వెండి తెర మీద “స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అండ్ స్ప్రింగ్”

దేళ్ళ క్రితం 14 వ కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్ కిమ్ కి దుక్ అనే అసామాన్య దక్షిణ కొరియా దర్శకుడిని పరిచయం చేసింది. ‘ఆవిష్కరణ’ విభాగంలో చూపిన ఆయన తాజా సినిమాలను సినీ వీక్షకులు పసందైన విందులా ఆస్వాదించారు. స్లోగా సాగుతూనే మనసులో నిలిచేలా, సైలెంటుగా వుంటూనే చెవిలో రొద పెట్టేలా, కథాకథనాలతో అబ్బురపరిచేలా వుండే అతడి కొత్తరకం ఆర్ట్ హౌస్ సినిమాలు నిజంగానే అప్పట్లో ‘తాజా ఆవిష్కరణే’. ఆనాటి నుండి నేటి 24వ కోల్ కతా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో చూసిన ‘హ్యూమన్, స్పేస్, టైం అండ్ హ్యూమన్’ వరకు ఈ దర్శకుడి ఏ ఒక్క సినిమా మిస్ కాకుండా చూడడం అలవాటుగా మారింది. 1990 లలో, గత దశాబ్దిలో ఈయన సినిమాలు కొరియన్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతినార్జిస్తే, ఆ దేశంలో ప్రజలు మాత్రం మనవాళ్ళ లానే ఫక్తు కమర్షియల్ చిత్రాలకు బ్రహ్మరథం పడుతూ వచ్చారు. తొలినాళ్ళలో అతను నిర్మించిన, సినీ ప్రేమికుల మదిలో పదిలంగా దాగిపోయిన సినిమా ‘స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అండ్ స్ప్రింగ్’.

కిమ్ కి దుక్

  జీవితంలోని వివిధ దశలకూ, మనిషిలోని భావోద్రేకాలకూ ఋతువులతో ముడిపెట్టి చూపడం కవిత్వంలో గానీ, కథల్లో గానీ ప్రబంధయుగాలనుంచీ మనం చూస్తున్నదే. ఇలాంటి పోలికలతో గతంలో సినిమాలూ రాకపోలేదు. కానీ, సినిమా వైవిధ్యమంతా దాని ట్రీట్మెంట్ లోనే వుంది. షూటింగు లొకేషన్ సినిమాలో పాత్రధారిగా మారడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కథను దాని ప్రాకృతిక నేపథ్యాన్నుంచి తొలగించేస్తే అర్థమే లేకుండా పోతుంది. అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రకృతి సినిమాలో. వివిధ ఋతువులు సినిమాలో ప్రధాన పాత్రదారులు. బౌద్ధమతంలో “నాలుగు పరమసత్యాలు” ప్రవచింపబడ్డాయి. అవి – దుఃఖము, దుఃఖానికి కారణము, దుఃఖం నుండి విముక్తి, దుఃఖాన్నిండి ముక్తిని పొందే మార్గం. వీటిని చతురార్య సత్యాలంటారు. ఇవికాక ‘సంసార’ అంటే ‘పుట్టుక, సాంసారిక జీవనం, చావు’ అనే చట్రంలో జీవి తిరుగుతూ ఉంటుందనీ, ‘బంధనం’ అంటే ‘ప్రాపంచికమైన దానికి అట్టిపెట్టుకుని ఉండడం దు:ఖానికి కారణమ’నీ, ‘అనిత్యము’ అనగా ‘సమస్తమూ మార్పుకు లోనవుతుంద’ని  బుద్ధుని ప్రవచనాలలో మూడు ముఖ్య సూత్రాలు వున్నాయి. భౌద్ధం మీద ఎంతో గౌరవం వున్న దర్శకుడు ఈ సూత్రాలను తన కథకు చోదక శక్తిగా  వినియోగించుకుంటాడు. సినిమా ఐదు అధ్యాయాలుగా నడుస్తుంది

స్ప్రింగ్ (వసంతం లేక ఆరంభం)/ (సంసార లేదా దు:ఖం):

