అప్పుడూ ఇప్పుడూ పెద్ద తేడా లేదు!

ఎన్‌.సుభాష్‌, సికింద్రాబాద్‌

ప్రశ్న : ఇప్పటి జనంలో గట్టి వ్యక్తిత్వాలు లేవనీ, పూర్వం రోజుల్లో గట్టి ఆదర్శాలతో వుండేవారనీ, మా మేనమామ అంటాడు. ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది. అది నిజమే అంటారా?

జవాబు: గట్టి వ్యక్తిత్వాలు ఎప్పుడూ వుంటాయి. ఇప్పటి వ్యక్తిత్వాలు డబ్బు కోసం! డబ్బుని పెంచడం కోసం చాలా గట్టి ఆలోచనలు లేవా ఇప్పుడు? గత కాలంలో, సరుకు అమ్మకాలు అంతగా లేవు. అందుకే డబ్బు కూడా అంతగా లేదు. అప్పుడు కూడా స్వార్ధాలే గానీ, డబ్బు దృష్టి తక్కువగా వుండి, సంబంధాలు కాస్త దృఢంగా వుండేవి. వ్యక్తిత్వాల రకాల్లో తేడాలు, అంతే! ఎప్పుడూ తప్పులే!

హేమసుందర్‌, హైదరాబాద్‌

ప్రశ్న: ఇప్పుడు కుక్కల్ని ఇళ్ళల్లో పెంచుతూ, వాటిని ఒళ్ళో ఎక్కించుకోవడం గొప్ప ఫేషన్‌ అయిపోయింది. అదే కాదు; ఆడవాళ్ళు కొత్త ఫేషన్లతో మారుతున్నారు. జుట్టు, బట్టలు, మొహాల నిండా అనేక రంగులు! ఇవన్నీ వెనకటి కాలపు వంటి అంద చందాల ముస్తాబుల కిందకే వస్తాయి అంటారా?

జవాబు: పెట్టుబడిదారీ పరిశ్రమలు, కొత్త కొత్తగా పెరిగిపోతూ వుంటాయి. ఏటా లాభాలు వస్తూ వుంటే, వాటితో కొత్త పరిశ్రమలు పెట్టాలి కదా? వేరు వేరు జాతుల కుక్కల్ని పుట్టించి, అమ్మే పరిశ్రమలు పుట్టుకొచ్చేశాయి. అలాగే, ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ కూడా కొత్త ఫేషన్‌ బట్టలూ, జుట్టు రకాలూ! అన్ని పరిశ్రమలూ పుట్టుకొచ్చేశాయి. ఇవే ఆఖరు కాదు. ఇంకా ఎన్ని కొత్త రకాలు వస్తాయో, ఇంకా బ్రతికి వున్న వాళ్ళు చూస్తారు. మొన్న ఒక వీడియోలో, పూర్తిగా ‘నగ్నంగా వున్నట్టు’ ఒక అమ్మాయి కనపడింది. మొదటి చూపుకి అలాగే అనిపించింది. కానీ, బట్టల ఫేషన్‌ అది. అతి పల్చని తెలుపు డ్రెస్‌ అది! మొత్తం పై నించి కిందకి బిగించేసి వుంది. అది ప్రకటన కోసం. ఇక అవే కొంటారు. ఆ డ్రెస్‌తో, ‘నగ్నంగా’ ఉన్నట్టు వీధుల్లో తిరుగుతారు! ఇంకా తర్వాత రోజుల్లో అయితే, ఆ మాయ డ్రెస్‌ కూడా వుండదు. ‘మా శరీర సౌందర్యం, మా ఇష్టం’ అంటారు. అది వాళ్ళ తప్పే కాదు; చూసి ఆనందించేవాళ్ళ తప్పు కూడా కదా? ఫేషన్ల కోసం, అందాల చిట్కాల కోసం ఒక ప్రత్యేకమైన టీవీ చానల్‌ ఉందని విన్నాను.  

