క్లిక్ క్లిక్

మా రెండో అక్కకి మా ఎవరికీ లేని ఒక అలవాటొచ్చింది.  ప్రతి పుట్టిన రోజుకీ తలంటు, పరమాన్నం గుడి అయ్యాక , తన మజిలీ ఫొటో స్టూడియో కే.  ఏడుగురిలో తనకే ఎందుకొచ్చింది అంటే గుట్టమీది రాంరెడ్డి తాత మనవరాలి స్నేహం కావచ్చు.  అప్పట్లో అది ఖరీదైన వ్యవహారం కదా.. “కొత్త బట్టలు కొనకున్న మానె , ఫోట్వ దిగకుంటె గదేం పుట్టిన రోజం”టది మాయక్క . అందుకని “బట్టలు కుట్టించే అయిదోపదో నాకిచ్చెయ్.  ఫొటో ఇంపార్టెంటు” అనేది.  ఆ తీసుకున్న పోటోలన్నీ మొదట ఒక నోటు పుస్తకంలో అంటించి డేట్ వ్రాసి పెట్టుకున్నా కాస్త పెద్దయ్యాక మరి కొనుక్కుందో ఎవరైనా బహుమతిచ్చారో కానీ అవన్నీ అందంగా ఆల్బం లో అమరాయి.

దీనికి పూర్తిగా విలోమం మా పెద్దన్నయ్య.  “పెళ్ళి పేరంటమండీ మళ్ళీ రాదండీ రారండోయ్” అంటూ  ఫొటో గ్రాఫర్ తీసే ఏ క్లిక్కులకీ ఎప్పుడూ అందడు.  “అదేంటి” అంటే “ఫర్వాలేదు” అంటాడు. అప్పటి దాకా అక్కడే తిరుగుతున్న వాడల్లా ఎటు మాయమవుతాడో తెలియదసలు. అందరం వెతకడానికి  వెళితే..”ఇక నా వల్ల కాదమ్మా నేను పోతున్నా” అనేవాడు బాబూఖాన్ అన్న. అప్పట్లో తనే మాకు సినిమా డైరెక్టర్ రేంజ్ అన్నమాట. “బాబ్బాబు బాబూఖానూ.. ఉన్న వాళ్ళ తో తీసెయ్.. అవతల మాట పోతుంది వియ్యాల వారి దగ్గర” అని అమ్మ ఉన్న వాళ్ళని నించోబెట్టేది ఉస్సురంటూ….

మా రెండో అన్నయ్య మాత్రం ఎవరో దోస్త్ దగ్గర కెమెరా తీసుకొచ్చి దాన్ని మెడలో వేసుకుని నీరెండలో అందరినీ నించోబెట్టి… పౌడరేసుకోకున్నా ఫరవాలేదు తలదువ్వుకోకపోయినా ఇందులో కనబడదు అంటూ హడావిడి చేస్తూ, రీలు తీసేసుకుని కెమెరా ఇచ్చేయాలి కాబట్టీ,  పక్కింటి పిల్లలతో సహా అందరినీ నించోబెట్టి రీలు లో చివరికంటా టిక్కు టిక్కు మని మెరుపులు మెరిపించే సంబరాల రాంబాబు. తీయడం తీసేవాడు కానీ ఆ రీలు ఆ నల్ల చదరంగం పావుల డబ్బా  ( చదరంగం పావుల్లేవు..పెన్సిల్స్ వేసుకోమని సావిత్రి అక్క ఇచ్చింది) లో పదిలంగా పవళించి ఉండేది చాలా రోజులు.  అప్పుడప్పుడూ నన్ను, మా చిన్న చెల్లినీ సైకిల్ మీద కూచోబెట్టుకుని, సర్కస్ అని చెప్పి వెనక ఉన్న ఏనుగులు, గుర్రాలు, సింహాలు చూపించి, అక్కడ అమ్ముతున్న రెండు బుడగలు కొనిచ్చి, చెరుకురసం తాగించి ఇంటికి తీసుకెళుతూ ఫ్రెండ్ స్టూడియో లో ఇద్దరికీ ఫోటోలు తీయించేవాడు. ఆ ఫోటోలు తీయడం నిజమో కాదో కానీ వాటి గురించి కథలు కథలు గా చెప్పుకునేవాళ్ళం. అసలు మాకు ఆ ఫ్లాష్ పడడం వరకే తప్ప ఆ ఫోటోలు రాలేదేంటని అడిగే అంత  ఇంటలిజెన్స్ లేదు.  అన్ని తీయించినా ఒక్కటే వచ్చింది. డబ్బులున్నప్పుడు ఆ ఒక్కటి మాత్రం తెచ్చినట్టున్నాడు, అది చూసుకుని మురిసిపోయే వాళ్ళం మేమిద్దరం. ఫోటోల సంగతి వదిలేస్తే, మా ఇద్దరికీ పెద్దయ్యేదాకా సర్కస్ అంటే టెంట్ వెనకాల ఏనుగులు గుర్రాలు సింహాలు, పులులు అనే తెలుసు, ఆనక పక్కింటి పిల్లలెవరో  సర్కస్ అంటే ఏంటో చెప్పేదాకా మాకు తెలియదు. కానీ మాకెప్పుడూ అన్న మీద కోపం రాలేదు. ఆ మాత్రం చూపించాడు అదే పదివేలు అనుకునేవాళ్లం.

