పఠేల్ మంటున్న ప్రశ్నలు

“భారత దేశ శక్తిసామర్థ్యాలను ప్రశ్నించేవాళ్లందరికీ సమాధానం ఈ విగ్రహం” – మోడీ.

నెహ్రూకి వచ్చినంత పేరు ప్రతిష్టలు సర్దార్ పటేల్ కు రాలేదనీ, ఆయన ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనీ ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు మోడి ప్రకటించాడు. ఈ విధంగా పటేల్ పేరు పక్కన తన పేరు చరిత్రలో మిగిలిపోతుందని ఆశ.

స్వతంత్ర భారత దేశ నిర్మాణకర్తగా దేశ చరిత్రలో సర్దార్ పటేల్ కు ఎంత ప్రత్యేక స్థానముందో అందరికీ తెలిసిందే.  ఆ ఉక్కుమనిషికీ, స్ట్రాంగ్ మాన్ మోడీకీ మధ్య లేని సమత్వాన్ని అంటగట్టడం తప్ప సర్దార్ పటేల్ గురించి కొత్తగా భాజపా చెప్పగలిగేది ఏమీ లేదు.

ఆ సమత్వాన్ని  దేశం నమ్మిందంటే, సర్దార్ పటేల్ హిందూ మత-పక్షపాతి అన్న వదంతి నిజమయ్యే ప్రమాదమే కాకుండా,  ప్రస్తుతం దేశంలో చెలరేగుతున్న హిందూ మతోన్మాదానికీ, దానికి అనుసంధానమైన నయా ఉదారవాదానికీ తోడ్పడుతుంది.

సర్దార్ పటేల్ కూ, మోడీకీ మధ్య ఎంత  సమత్వముందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం:

స్వాతంత్ర్య భారత్ కు మొట్టమొదటి ఉప ప్రధానీ, హోమ్ మినిస్టర్, చిన్న చిన్న ముక్కలను కలుపుకొచ్చి భారతదేశాన్ని ఒకతాటిన నిలబెట్టిన ఉక్కు మనిషిగా భారత దేశ చరిత్రలో నిలిచాడు సర్దార్ పటేల్. అరెస్సెస్ సానుభూతిపరుడైన గాడ్సే గాంధీని హత్య చేసినప్పుడు, అరెస్సెస్ సంస్థను నిషేధిస్తూ ఇలా అన్నాడు, “సంఘ్ మనుషులు అనుచితమైన, క్రూరమైన కార్యకలాపాలు సాగిస్తున్నారు. రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ గృహ దహనాలూ, దోపిడీ దొంగతనాలూ, హత్యలూ చేయిస్తోందని దేశంలో ఎన్నో చోట్ల నుంచి సమాచారం వస్తోంది. ద్వేషాన్నీ, హింసనూ ప్రోత్సహిస్తూ దేశంలో స్వేచ్ఛను హరిస్తూ దేశానికి చెడ్డ పేరు తెస్తున్న ఇలాంటి శక్తులను కూకటివేళ్లతో పెకిలించివేయాలి.”

ఏ సంస్థ గురించైతే సర్దార్ పటేల్ ఇంత నిక్కచ్చి అభిప్రాయం వెలిబుచ్చాడో అదే అరెస్సెస్ సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పడింది భాజపా. భారత దేశ చరిత్రలో మరిచిపోలేని రోజుల్లో ఒకటైన 1992, డిసెంబరు 6న, బాబ్రీ మసీదును సంఘ్ కర సేవకులు కూల్చి వేశారు. ఆ సంఘటనతో తన నిజ స్వరూపమైన హిందూ మతోన్మాదమే బలంగా దేశ రాజకీయ రంగంలో తన వునికిని చాటుకుంది  భాజపా.

బాబ్రీ మసీదు మీద అది మొదటి దాడి కాదు. దేశ విభజన జరిగిన రెండేళ్లకే అయోధ్యలో బాబ్రీ మసీదు మీద కొందరు దాడి చేసి రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మతపరమైన సమస్యలను ముస్లిం ప్రజలను కలుపుకుని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి గానీ బలప్రయోగంతో కాదని అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రికి సర్దార్ పటేల్ ఉత్తరం రాశాడు.

1947లో దేశవిభజన సమయంలో మత కల్లోలాలు చెలరేగినప్పుడు కొన్నివేలమంది ముస్లింలకు రెడ్ ఫోర్ట్ లో రక్షణ కల్పించాడు సర్దార్ పటేల్. 2002లో గుజరాత్ లో ముస్లింల ఊచకోత సంఘటనలో మోడి ఎలాంటి చర్యలూ తీసుకున్నాడో తెలిసిందే.

దేశభక్తీ, దేశ మర్యాదను కాపాడే అతీత శక్తులు తమకు మాత్రమే ఉన్నాయని చాటుకుంటున్న భాజపా, తమకు ఏమాత్రం సంబంధంలేని స్వాతంత్ర్యోద్యమాన్నీ, దేశం కోసం జీవితాలర్పించిన వారినీ తమ పార్టీకీ, పార్టీ భావజాలనికీ వాడుకుంటోంది.  

