నీళ్ళలో న్యాయమైన వాటా చాలు సీమ సస్యశ్యామలం!

రాయలసీమవాసులు నిరంతరం శ్రమజీవులు. అయినా ఎప్పుడూ వారికి కష్టాలు, కన్నీళ్లే తోడు. దీనికి కారణం ప్రభుత్వం సాగునీటి వసతి సరైన రీతిగా కల్పించకపోవడమే.  రాయలసీమ పై ఎటువంటి దయ చూపవలిసిన పని లేదు. న్యాయంగా రావలిసిన నీటి వాటా ఇచ్చి రిజర్వాయర్లు నిర్మిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. రాయలసీమ నీటి కష్టాలు తీరకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడి ప్రజల్లో, ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో సరైన అవగాహన, చైతన్యం లేకపోవడమే. అదే సర్కారు, తెలంగాణ ప్రాంతాల్లో అయితే ఒక ప్రాంతీయ సమస్య ముందుకు వచ్చినప్పుడు ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ పాలసీలను, పాత గొడవలను వదిలేసి ఏకతాటిపైకి వస్తారు. ఆ పద్దతి ఇక్కడ లేదు. అదే మన దుస్థితికి కారణం”       — ఎం. సుబ్బారాయుడు , రిటైర్డ్ ఇంజనీర్

నీళ్లు, నీళ్లు అంటూ అనుక్షణం రాయలసీమ నీటి కష్టాలు గురించి ఆలోచిస్తూ, ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రాజెక్టును తయారుచేస్తూ గడిపే మనిషి ఎం. సుబ్బారాయుడు. నీటి లెక్కలతోనే ఆయన జీవితమంతా. రాయలసీమ ను సస్యశ్యామలం చేసే మహత్తర పథకానికై అనుక్షణం అన్వేషణ. ఎస్సార్బీసీ,  తెలుగుగంగ, హంద్రీనీవా వంటి పథకాల్లో జూనియర్ ఇంజనీర్ గా ఉద్యోగం మొదలెట్టి డిప్యూటీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యి 13 సంవత్సరా లయినా తాను అందరిలా విశ్రాంతి తీసుకోకుండా ఇప్పటికీ రాయలసీమకు నీళ్ల గిరించి ఆలోచించే వ్యక్తి. నిరాడంబరత్వం ఆయన నైజం. రాజకీయ నాయకుల నుండి సాధారణ ప్రజలు, విద్యార్థులు ఎవరొచ్చినా ఎంతో ఆప్యాయంగా రాయలసీమ నీటి పథకాల గురించి, వాటికి నీటి కేటాయింపుల గురించి ఎంతో ఓర్పుతో వివరించే వ్యక్తి ఆయన. ఆరోగ్యం సహకరించక, నడవలేని స్థితిలో వున్నా  ఆయన ఆలోచనలు మాత్రం రాయలసీమ ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతుంటాయి. ఆయన ఆవేదన తన గురించి కాదు, తన కుటుంబం గురించి కాదు. రాయలసీమ ప్రజల గురించి. అటువంటి వ్యక్తి శ్రీ ఎం. సుబ్బారాయుడు గారితో రస్తా కోసం చేసిన ఇంటర్వ్యూ .

ప్ర : రాయలసీమకు నీటిలో సమాన వాటా ఇవ్వడం అనేది ఎప్పటినుంచో లేదు కదా?  మరి ఇన్నాళ్లూ ప్రజలు ఎందుకు మౌనంగా ఉన్నారంటారు?