అప్పుడప్పుడు తప్ప ఫోటోలు తీయించుకుందామన్న ఆలోచనే వచ్చేది కాదు మాకెవరికీ. దానికి తోడు  అసలు అద్దంలో ఎక్కువ సార్లు చూసుకోవడం వల్లనూ, ఎక్కువ సార్లు కెమేరా ముందు నించోడంవల్లనూ అసలే అంతంతమాత్రమనుకునే అందం కూడా అటకెక్కేస్తుందనే అంశాన్ని అప్పటికప్పుడు కనిపెట్టిన మధ్య తరగతి తల్లులు… పాస్పోర్టు సైజ్ ఫోటో తీయించుకోడానిక్కూడా భయంగా చూసేట్టు చేసారు ఆడ పిల్లలని. మరి కాసుల్లేని చోట ఆకాశాన్ని కోసుకొస్తామంటే ఎట్లా కుదురుతుంది ? అందుకే అన్నారేమో శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని!!

అసలింకో సీరియన్ విషయముంది. మా అమ్మమ్మ కాలంలో పెళ్ళిల్లో తప్ప ఎవరికైనా ఇంటికొచ్చి  ఫొటో తీస్తున్నారంటే అది దండెయ్యడానికే అనుకునేవారుట. “అమ్మ కి ఒంట్లో బాలేదు స్టార్ట్ ఇమ్మీడియాట్లీ” అని ట్రంకాలు రాగానే పిల్లలనీ, ట్రంకు పెట్టినీ ఎత్తుకునొచ్చిన కూతుళ్లు, అల్లుళ్ళతో పాటు అదే ఇంట్లో ఉంటున్న కొడుకులు, కోడళ్ళు, ఆడపడుచులు అత్తగారు, అత్తగారి ఆడపడుచులూ, భర్త, బాగా మనసున్న మహరాజైతే తనవైపు తల్లీ, చెల్లీ వాళ్ళ కుటుంబాలతో సహా గ్రూప్ ఫుటోకెక్కేవారుట. గమనించాల్సిన విషయమేంటంటే అందరిలో మధ్య కుర్చీ లో ఉన్నవారు మెయిన్ అని అర్థం చేసుకోవాలి.  అంటే ఆ సదరు వ్యక్తి వల్లే ఈ ఫొటో సెషన్ అన్నమాట. నాకు తెలిసీ ఇంటి పెద్ద పెద్దగా డిస్కషను పెట్టకుండా ఫోటోగ్రాఫర్ ని పిలిపించడమూ  అతను ఇంటికి రాగానే అందరూ ఘొల్లుమనడం జరిగేవని అంచనా. ఇటువంటి ఫొటోలన్నింటిలోనూ ఏడ్చి ఏడ్చి అందరి మొహాలు కళ్ళు, ముక్కు వాచి ఉండడమే అందుకు నిదర్శనం.

