1
‘యింతకు ముందుసారి ఈమె వొచ్చినపుడు ఆ కళ్ళలోకి చూడడడానికి చాలా యిబ్బంది పడ్డాను’
అని గుర్తు తెచ్చుకున్నాడు డా.అయాన్.
‘ఐదేళ్ళయిందేమో… కానీ యింతలోనే ఎంత తేడా’ అని కూడా అనుకున్నాడు.
‘ఆ పక్కన కూర్చున్న తండ్రి యిప్పుడు నిర్లిప్తంగా తనకేమీ పట్టనట్టుగా కూర్చున్నాడు గానీ
అప్పుడు అతని కళ్ళ నిండా ఎంత ద్వేషం ఉండిందో..’
‘‘కమలేష్ మీ గురించి చెప్పి ఒకసారి కలవమన్నాడు కాబట్టి యిక్కడికి వచ్చాను
లేకపోతే ఈపాటికి పీకపిసికి కాలవలో పడేద్దును’’ అని ఎంత రౌద్రంగా అన్నాడు.
‘ఆ అమ్మాయి…తన పేరేమిటి?’ టేబుల్ మీది ఫైల్ ని తీసి చూసాడు అయాన్.
‘లక్ష్మీసుహాసిని… అవును..’ ఆమె వైపు చూసాడు. తల వంచుకొని కూర్చుని ఉంది.
తండ్రివైపు చూస్తూ ‘‘మీరు కాసేపు బయట కూర్చోండి’’ అన్నాడు.
అతడు బయటకి వెళ్ళాకా… కాసేపు నిశ్శబ్దంగా ఉండి పోయాడు.
ఆమె వంక అలా చూస్తూండి పోయాడు.
‘ఈమె కేసు సక్సెస్ కావడంతో నాకు చాలా పేరొచ్చింది.
తరువాత చాలా కేసులు డీల్ చేసాను. క్రమంగా ప్రాక్టీస్ పెరిగిపోయింది.
ఈ ఐదేళ్ళలో నేను రాష్ట్రంలోనే పేరు పొందిన సైకాలజిస్టుగా మారాను.’ అనుకున్నాడు.
‘‘ఏమ్మా… లక్ష్మీ… ఎలా ఉన్నావు?’’ అని మృదువుగా అడిగాడు.
ఆమె తలదించుకునే తల వూపింది.
‘‘బాగా చదువుకున్నావనీ … చక్కగా సెటిలయ్యావనీ విన్నాను’’
తలవూపింది.
అయాన్ కాసేపు చిన్న చిన్న ప్రశ్నలడుగుతూనే ఉన్నాడు.
ఆమె తల ఎత్తకుండా గొంతు విప్పకుండా తల ఆడిస్తూంది.
కుర్చీలో వెనక్కి వాలి
‘‘యిక్కడ మనం మాట్లాడుకునే మాటలు ఎవ్వరికీ వినపడవు.
నువ్వు హాయిగా రిలాక్సయి ఓపెన్‌గా నీ మనసులో ఉన్న మాటలు చెప్పవచ్చు.’’ అన్నాడు.
యివే మాటలు అప్పుడు నేను ఈమెతో చెప్పినపుడు గుళ్ళో గంట మోగినట్టు నవ్వింది.
‘‘నేను రహస్యంగా దాచుకున్నదేమీ లేదు సార్! మీతో అయినా మా డాడీతో అయినా ఓపెన్‌గానే చెప్పేసాను.
నేను కిషోర్‌ని ప్రేమిస్తున్నాను. అతణ్ణే పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను.
మా డాడికి ప్రాబ్లెమ్ ఏమిటంటే అతను మా కాస్ట్ కాదు. పైగా తను ఎస్సీ.
కానీ అయామిన్ లవ్…. అతనంటే నాకిష్టం. ఇది నాకు కాదు. మా డాడీకి సమస్య..’’అంది.
అప్పుడామె కళ్ళు చేపల్లా ఎగిరాయి. ముఖం చంద్రబింబంలా వెలిగింది. దేహం కడలి తరంగంలా ఉప్పొంగుతోంది.
‘యిప్పుడాలోచిస్తే నిజానికి తమకున్నది ప్రేమ మీద ద్వేషం. రెండోది కులం మీద ద్వేషం.
మొదటి దాన్ని బహిరంగంగా చెప్పగలం… కానీ రెండోది మాటల శబ్దాల కింద పాకుతుంటుంది’ అనుకున్నాడు.
