సత్తెకాలపు  సత్తయ్య

 

మా జనక మారాజు మరీ సత్తెకాలం మనిషి. ఆడపిల్లల సొమ్ము తినకూడదనే మాటకి పేటెంట్ హక్కు తీసుకున్నట్టు, కొండొకచోట తినవలసి వస్తే కొంపలంటుకున్నట్టు భయపడి తడబడే టైపు.  దానికి తోడు గాంధీ గారి మార్గంలో సింపుల్ లైఫ్ . ఎక్కడా హంగూ ఆర్భాటమూ ఉండవు. కష్టమొస్తే బాగా కుంగిపోవడమో, ఆనందమొస్తే బాగా పొంగిపోవడమో ఉండవు. అయినా అంతటి ఆనందాలు రావడానికి అంబానీ కుటుంబమా ఏంటీ, ఏగానీ జీతంతో ఏడుగురిని పెంచడం మరి 

కొత్త చొక్కా వేసుకుంటే డిపార్ట్మెంట్ లో అందరికీ చాయ్ ఇప్పించాలని రూల్ పెట్టారుట ఆఫీస్ లో ఉన్న కుర్ర కారు.. ఆ చాయ్ పార్టీ ఖర్చుతో, ఒక పిల్లాడికి పరీక్ష ఫీజు కట్టడమో ఒక ఆడ పిల్లకి పరికిణీ కుట్టించడమో వచ్చేస్తుందని కొత్త చొక్కా వేసుకోవడానికి దాదాపు భయపడిపోయేవారని గుర్తు. బస్ ఖర్చు ఎందుకనేమో అల్వాల్ నించీ ఏ ఓ సి సెంటర్ కి రెండు పూటలా కాలి నడకే. చూసినప్పుడు  బస్ ఎక్కమని బలవంతపెడితే “ బస్ చాలా రష్ గా ఉంటుంది. కాళ్ళు తొక్కేస్తారమ్మా, కదుము కడితే తొందరగా మానదు. నిదానంగా నడచి వెళితే సుఖం, గాంధీ గారు నడక మంచిదని చెప్పేవారు” అనేవారు . అదరు నాన్నలు ఇంతేకదా? ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది మనందరికీ…! అందుకే మనందరికీ చదువులయ్యి ఉద్యోగాలొచ్చాక అయినా నాన్నకి ఏదైనా చేద్దామని అందరం తాపత్రయ పడతాం కదా?

చిన్న చిన్న వస్తువులు అడిగి కొనిపించుకునే తలిదండ్రులంటే నాకెంత ఇష్టమో చెప్పలేను.  మా ఇంట్లో మాత్రం ఏది కొనాలన్నా ఒద్దు అనే మాట ముందరే వచ్చేస్తుంది . మరీ బతిమాలినా వినరు.  పోనీ ఆయన కి చెప్పకుండా ఏదైనా కొనిస్తే, రెండో రోజు ఎవరికో ఇచ్ఛేస్తారు. ఇవన్నీ నాకు అలవాటు లేవనో , పుచ్చుకున్న వాడికి ఎక్కువ అవసరమనో, ఇంట్లోనే ఉంటా కదా నాకు ఎందుకు అనో అంటారు. మా నించి తీసుకోక పోగా ప్రతినెలా పెన్షన్ రాగానే ఎంతో కొంత పిల్లలకి ముట్టచెప్పేస్తుంటారు. కాస్త సంపాదనొచ్చాక  మనం పుట్టి పెరిగిన ఇంటిని బాగుచేయించాలని ఎవరికుండదు చెప్పండి. మా ఇల్లు మాత్రం…కట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంచాలని పురావస్తు శాఖ వారి పూర్వీకులెవరో శాపం పెట్టారనిపిస్తుంది.

నాన్న కి వయసు రీత్యా ఈ మధ్య వినిపించటం లేదు అనుకుంటా , మేము ఫోన్ చెయ్యగానే ఆయన మాట్లాడాల్సినవి చెప్పేస్తారు. కానీ, మనము చెప్పేవి పక్కనున్న వాళ్ళు గట్టిగా చెప్పాలి.  రోజు మొత్తం లో నాన్నకి ఇష్టమైన పని రేడియో వినడం. అది కూడా క్లియర్ గా వినలేకపోతున్నానని చెప్తూ వస్తున్నారు.