నా చిన్నప్పటి స్నేహితురాలింట్లో వారి కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ముస్తాబు చేసాక తీసిన ఫోటోలు గోడకి పెట్టేవారు వరుసగా. మీరు చదువుతున్నది నిజమే. చనిపోయాక తీసిన ఫోటోలే!! వాళ్ళింటికి చదువుకోడానికి రమ్మంటే మాత్రం వెళ్ళేవాళ్ళం  కాదు. ఆ పిల్ల అలిగి ‘ సరదాగా నేను రమ్మంటే దడ.. మ్మీకు దడ” అనే ప్రభుదేవా పాట అప్పట్లో లేకపోయినా కంపోస్ చేసి  అందుకునేది.

పదో తరగతి పరీక్షకి ఇద్దరు ముగ్గురు దోస్తులం వెళ్లి  విడి విడి గా   వెళ్లి పాస్పోర్ట్ సైజ్ ఫోటో  దిగితే, ఫోటోలు ఇచ్ఛేటప్పుడు విడి విడి ఫొటోలే కాకుండా ఇద్దరూ పక్కపక్కన కూచుకున్నట్టు తీసిన ఫోటో కూడా ఇచ్చి బాబూఖాన్ అన్న మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచినప్పుడు మేము బోలెడు సంతోషపడిపోయినా , ఎవరో అబ్బాయిలవీ అమ్మాయిలవీ ఫోటోలు కలిపి ఇచ్చాడని పసిగట్టిన కొందరు తలితండ్రులు అతని వీపు సాఫ్ చేశారని తెలిసాక అటు వెళ్లడం భయంగా ఉండేది.

ఒక్క నాలుగైదేళ్లలో పెద్ద మార్పు.  ప్రతి ఫంక్షన్ కి వేలకొద్దీ ఫొటోలు తీయటం తమాషా అయిపోయి ఎవరింటికెళ్ళినా రెండు ఆల్బమ్ లు పడేసి “చూస్తూ ఉండండి, ఇపుడే వస్తా” అని లోపలికెళ్ళిన ఇల్లాలు గంట దాటినా బయటికి రాకపోతే  “వెళ్ళలేను,  ఉండలేను, ఏమికానూ”  అని మనసులో విసుక్కుంటూ  ఆవిడ తప్ప ఎవరూ తెలియని పొటోలని చూడలేక అక్కడ పడేసి. కాఫీ కప్పుతో తిరిగొచ్చిన ఆవిడ, “మా తోటికోడలిని చూసారా.. ఆ ఎర్రచీర కట్టుకున్నఆవిడే ..  అప్పుడు చెప్పానే మా కజిన్ ఢిల్లీ లో ఉంటారని, గుర్తు పట్టండి చూద్దాం”  అంటూ పెట్టిన క్విజ్ కి సమాధానాలు చెప్పలేక  అంతర్మధనానికి దారితీయించిన పరిస్థితులు కోకొల్లలు.  అందుకే నేనెవరికీ ఫొటోలు,  ఆల్బమ్ లూ చూపించను.  కానీ నా స్నేహితులు కొందరు “ఆల్బమ్ తేవే”  అని ఆర్డర్ చేసి మరీ, కొన్ని ఫొటోలని  చూసి అల్లరి చేయడం  కూడా అనుభవమే. తికమక ఫొటోలొస్తే  మన తప్పా ఏంటీ.. ద గ్రేట్ బాబూఖాన్ గారిదే కదా?

