అస్తిత్వవాద‍ం ఇంకొన్ని కోణాలు!

(ఇది షాజహానా క‍థల‍ పుస్తకం ‘లద్దాఫ్ని’ పై ఒక సభలో కె. శ్రీనివాస్‍ ప్రసంగ పాఠం, స్కై బాబా రాసి ప‍ంపినది)

కధలు విడివిడిగా వచ్చినపుడు రచయితలు కొద్దికొద్దిగా అర్ధమవుతారు. కొన్ని కొన్ని కోణాల్లో తెలుస్తారు. కానీ కొన్ని కథలై తరువాత అదొక పుస్తక రూపం తీసుకున్నప్పుడు, దానికో పేరు పెట్టి దానికి ముందుమాటలు రాయించి పుస్తకం వేసినపుడు అదొక సమగ్రమైన సంపుటిగా ఒక భిన్నమైన అర్ధాన్నిచ్చే ప్రయత్నం చేస్తుంది. పుస్తకం లేదంటే ఆ రచయితను శకలాలు శకలాలుగా అర్ధం చేసుకున్న రచయితను సమగ్రంగా అర్ధం చేసుకోవడానికి పుస్తకం ఉపకరిస్తుంది.

మొదటిసారి కథల పుస్తకంగా వచ్చినప్పుడు షాజహానా ఒక కథగా అర్ధమైన దానికంటే కొంచెం విస్తృతంగా, కొంచెం సమగ్రంగా అర్ధమవుతున్నారనే అనుకుంటున్నాను. అస్తిత్వ వాద సాహిత్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు సాహిత్యం ఇంతకాలం ఈ జీవితానుభవాలను గర్భితం చేయకుండా ఎంత అసంపూర్ణంగా ఉండిపోయందోనని బాధ కలుగుతుంది. ఆ అసంపూర్ణత్వం ఎలాంటిదంటే మనం వందలాది వేలాది సంవత్సరాల చరిత్ర అందులో లక్షలాది కోట్లాది మానవ జీవితాలు అనేకం అలిఖితంగానే ఉండిపోయినై. కొత్త జీవితం, సాహిత్యంలోకి వచ్చినపుడు ఆ సాహిత్యం అంతకు ముందు అటువంటి జీవితాన్ని ఎప్పుడూ ప్రతిఫలించక పోయినందు వల్ల మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, కలవరం కలిగిస్తుంది, మురిపెం కూడా కలిగిస్తుంది. ఒక ముస్లిం సమాజంలో కూడా దూదేకుల సమాజంలోని స్త్రీ కథలు రాస్తే ఎట్లా ఉంటుందని తెలిసినపుడు అయ్యో మన సాహిత్యం ఎంత చిన్నది! ఇంకా ఎన్ని జీవితాల్ని చిత్రించవలసి ఉంది! అని మనకు బాధ కూడా కలుగుతుంది.

అయితే అస్తిత్వ స్పృహతో కథలు రాస్తున్నప్పుడు కేవలం వాళ్ళలో కలిగిన ఆ అస్తిత్వ చైతన్యాన్నే రాయాలా? వాళ్ళలో ఉండే పోరాటాన్నే రాయాలా? వాళ్ళ జీవితంలోని అనేక పార్శ్వాల్ని- దాన్లో సెలబ్రేట్ చేసుకునేవి ఉంటాయి, దు:ఖపడేవి ఉంటాయి, రాజీ పడేవి ఉంటాయి.. వీటన్నింటి గురించి చిత్రించాలా? నేనయితే తెలంగాణ అస్తిత్వ వాద సమయంలో తెలంగాణ తన జీవితాన్ని సాహిత్యంలో వ్యక్తం చేయాలంటే తన పోరాటాన్ని కాకుండా సమస్త జీవిత పార్శ్వాల్ని కూడా చెప్పగలిగే అవకాశం ఆ సాహిత్యం మనకిస్తుందనే అటువంటిది చేయాలనే అభిప్రాయంతో ఉన్నాను.

