గోటూరు గిత్త

ఆ యేడు మా కొత్తిమిట్ట సేండ్లో నీళ్లు పారగట్టి రెండెకరాల డిసెంబరు కాయ పెట్టింటిమి. పంట గూడా అయ్యిండ్య. ఆ ముందు రోజే కట్టె గూడా సుమూరుగా పెరికి సగం సేను ఓదెలేసింటిమి. ఆ పొద్దు కట్టెను సేండ్లో నుంచి కలంలోకి తోలాల్సి ఉండ్య.

అసలే దూరాబారం సేను. మార్చి నెలైందాన ఎండలు మండిపోతనాయి. పొద్దెక్కే కొద్దీ ఎద్దలకు , మంచులకు పని శానా యాసిరికైతాది. ఏం రోంత యామార్నా కట్టె కొదవపడి , సేండ్లో ఎండిపోయి పొట్టు మనంగా రాల్తాది. మల్ల కాయలు కొయ్యాలన్యా ఇబ్బందిగా ఉంటాది. అందుకే పెరికిన కట్టెను ఒక దినం మించి పొలం మీద పెట్టగుర్దనుకుంటిమి. అమ్మల్లపొద్దు కంతా ఒక తడవన్నా తోలాలని తెల్లార్జామన్నే కాడి కట్టుకోని పోవాలనుకుంటిమి.

ఇటుపక్క జూచ్చే తీరా అప్పుడే మా గోటూరు గిత్త రోంత మెత్తబడిండ్య. అప్పటికే అది మా ఇంట్లో ఎనిమిదేండ్లు సేతవ జేసిండ్య. అది ప్రాయంలో ఉన్నెప్పుడు ఒక్క పూట గూడా సేద్యం కుంటు పడిందిల్యా. ఎంత పనైనా లెక్క ల్యాకుండా సేచ్చాండ్య . వయసు పైబడే కొద్దీ గిత్త గూడా తగ్గిపాయ. ఆ మద్దెన పండుకుంటే లెయ్యాలన్న్యా రోంత ఇబ్బంది పడ్తాండ్య.

కొత్తెద్దును పట్టకచ్చామనుకుంటే అప్పటికే మా సంసారం గుల్లైపోయిండ్య. ఆ గిత్త మాదిరే మా డొక్కలు కూడా కరువుకు కరిగిపోయుండ్య. ఎండిన డొక్కలకు ఏ ఆసరా ల్యాక లెక్కతో ఉసి తిరక్క శానా ఇబ్బందిగా ఉండ్య. వల్లల్యాక అట్లనే ఆ మెత్తబన్య గిత్తతోనే ఎట్లనోకట్ల మెల్లెంగ ఇగ్గకచ్చాంటిమి.

గిత్త లెయ్యల్య బ్బీ … ‘ అన్య మా నాయన, నేను దొడ్లో మొగం కడుక్కుంటాంటే. నాకు శానా బయమేస్య. ఏందిబ్బా ఇట్లాయ, తీరా తోట్లో నుంచి కట్టె తోలాల్సినప్పుడు గిత్త ఇబ్బంది పెడ్తాదేమో అనుకుంటి మనసులో.అయినా నిబాయించుకొని  నేను లేపుతాలే నాయ్నాఅంటి లోపల ఎంత బెరుకున్యా గానీ.

నేను దొడ్లో ఎద్దల కొట్టం కాడికి పోతి. గిత్త గాటిపాటన  పండుకోనుండాది. అది బాగ సిక్కిపోయుండాది. ఇదే గనక మనిసయ్యున్నింటే దీన్ని ఇంత ఇబ్బంది పెడుదుమా? అని మనసు సివుక్కుమన్యాది. గిత్త కండ్లల్లోకి సూచ్చి. నాకాడ ఇంగ బిసలేదబ్బి, నన్ను కాడికి కట్టగాకుబ్బీ …’అని దీనంగ బంగపొయ్నట్లనిపిచ్చ. అబ్బా ఏందిరా దేవుడా ఇంత సిక్కున పెడ్తివి అనుకుంటి మనసులో.

అయితే తప్పదు. అదితప్ప మాకింగ వేరే గత్యంతరం ల్యాకపాయ.

