దంతెవాడలో ప్రజాకీయం?

(ది వైర్ పత్రిక (08, నవంబర్, 2018) నుంచి అనువాదం.

‘ది వైర్’కు, సుకన్యా శాంతా గారికి కృతజ్ఞతలతో)

నీలాయవ (దంతెవాడ, చత్తీస్ ఘర్):

ఎండ మండిపోతోంది, 35 మంది బడి పిల్లలు, అందరూ ఆరేండ్లు పదకొండేండ్ల మధ్య వాళ్లు. ఒకే వరుసలో, సైనిక దళంలా నడుస్తున్నారు. వాళ్ళు అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని రెసిడెన్షియల్ స్కూల్ నుంచి, మూన్నెళ్ళ తరువాత, దీపావళి సెలవుల్లో ఇళ్ళకు వస్తున్నారు. ఈ పిల్లలు… దంతెవాడకు 49 కిలోమీటర్ల పశ్చిమాన అడివి లోతట్టు గ్రామాలు… నీలాయవ, మరి తొమ్మిది వూళ్ళ వాళ్ళు. వాళ్లలో అందరి కన్న పెద్ద పిల్లవాడు ఆ గులక రాళ్ళ  దారిలో ఎక్కడైనా సాయిధ తిరుగుబాటు దారులు పెట్టిన మందు పాతరలున్నాయేమో అని చూసుకుంటూ ముందు నడుస్తుండగా, మిగిలిన పిల్లలు పెద్దవాడి అడుగుల్లో అడుగులు వేస్తూ జాగర్తగా నడుస్తున్నారు,

అంతకు నాలుగు రోజుల క్రితమే.. ముగ్గురు డిస్త్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డిఆర్ జీ) మనుషులు, దూరదర్శన్ న్యూస్ వీడియో జర్నలిస్ట్ ఒకరు… నీలాయవ గ్రామం దగ్గర మందుపాతర పేలి చనిపోయారు. మరణాన్ని తప్పించుకుంటూ తిరగడం.. ఈ పిల్లలు రోజూ చేసే పని. అలాగే, చత్తీస్ ఘర్, దక్షిణ బస్తర్ ప్రాంతంలో, దంతెవాడ లోతట్టు గ్రామాల్లో సాయుధ విప్లవ దళాలు తిరగడం కూడా ఆ గ్రామస్టులకు మామూలే.

2001 గ్రామ రికార్డుల ప్రకారం 159 ఇళ్లు వున్న మధ్య రకం గ్రామం నీలాయవ. ప్రశాంతంగా, స్తబ్దుగా వుండే ఈ గ్రామం… అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో గత అక్టోబర్ 30న నక్సలైట్ దాడితో వార్తలకెక్కింది. దాడులు ఈ ప్రాంతానికి కొత్త కాదు. ఈ దాడిలో ఒక విలేఖరి చనిపోవడం వల్ల… ప్రభుత్వం, మానవ హక్కుల సంఘాల వాళ్ళు, న్యాయవాదులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.

వామపక్ష తీవ్ర వాదుల ప్రాబల్యం వున్న దక్షిణ బస్తర్ ప్రాంతంలో ప్రభుత్వం నిర్వహించే ‘అభివృద్ధి’ని వివిధ కోణాల్లో వీడియో తీసి చూపించడం కోసం, తమ చుట్టూ సాయుధ పోలీసులతో ముగ్గురు దూరదర్శన్ సభ్యుల బృందం బయల్దేరింది. వారిలో ఒకరు, రిపోర్టర్, చనిపోయిన అచ్యుతానంద సాహు.

నీలాయవలో ప్రజలు గత 13 సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకోలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే గాని, వేరే అభ్యర్టులు గాని ఈ ప్రాంతానికి అస్సలు రాలేదు. నక్సలైట్లు దాడి చేస్తారని భయం. ఈ సంవత్సరం ‘ఇంక్లూజన్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్’ ప్రక్రియలో మొదటి అడుగుగా ఈ గ్రామంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.

పోలింగ్ బూత్ ఏర్పాటు చేసిన చోట వీడియో తీయడం కోసమే దూరదర్శన్ విలేఖరుల బృందం వెళ్లింది. బృందం నీలాయవ వెళ్లే దారిలోకి వెళ్ళాక పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా (పి ఎల్ జి) సభ్యులు కాల్పులు జరిపి నలుగురు వ్యక్తులను హతమార్చారు.