మిగతా అన్ని అస్తిత్వ వాదాలని గురించి చర్చించను గానీ షాజహానా ‘సిల్‌సిలా’ కథ చదివినప్పుడు నాకు ఆ కథ ముస్లిం జీవితాల కధే కానక్కర్లేదు అని ఒకసారి అనిపించింది. చాలా కులాల, చాలా మతాల జీవితాలలో కూడా అటువంటి కథే ఉండే అవకాశం ఉంది.  ఒక బంధువుల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, అన్నదమ్ముల మధ్య, ఆర్ధికాంతరాలు, సాంస్కృతికాంతరాలు మానవ సంబంధాలు, ఆర్ధిక సంబంధాలు ఒకదానికొకటి విరుద్ధంగా పనిచేసి, ఆ జీవితాల్లో సృష్టించే వైచిత్రి, విషాదం వాటి మధ్యే మనుషులు వెతుక్కునే సంతోషం.. ఇక అందరి జీవితాల్లో ఉండే అంశాలు కూడా ముస్లింల జీవితాల్లో ఉంటాయి. ఆ అందరి జీవితాల్లో ఉండే అంశాలు ముస్లిం జీవితంలో కనుగొన్నప్పుడు, ముస్లింలు కాని వాళ్ళందరికీ ముస్లింలతో ఒక రకమైన సహానుభూతి కలుగుతుంది. సాహిత్యానికి ఆ ప్రయోజనం కూడా ఉందని నా అభిప్రాయం. అది గతంలో ఒక కథా రచయిత తన బాల్యానుభవాల గురించి రాసినపుడు ముస్లింల బాల్యం ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి, ఆ ముస్లింల బాల్యంలో కూడా నా బాల్యాన్ని వెతుకుతున్నపుడు నాకు తెలీకుండానే ఒక ఐక్యతను సాధించిందనుకున్నాను. అస్తిత్వవాద రచయిత పోరాట స్పృహతో పాటు, సాధారణ జీవిత చక్రాలను, ఆ సాధారణ జీవితంలో కూడా మనల్ని కదిలించగలిగేవి ఎంచుకోవటంలో రచయిత చేతుల్లోనే ఉంది. షాజహానా సిల్‌సిలా కథ సక్సెస్‌ కావడానికి నేననుకోవడం అది అందరి కధ. అందరి కథతో పాటు ముస్లిం కథ, ముస్లిం కథతో పాటు దూదేకుల జీవితాలకు సంబంధించి, ఆడవాళ్ల కథ, పేదరికం కథ కూడా. అన్ని అస్తిత్వాలను పెనవేసి ఒక ఆర్గానిక్‌ యూనిట్లోనే  కథ రాయడం సామాన్యమైన విషయం కాదు. బహుశా నేననుకోవడం స్త్రీలకు ఆ శక్తి ఉంటుంది. అంటే స్త్రీలో సహజంగా పురుషుడు ప్రపంచాన్ని చూసే పద్ధతికి వాళ్ళ బయలాజికల్‌గా డిఫరెంట్ కావడం వల్ల కాదు సోషలైజేషన్‌ డిఫరెంట్ కావడం వల్ల. చాలా ఓవర్టోన్స్‌ ఆడవాళ్ళలో ఉండవు. వాళ్ళు ప్రపంచాన్ని అర్జన్ట్గా మార్చేయాలని కాకుండా.. ప్రపంచాన్ని ఆవేశంతో కాకుండా, ఉద్వేగంతో కాకుండా, చాలా ప్రేమగా, కరుణగా ఒకోసారి సౌమ్యంగా కూడా చూస్తారేమో అని అనిపించింది. అది సంభాషణలు రాసే పద్ధతి కావొచ్చు, మనుషుల మధ్య మానవ సంబంధాల్లోని వికృతత్వాన్ని గానీ, అందులోని మృదుత్వాన్ని చెప్పడంగానీ.. ప్రేమ కథ గానీ కావొచ్చు.

తర్వాత షాజహానాలో నాకు నచ్చిన రెండవ గుణం- ఎందుకనో తెలీదు కానీ సాధారణంగా ఆడవాళ్ళు సాహిత్యంలో  కవిత్వంలోగానీ, కథల్లో గానీ ప్రయోగశీలతను ఇష్టపడరు. కవిత్వం రాసిన ఆడవాళ్ళు, విలోమ కవిత్వం రాసిన ఆడవాళ్ళలో అటువంటివారు కనపడరు. వాళ్ళు నేరుగా చెప్పడానికి ఇష్టపడతారు. అస్పష్టత ఉండాన్ని పెద్దగా లైక్‌ చేయరు. గత 60, 70…100  సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో కూడా ప్రయోగశీలురందరూ మగవాళ్ళే. అది లక్షణమా, అవలక్షణమా తరువాత తేల్చుకోవాల్సిన అవసరం.