యుద్ధాలు జరగకుండా ఆయనకి నేను కొనిచ్చిన వస్తువు ఈ రేడియో ఒక్కటే. మాల్దీవుల నించి వస్తూ ఒకసారి ఎయిర్పోర్ట్ లో చూస్తుంటే నాలుగు డాలర్లకి కనబడింది అరచేతిలో పట్టే బుజ్జి పాకెట్ రేడియో. ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఎవరినీ డిస్టర్బ్ చెయ్యకుండా చెవి దగ్గర పెట్టుకుని వినడానికి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు తోడుగా ఉండడానికీ భలే గా పనికొస్తుంది  అంటారు నాన్న. కళ్ళు మూసుకుని ముళ్ళు తిప్పడం అలవాటయిందేమో అది విరిగినా, బ్యాటరీ లూస్ అయినా, పదిహేనేళ్ళు దాటింది కదా అని ఎవరైనా ఇంకో మంచిది కొనిచ్చినా అది మాత్రం వదలరు. పైగా మా అమ్మాయి అల్లుడు కొనిచ్ఛా రని అందరికీ చెప్పుకుంటుంటే మా సీతయ్య కి మొహమాటం. ఇల్లో , పొలమో రాసిచ్చిన లెవెల్లో చెప్తుంటారు, కాస్త మంచిదైనా కొన్నావు కాదు అంటుంటారు. ఎదో ఒకటి లెండి అసలు తీసుకుని వాడుకుంటున్నారు అదే పదివేలు అంటాను నేను.

అలా రోజు మొత్తం లో ఎక్కవ వాడే రేడియో వినలేక పొతే కష్టమే కదా మరి? పోనీ  చెవి మిషన్ కొందామా అని అడిగామనుకోండి , ఠక్కున ఒద్దు అని వచ్చేస్తుంది, ఒక సారి వద్దు అనే పదం వచ్చిందంటే బ్రహ్మ గారొచ్చి చెప్పినా వినడం కల్ల.

నాకు బంగ్లాదేశ్ నించి వచ్చిన కొలీగ్ ఒక కథ చెప్పాడోసారి. ఒక కోర్ట్ దగ్గర గేటుకీపర్  గా ఒక జవాన్ నిలబడ్డాడుట. ఒక వ్యక్తి లోపల ఎవరినో కలవాల్సి వచ్చి, లోపలికెళ్లాలని పర్మిషన్ అడిగాడట. జవాన్ అతన్ని లోపలికి పంపడానికి ఒప్పుకోలేదుట. ఆ వ్యక్తి ప్రతి పావుగంటకీ ప్లీస్ ప్లీస్ అని బతిమాలినా జవాన్ ఒప్పుకోలేదుట. కాసేపు అక్కడే నించుని గమనించిన ఆ వ్యక్తికి లోపలికి బోలెడు మంది వెళుతూ కనిపించారుట. “మరి వాళ్ళు వెళుతున్నారు కదా నన్నెందుకు ఆపుతున్నావని” కోపంగా అడిగాడట. “వాళ్ళల్లో నన్నెవరైనా లోపలికి వెళ్ళచ్ఛా అని అడిగారా? ఎవరైనా అడిగితే పంపకూడదని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు . నువ్వు అడిగావు కాబట్టి నిన్ను లోపలికి వెళ్లకుండా చూడడమే నా కర్తవ్యం” అన్నాడుట జవాను. ఆ కథ  గుర్తొచ్చి, ఇప్పటికి ఊరుకోవడమే ఉత్తమం అనిపించింది.

ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సూపర్ అవిడియా  వచ్చేసింది. అనగనగా ఒక చెవి డాక్టరు ఉన్నాడనీ, అతను  పెద్దవాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ చక్కగా అమరుస్తాడనీ, తన ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి అక్కడే చెవి మిషను కొన్నారనీ  చెప్పి శ్యామ్ అతని దగ్గరికి తీసుకెళ్లాడు . సికందరాబాదు జనరల్ బజార్లో ఒక ఇరుకు సందులో మూడో అంతస్తులో ఉన్న అతన్ని కలిసి మా నాన్న గారి పరిస్థితి ఇదీ అని చెప్పాము.  

“తీసుకురండి చూస్తా” అన్నారు.

“ఇన్ని మెట్లెక్కి రాలేరండీ బాగా పెద్దాయన” అని చెప్పా.

”ఫర్వాలేదు  ట్యాక్సీ లో తీసుకొద్దాం , నేను జాగర్తగా ఎత్తుకుని పైకి తీసుకొస్తా వదినా” అన్నాడు శ్యామ్.

“అసలు ఆయన కదలాలిగా” అన్నా నేను నవ్వుతూ .

