ఒక అపద్దాలు…

అప్పుడేమయిందో తెలుసా?

తెలీదు!

‘అమ్మా’ అని ‘మా’కి దీర్ఘమిచ్చినట్టు.. మామూలు దీర్ఘం కాదు, మహా దీర్ఘమిచ్చినట్టు అరిచాడు నాని. పచ్చిమిరపకాయను నమిలి, నాలుక మీద పెట్టుకొని చప్పరిస్తే ఎలా కళ్ళల్లో నీళ్ళూరుతాయో నానిగాడి కళ్ళలో అలా నీళ్ళూరిపోయాయి. టపటప పెద్ద పెద్ద చినుకులు పడ్డట్టు నీళ్ళు బొట్లు బొట్లుగా రాలాయి.

స్వీటీ నోరు మూసేశాం. చిన్నిగాడి కళ్ళు మూసేశాం. బుజ్జిగాడి చెవులు మూసేశాం. బబ్లీగాడు వార్నింగు ఇస్తూ బెత్తంలా చూపుడు వేలిని తిప్పాడు. అందరం సైన్సు క్లాసు విన్నంత సైలెంటయిపోయాం. హెడ్ మాష్టారిలా నానీ వాళ్ళ అమ్మ పరుగున వచ్చింది. మిగతా స్టేఫ్ లా వెనకాలే మా అందరి మమ్మీసూ డాడీసూ వచ్చేశారు.

‘ఏమయిందర్రా?’ నానీ వాళ్ళమ్మ అడిగిందే అందరూ అడిగారు.

నానీగాడు ఏడుస్తున్నాడు పాపం.

‘వాట్ హేపెండ్?’ నానీ వాళ్ళ నాన్న అడిగాడు, అందర్నీ తోసుకు ముందుకు వచ్చి.

నానీ ముందు మౌనంగా చూశాడు. ‘నిన్నేరా’ అడిగేదన్నట్టు చూసింది వాళ్ళమ్మ.

నానిగాడు మెల్లగా తలెత్తి మా అందరివంక చూశాడు.

‘ఏమయిందర్రా?’ ఒకర్ని కాదు, అందర్నీ చూస్తూ అడిగింది అమ్మ.

‘ఏమయింది?’ డాడీల వాయిస్సూ లుక్సూ సీరియస్సే.

‘ఏమయింది?’ మేమూ అదే అన్నాం.

‘ఎందుకేడ్చావ్.. నానీ చెప్పకపోతే తొడపాశం తీస్తా’నంది వాళ్ళమ్మ. తీసుకో అన్నట్టుగా నిక్కరు ఎత్తాడు నానీ.

నానీ తొడమీద ఎర్రగా రక్తం చిమ్ముతూ గుండ్రని గాటు.. కాటు?!

నానీ పేరెంట్స్ కే కాదు, మా పేరెంట్స్ కీ.. అందరు పేరెంట్స్ కీ మాట రాలేదు.

‘ఏంఠ్రా అది? ఏమయింది?’ అప్పుడే చూసినట్టు అన్నాడు బబ్లూ.

‘క.. క.. క్కరిచింది..’ అన్నాడు నానీ.

స్వీటీ నోరు తెరచి అవునా అన్నట్టు నోటికి అరచెయ్యి అడ్డం పెట్టుకుంది. పొడికళ్ళను తుడుచుకుంటూ చిన్నిగాడు తలడ్డంగా ఊపాడు. బుజ్జిగాడు తన చెవి తమ్మెలు తనే కిందికి లాక్కున్నాడు, సాగదీస్తూ.

‘ఎవరు కరిచార్రా?’ కరిచేద్దామన్నంత కోపంతో నానీ వాళ్ళమ్మ.

‘ఎవర్రా?’ ఊగిపోతూ వాళ్ళ నాన్న.

నానీగాడు చెయ్యి చూపించాడు. స్వీటీ పక్కకు తప్పుకుంది. నానీ చూపించిన వంకే అంతా చూశారు. మింటూ అర్థం కానట్టు చూస్తోంది.

‘మింటూనా?’ కరెంటు షాక్ కొట్టినట్టు పేరెంట్స్.

‘ఓ మై గాడ్.. డాగ్ బైట్..’ తలడ్డంగా ఊపారు నానీడాడీ. నానీ వాళ్ళమ్మ ఏడ్చేస్తోంది. ‘తొందరగా హాస్పిటల్ కు తీసుకుపోండి’ గ్రాండ్ ఫాదర్ ఆయాసపడుతూ అరిచారు.

‘బొడ్డు చుట్టూ ఇరవై నాలుగు ఇంజక్షన్లు వెయ్యించాలి’ గ్రాండ్ మా చెప్తే, ‘అది మీ కాలంలో. ఈ కాలంలో అక్కర్లేదు..’ అన్నాడు అంకుల్. ‘ఏంటి ఇంజక్షనే అక్కర్లేదా?’ గ్రాండ్ మా విస్తుపోయింది. ‘అదికాదు..’ అంకుల్ చెప్పబోయి ఆగిపోయాడు. అప్పటికే నానీని హాస్పిటల్ కు తీసుకు వెళ్ళిపోయారు.