నిర్మలమైన అడవిలోని సరస్సు మధ్యలో చెక్కతిన్నెపై తేలియాడే భౌద్దారామం. అక్కడ ఒక బౌద్ధ సన్యాసి (ఓ యాంగ్ సూ) దగ్గర శిష్యరికం చేస్తున్నాడు ఒక చిన్న బాలుడు (సియో జీ క్యుంగ్). చిన్న పడవపై తెడ్డు వేసి ఒడ్డుకు చేరి ఆహారం సేకరించడం, మందుల తయారీ కోసం వనమూలికలు సేకరించడం వారి దినచర్య. అక్కడ వొడ్డున నీళ్ళలో ఒక చేప పిల్లకు చిన్న రాయిని కట్టి అది ఈదడానికి ఇబ్బంది పడుతుంటే చూసి ఆనందపడతాడు ఆ పిల్లాడు. అంతటితో ఆగకుండా మరో కప్పకు, పాముకు రాళ్ళు కడతాడు. గురువు ఇవన్నీ గమనిస్తాడు. ఆ పిల్లాడికి గుణపాఠం నేర్పాలనుకుంటాడు. నిద్రిస్తున్న అతడి వీపుకి ఒక పెద్ద బండను కడతాడు. ‘నీవు రాళ్ళు కట్టిన ఆ ప్రాణుల్ని వెతికి, వాటిని ఆ రాళ్ళ నుండి విముక్తుల్ని చేస్తేనే నీకు ఈ బండ నుండి విముక్తుడిని చేస్తాను. ఒకవేళ ఏదైనా జీవి ఆ రాయి కారణంగా మరణిస్తే ఆ రాయి జీవితాంతం నీ గుండెల్లో వుండి నిన్ను బాధిస్తుందని తెలుసుకో’ అని చెబుతాడు. ఆ బాలుడు ఆ బండను మోస్తూ అతి కష్టంతో  కప్పను రాయి నుండి రక్షిస్తాడు. చేపను మట్టిలో పాతుతాడు. పాము రక్తపు మడుగులో చచ్చిపడివుంటుంది. బహుశా దాన్ని చంపడానికి వచ్చిన ప్రాణి నుండి తప్పించుకోలేక చనిపోయిందని గ్రహిస్తాడు. గురువు చెప్పిన మాట గుర్తు చేసుకుని భోరున విలపిస్తాడు. ఒకటో అధ్యాయం ముగుస్తుంది. ‘కారణం తెలీని ఆనందం’ లేదా ‘బాల్యదశ’ను వసంతానికి ప్రతీకగా వాడుకున్నాడు దర్శకుడు. సృష్టిలోని ప్రతి జీవరాశిని గౌరవించాలని బోధించాడు. ‘ఆ రాయి జీవితాంతం నీ గుండెల్లో వుండి నిన్ను బాధిస్తుందని తెలుసుకో’  అన్నది ఈ అధ్యాయంలో అతి ముఖ్యమైన వాక్యం. నీ కర్మను (పనిని) బట్టే పర్యవసానం లేదా ఫలితం ఉంటుందని బౌద్ధం చెబుతోంది. ఈ అధ్యాయంలో ప్రతీకగా ఉపయోగించిన కుక్క పిల్లను గురుశిష్యుల పరస్పర ‘విశ్వాసానికి’ ప్రతీకగా చెప్పొచ్చు.  

సమ్మర్ (వేసవి లేక వాంఛ)/ (బంధనం లేదా దు:ఖ కారణం):     