జ : ప్రజలు మౌనంగా ఉండడానికి ప్రధాన కారణం ఒక్కటే. కోస్తా వాళ్లకు నీటి విలువ బాగా తెలుసు . రాయలసీమ కంటే సర్కారు ప్రాంతంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది ఉండేది. అక్కడి ప్రజలకు నీటి పథకాల విలువ , కొత్త ప్రాజెక్టుల ఆవశ్యకత వంటి వాటి గురించి అవగాహనతో వుండేది. స్వాతంత్రం తొలినాళ్లలో మన రాష్ట్రంలోని పెద్ద పెద్ద ఇంజనీర్లు ఎక్కువ మంది కోస్తా నుండి వచ్చినోళ్లే. ఆ ఇంజినీర్లకు తెలుసు , నీటి పంపకాలు ఎట్లా జరిగితే తమ ప్రాంతానికి సమృద్ధిగా నీళ్లు అందుతాయి అని. కృష్ణా నది మహారాష్ట్ర , కర్ణాటక , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది. యీ నాలుగు రాష్ట్రాల నీటి అవసరాలు మొత్తం 4200 టీఎంసీలు. కానీ కృష్ణానదిలో మొత్తం నీటి లభ్యత 2130 టీఎంసీలు మాత్రమే. అంటే అవసరాలలో లభ్యత సగం మాత్రమే అన్నమాట. అందుకే బచావత్ కమిషన్ సెప్టెంబర్ 1960 లోపు పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే నికర జలాలు కేటాయించింది. శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమలో వున్నా కూడా శ్రీశైలం నుండి రాయలసీమకు ఒక్క టీఎంసీ కూడా కేటాయించలేదు. కోస్తావారు ముందుచూపుతో 1951 లోనే అనుమతులు లభించిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును పక్కనబెట్టి నాగార్జునసాగర్ కు నీటి కేటాయింపులు చేయించుకోగలిగారు. ఇక మన వాళ్ళైతే ‘ మన కర్మ ఇంతే ‘ అనే వేదాంత ధోరణిలోనో , లేకపోతే మనకు కృష్ణా నీళ్ళల్లో హక్కులు ఎక్కడున్నాయి అనే నిరాశ , నిస్పృహలతోనో బతుకుతుండేవారు. ఇప్పుడిప్పుడే రాయలసీమ నీటి హక్కుల గురించి తెలుసుకుని ఉద్యమించడానికి ఉరకలేస్తున్నారు.

ప్ర : రాయలసీమ నీటి కష్టాలను తీర్చడానికి ఎప్పుడూ ఏదో ఒక పథకం గురించి ఆలోచిస్తూ వుంటారు మీరు. మీకు అసలీ ఆలోచన ఎలా వచ్చింది?

జ : చాలా సంవత్సరాల కిందట నేను గుత్తిలో జూనియర్ ఇంజనీర్ గా పనిచేసేటపుడు నాకో అవసరం వచ్చి పడింది. అదేమంటే ‘ఎంపిక చేయబడ్డ ఒక స్థలంలో యాభై వేల నీలగిరి వృక్షాలు నాటించడం’. ఆ పని పూర్తి చేయడానికి  నేను రెండు మూడ్రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. వర్షం పడితే ఆ మొక్కలను నాటాల్సి ఉంది. ఎంత ఎదురు చూసినా వాన జాడే లేదు. అప్పుడు నాకనిపించింది వర్షంతో నాకేం పని లేకపోయినా, చెట్లు నాటించిన ఖర్చుతో గానీ, దాని లాభంతో కానీ నాకు సంబంధం లేకపోయినా నేనింత ఆతృతగా ఎదురుచూస్తున్నాను కదా మరి వర్షంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రాయలసీమ రైతుల పరిస్థితి ఏమిటని ఆలోచనలో. పడ్డాను. నేను పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంత కరువు సమస్య పరిష్కారానికి మార్గాలు వెదకడం మొదలెట్టాను.

ప్ర : రాయలసీమకు న్యాయమైన నీటి వాటా దక్కితే సీమ మొత్తం సస్యశ్యామలం అవుతుందా?

జ : న్యాయపరమైన నీళ్లు అందితే నూటికి నూరు శాతం సస్యశ్యామలం అవుతుంది. అంతేకాదు వ్యవసాయంలో కోస్తా డెల్టాతో పోటీ పడగలదు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల కేటాయించిన నికర జలాలను కూడా వాడుకోలేకపోతున్నాం.

ప్ర : రాయలసీమ ప్రజాప్రతినిధులకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చలనం రాకపోవడానికి కారణాలు ఏమైవుంటాయి?

