చినుక్కింద దాక్కున్న మట్టి పూవు

కవయిత్రి: స్వేచ్చ

కవి శిలాలోలిత పుస్తకం ముందు మాటలో ఒక మాటన్నారు. “ప్రేమ, విరహం, శృంగారం, వియోగం స్త్రీలకు నిషిద్థవిషయాలని సమాజం భావిస్తోంది. స్త్రీల  రచనల్లో అవి మాత్రం కనబడినా ఎవరై వుంటారు? అని డైరెక్ట్ , ఇండైరెక్ట్ గా చర్చిస్తూ వుంటారు. అది మారాలింకాఅన్నారు. లోపలొకటి బయటకొకటి అనదలుచుకోలేదు.  అది చాలా కష్టసాధ్యమైన విషయమే.

కవిత్వం చదివిన తరువాత ఎవరికైనా వచ్చే మొదటి అనుమానం అదేనేమో ?ఎవరి గురించి రాసిందీవిడా ? అని. అవును అసలు ఎవరి గురించైనా అనుకున్నపుడు అది వ్యక్తిగురించా ? లేకనువ్వూ నువ్వూఅన్నప్పుడల్లా అదేమీ కాదనుకుంటే ఏదన్నా ఒక అశరీర రూపం గురించా ? ఆసక్తి సహజం. తప్పా ఒప్పా నిర్ధారించలేము గానీ ఒక స్త్రీ అభివ్యక్తిలో దుఖ్ఖం బద్దలవుతున్న శబ్దం మెలమెల్లగా చెవుల్లోంచి గుండెల్లోకి జారుతున్నప్పుడు దాన్ని వ్యక్తిగతం లోకి ముడివేసుకుని చదువుకోవడం పూర్తిగా అసహజం కాదేమో ! అందునామట్టి పూల గాలిలాంటి ఆత్మాశ్రయ కవిత్వం చదువుతున్నపుడు ఈమె ఎందుకింత దుఖ్ఖాన్ని కవిత్వీకరించింది ? ఇంత దిగులు మనకెందుకు బట్వాడా చేస్తోంది ? అసలు ఇలాంటి కవిత్వ ప్రయోజనం ఏముంటుంది ? లాంటి  ఎన్నో ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయి. చాలా అసహన పడతాం. “నువు రాని సాయంత్రాన్ని శ్వాసించడం నేర్పలేదెందుకు ? నువ్వుండగా పీల్చిన ఆఖరి శ్వాసనే గుండెను వీడి నీవైపొస్తున్న శబ్దంగా మార్చి నిన్ను వెతకనూ” (శ్వాస-1) అని ఒక వాక్యం, “ఒక వాన నువ్ పక్కన లేనప్పటి బాధను జలపాతం పగిలి భోరుమంటున్నట్టు కురుస్తుంది” (కురావాల్సిందే) అని ఇంకో వాక్యం. ఇలాంటి వాక్యాల్లో ఎవరి గురించో రసవద్వంతంగా  వ్యాఖ్యానం చేస్తుంది కాబట్టి ఒక కుతూహలం హెచ్చరిల్లిపోతుంది. స్వేచ్ఛ ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు. ”మెరుగైన సమాజం కోసం చూస్తూనే ఉండండి టీవీ నైన్”, అని చక్కటి గొంతుతో మాట్లాడే టీవీ జర్నలిస్ట్. మనం చాలా సార్లు చూసివుంటాం. కానీ ఆమె కవిత్వాన్ని మాత్రం అందరమూ చదివి ఉండం. కవిత్వ పుస్తకం చక చకా చదివిస్తుంది. అంత అందమైన దుఖ్ఖ ప్రేమ ఉన్న కవితలివి. పుస్తకంలో ప్రకృతి, ఒక బుజ్జి పాపాయి, ఒకరెవరో ఉన్నారో, లేరో, ఇతమిద్దంగా తెలీని ఒకనువ్వు“. ముగ్గురూ మనల్ని పట్టుకుని ఊపేస్తారు. ఒకరు దుఖ్ఖ ప్రేమ, ఇంకొకరు పసితనం, చివరాఖరిది ఒక క్వశ్చన్ మార్క్, అదే ఎవరి గురించి ? అంతే.

