అమెరికా ఎన్నికలు: రేకెత్తిన కొత్త ఆశలు

ఎలక్షన్ ర్యాలీ లో… పాలస్తీనియన్- అమెరికన్ రషీదా.

పైన ఫోటో  విజయం సాధించిన సోషలిస్టు డెమోక్రాట్లు: షరిస్ డేవిడ్స్ (నేటివ్ అమెరికన్) రషీదా (పాలస్తీనా ముస్లిం), ఇల్హన్ ఓమర్ (సొమాలియా ముస్లిం), డెబ్ర ఎ హాలాండ్ ( నేటివ్ అమెరికన్)

 

 

‘’మీలో ఈ జ్వాల ఎలా రగిలింది? ఎందుకు రగిలింది?’’,

గత వారం అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో  పాలస్తీనా ముస్లీం స్త్రీ రషీదా త్లాయిబ్ కాంగ్రెస్ కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా  ఆమెను “ఎమ్ ఎస్ ఎన్ బి సి”టీవీ  అడిగిన ప్రశ్న ఇది.

“పేద కుటుంబం నుంచి వచ్చాను. సమస్యల మధ్య పెరిగాను. రెస్టారెంట్స్ ల్లో పని చేస్తూ చదువుకొని అడ్వకేట్ ను అయ్యాను. ఇళ్లల్లో, స్కూల్లో  తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు. పిల్లలు చదువుకోడానికి, పెద్దలు వైద్యం చేయించుకోడానికి అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఉద్యోగాలు లేవు, కనీస వేతనాలు లేవు.  పేద ప్రజలు మాత్రమే కాదు, మధ్య తరగతి ప్రజలు కూడా సమస్యల సుడిగుండంలో చిక్కుబడిపోయారు. నేను పెరిగింది సివిల్ రైట్స్ వుద్యమం, ట్రేడ్ యూనియన్ ఉద్యమం బలంగా వున్న డెట్రాయిట్ (మిచిగన్ రాష్ట్రం)లో. ఈ ఉద్యమాల ప్రభావంతో సమస్యల్ని చూసిన నాలో జ్వాల రగిలింది. నేను ముస్లిం స్త్రీని అయినందుకు కాది ప్రజలు నాకు ఓటువేసింది. కాంగ్రెస్ లో తమ సమస్యలను  వినిపించడానికి తమ వాయిస్ గా నన్ను ఎన్నుకున్నారు. మేము సంఘటితంగా సమస్యలను ఎదుర్కొంటాం” అని ఆమె జవాబిచ్చారు.

చరిత్రలు సృష్టించిన స్త్రీలు

అందరి కన్న చిన్న కాంగ్రెస్ సభ్యురాలు: అలెగ్జాండ్రియా ఓకాసియో కార్తేజ్

ఈ మధ్యంతర ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో స్త్రీలు పోటీ చేయడం ఒక చరిత్ర అయితే  ఎక్కువ స్థానాలు గెలుపొంది కాంగ్రెస్ లో 23% స్థానాన్ని ఆక్రమించారు. మొదటిసారి కాంగ్రెసులోకి ఇద్దరు లాటినమెరికా స్త్రీలు, ఇద్దరు ముస్లిం స్త్రీలు, ఇద్దరు నేటివ్ అమెరికన్ స్త్రీలు, ఒక పోర్టరికన్ స్త్రీ అడుగుపెట్టారు. పోర్టరికన్ అయిన 29 ఏళ్ళ అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ అతి చిన్న వయసులో కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. 29-40 ఏళ్ల వయసు వున్న వారు 25 మంది ఎన్నిక కావడం, స్త్రీలు ఎక్కువ సంఖ్యలో ఎన్నిక కావడంతో ఈ సారి కాంగ్రెస్ లోకి కొత్త నీరు ఉధృతంగా ప్రవహించిందని చెప్పవచ్చు. ఆఫ్రికన్- అమెరికన్లు మునుపటికన్నా అధిక సంఖ్యలో ఈ ఎన్నికల్లో గవర్నర్, సెనేట్, కాంగ్రెస్ స్థానాలకు పోటీ చేశారు. ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. జార్జియా, ఫ్లోరిడా గవర్నర్ ఫలితాలు ఇంకా తెలియాల్సి వుంది.