జ : అస్సలు చలనమే లేదు అనను కానీ నాయకులంతా కోస్తా ఇంజనీర్ల మాటకే సై అనేవారు. ఉదాహరణకు శ్రీశైలం ప్రాజెక్టును తీసుకుంటే అంత పెద్ద ప్రాజెక్టును కడుతున్నారు కదా మరి దాంట్లో కరువు రాయలసీమకు నీటి కేటాయింపులు చేయనేలేదు. మన నాయకులు కోస్తా వారిలా ముందు చూపు ఆలోచనలు చేయలేకపోయారు. ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా సీమ అభివృద్ధి కోసం నూరు శాతం పనిచేసుంటే సీమకు ఇప్పుడు యీ దుస్థితి ఉండేది కాదు. సాక్షాత్తు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ స్వయంగా ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ కోసం ఎటువంటి కొత్త ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు అడగలేదు’  అని వ్యాఖ్యానించింది. దాన్నిబట్టి  రాయలసీమ నాయకులకు కోస్తా వారంత ముందుచూపు లేదనే చెప్పాలి. మన నాయకులకు నీటి లెక్కల గురించి చెబితే మనకెక్కడ నీళ్లున్నాయి అంటూ మాట్లాడేవారు. మొత్తం దోపిడీ అంతా వివరిస్తే అలాగా అంటూ ఆశ్చర్యపోయేవారు. పూర్తి అవగాహన లేకపోవడమే దీనికి కారణం.

ప్ర : రాయలసీమ నీటి హక్కుల్లో ఇక్కడి వారు అడిగే వాటా పైన తెలంగాణకు ఏమైనా అపోహలు, అభ్యంతరాలు వుంటాయా?

జ : ఉన్నాయి కానీ మనపై లేవు. కోస్తా వారి డామినేషన్ పైన తెలంగాణకు అపోహలు వుండొచ్చు. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణ లో ఎక్కువగా ఉంది. తర్వాత రాయలసీమ లో ఆ పై కోస్తాలో తక్కువగా ఉంది. కానీ బచావత్ ట్రిబ్యునల్ నీళ్లు పంచేటప్పుడు పరివాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సెప్టెంబర్ 1960 నాటికి పూర్తయిన ప్రాజెక్టులకు మాత్రమే నీటి కేటాయింపులు చేసింది. అక్కడే జరిగింది సీమకు పెద్ద ద్రోహం. కోస్తా వాళ్ళ సంగతి తెలిసే మనవాళ్ళు శ్రీబాగ్ ఒడంబడిక రాసుకున్నారు కానీ దాన్ని అమలు చేయించుకోలేకపోయారు.

ప్ర : ఎందుకు రాయలసీమ ప్రజలకు నీళ్లపై అంత నిరాశ?

జ : సీమ ప్రజలకు మొదటి నుంచి చెరువులపై ఆసక్తి ఉంది కానీ పెద్ద ప్రాజెక్టులపై లేదు. చెరువులు నిండాలంటే వర్షం కావాలి, వర్షాలు పడవు. రెండు మూడేళ్ళకోసారి వర్షాలు పడే పరిస్థితి. ఇవన్నీ రాయలసీమ రైతులను ఇంకా ఇంకా పేదరికంలో కూరుకుపోయేలా చేశాయి. చాలా కాలం నుంచే వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి కోస్తా జనాలకు, నాయకులకు నీటి విలువ తెలిసి ఎప్పుడూ అంట కాచుకుండేవారు. వారితో పోటీ పడలేక రాయలసీమ వాళ్ళు నిరాశకు లోనయ్యారు, కానీ ఇప్పుడు నీటి కోసం ఏమైనా చేయాలి అనే నిశ్చయంతో వున్నారు.

ప్ర : ప్రభుత్వాలు మొదటి నుంచి నీటి పంపకాలలో సవతి తల్లి ప్రేమ చూపాయా?

జ : కనీసం బచావత్ ట్రిబ్యునల్ సూచనలు పాటించి వుంటే సీమకు చాలా వరకు న్యాయం జరిగుండేది. ట్రిబ్యునల్ సూచనలు పాటించడంలో ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను ఉపయోగించి రాయలసీమకు తగిన నీరు ఇవ్వొచ్చు .

ప్ర : మీరు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక చిన్న, పెద్ద పథకాలు తయారు చేసి రిపోర్టులు ఇస్తూనే వున్నారు, ప్రభుత్వాలు వాటిని పట్టించుకున్నాయా?