మింటూ కుయ్ కుయ్ మని అరుస్తోంది.

‘నానీగాడికి ఏం కాదుకదా?’ స్వీటీ ఏడ్చేసింది. ‘ఏం కాదమ్మా’ అని వాళ్ళమ్మ స్వీటీని ఎత్తుకుంది.

‘పిల్లలకి ఒకరంటే ఒకరికి ఎంత దోస్తీ.. ఎంత దోస్తీ..’ అని ముచ్చటపడి ముద్దులు కురిపించింది గ్రాండ్ మా.

తర్వాత తొడకు బ్యాండేజ్ తో వచ్చాడు నానీ. తెల్లటి బ్యాండేజి తొడకు వెండి కడియం వేసినట్టుగా బాగుందని, ఇంకో కాలు ఖాళీగా వుంది వేసుకుంటావా? అని, ఎకసెక్కాలాడ్డం లేదనీ అంది గ్రాండ్ మా.

‘ఇకమీదట మీయమ్మగాని ఏ టీచరుగాని నీకు తొడపాశం ఇవ్వరులే, మంచి చోటే కరిపించుకున్నావ్..’ నానీని మెచ్చుకున్నారు గ్రాండ్ పా.

నానీకి మేమంతా ఆటపాటల్లో ఫస్టు ప్లేసు ఇచ్చాం. క్రికెట్ లో టాస్ వెయ్యకుండానే వాడికి బేటింగ్ ఇచ్చాం. వికెట్ పడిపోయినా వాడు కొట్టిన బంతి క్యాచ్ అయిపోయినా అవుట్ కాదు. బాల్ దూరంగా పడినా వెళ్ళి తీసుకురాడు. మేమే తెచ్చి ఇవ్వాలి. స్కూలుకు పోతే బ్యాగ్ కూడా మేమే మొయ్యాలి. నోట్సు మేమే రాయాలి. హోం వర్క్ మేమే చెయ్యాలి. స్కూలుకు వెళ్ళే ఆటోలో మేం ముందు వచ్చి కూర్చున్నా లేచి ఆలస్యంగా దర్జాగా వచ్చిన నానీకి సీటు ఇచ్చేవాళ్ళం. మొదట్లో పోనీలే అని ఇచ్చేవాళ్ళం. తర్వాత కానీలే అనుకున్నాం. కాని.. కాని..

నానీగాడికి ఇంజక్షన్సు.. కోర్సు కంప్లీటయిపోయాయి. గాయం మానిపోయింది. అయినా గాని నానీకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇంకా ఇవ్వడం మా బ్యాచ్ లో చాలా మందికి నచ్చలేదు. వాడితో అదే చెప్పాం.

‘ఉండండి మీ పని చెప్తా..’ నానిగాడు ఇంటికి వెళ్ళబోతుంటే, మేమంతా భయపడి పరిగెత్తుకు వెళ్ళి బతిమాలుకున్నాం. నీకెలా కావాలంటే అలాగే అన్నాం.

ఇలాగే ఎప్పటికప్పుడు నానీతో గొడవలు వచ్చేవి. సీన్ రిపీట్ అయ్యేది. వాడు మమ్మల్ని కంట్రోల్లో పెట్టే రిమోట్ కంట్రోల్ అయ్యాడు. మేం ఫీలయితే వాడు ఫోజు కొట్టేవాడు. మాతో కావాలనే చాలా పనులు చేయించేవాడు. వాడోసారి నాతో బూటు లేసు ఊడితే కట్టించాడు. భరించడం మావల్ల కాలేదు. అడిగాం.

‘మా పేరెంట్సుకు చెప్పేస్తా’నన్నాడు నానీ.

‘చెప్పుకో’ అన్నాడు బుజ్జి.

‘చెప్పేస్తా’నన్నాడు నానీ.

‘చెప్పుకోబే’ అన్నాడు బుజ్జి.

‘బే అంటావ్ బే’ నాని!

‘ఔను బే’ బుజ్జి!

‘బే బే బే బే బే బే బే..’ బుజ్జి అంటూనే ఉన్నాడు.

‘మీ ఇద్దరి గొడవ కాదుగాని, మా చెల్లికి బేండయిపోతుంది..’ అన్నాను కంగారుగా. అప్పటికీ ఆపరా అన్నట్టు బుజ్జిగాడి గెడ్డాము పట్టుకున్నాను. ఆపడే?

‘బైట్ తగ్గిపోయిందిగా, చెప్పుకోని..’ అంది స్వీటీ. ఆమాట చాలా పొగరుగా లెక్కలేనట్టుగా అంది.