మా చిన్నక్కకి ఫోటోల మీద ఉన్న ఇష్టం వలన ఎవరికైనా పెళ్లిళ్లు పేరంటాలు జరిగినప్పుడు, ఫోటో ఖర్చు  నాది  అనేసేది. అప్పట్లో అది చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి పెద్ద బహుమతి ఇచ్చినట్టే. అబ్బో అసలు పూర్తి వీ ఐ పీ ట్రీట్మెంట్ మా అక్కకి, కానీ రెండు సార్లు పూర్తిగా దెబ్బతినేసి ఇంక ఆ బహుమతి జోలికెళ్లలేదు. అందులో ఒకటి నా మొదటి సీమంతం. అసలే పెద్ద కోడలినేమో మా అత్తయ్య కి బోలెడు సరదా. మొట్టమొదటి మనవడు వస్తున్నాడు కాబట్టి ప్రతీ జ్ఞాపకం ఒడిసి పెట్టాలని తాపత్రయం ఉంటుంది కదా… ఫోటో గ్రాఫర్ ని మాట్లాడదాము అనుకుంటుండగా “..నేను …. నేను…..  నేనున్నా కదా ” అనేసింది మా అక్క. “పక్కానా” అని మా ఇంట్లో అందరూ అడిగారు… ” పక్కా లాక్ చేసెయ్యండి”  అంది మా అక్క. అందరూ టేకిట్ ఈజీ అనేసుకున్నారు. తీరా మా అల్వాల్ ఫోటో స్టూడియో వాళ్ళు నా మీద ప్రేమతో నెగటివ్ లు నీళ్లతో కడిగారో  పాలతో కడిగారో  కానీ మొత్తం 2 రీళ్లు తెల్లగా వచ్చ్చేశాయి.  అలా జరిగినందుకు  అందరికంటే ఎక్కవ బాధపడింది మా అత్తమ్మే …

రెండో సందర్భం ఏదీ  అని అడుగుతున్నారా.. వస్తున్నా అక్కడికే వస్తున్నా.. మా పెళ్లి టైం కి పెళ్లి వీడియోలు  కొత్త. ఎవరో కానీ తీయించేవారు కాదు. మా అత్తగారు సరదా పడ్డారు. అక్కడ కూడా మా అక్క ” మై హు నా ”  అనేసింది. పెళ్లి హడావిడి అయ్యాక ఫోటోలొచ్చాయని కబురొచ్చింది. వాటితో పాటు  వీడియో  కూడా  పంపమని మా అత్తమ్మ సవినయం గా కబురంపారు. అందరి గుండె గుభిల్లుమంది. విషయమేంటంటే  పెళ్లి లో అసలు   వీడియో గ్రాఫర్ రానేలేదు.. పెళ్లి  హడావిడి లో ఎవ్వరూ  పట్టించుకోలేదు,  అసలు గుర్తు కూడా రాలేదు. పోనీలే యోగం లేదని ఈజీ గా తీసుకున్నారు అత్తయ్య. రెండో సారి  సీమంతం ఫొటోలకి మాత్రం కాస్త మనసు కష్టపెట్టుకున్నారు. అసలు జ్ఞాపకానికైనా ఒక ఫోటో లేదు.. నేనైనా తీసుకొచ్చాను కాదు ఫోటోగ్రాఫర్ ని అంటూ. పోనీ స్టూడియో కి తీసుకెళ్లి ఫోటోలు తీయిద్దామనుకునేలోపు పిల్లాడు పుట్టేసాడు.