జ : తగిన విధంగా పట్టించుకోవడం లేదు. వైఎస్ లాంటి వాళ్ళు సిద్దేశ్వరం ప్రాజెక్టు గురించి ఓపికగా విని సదభిప్రాయం వెలిబుచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా గుండ్రేవుల , వేదవతి ప్రాజెక్టులపై సానుకూలంగా స్పందించారు, తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. సిద్దేశ్వరం అలుగు, వేదవతి, గుండ్రేవుల వంటి పెద్ద ప్రాజెక్టులే కాకుండా అనంతపురం సమాంతర కాల్వ, ఇంకా ఇతర చిన్న వాటికి రిపోర్టులు ఇచ్చినా ఇంతవరకు ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు . గుండ్రేవుల , వేదవతి కి ప్రభుత్వం యీమధ్యే సానుకూలంగా స్పందించింది . అవి కూడా ఎప్పటికో , కనీసం ఒక్కటైనా చూస్తానా బ్రతికుండగా అని నిరాశ కలుగుతోంది. నా మిత్రులు, కుటుంబం వల్ల మళ్ళీ ఉత్సాహం వస్తోంది. ఆ భగవంతుడు ఆరోగ్యం ఇచ్చినంత వరకు నా పని కొనసాగిస్తా.

ప్ర : బచావత్ , బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లు కృష్ణా జలాల్లో సీమకు న్యాయమైన వాటా ఇచ్చాయా?

జ : వాటా పంపిణీ లో ఎప్పుడో అన్యాయం జరిగింది. అసలు ట్రిబ్యునల్ అవార్డులే న్యాయమైన ప్రాతిపదికన లేవు . కానీ బచావత్ స్వయంగా చేసిన సూచనలే పాటించడం లేదు. ప్రతి సంవత్సరం 300 టీఎంసీల కృష్ణా నీరు సముద్రంలో కలుస్తున్నాయి అని బ్రిజేష్ కుమార్ కమిషన్ స్వయంగా ప్రకటించింది. ప్రభుత్వాలు అవార్డును, వాటిలోని సూచనలను అస్సలు పాటించట్లేదు. అవార్డు ఏం చెబుతోంది అంటే క్యారీ ఓవర్ నీటి కోసం వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకోండి అంటుంది. ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ కూడా కరువు ప్రాంతాల్లో ప్రాజెక్టులు 1:1 కాస్ట్ బెనిఫిట్ రేషియో ఐనా సరే నిర్మించాల్సిందే అంటుంది . కానీ ముక్కారు పంటలు పండే కోస్తాలో కడుతున్న ప్రాజెక్టుల వేగం సీమలో ఎక్కడుంది.

ప్రశ్న : రాయలసీమ నీటి గురించి చర్చ జరిగినప్పుడల్లా సర్కారు వారు సీమవాసులకు హక్కులేం లేవన్నట్లు మాట్లాడుతుంటారు  కదా దానిలో నిజమెంత?

జవాబు : రాయలసీమకు కృష్ణా నీటిలో అనగా శ్రీశైలం నుండి లేవు కానీ తుంగభద్ర నీటిపై హక్కులున్నాయి. అవే కేసీ కెనాల్ , హెచ్చెల్సీ , ఎల్లెల్సీ  కాల్వలు. రాయలసీమకు దయాదాక్షిణ్యంతో ఎటువంటి నీరు ఇవ్వొద్దు కానీ న్యాయపరమైన వాటాలో దోపిడీ చేయకుంటే చాలు. రాయలసీమను వ్యవసాయ రంగంలో డెల్టా ప్రాంతానికి సమానంగా అభివృద్ధి చేయొచ్చు. వారి నీటి చౌర్యం ఎలా ఉందంటే కృష్ణా నదికి ఉపనది ఐన తుంగభద్ర నుంచి ఏటా 170 టీఎంసీల నీరు కృష్ణాలో కలుస్తుంది రాయలసీమలో. అసలు నిజం ఏంటంటే తుంగభద్ర నీరు కృష్ణాలో పారించవలిసింది  రూలు ప్రకారం 31.45 టీఎంసీలు మాత్రమే. యీ విషయం రాయలసీమలో కొంతమంది ప్రజాప్రతినిధులకే తెలియదు. తుంగభద్ర నుంచి మీకివ్వవలసిన నీరు మీకిచ్చి మిగిలిన నీటిపై మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం అంటే, అలా కాదు మీరు మీ భాగం తీస్కుని మిగిలినదంతా మాకే వదిలెయ్యమంటున్నారు. ఇదేం పంపకం. ఎగువ నది పరివాహక రైతులకు సమృద్ధిగా నీరు లేకున్నా , కరువులతో ఇబ్బందులు పడుతున్నా కింది వారికి కావాల్సినన్ని నీళ్ళు ఉండాలి అనుకుంటే ఎలా. రాయలసీమలో కేసీ కెనాల్ కు కేటాయించిన నీటిని నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్లు కట్టమూ అంటే ఎలా .