ప్రకృతిని చూస్తే ఎలా ప్రేమించాలని ఉంటుంది ? దాంట్లో కూడా ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టయిల్ కదా. కవయిత్రిదీ అంతే. “ఎంత చలి పెడుతున్నా నడి రాతిరో, దొంగతనంగా మేఘపు ముద్దుకోసమేగా ముఖానికి దుప్పటి కప్పుకోనిది”  (నిన్ను తాకలేని రాత్రి) — అని అనడంలా ఉంటుంది. ఆమెకి నేచర్అం టే తగని ప్రేమ. అసలు నేచర్ లో మునిగి పోయిందంటే మిగతా లోకం మొత్తం మరచిపోవడం చాలా సులువుగా తెలిసిపోతుంది. “ఎంత స్వార్థం మంచు బిందువులకి, తదేకంగాపచ్చికను వెచ్చగా కప్పుకున్న కొండల్లో, క్షణాల్లో, ప్రత్యక్షమై కొండల్ని దాటేసి నా చుట్టూ కమ్ముకున్నాయిఇంకెక్కడికి పొతానిప్పుడు గాలినై వీటితో ఆడుకోకుండా” (ఎక్కడికిపోతానిప్పుడు). ఎందుకింత ప్రేమ ? “దారిపొడవునా వెంటాడిందినన్నో, భయాన్నో, ఒంటరితనాన్నోలోపలెలాగూ తడిసి పోయా (?) నటించలేనని తెలిసిపోయిందేమో… ” (మేఘమంత) ఎందుకింత బాధ ? తను బాధని అనుభవించిన క్షణాలన్నింటినీ ప్రకృతిని ఆధారం చేసి మనకి పరిచయం చేయకుండా ఉండదు కదా ! అసలెందుకు ఇవన్నీ మనకి ? తన ప్రేమలో, ఒక రాహిత్యాన్ని వెతుక్కుంటున్న సందర్భం కావొచ్చు. ప్రకృతి ప్రేమ రాహిత్యాన్ని భర్తీ చేస్తుందనా? చేసినట్టే ఉంది. అయితే తన దుఖ్ఖంతోతన కన్నీళ్లతోతన భారమైన హృదయం తోఅదే గమనించదగ్గ తేడా ! ఆకుల్లో, కొండల్లో, చీకట్లో, వెన్నెల్లో తన దుఖ్ఖాన్ని తడిమి చూసుకోవడం, దానిలోంచి తేలికపడేందుకు అదే ప్రకృతిని ఆసరా చేసుకోవడం. చాలా చిత్రమైన అభివ్యక్తిని గమనిస్తాం. ఊహాతీత భావ ప్రకటన మనల్ని ఆకట్టుకుంటుంది.

స్వేచ్ఛ తన కూతురు గురించిన ప్రస్తావన కొన్ని చోట్లే తీసుకొస్తుంది. కానీ గుర్తుండిపోయేట్టు చెప్తుంది. “వేలి కొసలతో నన్ను బొమ్మను చేసేస్తుంది, కళ్ళూ ముక్కూ అంటించి ముద్దాడుతుంది“(రేపటి సంభాషణ కోసం) అన్నపుడు, “నేనూ నా బిడ్డ మనుషుల్లేని చోట ప్రేమించుకుంటూ బతికేస్తాంఅది అడవి తల్లి, నా శ్వాసకు  వయసైపోయింది, ఇపుడు మళ్ళీ పుడతా, నా బిడ్డ పేగు తెంచుకుని.. (పునర్జననం) అన్నపుడు ఒకరి కొకరిపట్ల గల ఆధారభూతమైన గొలుసు మనకి కనపడీ కనపడకుండా కవితా వాక్యాల మధ్య చదువుకోమంటుంది.   గొలుసేమిటి ? తనలోని ప్రకృతీ, ప్రేమా, దుఖ్ఖమూమూడింటినీ ఇన్ఫ్లుయన్స్ చేస్తూ నడుస్తున్న ప్రస్తావన. అది గతంలోంచి తొంగి చూసే జ్ఞాపకానిదైనా, లేక భవిష్యత్తులోకి నడచి వచ్చే లే చివురు లాంటి ఆశైనా ! అందుకే అంతర్ధ్వని ఏమిటి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఎవరైనా సరే, పేరు, ఊరు మనకక్కర్లేదు గానీ, తను మాత్రం  ఆస్వరం గురించే చెప్పింది. ఒక నిరీక్షణ గురించి. గొంతురాత్రి వెన్నెల కధలు చెప్పిన కొలను వైపు, నీ అనుభూతులు కలబోసుకుంటానునువ్వొచ్చే దారి పొడవునా చెట్ల కింద పరచిన పూలు, ప్రతి చెట్టు చాటు నుంచీ నిన్ను తొంగి చూస్తుంటాను” (గట్టు చివర) అని ఎదురు చూస్తుంది. జీవితంలోని నిశబ్దాన్ని, ఒంటరితనాన్ని, రాహిత్యాన్ని ఏమాత్రమూ సహించలేని తనం సుష్పష్టంగా ప్రతీ వాక్యమూ పలికింది. “గాలానికి చిక్కిన చేపనైనా బాగుండు నిశ్శబ్దం కొక్కెంతో గుండె చీలుతోంది; నువ్వు మాత్రమే ఇచ్చే ముద్దు నరనరాన్ని కాల్చేయగలదు, ఈ రాత్రికి ఊపిరాపగలదు. ” (గాలం) అంటుంది.  దాచిందేమీ లేదన్నట్టు మన ఊపిరి ఆపేస్తుంది.చక్కటి కవితా పాదాలు, వాటిల్లో కూరిన అనంతమైన ప్రేమ. ప్రేమ మౌనంగా ఉండిపోయినప్పుడుఛాతీ మీద ఇసుక తుఫానుకు ఎడారి కొట్టుకుపోయింది, ఒక నిశ్శబ్దం మిగిలిపోయిందిఅనేస్తుంది.