కానీ ప్రయోగశీలత ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. ఆడవాళ్ళ సాహిత్య ప్రయాణంలో అది కూడా ఒక మజిలీ. ఈ పుస్తకంలో షాజహానా స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్షియస్‌నెస్‌ రూపంలో కథ రాయడానికి ప్రయత్నించారు. కథ మంచి కథ నిజానికి. అది షాజహానా ఒక స్త్రీ రచయిత్రిగా చూసినపుడు అది ఒక ప్రయోగంగానే కాకుండా అది ఒక విశేషంగా ఆవిడ స్త్రీ కథా రచనలో ముందడుగుగా కూడా అనిపించింది. అదొక్కటే కాదు ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ చెప్పిన కథ కావొచ్చు, దీవారే అని ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టిస్తూ, ఇల్లు అనే భావన, గోడలు అనే భావన, వాటి వెనుక ఉండే జీవితాలు, వాటి వెనుక ఉండే తాత్వికత.. ఒక ఫిలసాఫికల్‌గా చర్చలోకి వెళ్ళిపోతుంది. అది కూడా స్త్రీ కథనంలో అరుదుగా కనిపించే లక్షణాలు. బేసిగ్గా షాజహానా ముస్లింవాద కవయిత్రిగా తనేమిటో, తను ఎట్లా ఎక్స్‌ప్రెస్‌ చేయదలచుకుందో ఇంతకుముందే ఎస్టాబ్లిష్‌ చేశారు. కథనంలో తన జీవితాన్ని ఎట్లా చూడగలదో కూడా చెప్పారు. అది ఆవిడ ప్రయోగశీలంగా కూడా ఉన్నారు అని చెప్పినంత మాత్రాన ఆవిడ అస్తిత్వవాద రచయిత్రి హోదాకు వచ్చిన తేడా ఏమీ ఉండదు. ఎట్ ద సేమ్‌ టైమ్‌ ఆవిడ అందరికీ సంబంధించిన కథలు రాశారు కూడా అని చెప్పడం వల్ల నిజానికి అందరికీ సంబంధించిన కథలు అందరూ ఐడెంటిఫై కాగలిగే కథలు రాయడం కూడా ఎందుకంటే అందరికీ సంబంధించిన జీవితం లాంటి జీవితం కూడా ప్రతిఒక్క అస్తిత్వంలోనూ ఎంతోకొంత ఉంటుంది. దాన్లోంచి కూడా ఒక వేరియేషన్‌ ముస్లిం జీవితానికి సంబంధించిన వేరియేషన్‌ చూపించడం అన్నది కూడా చాలా అవసరం. ముస్లిం జీవితం నుంచి ఒక ప్రేమ కథ ఎలా ఉంటుంది, ముస్లిం జీవితాల్లో ఒక వలస కథ ఎట్లా ఉంటుంది, ఎన్ని రకాల కథలున్నాయో అన్ని రకాల కథలు ప్రతి జీవితంలోంచి రావల్సిన అవసరం ఉంది. దాన్ని తన మనసులో అటువంటి ఐడియలాజికల్‌ పట్టింపు ఉందో లేదో నాకు తెలీదు కానీ తాను స్త్రీగా, ముస్లింగా, దూదేకుల స్త్రీగా మాత్రమే కాకుండా ఒక ఆధునిక రచయిత్రిగా శిల్పాన్ని కూడా పట్టించుకున్నారు. కథన పద్ధతిని కూడా పట్టించుకున్నారు. స్త్రీ రచయిత్రిగా కూడా ఉన్నారు. పేదరికానికి సంబంధించిన జీవితాన్ని సృజించారు.ఈ విస్తృతి అనేది షాజహానాని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, విశిష్టమైన రచయిత్రిగా నిలబెడుతుందని నేననుకుంటున్నాను..

కె. శ్రీనివాస్‍

1 comment

  • చక్కటి వ్యాఖ్యానం. షాజహానా కథలు,కవిత్వం అన్నీ పదునైనవి, ఆలోచింపజేసేవి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.