మనూరి పోరు!

తెలుగు వాళ్ళలో సగం మంది ఎన్నికల హడావిడిలో వున్నారు.

కార్లూ, సైకిళ్లు, హస్తాలూ, అగ్గిపెట్టెలు… సందట్లో సమారాధనగా… బహుశా, టు యాడ్ కలర్ టు ది ప్లేస్…  రెండో నాలుగో ఎర్రజెండాలు… వెల్… పోరు హోరు హోరుగా వుంది.

పచ్చని తెలుగు బతుకును చిదిమి రెండాకులు చేసిన వాళ్ళెవరనే ఆవేదనకు ఇందులో జవాబు దొరకదు. అదొక ఫెయిట్ అకాంప్లీ. చిరిగిన విస్తరి.

జవాబు దొరికే అవకాశం ఎందుకు లేదంటే… ఆ పని తమదే, అందుకే తమకు ఓటేయాలనే వాళ్ళే ఇప్పుడందరూ.

అప్పుడు పూర్తిగా సమర్థించలేదు, మమ్మల్ని మన్నించండన్నట్లు కూడా కొందరుండొచ్చు.   

సామాన్యుల సంగతి వేరు. ఇంకా నీ విస్తట్లో నా బువ్వ వుంది, నా విస్తట్లో నీ బువ్వ వుంది… మీ వూళ్లో నా ఇల్లుంది, మా వూళ్ళో నీ ఇల్లుంది.

ఇదిలా పూర్తయిపోదు. ఈ విస్తరి ఎప్పటికైనా కలిపి కుట్టుకోవలసిందే. ప్రజల మధ్య పెట్టుకున్న గోడ కూలిపోవలసిందే.

మనసులోని మాట ఓసారి బయటికే అనుకుందాం.

ఏం ఒరిగింది, చీలిపోయి?

ఉన్నోడి వెంట్రుక కూడా కదల్లేదు.

రామోజీ ఫిల్మ్ సిటీ అలాగే వుంది. సింగపూరు టౌన్షిప్ లూ, మలేషియా టౌన్షిప్లూ, వాటి బిల్డర్లూ అలాగే వున్నారు.

ఉండొద్దని కాదు, ఉండవు అని కదా అప్పుడు ప్రచారమైన ఒక సెంటిమెంటు.

కనీసం రియల్ ఎస్టేట్ యాపారమైనా చేతులు మారలేదు.

సో కాల్డ్ ‘ఆంధ్రా’లో పంట భూముల్ని పాడు చేసి కాంక్రీట్ అడవులింకా తయారవుతున్నట్లు లేదు. అమరావతిలో రియల్ ఎస్టేట్ తెల్ల ఏనుగుల విహారానికి సింగపోర్, మలేషియా నమూనాలు చాలినట్లు లేదు. రాజధాని తన తల్లి నేలలో కాకుండా అత్తగారి వూళ్ళోనే వుండాలనుకున్న  ముఖ్య మంత్రి పన్నాగాలు పండుతున్నట్లు లేవు. ఎవరు కొంటారక్కడ ఇళ్ళు, అంతంత ఖరీదులెట్టి? అక్కడ భూములు పోగొట్టుకున్నోడే ఆ డబ్బులతోనే కదా కొనాలి? వాళ్ళలో వాళ్ళే అమ్మకం దారులూ కొనుగోలు దారులు. కొత్త జనం రావడానికి, అక్కడేమైనా కొత్త పరిశ్రమలా పాడా?

చక్కని సమశీతోష్ణ వాతావరణంతో హైదరాబాద్ లోనే జనం వుండాలనుకుంటారు. చారెడో, జానెడో ‘నిజక్షేత్రం’ వుంటే, దాన్ని హైదరాబాద్ లోనే వుంచుకుంటారు. విజీవాడ  వేడిగాలిమేడల కోసం ఎవరూ దేన్నీ అమ్ముకోరు.

సో, మునుపటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు హైదరాబాద్ లో అంగళ్ళు మూయ(లే)రు.

కేసియార్ బాల్ థాకరే అంతటోడే. అయినా ఎవరూ భయపడి పారిపోరు.

ఎందుకంటే, తెలంగాణా ప్రజలు చాల మంచోళ్ళు.

హైదరాబాదీ అనే ఒక ఐడెంటిటీ అలాగే వుంటుంది. ఉండాలి. కాస్త ఉర్దూ, కాస్త తెలుగు, కాస్త హిందీ కలగల్సిన అద్భుత కాస్మొపోలిటన్ నగరం అలాగే వర్ధిల్లాలి.

