పద్మాలయా వారి ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ప్రారంభంలో, పేర్లు పడేటప్పుడు నేపథ్యంలో వచ్చే ‘రగిలిందీ విప్లవాగ్ని ఈ రోజు’ పాట, కథారంభానికి నాంది పలుకుతూ సీతారామరాజు విప్లవోన్ముఖుడు కావడాన్ని వర్ణించే వైతాళిక గీతం. సినిమాలోని పోరాటదీప్తికీ, దేశభక్తికీ, వీరరస స్ఫూర్తికీ అద్భుతమైన ఆవాహనగా ఈ పాటను రచించారు ఆరుద్ర.
రగిలింది విప్లవాగ్ని ఈ రోజు
ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు
తనువులోన అణువణువున తరతరాల పోరాటం
తన రూపే దాల్చింది ఝాన్సీరాణి కరవాలం
జలియన్ వాలాబాగున జరిగిన మారణకాండ
తలచి ఎగురవేశాడు తిరుగుబాటు జండా
తిరుగుబాటు జండా..
కన్నెగంటి హనుమంతు వెన్ను లోని బాకు
కత్తిగట్టి సాగమంది కడవిజయం వరకు
ఎలుగెత్తెను ఆ కంఠం మనదే రాజ్యం
జపియించెను ఆ వదనం వందేమాతరం వందేమాతరం
వందేమాతరమంటూ నినదించిన బంగాళం
స్వరాజ్యమ్ము జన్మహక్కు అని చాటిన మహారాష్ట్రం
హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం
అన్నిటికీ నెలవాయెను ఆంధ్రవీర హృదయం
రామరాజు హృదయం….
ఆరుద్ర ఉత్తరోత్తరా పరిశోధకుడిగా, పండితుడిగా, వివిధ రచనా ప్రక్రియల్లో రచయితగా తన సామర్ధ్యాన్ని ఋజువు చేసుకున్నా మౌలికంగా స్వభావరీత్యా ఆయన కవి. ఈ పంక్తులు చూడండి.
తనువులోన అణువణువున
తరతరాల పోరాటం
తన రూపే దాల్చింది
ఝాన్సీరాణి కరవాలం ..
ఇవే కాకుండా, మొత్తం పాట కవిత్వవంతంగా, చదివితేనే ఒళ్ళు గగుర్పొడిచే చందాన సాగుతుంది. ఒకసారి విన్న తర్వాత ఈ పాటను మరచిపోవడం కష్టం.
అయితే అంత ఆవేశంలోనూ, నేల విడిచి సాము చెయ్యకుండా జరిగిన సంఘటనల పునాదిపై సాగుతుంది ఈ గీతం. అవేమిటో చూద్దాం.
>ఝాన్సీరాణి కరవాలం ..
తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా ప్రసిద్ధికెక్కిన 1857 పోరాటంలో అమేయ పరాక్రమం చూపి అసువులు బాసిన ఝాన్సీరాణి లక్ష్మీబాయిని జ్ఞాపకం చేసుకుంటూ ఆమె ఖడ్గమే రామరాజు రూపం దాల్చిందా అని అందమైన వర్ణన చేసారు ఆరుద్ర.
జలియన్ వాలాబాగున జరిగిన మారణకాండ ..
1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలా బాగ్ హత్యాకాండ నాటికి రామరాజు వయసు 21 సంవత్సరాలు. అప్పటికే ఉత్తరభారతదేశం పర్యటించి కాంగ్రెస్ విధానాల్నీ, సాయుధ విప్లవవాదుల ఆలోచనలనూ తెలుసుకుని ఉన్నాడు. మన్యంప్రాంత ప్రజలతో కలసిమెలసి జీవిస్తూ వారి కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూసినవాడు. వలసప్రభుత వికృతరూపాన్ని అందరికీ తేటతెల్లం చేసిన జలియన్ వాలా బాగ్ ఉదంతం రామరాజు మదిలోని బడబాగ్నిలో ఆజ్యం పోసిందని రాబోయే మన్యం విప్లవానికి మరో బలమైన ప్రేరణ అయివుంటుందనీ అనడంలో అతిశయోక్తిలేదు.
