సంకీర్తనల్లో అంతర్లయగా వ్యక్తిత్వ వికాసం! 

వ్యక్తిత్వ వికాసమంటే కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకుని, కావలసినంత డబ్బు సంపాదించుకుని జీవితమనే కోరికల ఊరేగింపులో కలసిపోవడం కాదు. లక్ష్య సాధన మీద మనసు లగ్నం చేసి, ఆ కృషిలో విజయ శిఖరాలు చేరుకున్నప్పుడు జీవితం మీ వెంట పరుగెత్తుకుంటూ వస్తుంది.  వెంట మీరు కోరికల గుర్రాలెక్కి పరుగెడితే జీవితం మీకు చిక్కకుండా పారిపోతుంది. అందుకే తాళ్ళపాక అన్నమాచార్యులవారు చదువు సంధ్యలెలా ఉండాలో, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఒక చక్కని సంకీర్తనలో వివరించి చెప్పారు.

కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై పడని పాట్లనెల్ల పడిపొరలనేల?

చరణం 1 :
ఆపదలు కలుగగ చేయ పరితాపకరమైన బతుకేల?
ఇతరుల మేలు చూసి సైపగ లేక తిరుగుచుండే కష్ట దేహమది యేల?

చరణం 2 :

ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పనియట్టి చదువేల?

పొదిగొన్న ఆసలో బుంగుడై సతతంబు సదమదంబై వడయు చవులు తనకేల?  

చరణం 3 :
వేంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతిపడు సిరులేల?
ఆత్మ తెలియనొల్లక పెక్కు త్రోవలేగిన దేహి దొరతనంబేల?  

ఇక ఈ సంకీర్తన అర్ధం, అంతరార్ధం ఏమిటో చూద్దాం.
‘కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై పడని పాట్లనెల్ల పడిపొరలనేల?
ఈ కడుపెంత తింటుంది? దీనికోసం ఎన్ని పాట్లు పడుతున్నాం? ఎంత కష్టపడుతున్నాం అన్న ఒక ఆలోచనా బీజాన్ని మనలో నాటి అన్నమయ్య ఈ సంకీర్తనతో మనల్ని ఎటు తీసుకెళుతున్నారో చూద్దాం.

పరుల మనసునకు ఆపదలు కలుగగ చేయ పరితాపకరమైన బతుకేల?
సొరిది ఇతరుల మేలు చూసి సైపగ లేక తిరుగుచుండే కష్ట దేహమది యేల?

ఎప్పుడూ ఎదుటివారి మనసును నొప్పించే పనులు చేస్తూ, ఏడుస్తూ బతకడమెందుకు? ఇతరులకు జరిగే మేలు చూసి ఏడుస్తూ, ఈ దేహాన్ని మోసుకుంటూ తిరగడమెందుకు? ‘Help Ever; Hurt Never’ అంటారు శ్రీ సత్యసాయి. 15వ శతాబ్దంలోనే అన్నమయ్య చెప్పారు ఆలోచనకు ఆచరణకు మధ్య అంతరం పెరిగితే వ్యక్తిగత వికాసం; అంతరం తగ్గిన కొద్దీ వ్యక్తిత్వ వికాసం.

ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు చదివి చెప్పనియట్టి చదువేల?
పొదిగొన్న ఆసలో బుంగుడై సతతంబు సదమదంబై వడయు చవులు తనకేల?

