సముద్ర నాచు తొడుక్కున్న మనిషి

రాజు గారు నగరంలో చాటింపు వేయించారు. తన కుమార్తెను వెతికి తెచ్చిన వారెవరికైనా నిలువెత్తు ధనమిస్తాడట. చాటింపు వల్ల ఏ ఫలితం రాలేదు. రాకుమారి ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఆమెను ఎవరో రాత్రికి రాత్రి ఎత్తుకు పోయారు. ఆమె కోసం జగమంతా ఘాలించడం అప్పటికే అయిపోయింది.

ఒక ఓడ క్యాప్టెన్ కు ఆలోచన వొచ్చింది. ఆమె భూమ్మీద లేకపోతే, ఇక, సముద్రం మీదే వుండాలి. ఇంకేం. రాకుమార్తెను వెదికి తీసుకు రావడానికి అతడొక ఓడను సిద్ధంచేశాడు. ఓడ బయల్దేరే సమయం వొచ్చింది. ఓడలో సహాయకులుగా పని చేయడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. ఏమో, ఈ సముద్ర యాత్ర ఎన్నాళ్ళు పడుతుందో ఏమో. ప్రమాదకరమైన యాత్ర, తిరిగొస్తామో రామో అని వాళ్ల భయం. క్యాప్టెన్ రేవులో ఓడ వద్ద చాల సేపు ఎదురు చూశాడు. మొదట ముందుకొచ్చే సాహసం ఎవరూ లేదు. రేవులో శఫైర్ స్టార్బోర్డ్ అనే రికామీ తాగుబోతు యువకుడు వున్నాడు. అతన్ని పనివాడుగా తీసుకోడానికి ఏ క్యాప్టెనూ ఇష్టపడడు. అతడిని మన క్యాప్టెన్ చూశాడు.

“ఓయ్, నాతో పాటు సముద్ర యానానికి వొస్తావా” అని అడిగాడు.

“ఎందుకు రానూ, మహ బాగా వొస్తాను” అన్నాడు స్టార్ బోర్డ్.

“అయితే, ఇంకేం, వొచ్చేయ్”

శఫైర్ స్టార్ బోర్డ్ మొదటి పని వాడిగా ఓడ ఎక్కేశాడు. అది చూసి మిగులిన నావికులకూ ధైర్యం వొచ్చింది. వాళ్లు కూడా ఓడ ఎక్కేశారు. ఒకసారి ఓడ ఎక్కాక, ఇక స్టార్ బోర్డ్ ఏ పనీ ముట్టుకునే వాడు కాదు. రెండు చేతులూ జేబుల్లో పెట్టుకుని తాను వొదిలి వొచ్చిన కల్లు కొట్టాల గురించి పగటి కలలు కంటూ ఓడలో అటూ ఇటూ తిరిగే వాడు. ఇతర నావికులు అతడిని తిట్టుకునే వాళ్ళు. ఈ యాత్ర ఎప్పటికి అవుతుందో తెలీదు. ఓడలో తిండి సామగ్రి కొంచెం కొంచెం తరిగిపోతోంది. ఇతగాడు తినడం, తిరగడం తప్ప ఏమీ చేయడు. ఇతడిని ఎలాగైనా వొదిలించుకోవాలని అనుకున్నాడు ఓడ క్యాప్టెన్. ఇంతలో సముద్రం మధ్యలో చిన్న దీవి ఒకటి కనిపించింది. క్యాప్టెన్ స్టార్ బోర్డ్ కు దాన్ని చూపించి, “ ఆ చిన్న దీవిని చూశావా?” అని అడిగాడు. “నువ్వొక తెడ్ల పడవేసుకుని ఆ దీవిని గాలించు. మేము ఇక్కడే దీవి చుట్టూ తిరుగుతుంటాం” అని చెప్పాడు.

శఫైర్ స్టార్ బోర్డ్ తెడ్ల పడవలో కాల్మోపగానే, పెద్ద ఓడ.. స్టార్ బోర్డ్ ను నడి సముద్రంలో వొదిలేసి, రయ్ న వెళ్లిపోయింది. మన వాడు దీవికి చేరాడు. అక్కడ అతడికొక గుహ కనిపించింది. లోపలికి వెళ్ళాడు. లోపల ఒక అందమైన అమ్మాయిని ఎవరో కట్టేసి వుంచారు. ఆమె ఎవరో కాదు, రాజు గారి ముద్దుల కూతురే.

“నన్నెలా కనుక్కున్నావు?” ఆడిగిందామె.

“నేను ఆక్టోపస్ ల కోసం వల వేస్తూ ఇలా వొచ్చాను” అన్నాడు స్టార్ బోర్డ్.