అంతలోకే మానాయన మోకులు, బిల్ల సెరుగులు తీస్కోని పొయ్ బండ్లో బేయడం ఇనపచ్య. దావలో పండుకున్నె కుక్క పిల్లను తాయ్..అని అదిలిచ్చా దొడ్లోకి రాబట్య. ఇంగ తప్పదు, ఎట్లోగట్ల సెయ్యాల అనుకోని గిత్త మోర కాడికి పోతి. గాటికి ఆనుకుని ఆన్నే కూకోని, ‘ఇదొక్కరోజేలే న్నా…ఎట్నోకట్లఅని కండ్ల కింద పిసురు దీసి రోంతట్ల ఏల్లతో గీరితి. మోరను సంకలో బేసుకుని సుతారంగా సాదితి. దాని మెడకింద గంగడోలును సేత్తో నిమిరితి. మళ్లా తిరిగి దాని కండ్లల్లోకి జూచ్చి. దాని కనుగుడ్డు సుట్టు తడిపొర కమ్ముకోనుండటం జూసి తట్టుకోల్యాక దాని మూతికాడ సెయ్యి పెడ్తి. అది నాలుకతో నా సెయ్యిని నాకె పరపరమని, దానికట్ల మరిపింటిని నేను. అదట్ల నాకుతాంటే నాకదో సంబరం.

మళ్లా పొద్దు పొడుచ్చాదని మతికొచ్చి ఆన్నుంచి లేసి గిత్తకు ఇటుపక్కకొచ్చి బొడ్డు కాడ కాలు తాకిచ్చి అయ్లేన్నా…అని అదిలిచ్చి. అంతే ఒక్క ఉదుటున గిత్త లేస్య. సచ్చి బతికినోని మాదిరి గట్టిగా ఊపిరి పీల్చుకుంటి. గిత్త ఎనిక్కి పొయ్యి తోకనట్ల గుంజితి. అది నీలిగినట్లు ఒల్లిర్సుకోని గంజుపోసి ప్యాడ పెట్య. ఇంట్లోకి పొయ్ తవుడు గిన్నె, మాయమ్మ ఆపొద్దకు ఉడికేసిన పుటికె మేపు తీసకచ్చి బకెట్లో బేసి, దానికి రోన్ని నీళ్లు కలిపి గిత్తకాన్నే కూకోని బకెట్లో నా సెయ్యేసి కలుపుతా మట్టసంగ తాపితి. మళ్లా గాట్లో రోంత మేపేసి నేను మా ఎదురింటి వెంకట్నారాడ్డి పెదనాయన్ను లేపను పోతి. ఆ పొద్దు కట్టెబండికి వచ్చే మనిసి ఆ పెదనాయనే. ఆ పెదనాయన అప్పటికే లేసిండ్య. నన్ను జూసి వచ్చనా పా బ్బీ…’ అనె దండెంపై టవల తీసుకుంట .

కాడి కట్టుకుని సేన్దావ పడ్తిమి నేను , మా నాయన , వెంకట్నారాడ్డి పెదనాయన. నేను నగల్లో కూచ్చోని ఎద్దల్ను తోల్తనా. గోటూరి గిత్త పక్కనే సారికి సూసుకుంటా ఈ రోజొక్క రోజేలే…ఎట్నోకట్ల…పరువు నిలబెట్టాల…మొండికెయ్యాకు….ఏం జేచ్చాంమల్ల,వల్ల ల్యాకనేఅట్లా లోలోపల్నే దాన్ని సముదాయిచ్చా. బండ్లో కూచ్చున్య మా నాయన , పెదనాయన ఏవో మాటలు పెట్టుకుండ్య గానీ నా మనసంతా మా గోటూరు గిత్త పైనే వాల్తాంది. ఆ గిత్త మరుపులే నా మెదడును ఉండ జేసికుని నెమరెయ్య బట్నాయి.

నేను 8 తరగతిలో ఉన్నెప్పుడు అది మా గడపన అడుగుపెట్టినప్పుడు  దాన్ని సూసిండాల. తక్య ఏమున్యాదిలే అది. గుండ్రాయి మాదిరి నున్నగ దాని పై మీద ఈగ వాల్న్యా జారిపోతాదా అన్యట్లు బలే సతవున్యాది గిత్త. బండిని యాడ పెట్న్యా ఎనిక్కి సల్లోకోకుండా పెరక్కచ్చన్యాది.