తమ దాడి జర్నలిస్టుల మీద కాదని, ఇది ప్రభుత్వానికి వామపక్ష తీవ్రవాదులకు చిరకాలంగా సాగుతున్న పోరాటంలో భాగమని, అందులో అనుకోకుండా జర్నలిస్టు మరణించాడని…  ఆ తరువాత నక్సలైట్లు వివరణ యిచ్చారు.

‘అభివృద్ధి’ కోసం పోరాటం

అభివృద్ధి అనేది ఈ ప్రాంతంలో ఒక వివాదాస్పద అంశం. ఆ బడి పిల్లలకు… ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళడానికి ఒకదాని తరువాత మరో రవాణా సాధనం వుపయోగించుకుంటూ… కొంత దూరం బస్సులో వెళ్తూ, కొంత దూరం తెలీని మనుషుల బండ్లలో చోటు అడుక్కుంటూ, మిగిలిన సగం దూరం కాలి నడకలో వూరు చేరాల్సిన ఆ పిల్లలకు… ఈ అభివృద్ధి అనేదొక బ్రహ్మ పదార్థం. 20 కిలోమీటర్ల దూరంలో ఒక్క ప్రాధమిక ఆరోగ్య కేంద్రమైనా లేదు. చాల కాన్పులు వూళ్ళోనే జరుగుతాయి. కాన్పు జబ్బుల వల్ల చాల మంది ఆడవాళ్లు చనిపోయారు. పాఠశాలల్లో కొన్ని నెలలుగా టీచర్లు లేరు. పిల్లలు రెండు మూడు తరగతులకే బడి మానేస్తారు. లేకుంటే దగ్గర్లోని బర్గుం గ్రామంలో, ఆశ్రమ పాఠశాలలో చదువుకోడానికి 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఆ చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో పాఠశాలల్లాగే నీలాయవలో ఆరేళ్ళ లోపు పిల్లల కోసం అంగన్ వాడీలు కూడా లేవు. పిల్లలు, స్త్రీలు తగిన పోషకాహారం లేక చాల బక్కచిక్కి కనిపిస్తారు. ఈ స్థితిగతులు, వీటి గురించి ఆలోచనలేవీ… అధికారం కోసం పోటీ పడుతున్న రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలో కనిపించవు.

ప్రజా పంపిణీ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్) వ్యవస్థ అనేది చాల కాలం కిందటే ఆగిపోయింది. స్థానిక దుకాణాలలో తిండిగింజలూ అవీ కొనుక్కోడానికి కూడా జనాలు కిలోమీటర్ల కొలది నడవాల్సి వుంటుంది. గ్రామాలు బాగా లోతట్టుగా, మిగతా ప్రపంచం నుంచి కత్తిరించి వేసినట్లుంటాయి. నవంబర్ 12 ఎన్నికలకు నిరసన తెలుపుతూ బ్యానర్లు ఎక్కడంటే అక్కడ కనిపించాయి. బలమైన చెట్ల మొదళ్ళు, వొదిలేసిన ప్రజాపంపిణీ దుకాణాలు, స్కూళ్ళు.. చాల చోట్ల.. అచ్చేసినవో, చేత్తో రాసినవో నినాదాలు “సర్కార్, వెనక్కి వెళ్లిపో’   

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో కాంక్రీట్ రోడ్లు వేయాలని పట్టుదలగా ప్రయత్నిస్తోంది. ‘వూళ్ళన్నిటికీ రోడ్లు వేస్తే, స్కూళ్లు, ఆసుపత్రుల వంటి సౌకర్యాలు కూడా ఆ తరువాత వస్తాయి’ అంటారు ప్రస్తుత ఎంఎల్ఏ దేవతీ కర్మా. మిగతా అభ్యర్థులు… సిపిఐ కి చెందిన నందా రాం సోరి, బిజేపీ నేత భీమా రావ్ కూడా రోడ్లేయించడమే తమ ప్రధమ కర్తవ్యమని ప్రకటించారు.

