మానవ శరీరాలూ మంచినీళ్ల గ్లాసులూ

 

సర్దాగా ఈ సారి సెక్సు సంగతులు మాట్లాడుకుందామా?

అడగాలా? ఎవురు కాదంటారు!

ఎవురూ కాదనరు గనుకనే అంతటి మానుభావుడు, తెలుగు సాహిత్యంలో సెక్సు స్పెషలిస్టు చెలం సారు మహా ప్రస్థానం పీఠికలో… అదే, గుర్తుంది లెండి, ‘యోగ్యతా పత్రం’లో ‘ఇందులో మిమ్మల్ని వుద్రేకించే సెక్సు సంగతులేం లేవు’ అని ఒక డిస్క్లెయిమర్ రాసేడు.

సెక్సు సంగతి ఏమాత్రం వున్నా, చూచాయగా… అనగా కనిపించీ కనిపించనట్లు వున్నా … కన్ను అక్కడే తచ్చాడుతుంది.

‘సర్దాగా’ అని అన్నాను గాని, నిజానికిది సరదా ఏం కాదు. కొంపలు అంటుకునే సంగతి. ఇట్టా ఎన్ని కొంపలు కాలాయో, ఎన్ని కొంపలు ఆరాయో లెక్కా జమా లేదు.

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి… అనగానే… ఆ, ఆ, తరువాతేంటీ.. అని అడగాలనిపిస్తుంది.

అలా అన్పించడం సరైనదే, సహజమే.

సెక్సు సంగతులలోకెల్ల హింసాత్మకమైనది రేప్.

ఆడవాళ్ళ మీద మగవాళ్ళ అత్యాచారాలు… పలు రకాలు. అందులో కొన్ని ప్రాణాంతకాలు కూడా.

లీగల్ అత్యాచారాలు సరే, ‘పిల్లలు నిద్దర్లు పోయాక అమ్మలు లీగల్ గా రేప్ చేయబడతారు’.

ఇప్పుడు ఇల్లీగల్ అత్యాచారాల గురించే మాట్లాడుకుందాం.

‘మీ టూ’ వుద్యమం గురించి కూడా ఓ మాట అనుకుందాం.

అత్యాచారం స్త్రీ శరీరానికి కలిగించే బాధ కన్న ఆమె మనస్సుకు కలిగించే బాధ చాల ఎక్కువ. మనస్సుకు కలిగించే బాధ కన్న ఆమె సామాజిక జీవితానికి కలిగించే బాధ ఇంకా ఎక్కువ.

రేప్ కు గురైన స్త్రీని తక్కువ చేసి చూసి, ఆమెను జీవచ్చవం చేసే వాళ్ళే లోకంలో ఎక్కువ.

దానికి మందు ఒక్కటే. సమాజంలో ఆ మైండ్ సెట్ ని తీసెయ్యాలి. ‘రేప్ చేయడం హీనం గాని, రేప్ కు గురవడం కాదు’ అనే సుయోచనని సమాజం మనస్సుకు మప్పాలి. ఆమెను నార్మల్ మనిషిగా చూడడం సమాజానికి నేర్పించాలి.

అది మన విద్యలో భాగం కావాలి.

రేప్ కు లేదా ఆ ప్రయత్నానికి గురయిన వాళ్లు తమకు అలా జరిగిందని బహిరంగంగా మాట్లాడాలి. బహిరంగంగా మాట్లాడడ మంటే రేప్ ని రేపిస్టు నేరంగానే గాని, తమ అవమానంగా అనుకోడం లేదని ప్రకటించడమే. ఆ స్టేట్మెంటుని సానుభూతితో విని సంఘం ఆమెను ఎప్పట్లా నార్మల్ గా చూసే కొద్దీ… రేప్ ను నేరంగా తప్ప అవమానంగా చూడకపోవడం జరిగే కొద్దీ.. మగాళ్ళు ఆడపిల్లలను అవమానించడం కోసం రేప్ చేయడం తగ్గిపోతుంది. పురుషులు స్త్రీలను ఆధిక్యతా భావన కోసం రేప్ చేయడం తగ్గుతుంది. రేప్ కి అతి ముఖ్యమైన మోటివ్ తొలగిపోతుంది. బాధితురాలు… తన మీద జరిగింది ఒక దాడి గాని, అవమానం కాదని అనుకోగలిగితే అది ఆమెకొక మానసిక క్లేశంగా వుండిపోదు.