ఇలా అనడంలో తన అనుభవం లోంచి మాటలు ఎలా నేరుగా మన ఊహా సీమల్లోకి దూసుకుని వస్తాయో మనం తొందరగా పట్టుకోలేం. కవిత్వీకరణలో వ్యక్తిగతమైన విషయాలు కవయిత్రి చాలా నిర్భయంగా చెప్పడంతో చిన్న చిన్న సందర్భాలకి ఎంతో గంభీరత వొచ్చిందనిపిస్తుంది. “నిదురకిప్పుడు ఉనికి లేదు,   వాలిన దేహం మీద పాలిపోయిన వెన్నెలఅని నిద్రరానితనంలో సలుపుతున్న   గాయాల గానం చేస్తుంది. పాలిపోయిన అన్న ప్రతీక లేమికి పర్ఫెక్ట్ గా అతుకుతుంది. “దుఖ్ఖానికి ఇవతలి వైపు నీకోసం ఎదురు చూస్తున్నా” (దుఖ్ఖానికి చెరోవైపు) అన్నప్పుడు గానీ, “నువ్ ఎదురొచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయిన మలుపు నిన్నటి జ్ఞాపకాలతో మురిసిపోతుంది, వెన్నెలతో నువ్ తడిపిన సెలయేరు ఇంకా చలికి వణుకుతూనే ఉంది” ( జ్ఞాపకం) అని అన్నా స్వేచ్ఛ ఒక ఏకాంత మనః స్థితిని మన కళ్ళకి గడుతుంది. ప్రతీకల్ని వాటి భావ సమన్వయాన్ని ఒకట్రెండుసార్లు తరచి తరచి చదువుకుంటాం.