సల్వాజుడుం స్థాపకుడు, 2013 జీలం ఘాటి మావోయిస్ట్ దాడిలో చనిపోయిన మహేంద్ర కర్మా భార్య ప్రస్తుత ఎంఎల్యే దేవతీ కర్మా. ‘బస్తర్ టైగర్’ మహేంద్ర కర్మా  2005లో నెలకొల్పిన మావోయిస్ట్ వ్యతిరేక ‘సాయుధ పౌర నిఘా బృందం’ పేరే సల్వాజుడుం. సల్వాజుడుం లోని సాయుధులందరూ గిరిజనులే. చాల వరకు, దిగువ స్థాయిలోంచి లొంగిపోయిన నక్సలైట్లు, స్థానికంగా మానవహక్కులను వుల్లంఘించి, జనం మీద దాడులు చేసినట్లు  ఆరోపణలున్నవాళ్ళు. గత పదేళ్ళలో వీళ్లు… చాల రేపులు, హత్యలు, దోపిడీలు చేసినట్లు రిపోర్టులున్నాయి.

అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే నిర్వచనాన్ని గ్రామస్టులు అస్సలు అంగీకరించరు. ‘హమారె పాస్ న ఘాడీ హై న ఘోడా, సడక్ హమారె కిస్ కసమ్ కే’ (మా దగ్గర బండి లేదు, గుర్రం లేదు; మరి రోడ్డు అవసరం మాకేమిటి?)  అంటాడు ఒక గ్రామ సర్పంచ్.

ఈ ప్రాంతంలో మరింత మిలిటరీని దింపడానికే ఈ రోడ్లు అంటారు గ్రామస్టులు. “మొదట సల్వాజుడుం, తరువాత మరింత దుర్మార్గమైన డిస్త్రిక్ట్ రిజర్వ గార్డ్స్ (డిఆర్ జి) అయ్యింది. వాళ్లు ఇక్కడికి వొస్తారు, మా తిండి గింజలు దోచుకుంటారు, గ్రామస్థుల్ని అవమానిస్తారు. గ్రామంలో ప్రతి ఇంట్లో కనీసం ఒక మనిషి, కొన్ని సార్లు స్త్రీలు కూడా అరెస్టయ్యారు. గత మూడేళ్ళలో ఒక్క నీలాయవ గ్రామంలోనే 49 మంది అరెస్టయ్యారని గ్రామ పెద్ద ‘వైర్’ తో అన్నారు.

దంతెవాడలో సాయుధ సిఅర్పిఎఫ్ జవాన్లు బాగా కనిపించారు. కేవలం దంతెవాడ జిల్లా కేంద్రం నుంచి నీలాయవ వరకే 300-325 జవాన్లతో రెండు సిఆర్పిఎఫ్  క్యాంపులున్నాయి. మరో క్యాంపు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా వుంది. ‘అందువల్లనే, ఈ గ్రామాల్ని కాంక్రీట్ రోడ్లతో అనుసంధానించాలని ఇంత వొత్తిడి’ అన్నాడు మరో గ్రామస్టుడు.

నక్సలైట్ల విస్తృతి,  ఎన్నికల బహిష్కరణ

నీలాయవ చుట్టుపక్కల – రేవలి, బుర్గావ్, నహడి, కకడి, జబేలి, బర్రెమ్, చిర్మూర్, గోడేరాస్- ఈ తొమ్మిది గ్రామాలలో సగటున వూరికి 50-70 ఇళ్ళుంటాయి. అందరూ గోండు తెగకు చెందిన వారే. ఇవన్నీ నక్సలైట్ల పట్టులో వున్నాయి. సాయుధులైన పిఎల్జీ సభ్యులు, ఆయుధాల్లేకుండా కొరియర్లుగా పనిచేసే సంగం సభ్యులైన యువజనులు.. ఈ గ్రామాల్లో చాల ఎక్కువ. చేతనా నాట్య మండలి అనే నక్సలైట్ సాంస్కృతిక బృందం కూడా ఈ గ్రామాల్లో పని చేస్తుంది. ఈ గ్రామాల్లోంచి చాల మందిని చేర్చుకుంది.

2013 ఎన్నికల్లో ఈ గ్రామాల్లో 870 ఓట్లుండగా కేవలం నాలుగు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఏడాది ఈ వూళ్లో మొదటి సారి ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ను ఇప్పటికే… జర్నలిస్ట్ మరణం తరువాత… ఎనిమిది కిలోమీటర్లు దూరానికి మార్చారు.   

