చావుకు వొచ్చిన తుమ్ము

(చదివిన వాళ్ళకు మొదటి పేరా లోనే తెలిసిపోతుంది… ఇది ఆంటన్ చెహోవ్ కథే. (డెత్ అఫ్ ఎ గవర్నమెంటి క్లర్క్) తెలుగులోకి కూడా వొచ్చిందెప్పుడో. ఇది మరో అనువాదం, బాగా స్వేచ్చానువాదం. చదవని వాళ్ళకు కథ మొదటి సారి. చదివిన వాళ్ళకు ఈ అనువాదం మొదటి సారి– ఎడిటర్.)

 

ఇలాంటి సాయంత్రాలు జీవితంలో ఒక్కసారే వస్తాయ్, ఒక మనిషి చేయవలసిందల్లా ఆ సాయంత్రం వచ్చిందని గుర్తించడమే. ఈ సాయంత్రం అతని కోసమే పూసిన పువ్వు అని అర్థమైంది దయానిధికి. మరి ఈ పువ్వుని ఇలాగే చూస్తూ ఆనందిస్తానో లేక తెంపి వాడగొడతానో అనే భయం అతనిలో మొదలైంది. అతనొక పిరికివాడని, బలహీనుడని అతని అభిప్రాయం. అందరి అభిప్రాయం కూడా అదే అని అతని భావన. అందుకే ఆ అభిప్రాయానికి తగ్గట్టుగా నడుచుకుంటాడు.

జీవితంలో చేయవలసిన పనులన్నీ ఆ సాయంత్రంతో అయిపోయినంత ప్రశాంతంగా కూర్చోని తాజ్ హోటల్లో జరుగుతున్న ఇళయరాజా కాన్సెర్ట్ ని వింటూ వీక్షిస్తున్నాడు దయానిధి. భయాలు, బాధలు, బాధ్యతలు లాంటివి అన్ని ఇతన్ని సస్పెండ్ చేసాయి ఈ సాయంత్రానికి. మాములుగా అందరూ కళ్ళు ముసుకుంటే కానీ నడవలేని దయాకి ఈరోజు స్టేజి మీదకి వెళ్లి ఇళయరాజాని ఎత్తుకుందాం అన్న ఆలోచన వచ్చింది. అతనికి ఆ ఆలోచన రావడం కూడా అది చేసినంత పనే. అతని చుట్టూ జరుగుతున్న  ప్రతి విషయం అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది., పక్కన వాళ్ళు కనురెప్పలు కొట్టడం చేతి వేళ్ళు కదల్చడం కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయగలిగాడు. కానీ ఉన్నట్టుండి-ఉన్నట్టుండి రచయితలు ఈ ‘ఉన్నట్టుండి’ అనే పదాన్ని వాడేస్తుంటారు. అది నిజమే కదా జీవితంలో అన్ని సర్ప్రైజింగ్ గా జరిగేవే కదా-అయితే ఉన్నట్టుండి దయా ముఖం దగ్గరికయ్యింది, కళ్ళు మూసుకుపోయాయి, ఊపిరి అందడంలేదు…ఆకకక్షి…అంటే తుమ్ము.దయానిధి కి అలా తుమ్మడం ఏమాత్రం తప్పుగా అనిపించలేదు. ఈ మధ్య తుమ్మే హక్కు అందరికి వచ్చింది. ఎవరైనా ఎక్కడైనా తుమ్మోచ్చు డాక్టరైనా, కవియైనా, నక్సలైట్, ప్లంబర్ అందరు అందరూ తుమ్ముతున్నారు.అతని తుమ్ము వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగిందా అని చుట్టూ చూసాడు. హమ్మయ్య ఎవరు చూడలేదు అనుకుంటూ నెమ్మదిగా తల పైకెత్తి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసాడు, ఆ పెద్దాయన తన బట్టతల, మెడ మీద కర్చీఫ్ తో తుడుచుకుంటూ ఎదో గొణుక్కుంటున్నాడు.ఆ పెద్దాయనని భాస్కర్ గా కంటోన్మెంట్లో ఉండే ట్రాఫిక్ ఎ సి పి గా గుర్తుపట్టాడు. 

“నేను ఈయన మీద తుంపర్లు చల్లాను, ఇతను నా సీనియర్ కావచ్చు కానీ నా డిపార్ట్మెంట్ కాదు అయినప్పటికీ నేను చేసింది తప్పే క్షమాపణ కోరాల్సిందే” అని అనుకున్నాడు. చిన్నగా దగ్గి, గొంతు సరిచేసుకొని ముందుకు వంగి ఆ మిలిటరీ పెద్దాయనతో “నన్ను క్షమించండి సార్! ఎదో యాదృచ్చికంగా జరిగిపోయింది” అని చెప్పాడు దయా.