ఒక శరీరం మీద మరొకరు దాడి చేయడం, ఒక శరీరాన్ని మరొకరు నిర్బంధించి హింసించడం మహా నేరం. ఈ దాడుల్లో ఆడపిల్లలు, అసిఫా వంటి చిట్టితల్లులు ప్రాణాలు పోగొట్టుకోడం జరుగుతోంది. అందువల్ల రేప్ కి కఠినాతి కఠిన శిక్షలు వుండాల్సిందే.

శిక్షల మేరకు అందరూ ఓకే, దీన్ని సామాజికాంశంగా పరిగణించడమే జరగాల్సినంతగా జరగడం లేదు.

మిగిలిన భౌతిక దాడుల నుంచి రేప్ ను వేరు చేసే విషయం ఒక్కటే, అది సెక్సు.

కన్సెంట్ తో జరిగినా కన్సెంట్ లేకుండా జరిగినా ఇందులో వున్నది సెక్సువల్ యాక్ట్.

సెక్సు గురించి అవధులు లేని ‘స్వేచ్చ’గా ఆలోచించే వారు పునరాలోచించాల్సిన అంశమొకటి వుంది.

స్వేచ్చ ద్విముఖి.

ఎవరు ఎవర్ని రేప్ చేస్తారు? బలవంతురాలైన స్త్రీని ఆమె కన్న బలహీనుడైన పురుషుడు రేప్ చేయలేడు.

బలం కేవలం శారీరకం కానక్కర్లేదు. సామాజికం కావొచ్చు. ధనవంతురాలైన స్త్రీ,  సాంఘికంగా వున్నతిలో వున్న స్త్రీ తన మీద ఆధారపడిన పురుషుడి కన్న బలవంతు రాలే.

చదువుకోడం ఎక్కువయ్యే కొద్దీ… మగ ఆఫీసర్లు ఆడ వుద్యోగుల మీద చేసే అత్యాచారాలు లేదా ఆ ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి.

య్యా, ఔనండీ, నిజమే, ‘ఈ రకం అత్యాచారాలు’ రివర్స్ లో జరగ్గూడదని ఏమీ లేదు. జరగడం లేదని కూడా ఏమీ లేదు. ప్రొఫెసర్లను యువతులు లోబరుచుకుని పనులు జరుపుకోనూ వచ్చు. కాకపోతే అలాంటి అత్యాచారాలకు గురయిన, గురవుతున్న మగవాళ్ళు దాన్ని ప్లెజర్ గానే భావిస్తారు. అవమానంగా భావించరు. గప్ చుప్ సాంబార్ బుడ్డి అన్నట్టుండిపోతారు. ‘మీ టూ’ అంటో ముందుకు రారు.

ఎందుకిలా?

సెక్సు స్వేచ్చ పురుషుడికి తప్పు కాదు, అవమానం కాదు, గర్వకారణం.

అది స్త్రీకి గర్వకారణం కాదు, అవమానకరం. కనుకనే, స్త్రీల సెక్సు స్వేచ్చ గురించి ఎంత మాట్లాడితే అంత రెవల్యూషనరీ అవుతున్నది.

రెవల్యూషనరీ అవునో కాదో గాని, అది స్త్రీకి వుపయోగపడదు.

ఒక మగాడి కోసం ఇద్దరు స్త్రీల పోటీలో ధనిక ఆడ్వాంటేజ్డ్ స్త్రీ గెలవడానికి వుపయోగపడితే, అది స్త్రీ స్వేచ్చకు వుపయోగపడిందనడం పాపులర్ ఫెమినిస్టుల వాదం. స్వీయమానసిక వాదం.  

సెక్సు స్వేచ్చను స్త్రీకి గొప్పదని ఒప్పేసుకోడమంటే. అది పురుషుడికి గొప్పదని కూడా ఒప్పుకోడమే.