శిష్యుడు వెచ్చని వేసవి లాంటి టీనేజి దశకి చేరుతాడు. పాముల సంగమ దృశ్యం చూస్తాడు. ఓ రోజు అతడికి ఒక స్త్రీ, ఆమె కుమార్తె తారసపడతారు. వారి దుస్తుల్ని బట్టి ఇది ఆధునిక కాలానికి చెందిన కథ అని మనకు అర్థమవుతుంది.  అన్యథా అడవిలోని బౌద్ధమఠాన్ని చూసినా, గురుశిష్యుల వేషధారణ చూసినా మనకు కథాకాలం అర్థం కాదు. బయటి ప్రపంచం నుండి అక్కడికి వచ్చే వ్యక్తుల వల్లనే కథాకాలం అర్థమవుతూ వుంటుంది. స్థలకాలాలకతీతంగా మానవజాతి పాటించాల్సిన నీతినియమాల్ని గుర్తుచేసే పవిత్రస్థలంలా కన్పిస్తుంది ఆ బౌద్దారామం. శిష్యుడు ఆ వచ్చిన వారిని తన గురువు గారి దగ్గరికి తీసుకుపోతాడు. యుక్త వయసులో వున్న తన కుమార్తె కారణం తెలీని, ఎంతకీ తగ్గని జ్వరంతో బాధపడుతోంది. ఉపశమనం కోసం ఆమెను ఇక్కడికి తీసుకోచ్చానంటుంది ఆ స్త్రీ. ‘ఆమె ఆత్మకు ప్రశాంతత చేకూరితే, ఆరోగ్యం కుదుట పడుతుంది’ అని చెబుతాడు ఆ బౌద్ధ గురువు. కుమార్తెను అక్కడ వదిలి ఆమె వెళిపోతుంది. ఏనాడూ ఆడదాన్ని చూసి వుండని శిష్యుడు ఆ అమ్మాయి ఆకర్షణకు లోనౌతాడు. కానీ మనసులోని సంగతి వ్యక్తం చేయలేక ఒక రోజు నిద్రిస్తున్న ఆమె గుండెపై చెయ్యివేసి చెంపదెబ్బ తింటాడు. అపరాధ భావనతో బుద్ధుని ప్రార్థనలో నిమగ్నమౌతాడు. గురువుకిది విడ్డూరంగా కన్పిస్తుంది. శిష్యుడిని ఆ అమ్మాయి క్షమిస్తుంది. ఇద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. ప్రతిరోజూ రహస్యంగా రతిలో పాల్గొంటారు. ఈ అధ్యాయంలో ఆ ఆరామంలో ఒక కోడిపుంజు తిరుగాడుతున్నట్టు చూపుతాడు దర్శకుడు. ఎర్రని కోడిపుంజు ‘వాంఛ’కు ప్రతీక.  సరస్సు వొడ్డున బోటులో నగ్నంగా వారిద్దరూ పడుకుని వుండగా గమనిస్తాడు గురువు. వారినేమీ అనకుండా, ‘మోహం కైవసం చేసుకోవాలన్న భావనకు దారితీస్తుంది. కైవశం చేసుకోవాలన్న బలమైన కోరిక చివరకు హత్యకు కూడా దారితీస్తుంది’ అని తన శిష్యుడికి హెచ్చరిస్తాడు. శిష్యుడు వారిస్తున్నా,  ఆ అమ్మాయిని ఇంటికి పంపించేస్తాడు. ఆ రాత్రి ఆ శిష్యుడు కోడిపుంజుతో పాటు అక్కడి బుద్ధ విగ్రహాన్ని దొంగిలించి (సింబాలిక్ గా తన గురువు బోధనల్ని మోస్తూ) ఆ అమ్మాయి ధ్యాసతో అక్కడినుండి పారిపోతాడు. బంధనం ఒదులుకోలేక తన దు:ఖ కారణాన్ని ఆ యువకుడు ఎంచుకున్నట్టు మనకు తదుపరి అధ్యాయంలో తెలుస్తుంది.

ఫాల్ (శరద్  రుతువు లేక ఆగ్రహం)/ (అనిత్యం లేదా దుఃఖ విముక్తి):