ఈ ఏడాది కూడా ఏ పార్టీ అభ్యర్థీ ఈ గ్రామాలకు రాలేకపోయాడు. చాల మంది గ్రామస్థులకు అభ్యర్థులెవరో కూడా తెలీదు. మొత్తం అందరూ కలిసి, ఏడుగురు అభ్యర్థులు బరిలో వున్నారు. గ్రామస్తులకు కర్మా పేరొక్కటే తెలుసు, అది హతుడైన రాజకీయ నాయకుడు మహేంద్ర కర్మా నా, అతడి భార్య దేవతీ కర్మా నా అనేది వాళ్ళకు ఇదమిత్థంగా తెలీదు.

ఈ రిపోర్టర్ మరి ముగ్గురు స్థానిక రిపోర్టర్లు…ఒక రాష్ట్ర స్థాయి ప్రైవేట్ చానెల్ కరెస్పాండెంట్, మరి ఇద్దరు పదేండ్లుగా బస్తర్ లో పని చేసే ఫ్రీ లాన్స్ రచయితలతో కలిసి నవంబర్ 4 ఉదయం ఈ గ్రామాల్లో తిరగడం జరిగింది. కొండలు గుట్టల ప్రాంతం. స్థానిక సహాయం లేకుండా లోతట్టున తిరగడం కష్ట సాధ్యం.

దాడి జరిగిన చోటు చేరాక, నీలాయవ గ్రామస్తులమని చెప్పుకున్న ఇద్దరు టీనేజర్ అబ్బాయిలు రిపోర్టర్లతో గోండీ లో మాట్లాడారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో అడవుల్లో గ్రామస్తులు జమగూడి వున్నారని, తామెందుకు ఎన్నికల్ని బహిష్కరిస్తున్నారో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారు. రిపోర్టర్ల బృందం అడివిలో ప్రవేశించాక, పరిస్తితి మారిపోయింది. బైకు మీద దట్టమైన అడివిలో కొన్ని నిమిషాల ప్రయాణం తరువాత, ఇద్దరు అబ్బాయిలు బైకు మీంచి దిగి పోయి, వేరే ఇద్దరు ఎక్కారు. ఆపైన 20 కిలో మీటర్ల దూరం, రిపోర్టర్లు ‘పోటాలి గావ్’ అనే గ్రామానికి చేరే వరకు… ఇలాగే జరిగింది. ఈ గ్రామం గూగుల్ మ్యాప్స్ లో కనిపించదు. ఈ 20 కిలోమీటర్ల ప్రయాణం స్వచ్చందంగానే జరిగింది. నిర్బంధిస్తారేమో, తమకేమైనా జరుగుతుందేమో అనే భయంతో రిపోర్టర్లు కొరియర్ల సూచనలను పాటించారు.

పోటాలి వద్ద, 3500 మంది స్త్రీ పురుషులు జమగూడారు. ఒక ప్రత్యేక బృందంగా కొందరు యువతీ యువకులు… ఎర్రని యూనిఫాం లేదా ఎర్రని తలకట్టు ధరించిన వాళ్ళు… వేరుగా కూర్చున్నారు. అలాగే మరో ప్రత్యేక బృందం… సాంప్రదాయిక ఆదివాసీ దుస్తులతో, గోండు భాషలో విప్లవగీతాలు పాడుతూ.. తాము వేరుగా కూర్చున్నారు. ఈ గ్రూపు “సిఎన్ఎం పార్టీ’ అని వారిలో ఒకరు పేర్కొన్నారు.

చాల జాగర్తగా ప్లాన్ చేసినట్లున్న ఈ సమావేశం నాలుగు గంటల పాటు సాగింది. రిపోర్టర్లు, ఇతరులు కూర్చుని.. పలువురు తిరుగుబాటు నాయకుల వుపన్యాసాలు విన్నారు. స్థానికంగా తయారైన రైఫిల్స్ ధరించిన సాయుధులు సమావేశాన్ని జాగర్తగా గమనిస్తూ చుట్టుపక్కల తిరుగుతూ కనిపించారు. మొత్తమ్మీద సమావేశాన్ని చాల నైపుణ్యంతో నిర్వహించారు. కాని తెలుస్తూనే వుంది. దాని మీద గ్రామస్టులకు నియంత్రణ ఏమీ లేదు. ఆ సాయంత్రం సమావేశాన్ని ఫోటోలు, వీడియోలు తీసుకోడానికి అనుమతించారు. అయితే, తుపాకులు ధరించిన వారి ఫోటోలు తీయొద్దని హెచ్చరించారు.