నానీకి బాగా కోపం వచ్చింది. ‘మింటూ (కుక్క) కాదు, నువ్వే కరిచావని నిజం చెప్పేస్తా’ స్వీటీకి వార్నింగు ఇచ్చాడు నానీ.

చిన్నిగాడు తలతిప్పకుండా కనుగుడ్లు టుయ్ టుయ్ తిప్పుతూ ‘స్షో.. స్షో.. ఉస్షో..’ అంటున్నాడు.

‘నువ్వేంట్రా మధ్యలో?’ అంటే-

‘స్షో.. ఉస్షో..’ అన్నాడు మళ్ళీ చిన్ని.

నానీగాడితో పాటు మేమంతా తలతిప్పి చూశాం. ఉలిక్కిపడి వెనక్కి అడుగులు వేశాం.

గ్రాండ్ మా – గ్రాండ్ పా మావంకే కళ్ళార్పకుండా చూస్తున్నారు.

మేమలాగే ఉండిపోయాం.

స్వీటీ మాత్రం తుర్రున ఇంటికి పారిపోయింది.

వెనకాలే నానీ పరిగెత్తాడు.

బబ్లూ నేనూ బుజ్జీ చిన్నీ అంతా ‘ప్లీజ్ రా.. ప్లీజ్’ అని బతిమాలుకున్నాం. మాటలు రానట్టు తలడ్డంగా ఊపారు గ్రాండ్ మా అండ్ పా.

‘మీరు మామూలు పిల్లలు కారురా, దేవాంతకులు..’ అని విస్తుపోతూనే ఉన్నారు.

‘ఊ.. అంటే.. అది.. స్వీటీదేం తప్పులేదు.. తను అడిగింది చేతిమీద నీకు వాచీ ఇస్తానని. నానీగాడే నో అన్నాడు..’ బబ్లూ మాట పూర్తి కాలేదు.

‘అందుకని తొడమీద ఇచ్చిందన్న మాట వాచీ..?’ గ్రాండ్ మా మాట్లాడేదే, పా ఆగమన్నట్టు చూశారు. బబ్లూని చెప్పమన్నట్టు చూశారు.

‘సరదాకే కరిచింది, చక్కిలిగింతలు వేసి ఈ నానీగాడు అటూ యిటూ కదిలాడు.. గట్టిగా పట్టేసింది..’ బబ్లూగాడు చెప్తుంటే ‘ఎక్కడ దొరికితే అక్కడ పట్టేసింది’ గ్రాండ్ మా మాటకు ఔనన్నట్టు తలూపాం. ‘ఊ’ చెప్పమన్నట్టు పా.

‘నానీగాడిప్పుడు పేరెంట్సుకు చెపితే మమ్మల్ని కలిసి చదువుకోనివ్వరు..’ బాబ్లూగాడు బాధపడ్డాడు. ‘ఇంకో మాట చెప్పు’ అంది గ్రాండ్ మా.

‘పేరెంట్సుకు చెపితే మమ్మల్ని కలిసి ఆడుకోనివ్వరు..’ తలదించేశాడు బబ్లూ.

‘చెల్లిని కొట్టేస్తారు కదా?’ అన్నాను.

‘అందుకని?’ గ్రాండ్ పా.

‘నిజం చెప్తే, పేరెంట్స్ డిష్యుం.. డిష్యుం ఫైట్ చేసుకుంటారు కదా?’ అన్నాడు బుజ్జి.

‘ఓహో..’ గ్రాండ్ మా.

‘అందుకే అపద్దం చెప్పాం, సారీ.. ప్లీజ్..’ తలడ్డంగా ఊపాడు చిన్ని.

‘బావుంది, చాలా బావుంది’ కూడబలుక్కున్నట్టు అన్నారు గ్రాండ్ మా అండ్ పా.

‘నానీగాడికి మళ్ళీ కుక్క కరిచింది’ అంటూ చింటూ పరిగెత్తుకు వచ్చి ఆయాస పడుతూ చెప్పాడు.

‘ఏ కుక్క?’ మాలాగే గ్రాండ్ మా అండ్ పా అడిగారు.

చింటూగాడు తెలీదన్నట్టు అడ్డంగా తలూపాడు.

‘రెండు జెళ్ళ కుక్కా? నాలుగు కాళ్ళ కుక్కా?’ గ్రాండ్ మా ఆరా తీయబోతే-

ఏమో తెలీదన్నాడు వాడు.

మెల్లగా వచ్చిన స్వీటీ స్వీట్ వాయిస్ తో నాక్కూడా తెలీదన్నట్టు అడ్డంగా తలూపింది.

మాకు మళ్ళీ ఏ కుక్క కరిచిందో తెలీలేదు?

మీకు తెలుసా?!

-కె. వికాస్,

సిస్త్ క్లాస్ ‘ఢీ’

ఢిల్లీ పబ్లిక్ స్కూల్.

 

 

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.