బి.సాంబశివరావు, విజయవాడ

ప్రశ్న: మొన్న ఒక డాక్టరు దగ్గిరికి వెళ్తే, ఆయన కాశీ దారాలు కట్టుకుని కనపడ్డాడండీ!

వైద్యం నేను చేస్తాను.

దైవం నయం చేస్తాడు (‘ఐ ట్రీట్‌, హి క్యూర్స్‌) అని ఒక బోర్డు కూడా పెట్టారు. ఈ డాక్టరు వైద్యం బాగుంటుందా అని భయం వేసింది. అయినా, ఆ వైద్యమే తప్పలేదు. మా ఇంటికి ఆయన దగ్గిర.

జవాబు: ఆయన, వైద్యం చేస్తానని రాసుకున్నాడు కదా? చేస్తాడు లెండి. ఆ వైద్యం పని చేసిందో లేదో చెప్పలేదు మీరు.

జి.లక్ష్మి, రాజమండ్రి

ప్రశ్న: మీకు స్నేహితులు ఉన్నారంటారా?

జవాబు: ఇదేం ప్రశ్న? స్నేహితులు లేని మనుషులెవరైనా వుంటారా? స్నేహం లేకుండా జీవితం గడపగలరా?

కె. వెంకట రమణ, ముంబయ్‌

ప్రశ్న: స్త్రీల వ్యభిచారాన్ని, ఒక వృత్తిగా భావించవచ్చునంటారా? అది, తప్పు విషయం అవదంటారు కొందరు?

జవాబు: ‘వ్యభిచారం’ అన్నప్పుడు స్త్రీలనే కాదు, పురుషులది కూడా కదా? దీని మీద చర్చ ఏముంటుంది? స్త్రీ పురుష సంబంధాలు, ప్రేమానురాగాలతో, బిడ్డలకు తల్లిదండ్రులుగా వుండే సంబంధాలకు, అది పూర్తిగా వ్యతిరేకమే. సందేహం ఎందుకు?

పరిమి రామనాధం, ఏలూరు

ప్రశ్న: ఒక యువతి పెళ్ళి కాక ముందు, భర్తే లేనప్పుడు, ఆమె ఒక పురుషుడితో శారీరక సంబంధంలో వుంటే మాత్రం, దాన్ని అక్రమ సంబంధం అంటారు. అది అటువంటి సంబంధం ఎలా అవుతుంది?

జవాబు: ఆ యువతి ఏ పురుషుడితో గడుపుతుందో, ఆ పురుషుడికి భార్య వుంటుందా? అతను, వివాహ సంబంధంలో వున్నట్టు, ఈ యువతికి తెలీదా? ఒక వేళ, ఈమెకి తెలియకపోతే, ఆ పురుషుడికీ, ఈమెకీ, వివాహం జరగబోతోందా? ఆ వివాహ నిర్ణయం లేకపోయినా, అది ‘అక్రమ సంబంధం’ ఎలా అవుతుంది – అంటారా? వాళ్ళిద్దరూ, ఈ మానవ సమాజంలో పుట్టి పెరుగుతూ ఈ సంస్కృతి తెలిసిన వాళ్ళే. వివాహ సంబంధానికి వున్న నియమాల సంస్కృతిని ఎరిగిన వాళ్ళే. ఈ వివాహ సంస్కృతి ప్రకారం, భార్యా భర్తల సంబంధం ‘క్రమ సంబంధం’ అయితే, అలా కాని పరాయి వ్యక్తులతో సంబంధాలు అక్రమ సంబంధాలే అవుతాయి కదా? ఈ సంస్కృతి తప్పుగా వుందని భావిస్తే, దాని కన్నా వైరుధ్యాలు లేని సంస్కృతిని ఊహించాలి. అసలు, స్త్రీ పురుష సంబంధాల్ని, బిడ్డలతో కలిసి వుండే సంబంధాలుగా చూడాలి. భార్యాభర్తలుగా భావించుకోకుండా కేవలం శారీరక సంబంధాలతో గడిపేవాళ్ళు, తాము బిడ్డలకు తల్లిదండ్రులం – అని కూడా భావిస్తారా? బిడ్డల పోషణా, పెంపకాలూ, ఆ ఇద్దరి బాధ్యత తోటీ వుంటాయా? భార్యాభర్తలు కాని సంబంధాల్ని, రహస్యంగానే వుంచుకుంటారు. వాళ్ళు వెనకటి సంస్కృతిని పాటించని వాళ్ళు అయితే, తమ సంబంధాల్ని రహస్యంగా ఎందుకు గడుపుతారు?