మనం బతుకుతున్నది పురుషాహంకార ప్రపంచంలో. అన్నిటా పురుషుడికి అడ్వాంటేజెస్ వున్న ప్రపంచంలో. స్త్రీ, పురుషులకు ‘సమాన’ స్వేచ్చ అనడమంటే, పురుషుడి స్వేచ్చను వుగ్గడించడమే.

తెలిసి తెలియక వివాహేతర సంబంధంలో పడిపోయిన వారి సంగతి వేరు.

వివాహేతర సంబంధాలు చాల గొప్ప అయినట్లు, మోనోగమీ దానికదే పరమ ఫ్యూడల్ అయినట్లు రాస్తున్న వాళ్ళు ఫెమినిస్టులా, మాస్కులైనిస్టులా? వాళ్లు స్త్రీవాదులా పురుష వాదులా?

వాళ్ళు సాహిత్య సేవ చేస్తున్నది స్త్రీలకా? పురుషులకా?

సెక్సు స్వేచ్చ భావన ఇంతగా వెర్రి తలలు వేయకపోతే, ఒక ప్రొఫెసర్ తనకు చేరువగా వొచ్చిన ఆడపిల్ల మీద పడి కావిలించుకుని, ముద్దులు పెట్టేసుకోడం వంటి ఘటనలు జరిగేవి కాదు.

మీద పడిన ప్రొఫెసర్ వయసు ఎంతనే చర్చ అర్థరహితం. సెక్సువల్ కేపబులిటీ వయో సంబంధమే గాని, సెక్సు కోరిక వయో సంబంధం కాదు.

పళ్ళూడిన తరువాత మటన్ రోటీ మీద కోరిక ఇంకా ఎక్కువవుతుంది..

పద్నాలుగేళ్ళ పిల్ల వాడి నుంచి తొంభై ఏండ్ల వయో వృద్ధుడి వరకు సెక్సు ఒక సహజాతం. బేసిక్ ఇన్ స్టింక్ట్. పెద్ద వయసు ప్రొఫెసర్ ప్రవర్తనలో వ్యక్తమయ్యింది అటువంటి సహజాతమే.

సెక్సు కోరిక సహజం, సహజాతమే అయినప్పుడు, ఆ ‘సదు’ద్దేశంతో చొరవ తీసుకోడాన్ని తప్పని ఎందుకనాలి?

పులి జింకను తినడం, జింక గడ్డి తినడం తప్పని అంటామా?!

అది సహజమే గాని, ‘సంస్కారం’ కాదు. సంస్కారం పుట్టుకతో రాదు. అది పుట్టిన తరువాత నేర్చుకునేది.

సంస్కారం కాకపోతేనేం… అంటే కుదరదు. అందరూ అంగీకరించే సంస్కారాలు కొన్ని వున్నాయి. రోడ్డు మీద బట్టల్లేకుండా తిరక్కపోవడం వంటివి.

ప్రొఫెసర్ ప్రవర్తన సంస్కారం కాదు.

ఆయన ప్రవర్తన, ఆయన కోరిక, ఆయన దాన్ని ‘అణుచుకోక పోవడం’ అంగీకార యోగ్యం ఎందుకు కాదో అందుకే అబ్జల్యూట్ స్వేచ్చ అనగా నిర్నిబంధ సెక్సు స్వేచ్చ అంగీకార యోగ్యం కాదు.

నిర్నిబంధ స్వేచ్చ కుదరనప్పుడు చాల ఎక్కువ మంది అంగీకరించే నిబంధనలేవో వుండాలి.

సెక్సు అంటే ఇర్వింగ్ వాలెస్ చెప్పిన ‘ఏడు నిమిషాల’ ఆనందం కాదు. సెక్సంటే పిల్లలు, వాళ్ళ పెంపకం, వృద్ధాప్యం, నిస్సహాయ సమయాల్లో గౌరవనీయమైన సహాయం… అన్నీ దానితో ముడిపడి వుంటాయి.