కేసియార్ అనే నాటకాల్రాయుడు లేకపొయ్యుంటే, యువకుల ప్రాణాంతక అవేశాల్ని సొంతలాభం కోసం వాడుకోకపోయి వుంటే, హైదరాబాద్ తెలుగు వాళ్ళందరి ప్రేమ పీఠంగానే వర్ధిల్లేది.

పాపం కేసియార్ దే అయినా ఆ మాయలో పడిన తెలంగాణా ప్రజలందరూ దుఃఖంలోనే వున్నారు. కొట్లాటలే గాని, కొలువుల్లేవు.

ఇందుకోసమా ప్రత్యేక రాష్ట్రం ఆడిగింది? ఇందుకోసమా అంతమంది యువకులు ప్రాణాలొదిలింది? అని ఆడుగుతున్నారు.

విభజన వాదంతో మేలొందిన వారెవరైనా వున్నారంటే వారు, చాల కొద్ది మంది.

ఈ ఏడాది మొదట్లో, హైదరబాద్ లో పెద్ద బుక్ ఫేర్ జరిగింది. ఫేర్ లో పలువురు రచయితల నిండోలగంలో  సభ నిర్వాహకుడు సభకు అతిధిగా వొచ్చిన ఒక (కొత్త) వైస్ ఛాన్సెలర్ని పరిచయం చేస్తూ, ‘తెలంగాణ రావడం వల్ల జరిగిన మేలేమిటని అడుగుతారు, తెలంగాణా రావడం వల్లనే ఇదిగో ఈయన వైస్ ఛాన్సెలర్ అయ్యారు’ అని వాక్రుచ్చారు. వీ సీ గారు ఆ చమత్కారాన్ని తీసుకోవలసినంత సీరియస్ గా తీసుకుని, తమదైన శైలి లో వూగిపోతూ.. నిర్వాహకునితో సహా అక్కడ కూర్చున్న వారందరినీ చూపిస్తూ… వారందరికి వారి వారి పదవులు రావడానికి తెలంగాణా ఆవిర్భావమే కారణమని…ప్రకటించారు.

అదీ సంగతి.

అదే సంగతి.

కేసియార్ కు ముఖ్యమంత్రి పదవి, వాళ్ళబ్బాయికి మంత్రి పదవి, మేనల్లుడికి ఇంకో మంత్రి పదవి, కూతురికి ఇంకోటి… అవన్నీ వొచ్చేవి కాదు.

పదవులు వొచ్చాయి. కొన్ని తలలకు కిరీటాలు వొచ్చాయి. తలలకు పెట్టిన కిరీటాల వల్ల, మూతులకు పెట్టిన చిక్కాల వల్ల…  వీర తెలంగాణాలో ధిక్కార స్వరాల కోసం ఇవాళ కాగడాలెట్టి వెదుక్కోవాల్సి వస్తోంది.

ఈ విధంగా వాళ్ళు కల్పించిన ఆశలే వాళ్ళ చాప కిందికి నీళ్ళు తెస్తాయి. వాళ్ళు పెంచి పోషించిన, పోషిస్తున్న ప్రజా వ్యతిరేక దుర్నీతి చాల త్వరగా దిగువన అసంతృప్తిని రగిలిస్తుంది. రగిలిస్తున్నది.

ఆనాడు ఈ పరిణామాన్ని ఎందుకు చూడలేక పోయారు?

అప్పుడు చూడలేకపోయారు పో.

ఇప్పుడైనా ఆనాడు తమకు తాము చేసుకున్న వాగ్దానాలు.. ఏ ఎత్తిపోతల పథకాలు లేకుండానే… గోదాట్లో కలిసి పోతుంటే ఏం చేస్తున్నారు?

కేసియారిచ్చిన పదవులు పొందినోళ్ళకు అవి పోతాయని భయం. పదవులు లేనోళ్ళు మూసుకోకపోతే ఎప్పటికీ పదవులు రావని భయం.   

ఈ ప్రశ్న తెలంగాణా మీగడ(క్రీమ్)కే గాని, ప్రజలకు కాదు. దిగువన పాలు మరుగుతున్నాయి. పొంగుతాయి.

జనం ఆలోచనలు ఆరోగ్యంగానే వున్నాయి.

ఫేస్ బుక్ లో ఒక ఎన్నారై (బహుశా ఆయన తెలంగాణా వారే) చెప్పిన మాట: ‘తెలంగాణా అంతా తిరిగాను, టీఅరెస్ కు అనుకూలమైన మాటొక్కటీ వినిపించ లేదు’ ఆన్నారు. అలా తిరిగి చూడని వాళ్ళకు కూడా ఆ మాట నిజమే అనిపిస్తుంది.