ఆ తరువాత రెండు గంటల ర్యాలీ. గ్రామంలోని వివిధ బజార్ల గుండా, నినాదాలు సాంప్రదాయిక పాటలతో సాగి వూరి మధ్యన ఖాళీ స్థలంలో ఆగింది. ‘మాకు రోడ్లు వద్దు. ఆసుపత్రులు, పాఠశాలలు కావాలి’, అక్కడి జనం లోంచి ఒకాయన గోండు భాషలో అరిచాడు. ‘మోడీ సర్కార్ చోర్ హై’ మరొకాయన హిందీలో. దాదాపు 90 శాతం గ్రామస్తులు గోండీ లోనే మాట్లాడారు. వాళ్ళలో హిందీ, తెలుగు మాట్లాడగలిగే వాళ్ళు చాల సంవత్సరాలుగా సాయుధ వుద్యమంలో వున్నారని, ‘ఇతర్ల’ నుంచి ఆ భాషలు నేర్చుకున్నారని.. అక్కడి వాళ్లు అనుకుంటారు.

సాయంత్రం 4 గంటలప్పుడు 20-30 ఏండ్ల ఒక వ్యక్తి ప్రదర్శన స్థలంలోకి వొచ్చి రిపోర్టర్లతో మాట్లాడాడు. ఆయన తన పేరు ‘గుండా ధూర్’ అని చెప్పుకున్నాడు. ఆయన ‘ఏరియా కమాండర్’ అని తరువాత తెలిసింది. గుండా ధూర్ అనేది చాల సాధారణమైన పేరు. అది 20 వ శతాబ్దికి చెందిన ఒక ఆదివాసి తిరుగుబాటు నాయకుని పేరు. చాల మంది సాయుధ నేతలుల ఆ పేరు పెట్టుకుంటారు. ఆటోమ్యాటిక్ రైఫిల్ ధరించిన సాయుధుడు, గుండా ధూర్ ఈ రిపోర్టర్ తో మాట్లాడుతూ, తమ దాడిలో మరణించిన రిపోర్టర్లు పోలీసులతో పాటు పయనించాల్సింది కాదని అన్నాడు.’పోలీస్ సే సాథ్ ఆయె ఉంకీ గల్తీ థీ. హమ్నే కిస్సీ పత్రకార్ కో యహ ఆనే సే మనా నహి కియా హై. లేకిన్ అగర్ పోలీస్ కె సాథ్ ఆవోగే తో మారే హి హోగే’ (వాళ్లు పోలీసులతో పాటు వచ్చారు, అది వాళ్ల తప్పు. ఇక్కడికి రావొద్దని మేము ఏ విలేఖరికీ చెప్పలేదు. కాని, మీరు పోలీసులతో పాటు వొస్తే, మీ మీద దాడి జరుగుతుంది’ అన్నాడాయన.

రిపోర్టర్ ను చంపినందుకు మీ వాళ్ళు బాధపడుతున్నారా అని అడిగితే. ‘ఔన’న్నాడు. కాని ఆ పశ్చాత్తాపానికి అర్థం లేదు. నక్సల్స్ ఒక రిపోర్టర్ ను చంపడం ఇది మొదటి సారి కాదు. 2013 లో సాయి రెడ్డి, నేమి చంద్ జైన్ అనే జర్నలిస్టులను… వాళ్ళ మీద పోలీసు ఇన్ఫార్మర్లు అని ముద్ర వేసి… చంపేశారు. ఇక్కడి స్థానిక జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బంది ఇది. పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పుల్లో ఇరుక్కుంటున్నారు. వేధింపులు, బెదిరింపులు… బస్తర్ ప్రాంత జర్నలిస్టుల జీవితంలో భాగమయి పోయాయి.

