ఒరే దోస్తులూ…
ఒకసారి ఏమయిందంటే-
అమ్మ కూడా నా దోస్త్ కటీఫ్ చేసింది. నాన్నారు కూడా అమ్మతో కటీఫ్ చేసేసారు. నాతో కూడా.
ఎవరికీ ఎవరితో దోస్తీ లేదు. నాన్నకీ అమ్మకీ – పక్కింటి అంకులుకీ నాన్నకీ – అంకులు వాళ్ళ ఆంటీకి అమ్మకీ అందరికీ కటీఫ్ అయిపోయింది.
అంతా కటీఫ్.. కటీఫ్..కటీఫ్..
దీనంతటికీ కారణం నేనేనంటుంది అమ్మ. వీడికి అంటే నాకు తలకాయే లేదంటారు నాన్న. తలకాయ లేకపోతే జుట్టిలా పెరిగిపోతుందా చెప్పండీ.. బుర్ర పెరక్కపోయినా జుట్టు బాగా పెరిగిపోతుంది అని అమ్మే తిడుతుంది..
అసలప్పుడేమయిందంటే-
అమ్మ వంటగదిలో ఉందా? నే వెళ్ళానా? ‘అంకుల్.. అంకుల్..’ అని అమ్మకు చెప్పానా? ‘ఎవర్రా?’ అని అమ్మ అడిగిందా? హాల్లోకి తొంగి చూసిందా? ‘ఈ జిడ్డుగాడా’ అని అందా? ‘వచ్చాడంటే గమ్ములా పట్టేసి వదల్డు’ అని అమ్మ గొణుక్కొని తిట్టుకుందా? ‘ఇంక సినిమాకి వెళ్ళినట్టే’ అని ఉస్సురుమందా? అమ్మ అలా చాలా బాధ పడడం చూసి ‘ఏమయిందమ్మా?’ అని అడిగానా?
‘వచ్చాడుగా.. ఈ పూట తినేస్తాడు..’ అంది అమ్మ.
నాకర్థం కాలేదు. అర్థం కానట్టే చూశాను.
‘బుర్ర తింటే కాని వెళ్ళడు..’ అంది అమ్మ.
నాకర్థమయ్యింది. అయినట్టే తలూపాను.
‘ఓహో’ అన్నాను.
‘టీ కావాలో కాఫీ కావాలో వెళ్ళి అడుగు..’ అంది అమ్మ.
‘ఎందుకు?’ అన్నాను.
‘ఏదో ఒకటి వాడి ముఖాన పోస్తే తొందరగా తాగి పోతాడు..’ అంది అమ్మ.
అప్పుడప్పుడూ అయినట్టే అప్పుడూ అమ్మ చిరుబురు అయింది.
‘ఇంకా ఇక్కడే నిలబడ్డావా? తొందరగా వెళ్ళు..’ అమ్మ నన్ను కసిరింది.
నేను బుద్దిగా తలాడించి వచ్చానా? డాడీ అంకులూ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారా? వాళ్ళ పక్కన నిలబడ్డానా? అంకుల్ నన్ను చూశాడా? నవ్వాడా? ‘ఏంటి సంగతి?’ అని కళ్ళెగరేసి అడిగాడా? నేను ‘కాఫీయా టీయా?’ అన్నానా?
‘ఏం తీసుకుంటారోనని వాళ్ళమ్మ అడిగమన్నట్టుంది?’ అని డాడీ చెప్పారు. కరెక్టు అన్నట్టు నేను తలాడించాను.
‘ఏం వద్దు..’ అన్నారు అంకుల్.
‘కాఫీయా టీయా?’ మళ్ళీ అడిగాను.
‘ఎందుకు?’ అని అంకుల్ మొహమాటంగా నవ్వారా?
‘ఏదో ఒకటి తాగితేకాని వదిలి వెళ్ళరట కదా?’ అంకుల్ డౌటు తీర్చడానికి చెప్పానా?