ప్రత్యేక తెలంగాణా ఏర్పడాలని ఏ సమస్యలను చూపించి అన్నారో, ఆ సమస్యలన్నీ ఇప్పుడు మరింత పదునెక్కి జనాన్ని మరింత బాధిస్తున్నాయి. సమస్యలు తీరనూ లేదు, గాయాలు మాననూ లేదు.

ఎలా తీరుతాయి సమస్యలు, ఎలా మానుతాయి గాయాలు?

మీరే చెప్పండి, సారు!

పాత వుమ్మడి తెలుగునాట అసలు విలన్లు ఎవరు?

భూస్వాములు, పెట్టుబడిదారులు!

మామాలు మాటల్లో చెప్పాలంటే దొరలు, ద్రవ్య వ్యాపారులు.

(కొంచెం భూమి వుండి సేద్యం చేసుకుని బతికే వాళ్లు ‘భూస్వాములు’ కారు. వాళ్ళు రైతులు. వాళ్ళు మనమే. నెత్తిన బుట్ట పెట్టుకుని, లేదా అంగడి పెట్టుకుని సరుకుల మారుబేరాలతో బతికే వాళ్ళు ‘పెట్టుబడి’దారులు కారు, శ్రమ చేసే వ్యాపారులు. వాళ్ళూ మనమే.)

నక్సలైట్ ఉద్యమం పుణ్యమా అని, ఆ వుద్యమం కోసం ప్రాణాలిచ్చిన ప్రజా వీరుల పుణ్యమా అని… తెలంగాణాలో ఆధునిక దొరగాళ్ళ కూసాలు కదిలాయి. ఆ మేరకు నక్సలైట్ వుద్యమం విజయవంత మయ్యిందని చెప్పక తప్పదు.

అంతమంది బలిదానాల వల్ల, స్థాన భ్రష్టులైన భూస్వాములు పట్నాలకు చేరి పెట్టుబడిదారులయ్యారు. అలాగని వాళ్ళు తమ ‘భూస్వామ్యా’న్ని వొదిలేశారా? లేదు. తాత్కాలికంగా మానేశారు. ఒక షార్ట్ వెకేషన్.

ఇప్పుడు వాళ్ళు పల్లెల్లో, పట్నాల్లో మళ్లి చెలరేగారనడానికి మధుకర్, ప్రణయ్ హత్యలు సాక్ష్యం. అభంగపట్నం భరత్ రెడ్డి దౌష్ట్యానిదీ అదే కోవ.

ప్రత్యేక రాష్ట్రం వొచ్చాక, జరిగిన వాటిలో అతి మ్ముఖ్యమైనవి మూడు:

  1. ఆధునిక నేపధ్యంలో ఆనువంశిక పాలనకు కొత్త వూపిర్లు.
  2. రాజాస్థానాలను పోలిన పదవుల పంద్యారం.

మూడవది: దొరల పాలన పునరుద్ధరణ. దొరల్లో పెట్టుబడిదారులుగా మారిన వాళ్లు తిరిగి తమ భూములను స్వాధీనం చేసుకుని ఫామ్ హౌసులు, వ్యవసాయ క్షేత్రాలు నిర్వహిస్తూ… ఎలా పెత్తనాలు సాగిస్తున్నారో కొత్త సామాజిక సర్వేలు నిర్ధారించాలి. నేటి ప్రతిపక్షంలో వున్నది కూడా రంగు రంగుల దొరలే గనుక ఏ పాలకవర్గ ప్రతిపక్షం నుంచీ వాస్తవాల్ని ఆశించలేం. ప్రజల మనుషులు చేసే కొత్త సర్వేలే ఆధారమవుతాయి.

ఇవాల్టికివాళ కనీసం ఒక్క ఫ్యూడల్ అంశాన్ని వొదిలించుకోడానికైనా… తెలంగాణా ఓటరు ప్రయత్నించాలి.

దాని పేరు కుటుంబ పాలన.

కుటుంబ పాలనకు ఎవరు పాల్పడినా వారిని ఓడించడానికి అదే మొదటి కారణం కావాలి. లేకుంటే మన దేశంలో ప్రజానుకూల ప్రయోగాలేవీ జరగవు.

ఒక్క సారి వెనక నుంచి నరుక్కొద్దామా?!

