అమ్మ బయలెల్లినాది

ఆకాశంలో సగమే గానీ,
విడిపోయిన అన్నదమ్ముల
చట్టసభలో మాత్రం
నీ మెత్తటి పాదాలకి ఇంత జాగా దొరకలేదు
చూపుడువేలు మీది సిరాచుక్కలో
లింగవివక్ష నీడ,
సాధికారతకు అర్ధం చెరిపిన నిఘంటువులో
బుగ్గన చుక్కపెట్టుకుని కిసుక్కున నవ్వుతుంది
రాజకీయం ఎక్కడైనా ఒకటే అని తెలిసింది
నీ నవ్వుల్ని అది మొహాన పులుముకుని
మోసం కుర్చీలో దర్జాగా కూర్చుంటుంది
దాని సిగ్గులేని చేష్టలకి నువ్వో  సిగ్గుబిళ్ళ తగిలించుకుని చప్పట్లు కొడుతుంటావు
ఏ దాపురికమూ లేదు
నీ జాకెట్ హుక్కులు తెగినా
చీర కొంగు చిరిగిపోయినా
ప్రచార సభల్లో నువ్వొక గ్లామర్ జై జై నాదానివి
కోటి రతనాల వీణ చేదుగా పాడిన  రాగానివి
నిన్ను
గుళ్ళో కాళ్ళు మోపే భక్తిలో ముంచి
మళ్ళీ అధికారం నీమీద పెత్తనం చేస్తోంది ..
ఆంధ్రోడో ..నయా నైజామోడో..
నువ్వు యజ్ఞం దగ్గర పసుపు చల్లు
మహిమగల తాయత్తుని చేతిక్కట్టు
అమ్మ బయలెల్లినాది,
దారికడ్డం రాకు.

లావణ్య సైదీశ్వర్

6 comments

  • నేటి రాజకీయ వాస్తవ పరిస్థితికి పూర్తిగా అద్దం పడుతోంది ఈ కవిత.రాజకీయ నాయకులు, వినాయకులు చెప్పే మాటలకు, చేసే పనులకు ఉన్న తేడాను తెలుపుతోంది. వారికి ఈ కవిత ఓ చెంపపెట్టులాంటిది.

  • నిజమే
    నిఘంటువులు నవి పోయాయి
    తాయత్తులే దిక్కయ్యాయి

  • చాలా బాగుంది లావణ్య గారు … అద్భుతమైన జానపద వాక్యం కవితగా మలిచారు ..గ్రేట్

  • చట్ట సభల్లో మహిళా ప్రాధాన్యత మీద మీ జ్వలనం బాగుంది. ఈసారి తీవ్రత పదునెక్కింది. మీ కవితల్లో సామాజిక స్పృహ ఎక్కువ పాళ్ళు కనిపిస్తుంది. అభినందనలు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.