‘‘లక్ష్మీ… నిన్ను ప్రేమించవద్దని కానీ…ఎందుకు ప్రేమించావని గానీ….యిలాంటి చెత్త సంగతులు నేను మాట్లాడను.
నేను మీ డాడీని కాదు. జస్ట్ అయామ్ ఎ సైకాలజిస్ట్… అంతే… మనం ప్రేమని గురించి మాట్లాడుకుందాం. దట్సాల్…’’అన్నాడు.
‘అప్పుడు నేనూ మాంచి ఉత్సాహంలో ఉన్నాను. సైకాలజీలో నేను నేర్చుకున్న
ఒక థీరీని ప్రత్యక్షంగా ప్రయోగిస్తున్నాను. ఆ ఉద్వేగం నాకు ఆమెతో పోటీ పడగల
ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఆమె ప్రేమతో ఎంత ఉద్రేకంలో ఉందో
నేనూ అంతే ఉద్రేకంలో ఉన్నాను’ అనుకున్నాడు.
‘కానీ ఫ్లడ్లైట్లలా వెలుగుతున్న ఆ కళ్ళలోకి మాత్రం చూడలేకపోయాను’ అనుకున్నాడు.
ఆమె కిషోర్ గురించి చెప్పింది…వాళ్ళ పరిచయం…వాళ్ళ చదువు….వాళ్ళ స్నేహాలు ..
వాళ్ళ.. కలలు … జీవితం గురించి వాళ్ళ ఊహలూ… స్నేహితులూ…
వేళ్ళ సందులోంచి ముగ్గు జారినంత హాయిగా మాటలు చెప్పుకుంటూ పోతోంది.
తేనెలో ముంచిన చిరుగంటల్ని మోగిస్తున్నట్టు వస్తున్నాయి ఆమె స్వరంలోంచి మాటలు.
‘ఈమె మాటల్ని వింటూ కూర్చోడం కాదు నా వృత్తి’ అనుకోవడం గుర్తొచ్చింది అతనికి. ఆమెని మృదువుగా ఆపి
‘‘ఒక్క కిషోర్ ప్రేమ గురించే అంతలా చెపుతున్నావు కదా! మరి యిన్నేళ్ళ నీ జీవితంలో నీకు లభించిన
అన్ని ప్రేమల గురించి ఆలోచించవా?’’ అనడిగాడు.
ఆమె చూసింది.
తల వూపుతూ, ‘‘నీవు పుట్టి పెరుగుతున్నప్పుడు నువ్వు నవ్వినా ఏడ్చినా ముద్దులాడిన మీ అమ్మ ప్రేమ…
ఉంది గదా… నీకు సకల సౌకర్యాలూ కూర్చి గుండెల మీద పెంచిన తండ్రి ప్రేమ ఉంది కదా…
అన్న ప్రేమ ఉంది… చుట్టాల ప్రేమలు ఉన్నాయి… ఎన్నో ప్రేమలు లేవా? మరి వాటి గురించి ఏమిటి?’’
బాణం బయు దేరింది.
‘‘మా అమ్మ అన్నా… డాడీ అన్నా నాకు ప్రాణం సార్…’’
యింకా ఏదో అనబోతున్న ఆమె మాటల్ని ఆపుతూ
‘‘కానీ అమ్మానాన్న మీద ప్రేమ వేరు… ఈ ప్రేమ వేరూ అది నాకు తెలుసు. .
అయితే నాకు కలిగే ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రేమని వదిలేయాల్సినంత…
వాళ్ళని బాధపెట్టాల్సినంత గొప్పదా ఆ ప్రేమ…’’
కొద్దిగా తడి రాసిన గొంతుతో ఎమోషనల్‌గా అన్నాడు.
ఒక ప్రశ్నలా వెళ్ళి గుచ్చింది బాణం. అతని గొంతులోని తడి ఆ పిల్లని ఆపింది.
ఫ్లడ్ లైట్లలా వెలిగిన కళ్ళు ఒక్క క్షణం ఆరిపోయాయి. పక్షి నేల రాలుతూంది. ఆమెని మాట్లాడనివ్వలేదు.
‘‘గొప్పదేకూడా… ఎందుకంటే ఎలాగూ పెళ్ళి చేసుకుని తల్లి దండ్రులకి దూరంగా పోవల్సిందే…
కానీ నేనేమనుకుంటానంటే కిషోర్ ప్రేమ కన్నా గొప్పదైన ప్రేమ దొరికిందనుకో… అప్పుడు…’’
అని పెదాల్ని సన్నటి వంకర తిప్పి కనుబొమల్ని ఎగరేసాడు.