“మరి ఏంచేద్దాం” అన్నారు  డాక్టరు గారు.

“మీరు మా ఇంటికి రాగలరా” అని అడిగాము.

“కష్టం అండీ, నేను పగలూ రాత్రీ బిజీ ” అన్నారు.

“మీకు వీలుంటేనే ..నేను ఇంకో వారం రోజులుంటా ఈ లోపు అయితే బెటర్, నేను వెళ్ళాక ఆయనని ఒప్పించడం ఇంక కష్టం” అన్నాన్నేను.

కొంచెం సేపు ఆలోచించి “సరే” అన్నారు.

“కానీ డాక్టరు గారూ,  మా నాన్నగారు ఇలా చెవి మిషను అవీ అని చెప్తే ఒప్పుకోరండీ, చిన్న అడ్జస్ట్మెంటు చెయ్యాలీ” అన్నా నేను మొహమాట పడుతూ.

“అలాగా, ఏమి చెద్దామంటారూ” అన్నారు.

“మీరు ఏమీ అనుకోకపోతే చిన్న డ్రామా” ….మళ్లీ నా మొహమాటం. డ్రామా పదం వినగానే డాక్టరు గారి మొహంలో ఉత్సాహం తొంగి చూసింది.

“చెప్పండీ నన్నేం చెయ్య మంటారూ” … డాక్టరు గారు తొందర పెట్టారు.

” ఏం లేదండీ , మీరు మా వారి స్నేహితుణ్ణని చెప్పండి  చాలు నేను మ్యానెజ్ చేస్తా” అని చెప్పా. అప్పటి దాకా అస్సలు ఖాళీ లేదన్న మనిషి కాస్తా “అయితే రేపు రానా” అని అత్యుత్సాహం ప్రకటించారు. అప్పటికే వారిలో మా వారి స్నేహితుడు జీవం పోసుకుని జీవించెయ్యడానికి రెడీ అయిపోయారు.

“ఇంకో విషయం నాన్నగారి ముందు డబ్బు ప్రసక్తి తేకూడదు కాబట్టి ఫీసు విషయాలు ఇప్పుడే మాట్లాడేసుకుందాం” అన్నాన్నేను. కన్సల్టేశనుకి ఇంత, ఇంటికి వచ్చినందుకు ఇంత, మెషినుకి ఇంత అని మాట్లాడేసుకున్నాము. డ్రామా ఆక్టరుకి ఇంకో 500 అని నేను మనసులో అనుకున్నా కానీ పైకి చెప్పలేదు. “సరే మరి వెళ్లి  వస్తాము, రేపు సరిగ్గా 5 గంటలకి కలుద్దాం, ఇదిగో మా ఇంటి అడ్రస్సు” అని అడ్రస్సు వ్రాసి ఇచ్చాన్నేను.

“నాకు ఆల్వాల్ మెయిన్ రోడ్డు వరకు తెలుసండీ అక్కడి నుంచీ తెలియదు”అని చెప్పారాయన .

“సరే సత్యా టాకీసు దగ్గరకొస్తున్నప్పుడు ఫోన్ చెయ్యండి మా మేనల్లుడిని పంపుతా”అని ఫోన్ నంబరు కూడా వ్రాసి ఇచ్చాను . వెళుతుండగా గుర్తొచ్చింది ” డాక్టరు గారూ మా వారి పేరు “రాజు ” గారండీ అని చెప్పి బయలుదేరాము.

ఇంటికెళ్ళాక  ఇంట్లో అందరినీ సమావేశ పరచి విషయం చెప్పాను.”  నాన్న దగ్గర కెళ్ళి” నాన్నా.. ఈయన స్నేహితుడొకరు నన్ను చూడ్డానికి వస్తానని ఫోన్ చేసారు , రేపు సాయంత్రం రమ్మన్నాను ,  నువ్వు ఇంట్లోనే ఉంటావా గుడికెళతావా” అని అడిగా. “అలాగా.. గుడికి తరవాత వెళ్ళచ్చులే , తప్పకుండా రమ్మను” అన్నారు . నేను మనసులోనే బోల్డు సంతోష పడిపొయ్యా .

అల్లుడు గారి స్నేహితులు కదా టిపినీలు అవీ ఘనంగా చెయ్యమన్నారు  నాన్న.