ప్ర : ప్రభుత్వాలు కూడా రాయలసీమను దశాబ్దాలుగా పట్టించుకోకుండా ఉండడానికి కారణం ఏమిటి?

జ : కచ్చితంగా పూర్తి అవగాహన లేకపోవడమే, ఎవరూ ప్రచారం చేయకపోవడం, అంతో ఇంతో తెలిసిన రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం నీళ్ల సమస్యను మూసిపెట్టడం జరుగుతూవచ్చింది. ఇక్కడి ప్రజాప్రతినిధులకు తమ స్వార్ధ ప్రయోజనాలే తప్ప ప్రజల సమస్యలు పట్టవు. అలా అని నూటికి నూరు శాతం మంది కాదు, కొంతమంది పట్టుదల గల నాయకులు వున్నారు కానీ, వాళ్లకు మాత్రమే తాపత్రయం వుంటే ఏమి లాభం . ఇది ఒకరిద్దరు పూనుకుంటే తీరే సమస్య కాదు కదా. నాలుగు జిల్లాల నుండి అందరూ ఏకమై సాదించుకోవాల్సినది.

ప్ర : సీమ , సర్కారు ప్రాంతాలకు శాసనసభ సీట్లలో తేడా ఉండడం వల్ల, కోస్తాలో సీట్ల సంఖ్య ఎక్కువ కనుక ఇక్కడివారి డిమాండును ప్రభుత్వాలు పట్టించుకోవు అనే వాదన సరైనదేనా?

జ : చాలా వరకు కరెక్టే. ఇక్కడి నాయకులకు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలని ఉన్నా కూడా వారికి ఒక అపోహ , భయం ఉంటుంది . అదేమంటే ‘తాము తమ ప్రాంత నీటి సమస్యపై ప్రబుత్వాన్ని నిలదీయాలని ప్రయత్నం చేస్తే పార్టీలో , ప్రభుత్వంలో తమ ప్రాధాన్యతను తగ్గిస్తారేమో’ అని. అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఆ అపోహలను , భయాలను వీడి అందరూ ఒక్కటై పోరాడడానికి సంసిద్ధం కావాలి. అప్పుడే రాయలసీమకు సరైన న్యాయం జరుగుతుంది.

ప్ర : రాయలసీమ నీటి వాటాలు మనం అడిగిన రీతిలో ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా అభ్యంతరాలు వుంటాయా?

జ : అట్లా ఏమి వుండవు , ఆ ప్రాంత నాయకులకు అపోహలు ఏమైనా వున్నా అవి సరైన రీతిలో అవగాహన కల్పిస్తే తీరిపోయేవే. వాళ్ళు మనం ఇచ్చి పుచ్చుకునే రీతిలో ఐక్యమత్యంతో నడుచుకుంటే ఇరువురికి లాభం ఉంటుంది. అది అభిలషణీయం కూడా .

ప్ర : ఇప్పుడు కడుతున్న పోలవరం వల్ల రాయలసీమకు మేలు జరుగుతుందా?