చదువెలా ఉండాలో అన్నమయ్య ఈ చరణంలో ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఎదిరికి అంటే శత్రువుకు కూడా ఉపకారము చెయ్యాలని చెప్పని చదువెందుకు? అంటున్నారు అన్నమయ్య. ‘అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ’ అన్నాడు సుమతీ శతకకారుడు బద్దెన. ఇంతటి సత్యాన్ని అన్నమయ్య 15వ శతాబ్దిలోనే చెప్పాడు. ఇటువంటి చదువులు ఇప్పుడు చెప్పకుండా, అంతా వ్యాపారమయం చేయడం వల్లనే కదా ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష’ అనుకుంటూ ప్రపంచమంతా డబ్బు వెంబడి పరుగులు తీస్తూ, లోపలి అంతర్గత శక్తిని, అంతరంగ శక్తిని, లోని నైపుణ్యాలను పెంచుకోకుండా కొనుగోలు శక్తిని పెంచుకోవడానికి పరుగులు తీస్తోంది? రాశులు పోసిన ఆశలలో మునిగిపోయి ఎప్పుడూ సతమతమయ్యే చదువులెందుకు? ‘స్వగృహే పూజ్యతే పితర; స్వగ్రామే పూజ్యతే ప్రభు; స్వదేశే పూజ్యతే రాజా; విద్వాన్ సర్వత్ర పూజ్యతే ‘ అంటే ఒక తండ్రిని తన ఇంట్లోనే పూజిస్తారు; ఒక ప్రభువును తన గ్రామంలోనే పూజిస్తారు; ఒక రాజును అతని దేశంలోనే పూజిస్తారు; కానీ విద్వాంసుడిని అన్ని చోట్ల పూజిస్తారు’  అంటే విద్వత్తు ఉన్నవాడిని ప్రపంచమంతా గౌరవిస్తుంది అని తాత్పర్యం. అటువంటి విద్వత్తును విద్యుత్తులాగా దేహంలోకి, మనసులోకి, హృదయంలోకి ఆవాహన చేసుకుని, అవగాహనతో బతకడమే మానవ జీవిత లక్ష్యం కావాలని అన్నమయ్య పద సారాంశం.
ఒకరు చెప్పినట్టు మరొకరు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోలేరు. వారి సంస్కారాన్ని బట్టి వారి వారి ఆలోచనల సమాహారంగా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు. అనుభవాలు దిక్సూచులుగా జీవితాలను జీవిస్తారు. తాము జీవించేదే జీవితమనుకుంటారు. ఎవరైనా వెదికేది జీవితంలో సంతోషం కోసమే. తమదే సంతోషమని జీవిస్తూ ఉంటారు. అనిర్వచనీయమైన వాటికి నిర్వచనాలివ్వడానికి ప్రయత్నిస్తారు. చివరకు వాయిదాల పద్ధతిలో జీవిస్తూ; తామే ఉద్ధతులమనుకుంటారు. శిఖరాన్ని జీవిత కాలంలో సాధించాలంటే ఎటువంటి చదువు చదవాలి? కేవలం పొట్ట కోసం, ధనం కోసం విలువైన జీవితాన్ని వృధా చేసుకోవాలా? అనుబంధాలు పెంచుకుంటూ అర్ధమే పరమార్ధమని ఒక్కరు నలుగురయ్యే కుటుంబం కోసం జీవితాన్ని పణంగా పెట్టి, వాయిదాలు మాత్రం కట్టి జీవించే రీతిలో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలా? పర హితమే తన హితమని జీవితాన్ని ఉత్సవంలా జీవించాలా? Life is a celebration.  జీవితమొక మహోత్సవం. ప్రతి నిత్యం వసంతోత్సవం. ఇంత నిర్మలంగా జీవితాన్ని జీవించాలంటే వాగాడంబరాల భ్రమలో పడకుండా మనలోని నైపుణ్యాలను అనుక్షణం తవ్వుకుంటూ, నలుగురిలో బతుకుతూ, నలుగురికీ ఉపయోగపడేలా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.
కేవలం జీవనోపాధికి మార్గం చూపేది వ్యక్తిగత వికాసమే అవుతుంది కానీ వ్యక్తిత్వ వికాసం కాదు. మాటలెన్ని కోటలు దాటినా దారి చూపు వారు మనీవైపు దారి చూపిస్తే అది యువతరాన్ని పెడతోవ పట్టించినట్టే అవుతుంది. లక్ష్యమెప్పుడూ ఘనంగా ఉండాలి. ధనంగా ఉండకూడదు. ధన లక్ష్యంతో జీవితం పరిభ్రమిస్తున్నప్పుడు, అది విఘాతమవుతుంది  కానీ వికాసం కాదు.
బాల్యం నుంచి యవ్వనం దాకా మన పిల్లలు చదువుకునే చదువులో ఎప్పుడైతే శీల నిర్మాణ విద్యను సమూలంగా నిర్మూలం చేసి, వాణిజ్య విలువలతో విద్యను ప్రారంభించామో అప్పుడే జాతి వ్యక్తిత్వ వికాస నాశనానికి విష బీజం పడింది. దాని పరిణామాలు మనందరం చూస్తున్నాం. ఇటువంటి ఆలోచనా రహిత దుస్థితి నుంచి యువతరాన్ని బయట పడేయడమే నేటి వ్యక్తిత్వ వికాస మార్గ దర్శకుల లక్ష్యం కావాలి. దానికి మన భారతీయ సాహిత్యమే తరిగిపోని బంగారు నిధిగా ఉపయోగపడుతుంది.

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.