కవిత్వమంతా ఎవరికోసం ? అని అనుమాన పడ్డాం కదా ? సరే. ఇప్పుడు ఎందుకూ అని కూడా అడగాలనుకుంటున్నాను. “ చేలన్నీ గుండెకద్దుకుంటే వస్తావా ? మన్నుని మీదకప్పుకుంటే చూస్తావా? నీ కళ్ళు వెతికే లేగ దూడ నవుతా, ఇంటికి తీసుకెళ్లు” (విన్నపం) లాంటి వాక్యాలు చదివినప్పుడుస్వేచ్చా ! మాకెందుకీ మౌన దుఖ్ఖాలు, కన్నీటి సముద్రాలు, సునామీలు, పగిలిన జీవితమూ, దుఖ్ఖపు తోడు సంగతులూఅని అడగాలని వెర్రి కోపం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చదివితే పర్సొనలైజ్డ్ పెయిన్ అండ్ అగోనీ కనిపిస్తుంది.అప్పుడేతను దారైనా  దుఖ్ఖమే గమ్యమవుతుంది” (మెరుపు కలలు) అంటుంది.  దుఖ్ఖమూ నా లాంటిదే ఒంటరిగానైనా ముందుకే పయనిస్తుంది, దారి కొత్తదో పాతదో తోవంతా కన్నీటిపూలే”  (దుఖ్ఖిత) అనేస్తుంది. ఓర్నాయనా ! నీ చెల్లో, అక్కో, ఒరే తమ్ముడూ ఇది రా నా బాధ; అని నిన్ను పక్కన కూర్చో బెట్టుకుని ఏదీ లేకుండా, ఏడుపై  బతకడమొక్కటే తనకు చేతనయ్యిందని చెప్తోంటే నీ కేమనిపిస్తుంది. ఆత్మీయతని వెంట బెట్టుకోనొచ్చి ఉప్పునీ, నీటినీ కలిపి కళ్ళ నుండి కడలిలోకి ఒంపేస్తోంటే నీ కేమనిపిస్తుంది. ముందు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, ఆనక నువ్వూ కొంచం సేపు తనతో కలసి దుఖ్ఖపడి పసిపాపలా ఏడుస్తున్న తనని చూసి కాలమే మరణమయ్యిందా అనుకుంటావు. అంత ఎమోషన్ ఉంది. చలం పుస్తకంలో ఎక్కడో రొమైన్ రొల్లండ్ని కోట్ చేస్తాడుచాల సులభంగా సింపుల్ గా ఎట్లా వెలువడితే అట్లా సింపుల్ గా రాయి. మాట మీద మనసుని వృధా చేసుకోకు. అక్షరం పైన ఆలోచన నిలపకు. నీ హృదయంలోని లయ నీ రాతల్లో కనపడనీ! ఆత్మే శైలిఅంటాడు. అంతటి అనుభవానికి గురి చేస్తుందీ కవిత్వం.

సంపుటి లో కుర్దీ, అమ్మా నాన్న, ఎలా గుర్తుపట్టాలి లాంటి సామాజిక అంశాలతో రాసిన కవితలు ఆసక్తిగా ఉంటాయి. కానీ అవి చదివిన మూడ్ ని ఆట్టే ఎక్కువ సేపు పట్టి ఉంచలేము.అది వాటి దోషం కాదు. మిగతా వాటికున్న మానవీయ మహోద్విగ్నత వలన. అంతస్సారంగా పుస్తకమంతా ప్రవహించే ప్రేమ, దాని రాహిత్యంలోని తీవ్రత కలలూ, అస్పష్టమైన దిగులు, దిగుల్లోని దుఖ్ఖమూ…. బాబ్బాబ్బో, స్వేచ్ఛకే సాధ్యమైన పద బంధాలూ, సున్నిత భావ ప్రకటనలూ చదువరుని సంఘర్షణకి గురిచేస్తాయి. ఒక దుఖ్ఖిత జీవిత సన్నివేశమే అసలు కంటెంట్. నేను అన్న తన కవితలోనమ్మకమే మోసం చేసి లోయలోకి తోసేసి నపుడు మళ్ళీ పైకి ఎక్కి నిలబడింది నేనే, నేనలా కుంగి మళ్ళీ మొలకెత్తింది నేనే, ఇప్పుడు లోయ లేదు, తుఫానూ లేదు అంతా మైదానమేలాంటి స్వకీయ వ్యక్తీకరణలు చదివినప్పుడు చేజారిపోయిన జీవితాన్ని ఓర్పుగా కన్నా, ఒడుపుగా మళ్ళీ పైకి లాక్కుంటున్న స్పృహ మనల్ని ఆనందపరుస్తుంది.

పట్టుమని ముప్పయ్యేళ్ళుంటాయేమో ! పోయెట్రీ చదివాక ఇంత సన్నటి పుస్తకంలో ఎంత జీవితం చూపించిందీ అమ్మాయీ అనిపించింది. అంతకు మునుపెన్నడూ కవిలా కనపడిన దాఖలా తక్కువ. నలుగురిలో ఎక్కువుగా హడావుడి చేసిందీ లేదు. ఇప్పుడు Women empowerment & News papers; A study of four Telugu dailies అనే అంశం మీద పీ హెచ్ డీ కూడా చేస్తోంది. మహారాష్ట్ర మూలాలున్న కుటుంబం నుంచి వచ్చిన శంకర్ వోటార్కర్, కరీం నగర్ ఇటిక్యాల కు చెందిన శ్రీదేవి గార్ల ఒక్కగానొక్క కూతురు స్వేచ్ఛ. తల్లితండ్రులిద్దరూ సిపిఐ (ఎం ఎల్ ) జనశక్తి లో పనిచేసిన వాళ్ళు. ఇద్దరూ అజ్ఞాతంలోనే చాలా కాలం ఉండిపోయారు. ఐదునెలల వయసు నుండీ మేనత్త కూతురు దగ్గర పెరిగిందీ అచ్చమైన తెలుగమ్మాయి. వనితా, హెచ్ ఎం టీవీ, మన టీవీ, టీ న్యూస్, ఛానళ్లలో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ 9 లో న్యూస్ ప్రేసెంటర్ గా పనిచేస్తోంది.