‘క్రమమూ – అక్రమమూ’ అనేవి, ఆ సంబంధాల స్వభావాన్ని బట్టి వుంటుంది.

బి. రాధిక, వైజాగ్‌

ప్రశ్న: ఆర్ధిక వేత్తలకు ‘నోబుల్‌ ప్రైజులు’ అని పత్రికల్లో చదువుతాం. ఆర్ధిక వేత్తలు, ‘లాభం’ ఎలా వస్తుందో దాన్ని గురించి వివరిస్తారా?

జవాబు: ఇదేం సందేహం? ‘లాభం’ మాట తెలిసిన మీకు ఈ ఆర్ధిక వేత్తల సంగతి తెలీదా? నోబుల్‌ ప్రైజులు బూర్జువా ఆర్ధిక వేత్తలకే కదా? వాళ్ళు చెప్పేదంతా, సరుకుల అమ్మకాలకు ఆటంకాలు లేకుండా, విదేశాల్లో వ్యాపారాలు ఎలా చెయ్యాలో, ఆ మార్గాలేవో చెపుతారు. లేకపోతే, నిరుద్యోగులకు కాస్త ‘భృతి’ ఎలా పడెయ్యాలో, చెపుతారు.

ఇంకో సమస్య తలెత్తింది. ఇప్పుడు, పర్యావరణం అస్తవ్యస్తం అయ్యే పరిస్తితి ఎక్కువ అవుతోంది కదా? భూమి వేడిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు చెప్పే వాళ్ళకి కూడా నోబుల్‌ ఇస్తారు. వీళ్ళు, ‘పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని రద్దు చేస్తే తప్ప, ఈ సమస్యని పరిష్కరించలేము’ అని మాత్రం చెప్పరు. ఇటువంటి తప్పుడు ఎత్తుగడలు చెప్తేనే నోబుల్‌ అవార్డులు!

ఆకునూరి రమామణి, మచిలీపట్నం

ప్రశ్న: మీరు టీవీ తరుచుగా చూస్తారా? ఒక ఇంటర్వ్యూ చేసే వాళ్ళు, కాలు మీద కాలేసుకుని కూర్చుంటారేమిటి? ఆశ్చర్యంగా వుంటుంది, చూడడానికి.

జవాబు: ‘ఆశ్చర్యంగా’ కాదు, అసహ్యంగా వుండాలి. నేను టీవీల్ని దాదాపు చూడను గానీ, సెల్‌ ఫోన్లో చూడడం కూడా టీవీ ప్రోగ్రామ్‌లు చూసినట్టే అవుతుంది లెండి. ఒక ఇంటర్వ్యూ జరుగుతోంటే, ప్రశ్నలు అడిగేవాళ్ళూ, జవాబులు చెప్పేవాళ్ళూ ఇద్దరూ, కాలు మీద కాలేసుకోడం చాలాసార్లు చూశాను. అంతకన్నా ఘోరాలు కనపడతాయి. కాళ్ళు రెండూ తెరుచుకుని కూర్చుంటారు. యూరినల్స్‌కి వెళ్ళేటప్పుడు, పేంటుని ఎక్కడ విడదీస్తారో ఆ కుట్టు భాగం అంతా ఎప్పుడూ అక్కడ కనపడుతూ వుంటుంది. షర్టు అనేది కిందకి ఉండదు. ఇన్‌షర్టులతో తిరగడం, పని చేసే సందర్భాల్లో అవసరం కావచ్చు గానీ, ఎప్పుడూ అదే వేషం. మీరు ఇంకో సంగతి గమనించలేదా? ఎవ్వరో, ఎప్పుడూ మహా అరుదుగానే గానీ, చేతి రుమాలు వాడరు. ఎప్పుడూ వేళ్ళతో ముక్కూ, మూతీ, తుడుస్తూ వుంటారు. ఆ వేళ్ళని బట్టలకి రాసేస్తారు. అంతే కదా? ఇలాంటివి చూడలేక సెల్‌ని కూడా ఎక్కువ చూడను.