” ఆయన ఒక అరగంట ఉంటారుట అంతే . ఇటు వైపు ఎదో పార్టీ కి వెళుతూ దారిలో మనింటికొస్తున్నారుట. దయచేసి ఫార్మాలిటీస్ పెట్టుకోకండి టీ కి మాత్రం వస్తాను అని చెప్పారు. అంతగా అయితే మిక్చరు స్వీట్ పెడదాములే” అంది అక్క. నేను మెచ్చుకోలుగా చూసా.   

మరునాడు సరిగ్గా 5 గంటలకి ఫలానా చోట ఉన్నానని డాక్టరు గారు చెప్పడం అక్కడ వెయిట్ చేస్తున్న మా మేనల్లుడు  దారి చూపించి తీసుకురావడం జరిగాయి. వస్తూనే “నమస్కారం అండీ నేను నాయుడు గారి ఫ్రెండ్ ని” అన్నాడాయన. అత్యవసరమైన విషయాలు అరచి చెప్పినా కూడా వినపడని నాన్నకి  ఆ పదాలన్నీ చక్కగా వినిపించేసాయి. నాయుడు గారెవరన్నారు.

“మన రాజు గారికీ, వీరికీ కామన్ ఫ్రెండ్ సికందరాబాద్ స్టేషన్  దగ్గర ఉంటారు లే ఆయన గురించి చెప్తున్నారు” అంటూ, “నాన్న గారికి నాయుడు గారు పరిచయం లేదండీ మా రాజు గారు ఎప్పుడు ఇంటికి తీసుకురాలేదు వారిని”  అన్నా రాజు గారన్న పదం గట్టిగా నొక్కుతూ . “రాజు, నాయుడూ నేనూ చిన్న నాటి స్నేహితులమండీ” అని నాన్నకి వినపడేట్టు చెప్పారు డాక్టరు గారు. “ఏ ఊళ్ళో”అనడిగారు నాన్న. చచ్చింది గొర్రె అనుకుంటూ “మన రాజు గారు మదరాసులో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వీరు ఈ ఎన్ టీ  చేశారట. కొద్ది రోజులు ఒకే రూమ్ లో ఉన్నారట, వీరు చెవి డాక్టర్ “అని గబగబా చెప్పా గట్టిగా.. ” మీకు సరిగా వినబడుతున్నట్టు లేదు.. గట్టిగా మాట్లాడుతున్నారందరూ.. ఏదీ ఒక సారి చూడనీయండి” అని చనువుగా జీవించేసారు డాక్టరు గారు. అల్లుడు అన్న పదం బాగానే వర్క్ అవుట్ అయింది. మరో మాట లేకుండా చెవులప్పగించారు నాన్న. ఆయన కార్ దగ్గరికెళ్లి పరికరాలన్నీ తెచ్చుకుని పావు గంటలో టెస్టులు ముగించి టీ తాగి “పని ఉంది అండీ మళ్ళీ వస్తా ” అని చెప్పి వెళ్లిపోయారు.

మూడవ రోజు హియరింగ్ ఎయిడ్ తీసుకొచ్చ్చి , చెవిలో పెట్టేసి టెస్ట్ చేసేసి ఎలా వాడాలో చూపించారు,

” అయ్యో బాగా ఖరీదైన వస్తువు .. నాకెందుకండీ” అన్నారు నాన్న.

“అవన్నీ మర్చిపొండి, మీకు బాగా వినిపిస్తే మాకు అదే చాలు” అన్నారు డాక్టరు.  “అలా కాదండీ” అంటున్న నాన్నతో “నేను, రాజు చూసుకుంటాం మీరు వర్రీ అవకండి, నాకు పేషంట్ అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాలి” అని లేచారు డాక్టరు గారు ఇంకో మాట మాట్లాడనీయకుండా. అతని సహాయానికి అందరం బోలెడు కృతజ్ఞతలు చెప్పుకున్నాము. అతని వెంట వచ్చిన  శ్యాము అతన్ని సాగనంపే వంకతో సత్యా టాకీసు వరకు వెళ్లి అతనికి ఇవ్వాల్సిన డబ్బు ముట్టచెప్పి వచ్చాడు. నాన్నకి బాగా ఇబ్బంది గా, మొహమాటంగా ఉంది.. ఆయనటు వెళ్ళగానే “దీనికి ఖర్చు ఎంత, ఆయనలా ఇచ్చేసి వెళ్లిపోయారు. నువ్వు అడగలేదు, రాజు గారి దగ్గర తీసుకుంటే బాగుండదు. ఎంతయిందో కనుక్కో.  మనమే ఇచ్చేద్దాం” అన్నారు..