“పర్లేదులే…పర్లేదు”

“నిజంగా సార్… నేను కావాలని చేయలేదు”

“సరే బాబు..వదిలేయ్, నన్ను సంగీతం విననివ్వు”

దయానిధి కి ఇబ్బందిగా అనిపించింది.ఎం చేయాలో అర్థంకాక ఓ పిచ్చి నవ్వు నవ్వి స్టేజి వైపు తిరిగాడు. కానీ ఇప్పుడు అతను ఏమాత్రం ఆనందంగా లేడు నిజానికి ఎంతో విచారంగా చేసిన పనికి కుమిలిపోతున్నాడు. షో మధ్యలో భాస్కర దగ్గరకి పోయి మోహమాటాన్ని జయించి “నేను మీ మీద తుంపర్లు చల్లాను, మీరెంతో పెద్దవారు..దయచేసి నన్ను క్షమించండి.” అని ఆయన చెవిలో గుణిగాడు.

“అరే! ఇక చాలు…నేనది ఎప్పుడో మర్చిపోయా, నువ్వు కూడా మర్చిపో.”అని ఎంతో అసహనంగా పెదవి కొరుకుతూ చెప్పాడు. దయానిధి అనుమానంగా అతని వైపు చూస్తూ “మర్చిపోయా అని చెప్తున్నాడే గాని అతని చూపు మాత్రం ఇంకా నన్ను కోపంగానే చూస్తుంది. నేను అదంతా కావాలని చేయలేదు అని చెప్పాలి కానీ ఎలా అతనికి నాతో మాట్లాడటమే ఇష్టం లేదు. తుమ్ము వచ్చినప్పుడు తుంపర్లు జల్లడం ప్రకృతిలో సహజం అని చెప్పాలి లేకుంటే అతని మీద ఉమ్మేసాను అని అనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు షో చూడటానికి మర్చిపోయినట్టు నటిస్తున్నాడే గానీ తర్వాత ఖచ్చితంగా ఉమ్మేశాననే అనుకుంటాడు.”

షో అయిపోయింది. తల ఏమాత్రం పైకెత్తకుండా, కింద ఏమాత్రం చూడకుండా అసలు ఎటు చూస్తున్నాడో ఎం చేస్తున్నాడో కూడా అర్థంకానంత ఖాళీ బుర్రతో అలా నడుస్తూ ఇల్లు చేరుకున్నాడు. జరిగినదంతా అతని భార్యకి చెప్పాడు, కానీ ఆమే పెద్దగా పట్టించుకోలేదు. మొత్తం విన్నాక కాస్త భయపడింది కాని భాస్కర్ దయా డిపార్ట్మెంట్ అధికారి కాదని తెలిసాక మళ్ళీ కొలుకుంది. ”అయినప్పటికీ, నువ్వు వెళ్ళి క్షమాపణ అడగడం మంచిది, లేకపోతే నీకు పెద్దవాళ్ళ ముందు ఎలా ప్రవర్తించాలో తెలిదనుకుంటాడు” అని సలహా ఇచ్చింది భార్య.

“నేను అక్కడే క్షమించమని అడిగా అని చెప్తుంటే…నేను ఆల్రెడీ అడిగా కానీ అతను నన్ను పట్టించుకోలేదు, వినలేదు…అసలు మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదు.”

మరుసటి రోజు పొద్దున్నే జుట్టు, గడ్డం చిన్నదిగా కత్తిరించి యూనిఫాం వేసుకుని తయారయ్యి భాస్కర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొత్తగా ఉద్యోగంలో చేరిన పోలీసులకి ట్రాఫిక్ రూల్స్ పై శిక్షణ నిర్వహిస్తున్నాడు భాస్కర్, వెనకాల నిలబడి ఎదురుచూస్తున్నాడు దయానిధి. దయాని చూసిన భాస్కర్ ’ఎవరు నువ్వు’ అన్నట్టుగా కనుబొమ్మలు ఆడించాడు వెంటనే ఆయన దగ్గరికి ఉరికి ఆయాసపడుతూ “సార్ నేను, మీరు నిన్న తాజ్ హోటల్ కి రావడం గుర్తున్నట్టయితే, అక్కడ ఒకతను మీ మీద తుంపర్లు పడేట్టుగా తుమ్మాడు గుర్తుందా..అది…అత…”

“ఏంట్రా ని సోది…ఎం కావాలిరా నీకు. ఇంకా తుమ్మ, తుంపర్లు అంటూ”అని కోపడ్డాడు అధికారి(భాస్కర్)

‘ఈయనకి నాతో మాట్లాడటమే ఇష్టం లేదు అంటే ఇంకా నామీద కోపంగానే ఉన్నారు, మర్చిపోలేదు… లేదు ఇలా వదిలేయకూడదు నేనొక మరియాదస్తుడ్ని క్షమించే వరకి క్షమాపణ కోరాల్సిందే లేదంటే నాకు నిద్ర కూడా పట్టదు.’

శిక్షణ పూర్తయ్యాక భాస్కర్ తిరిగి వెళ్తుండగా దయా త్వరత్వరగా ఉరికి “సార్! మీరు చాలా గొప్పవారు, మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం తప్పే.కానీ దయచేసి నన్ను క్షమించండి సార్. నేను నిన్న కావాలని అలా చేయలేదు, నన్ను నమ్మండి.”