వీడియో అనగానే ఇంకో విషయం గుర్తొచ్చింది.. ఒకావిడ కి అప్పట్లో ఏదో పెద్ద ఆపరేషన్ అయింది. ఆవిడ అతి ఖరీదైన ఆస్పత్రిలో చేయించుకోవడం వల్ల ఆ “ఆ-పరేశాన్ ” వీడియో అంతా వీళ్ళ చేతిలో పెట్టారు. ఆవిడని పరామర్శించడానికి వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఆవిడ అదేదో పాతాళ భైరవి సినిమా చూపించినట్టు చూపించేది. పోనీ ఆవిడ సంతోష పడుతుంది కదా అని చూద్దామనుకుంటే, అది ఒక పట్టాన అవదు.. రెండున్నర గంటల  ఆపరేషన్ ఎక్కడా వదలకుండా  తీయడంతో పాటు, ఆపరేషన్ ప్రిపరేషన్ కొంత,  రికవరీ రూమ్ లో కొంత తీసి చివరాఖరికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ నటీ నటులంటూ ఆస్పత్రి వివరాలు , పేషంట్ వివరాలు, ఆపరేషన్ చేసిన డాక్టర్ల వివరాలు ఇచ్చి శుభం కార్డు వేసాడు. ఇదంతా మనం చూస్తున్నామా లేదా అని చూస్తూ, అక్కడక్కడ  కామెంటుతూ,  మొహం లో బోలెడు సంతోషం నింపుకుని చూపిస్తారావిడ. పైగా  అదయ్యాక ఒక్కొక్క నిముషమూ తన మానసిక పరిస్థితి ని విశ్లేషించి చెప్పేదాకా వదలరు. నేను కనీసం 10 సార్లు ఎవరో ఊరినించి వచ్చిన వాళ్లకి  తోడుగా వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో పాడు మొహమాటమొకటి. అయ్యో ఫర్వాలేదండీ అనేదాన్ని లోపల చిరచిరలాడుతూ … పోనీలెండి మీరూ  ఆవిడని క్షమించెయ్యండి ఒక పారాగ్రాఫ్ తీసుకున్నందుకు.

మొన్నిక్కడ మాకు బాగా చనువు ఉన్న పిల్ల పళ్ళ కి ఏదో ఆపరేషన్ జరిగితే ఆపరేషన్ టేబుల్ మీద స్పృహలో లేనప్పుడు ఎవరో  ఫోటో తీసి తన ఫోన్ లోంచి అప్లోడ్ చేశారు . సడన్ గా ఆ ఫోటో చూసి, పిల్లకేదో అయిందని ఖంగారు పడిపోయాము… సరదాగా పెట్టాము అన్నారు వాళ్ళు.. “వీళ్ళ సరదా కాకులెత్తుకెళ్లా .. రెండు రోజులు మనసు కుదుటపడలేదు” అని విసుక్కుంది వాళ్ళ అమ్మమ్మ.

“నన్ను ఫోటో తియ్ నన్ను తియ్” అని  పెళ్లిళ్లలో ఫోటోగ్రాఫర్ బుర్ర తినేసే పిల్లల్ని ఒక్క మెరుపు మెరిపించి మోసం చేసే కాలం పిల్లలం కదా మేము …  పైన చెప్పినట్టు, మెరుపు మెరవడం వరకే కానీ ఫోటో వచ్చిందా అన్న ఆలోచనే వచ్చేది కాదు.  ఎవరింటికెళ్లినప్పుడో వాళ్ళ ఫోటోలు చూస్తూ పంతులు గారు,  దంపతులు కాకుండా ఉన్న గుంపులో మన కాలో, చెయ్యో, చెవి జూకాలో కనిపించినా నేనే నేనే అని చూసి సంబరపడిపోవడలో ఒక ఆనందముండేది .. ఆ ఆనందమే అందం మరి!

కొన్ని రోజులకి ఇంటికో కెమెరా  పథకం వచ్చాక,  నాచురల్ అంటూ అంట్లు తోముతున్నప్పుడో,  బట్టలుతుకుతున్నప్పుడో ఫోటోలు తీసేవారు మా ఇంటి పిల్లలు. అవి ఎంత భయకంరమైన ఫొటోలో ఎవరైనా చూస్తే కానీ అర్థం కాదు. ఆల్మోస్ట్ జగన్మోహిని సినిమా లో అదేదో క్యారెక్టర్.. వద్దులెండి చెప్తే మీరు దడుసుకుంటారు. నేను ఫొటోల్లో కనబడేదాన్ని కాదసలు. వంటింటికీ నాకూ ఉన్న అవినాభావ సంబంధం నన్ను చాలా నాచురల్ ఫోటోల నించి కాపాడింది.