“నన్నొక పేద్ద ఆక్టోపస్ అపహరించింది. నేనిప్పుడు దాని ఖైదీని” రాజకుమార్తె చెప్పింది. “అది వొచ్చే లోగా పారిపో. కాకపోతే, గుర్తు పెట్టుకో. రోజుకు మూడు గంటలు అది ఎర్ర ముల్లెట్ చేపగా మారిపోతుంది. అప్పుడు దాన్ని పట్టుకోవచ్చు. అయితే నువ్వు ముల్లెట్ చేప ని వెంటనే చంపేయాలి. లేకుంటే అది సముద్ర కాకిగా  మారిపోయి, ఎగిరిపోతుంది”

శఫైర్ స్టార్ బోర్డ్ తెడ్ల పడవను దాచేసి, తను కూడా ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు. అప్పుడొచ్చింది ఒక పేద్ద ఆక్టోపస్. అదెంత పెద్దగా వుందంటే, అది దాని చేతులతో మొత్తం దీవిని చుట్టేయగలదు. దీవిలో మనిషి వున్న వాసన తగిలి దాని సక్కర్స్ అన్నీ ప్రకంపించాయి. ఇంతలోనే అది ఎర్ర ముల్లెట్ చేపగా మారే సమయం వొచ్చింది. అది ముల్లెట్ చేపగా మారి, సముద్రం లోనికి మాయమైపోయింది. స్టార్ బోర్డ్ వలలు విసిరాడు. మొదటి సారి ఇంకేవేవో చేపలు పడ్డాయి. స్టార్ బోర్డ్ పట్టు వొదలకుండా మరి మరి వలలు విసిరాడు. ప్రతి సారీ రక రకాల చేపలు పడ్డాయి. చివరి సారి వలలో ఎర్ర ముల్లెట్ చేప. అది వలలో ఎండుటాకులా వొణుకుతోంది. స్టార్ బోర్డ్ పడవ తెడ్డు ఎత్తి దాన్ని చంపబోతుండగా అది సముద్ర కాకిగా మారబోయింది. సముద్ర కాకి వల లోంచి ఎగిరి పోబోతుండగా దానికి తెడ్డు తగిలి, ఒక రెక్క విరిగిపోయింది. అందువల్ల సముద్ర కాకి తిరిగి ఆక్టోపస్ గా మారిపోయింది. ఆక్టోపస్ చేతుల మీద గాయాల నుండి చిక్కని రక్తం ఎర్రగా స్రవిస్తోంది. స్టార్ బోర్డ్ ఏమాత్రం దయ తల్చకుండా దెబ్బ మీద దెబ్బవేసి దాన్ని చంపేశాడు. అప్పుడు రాకుమార్తె చాల సంతోషపడిపోయింది. జీవితాంతం కృతజ్ఞురాలను అంటో, అందుకు గుర్తుగా స్టార్ బోర్డ్ కు తన వజ్రపు వుంగరం ఇచ్చింది.

‘రా, నిన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తా’ అన్నాడు స్టార్ బోర్డ్ ఆమెకు తన పడవను చూపిస్తూ. ఇంతా చేసి, ఆ చిన్న పడవ వాళ్లిద్దరికి సరిపోయేలా లేదు. అయినా దానిలో ఎక్కి కూర్చున్నారు. స్టార్ బోర్డ్ పడవకు తెడ్లు వేస్తూ సముద్రంలో కాసేపు తిరిగాడు. ఇంతలో స్టార్ బోర్డ్ కు ఒక ఓడ కనిపించింది. స్టార్ బోర్డ్ తెడ్డు కర్రకు రాకుమారి గౌను కట్టి ఎగరేస్తూ, ఓడకు సంజ్ఞలు పంపాడు. ఓడ వీళ్లను చూసి, పైకి తీసుకుంది. ఇంతకూ అది స్టార్ బోర్డ్ మునుపు ప్రయాణం చేసిన ఓడ నే. స్టార్ బోర్డ్ ను అక్కడ వొదిలేసి వుడాయించిన ఓడ నే. తను రాకుమార్తెతో పాటు తిరిగి కనిపించే సరికి క్యాప్టెన్ అన్నాడు, “అయ్యో, పాపం, శఫైర్ స్టార్ బోర్డ్! నువ్వు తప్పి పోయావనుకున్నాం. నీ కోసం అంతటా వెదికాం. భలే, నువ్వు రాకుమార్తెతో తిరిగి కన్పించడం చాల బాగుంది. రా, ఇది మనం పండగ చేసుకోవాల్సిన సమయం”. కొన్ని నెలలుగా చుక్క గొంతులో పడని శఫైర్ స్టార్ బోర్డ్ కు పండగ చేసుకోడం అనగానే చెప్పలేనంత ఆనందం వేసింది.

ఓడ ముందుకు సాగింది. వాళ్లూరి రేవు కను చూపు దూరంలోకి వొచ్చింది. క్యాప్టెన్ స్టార్ బోర్డ్ ని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి రకరకాల మద్యం సీసాలను అతని ముందుంచాడు. స్టార్ బోర్డ్ తాగాడు, తాగాడు, పూర్తిగా మత్తెక్కి నేల మీద పడిపోయే వరకు తాగాడు. క్యాప్టెన్ రాకుమార్తెను చూస్తూ అన్నాడు, “ఈ తాగుబోతు నిన్ను చెర విడిపించాడని రాజుతో చెప్పేవు, జాగర్త. నేను ఈ ఓడ క్యాప్టెన్ ని, నా ఆజ్ఞ మీదనే వాడు నిన్ను కాపాడాడు. కనుక నేనే నిన్ను చెర విడిపించానని చెప్పు”.