నిరాడంబరతకు మరో పేరు సర్దార్ పటేల్. ఆయన విగ్రహానికి అయిన ఖర్చు 3000 కోట్ల రూపాయలు. అంత ప్రజాధనంతో దేశంలో ఎన్నో తరాలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టి ఉండవచ్చు. సర్దార్ సరోవర్ డ్యామ్ కడుతున్నప్పుడు రైతుల నుంచీ, ఆదివాసుల నుంచీ భూములను లాక్కున్నప్పుడు ఇస్తామన్న నష్టపరిహారం 35 వేల కుటుంబాలకు ఇంకా పూర్తిగా చెల్లించనేలేదు. వాళ్ల కళ్లెదుటే ఆ విగ్రహ నిర్మాణం జరిగింది. దీని వల్ల చుట్టుపక్కల జరిగిన ప్రకృతి విధ్వంసం గురించి మచ్చుకి కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, విగ్రహం కోసమూ, ఆరు లేన్ల రోడ్డుకోసమూ దాదాపు 200,000 చెట్లు కొట్టేశారు. ఆదివాసి తెగలు నివసిస్తున్న ఆ ప్రదేశాన్ని ప్రభుత్వం ముట్టుకోకూడదని సర్దార్ పటేల్ స్వయంగా నిర్దేశించిన స్థలంలో ఆయన విగ్రహ నిర్మాణమే జరిగింది.

నరేంద్ర మోడీ ఆదివాసులకు శత్రువు’ – రక్తంతో రాసిన నినాదం

 

 

విగ్రహావిష్కరణకు రాబోతున్న మోడీకి, తమ నుంచి ఎలాంటి స్వాగత సత్కారాలు ఉండవనీ, ఈ విగ్రహ నిర్మాణం వల్ల ఎంతటి ప్రకృతి విధ్వంసం జరుగుతోందో, తమకు ఎంత అన్యాయం జరుగుతోందో చూసి వుంటే సర్దార్ పటేల్  ఏడ్చేసి ఉండేవాడనీ, విగ్రహ నిర్మాణం వల్ల నష్టపోయిన ఎన్నో గ్రామాలకు చెందిన ఊరి పెద్దలు ఉత్తరం రాశారు. ‘నరేంద్ర మోడి ఆదివాసులకు శత్రువు’ వంటి నినాదాలను తమ రక్తంతో రాసి నిరసన తెలిపారు అక్కడి ఆదివాసి ప్రజలు. విగ్రహావిష్కరణకు కొన్ని రోజుల ముందు ఎంతో మంది పౌరహక్కుల కార్యకర్తలను అరెస్టు చేసింది గుజరాత్ ప్రభుత్వం.

72 గ్రామాల ప్రజల కడుపులు కొడితేగాని భారత శక్తి సామర్థ్యాలు రుజువు కాలేదు. విగ్రహ నిర్మాణానికీ, ఆవిష్కరణకూ నిరసనగా రైతులు, ఆదివాసి తెగ ప్రజలూ అక్టోబరు 31 న పొయ్యిలు వెలిగించలేదు. ఇంట్లో ఎవరైనా చనిపోతే పొయ్యి వెలిగించకూడదన్న ఆనవాయితీ వాళ్లలో ఉంది.

సర్దార్ పటేల్ పుట్టిన రోజైన అక్టోబర్ 31ను ‘అఖిల భారత ఏక్తా దివస్’గా  ప్రకటించాడు మోడీ.

ఏ దేశ స్వాతంత్ర్యం కోసమైతే జీవితాన్ని అర్పించాడో, ఏ దేశ ఐక్యతను సాధించి ఉక్కు మనిషి అయ్యాడో ఆ దేశం ఆయన విగ్రహాన్ని ఆకాశానికి ఎత్తి ఆయన సిద్ధాంతాలను పాతాళానికి అణగదొక్కిన రోజు ఈ ‘అఖిల భారత ఏక్తా దివస్’. రండి, లెటజ్ సెలబ్రేట్!!

సెలెబ్రేట్ చేసుకోవడానికి మనమెవరమయా అంటే విజయ మాల్యాలు దేశం దాటిపోయినా, డిమానిటైజేషన్ పేరిట జీవితాలు అతలాకుతలం అయినా అతి సహనంతో బ్యాంకుల ముందు బారులు తీరినవాళ్లం. మెడ వెనక్కి విరిచి చూదాం దేశ శక్తి సామర్థ్యాలను. ఎంతైనా, పొయ్యి వెలగనిది మనింట్లో కాదు.. ఇప్పటికి!!

కొడిదెల మమత

3 comments

  • చాలా బాగా వ్రాసారు మమతల గారూ. straight forward .to the point…

    • ‘తప్పుడు సమాచారం’ అంటూ ఒక మాట పడేస్తే నమ్మేసే గుడ్డిరోజులు కావివి. ఈ ప్రాజెక్ట్ బాధితులతో పనిచేసిన కార్యకర్తలనుంచి సేకరించిన సమాచారమిది. మీ దగ్గరనున్న ‘ప్రత్యామ్న్యాయ సమాచారం’ కాస్త సెలవియ్యండి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.