ఇక్కడికొచ్చాక ఫోటోల గురించి ఆలోచించే తీరికే లేదసలు. ఇంట్లో కెమెరా అన్న పదార్ధం ఉందని మాకు  గుర్తే ఉండదు. అందరిళ్ళల్లో చిన్న ఫంక్షన్ అయినా జంటలని, గుంపులని, విడివిడిగా ఫోటో లు తీస్తారు. మాకు ఫంక్షన్ అయిపోయాక ఎప్పుడో అనిపిస్తుంది అయ్యో తీసి ఉంటే  బాగుండు కదా అని.. కానీ మళ్ళీ ఇంకో ఫంక్షన్ కి షరా మామూలే. మొదటి సారి కెమెరా ఉన్న ఫోన్లు మా ఇద్దరికీ  వచ్చినప్పుడు మాకు అంత  ఆసక్తి లేదు కాబట్టిన్నీ, ఫోన్ ఫోన్ కోసమే వాడటం వల్లనున్ను , ఇంట్లో కెమెరాయే  సరిగా వాడకపోతే ఇదేం  వాడతాం అన్న ఆలోచన వల్లనూ, ఒకటి మా చెల్లికీ, ఒకటి అత్తయ్య కీ ఇచ్చి పంపేసాము. వాళ్ళు చక్కటి చిక్కటి ఫోటోలు తీసి అమందానందం పొందేవారు.

ఇప్పట్లో అరచేతిలో వైకుంఠం వచ్చాక ఎవరెవరు ఏం ఫోటోలు తీస్తున్నారో ఎందుకు తీస్తున్నారో కూడా తెలియట్లేదు . కూచుంటే ఫోటో,  నించుంటే ఫోటో,  పూజ చేస్తుంటే ఫోటో,  పూజారితో ఫోటో,  బట్టలుతికితే ఫోటో,   బకీటు తన్నేస్తే ఫోటో, పుట్టిన పిల్లతో ఫోటో, చనిపోయిన వారితో  ఫోటో. రెండు చేతులెత్తీ దణ్ణం పెట్టుకునే చేతులిప్పుడు రెండు చేతులెత్తీ ఫోటోలు తీస్తున్నాయని బోలెడు జోకులొస్తున్నాయి కూడా. ఈ మధ్య ఎవరో ఒకతను రైల్ ట్రాక్ మీద నించుని వచ్ఛే రైలుని చూడకుండా ఫోటోలు తీసుకుంటుంటే  రైల్ వచ్చి గుద్దేసిందని చదివి అందరం ఎంతో  బాధ పడ్డాము కదా!

ఇంకో విషయం చెప్పాలి మీకు. మాది పెద్ద కుటుంబమని తెలుసు కదా… మా అక్క పిల్లలకో  అన్నపిల్లల పిల్లలకో  పిల్లలు పుట్టారనుకోండి.. పిల్లా తల్లీ క్షేమమని మా అక్కా వాళ్లకి చెప్పి పంపుతారు. వీళ్ళు పత్యమో పానమో తీసుకుని  రెండో రోజు ఆస్పత్రికెళ్లి  ఆ మూడో రోజెప్పుడో నేను ఫోన్ చేసినప్పుడు “అబ్బో ఆ చిన్నదుంది చూడసలూ “అంటూ వార్త లాగా చెప్తారా… నేనెప్పుడో చూసేసానని చెప్తే కోపం తెచ్చుకుంటారు. తూచ్ కుదరదని  తుడిచేస్తారు . ఇక్కడున్నవాళ్ళం మేము చూడకుండా నువ్వెలా చూస్తావని పందెం కూడా కాసేవారు కొత్తల్లో. ఇప్పుడు వాళ్ళకీ వాట్సాప్పులొచ్చాక పుట్టిన రెండో నిముషం పిల్లలని చూడచ్చని ఒప్పుకున్నట్టు అనిపిస్తోంది

