోట్లకు కూడా వెళతాం. పట్టెడన్నం కోసం కనిపించిన ప్రతి ఒక్కరిని బతిమాలతాం! ఇవన్నీ అనుభవైకవేద్యమే. చిరుద్యోగం కోసం ఎక్కే గుమ్మం; దిగే గుమ్మం! చీదరింపులు, ఛీత్కారాలు ఎదుర్కోవడం! ఇవన్నీ అవసరమా అంటే ఎదుటివారి కలల పొలం పండించడం కోసం కూలీ చెయ్యాలని నిర్ణయించుకున్నవాడు బలహీనుడవుతాడు. మాట్లాడే ధైర్యం కూడా కోల్పోతాడు. మన కలల కోసం మనం పాటు పడితే, చెమటోడ్చి పని చేస్తే అవి ఫలించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కదా అంటాడు  అన్నమయ్య. ‘If you don’t build your dreams; some one will hire you to build theirs.’ నీ కలలు నిజం చేసుకోవడానికి నీవే కష్టించకపోతే, ఇంకెవరో వాళ్ళ కలలను నిజం చేసుకోవడానికి నీకు ఉద్యోగమిస్తారు. అప్పుడిక శ్లేష్మంలో పడ్డ ఈగలాగా ఆత్మ విశ్వాసం కోల్పోయి బానిస బతుకు బతకాల్సొస్తుంది. ఎప్పటికప్పుడు నీ నాలెడ్జ్, నైపుణ్యాలు, వైఖరి అభివృద్ధి చేసుకోకపోతే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది.    

పుట్టినచోటికే పొరలి మనసు వెట్టి; వట్టి లంపటము వదలనేరడుగాన – పొరలి మనసుపెట్టి పుట్టినచోటికే పోవాలని ప్రతి ఒక్కడూ తహతహలాడతాడట! వట్టి లంపటాన్ని వదలలేక పుట్టిన చోటికే వెళ్ళాలని తపిస్తుంటాడు. ఆలోచనే వదల లేక వదలలేక వెనక్కి, పుట్టినచోటికే వెళదామని తపిస్తాడు. త్యాగరాజ స్వామి కూడాఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైన కాంతదాసులేఅంటారు.  ‘మర్మ స్థానం కాదది నీ జన్మస్థానంఅని వేటూరి సినిమా పాట. ఇంతటి సంస్కారం లేక రోజుల్లో జరిగే ఘోరాలు, నిరంతర అత్యాచారాలు, మానభంగ పర్వాలు మనం చూస్తూనే ఉన్నాం. ‘మీ టూ’ లాంటి ఉద్యమాలకి మూలకారణమైంది మర్మస్థాన లంపటమే. లంపటాన్ని వదిలించుకోవాలని, విదిలించుకోవాలని అన్నమయ్య తాత్పర్యం. అప్పుడే మనిషి లక్ష్యాన్ని సాధించగలడు. బుద్ధుడు కూడా ఇదే చెప్పాడు. జీవితంలో విజయాన్ని సాధించాలంటే వనితా వ్యామోహానికి దూరంగా ఉండాలంటాడు.  ‘We are miserable because we are not aware of what we are doing! Action goes in one direction! Thinking goes in another direction! Feeling is somewhere else direction!’ అంటారు రజనీష్. ఆలోచనకు, ఆచరణకు సమన్వయం లేకపోవడం, విచక్షణా జ్ఞానం నశించడం  అన్ని అనర్ధాలకు మూలం అని సారాంశం.   

అందరిలో పుట్టి అందరిలో చేరి; అందరి రూపములటుతానై పుడుతూనే ఉంటాం; చస్తూ ఉంటాం. మన పోలికలతో మరొకడు పుడతాడు. అలా ఒకరి పోలికలతో ఒకరు వంశవృక్షాలను పెంచేస్తూ ఉంటారు. విజయానికి ఎవరి నిర్వచనాలు వారు చేసుకుంటూ, కుంటుకుంటూ బతుకులో ముందుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాం. లంపటాల్లో పడి కొట్టుకుంటూ ఉంటాం.   

అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి; అందరానిపదమందెనటుగానఅన్నమయ్యకు విజయ తీరం శ్రీ వేంకటేశ్వరుడు. అన్నమయ్య రోజుల్లో భక్తి తత్వమే జీవిత తత్వం. మనకు ఆర్ధిక స్వావలంబనే అద్భుత విజయం. విజయానికి అడ్డదారులు వెతుకుతూ ఉంటాం. పక్కదోవలు పట్టి పోతుంటాం.  మనకు అందమైనది జీవితం. అందనిది జీవితం. జీవిత గమనం, గమ్యం మనం అనుకున్న విజయం సాధించడమే. అన్నమయ్యకు వేంకటేశ్వరునిపై ఎంతటి గురి ఉందో, మనం కూడా మన లక్ష్యం పట్ల అంతటి చిత్తశుద్ధిని అలవరచుకోవాలి. అప్పుడే విత్తసిద్ధి కలుగుతుంది. లక్ష్యశుద్ధితోనే లక్ష్యసిద్ధి. లక్ష్యం విత్తమే కానక్కర్లేదు, మీకు నచ్చిన మరేదైనా కావొచ్చు.  ‘If you focus on the hurt; you will continue to suffer. If you focus on the lesson, you will continue to grow.’ ‘గాయం మీద దృష్టి పెడితే, బాధపడుతూనే ఉంటాం. గుణపాఠం మీద గురిపెట్టి  నేర్చుకుంటే ప్రగతిపథంలో ముందుకెళతాం’  అంటాడు బుద్ధుడు. వినదగునెవ్వరు చెప్పిన… అని వినయంగా విందాం. నేర్చుకుందాం.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.