భాస్కర్ చూపు చిన్నదిగా చేసి కాస్త బాధగా దయాని చూస్తూ “ఎందుకు సార్ మీరు నన్ను పరహాసం చేస్తూ ఆటపట్టిస్తున్నారు” అని అంటూ క్యాబిన్ తలుపులు మూసేసాడు.

దయానిధి నీరసంగా ముందుకు రెండడుగులు వేసి ఆగి వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా ఆ క్యాబిన్ తలుపులు చూస్తూ “అసలు ఇందులో ఆట ఎక్కడుంది, అలాంటిదేమీ లేదసలు! ఒక అధికారి అయ్యుండి, ఆ మాత్రం అర్థంచేసుకోలేడా? నేనింకా ఈ పిచ్చడిని బ్రతిమాడలేెను.పోతే పోనీ బొంగులో మరియాద. అయినా నేనేంటి మరియాద కోసమే చేస్తున్నానా, నాలో ఉన్న పశ్చాత్తాన్ని పోగొట్టుకోవడం కోసం కాదు.ఎదో ఒకటి ముందు నాలో ఈ భారం తగ్గించుకోవాలి .కానీ, ఎలా నాకు అతన్ని కలవడానికే భయంగా ఉందే. అవును లెటర్ రాస్తే ?  హా! అవును లెటర్ రాసి పంపుతా.” ఇలా ఏ అడ్డుకట్ట లేకుండా సాగిపోతున్న అతని ఆలోచనల్ని అలాగే వింటూ ఉండిపోయాడు. ఇంటికి వెళ్ళి లెటర్ రాద్దామని పెన్ను పట్టుకుని కూర్చున్నాడు, అతని గుండె గట్టిగా కొట్టుకుంటున్నది, చేతులు వణుకుతున్నాయి. ఒక్క అక్షరం కూడా రాయలేకపోయాడు. ఇక చేసేదేమి లేక ఫైనల్గా రేపు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూద్దాం అని నిర్ణయించుకున్నాడు.

పొద్దున్నే మళ్ళీ అతని ఆఫీసుకు వెళ్ళి “సార్! నేను మీ పనికి భంగం కలిగించడానికి రాలేదు, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేను మిమ్మల్ని ఆటపట్టించాలని ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండా తుమ్మినందుకు..తుంపర్లు చల్లినందుకు క్షమాపణ అడగడానికి మాత్రమే వచ్చాను తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశము నాకు లేదు. అయినా అసలు మీతో ఆటలాడేంత మనిషీనా నేను. ఒక మనిషిని వేళాకోళం చేయాలనే ఊహ కూడా నాకు రాదు. అసలు ఏ మాత్రం గౌరవం, మరియాద లేకుండా ఒక మనిషి ఇంకో మనిషిని ఎలా పరహాసం చేస్తాడో కూడా నాకు అర్థంకాని విషయం.

అధికారి ఆవేశంగా చూస్తూ, కోపంతో ఊగిపోతూ “రేయ్! వెళ్ళరా ఇక్కడ్నుంచి” అంటూ దండించాడు.

దయా భయంతో నెమ్మదిగా, అతనికి కూడా వినిపించనంత చిన్నగా “ఏంటి?” అని వణుకుతూ గుణిగాడు

“పోరా నాయాల! ఇంకోసారి కనిపిస్తే కాల్చేస్తా” అని వేలు చూపిస్తూ బెదిరించాడు

దయానిధి మనసులో ఎదో వెలితిగా, ఖాళీగా అయినా బరువుగా తోచింది, వెనక్కి తిరిగి ఎటో తెలియకుండా నడుస్తూ ఎక్కడికో చేరి ఆగి..మళ్ళీ నడుస్తూ కనిపించని, వినిపించని, ఆలోచించలేని అవయవాలను భారంగా మోసుకుంటు ఎలాగోలా ఇంటికి చేర్చి సోఫా మీద ఎత్తేసి…అలా సోఫాలో ఒరిగి…ఇక ఎప్పటికి లేవకుండా అలా…

ఈ కథ అనువాదకుడు: డేగల హిమసాయి.  సూర్యాపేటలో పుట్టి పెరిగారు. తనకిది మొదటి అనువాదం. హిమసాయి హైదరాబాదులో వుంటారు. ఆయన ఫోన్: 8309749007 

ఆంటన్ చెహోవ్/ హిమసాయి

ఆంటన్ చెహోవ్ గురించి తెలుసుకోడానికి ఈ కింది లింకులీ చూడండి
https://en.wikipedia.org/wiki/Anton_Chekhov

2 comments

  • ఏదో సినిమాలో కామెడీగా చూపించేరు. కమెడియన్ పొరపాటున వేరొకరి భార్యని ముద్దు పెట్టుకుంటాడు. ఆమె భర్త కనిపించినపుడల్లా క్షమాపణ చెప్తూ ఆయనని విసిగిస్తాడు. అనువాదం బావుంది.

    • థాంక్యూ సార్, నేను నిన్న చూసిన ఆ కామెడీ scene ‘ప్రియరాగాలు’ సినిమా అది.

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.