‘ఆమె కళ్లు నల్లగా అయిపోవడం నేను స్పష్టంగా చూసాను.
ట్రోజన్ హార్స్ ట్రాయ్లోకి ప్రవేశించింది. కోట పట్టుపడుతుంది. పక్షి కింద పడింది.
గిల గిల లాడుతోంది’అని అనుకోవడం అతనికి గుర్తొచ్చింది.
మెల్లిగా అతని కళ్ళు ఫ్లడ్లైట్లలా వెలగడం మొదలు పెట్టాయి.
ఆమె కళ్ళు విల విల లాడాయి. ముఖం మాడిపోయింది. దేహం ముడుచుకుపోయింది.
అతడు ఆమె కళ్ళలోకి సూటిగా చూడగలిగాడు.
2
ఆ తండ్రి ఎంత ఆశ్చర్యపడి ఎంత ఉప్పొంగి పోయాడంటే ‘‘నా పరువు నిబెట్టారు అయ్యాన్ గారూ…
ఎక్కడ ఆ ఎస్సీవోడితో వెళ్ళి పోతుందో అని కొట్టుకు ఛస్తున్నాను.
అదే జరిగితే ముక్కలుగా నరికేసి జైలుకు పోదుననుకోండి…. కానీ… మీరు చాలా గొప్పవారు…
భలే మార్చేసారు….’’ అని బోలెడంత డబ్బు ఫీజుగా యిచ్చాడు. అంతే కాదు ఈ విజయం గురించి నోరు నొప్పెట్టేలా చెప్పాడు.
‘అప్పట్నుంచీ నేను మబ్బుల్లో తేలిపోయాను. విజయం యిచ్చే మత్తు ఇంకేదీ యివ్వలేదు.
దీని తరువాత ఊపిరి సలపని విజయాల మత్తులో మునిగిపోయాను…’అనుకున్నాడు.
వారం రోజు క్రితం వచ్చాడు లక్ష్మీసుహాసిని తండ్రి. మొదట గుర్తు పట్టలేదు.
అయనే పరిచయం చేసుకుని కమలేష్‌ని గుర్తు తెచ్చాకా గుర్తొచ్చింది.
‘‘అవును ఎలా ఉంది మీ అమ్మాయి’’
‘‘ఏం చెప్పమంటారు? అప్పుడు మీరిచ్చిన కౌన్సిలింగ్‌కి మారిపోయి ఆ కుర్రాడిని వదిలేసింది.
డిగ్రీ చదివింది. ఉద్యోగంలో కూడా చేరింది.’’
‘‘వెరీ నైస్… అదే కదా మనక్కావల్సింది…’’
‘‘సరే అనుకోండి.. కానీ పిల్ల మారిపోయిందండి. మాట్లాడదు. అడిగితే ఊ…. ఆ… అంటుందంతే…
కొన్నాళ్ళు వదిలేసాను. ఉద్యోగం వచ్చాకా సరే పెళ్ళి చేస్తే బాగుంటుంది కదా అని అడిగా..
ఊ అంది. మన కులం వాణ్ణి… మంచి సంబంధం అని చెప్పి చేసా. పెళ్ళయ్యాకా బావున్నారో లేదో తెలియదు.
మొన్న రాత్రి సైలెంటుగా ఏడుస్తోందని వాళ్ళమ్మ చెప్పింది.
ఏమిటి తల్లీ అనడిగితే నాకు బతకాలని లేదు. నేను చచ్చిపోతానమ్మా..అందట.
వాళ్ళమ్మ హడిలిపోయి ఏమిటి సంగతి అని అడిగిందట. కానీ చెప్పదు….’’
‘‘మీ అల్లుడూ..వాళ్లూ ఎలా ఉంటారు’’ అనడిగాడు అతన్ని ఆపుతూ…
‘‘ఎలా ఉంటారంటే….’’ గొంతు నొక్కుకుని‘ ‘అల్లుడు సంగతి తెల్దు గానీ అత్తగారు రాక్షసి.
ఓ ఆడపడుచుంది అదీ అంతే…’’ అని ‘‘అయినా కాపరం అన్న తరువాత యిలాటియి మామూలే కదండీ…
ఇంతోటి దానికి చచ్చిపోతామంటారా?’’అన్నాడు.