రాజకుమార్తె ఔనని గాని కాదని గాని అనలేదు. “రాజుకు ఏం చెప్పాలో నాకు తెలీదా?” అని వూరుకుంది.

ఎందుకేనా మంచిది, శఫైర్ స్టార్ బోర్డ్ ను శాశ్వతంగా వొదిలించుకుంటేనే మంచిదన్ క్యాప్టెన్ అనుకున్నాడు. ఆ రాత్రి, ఇంకా తప్ప తాగి స్పృహలో లేని స్టార్ బోర్డ్ ను ఎత్తుకెళ్లి, సముద్రంలోకి విసిరేశారు. తెల్లారే సరికి ఓడ రేవుకు చేరింది. రాకుమార్తెను సురక్షితంగా ఇంటికి తీసుకు వస్తున్నట్లు సంజ్ఞలు పంపారు. రేవులో బ్యాండు మేళం మోగింది. రాజు రాజోద్యోగు లందరితో ఎదురేగి వొచ్చాడు.

రాకుమార్తెను క్యాప్టెన్ ఇచ్చి పెళ్లి చేయడానికి తేదీ నిర్ణయించారు. సరిగ్గా పెళ్లి రోజు సముద్ర జలాల్లోంచి ఒక మనిషి బయటికి రావడం నావికులందరూ చూశారు. అతడి నిలువెల్లా సముద్ర నాచు. అతడి దుస్తుల జేబులు, యితర రంధ్రాల నుంచి చేపలు, రొయ్యలు బయటికి వురుకుతున్నాయి. అది ఎవరో కాదు. మన శఫైర్ స్టార్ బోర్డ్. స్టార్ బోర్డ్ నీళ్ళలోంచి బయటికి వొచ్చి నగర వీధుల్లో సొరుగుతూ, తూలుతూ నడవసాగాడు. సముద్ర నాచు అతడి తల మీద, వొళ్ళంతా పరుచుకుని, వెనకాల కూడా, అతని వెంటపడినట్టుగా వొస్తోంది. అప్పుడే పెళ్లి వూరేగింపు వీధుల్లోకి వొచ్చింది. మన సముద్ర నాచు తొడుక్కున్న మనిషికి ఎదురొచ్చింది. అందరూ ఆగిపోయారు. ‘ఎవడు వాడు’ రాజు అరిచాడు. ‘పట్టుకోండి వాన్ని’ అన్నాడు. భటులు ముందుకు వొచ్చారు. స్టార్ బోర్డ్ ఒక చేయి పైకెత్తాడు. అతడి చేతి వ్రేలికి వజ్రపుటుంగరం ఎండకు ధగ ధగ మెరిసింది.   

“అది నా కూతురు వుంగరం’ రాజు ఆశ్చర్యపోయాడు.

“ఔన్నిజమే. నన్ను రక్షించింది ఇతడే. ఇతదే నాకు పెళ్లికొడుకు’ అంది రాకుమార్తె.

స్టార్ బోర్డ్ తన కథ చెప్పాడు. క్యాప్టెన్ ను చెరలో పెట్టారు. స్టార్ బోర్డ్ సముద్ర నాచుతో ఆకుపచ్చగా కనిపిస్తున్నప్పట్టికీ, తెల్లని పెళ్లి బట్టలతో మెరిసిపోయే రాకుమార్తె పక్కన కూర్చుని, పెళ్లి వేడుకలలో పాల్గొన్నాడు.

*

ఇటాలో కాల్వినో/హెచ్చార్కె

ఇటాలో కాల్వినో (1923 అక్టోబర్ 15- 1985 సెప్టెంబర్ 19): జగత్ ప్రసిద్ధ కథా, నవలా రచయిత. తన పేరూ, ఈ పుస్తకం పేరూ సూచిస్తున్నట్లే ఆయన స్వదేశం ఇటలీ. ఆయన స్వయంగా సేకరించి, తన మాటల్లో తిరిగి చెప్పిన కథల పుస్తకం “ఇటాలియన్ ఫోక్ టేల్స్'.

మాకు తెలిసి, ఆయన సొంత కథలు కొన్ని ‘ఈ మాట' వెబ్ పత్రికలో వెలువడ్డాయి.. ఇవి ఆయన సేకరించి తన చక్కని శైలిలో తిరిగి చెప్పిన ఇటాలియన్ జానపద కథలు. వీటిలోని చదివించే శైలి, ప్రగతి శీలం అబ్బురపరుస్తాయి. ఇక ముందు రస్తా సంచికల్లో ఈ కథలు ఇలాగే వరుసగా...

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.