ఒక లా గుణింతం…

లేయ్…

నా పేలు లవి!

నేను నల్చలీ చలువు తున్నా.

నాకు మాతలొచ్చు. పాతలు కూలా వొచ్చు. పైతింగులు కూలా వొచ్చని బాబాయి అంతాలు.

నాకు లానిదొక్కతే.

‘ల’ (ర) పలకతం!?.. ప్చ్.. అన్నితిలోకి లావొద్దన్నా లా వొచ్చేత్తుంది..

నేను బాగా చిన్నవాలిని కలా? ఏలి పలికినా బాగుంతుందని అమ్మ అంతుంది.

నా మాతలు ముద్దొత్తాయని.. పిన్నీ అత్తా అమ్మమ్మా తాతయ్యా అందలూ అంతాలు – మెచ్చుకుంతాలు కూలా.

ఎదులింతి లమేచు మాత్లం యెక్కిలిత్తాలు.. నేను కనిపిత్తే చాలు.. వాలు.. ‘ల.. లకు దీల్గమిత్తే లా.. లా గులిత్తే లి.. లి గుళ్ళో దీల్గ.. దీల్ఘమిత్తే లీ.. లాకు కొమ్మిత్తే లూ’ – అని గులింతాలు చదివేత్తాలు..

లమేచే కా.. కాదు, అందలూ అంతే-

బళ్ళో కూలా అంతే-

అలటి.. ఆవు.. ఇల్లు.. ఈగ.. ఉలుత.. ఊయల.. చలువుతానా?

‘లంపము’ చదవమంతాలు. నాకొచ్చుకదా లంపము చ.. చదివేత్తాను. జల.. జల్లెల కూలా చదివేత్తాను.

ఎందుకో అక్క మాత్లం బాత పలుతుంది. అమ్మకు చెపుతుంది. అమ్మ నవ్వితే నవ్వి, ఏలుత్తుంది.. ఎక్కువ కాదు, కొద్దిగే.

‘ల’ కాదు ‘ల’ అంతుంది.

నేను లా’యే అంతాను.

మళ్ళీ ‘లా కాదులా.. ల.. ల..’ అంతుంది.

నేనదే అంతాను.

అమ్మ వొప్పు కోదు. లోజూ నేల్పిత్తుంది.

నాకు ‘ల’ పలకతం లాదు సలే, నాతో మాత్లాలే వాలందలూ అంతే. వాలకీ నోలు తిలగనత్తు.. ‘లాజూ’ ‘లవీ’ ‘లవ్వలద్దూ’  యింకా ‘లమ్మిలా’ అని పిలుత్తాలు.. అమ్మని నానా కూలా ‘సలోజా’ అని అంతాలు..

లోజూ యిదే సంత..

అందలికీ పిచ్చి పత్తింది.

ఒక లోజు నాకు.. ల పలకతం.. అదే ‘ర’ పలకతం వొచ్చేసింది. మాత్లాడుతూ మాట్లాడుతూ వుండగానే ర వచ్చేసింది. నోతికి.. నోటికి వొచ్చేసింది. పలిగేత్తుకు వెళ్ళి అమ్మని గత్తిగా పత్తుకొని ముద్దు పెత్తీసి ‘సలోజా’ అన్నాను.

‘పోలా’ అంది అమ్మ.

‘సరోజా’ అన్నాను. అంతే అమ్మ హాశ్చర్యమై పోయింతి. ది. కళ్ళలో నీల్లు తిప్పుకుంతి. కుంది.

‘ఏలవొద్దు’ అని ‘కాదు ఏడవొద్దు’ అని దిద్దుకున్నా.

అమ్మ కళ్ళు తులుచుకొని ‘యిది యేలుపు కాదులా’ అంది. ప్చ్.. కాదు ‘యిది ఏడుపు కాదురా’ అంది.

‘మలి.. వుహు.. మరి?’ అన్నాను.

అమ్మ నాకన్నా గాట్ఠిగా పట్టుకొని నాకు ముద్దులు పెట్టింది.

‘రమేస్’ పిలిచా. వాడు నన్ను చూడ్డం మానేసి ఎవ‘రా’ అని చుట్టూ చూసాడు.

‘నేనేలా.. కాదులా.. ర.. నేనేరా’ అన్నాను. వాడ్ని చిక్కేసా. ‘కరకాదు.. కాదు.. కలకాదు’ నిజమేనని చెప్పేసా. ‘ర.. రాకు దీర్ఘమిస్తే రా.. రారా..’ అని వూపులో రా గుణింతం చెప్పేసా. అరటి.. రంపమూ.. చదివేసా.

‘అర్రే.. బుర్రే.. ఇంగ్లీషులో హుర్రే..’ అరిచాను.

అందరికీ హాశ్చర్యం..

నాకు మరీ.. రీయే- హాశ్చర్యం..

‘లక్కీ ఫెలో’ అంది అక్క.

‘రక్కీ ఫెలో’ అన్నాను.

స్కూల్లో టీచర్.. ర్రే.. ‘ఏలా నీకు ఇంకో చాలి చెప్పాలా?’ అన్నారు.

‘అక్క..ల్లే.. అక్కర్లేదు..’ అన్నాను.

రా గుణింతం.. ర.. రాకు దీర్ఘమిస్తే రా.. మొత్తం చదివేసా. అప్పజేప్పేసా. అరటి.. రంపమూ..

చాల్రా.. టీచరుకు అంతకన్నా మాటలాడలేదు. మెచ్చుకొని ‘నౌ యువార్..’ అంటే ‘రవి’ అన్నాను. ‘గుడ్.. వెరీ గుడ్..’ చాలా గుడ్లు యిచ్చింది. గుడ్లు బలం కదా?

నాకు ర వొచ్చేసింది. అయినా అందరూ ‘లవీ’ అని పిలుస్తున్నాలు. స్కూల్లో యింట్లో వీధిలో గ్రౌండులో చుట్టాల్లో ఫ్రెండ్సులో అందలూ..

లవీ లవీ లవీ..

లావోయ్ లావోయ్ లావోయ్..

లాస్కెల్.. లాస్కెల్.. లాస్కెల్..

ఏంటో అందలూ నాతో లా పలుకుతుంటే నాకూ లా వొచ్చేస్తోంది. ర గుణింతము చదువుతానా? ర.. ర కు దీర్గ.. దీర్ఘమిస్తే రా.. ర కు గుడిస్తే లి. లి గుళ్ళో దీర్ఘమిస్తే లీ.. ల కు కొమ్మిస్తే లు.. రా గుణింతము లా గుణింతమయిపోతోంది.

అందలూ అందరూ నన్ను చూసి ‘ల’ పలుకుతుంటే నాకూ లానే వొచ్చేస్తోంది.

ర పలికినట్టే పలికి.. పలక్కుండా అయిపోతోంది.

‘ఏరా’ అంటే ‘ఏలా’ అయిపోతోంది.

అందరూ నాతో లా పలికి – నేను లా పలికితే నవ్వుతున్నాలు!

అందలికీ సలదా అయిపోయింది గాని.. నాకు ‘ల’ మళ్ళీ ‘ల’ అయిపోయింది.

నేను మళ్ళీ ‘లవి’నయిపోయాను!

-లవి,

నల్చలీ, లోచలీ స్కూల్,

హైదలాబాతు.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.