ఒక్క మాటలో, సెక్సు కోరిక నిబంధనలు కుటుంబంతో ముడిపడి వుంటాయి.

అంటూ వుంటారు గాని, సెక్సు కోరిక ఆకలి దప్పుల వంటి సహజాతం కూడా కాదు.

అది ఆకలి దప్పుల వంటిదనే వైఖరినే… వ్లాదిమీర్ ఇల్యీచ్ లెనిన్ అనే పెద్దాయన ‘గ్లాస్ వాటర్ థీరీ’ అని కోప్పడ్డాడు, కామ్రేడ్ క్లారా జెట్కిన్ తో మాట్లాడుతూ.

దప్పికేసినప్పుడు నీళ్లు తాగడానికి వుపయోగించే గ్లాసు వంటిది సెక్సు అని ఒక థీరీ.

అలెగ్జాండ్రా కొల్లెంటాయ్ అనే ఆమె ‘గ్లాస్ వాటర్ సిద్ధాంతమే కరెక్ట’ని ఏకంగా ఓ నవలే రాసేశారు. దాని పేరు ‘త్రీ జెనరేషన్స్’. నవల తెలుగు నాట కొన్నాళ్ళు హల్ చల్ చేసింది. సెక్సు స్వేచ్చావాదులు భలే మెచ్చుకున్నారు.

లెనిన్ అన్నట్లు సెక్సు గ్లాసులోని నీళ్లు కాదు, ఏ గ్లాసైనా ఫరవాలేదు, దప్పిక తీరాలంతే అనుకోడానికి.

సింపుల్ ట్రూత్: ఆకలి, దప్పులను ఆపుకోలేం. మరీ ఎక్కువగా ఆపుకుంటే చస్తాం.

సెక్సు కోరికను ఆపుకోగలం. చాన్నాళ్ళు ఆపుకోగలం. బతుకంతా అది వొద్దనుకున్నా చావం.

సెక్సు వొద్దనుకుంటే ఏమీ కాదు, వొద్దనుకోగలమని ప్రతి మగవాడికీ తెలుసు.

బలం వున్నప్పుడు… బలం వుండి ఏ సిగ్గు (సంస్కారం) లేనప్పుడు… ఆపుకోరంతే.  

కనుక సోదరా, సోదరీ! సెక్సు అన్నం, నీళ్ళ వంటిది కాదు. మానవ శరీరాలు ప్లేట్లూ, గ్లాసులూ కాదు.

అన్నం, నీళ్ల విషయంలో దొంగతనం పెద్ద నేరం కాదు. రాబిన హుడ్ తరహా బందిపోటు దొంగతనం కూడా దొంగతనం కాదు. వాటి కోసం కొందరు దొంగతనం చేయాల్సి వస్తే, ఆ తప్పు సంఘానిదే. మారాల్సింది సంఘమే, వాళ్లు కాదు.

అకలి దప్పులు తీరని వాళ్ళు సంఘం మీద ఎలాంటి తిరుగుబాటు చేసినా అది సమర్థనీయమే. సమర్థనీయం అయినా కాకపోయినా ఎవ్వడూ ఆగడు. ఆకలి దప్పులతో చావడం కన్న వాటి కోసం పోరాడి చావడం మేలనుకుంటాడు.

సెక్సు విషయంలో దౌర్జన్యం, దొంగతనం రెండూ అక్కర్లేదు. కాస్త ఓపిక పడితే గంతకు తగ్గ బొంతలు దొరుకుతారు. అది లేకుంటే బతుకలేమనే పనికి మాలిన రొమాంటొక్ భావన ఎంత తొలగితే అంత మంచిది… వ్యక్తికీ, లోకానికి.

(ప్రేమ అనేది ఒకటుంది. మరొకరికి బాధ కలిగించేట్టుగా ప్రేమ ఎప్పుడూ వుండదు. ఉంటే అది ప్రేమ కాదు. సంస్కారం లేని వొట్టి కామం, సెక్సు కోరిక.)