ఈ మధ్య ఫోన్ బాగా స్లో అయిపోతే ఎందుకో అనుకున్నా. మా పిల్లలని అడిగితే వేల కొద్దీ ఫోటోలు వీడియో లు ఉన్నాయన్నారు. నేనసలు తీయనని చెప్పా, అవన్నీ వాట్సప్ లోను ఫేస్బుక్ లోను వచ్చినవిట . అవన్నీ తుడిచెయ్యాలంటే మనసొప్పట్లేదు. చుట్టాలు పంపిన కుప్పల్లోంచి  మన ఇంటి పిల్లలున్నవి చూసి కాసిని దాచుకోవాలని మనసవుతుంది. కానీ ఏరడం ఎలా. అందుకే అన్నీ డిలీట్ చేసేసి, ఇప్పటి నించీ వచ్చిన వాటిలో దాచాలనుకున్నవి చుక్కలు (స్టార్) పెట్టమని చెప్పి పుణ్యం కట్టుకున్నారు పిల్లలు.

ఈ మధ్య నా కొలీగ్ ఒకమ్మాయి మాట్లాడుతూ  ఫోటోలు ఇష్టం లేకపోవడమన్నది మానసికమైన లోపమనీ, కొన్ని ఏళ్ళ తరువాత ఇప్పటి ఫుటోలు చూసుకోవడం వల్ల  డిప్రెషన్ రాకుండా ఉంటుందని, ఫోటోలు తియ్యడం ఒక కళ  అనీ, అలా తీయనివాడు దున్నపోతై పుట్టునని గిరీశం చెప్పినట్టు చెప్పి పడేసింది. అప్పటినించీ అందమైన పిల్లలనో, నవ్వులనో తీయాలని ప్రయత్నిస్తున్నా కానీ, మాకిక్కడ ప్రయివసీ పాలసీ ఉంటుంది. మనకి ఏ పిల్లో, ఇల్లో, పిచ్చుకో, కుక్కో ,  నచ్చిందని  టకాటకా క్లిక్కు క్లిక్కు అన్నామంటే ఆనక్కి కటకటాస్ లెక్కెట్టే ముచ్చట తీర్చుకోవచ్చు. ఎవరైనా ఒకవేళ ప్రపంచం మెచ్చే పని చేసినా, వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వివరాలు కానీ ఫోటోలు కానీ పెట్టలేము. అలాగే ఎవరికైనా ఆక్సిడెంట్ అయినా సరే, అక్కడికక్కడే క్లిక్కేసి పేపర్లకెక్కించే రిస్కులెవ్వరూ చెయ్యరు. వార్తలలో కూడా ఒక విధమైన అనుమతి తీసుకున్నాక మాత్రమే వివరాలు వెల్లడిస్తారు… లేకపోతే అనామిక అని చెప్పి వదిలేస్తారంతే .

చేతుల్లో కెమెరా ఉన్న ఫోన్లొచ్చాక గడియకొక్క  సెల్ఫీ తీసి ప్రొఫైల్ పిక్ గా ఆ ఫోటోలు పెట్టేవారిని చూసి కొంతమందికి బీపీ ఎక్కువవుతోందిట.  విండో డ్రెస్సింగ్ లాగా, కష్టాలు, కన్నీళ్లు దాచుకుని అంతా చాలా బాగుందోహో అని చూపించే ఫోటోలు పెడుతుండడం వాళ్ళ అవతలి వారు ఎంత సుఖం గా ఉన్నారో అని అనుకోవడం వల్లనే అని ఒక సర్వే తేల్చి చెప్పేసిందిట.