నాకప్పుడు ఎద్దులన్యా , ఎనుములన్యా,  మ్యాకలన్యా కోల్లన్యా బలే ఇష్టంగా ఉండ్య. మంచులకంటే అయ్యే మంచియని నాకు దాంట్లపై బో గురుండ్య. ఎద్దల గాట్లో పొట్టు పోయడం, ఎనమల్ను మేపకరాడం, దాంట్లకు మడుగులో పైగడగటం, యా సేనికాడికి పొయ్నా పొట్టెల్లను మ్యాకల్ను నా తోకమాదిరి కరిపిచ్చక పోడం, దాంట్లకు ఆకు అలుం పెరికి సేత్తో మురిపెంగా తినిపియ్యడం, మాయ్టాలయ్యాలకు కోల్లకు గింజలెయ్యడం అయ్యి ఒడగడానికి గంపలు వారగియ్యడం ఇయ్యన్నీ నా వ్యాపకమై పోయిండ్య .

ఎప్పుడెప్పుడు బడి ఎగ్గొట్టి ఎనమలమ్మడి పొదామా, వంకల్లో వాగుల్లో పడి పొల్లాడ్దామా, యాడాడి మడుగుల్లో ఉండే శాపలు, ఎండ్రకాయలు పడ్దామా, ఎద్దలమ్మడి పొయ్ మా నాయన సేద్యం జేచ్చాంటే గొర్రు మిందనో, గుంటకమిందనో ఎక్కి కూచ్చుందామా అనే యావదప్ప, సదువు సందెల మీద ద్యాసే ల్యాకుండ ఉండ్య. అందుకే మా బజార్లో  నాకు మొరటోడని, బల్లో సింత మొద్దని కిరీటం పెట్టి నన్ను బలె అవ్లెయ జేచ్చాండ్య.

అట్లాంటి సింతమొద్దు గాడు గూడా ఒకతూరి మా బడికి అక్కరబడ్య. అప్పుడు నేను పదిలో ఉంటి. ఆ సమ్మచ్చరం మా బల్లో స్కూల్ డేజరపాలని అనుకుంటిరి. గ్రౌండులో ఆటల పోటీలకని సదును జేసి వంకలో నుంచి ఇసిక్య తోలాలనుకుంటిరి. ఎద్దులు ఎవ్రెవరికుండాయో అని మా లెక్కల సారు లెక్కదియ్యబట్య. నా జతగాళ్లంతా నా తిక్కు జూచ్చిరి.  ఇంగేముంది, సింతమొద్దు గాడు బండి కట్టడం ఖాయంమైపాయ.

ఆ పొద్దు జూడాల, బెల్లం సుట్టూ ఈగలు మూగినట్లు మా క్లాసులో పిల్లగాల్లంతా నా సుట్టూ మూగి, నేనొచ్చానంటే నేనొచ్చానంట నా యెంట పడ్య. నేను ఆ ఒక్క దినానికైనా పెద్ద హీరో మాదిరి బో జమ్మంబోతి. పరిచ్చల్లో ఎవరు సూపిచ్చారో వాళ్లను తడవకింత మందినని ఖరారు జేచ్చి.

అప్పుడు మా యింట్లో గోటూరు గిత్త మాంచి ప్రాయంలో ఉండ్య. దాని జతకు సిన్నెద్దు ఉండ్య . రామ లచ్చమనుల మాదిరి ఆ రెంటికీ జోడి బలె కుదిరిండ్య. బండికైనా, సేద్యానికైనా సెయ్యి తగల్నీకుండ జింకల మాదిరి నడుచ్చాండ్య. ఇంటికాడ మా నాయన నాకు బండి కట్టిచ్చి బద్రమబ్బి, మెల్లెంగ పొండిఅన్జెప్య. నా సవాసగాళ్లంతా బండ్లో కూకుండ్య. నేను నగల్లో పగ్గాలు పట్టుకుని కూకుంటి. తక్కె అయ్యి నడుచ్చాంటే సూడు, దాంట్ల మోరలకుండే సిలిమార్లు గల్లుగల్లు మంటాంటే, మా ఊరి రాంచోం దేవలం కాడ సెక్క బజన జేసేటప్పుడు జెజ్జనక తొక్కినట్లుండ్య దావంతా.