చాలా ఏళ్ళు గడుస్తాయి. గురువుకి వయసు మీద పడుతోంది. దగ్గరలోని ఒక గ్రామం నుండి  ఒక పిల్లిని, నిత్యావసరాలను తీసుకొస్తాడు. న్యూస్ పేపర్ పొట్లం ద్వారా తన భార్యను చంపి పారిపోయిన వ్యక్తి గురించిన ఒక వార్త కంట పడుతుంది. తన శిష్యుడే అని గ్రహిస్తాడు. తన చేతుల మీదుగా ఎదిగిన శిష్యుడి చిన్ననాటి దుస్తుల్ని ఆప్యాయంగా నిమురుతుంటే, సరస్సు ఒడ్డున ముఖ ద్వారం దగ్గర పలాయితుడిగా తిరుగుతున్న తన శిష్యుడు  ప్రత్యక్షమవుతాడు. ‘తనని నేనెంతో ప్రేమించాను. ఆ ప్రేమంతా నాకేననుకున్నాను. కానీ, నన్ను వదిలేసి వేరొకడితో లేచిపోయింది. అందుకే దాన్ని వెదికి పట్టుకుని చంపేశాను’ ఆగ్రహంతో చెబుతాడు శిష్యుడు. ‘నువ్వు ఇష్టపడేది వేరొకరికి ఇష్టమవ్వచ్చుగా, నిన్ను ఇష్టపడ్డట్టే వేరొకర్ని ఇష్టపడొచ్చుగా’ – ‘ఇష్టమైన దాన్ని వోదులుకునే ధైర్యం వుండాలి.’ సినిమాలో ప్రతిచోటా అవసరమైనంత సంభాషణే వుంటుంది. పొడుగాటి డైలాగులతో దృశ్యంలోని అందాన్ని చెదరగొట్టడం దర్శకుడికి ఇష్టం లేదు. శరదృతువును ఆగ్రహానికి ప్రతీకగా వినియోగించాడు. గుండె మంటను ఎంతకీ ఆర్పుకోలేక పోతున్న శిష్యుడు తన కళ్ళు, నోరు, చెవులు పేపరుతో మూసుకుని ఆత్మహత్య చేసుకునే క్రతువుకు వొడిగట్టబోతే అతడ్ని అడ్డుకుని కసిగా కర్రతో బాదుతాడు గురువు.  ‘నువ్వు చంపినంత సులువుగా నిన్ను చంపుకోలేవు.’ అతడిని దూలానికి వేలాడదీసి కొవ్వొత్తి మంటలో తాడు కొద్దికొద్దిగా కాలి దబ్బున కిందపడేలా శిక్ష విధిస్తాడు. పిల్లి తోకను కుంచెగా చేసుకుని ఆ కలప ప్లాట్ఫారంపై ‘ప్రజ్ఞాపరమిత సూత్రాలు’ రాస్తాడు. వాటిని కత్తితో చెక్కుతూ తన కోపాన్ని చల్లర్చుకోమంటాడు. పిల్లి లైంగిక వాంఛకు ప్రతీక. కొరియన్ జానపద సాహిత్యం పిల్లి దుష్టాత్మను వెళ్ళగొడుతుందని నమ్ముతుంది. పిల్లి తోకతో ‘ప్రజ్ఞాపరమిత సూత్రాలు’ రాయడమంటే దుష్టాత్మలను పారద్రోలడమే. హంతకుణ్ణి అరెస్టు చేయడానికి ఇద్దరు డిటెక్టివ్ లు అక్కడి కొస్తారు. తన పని పూర్తి అయ్యాకనే అతడిని తీసుకెళ్ళమని చెబుతాడు గురువు. అక్షరాలు చెక్కడంలో శిష్యుడికీ, చెక్కిన అక్షరాలపై రంగు నింపే పనిలో బౌద్ధ గురువుకు  సహకరిస్తారు ఆ డిటెక్టివ్ లు. శిష్యుడిని తీసుకుపోయిన తర్వాత, అతడిలో కనిపించిన మార్పుచూసి సంతృప్తుడై, బౌద్ధ గురువు ఇక తన నిర్వాణం కోసం పడవపై చితి ఏర్పాటు చేసుకుని తన చితికి తనే నిప్పంటించుకుని తనువు చాలిస్తాడు.    

వింటర్ (శీతాకాలం లేక జ్ఞానోదయం)/ (దుఃఖ ముక్తి పొందే మార్గం):

జైలు జీవితం ముగిసాక నడివయస్కుడైన శిష్యుడు (ఈ పాత్రను దర్శకుడు తనే పోషించాడు) చాలా కష్టతరమైన శీతాకాలంలో ఆరామానికి వస్తాడు. సరస్సంతా గట్టకట్టుకుపోయివుంది. తన గురువు దుస్తుల్ని వేసుకుంటాడు. పడవలో గడ్డకట్టిన మంచును తవ్వి,  తన గురువు దంతాలను వెలికి తీస్తాడు. జలపాతం దగ్గర ఒక మంచుతో బుద్ధుని విగ్రహాన్ని చెక్కి ఓ ఎర్రని గుడ్డలో గురువు దంతాలను వేసి, ఆ విగ్రహంలో పెడతాడు. అతడికి ధ్యాన ముద్రల బొమ్మలున్న పుస్తకం దొరుకుతుంది. ఆ మంచుపై ఆ ధ్యానముద్రలను, మార్షల్ ఆర్ట్స్ ను అభ్యసిస్తూ తన మనసునూ, శరీరాన్ని తన వశంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు. ముఖం కప్పి పెట్టికున్న ఒక స్త్రీ తన చంటిబాలుడితో అక్కడికి వస్తుంది. తన బిడ్డను మఠంలో వదిలేసి తిరిగివెళ్ళే క్రమంలో పడవలో త్రవ్విన గోతిలోని నీటిలో మునిగి చనిపోతుంది. ఆ బిడ్డను చేరదీస్తాడతడు. ఆఖరు ఘట్టంలో ఆ శిష్యుడు తన నడుముకి ఒక గుదిబండ కట్టుకుని ఆ భారాన్ని లాగుతూ, అతి కష్టం మీద ‘కరుణ’ దేవత క్వాన్ యిన్ విగ్రహాన్ని శిఖరాగ్రంపై  ప్రతిష్టిస్తాడు. దుఃఖాన్నిండి ముక్తిని పొందాలంటే అష్టవిధ మార్గాల ద్వారా ‘బంధనాల’ నుండి విముక్తులు కావాలని భౌద్ధం చెబుతోంది. గుదిబండ లాగాడమంటే పాళీ భాషలో చెప్పబడిన ‘సంసార’, ‘బంధన’ నుండి ‘నిబ్బన’ పొందే ప్రయత్నమన్నమాట. గత అధ్యాయం ఆఖర్లో, ఈ అధ్యాయంలో కనిపించే పామును ఆత్మ విముక్తికి ప్రతీకగా వినియోగించాడు దర్శకుడు. పాము తనలో తను చుట్టుకోవడం పునర్జననానికి ప్రతీక అనుకోవాలి.