‘‘సరే యింతకీ విషయం ఏమిటి?’’
‘‘వాళ్ళమ్మ చాలా భయపడిపోతోంది. ఈ పిల్ల చచ్చిపోతుందేమో అని. పోనీ ఏమిటమ్మా అంటే చెప్పదు.
మీరోసారి మాట్లాడితే…’’అని ఆగాడు.
భార్యాభర్త గొడవలన్న మాట. ఇందులో మనం పెద్దగా చేసేదేముండదు. కాస్త చెపుతారు.
కాస్త ఏడుస్తారు. మళ్లీ మామూలే.
వారం తరువాత రమ్మన్నాడు.
3
‘‘యిక్కడ మనం మాట్లాడుకునే మాటలు ఎవ్వరికీ వినపడవు. నువ్వు హాయిగా రిలాక్సయి ఓపెన్‌గా
నీ మనసులోని మాటలు చెప్పవచ్చు.’’ అన్నాడు. గ్లాసులో నీళ్ళు తీసుకుని నోటి దగ్గర పెట్టుకున్నాడు.
ఆమె వంక చూస్తున్నాడు.
ఆమె తల ఎత్తింది. కళ్ళ చుట్టూ శనిగ్రహపు వలయాల్లా నలుపు. కళ్ళు గుడ్లతో సహా తెల్లగా ఉన్నాయనిపిస్తోంది.
ఆ పెదాలు నవ్వడం మర్చిపోయి ఐదేళ్ళయినట్టుంది.
‘‘అప్పుడు మా డాడీ తీసుకు వస్తే నాకు మీరు కౌన్సిలింగ్ చేసారు కదా!
అలా కాకుండా నేనే మా డాడీని తీసుకువచ్చి అంతకన్నా రెట్టింపు డబ్బు ఇస్తే
మా డాడీకి కౌన్సిలింగ్ చేసేవారా?’’ అనడిగింది.
డా. అయాన్ గొంతు పొలమారి కళ్ళు నల్లగా మాడిపోవడం ఎవరికీ తెలియదు.
ఈ కథ తో మీరూ విజయం సాధించారు.
ఎక్స్ల్లెంట్ టర్నింగ్ ఇన్ ది ఎండింగ్ .. ఊపిరి బిగబట్టి చదివించిన కథ .. అవును ఇది ఇలాగే ఉండి తీరాలి …
బాగుంది ప్రభు గారు. గానీ కదా సడెన్ గా ముగించినట్టన్పించింది.
ఏమైనా మంచి కథ. అభినందనలు .
ముగింపు బాగుంది సర్.
సైకాలజిస్ట్ పేషెమ్ట్ తో మాట్లాడుతూ, “పక్షి కింద పడింది.గిల గిల లాడుతోంది” అని అనుకోవడంలోనే అతను నకిలీ అని లేదా చదివిన చదువు అర్థం చేసుకోనివాడని అర్థమవుతొంది. (ఎందుకో ఎంత మామూలుగా టైప్ చేసినా దాని ఇష్టం వఛ్చినట్లు తెలుగులోకి మారుస్తోంది ఈ సాఫ్ట్ వేర్. కొన్నిసార్లు అది ఇస్తున్న చాయిస్ లలో ఏదీ పొసగడం లేదు). ఈ కథ అతని గర్వభంగానికి సంబంధించినది అయినట్లుగానే భావించేటట్లయితే లక్ష్మి వేసిన ప్రశ్నతో ముగింపు సమంజసమే.
అవునూ, పక్కా భారతదేశంలో జరిగిన భారతీయుల కథకి ఫోటోలు మాత్రం తెల్లవాళ్ళవి మాత్రం పెట్టారేమిటి? బొమ్మలు వేసి ఇవ్వడానికి మంచి చిత్రకారులు ఉన్నారు కదా! సైకాలజిస్థ పేరు అయాన్ అంటే ఆ పేరు Ian ఏమోనని అనుకోవడానికి ఆస్కారం ఉన్నది గానీ, ఆ చచ్చు ప్రశ్న వేసి ఆ అమ్మాయికి చేసిన అన్యాయం గూర్చి ఆలోచించిన తరువాత అది దొంగ సైకాలజిస్టులు మాత్రమే చెయ్యగలిగింది, దానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నది భారతదేశంలోనే గదా అని ఆ నిర్ధారణకు వచ్చాను.