ఒకటీ ఆరా ఫుటోలు జాగర్తగా ఫ్రేమ్ కట్టించి దాచుకునే కాలానికీ ఇప్పటికీ పొంతనే లేదసలు. . క్వాలిటీ నా క్వాన్టిటీనా అని అడిగితే క్వాలిటీ కే కదా  ఓటు ఇచ్చేస్తాం అందరమూ. నేనూ అంతే .

ఇంత చెప్పుకున్నా అర్థం కానీ విషయం ఒకటుంది నాకు. ఇన్ని వెసులుబాటు లుండీ, ఇన్నిన్ని ఫోటోలు దిగుతూ  కూడా కొందరు వారి ఫోటో బదులు చెట్టుదో పుట్టదో పువ్వుదో కాయదో ఫోటో పెడతారు ఎందుకంటారూ?

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

8 comments

 • మొత్తమంతా మందహాసం . అక్కడక్కడా అట్టహాసం . గొప్ప హాస్య గుళిక

 • ఎన్నెలమ్మ, మీ సీమంతం ఫోటోల కథ చదివితే, మా పెళ్ళి ఫోటోల ప్రహసనం గుర్తు వచ్చింది. మా ఫోటోలు కూడా రీల్స్ ఎక్సపోజ్ అయిపోయి, పెళ్ళి చూడడానికి వచ్చిన వాళ్ళెవరో తీసిన 4 -5 ఫోటోలు మాత్రమే మిగిలాయి. అందుకే ఇప్పుడు కెమెరా ఫోన్స్ ని చూస్తే ఆనందమేస్తుంది. మీ ఇష్టయిల్ లో ఎప్పట్లాగే నవ్వించేసారు 🙂

  • ayyo avunaa bangaaru..chaalaa బాధ అనిపిస్తుంది. నాకైతే పెద్దగా లేనే లేవు. అంతంతమాత్రమైన అందం లాంటిదేదో తగ్గిపోతుంది అనేది ఉండిపోయిందేమో ఇప్పటికీ ఫోటోలకి పోజియ్యడం రావట్లేదు.
   Thank you raa

 • నవ్వులే నవ్వులు. ఆఖరి వాక్యం మాత్రం చాలా ముఖ్యమైనది. 🙂

  • ధన్యవాదాలు అండీ. నా గోడ మీద చరచకపోయినా చదివేసారు . మీరు మంచివారు అంతే….😂

 • లక్మీ నీకయినా కొంత నయం అక్క, .అన్న కాసిన్ని ఫోటోలు తీసారు. మా కయితే మొదటి ఫోటో నా టెన్త్ క్లాస్ పాస్పోర్టు సైజు ఫోటో. మళ్ళీ డిగ్రీలో ఒకటి.బలే వ్రాసావు. ఎందుకు చిన్న సరదాలు కూడా అప్పుడు తీర్చు కోలేక పోయామో నాకిప్పటికీ అర్థంకాదు.ఇప్పుడు వద్దంటే ఫోటోలు. ఎటొచ్చీ నాకు నన్ను చూసుకోవడమే నచ్చదిప్పుడు.
  ఒకసారి రీవైండ్ అయింది జీవితం. థాంక్యూ.♥️💐👏

 • మొత్తానికి ఫోటో ప్రహసనం..మాకు హాసనం తెగ తెప్పించింది.
  మీ చిన్నక్క స్టైల్లో మా బావగారు నా పెళ్లి ఫోటోల పుణ్యం కట్టుకున్నారు అనుకోండి.అన్నట్లు నేనిచ్చిన చదరంగం పావుల డబ్బా ఇంకా దాచుకున్నవా ఎన్నెలమ్మా.. ఫోటో మాట ఎలా వున్నా ..నా డబ్బా చాలా పదిలం ..గా మిమ్మల్ని ఎప్పుడూ వీడదు..హహ..
  చాలా బాగా రాసారు..మీనుంది మరెన్నో హాస్య గుళికలు కోసం..ఈ మమ్మీ returns always.. హహ

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.