మిలియనీర్లే (కోటీశ్వరులు) అమెరికా కాంగ్రెస్ కు, సెనేట్ కు పోటీ చేయడం, ఎన్నిక కావడం రివాజు. ఈసారి శ్రామిక వర్గం, మధ్య తరగతి అభ్యర్థులు, ప్రగతిశీలురమని చెప్పుకునే వారు ఎక్కువ సంఖ్యలోనే ఎన్నికయ్యారు. మిన్నిసోటా నుంచి ఎన్నికయిన ఒక కాంగ్రెస్ మెంబర్  ఇల్హన్ ఒమర్  సోమాలియా నుంచి శరణార్థిగా వచ్చిన  ముస్లిం స్త్రీ.

మరోసారి న్యూ యార్క్ లో నివసించే అలెగ్జాండ్రియా పేరునే ఉదహరిస్తాను. ఆమె తల్లి ఇళ్లల్లో పనిచేస్తారు. నాలుగైదు నెలల క్రితం దాకా అంటే జూన్ నెల వరకు అలెగ్జాండ్రియా రెస్టారెంటులో పనిచేశారు. ఈమె గత నాలుగైదు ఏళ్లుగా బెర్నీ శాండర్స్ నాయకత్వంలో ఆయా సమస్యలపై పనిచేస్తూ చురుకైన యాక్టివిస్టుగా గుర్తింపు పొందారు. ఈమె డెమొక్రటిక్ పార్టీ తరుపున పోటీ చేసినా తనను తాను డెమొక్రటిక్ సోషలిస్టునని చెప్పుకుంటారు. ప్రిలిమినరీ ఎన్నికల పోటీలో డెమొక్రటిక్ పార్టీ తరుపున పది సార్లు కాంగ్రెస్ కు ఎన్నికైన జో క్రౌలీ పై అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ఎన్నికల బరిలో నిలబడ్డారు అలెగ్జాండ్రియా. గతవారం జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిపై కూడా అత్యధిక మెజారిటీతో విజయం సాధించి కాంగ్రెస్ లోకి అడుగుపెట్టారు. శ్రామిక ప్రజలు తమ గొంతును కాంగ్రెస్ లో వినిపించడానికి ఒక్కో డాలర్ విరాళంగా ఇచ్చుకుని అలెగ్జాండ్రియాను గెలిపించుకున్నారు.  

స్త్రీలు ఎక్కువ సంఖ్యలో పోటీ చేసి, గెలుపొందడానికి “మీ టూ” ఉద్యమం, బ్రెట్ కావినా ఉదంతం ప్రభావం చూపాయని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో స్త్రీ ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. రాజకీయాలే అందరి జీవితాల్ని శాసిస్తున్నాయి. మతాలతో, ప్రాంతీయతలతో, వర్ణ వివక్ష తో  పేద ప్రజలు విభజింపబడి వుంటే సంపన్నులు మాత్రం కలిసి కట్టుగా ఉండి రోజు రోజుకు సంపన్నులవుతున్నారు. పేద ప్రజలకు, మధ్య తరగతికి, ఎగువ మధ్య తరగతికీ కూడా విద్యా, వైద్యం అందుకోలేని అమ్మకం సరుకులుగా మారాయి. దేశంలో ప్రతి రోజు ఏదో మూల తుపాకీ కాల్పులు. ఆఫీసులకు, స్కూళ్ళకు వెళ్లిన వారు తిరిగి సురక్షితంగా ఇండ్లకు చేరుకుంటారన్న నమ్మకం లేదు. ఉద్యోగాలు లేవు, ఉన్న వారికి కనీస వేతనాలు లేవు. ఆఫ్రికన్ యువత అత్యధిక శాతం మంది డ్రగ్స్ పేర అరెస్ట్ అయి జైళ్ళల్లో బానిసల్లా బతుకుతున్నారు. జైళ్ళ నుంచి విడుదల అయ్యాక వారి పేరు ఓటర్ జాబితా నుంచి తొలగించబడుతుంది. ఈ కారణంగానే గాక, లక్షలాది ఆఫ్రికన్ అమెరికన్, బ్రౌన్ కలర్ ప్రజల పేర్లు ఓటర్ల లిస్ట్ నుంచి గల్లంతయ్యాయి. తమ ఓటు హక్కును పునరుద్ధరించాలనో, తమ పేరు ఓటర్ల లిస్టులో నమోదు చేయాలనో లక్షలాది మంది ఆఫ్రికన్- అమెరికన్లు ఎన్నికల ముందు దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రంగా పోరాడారు.   