” డాక్టరు గారు పెద్ద వాళ్లకి ఫ్రీ గా చెవి మిషన్లు పంచుతున్నారుట ఈ మధ్య . ఖర్చు ఏమీ లేదు ఉత్తినే ఇటొస్తూ తెచ్చారు” అన్నాడు శ్యామ్ .

“ఓహో అవునా ఎంత మంచి మనసు” అని నాన్న మెచ్చుఁకున్నారు. మా చెల్లి నా చేయి గిల్లింది ఇంకా ఏమేం అడుగుతారో శ్యామ్ ని పిలువు అని.. “శ్యామ్ భోజనానికి రా” అని పిలిచా.

డాక్టర్ గారి మంచి తనం ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికే కాక గుడి దగ్గర కూడా పాకింది.  చుట్టాలని చూడడానికి ఆ ఊరు ఈ ఊరు వెళ్లి వచ్చేటప్పటికి చెవి మిషను వాడట్లేదని కంప్లెయింట్లు. “చెవిలో హోరుగా ఉంటోందమ్మా” అన్నారు నాన్న. నాకు జాలేసి “అలాగేలే నెమ్మదిగా రోజుకో గంట పెట్టుకుని అలవాటు చేసుకో” అన్నా.

మేము మరునాడు బయలుదేరుతామనగా  కాస్త షాపింగ్ అని బయటకెళ్ళి వచ్చ్చేలోపు సత్యనారాయణ గారు వచ్చి  ఉన్నారు. “అమ్మలూ వీరికి, సీతమ్మ గారికీ చెవి వినపడదు, బాగా ఇబ్బంది పడుతున్నారు.  డబ్బు కట్టే పరిస్థితి లేదు పాపం, డాక్టరు గారి దగ్గరికి తీసుకెళతావా” అన్నారు నాన్న. “డాక్టరు గారి దగ్గర అప్పాయింట్మెంట్ తీసుకోవాలి నాన్నా,  ఆయన చాలా బిజీ కదా” అన్నాను. “అయ్యో నీకు టయిం లేదు కదా ఇంకో సారి వచ్చ్చినప్పుడు చూద్దాం” అన్నారు నాన్న. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా.

మరునాటి నించీ మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి చెపితే అర్థం అయ్యేది కాదు. చెవి మిషన్ పెట్టుకోమని వాళ్ళు పోరడం, ఆయన పెట్టుకోకపోవడం, ఇన్ని వేలు పెట్టిన వస్తువు వేస్ట్ అవుతోందని ఒక వైపు, తెలిస్తే ఆడ పిల్ల చేత ఖర్చు పెట్టించినందుకు బెంగ పెట్టుకుంటారేమో అనవసరం గా అని ఇంకో వైపు సతమతమయ్యారు. అక్కలు వదినలు నాకు పనీ పాటా లేక ఖర్చు చేశానని ఆ కర్ణాభరణం డబ్బుతో నా చెవులకి మకర కుందనాలు  వచ్ఛేవని కనీసం అవి చూసి అయినా వాళ్లు సంతోషపడేవారనీ నన్ను తిట్టి వాళ్ళు బాధ పడ్డారు.

“అంత పెద్దగా ఆలోచించకండి, కనీసం ప్రయత్నం చేసాము కదా ..ఇప్పుడు ప్రయత్నం  చెయ్యకపోతే .. చేసుంటే బాగుండేదని భవిష్యత్తులో బాధ పడి ఉండేవాళ్ళం” అన్నాన్నేను.  మిషను పెట్టుకోమంటూ నాన్నని పోరి పోరి కొన్నాళ్ళకి వదిలేశాం అందరమూ.

నాన్న చనిపోయాక  నాన్న వస్తువులు ఎవరికో ఇచ్ఛేస్తూ  “చెవి మిషన్ ఉండాలి దాన్నేం చేద్దాం” అంది అక్క.  అందరికీ ఆసక్తి కలిగింది. చాలా వెతికాము కానీ దొరకలేదు.  ఒక సారి కలిసినప్పుడు ఈ మిషన్ ఎవరైనా వాడచ్చా అని అడిగారని, ఒకొక్కరికీ  కస్టమైజ్ చేస్తారని చెప్పానని శ్యామ్ చెప్పాడు. హోరు వస్తోందని చెపుతూ అదే ప్రశ్న నన్ను పదే పదే అడిగారు అటెండరు పిల్ల అచ్చమ్మ సహాయంతో . అవన్నీ అందరం చెప్పుకుని,  బహుశా హోరు వంక పెట్టి ఆయనకంటే ఎక్కువ అవసరం అనిపించిన ఎవరికో ట్రై చెయ్యమని ఇచ్చుంటారని ఊహించాము. మర్నాడు అచ్చమ్మ వచ్చి ” ఎంత మంచోడమ్మా అయ్యగారు మా అమ్మకి ఖరీదైన చెవి మిషన్ ఇచ్చి ఎవరికీ చెప్పద్దనీ చెప్పిండు” ఏడుస్తూ  ఇంకా ఏవో ఏకరువు పెడుతోంది… పోనీలే ఎవరికో ఒకరికి ఉపయోగపడింది, నాన్న అంతే అనుకున్నాము.