వంకలో ఇసిక్య పోసుకుని బడితట్టు బండి కదిల్య. బడికాడ మా సార్లంతా బయట వరండాలో ఉండ్య. మా బండి రాక జూసి గ్రౌండు లోకి వచ్చిరి. వాళ్లు యాడ ఇసిక్య కావాలంటిరో ఎద్దల్ను వాటంగా అదిలిచ్చి ఇసిక్య సరిగ్గా ఆన్నే పడేట్లు నిలిపబడ్తి. మా బడిపిల్లోల్ల ముందర్నే మా లెక్కల సారుండి ఎప్పుడు నేర్సుకున్యావ్ రా ఈ విద్యఅని నోరెల్లబెట్య . మల్లా సారే మా గోటూరు గిత్తపక్క రెప్పార్పకుండా జూచ్చా యా ఊర్లో పట్టకచ్చినారు?’ అన్య. పులిందల కాడ గోటూర్లో సార్ . మా మామ పట్టిచ్చినాడుఅంటి. య్యాయ్ బలుంది, పీటె బిగిచ్చినట్లుఅన్య. అప్పుడ్నాకు బండి మీద నుంచి ఒక్కసారిగా కొండెక్కినట్లు అనిపిచ్చ. అట్ల నాలగైదు తడవల ఇసిక్య తోల్తిమి పిల్లగాల్లమే. ఆ పొద్దు నుంచి సింతమొద్దు నుంచి నా పేరు సేద్యగాడాయ. బల్లో నన్ను సీటికి మాటికి కసురుకోడం తగ్గిపాయ. నాకు బడికి బాగ పొవ్వాలనే బుద్దిపుట్య. దాంతో రెండు అచ్చరాలు మనసునబడ్డం మొదలాయ.  

అట్లా నాకు మా బల్లో మంచి పేరు తెచ్చిన పుణ్యమంతా మా గోటూరు గిత్తదే. అప్పట్నుంచి ఆ గిత్తంటే నేను పానమిడుచ్చాంటి. దాని మీద ఈగ కూడా వాలకుండా సూసుకుంటాంటి. ఎనమలకు మాయమ్మ ఏం సథవేచ్చే ఎద్దలకూ అదే బెయ్యాలని మంకు పట్టు పడ్తాంటి. మా నాయన్తో కొట్లాడి ఎద్దలకు సెక్కో, తవుడో నీళ్ల మీదికి ఏదో ఒకటి ఉండేట్లు సూచ్చాంటి. వామికాడ పొట్టులో వరిగడ్డి, సెనిక్కాయ కట్టె, ఎండిన నాము, కందిపొట్టు అన్నీ ఈతపులితో బాగ కలిపి జొల్లకేసకచ్చాంటి.

దాని రొడ్డ డొక్క నీళ్లకని, బూసేతి డొక్క మేపుకని నాకప్పటికే అర్తమయ్యిండ్య. దానికి ఉత్తనీళ్లు ఎప్పుడే గానీ తాపిందిల్య. నీళ్ల పైకి ఎంతలేదన్న్యా తౌడన్నా ఏచ్చాంటిమి. బకిట్లో నీళ్లు పోసి సిన్న బుట్టిలో తౌడేసి సేత్తో కలగిచ్చి తాపుతాంటి. నీళ్లన్నీ తాగినాక నా సెయ్యి పెడ్తే నాలికతో పర్రు పర్రున నాకుతాండ్య. అట్లా దానికీ నాకూ సావాసం బలె కుదిరిండ్య. అవతల ఎంత పనున్యా గానీ సేద్యానికి పొయ్యొచ్చిన  ఎద్దల్ను పై కడక్కుండా ఇంట్లో కట్టేసింది ల్యా. బాయిబండల కాడ కట్టేసి టెంకాయ పీసుకు రోంత గుడ్డల సబ్బు పట్టిచ్చి దాని పై బలే తోముతాంటి. యాన్నే గానీ ప్యాడనేదే ల్యాకుండా తెల్లగ బలె మట్టంగ పెడ్తాంటి. సాల్రాబ్బి…ఇట్లాంటెద్దల్ను గాటిన సూసుకుంటాంటే కడుపు నిండినట్లుంటాదనిఅనుకుంటా బలె మురిసిపోతాంటి . మళ్ల మూడేండ్లకు మా సిన్నెద్దును మార్సి దాని జతకు ఇప్పుడుండే కోడెను పట్టకచ్చిమి. అప్పుడు మా పరిస్థితి ఇప్పుడంత అద్వాన్నంగా ల్యాకపాయ.