సమస్యల్లో చిక్కుకున్న ప్రజలు ఒక్కో సమస్యపై కేంద్రీకరించి పోరాడడం ఇక్కడ ఒక విశేషం. కనీస వేతనాలు అమలుచేయాలని,  అందరికీ ఉచితంగా వైద్యం, కాలేజీ చదువుల వరకు ఉచిత విద్య అందించాలని. కాలేజీ ఫీజుల పేరిట విద్యార్థులకు ఉన్న అప్పులను మాఫీ చేయాలని, గన్ కంట్రోల్ విధించాలని, డ్రగ్స్ పేర అరెస్ట్ అయిన వారిని విడుదల చేయడమే గాక, డ్రగ్స్ ను ఒక నేరంగా పరిగణించకూడదని, పర్యావరణాన్ని రక్షించాలని, మిలిటరీ బడ్జెట్ ను తగ్గించడమే గాక ఇప్పుడు అమెరికా 70 దేశాల్లో చేస్తున్న యుద్ధాలను ఆపివేయాలని, మెక్సికో సరిహద్దులో గోడలు కట్టడం ఆపాలని, ఐ సి ఇ (ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్) ను రద్దు చేయాలని, అబార్షన్ హక్కు కోసం, ఎల్జిబిటీ హక్కుల కోసం,… లింగ, వర్ణ వివక్ష లేని సమాజం కోసం, సంపన్నులపై అధిక శాతం పన్నులు విధించాలని … ప్రగతిశీల ఆలోచనలతో పోరాడుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఒక్క ఓటు వేసి మన పని తీరిపోయిందనుకోవడం కాదు.  ప్రజలు ప్రతి సందర్భంలో, ప్రతి సమస్యలో పాల్గొని ప్రజాస్వామం అమలు జరిగేలా చేసుకోవాలని అంటారు ఆఫ్రికన్- అమెరికన్ కరోల్ ఆండర్సన్. ఈమె మూకుమ్మడిగా ఓటర్ల జాబితా నుంచి ఆఫ్రికన్- అమెరికన్ల పేరు తొలగింపును నిరసిస్తూ, తమ హక్కుగా ఓటర్ల జాబితాలో తిరిగి పేర్లు నమోదు చేసుకోవాలని ఉద్యమిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు రేపు మాపు అనగా లక్షలాది మంది ఆఫ్రికన్- అమెరికన్లు తిరిగి తమ ఓటు హక్కును సాధించుకున్నారు.

ప్రతి రెండేళ్ల కొక సారి కాంగ్రెస్ కు ఎన్నికలుంటాయి. దేశంలోని 50 రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రానికి ఇద్దరేసి సెనేటర్లు వుంటారు అంటే సెనెట్ లో 100 మంది సభ్యులుంటారు. జనాభా ప్రాతిపదిక మీద ఒక్కో జిల్లాకు ఒక కాంగ్రెస్ మెంబర్ ప్రాతినిధ్యం వహిస్తారు. అతి చిన్న రాష్ట్రాలైన వర్మాంట్, డెలావేర్ రాష్ట్రాలకు ఒక్కో కాంగ్రెస్ మెంబరే వున్నారు. అదే కాలిఫోర్నియా రాష్ట్రంలో 53 మంది కాంగ్రెస్ సభ్యులుంటారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే  ప్రెసిడెంట్ ఎన్నికలతో పాటు కాంగ్రెస్ కు ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్(హౌస్) మెంబర్స్ (ఫెడరల్ లెజిస్లేచర్) కాల పరిమితి రెండేళ్ళే. కనుక ప్రెసిడెంట్ రెండేళ్ళ తరువాత జరిగే ఎన్నికల్ని మధ్యంతర ఎన్నికలని పేర్కొంటారు. మధ్యంతర ఎన్నికలు ఒక రకంగా ప్రెసిడెంట్ పని తీరు మీద రెఫరెండం వంటివి. ఎన్నికల సమయంలో రేసిజం మరింత బాహాటంగా బయటపడింది. రైటిస్టు ఉన్మత్తులు కాల్పులు జరగడం, సి ఎన్ ఎన్ టీవీ ఛానల్ కు, కొంతమంది డెమొక్రటిక్ పార్టీల నాయకుల ఇళ్ళకు, ఒబామ, క్లింటన్ ఇళ్ళకు బాంబుల పార్శిళ్లు వెళ్లడం. ఒక  వారం రోజులు భయానక వాతావరణం ఆవరించింది.