పొయెటిక్ ఎక్స్ప్రెషన్లో కానీ, నిర్మాణంలో గానీ మనకేమీ కంప్లైంట్ కనపడదు. కంటెంట్ టోన్ మాత్రమే కొద్దిగా క్షోభ గా, నిరాశగా పలికినప్పుడు మరీ ఇంత వ్యక్తిగత అనుభూతులు కవిత్వం అయి ఏం సాధిస్తాయి అని అనిపిస్తుంది. తర్వాత రేవతీ దేవిని చదివినప్పుడో, వజీర్ రెహ్మాన్ ని చదివినప్పుడో కొంత అర్ధమయ్యింది. అస్తిత్వ వాదాలూ, వ్యక్తి, అనుభూతివాదాలు సంగతి అటుంచితే, నొప్పి లేని ప్రేమ ఎక్కడుంది ? ప్రేమ లేని మనిషెక్కడున్నాడు ? మనిషిలేని కవిత్వమేదీ ? అన్న జ్ఞానోదయం అవుతుంది. ఖలీల్ జిబ్రాన్ అన్నట్టు

Your pain is the breaking of the shell that encloses
your understanding.
Even as the stone of the fruit must break, that its
heart may stand in the sun, so must you know pain.
And could you keep your heart in wonder at the
daily miracles of your life, your pain would not seem
less wondrous than your joy;
And you would accept the seasons of your heart,
even as you have always accepted the seasons that
pass over your fields.
And you would watch with serenity through the
winters of your grief.

ఇదంతా దుఖ్ఖం తాదాత్మ్యత. ఆనంద గానం కూడా. అయితే నువ్వుంటేనే రాత్రి పుడుతుంది. నువ్వలా ఊపిరినివ్వడమే నేను బతకడ మంటేఅన్న వాక్యాల అసలు భావం మనమింకా చదవనే లేదు. జీవన సత్యానికి చాలా కవితల నేపధ్యం అతికి నట్టే ఉంటుంది గానీ, తను చేస్తున్న అనుభవ ప్రకటన మాత్రమే మన దాహానికి సరిపోదు. దానికీ అక్షరాలూ చాల్లేదు. అవి ఇక ముందున్నాయని ఆనందంగా వేచి చూద్దాం. అంత వరకూ చినుక్కింద దాక్కున్న మట్టి పువ్వుల పరిమళాన్ని హాయిగా (?) ఆస్వాదిద్దాం.ఇప్పటికైతే ఇంతే, ఇలాగే బతగ్గలం.

(ఈ పుస్తకాన్ని ‘సహచర’ బుక్ మార్క్, హైద్రాబాద్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ధర 65 రూపాయలు. ప్రతుల కొరకు 9848348173ని సంప్రదించండి)

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

6 comments

 • ఇప్పుడే స్వేచ్చ పుస్తకం మీద రాసిన సమీక్ష చదివాను. చాలా బాగుంది అది చదివాక ఆ అమ్మాయి రాసిన మట్టిగాలి పరిమళం చదవాలని ఉత్సుకత కలిగింది.కారణం మీ సమీక్ష అయిన కావచ్చూ.లేదా ఇందులో మీరు కోట్ చేసిన ఆమె కవిత్వపంక్తులైనా కావచ్చు. అభినందనలు శ్రీరామ్

