చీమలు ఈగలు

తాతా, పండు బాదం కాయలకి చీమలు ఎందుకు వస్తాయి?’ అడుగుతున్నాడు ఆరేళ్ల సుజన్.

తీపి పదార్థం ఏది దొరికినా వస్తాయి రా, నువ్వు తమ్ముడు పరిగెత్తరూ చాక్లెట్ల దగ్గరికి’, నవ్వుతూ చెబుతున్నాడు నెలరోజుల క్రితం రిటైర్ అయిన పరంధామయ్య.

పండగ కూడా కావడంతో  5 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుకులుకోడళ్ళు, కూతుళ్లుఅల్లుళ్లు, మనవళ్లుమనవరాళ్లతో కోలాహలంగా ఉంది ఇల్లు. వాకిట్లో బాదం చెట్టు కింద పడిన బాదంకాయలు ఏరుకుంటూ మనవళ్ళు, మనవరాళ్ళు. ఇంకాసేపట్లో భోజనాల సమయం అనగా పరంధామయ్య భార్య  పిల్ల లేదో అడుగుతున్నారు’ అంటూ వచ్చింది.

‘ఏంటట, పిలు వాళ్లను’ అన్నాడు.

‘వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమంటున్నారు. ఇద్దరూ బొంబాయి లోనే కదా ఇక్కడ ఎవరున్నారు మీరు రిటైర్ అయ్యారు, పెన్షన్ వస్తుంది. ఇల్లు స్థలం డెవలప్మెంట్ కిచ్చేసి మనల్ని కూడా వచ్చే మంటున్నారు’ అంది.

‘నువ్వేమంటావు’

‘నేనా? ఏమంటాను? మిమ్మల్ని అడగమన్నాను.’ 

‘మరి ఉద్యోగం చేసుకుంటూ మనతో ఉంటున్న కూతురు, దాని పిల్ల?’

ఆమె ఏమీ మాట్లాడలేదు.

‘భోజనాలయ్యాక మాట్లాడదాం లే.’ సాయంత్రం నాలుగింటికి పెరట్లో వేప చెట్టు కింద చేరారు. ‘అమ్మ చెప్పింది పొద్దున…’ కదిలించాడు పెద్దాయన. ఆయనకది ఇష్టమైనదేమోనుకుని పెద్దకొడుకు ‘అవును నాన్నా, నేనే చెప్పాను’ అన్నాడు.

‘ఊరికూరికే ప్రతిసారి అంతంత చార్జీలు పెట్టుకొని ఇంతింత దూరాలు రావాలి. మీరు రిటైర్ అయ్యారు అక్కడికి వచ్చేస్తే అందరం కలిసి ఉండొచ్చు కదా మామయ్యా. ఇల్లు కూడా ఎటూ  బ్యాంకు లోన్ లో ఉంది. అప్పులూ మేం  తీర్చేస్తాం’ అంది రెండో కోడలు.

‘తీర్చి?…’ 

‘అమ్మేద్దాం, నలుగురము నాలుగు వాటాలు తీసుకుంటాం’ అన్నాడు చిన్నాడు.

మరి మా వాటాలు?’ అడిగాడు పరంధామయ్య. 

ఒక్కసారి అందరూ తలెత్తి చూశారు.ఆయన జోక్ చేస్తున్నాడు అనుకుని

‘మీవా !?’

‘అవును, మావే!’

కడుపు మాడ్చుకుని పైసా పైసా కూడబెట్టి, ఇల్లు కట్టి, మిమ్మల్ని చదివించి, పెద్ద చేసి. పెళ్లిళ్లు చేసి ఒంటరితనాన్ని భరిస్తూ, మీరు ఎగిరిపోయి మీరు సంపాదించని మా ఆస్తులు ఎగరేసుకెళ్దామని అనుకుంటే, మేం అడగద్దా? ఒక మూర్ఖుని కట్టుకున్న పాపానికి ఒంటరిగా తన పిల్లతో జీవితాన్ని సాగదీస్తూ మమ్మల్ని తన పిల్లల్లాగా చూస్తున్న మీ పెద్దక్కకీ వాటా ఎక్కువ రావద్దా? ఇక్కడ ఎవరూ స్థలాలమ్మరు- వాటాలు ఇవ్వరు. ఎవరి బతుకులు వాళ్ళవి. ఇష్టమైతే ప్రేమను పంచడానికి రండి. కష్టపడి ఇంతింత దూరాలు అంతంత చార్జీలు పోసి వాటాలడగడానికి అక్కర్లేదు. మాకు వంటరితనం అలవాటయిపోయింది’ అంటుండగా తాతా చీమలే కాదు ఈగలు ముసురుతున్నాయి’ మనవడు చెప్పి కారాట ఆడుకుంటూ పరిగెత్తికెళ్ళిపోయాడు.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.