జ : జరుగుతుంది దానికి సరైన నిర్మాణం వున్నప్పుడు . పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి నీళ్లు రాయలసీమకు మళ్లిస్తామని చెబుతున్నారు . కానీ ఆ 80 టీఎంసీలపై రాయలసీమకు మాత్రమే కాదు . ఎగువనున్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లకు కూడా హక్కులు ఉంటాయి. ఒక బేసిన్ నుంచి ఇంకో బేసిన్ కు నీళ్లు మళ్లించబడితే ఆ మళ్లించబడిన నీటిపై అన్ని రాష్ట్రాలు ఒక నిష్పత్తి ప్రకారం పంచుకోవాల్సిందే అని బచావత్ తీర్పు ఇచ్చాడు. దాంతో రాయలసీమకు దక్కేవి 22 టీఎంసీలే. మరి వీటితో పాటు తెలుగుగంగ, ఎస్సార్బీసీ వంటి వాటికి కేటాయించిన నీళ్లు నిలుపుకోవడానికే కదా మాకు సిద్దేశ్వరం అలుగు కావాలంటోంది. పైగా యీ మళ్లింపు నీళ్లలో  భాగంగా కర్ణాటక, మహారాష్ట్ర , తెలంగాణలు పైనే 57.5  టీఎంసీలు నిలుపుకుంటాయి. అప్పుడు శ్రీశైలానికి నీటి ప్రవాహం తగ్గదా . రాయలసీమకు ఒక ప్రత్యామ్నాయ నిర్మాణం ; తన వాటా నీటిని నిలుపుకోవడానికి  కట్టుకోనివ్వకుండా ఊరికే నీళ్లిస్తామంటే ఎట్లా వస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్తు ఉత్పత్తి పేరిట 790 అడుగుల వరకు కిందకు విడుదల చేస్తారు. బచావత్ ట్రిబ్యునల్ సూచనల ప్రకారం ప్రాధాన్యత త్రాగునీరు, ఇండస్ట్రీయల్,వ్యవసాయం, విద్యుత్తు ; అలా ఇవ్వవలసి ఉంది. కానీ రాయలసీమలో వ్యవసాయ రైతులు రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అటువంటప్పుడు ప్రభుత్వాలు  విద్యుత్తు ఉత్పత్తి కంటే సాగునీటికే అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకోవాలి. సోలార్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి కదా.

ప్ర : ప్రస్తుతం దేని గురించి రిపోర్టు తయారు చేస్తున్నారు?

జ : శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పటి కెపాసిటీ దాని డిజైన్ కెపాసిటీ కంటే నేడు దాదాపు  95 టీఎంసీలకు పైగా తగ్గిపోయింది. దానికి కారణం రిజర్వాయరులో సిల్ట్ చేరడమే. మాములు పద్ధతుల్లో యీ పూడు తొలగించే అవకాశం లేదు. అయితే సిల్టేషన్ ఇలాగే కొనసాగితే మరో అరవై డెబ్భై ఏళ్లకు రిజర్వాయర్ మొత్తం మట్టితో నిండడం ఖాయం. యీ సమస్యకు కూడా పరిష్కార మార్గం సిద్దేశ్వరం అలుగే. శ్రీశైలం రిజర్వాయర్ జీవన కాలం పెంచేందుకు తీసుకోవలసిన చర్యలపై నా తదుపరి రిపోర్ట్ ఉంటుంది. శ్రీశైలం , నాగార్జున సాగర్ లాంటి పెద్ద ప్రాజెక్టులు భవిష్యత్తులో కట్టడానికి కృష్ణా నదిపై ఎక్కడా వీలు లేదు కాబట్టి వాటినే కాపాడుకోవడం మన ధర్మం. అలా చేయకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. పెరుగుతున్న అధిక జనాభా వల్ల నీటి అవసరాలు ఇంకా ఎక్కువైతాయి. కాబట్టి వాటిని కాపాడుకోవడం మన బాధ్యత.

ప్ర : ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఎందుకిదంతా అని అనిపించలేదా?

జ : అప్పుడప్పుడు అనిపించి అన్నీ పక్కన పడేస్తుంటాను కానీ మళ్లీ ఎవరో ఒకరొచ్చి ఏం రాస్తున్నారు సార్ అనడం , మళ్ళీ వాటిలో మునిగిపోవడం అలవటాయిపోయింది. నా వరకు నేను కూడా నా ప్రాంతానికి నాకు తెలిసిన పద్దతిలో చేతనైన సేవ చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నాను.

చివరిమాటగా ,రాయలసీమ నీటి కష్టాలు తీరాలంటే యీ ప్రాంత రాజకీయ నాయకుల్లో రైతులను ఆదుకోవాలనే తపన పెరగాలి.”

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

3 comments

  • సుబ్బారాయుడు గారు రాయలసీమకు దేవుడిచ్చిన వరం‌ సుబ్బారాయుడు గారికి ఉన్న తపనలో కనీసం ఒక్క శాతం తపన రాజకీయ నాయకులకు ఉంటే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.