బండి తోట గట్టుకు సేర్య. తూర్పున పొద్దు పొడుచ్చాంది. మా నాయనుండి అటు మారునుంచి ఏసకచ్చాం పా బ్బీ అన్య. నేను ఎద్దల్ను కదిలిచ్చి. పెదనాయన లేసి మోరమానుకు నాట్లు పెట్య. ఇటు మూడు సాల్లు అటు మూడు సాల్లు పెట్టి బండిని నడుం జేసి నిలబెట్టి నేను, మా నాయన బండి దిగితిమి. వెంకట్నారాడ్డి పెదనాయన తోపేసి మంచైదాన బండ్లోనే ఉండ్య. నేను మా నాయన ఓదెలు ఎగెయ్యబడ్తిమి.

నిన్నటి కొదవ పెరికి కూబెట్టడానికి వచ్చిన కూలోల్లు ఎగాసగా పడి మునం పట్టేసరికి బండికి సుమారుగా ఎగేచ్చిమి.న్నా..బండికి రోంత అనకవగానే బెయ్ న్నా, ఒక తడవ ఎక్కువైతే కానీలె, తిరుగుదాం ఇబ్బందిల్యాఅన్జెప్య మా నాయన. .

సేను ఇంగా ఆరల్య. బండ్లో కట్టె పడేకొద్దీ గాన్లు నల్చుకుని ఎద్దలకు బాగ తూకమైతాంది. గిట్టలు గూడా ఒక్కరవ్వ దిగబడ్తనాయి. అట్లనే ఎట్లనోకట్ల నిబ్బరంగా కట్టెబేసి  మళ్లా ఎక్కువైతే గిత్త ఇబ్బంది పడ్తాదిలే అన్జెప్పి తోపుకు మోకులేసి , బిల్ల సెరుగేసి బిగిచ్చినాము.

వెంకట్నారాడ్డి పెదనాయన వాటమైన సేద్యగాడు . ఎద్దలకు తూకం గాకుండా బాగ సూసుకోని బండి నేర్పుగా తోల్తాడు. అందుకే ఆ పెదనాయననే నగల్లో కూకోమని, నేను మా నాయన బండి ముందరొకరం ఎనకలొకరం నడుజ్జామని అనుకుంటిమి. అనుకున్నెట్లె పెదనాయన నగల్లో కూచ్చోని బండి తోలబట్య. బండి శానా తూకంగా ఉన్నెట్లుంది. అటుపక్క కోడెకేం గాలె గానీ గోటూరు గిత్తే రోంత కాలు తడబడ్తన్నెట్లు బరువుగా నడుచ్చాంది. ఎంతకైనా మంచిదే అని పెదనాయన ఎద్దల్ను రోంతసేపట్ల ఆనిచ్చి ఉసిబోసుకున్యాక మళ్ల ఎగదోల్తా నడిపిచ్చనాడు.  

గట్టు దాటి దావన పడ్తే ఇంత ఇబ్బందుడదులేఅనె మా నాయన. ఆ…ఈ ఒక్కరవ్వే లే. నీళ్లు పారిన న్యాలైందాన ఇంగా నెమ్ముండి నల్చుకుంటాంది. దావన పడ్తే మళ్లింత ఉరకుండదులేఅన్య పెదనాయన.