దంతెవాడ జిల్లా లోని పల్నార్ గ్రామం వద్ద జిల్లా పంచాయత్ సభ్యుడు నందలాల్ ముదియానీ మీద దాడికి కూడా బాధ్యత తమదేనని ఆన్నారాయన. ముదియానీ తలకు, శరీరంలో ఇతర భాగాలకు బలమైన గాయాలు తగిలి, ప్రస్తుతం రాజ్ పూర్ ప్రభుత్వాసుపత్రిలో వున్నారు. ఏవో కొన్ని ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశాడనే ఆరోపణతో ఆ దాడి జరిగిందని వార్త.

మామూలుగా ఎప్పుడూ చేసినట్లే, ఆ దాడికి బాధ్యత తమదేనని నక్సలైట్లు బహిరంగ ప్రకటనేదీ చేయలేదు. ప్రకటన త్వరలో చేస్తామని గుండా ధూర్ చెప్పారు. జో జో జబ్ జబ్ బగావత్ కరేగా ఉస్కా ఏకీ హీ న్యాయ్ హోగా’ అన్నాడాయన. ఈ ప్రాంతంలో ఎదురు చెప్పే వాళ్ళకు మరణమే ‘న్యాయం’ అని సూచిస్తూ.

 

సుకన్య శాంతా

'ది వైర్'పత్రిక కరెస్పాండెంట్

7 comments

 • కథనం ఏంచెపుతుంది.ప్రజలందరినీ వాళ్ళు వీళ్ళు పట్టుకొని నిరంతరం భయంలో ఉండేట్లు చేస్తున్నారు. నిజంగా తీవ్రవాద గ్రూపులను ఏరివేయటం కాదు. అటుచేసి ఇటుచేసి ఆభూముల్ని ఎలాగైన ఇండస్ట్రీలకు కట్టబెట్టి వాళ్ళభూముల్లోనే వాళ్ళుకూలీలవ్వాలని.దీనికి తీవ్రవాదు లెంతో ఉపయోగపడ్తారు. వాళ్ళపేరు చెప్పి ప్రజల్ని హింసించి పారిపోయేట్లు చేస్తే ఎవ్వరూలేరని డిక్లేర్ చేసి అక్కడివాళ్ళకు లేకుండాచేయడమే. దీనిగురించి ఇఃత చర్చ అనవసరం.

  • థాంక్యూ స‍ర్‍, మీరు అంత మ‍ంచి చ‍ర్చ చేసి, చ‍ర్చ ‘అన‍వసరం’ అంటారేమిటి? ‘న’ అక్షర‍ం పొర‍పాటున ప‍డిందా? !

 • అక్కడి కష్టనస్టాలతో….
  బాదలు సమస్యలతో…..
  కలసి నడిచినట్టుంది…
  మంచి వార్తాకదనం, చక్కనైన అనువాదం
  ద వైర్ సంపాదకులకు, హెచ్చార్కే గారికి
  అభినందనలు…

  • థాంక్సండీ, ‘ది వైర్‍’ లో చ‍దివిన‍ వెంటనే ‘రస్తా’ పాఠకుల‍తో ప‍ంచుకోవాల‍నిపించింది. వార్తా క‍థ‍న‍ం ఎలాంటి ప్రిజుడిస్‍ లేకుండా, ఆబ్జెక్టివ్‍ గా వుంది. తప్పక‍ తెలుసుకోవల‍సిన సమాచార‍ం. .

 • పాలకులు అభివృద్ధి చేస్తుంటే ఆదివాసీలే అడ్డుకుంటున్నారనే విషయాన్ని అటుతిప్పి ఇటుతిప్పి చెప్పాడు ‘ది వైర్’పత్రిక కరెస్పాండెంట్. ఆదివాసుల స్వయం పాలన గురించి ఒక ముక్క చెప్పడానికి వారికి మనసు రాలేదు.
  “జనతన సర్కార్ ” ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, ఆశ్రమస్కూళ్ళు .సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ఆరోగ్య వైద్య కారిక్రమాలు చెప్పడానికి నోరు రాలేదు. దండకారణ్యంలో పీడితవర్గం జనతన సర్కార్ రూపంలో నిర్మించుకున్న రూపాన్ని మాట వరసకైనా ప్రస్తావించకపోవడం ఘోరం.
  -దాసరి రాజబాబు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.