‘ఒరేయ్.. ముందు నువ్వు నోర్మూసుకొని లోపలికి వెళ్ళు..’ అని కరెంటు షాక్కొట్టినట్టు కయ్యమని డాడీ అరిచారా? కూర్చున్న చోటు నుండి లేచారా? చెయ్యెత్తారా? కొట్టబోయారా? ‘మీరాగండి’ అని అంకుల్ డాడీని ఆపారా?
‘ఎవర్ని చూసి ఎవరో అనుకుంటున్నాడు..’ అని అంకుల్ అదోరకంగా.. అచ్చం ప్లాస్టిక్ బొమ్మలా నవ్వారు.
‘లేదంకుల్.. మీరు జిడ్డు అంకుల్ కదా? డాడీ జిడ్డు అంకులే కదా డాడీ?’ అంకుల్ని అడిగి డాడీని కూడా ప్రూఫ్ కోసం అడిగాను.
డాడీ నాకు యస్ చెప్పలేదు. నో చెప్పలేదు. ‘బయటకు పోయి ఆడుకో’మన్నారు.
‘అదేంటి? మమ్మీ నువ్వూ ఇద్దరూ ఈ అంకుల్ని జిడ్డుగాడనే కదా అంటారు.. మాట్లాడుకుంటారు.. జిడ్డంకుల్ వాళ్ళకి కర్రీ ఇచ్చేసిరా అని మమ్మీ..’ నే చెప్పనే లేదు, ‘టింకూ.. గో అవుట్ సైడ్..’ డాడీ కళ్ళు బిగించి నావైపు కోపంగా చూశారు. అంకుల్ డాడీని వెర్రిగా పిచ్చోడిలా చూశారు. డాడీ ఏడ్చినట్టు నవ్వారు.
నాకు డౌట్. క్లియర్ చేసుకోవడానికి అడిగాను.
‘మీరు గమ్ములా పట్టేసి వదలరట కదా? మమ్మీ చెప్పింది..’
అప్పుడే మమ్మీ వచ్చింది.
‘అన్నయ్యగారూ బావున్నారా? వదిన రాలేదు, కాఫీ తీస్కోండి’ అమ్మ నవ్వుతూ పలుకరించి కప్పు ఇచ్చింది.
డాడీ మమ్మీని కోపంగా తినేసేలా చూశారు.
‘ఏమయిందండీ?’ మమ్మీ డాడీని అడిగింది.
‘ఏం లేదు మమ్మీ.. ఈ జిడ్డుగాడు.. గమ్ములా పట్టేసి.. బుర్ర తినేసి..’ నా వర్డుకీ వర్డుకీ ఒక్కో సిప్ తాగేసి కప్పక్కడ పెట్టేసి మోషను వస్తే పారిపోయినట్టు పారిపోయాడు అంకుల్.
నాకే అనుకుంటే అమ్మానాన్నలిద్దరికీ అర్థం కాలా. ఒకరినొకరు అలా చూసుకున్నారు. చూసుకొని ఇద్దరూ నావైపు చూశారు.
తర్వాత- ఇంట్లోనే సినిమా!
అమ్మ తిట్టిపోసింది.. అవే సాంగ్స్. నాన్న అమ్మని తిట్టారు. అవీ సాంగ్సే. ఇద్దరూ కలిసి నన్ను తిట్టారు.. అవీ..
అమ్మ కోపం పట్టలేక కొట్టింది. నన్ను చితక్కొట్టింది.
అవే ఫైట్లు.. సూపర్.. డిష్కుం డిష్కుం.. డిష్యుం డిష్యుం..
ఇంకేముంది?
శుభం!
-టింకు,
(అసలు పేరు అవినాష్)
ప్లే స్కూల్.
Jagadish chaala baavundi.
Haayi gaa vundi chaduvuthuntae
budugu flavour kanipinchindhi sir chalabagundhi