నెహ్రూ తరువాత ఇందిరా గాంధీది వారసత్వ రాజకీయమే గాని, అత్యున్నత పీఠం ఆమెకు అనాయాసంగా రాలేదు. లాల్ బహదూర్ శాస్త్రి వంటి నాయకుడు వొచ్చి పోయారు. తరువాత కూడా నిజలింగప్ప, మొరార్జీ వంటి ఉద్దండ పిండాలను సవాలు చేసి, చాల స్ట్రగుల్ పడి ఇందిరా గాంధీ పదవి నిలబెట్టుకున్నారు. ఎమర్జెన్సీ పాపానికి శిక్ష అనుభవించిన తరువాత… జనం ఆమెకు తిరిగి అధికారం కట్టబెట్టడానికి, ఆమె అనుసరించిన ప్రజానుకూల చర్యలే కారణం. బ్యాంకుల జాతీయీకరణ, గరిష్ట భూ పరిమితి, 20 పాయింట్ల ప్రోగ్రామ్ వంటి పాపులర్ (ఫ్యూడల్ వ్యతిరేక) చర్యల వల్లనే… హత్యకు గురయ్యే వరకు తిరుగులేని రాజకీయాధిపత్యం చెలాయించారు. ఆమె అధికార రహస్యం ప్రజలే. ప్రజల ఆశలే.

తెలుగునాట, తమిళ నాట కూడా… ఏ వారసత్వం లేకుండా కేవలం పేద ప్రజల అనుకూల విధానాలతో అధికారానికి వచ్చిన అన్నాదురై, ఎంటీయార్, వైఎస్సార్ల పాలనల్లో జనానికి ఎంతో కొంత మేలు జరిగింది.

అలాంటి పని ఏమీ పెట్టుకోకపోవడం వల్లనే చిరంజీవి రాజకీయంగా కేవలమొక దిష్టి బొమ్మ కాగలిగారు.  చిరంజీవి నినాదం ఏమిటి? ‘మార్పు’! ఏం ‘మార్పు’? ప్రభుత్వ ‘మార్పు’! అది ఎందుకు? హిహ్హి!

ప్రజలకు పనికొచ్చే పనులేవీ మనసులో లేకుండా.. అందుకు జనాన్ని కన్విన్స్ చేయకుండా.. . కేవలం ప్రత్యేక రాష్ట్రం వంటి సెంటిమెంట్లతో రాజ్యానికి వొచ్చిన వాడు ప్రజల కోసం ఏ పనైనా ఎందుకు చేయాలి?

అతడి వాగ్దానం రాష్ట్రం ఏర్పాటు. అది అతడు అధికారానికి రాకముందే నెరవేరింది.  

ఇప్పుడు కేసీయార్ కు ఎందుకు ఓటెయ్యాలంటే వొచ్చే జవాబు: ప్రెత్యేక తెలంగాణా సాధించాడనే సెంటిమెంటొక్కటే. దాన్నే ప్రశ్నిస్తే… ప్రత్యేక తెలంగాణా వల్ల తెలంగాణా వాడికి ఒరిగిందేమిటని మూలాన్నే ప్రశ్నిస్తే.. ఆయన గారిని గెలిపించడానికి.. ఒక్కటంటే ఒక్క కారణం కనిపించదు.

ఓడించడానికి చాల కారణాలు కనిపిస్తాయి.

మచ్చుకు ఒక కారణం. వివేక్, శ్రుతి, సాగర్ వంటి ప్రజల మనుషులను చంపినందుకు… కేవలం ఆ ఒక్క కారణంతో కేసీయార్ ను ఓడించవచ్చు.

తెలంగాణా ఏర్పాటుకు అహోరాత్రాలు శ్రమించిన వారిలో వివేక్, శృతి, సాగర్ లు, వాళ్ళ పార్టీయే గాక అన్ని ఎమ్మెల్ పార్టీలు వుండినారు.

దేశాదేశాల్లో అటు తెలంగాణాను, ఇటు మార్క్సిస్టు లెనినిస్టు వుద్యమాన్ని సమర్థించిన వారున్నారు. దేశాదేశాల వారంటే.. ఎన్నారై లు కూడా. మరి వారేరీ? అడగరేం? సిరి మూట గట్టుకుని వెళ్లి పోయారా ఎవరిళ్ళకు వారు? ఇంకొంచెం సిరి కోసమే అప్పుడప్పుడు మనూరికి వొస్తుంటారా?

ఇంతా చేసి, ఇదంతా… కేవలం కేసియార్ కు వొడ్డించాల్సింది మాత్రమే కాదు.