పి. వసుంధర, విజయవాడ

ప్రశ్న: మీకు ‘ఇంటి పేరు’ లేకపోవడం వింతగా ఉంది. ‘ఇంటి పేరు’ ప్రతీ మనిషికీ, తప్పకుండా వుండాలని మీరే ఒక వ్యాసం రాసింది చదివాను. కానీ మీకు ఇంటి పేరు లేదెందుకు?

జవాబు: ‘ఇంటి పేరు’ గురించి సరిగా తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. చిన్నప్పటి నించీ, నాకు, ‘దద్దనాల’ అనే ఇంటి పేరు నా పేరుకి ముందు ఉండేది. ఆ తర్వాత, ఆడ పిల్లలకి ఒక దరిద్రం జరుగుతుంది కదా? అది జరిగాక, నా ఇంటి పేరు ‘ముప్పాళ’గా మారింది. అలా మారక్కర లేదని అప్పుడు తెలీదు. అలా మారాలి కదా అనే అనుకున్నాను. ఆ తర్వాత, కొన్నేళ్ళకి, ఆ సంసారాన్ని వదిలేసిన తక్షణమే ఆ ‘ముప్పాళ’ ఇంటి పేరు వదిలేశాను. అది వదిలేసి, చిన్నప్పటి ఇంటి పేరే పెట్టుకోవచ్చు. అదీ తెలియలేదు. నా పేరుతో మాత్రమే రాశాను. బ్యాంకు ఎకౌంటులో కూడా నా పేరే. ఇలా ఉంటూ వుండగా ఒక మీటింగ్‌కి వెళ్ళాను. అక్కడ వేరే వాళ్ళకి ‘ఇంటి పేర్ల సమస్య’ వచ్చింది. ఇంటికి వచ్చాక, ఇంటి పేర్ల గురించి ఆలోచించి మీరు చదివానని చెప్పిన ఆ వ్యాసం రాశాను. అప్పటికే నా పేరుతో రావడం అలవాటుగా వుంది. అప్పుడు ఇంటి పేరుని పెట్టాలంటే, తల్లిదండ్రుల పేర్లనే నా ఇంటి పేరుగా చేసి పెట్టాలి. అయినా, దాన్ని చేర్చకుండా నా పేరుని అలాగే వుంచాను. కానీ, నిజంగా ప్రతీ మనిషికీ ఇంటి పేరు ఉండాలి. రాసేది పెన్‌ నేమ్‌ (కలం పేరు)తో అయితే, అది వేరు. నేను రాసిన ఇంటి పేర్ల వ్యాసం నా ”మానవ సమాజం” అనే పుస్తకంలో వుంది. నా పేరు, కలం పేరు కాదు గానీ, అలాగే వుండిపోయింది.

టి. బాలాజీ, తిరుపతి

ప్రశ్న: రోజూ ఫోనుల్లో కాల్స్‌ వస్తూ వుంటాయి. ఒక్క సరుకుని కొంటే, రెండు ఇస్తాం – అంటారు. అంటే, ఒకటి ఫ్రీగా; ఎలా ఇస్తారంటారు?

జవాబు: మీ ప్రశ్నలోనే జవాబు వుంది. రెండు సరుకుల ధరా, ఒక్క దానికే పెట్టి, ‘ఒక్కదానితోనే రెండు ఇస్తాం’ అని చెపుతారు. అలా కాకపోతే, ఒకటి ఉచితంగా ఎలా ఇవ్వగలరు చెప్పండి?

రంగనాయకమ్మ

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.