గట్టు ఇంగో పదిపదైదు బారలుండ్య. ఎద్దల్ను మళ్లా ఆనిచ్చినాడు. అప్పటికే ఎద్దులు బుస గొడ్తనాయి. రోంత బుసిర్సినాక మళ్లా ఎద్దల్ను అదిలిచ్చ. రెండడుగులేసి టక్కున నిల్చిపాయ గోటూరు గిత్త .ఠ్ఠ…అయ్అని రిక్కేసి మళ్లా ఎగదోల్య దాన్ని. రోంతట్ల ఎనిక్కి జరిగి కాడిమానును మళ్లా తగిల్య. ఊహూ బండి కదల్య. నేను ఎనక నుంచి గోటూరు గిత్త పక్కకు వచ్చి. మా నాయన కాడి ముందరికి వచ్చి దాని మొగదాడు పట్టుకుని ముందుకు గుంజినట్లు అన్య. పెదనాయన దాన్ని

మళ్లా ఎగదోల్య. అదేమో ఇగ్గాలని శతవిధాల పోరాడ్తాంది గానీ దాని శక్తి సాల్య. అటుపక్క కూలోల్లు నిలబడి మా తట్టు సూడబడ్తిరి.ఈ ఎగదోల్డం దిగదోల్డంలోనే

గాను ఇంగా రోంత నల్చుకుండ్య. మా నాయనుండి ‘ అన్నా రోంత కట్టె తీజ్జామా’ అన్య. దానికి పెదనాయనుండి నువ్వొకసారి సూడు ఇంటి మంచి తోల్తే ఏమన్నా కదుల్తాదేమో ‘ అని నగల్లో నుంచి దిగ్య. మా నాయ్న నగలెక్కినా లాభం ల్యాకపాయ. తోలే కొద్ది గిత్త అసలే కదలకుండా మొండికెయ్యబట్య. మా నాయనకు కోపమొచ్చ. దాన్ని బెత్తుపెడ్దామని శాలకాల పైకెత్తె. ‘నాయ్నా… కొట్టాకు నాయ్నా దాన్ని’ అని నేను అరిచ్చి. ‘దాని మీద ఏటు పడనందే నీకు నొప్పిచ్చాది ముందు’ అన్య నా తట్టు ఉరిమురిమురిమి జూచ్చా. అట్లనెనే గానీ మా నాయన దాన్నెప్పుడూ కొట్టిందిల్యా.

నేన్దోల్తా తీ…’ అని బండికాడికి పోతి. ఆ…మేం తోల్తే కదలంది నీగ్గదుల్తాదిల్యా, మొండికేసిందిఅన్య. మా నాయనుండి.

నేనుండి మీరు తోల్తిరి గదా. నన్ను తోలనీండి. నేను తోలి జూచ్చా ఒకతూరి. పగ్గాలు ఇట్లియ్యండిఅంటా గిత్త మోరకాడికి పోతి.

కాదులేబ్బీ…పనికి రెండు పనులు సెయ్యాకు. అది ముందే బక్కపానం. మొండికేచ్చే మళ్ల మొదటికే మోసమొచ్చాది. ఎంతసేపులే , రోంత కట్టె తీసి మళ్లా ఎగేచ్చాంలే బండిని దావలో పెట్టిఅన్య.

రోంతసేపు ఉండు నాయన. అది బుసన్నా తీర్సుకోనిఅని నేను గిత్త సిక్యాన్ని తీచ్చి. రెండు మండలు సెనిక్కాయ కట్టె సేత పట్టుకోని దాని నోటికి అందిచ్చి. దాని కండ్లకు పిసుర్లు తీచ్చి. సెవుల సందున పిరుదులు జూచ్చి. దాని మెడమీద ఒక సెయ్యేసి ఇంగో సేత్తో దాని మెడకింది గంగడోలును బాగ నిమిరితి. సెండును తట్టడిచ్చి. అది లోన పడకుండా గిత్తను కోపుకు తోలి కాడిమానుకు ఎలి సిల్ల బేసి పట్టెడ పెడ్తి. అటుపక్క కోడెను లోపలేసి లోసిల్ల పెడ్తి బయటికి పోకుండా. అయ్యన్నీ జూసి యా పుట్టలో యా పాముందోలే అని మా నాయన గమ్ముగాయ.

నేను గట్టుకాడికి పొయ్ రోంత తంగెడాకు , జిల్లెడ మండలు పెరక్కచ్చి గాండ్ల కింద తొక్కిచ్చి, నల్చుకోకుండా.