మేమెప్పుడూ కలిసినా ఆ  డ్రామా మాత్రం ఎవరు గ్రీన్ గా మమ్మల్ని అలరిస్తుంటుంది నాన్న జ్ఞాపకాలలో ఒకటిగా…

 

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

11 comments

 • ఒక మధుర ఙ్ఞాపకాల వీధి గుండా ప్రయాణించినట్టైంది. నిజాయితీగా రాసిన కథ. బాగుంది.

  • ధన్యవాదాలు సర్. ఇంటికో నాన్న ఉంటారనిపిస్తుందిలా (నాన్నో, నాన్న కి నాన్నో)

 • మీకు మీరే సాటి ఎన్నెలమ్మ
  బహుముఖ ప్రజ్ఞాశాలి
  చదువుల్లో మిన్న
  మనసులో వెన్న
  పని పాటల్లో పొన్న
  చెలిమిలో గున్న
  ఎన్నున్నా గర్వం సున్నా
  ఆ అపార సరస్వతికి నేనున్నా ఓ అన్న

 • లక్ష్మీ ! నాన్నలంతా అంతే. రేపు మీ పిల్లలు మీఅంత వయసువాళ్ళై మీత్యాగాలు , మీ రచనావ్యాసంగం , ఎన్నెలమ్మగా మీ విజయాలూ వాటనినటి వెనక అదృశ్యహస్తమైన మీ సీతయ్య గారూ అన్నీ చెప్పుకుంటారు.
  గతమెప్పుడూ ఘనమే మధురమే. మీ రచనతో మా నాన్నను గుర్తు చేసారు. చాల అభినందనలు 💐
  అన్నట్లు అస్ వచ్చాను. ఫినిక్స్ లో ఉన్నా. ఆశీస్సులతో … అమ్మ

 • బావుంది. అచ్చం మా తాతయ్య కథలా…తాతయ్య మిషను పెట్టుకోడానికి మావయ్యలు ఇలాగే డ్రామా ఆడారు.

 • ఎంత హ్రద్యమైన కథ.
  మనం చదవగలిగితే మనిషంత గొప్పనవల ఎం వుంటుంది, కదూ?
  మీ నాన్న గారి గురించి చెబుతుంటే నాన్ను నేను అద్దం లో చూసుకున్నట్టయింది లక్ష్మి గారు.
  🙂
  నాన్న గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని మహోన్నతం గా చిత్రీకరిం చారు. అద్భుతం గా రాశారు. మనసుని కదిలించింది.
  ఆ పుణ్య మూర్తికివే నా నమస్సుమాంజలులు
  __/\__

 • చాలా హ్రుద్యంగా వుందీ మీ రచన లక్ష్మి గారు..ప్రతి ఇంట్లో ఆ తరంలో ఇటువంటి ధర్మ ప్రభువులు, సిగ్గరి మనుజుల్లో దేవుళ్ళు, ఆడపిల్ల పైసా కూడా తినకూడదని భీష్మించుకోవడాలు, అర్ధరూపాయి లేక రూపాయి అయినా మిగులుతుందని ఎదో ఒక వంకతో బస్ ఎక్కకనే నడిచి రావడాలు ఇత్యాదివి కోకొల్లలు.. ప్రస్తుతం ఆ సేన్సిటివిటి మ్రుగ్యమైపోయే.. మీ స్వీయ అనుభవాన్ని మాతో పంచుకుని మమ్మల్నందర్ని కూడా తండ్రి ప్రేమ బస్ఎక్కించినందుజె ధన్యవామరిం, మరింత గొప్పగా మీ అత్మీయ అనుభవాన్ని అక్షరీకరణ చేసినందుకు జేజేలు..

 • హృద్యంగా వుంది. మంచి నాన్న కథ. కళ్ళు చెమర్చాయి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.