కనీసం కేటీయార్ కు మాట్లాడడం వొచ్చు. తండ్రితో పాటు వుద్యమంలో పాల్గొంటూ కనిపించాడు కూడా. విజీవాడ సంగతి మరీనూ. కనీసం మాటలు కూడా సరిగ్గా రాని కొడుకును, ఏనాడూ వుద్యమాలలో కాదు గదా, రాజకీయాల్లో లేని వాడిని మంత్రిని చేసి… ఓయ్, నన్నొదిలించుకున్నా, మా వోడున్నాడు, వొదల బొమ్మాళీ అంటో, చీకటి వెదజల్లుతున్న సో కాల్డ్ ఆంధ్రా చందమామ సంగతేమిటి? సిగ్గులేకుండా ఈ చంద్రుడిని తలదాల్చిన రాహులుల సంగతేమిటి?

తెలంగాణా కూటమిలో పాగా వేసిన చీకటి-మామ(ల)తో ఎలా వేగుతారు, ఆ సంగతేమిటి?

వరుస ప్రశ్నలు.

ప్రజల ముందు అంతా కలగాపులగం

రెండు రాష్ట్రాల్లో అదే కిచిడీ.

ఇప్పుడు జనం గుమ్మం ముందు నుంచున్న ప్రశ్న:

ఏం చేయాలి?

తెలంగాణా సెంటిమెంటు కోసం ఎవరికీ ఓటెయ్యక్కర్లేదు. అది గొప్ప విషయమే అయుతే, ఆ గొప్ప కేసియార్ జేబులో బొమ్మ కాదు. బరిలో వున్న అందరికీ వర్తిస్తుంది.

ఓటెయ్యడానికి మిగిలిన కొలమానం ప్రభుత్వ పనితనమే.

కేసియార్ వొద్దనుకుంటే ఎవరికి?

ఎవరికీ వేయక నిరసన కూడా తెలియజెయ్యొచ్చు. ఇప్పుడు నేతలు చేసే వాగ్దానాల కోసం. రేపు జనం రోడ్లెక్కక తప్పదు. అప్పుడు ప్రజల ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడతారనుకునే వాళ్ళను ఎంత మందిని గెలిపించుకుంటే అంత మంచిది.

వాళ్ళు ఇచ్చిన మాటకు కట్టుబడతారో, అదును చూసుకుని అమ్ముడు పోతారో,

రేపటి సంగతి రేపే.

బతుకు పోరు ఐదేళ్లకోసారి కాదు. ఇది నిరంతరం. 

11-11-2018

 

   

హెచ్చార్కె

17 comments

  • అవును సర్ నిజమే , పెట్టుబడి దారి వ్యవస్థ పేరుమార్చుకుంది కార్పెట్స్ లా … ప్రజాస్వామ్యం లో రాచరికం లా ఉంది పాలన ,అలా అని అంతకన్నా దారుణంగా ఉన్న అవతల వాళ్ళని ఎంచుకొనే పరిస్థితిలేదు … వాస్తవం చెప్పారు

  • విభజన జరిగి రెండవ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి ఇప్పుడు మల్లి విభజన గురించి ఎందుకు ? విడిపోయిన వారు దాని లాభ నష్టాలు చూసుకుంటారు. ముందు ఉన్న సంక్షోభం అమరావతి పేరుతో జరుగుతున్న విధ్వంసం, రాయలసీమ ప్రజలు లేవనెత్తున్న సమస్యలు. ముఖ్యంగా రెండవది . దాని గురించి ఏమి కార్యాచరణ ఉండాలి , జరిగిన విభజన అనుభవం నుండి ఏమి నేర్చుకోవాలి అన్నదే ఇప్పుడు ప్రధానం.

  • తెలంగాణ రాక ముందు ప్రజల పక్షాన ప్రభుత్వాలపై విరుచుకుపడిన అనేకానేక మంది ‘ప్రజా కవులు’, ‘ప్రజా రచయితలు’, ‘ప్రజా కళాకారులు’ మేధావులు.. తెలంగాణ వచ్చాక ‘ప్రభుత్వ కవులు’, ‘ప్రభుత్వ రచయితలు’, ‘ప్రభుత్వ కళాకారులు’గా మారిపోయిన సన్నివేశం బాధని కలిగిస్తోంది.. ప్రజల పక్షాన మాట్లాడుతున్నవాళ్లను తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా చిత్రిస్తున్న వైనం భయపెడుతోంది.

    • థాంక్స్, మీరన్నది నిజం.
      యజ్ఞ మూర్తి గారు నిజంగానే పరిస్థితి భయంకరంగా ఉంది. అవధులెరుగని స్వార్థం మన్ననలందుకుంటున్నది. దీనికి తట్టుకుని నిలబడాలి మనం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.