స్ప్రింగ్ (పునర్జననం లేదా పునరారంభం )/ (బుద్ధుని బోధనలను కొనసాగించడం):

ఆనాటి శిష్యుడు నేడు గురువై తన కొత్త శిష్యుడికి శిక్షణ ఇవ్వడం ఆరంభిస్తాడు. అదే జీవిత చక్రం ఆరంభమైందని తిరిగొచ్చిన వసంత ఋతువు చెబుతుంది. మనిషి చేసే పొరపాట్లు షరా మాములుగా మళ్ళీ రిపీట్ అవుతాయి. ఆ చిన్నపిల్లాడు ఒక తాబేలును హింసిస్తూ కనిపిస్తాడు.

బౌద్ధం నుంచి ఎన్నెన్నో ప్రతీకలు:

సంభాషణల ద్వారా కాకుండా దృశ్యాలతో ప్రతీకలతో మాట్లాడడం కిమ్ కి అలవాటు. సరస్సు వొడ్డున వున్న గోడ లేని ముఖద్వారం తలుపుల బయటి వైపు ఇద్దరు రాక్షసుల బొమ్మలు వుంటాయి. దుష్టాత్మలను ఆ ద్వారం బయటే ఆపేస్తున్నట్టు  అర్థం. అవే తలుపుల లోపలివైపు దేవతల బొమ్మలు స్థిర చిత్తానికి ప్రతీకలు. పైకప్పుకి వేలాడే చేప బొమ్మ గాలి కారణంగా అటు ఇటు కదలబోయి, గంటకు కొట్టుకుంటూ ధ్వని చేస్తూ పాత్రధారి అస్థిరతకు అద్దం పడుతుంది – ముఖ్యంగా ‘ఫాల్’ అధ్యాయంలో. మఠం లోపలి తలుపులు లేని గదులు మెదడులోని చేతనాచేతన విభాగాలకు ప్రతీకలుగా వుంటాయి. గురువు పక్కలోని శిష్యుడు రాత్రిపూట తన ప్రేమికురాలి పక్కలోకి చేరడం రాత్రిపూట అచేతన ఇష్టారాజ్యాన్ని, ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని రుజువుచేస్తుంది. మఠంలో బుద్ధ విగ్రహం దిగువ గల నీటిలో ఒక గోల్డ్ ఫిష్ వుంటుంది. బౌద్ధంలో గోల్డ్ ఫిష్ స్వేచ్ఛకు, ఆనందానికి ప్రతీక. అధ్యాత్మికానందాన్ని చేరాలని చెప్పడానికే ఆ చేపను అలా విగ్రహం మాటున వుంచడం జరిగింది. బౌద్దారామం నీటిలో తేలుతూ సాగడం ‘అనిత్యానికి’, మార్పుకు సింబల్గా చూడవచ్చు. బౌద్ధంలో కమలం ధ్యానానికి, డ్రాగన్ సృష్టికి, నూతనోత్సాహానికి ప్రతీకలుగా వాడతారు. వాటిని గోడమీది బొమ్మలుగా చూడొచ్చు. ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పినట్టు కాగితం మీది స్క్రిప్టుతో కాకుండా మనసులో ముద్రించుకున్న స్క్రిప్టుతో ఈ సినిమా షూటింగు జరిగిందిట.

మనం ఈ సినిమా ఉద్ఘోషించే అన్ని ప్రవచనాలతో ఏకీభవించక పోయినా, ఇది సినిమా చరిత్రలో వచ్చిన గొప్ప సినిమా అని వొప్పుకోక తప్పదు. ఎన్నెన్నో ప్రతిష్టాత్మకమైన బహుమతులు అందుకుంది ఈ సినిమా. ఈ శతాబ్దంలో తయారైన గొప్ప సినిమాల జాబితాలోకి చేరిపోయింది

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.