ఒక పట్టు వోణీ

చెట్టు కొమ్మ మీద ఓ పట్టు వోణీ వేలాడుతుంది. ఓ అమ్మాయి ఇటువైపు వచ్చయినా వుండాలి లేదా గాలి ఆమె వోణీ ని చెట్టుకు వేలాడదీసుండాలి, అన్న వాక్యాలు వోణీ గూర్చిన సమాచారం కాదు. విరహ బాధనెరగని ఓ కవి తన కవితకు రాసుకున్న ప్రారంభ వాక్యాలు. ఓ అందమైన పచ్చిక బయలును చూసినట్టు అతడు ఆ వోణీ ని దూరం నుంచి చూస్తూ ఇలా రాసుకోవడం మొదలెట్టాడు. పొడవైన విల్లో వృక్షం. ఓ పట్టు  వోణీ. వేసవికాలంలో ఆ అమ్మాయి తన ప్రియుడిని కలుసుకోవడాన్ని, వారిరువురూ ఎండిన గడ్డి మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి సూచిక ఆ వోణీ. కొండ అంచున తమ రహస్య వివాహానికి పక్షులను రప్పించే ఎర…దిజ్మండలాన్ని తాకినట్టున్న వోణీ. ప్రియుడు తన ప్రేయసితో ఇలా చెప్పి వుండొచ్చు ‘నీవు నా చెంత లేనప్పుడు నిన్ను ఎంతలా కోరుకుంటానో…నా పక్కనున్నప్పుడు కూడా అంతగానే కోరుకుంటాను…నీ చూపులకు కరిగి నేను సంగీతమవుతాను’. ప్రియురాలు అతడితో   ‘నీవు నా చెంత లేనప్పుడు నిన్ను నా వక్ష ద్వయంలా హత్తుకుంటాను…నా మోకాలిని సుతారంగా నిమిరే నీ చేయి… కాలాన్ని చెమటగా మార్చి నన్ను కరిగించేస్తుంద’ని అనివుండొచ్చు. సూర్యాస్తమయాన ఆ చెట్టు కొమ్మల మధ్య నుండి మెల్లగ సాగే మేఘాన్ని పట్టించుకోకుండా ఓ పట్టు వోణీ గా దానిని కవిత్వీకరించే పనిలో మునిగిపోయాడు ఆ కవి.

(స్వేచ్చానువాదం: మొయిద శ్రీనివాసరావు

మూలం: మహ్మద్ దర్వీష్)

మొహమ్మద్ దార్విష్/ మొయిద శ్రీనివాస రావ్

మహమ్మద్ దార్విష్ సుప్రసిద్ధ పాలస్తీనియన్ కవి. ఆయన వివరాల్ని కింది లింకులో చూడొచ్చు. https://en.wikipedia.org/wiki/Mahmoud_Darwish

2 comments

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.