సెక్సు విషయంలో సంయమనం, సంస్కారం లేకుండా ప్రవర్తించడం, ఇతర్లకు బాధ కలిగేలా ప్రవరించడం మీ పట్ల జరిగితే మీరు నెప్పి పడతారు. అదే పని మీరు మరొకరికి, మీ కంటె బలహీనులకు కష్టం కలిగేలా చెయ్యడం తప్పనిసరిగా తప్పే. ‘ఒరులేయవి యొనరించిన తమకెగ్గు కలుగు తానవి యొరులకు సేయకునికి పరమ ధర్మము’

ఆకలి వలె, దాహం వలె సెక్సు కోరికను ఆపుకోలేకపోయామని అత్యాధునిక ఆరిందా కబుర్లు చెప్పడం సామాన్యులు చేసే పని కాదు. అది ‘అసామాన్యులు’ చేసే పని.

అసామాన్యులు అనగా సాంఘికార్థిక ‘పురోగమనం’లో ముందుగా అవకాశాలు పొందిన వాళ్లు. అడ్వాంటేజ్డ్ పీపుల్.

ఆర్థిక అర్థంలో చెప్పాలంటే తమ ఇష్టం వొచ్చినట్టు, తమకు ఇష్టం వొచ్చిన పద్ధతుల్లో సంపాదించుకోడానికి (దోచుకోడానికి) అవకాశం వుండడమే స్వేచ్చ అని క్లాసికల్ పెట్టుబడిదార్లు వాదిస్తారు. గ్లాసు వాటర్ థియరిస్టులది అటువంటి ‘బూర్జువా ర్యాడికలిజ’మే. బలహీనుల పట్ల బాధ్యత లేని ర్యాడికలిజమే.

ఇది ‘వెనుక బడిన’ వాళ్ళకు… ముఖ్యంగా డిజడ్వాంటేజ్డ్ స్త్రీలకు అన్యాయం.  

ఈ పని చేసే వాళ్ళు చాల మటుకు… నూటికి తొంభై వంతులు మగ వాళ్ళే. దీని వల్ల విక్టిమైజ్ అవుతున్నది… అదే నిష్పత్తిలో… ఆడవాళ్ళే. నూటికి తొంభై విడాకులు మగ పక్షీంద్రత్వం (ఇవాలొక ‘కొమ్మ’ రేపొక ‘కొమ్మ’ అని అనుకోడం) వల్ల జరుగుతున్నవే.

ఈ వైఖరిని సమర్థించే లేడీసు పాడుతున్నది స్త్రీ స్వేచ్చా గీతం కాదు. పురుషహంకారానికి కొత్త వూతం.

హెచ్చార్కె

20 comments

 • చాలా బాలెన్సెడ్ గా రాశారు సర్. టాపిక్కే గంభీరమైనది. గంభీరత ఇంత ఓపెన్ గా మాటాడక పోవడం వల్లే అని కూడ మళ్ళీ అర్ధమయ్యింది. మగవాళ్ళకి ఊతం అంటూ లాస్ట్ లో ఒక మాటన్నారే, దాని సంగతి ఇంకాస్త ఎక్కువ చెప్పుకోవాల్సిందేమో ! థ్యాంక్స్ ఫర్ ఎ వండ్రఫుల్ రైటప్. గుడ్ గోయింగ్.

  • థాంక్యూ సో మచ్‍ శ్రీరాం. మీర‍న్నది నిజం. మ‍గ‍ధీరుల‍ సెక్సు స్వేచ్ఛ గురించి, అది గొప్ప అయిన‍ట్లు మాట్లాఢే/చ‍రించే ప‍క్షీంద్రుల‍ గురించి మ‍రింత‍ ఎక్కువ‍గా మాట్లాడుకోవ‍ల‍సి వుంది. త్వర‍లో మాట్లాడుకుందాం. థాంక్స ఫర ది స‍జెషన్‍.

  • ఉమా నూతక్కి గారూ, థాంక్యూ సో మ‍చ్‍. సెక్సు లొ గ్లాస్‍ వాటర్‍ థీరీ స్త్రీల‍కు చాల‍ హానిక‍ర‍ం. దాన్ని మ‍రింత‍ ఎక్కువ‍గా గుర్తింప‍ జేయాలి.