కన్నెగంటి హనుమంతు వెన్ను లోని బాకు ..
పంజాబ్ లో జలియన్ వాలా బాగ్ దారుణం జరిగిన కొంతకాలానికి అంధ్రదేశంలో పల్నాడు ప్రాంతంలో కన్నెగంటి హనుమంతు నాయకత్వంలో పుల్లరి సత్యాగ్రహం, హనుమంతు బ్రిటిష్ సైన్యం తుపాకులకు బలికావడం జరిగాయి. కొన్ని కథనాల ప్రకారం ఈ సంఘటన 1922 ఫిబ్రవరిలో జరిగింది. అదే సంవత్సరం ఆగస్టు నెలలో చింతపల్లి, కృష్ణదేవుపేట, రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లపై దాడుల ద్వారా మన్యం విప్లవం ప్రారంభమైంది. పుల్లరి సత్యాగ్రహం, హనుమంతు మరణం, సీతారామరాజుపై బలమైన ప్రభావం చూపి ఉంటాయని భావించవచ్చు. హనుమంతు కత్తి పోటుకు, అదీ వెన్నుపోటుకు గురయ్యాడనడానికి ఆధారాలు కనబడలేదు. అది బహుశా ప్రచారంలోని కథ కావచ్చు.
వందేమాతరమంటూ నినదించిన బంగాళం ..
‘ఆనందమఠ్’ నవలద్వారా బంకీంచంద్రుడు ప్రచారంలోకి తెచ్చిన వందేమాతరగీతం ఈనాటికీ శక్తిచెదరకుండానే ఉంది. ఆనాటి యోధులకు ఎంత ఎత్తేజం కలిగించిందో!
ఈ నవల బంగాళదేశంలో 1770 ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళపై సాయుధ సాధువులు, సన్యాసులు చేసిన తిరుగుబాటు నేపథ్యంలో జరిగింది. 1922 నాటికి యోగిగా మారి, తపస్సుచేసుకుంటూ. గిరిజనులచే దేముడిగా కొలవబడే స్థాయికి వచ్చిన రామరాజుకు వందేమాతరం అన్న నినాదం ప్రత్యేకస్ఫూర్తినిచ్చి ఉండాలి.
స్వరాజ్యమ్ము జన్మహక్కు అని చాటిన మహారాష్ట్రం ..
‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నినదించిన మహారాష్ట్రీయుడు, లోకమాన్యుడు బాలగంగాధర తిలక్, గాంధీ అహింసావాదాన్ని సమర్థించలేదు. 1920లో తిలక్ మరణం కాంగ్రెస్సుకేగాక స్వాతంత్ర్య పోరాటానికి గాంధీ తిరుగులేని నాయకుడు కావడానికి మార్గం సుగమం చేసింది అంటారు.
హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం ..
ఇక్కడ పాంచాలం అన్నమాట గురించి కొద్దిగా ఆలోచించాలి. పాంచాలాన్ని పంజాబ్ దేశంగా పాత తెలుగు నిఘంటువులు పేర్కొన్నాయి. ఇప్పుడు మనకు లభించే ఆధారాలనుబట్టి చూస్తే ఇది కురుసీమకు తూర్పుగా (ఉత్తర్ ప్రదేశ్ లో) హిమాలయాలకు దిగువ గంగా యమునా మధ్యప్రాంతంగా తెలుస్తోంది. ఆరుద్రగారు ఏ ప్రాంతాన్ని మనసులో పెట్టుకుని వ్రాసారో అని అలోచిస్తే ..
పంజాబు ప్రాంతం తరతరాలుగా చైతన్యవంతమైన భూమి, సాయుధ సంగ్రామాల్లో, మాతృభూమిని రక్షించుకోవడంలో ముందువరసలో ఉన్న భూమి. అల్లూరి జీవితకాలంలో జరిగిన గదర్ పార్టీ (1913-1919) కార్యకలాపాలు, ఆ పార్టీ నాయకుల్లో ఒకడై 19 సంవత్సరాలకే వీరమరణం పొందిన కర్తార్ సింగ్ సరభా, ఇవన్నీ గుర్తుకొస్తాయి. (గదర్ పార్టీకి చెందిన పృథ్వీసింగ్ ను అల్లూరి 1916 లో కలిసారని కథ ఉంది)
మహాజనపదాల్లో ఒకటైన పాంచాలం (ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రాంతం) చూస్తే 1857 సంగ్రామంలోని ముఖ్యప్రాంతాలు ఎక్కువ ఇక్కడే ఉన్నాయి (క్రింద బొమ్మలు చూడండి).
