మన మధ్య ఉన్నది వెన్నెలమడుగే
దోసిళ్లతో తోడి పారేద్దామనుకోకు
వెలుగుచిరునవ్వు వెలిగించుకొని
మాటలు పంచుకుందామనుకుంటేమాత్రం
స్నేహవంతెన మీదుగా రా
నీకోసం నీ స్నేహం కోసం
రెప్పలకి చూపుల దీపతోరణం కట్టి
స్వాగతిస్తూనే ఉంటాను
ఒకనాడు
స్నేహహస్తాన్ని చాపి అడుగుముందుకు వేస్తే
భాషనుండి యాసల్ని చీల్చి
విసిరికొట్టినప్పుడే
పుటుక్కున తెగిన
వర్ణమాల నుండి జారిన ముత్యాలై
అక్షరాలన్నీ చెల్లాచెదురై దొర్లిపోయాయి
ఒక్కొక్కటే ఏరుకుంటూ
అవిరామంగా కన్నీటిదారానికి గుచ్చుతూనేఉన్నాను
కానీ
దూరంగా పదవుల్ని పట్టుకొని వేలాడుతోన్న ప్రేతాత్మలు
ఒకదాన్నిలాగి మరొకటి ఎక్కే ప్రయత్నం లో
బొక్కబోర్లా పడుతూ
తిరిగి రంగులు మార్చుకుంటూ
ఎగబాకుతూనే ఉన్నాయ్
వాటిని చూస్తూ మురిసిపోతూ
నువ్వు నన్ను పరాయిని చేస్తున్నావు
ఉండుండి మనమధ్య
మనందరి మధ్యా
అగ్గిపుల్లల్ని గీచి పడేస్తూ
ఎండిపోయిన కులాల్నో,మతాల్నో,
కాకుంటే ప్రాంతీయాల్నో
ఇంకా..ఇంకా ..అనేకానేక వివక్షతల్ని
రాజకీయాలు రాజేస్తూనే ఉన్నాయ్
మిత్రమా!
ఏదీ ఎప్పటికీ
మనమధ్య సయోధ్య కుదరటమే లేదు
సాహిత్యం సార్వజనీనం అనుకున్నప్పుడే కదా
అక్షరాలు పద్యమై కూర్చుకొని
వివక్షతల్ని బూడిద చేస్తాయ్
యాసల్ని చీల్చి, వేలాడుతున్న ప్రేతాత్మలూ… లాంటి పదాలు లోపలెక్కడో గుచ్చుకున్నాయి. మేడం మీరన్నమాట నిజం. అక్షరమే సయోధ్య కుదర్చాలి. వేచి ప్రయత్నించడమే మన పని అనుకుంటున్నాను.
అమ్మా…మీ అక్షరాల కడలి లో
ఎంత సేద తీరినా… దాహం తీరదే!
ఈ.,అనంత కాల గమనంలో..
మీ…సాహిత్యం
ఈలోకానికి నిత్యనూతన వసంతం!!
“భాషనుండి యాసల్ని చీల్చి
విసిరికొట్టినప్పుడే
పుటుక్కున తెగిన
వర్ణమాల నుండి జారిన ముత్యాలై
అక్షరాలన్నీ చెల్లాచెదురై దొర్లిపోయాయి
ఒక్కొక్కటే ఏరుకుంటూ
అవిరామంగా కన్నీటిదారానికి గుచ్చుతూనేఉన్నాను”
Beautiful expression.. congratulations మేడం.