 • మీరన్నట్టు ఒక దుఖ్ఖిత జీవితపు సన్నివేశమే దీనిలో అసలు కంటెంట్..“నమ్మకమే మోసం చేసి లోయలోకి తోసేసి నపుడు మళ్ళీ పైకి ఎక్కి నిలబడింది నేనే, నేనలా కుంగి మళ్ళీ మొలకెత్తింది నేనే, ఇప్పుడు లోయ లేదు, తుఫానూ లేదు అంతా మైదానమే”ఈ ఒక్క వాక్యం చాలు చేజారిపోయిన జీవితాన్ని ఎంత ఒడుపుగా పైకి తెచ్చుకున్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది…మీ సమీక్ష చదివాక నేను స్వేచ్చ గారి ఈ మట్టి పూల గాలిని తెచ్చుకుని చదివాను…..శ్రీరామ్ గారు మీ సమీక్ష ఎప్పటిలాగే చాల బాగుంది .ఇరువురికి అభినందనలు

 • “నమ్మకమే మోసం చేసి లోయలోకి తోసేసి నపుడు మళ్ళీ పైకి ఎక్కి నిలబడింది నేనే, నేనలా కుంగి మళ్ళీ మొలకెత్తింది నేనే, ఇప్పుడు లోయ లేదు, తుఫానూ లేదు అంతా మైదానమే” ఈ మాట చదవగానే ఆనందమేసింది. ఆత్మవిశ్వాసం నింపుకున్న వాక్యాలవి. 👌👌
  గాలానికి చిక్కిన చేపనైనా బాగుండు ఈ నిశ్శబ్దం కొక్కెంతో గుండె చీలుతుంది.. ఈ మాట చదవగానే మనసు ఒక్కసారిగా నిశ్శబ్దంతో చీల్చినట్టే అనిపించిది. ఒక మౌనం ఎంతటి గాయం చేయగలదో తెలుస్తుంది మనకు ఈ మాటల్లో.. ఒకటి అని చెప్పలేం కానీ చక్కటి అనుభూతి తెలుస్తోంది.
  భావ వ్యక్తీకరణ కూడా బావుంది.
  మీరు ఉదాహరించిన కవితలన్నీ బావున్నాయ్.. ఇంక మీ సమీక్ష అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. అంతరంగాలలోతుల్లో దాచిపెట్టిన మనసు భాషని పట్టుకోవడం మీ(కు) కలానికి చాలా బాగా వచ్చు.
  ఇద్దరికీ అభినందనలు 💐 💐

 • “మట్టి పూల గాలి”… భగభగ మండిన మట్టి పై తొలకరి చిరుజల్లులను కురిపించినప్పుడు వచ్చే సుగంధ పరిమళం లా అనిపిస్తుంది. మీరు కోట్ చేసిన వాక్యాలు…మట్టి పూల గాలిని శ్వాసించాలనే కోరికను ప్రేరేపిస్తుంది…. చాలా బాగుంది శ్రీ రామ్ సార్….

 • ఆడవాళ్ల ప్రేమను, విరహాన్ని మీకు దగ్గరగా చూపించి స్వేచ్ఛ.. దుఖ్ఖాన్ని పంచుకోవడం ఏమంత తేలిక కాదు.. అందుకే కవి అంటాడు కదా.. ’నిన్ను నిన్నుగా ప్రేమించుటకు.. నీ కోసమే కన్నీరు నింపుటకు.. నేనున్నాననీ.. నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమో.. అదే స్వర్గమో..‘ అని డాక్టర్ చక్రవర్తిలో పాట విన్నప్పుడు నిజమే కదా అనిపిస్తుంది కదూ..? అయినా మీకింకా తెలియాల్సింది చాలా ఉందన్న చివరిలో మీ ఒప్పుకోలు వాస్తవంలోకి వచ్చినట్లనిపించింది.. స్వేచ్ఛ స్వచ్ఛమైన భావప్రకటనా కవిత్వమని నా భావన.. అది ఆమెదేనేమోనన్న దానికే ఎక్కువ ముక్తాయింపు ఇవ్వడం అవసరం లేదనిపించింది. ఏమైనా మీదైన శైలిలోనే సమీక్ష కొనసాగడం ఆనందం కలిగించింది. చివరిలో చలం, ఖలీల్ జీబ్రాన్ లను ప్రస్తావిస్తూ ముగింపులో సమీక్ష సాంద్రత పెరిగింది.. ఏమైనా మట్టి.. పూలు స్వచ్ఛమైన సహజ పరిమళాలే.. స్వేచ్ఛ కవిత్వం.. మీ సమీక్ష అంతే సహజంగా ఉన్నాయి..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.