మహాపండితుడైన ఆరుద్రకు ఈ విషయాలు తెలిసిఉండే అవకాశం ఉంది. విప్లవకారుడు రాంప్రసాద్ బిస్మిల్ ఇక్కడివాడే. కాకోరీ కుట్రకు ముందు అతను పాల్గొన్న మైన్ పురీ కుట్రకేసు ఇక్కడే జరిగింది.
ఏతావాతా తేలేదేమిటంటే ఈ రెండు ప్రాంతాలకూ సాయుధపోరాటంలో పేరు ఉంది. అయినా పంజాబును ఉద్దేశించే ఆరుద్ర వ్రాసారని నా భావన.
ఇన్ని విషయాలను ముచ్చటించు కోవడానికీ గుర్తుచేసుకోడానికీ అవకాశమిచ్చిన ‘రగిలిందీ విప్లవాగ్ని’ పాట ఆరుద్ర వ్రాసిన వేలాది పాటలలో ఎప్పటికీ నిల్చిపోయే గీతం. ఎన్నో పాటల లాగా ఆయన ఈ పాటను అతి తక్కువసమయంలొ వ్రాసి ఉంటారు. అయినా ఆయన ముద్ర అయిన అంత్యపాసలను మాత్రం వదల కుండానే వ్రాసారు.
అల్లూరి సీతారామరాజు సినిమాలో ఆఖరున వచ్చే ‘విప్లవం మరణించదు’ పాట కూడా ఆరుద్ర వ్రాసిందే. నాందీవాక్యమే కాక భరతవాక్యంకూడా ఆరుద్రదే!
‘అప్పటికే ఉత్తరభారతదేశం పర్యటించి కాంగ్రెస్ విధానాల్నీ, సాయుధ విప్లవవాదుల ఆలోచనలనూ తెలుసుకుని ఉన్నాడు.’
చారిత్రక ఆధారలున్నాయా?
అల్లూరి జీవితకాలంలో జరిగిన గదర్ పార్టీ (1913-1919) కార్యకలాపాలు, ఆ పార్టీ నాయకుల్లో ఒకడై 19 సంవత్సరాలకే వీరమరణం పొందిన కర్తార్ సింగ్ సరభా, ఇవన్నీ గుర్తుకొస్తాయి. (గదర్ పార్టీకి చెందిన పృథ్వీసింగ్ ను అల్లూరి 1916 లో కలిసారని కథ ఉంది)
పాట చరిత్రను చెపుతోందంటూ దానికి కధను ఆధారంగా చూపించడం సరిగా ఉండదు.
రామరాజు ఒకసారి కాదు, రెండుసార్లు ఉత్తరభారత దేశ పర్యటన చేసాడనటానికి అంతర్జాలంలోనే సమాచారం దొరుకుతోంది.
గదర్ పార్టీ విషయాలు కర్తార్ సింగ్ సరభా గురించీ మీకు సందేహం లేదనుకుంటాను.
పోతే రామరాజు గదర్ పార్టీ కార్యకర్తను కలిసాడనడానికి నాకు ఒకే ఒక్కచోట రిఫరెన్స్ కనబడింది. అది నిజమాకాదా అనడానికి సరిపోయినంత ఆధారం లేదనిపించి కథగా పేర్కొన్నాను. అది నిజమయ్యే అవకాశం లేకపోలేదు కూడా.
ఈ ఒక్క విషయం వల్ల మొత్తం పాట గురించి అందులోని చారిత్రాత్మక సంఘటనల పునాది గురించి చెప్పిన విషయాలకు పెద్దగా ఇబ్బంది లేదనుకుంటాను.
చదివి వ్యాఖ్య వ్రాసినందుకు మీకు ధన్యవాదాలు.