ఎన్నికల ఫలితాలు వెల్లడయి, డెమొక్రాట్లు మెజారిటీ సాధించడంతో ప్రెసిడెంట్ ట్రంప్ లో భయం మొదలయింది. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచి మొదలైన అనేక నిరసన ర్యాలీల్లో కనిపించిన యాక్టివిస్టులే అనేక మంది కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. బాబ్ ముల్లర్ విచారణ ఒక పక్క నడుస్తున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మర్నాడే అటార్నీ జనరల్ ను తొలగించి తనకు అనుకూలమైన మాథ్యూ విటాకర్ ను నియమించాడు. ఇది ముల్లర్ విచారణను నిరోధించడానికి తీసుకున్న చర్యేనని జనంలో నిరసన మొదలయ్యింది. వెనువెంటనే నిరసన ప్రదర్శనలతో రోడ్ల మీదకు వచ్చారు.  ఎన్నికల సమయంలో క్యూలో నిలబడి ఓట్లు వేసిన వారు. ఆ రాత్రంతా ఎన్నికల ఫలితాల కోసం మేల్కొని ఎదురు చూశారు. మరునాడు గెలిచిన ఆనందాన్ని ఉత్సవంగా మార్చుకొని ఆ రాత్రంతా వేడుకలు చేసుకున్నారు.  ఆ మరునాడు,గురువారం సాయంత్రం 5 గంటలకు(తూర్పున ఉన్న  రాష్ట్రాల్లో చీకటి పడుతుంది), దేశవ్యాప్తంగా 1000 నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి నిరసన ర్యాలీలు చేపట్టారు, “బాబ్ ముల్లర్ ను కొనసాగించాల”ని, ప్లే కార్డులు పట్టుకొని.

చిగురిస్తున్న కొత్త ఆశలు

అక్యుపై వాల్ స్ట్రీట్ అన్నది ఎనిమిదేళ్ళ కిందటి నినాదం. ఆ నినాదాన్ని అందుకొని, యువత రోడ్ల మీదకు వచ్చారు. శాసనోల్లంఘన చర్యలతో బైటాయింపులు, నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రతి సమస్యను రాజకీయం చేసి మాట్లాడగలుగుతున్నారు. కార్పొరేట్ శక్తుల, వ్యాపార వర్గాల లాభార్జనే ప్రమాదకరంగా మారిందని, ప్రభుత్వ యంత్రాంగం లోకి ప్రవేశించి, తమకనుకూలమైన విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ‘మిలీనియం’ యువత ఉవ్విల్లూరుతున్నది.

నిస్సంకోచంగా తమను తాము ‘ప్రగతిశీలురు’గా ప్రకటించుకునే అభ్యర్థులు వందమంది దాకా ఈసారి కాంగ్రెస్ కు ఎన్నికయ్యారు. కేవలం ప్రొగ్రెసివ్ అని మాత్రమే కాదు, తాము డెమొక్రటిక్ సోషలిస్ట్ లమని, తమ నాయకుడు బెర్నీ శాండర్స్ అని సగౌరవంగా చెప్పుకుంటున్నారు. బెర్నీ శాండర్స్ డెమొక్రటిక్ పార్టీలో ఒక ఫ్యాక్షన్ లీడర్ గా, యువతలో ప్రగతిశీల భావాలను రేకెత్తిస్తున్నారు. ఆయన మధ్యంతర ఎన్నికలకు ముందు ప్రిలిమనరీ ఎన్నికల సమయంలో తన వెంట నడిచిన చురుకైన కార్యవాదులను ( యాక్టివిస్టులను) బరిలో నిలపడమే గాక, వారి వారి ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేశారు. ఆయన వెంట నడుస్తున్న యువతను ముఖ్యంగా అలెగ్జాండ్రియా. ఇల్హన్ ఒమర్, రషీదా,అయన్న ప్రెస్లీ …  ఇంకా కొత్తగా కాంగ్రెస్ కు ఎన్నికయిన అనేక మందిని చూస్తే కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.