మా నాయన్ను అటుపక్క కోడెను మొగదాడు పట్టుకోమంటి.  పెదనాయ్న ఉండి నేను గోటూరు గిత్తకు ముందు పక్క నడుచ్చాలేఅన్య.

నేను మళ్లా గోటూరు గిత్త పక్క పొయ్ నడ్డిన సెయ్యేసి బాగ నిమిరితి. పగ్గాలు ఒడిసి పట్టుకుని ఎద్దల సందు నుంచే నగల్లోకి మెల్లెగ ఎక్కితి. నగల్లో లుంగీ సరిజేసికుని వాటంగా కూచ్చోని వలపట పక్క కోడేను బిర్రుగా పట్టుకోని గోటూరు గిత్త పగ్గం వదులుగా ఇర్సి

అయ్ పారన్నా…ఠ్ఠ…’ అని రిక్కేలి గిత్త బొడ్డుకింద కాలేసి, నడ్డి మీద సెయ్యేసి సైగజేసి అదిలిచ్చి.

తక్కె , యాడున్యాదో దానికి శక్తిగానీ అట్ల నేను అదిలిచ్చానే గోటూరు గిత్త బిసకొద్దీ కాడిమానుకేసి ఊంచి తగిల్య. అంతే నగలు కిర్రుమంటా గాన్లు సర్రున కదిల్య. అహా..పారన్నా…పా…’ అంటి అదే ఊపులో గిత్తను ఎగదోల్తా. అంతే ఒక్క ఊపులో బండి దావలో పడ్య. అబ్బీ సీకాంతు నువ్వే తోలుబ్బీ ఎద్దల్నుఅన్య పెదనాయన. సరే పెదనాయన అంటి’ . యాన్నే గానీ తూకం పడకుండా తోటలో కట్టెంతా వంగ గొడ్తిమి మాయ్టాలకంతా. మళ్ల యాన్నే గాని గిత్త మొండికేసింటే ఒట్టుండాది.

మాయ్టాల బండిర్సాలకు మాయమ్మ ఉడుకు నీళ్ల కాంచి పెట్టిండ్య. మా నాయన  వలపటెద్దుకు పై కడుగుతాంటే నేను మా గోటూరు గిత్తకు కడుగుతాంటి. దాని మెడమీద ఒక సెయ్యేసి ఇంగో సేత్తో  గంగడోలు రుద్దతాంటి. అప్పుడు నేను ఉత్తపైనుంటి. అప్పుడు దానికి ఏమనిపిచ్చెనో ఏమో అది నా పక్క మోరతిప్పి నా ఈపును నాకబట్య. నాకు బలె సక్కిలిగిలేస్య. తట్టుకోల్యాక దాని మెడని అట్లనే గట్టిగ వాటేసుకుంటి. అది నన్ను పర్రు పర్రుమని నాలికెతో నాకడం మాత్రం ఇర్సిపెట్టల్య,   నాగ్గూడా దాని మెడను ఎప్పటికీ ఇర్సి పెట్టబుద్ది కాల్య. ఎందుకోమడి!

సొదుం శ్రీకాంత్

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

4 comments

 • దాని మెడనే కాదు దాని గ్న్యాపకాలను మరువలే! గ్రామ జీవనాన్ని చిత్రించే మీ అనుభవాలు మాకు మా గ్రామాన్ని గురుతుకు తెస్తున్నై !

 • శానా బావున్నాయి అన్నా , పిల్లప్పటి జ్ఞాపకాలు.

 • అద్భుతమైన నేరేషన్ అన్న…
  త్రిపురనేని గోపిచంద్ గారి అర్రుకడిగిన ఎద్దు గుర్తొచ్చింది…
  అయితే అది వేరే కథ…
  ఇది మనకత…
  పన్లో పడి సదవలేకపోతి…
  నిన్న మనింట్లో కోడెదూడ సచ్చిపోయిందని నాయిన సెప్పగానే….ఎద్దు అనగానే…
  హఠాత్తుగా కథ గుర్తొచ్చింది…
  ఇప్పుడే సదివాను…
  చాలా బాగుంది…అన్న

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.