 • నిజంగా సెక్స్ సంబంధాలు ..తొంభై తొమ్మిదిశాతం జంతువులమైన మనం జంతువులలాగే ప్రవర్తిస్తాం.కాబట్టి జంతువులు ,పక్షులు ,పురుగులు ,చేపలు ,ఉభయచరాలు సెక్స్ సంబంధాలను ,ప్రవర్తనలను అధ్యయనంచేస్తే మనప్రవర్తతో పోలిక ,కుటుంబ సంబంధాలలో పోలిక కొన్ని వ్యతిరేకం కొన్ని విలక్షణాలు కనిపిస్తాయి.
  మనం ఎందుకు కొన్ని సంబంధాలని రిస్ట్రక్ట్ చసుకొన్నాం. ప్రతీ ఆడ/మగ అందరూ అందరికీ సెక్స్ సంబంధం పెట్టుకోవడానికి అడిగే విధానం ,తిరస్కరించే విధానం ,సంబంధం కొనసాగించుకోనేందుకు వీలు లేకుండా ఎందుకయ్యిందో తెలిస్తే చాలాసమస్యలు తొలుగుతాయి.
  నమ్మకాలు ,మూఢనమ్మకా లు సైన్సు తెలియకపోవడం కొన్ని అపశృతులకు కారణాలు.
  ఇంకా చాలా విషయాలు తెలియాలి. మనిషిలక్షణాలలో ఉన్న అపశృతులు కూడా సెక్స్ విషయంలో కూడా జరుగుతాయి. చిన్నప్పటి నుంచి పెంచుకున్న భావాలు కూడా పెద్దపాత్రే పోషిస్తాయి.
  కాబట్టి డాక్టర్లు సైక్రియాటిస్టులు ,సామాజివేత్తలు కలసి తేల్చాల్స న క్లిష్టమైన సబ్జెక్టిది.
  సెక్స్ సంబంధాలలో ఉన్న అపశృతులను సరిదిద్దడానికే ,జరగ్గకుండా చూడడానికే మనకు వీలుంది తప్ప ఎలాఉండాల అన్నది మనం చెప్పలేం.

  • మీ విశ్లేషణ చాల బాగుంద‍ండీ. థాంక్యూ సో మ‍చ్‍. చెప్పలేం కాదు, చెప్పాలి. ప్ర‍తి ఒక్కరూ మాట్లాఢాలి. ఇది వైద్య విష‍య‍ం కాదు, సామాజిక విష‍య‍ం. వైద్యులు కూడా త‍ప్పుగా ఆలోచించ‍వచ్చు. తిర‍ప‍తి మొక్కు త‍రువాతే శ్రీహ‍రి కోటలో రాకెట్లెగిరే స‍మాజ‍ంలో వున్నాం మ‍న‍ం.

 • చాలా బాగుంది (ఇందులో ఉద్రేకపరిచే సెక్స్ ఏమీ లేదు😊).

