డాక్టర్ జివాగో పద్యాలు

బోరిష్ ప్యాస్టర్నాక్ ప్రపంచ ప్రసిద్ధ నవల ‘డాక్టర్ జివాగో’. డాక్టర్ జివాగో రాసినట్టుగా బోరిష్ ప్యాస్టర్నాక్ రాసిన పద్యాల పుస్తకం ‘డాక్టర్ జివాగో కవితలు’. నవలలో సజీవ రీతిలో కలిసిపోయే ఈ కవితలు డాక్టర్ జివాగో ప్రాపంచిక దృక్పధాన్ని ప్రతిబింబిస్తాయి. జీవితాన్ని అమితంగా ప్రేమించే ఒక మానవుని అంతరంగంలోని, కదిలించే ఆలోచనలు ఈ కవితల్లో కనిపిస్తాయి.

(రష్యన్ నుంచి ఇంగ్లీషు: ఎం. కేడెన్. పుస్తకంలోని బొమ్మలు (ఇక్కడి ఎత్తుపోతలు కూడా) బిల్ గ్రీన్)… ఎడిటర్, రస్తా.  

హామ్లెట్

హర్ష ధ్వానాలు క్రమంగా ఆగిపోతాయి.
మరోసారి నేను వేదిక మీదికి వొచ్చాను,
మన ఈ యుగానికి ఏం జరగాల్సి వున్నదో
చప్పట్ల చివరి ప్రతిధ్వనుల్లో వింటానికి.

వేలాది బైనాక్యులర్ల లో నుంచి
చీకటి రాత్రి నా వైపు సూటిగా చూస్తుంది
వీలయితే, ఓ అబ్బా, తండ్రీ
ఇక, ఈ పానపాత్రను నా నుంచి తీసేసుకో

నీ ఖచ్చితమైన రూపకల్పనను నేను ప్రేమిస్తాను
ఈ దుఃఖ పాత్ర నాకిక చాలు అనుకుంటాను
కాని, వేదిక మీద మరో నాటకం వుంటుంది
కనుక నన్ను వొదిలెయ్, మరి వెళ్లిపోనీ నన్ను

జాగర్తగా ప్లాన్ చేసి, ఏర్పరచిన నాటకాంకాలు,
ముగింపు పూర్వ నిర్ణీతం, నేను ఒంటరిని.
ఛాందసులు గర్వోన్నతితో పొంగిపోతారు.
ఓహ్ మన దారి కఠినం- మనవి రాతి దారులు

మార్చి

నేల వుడుకెత్తింది, చెమటలో తడిసిపోయింది
గద్దల కళ్ళు బైర్లుకమ్మి, అశాంతిగా వూరుకుతున్నై
ఒక్క క్షణం తీరిక లేని పనిమనిషి మాదిరిగా
వసంతం పని చేస్తూనే వుంది, చాల చాల తృప్తిగా

స్వల్పమైన మంచు, ఇప్పుడు, జబ్బుపడి, నిస్సహాయంగా
అలా పడుకుని వుంది, అటిటు నీలి సిరల చారలు చాస్తూ
పీకాసుల మొనలు చలికాలపు తుప్పునూ,
గరుకు గీతలను వొదిలించుకుని ఆరోగ్యంగా మెరుస్తున్నై

ఓహ్ రాత్రులు, గడిచిపోతున్న పగళ్లూ రాత్రులు
దంతెల నుంచి, కిటికీ అంచుల్నించి జారే జల బిందువులు
చూరు అంచుల్లో కరిగి రాలుతున్న మంచు సోనలు
నిద్ర పట్టని చిన్ని చిన్ని పిచికల కలకల కబుర్లు

బార్లా తెరిచిన కొట్టాలూ, గుర్రపు శాలల చుట్టూ
జారి పడిన ఓట్ గింజలు ఏరుకు తింటున్న పిట్టలు
వసంత వాయువుల కన్న విశాలంగా విస్తారంగా
పరుచుకున్న, ప్రాణోత్పన్న చేసే పేడకుప్పలు

శ్వేత రాత్రి

చాల కాలం కిందటి ఒక రాత్రిని కలగంటాను
పీటర్స్బర్గ్ రేవులో ఒక ఇంటిని కలగంటాను
పేద భూస్వామి కూతురివి, నువ్వు వొచ్చావు
నగరంలో చదువుకోడానికి ఒంటరిగా.

చక్కని దానివని చాల మంది మెచ్చుకునేవారు
చాల చాల మంది. నువ్వూ నేనూ, ఆ సాయంత్రం
మీ కిటికీ దగ్గర కూర్చున్నాం చేరువగా ఒదిగి,
మీ ఆటక గది నుంచి దిగువన వీధిలోనికి చూస్తూ.

అక్కడ వీధి దీపాలు సీతాకోకచిలుకల్లా వెలిగేవి
ఉదయ కిరణాల చలిలో కొంచెం వొణుకుతూ.
నీతో నేను మెత్తగా మాట్లాడే వాడిని- అప్పటికి
సుదూర భవిష్యత్త్యు లోని సంగతుల గురించి.

అవధుల్లేని నేవా నదీ తీరానికి మన నగరాన్ని
ఏది కట్టిపడేసిందో ఆ రహస్యమే
పరస్పర అంకిత భావనలతో మనల్ని
కలిపి కట్టిపడేసిందని మనం కలగనే వాళ్ళం.

దూరంగా చిరు చీకటి చిట్టడవుల లోంచి
వసంత కాలపు వెండి సాయంకాలాలలో
వింటాం మనం కోయిల పాటలూ, ఈలలూ
మత్తుమత్తుగా, ఏదో సాధించినట్లు జయ గీతాలు.

ఒక్కో గాయకురాలి పాట, వొణుకుతున్న
కిచకిచలు, చుక్ చుక్ అరుపులు
కలకలాన్ని, ఆనందాన్ని నిద్ర లేపేస్తాయి
నిశ్శబ్దంగా స్తబ్దుగా వుండిన చెట్ల గుబుర్లలో.

ఇక రాత్రి, ఒక వొట్టిపాదాల యాత్రికునిలా
కంచెల గుండా రహస్యంగా పాకుతుంది
తన వెనుక కిటికీ అంచు మీది మన మాటల
మృత్యనంతర ఛాయలను వొదిలేస్తూ.

ప్రతిధ్వనించే మన పదాల రాగాలను
చాటుగా విని, చుట్టూరా వున్న తోటలలో
ఆపిల్ చెట్లూ, చెర్రీ చెట్ల కొమ్మలల్లోంచి
తెల్లని పూలు పుట్టుకొచ్చి మెరుస్తాయి.

కాంతిల్లే భూతాల మాదిరిగా చెట్లు
గుంపులుగా వొస్తాయి రహదారి మీదికి
రాత్రికి వీడ్కోలు చెప్పడానికి, ఇక
ముందేం జరగనుందో తెలిసిన రాత్రికి…

బోరిస్ ప్యాస్టర్నాక్

బోరిస్ ప్యాస్టర్నాక్:
https://en.wikipedia.org/wiki/Boris_Pasternak

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.