 • మంచి చర్చ. అయితే ఈ స్వేచ్చా శృంగారాన్ని ప్రతిపాదించే జనాలు సదరు జీవన విధానాన్ని ప్రతిపాదించుకుని మరీ మొదలు పెట్టరు అనేది సత్యం. ఈ రకమైన జీవనంలో కొంతదూరం రహస్య ప్రయోగాలు చేస్తూ ప్రయాణించాక, దాన్ని చుట్టూ వున్నవాళ్లు గుర్తించడం, దానిమీద రహస్యంగానో, బాహాటంగానో చర్చ మొదలైన తరవాత కూడా కొంత కాలం దాన్ని అబద్దం అని చెప్పడానికే ప్రయత్నించి అదేమీ కుదరనప్పుడు ఇక చివరి ఆశ్రయంగానే స్వేచ్చా శృంగార జీవన సిద్దాంతాన్ని మాట్లాడతారు. వెరసి ఇది భారత సమాజంలో ఒక రెస్క్యూ సిద్దాంతంగానే మిగిలి పోతుంది కానీ దాని తాలూకు వెస్ట్ సమాజపు గౌరవాన్ని పొందలేకపోతుంది. వెస్ట్ లో వున్నా ఓపెన్ రిలేషన్షిప్ లో ఉండే గౌరవం ఇక్కడ ఉండదు. అక్రమసంబంధాల్లో (?) కూడా శీలవంతులం అని నిరూపించుకోడానికి తాపత్రయం, వివాహంలో దక్కని వ్యక్తిత్వ మర్యాదను పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాను అని ముసుగు వేసుకుంటూ మొదలుపెట్టే వివాహేతర లైయింగిక సంబంధాలు, లయింగిక సంతృప్తి కోసమే అని మొదలు పెట్టి వస్తు ప్రతిఫల సూత్రంలో కూరుకుపోయే సంబంధాలు, పీడించే పురుషుడి పీడన నుండి విముక్తికోసం అని చెబుతూ ఆర్ధిక స్వేచ్ఛను సాధించడం మానేసి శారీరక సంబంధాలతోనే స్వేచ్ఛను ప్రకటించే సిద్దాంతాలు, ఆర్ధిక, సామాజిక బలాన్ని ప్రదర్శించడానికి అలంకారంగా మొదలుపెట్టే సంబంధాలు, ఆధునికతా ప్రపంచంలో ఇమడాలంటే ఇవన్నీ తప్పనిసరి హంగులు అని నమ్మే ఫాల్స్ సోఫిస్టికేషన్ ఆలోచనలు.. అన్నీ కలగాపులగమై ఇక్కడ పెద్ద గందరగోళాన్నే సృష్టించాయి.

  ఇక మీరు చెప్పినట్టు ‘అది దొరకకపోతే బ్రతకలేము అనే పనికిమాలిన రొమాంటిక్ భావన తొలగితే మంచిది ‘ అనే స్టేటుమెంట్ చర్చానీయాంశం. బహుశా ఈ స్టేటుమెంట్ మీరు మరొక వయసులో, మరొక పరిస్థితుల్లో ఇలానే ఇస్తారని అనుకోను. సెక్స్ ఒక సంతృప్తి. ఆ సంతృప్తికి చుట్టూ అల్లుకున్న భావనలు అనేకం. ప్రేమా , పెళ్లి , కుటుంభం లాంటి వ్యవస్తీకృత భావనలు కొన్నైతే , తీరిన కోరిక చివర మిగిలే ఫ్రీ మైండ్, ఆరోగ్యకరమైన శరీరం , మంచి నిద్ర , విస్రాంతి నుండి పొందే బలం, ప్రేరణా లాంటి వ్యక్తిగతమైన భావనలు మరికొన్ని. ఎవరి జీవన మార్గాన్నిబట్టి వాళ్ళు ఇది అత్యవసరమా కాదా అనే నిర్ణయానికి వస్తారు. అలానే వయసు, సామాజిక భూమికలనుండి కూడా ఈ నిర్ణయం జరుగుతుంది. నిర్ణయం మారుతూ కూడా ఉంటుంది.

  చర్చ లేవనెత్తినందుకు దండాలు

  • థాంక్యూ మార్ఠిన్‍, మీరన్నది నిజ‍మే. ఎవ‍రూ దేన్నీ ఎంచుకుని మొద‍లెట్ట‍రు. మొదలెట్టాక‍ ‘ఎంచుకుని’ స‍మ‍ర్థన‍ల‍లో భాగ‍ంగా థీరీలు త‍యారు చేస్తారు. (All theories are retrospective) నేనా స్టేట్‍ మెంటును అన్ని వ‍య‍సుల‍లో ఇచ్చాను, అలాగే జీవించాను. అయినా సెక్సు స్వేచ్చ గురించి మాట్లాడే వాళ్ల‍ంతా బాలా కుమారులేం కాదు. ఎడిట్‍ లో నేనుదాహ‍రించిన‍ ప్రొఫెస‍ర్‍ ఒక‍ వుదాహ‍ర‍ణ మాత్రమే. ఆయ‍న‍ది సెక్సు స్వేచ్ఛా వాద‍మే.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.