జాతి మూలాల్ని గెలిపిస్తుందీ కవిత్వం

అసలీ పుస్తకానికి “అయినా నిలబడతాను” అని పేరు పెట్టాల్సిందేమో. అంత శిఖరాయమానంగా ఉందా కవిత. “రుచించనప్పుడు ఓ గెలుపు అదృష్టమే అవుతుంది. గెలవడం ఇష్టంలేకపోతే చెప్పు….ఇకముందు ఓడిపోవడానికి ప్రయత్నిస్తాను” అన్న వాక్యాలు మంచు గడ్డల్ని అరచేతులతో పట్టుకున్నట్టు అనిపించాయి. చల్లదనం కాల్చదా ? ఎలా కాల్చగలదో ఈపుస్తకంలోని కవితలు చదివితే తెలుస్తుంది. ఎం తెలుస్తుంది ? నిప్పు గురించా ? నిప్పులాంటి మంచు గురించా ? నిప్పూ మంచూ ఒకేసారి అనుభూతిలోకి రావడం ఒకసారి ఊహించాలి. అయితే “మూలాల్ని తడుముకుంటూ” అని టైటిల్ పెట్టాడు కవి. ఏంటి తేడా ? ఏమీ లేదు. అతను “అయినా” అని వాడిన ఒక్క పదానికి, “మూలాల్ని” అని వాడిన మరొక్క పదానికి ఎంత లంకె వేశాడో లోపల కవితల్ని చదువుతుంటే తెలిసింది. ఈ పుస్తకం ఆత్మ మూల ప్రస్తావన. ఏం మూలం ? అదెక్కడుంది ? పంతులోరి పంచాంగంలోనో,మను చరిత్ర పుస్తకంలోనో కదూ మన మూలాలుంది. “మన” అంటే అందరిదీ అనేగా అర్ధం ? మరి కవేంటి “నాట్లేసే దగ్గరో… కోత కోసే దగ్గరో పంపు షెడ్డు అడ్డంలో దొరగారు అలగాపిల్లతో కలగాపులగమైనపుడు గుర్తుకురాని పెద్దరికం పడుచుదనం పొలిమేరంచున దొరకూతురు ఏ మల్లిగాడితోనో ఎల్లిగాడితోనో ప్రేమ దిమ్మరించుకుంటున్నపుడు… “(ముందుమాట ) అని అంటాడు. ఎవరీ దొరగారు? మల్లిగాడు ? ఎల్లిగాడు ? దొరకూతురెవరు ? ఇన్ని అనుమానాల మధ్య ఈ కవి వెతుకుతున్న మూలాల్లో స్పష్టమైన కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి ఏళ్ళ తరబడి మనిషిని అణగద్రొక్కి, హింసించి, ఏడిపించి, వెక్కిరించి జీవితాల్ని నానా యాగీ చేసిన వైనాన్ని కళ్ళ ముందు నిలబెడుతున్నాయి. అవును కవి వెతుకుతున్న మూలాలన్నీ అసమానతల మధ్య ఒంటరిగా నిలబడ్డ ఒక మనిషివి. “మీకులా కంచాలు మా మంచాల మీదకి నడచి రావు, మీ తాతలకి  మల్లె మా తాతలు బతకనేర్చినోళ్ళు కారు” అన్నప్పుడో “మీ లోకాలకి పూల వాసనలద్దుకుని మా వంటికి పేద కంపు పుల్మబడ్డప్పుడు  పెత్తనం బుసలు కొట్టే దగ్గర మా పౌరుషం కన్నెర్రజేయకపోదు..మీవెటకారం మట్టికొట్టుకుపోను.. (కొత్త సన్నివేశం) అని శాపనార్ధలు పెడతాడు.ఇప్పుడర్ధం కాలేదా ? కవి వెతుకుతున్న మూలాలు ?

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం నీరుగార్చే సంఘటన జరిగినపుడు ఎలుగెత్తిన గొంతులోంచి వచ్చిందీ కవిత. ఈ పుస్తకం లోని కవిత్వమొత్తం సమాజమ్మీద కవి చూపించిన కోపంగానే భావించాలి. ఎందుకంత కోపం ? వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలుగా భావించి రాజ్యం కొన్ని ప్రత్యేక అవకాశాల్ని కల్పించాక కూడా ఇంకా ఇంత ఆక్రోశమెందుకు బయటపెడుతున్నాడు. ఎంత మంది కలెక్టర్లు ? ఎంతమంది డాక్టర్లు ? ఇంకెంత మంది ఎంతెంత పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు ? అయినా కవి “నవ్వు ఏడుపయ్యే దాకా సాగే వెతుకులాటలో సాధించిన విజయం ఎప్పటికీ కనపడదు” (మనిషితనం) అని తేల్చేస్తాడు. అవును. బంగార్రాజు మనసంతా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడచినా ఇంకా ఒక మనిషిని ఇంకొక సాటి మనిషి చూస్తున్న తేడా చూపు, తాకుతున్న అసహజ స్పర్శ, నకిలీ నవ్వు గురించి అతను విస్పష్టంగా చెప్తున్నాడు. ఆడవాళ్ళ మీద జరిగే అఘాయిత్యాలకి స్పందించి”మీటూ” ఉద్యమానికి మద్దతుగా “బరితెగింపుగా చిత్రించబడుతున్న సామాజిక ముఖ చిత్రం మీద బాధల పరంపరగా పల్చటి మొహమాట తెరల్ని చించుతూ ఆమె పెదవి విప్పుతుంది. ముసుగు కప్పుకున్న భూమి భూమంతా ఇప్పుడు బీటలు వారుతుంది” (ఆమె పెదవి విప్పుతుంది) అని ధైర్య ప్రకటన చేస్తాడు. అతని మనసులో ఎడతెగని బాధ ఉంది.అది అక్షరంగా మారుతున్న సందర్భంలో పోలికలు భాషని సాయం కోరతాయి గానీ, అసలా వాక్యాల్లో అతని దుఖ్ఖమే మొత్తంగా మనల్ని నిశ్శబ్దంలోకి తోసేస్తుంది.

కరుణానిధి గురించి, ఏషియన్ గేమ్స్ లో గెల్చిన స్వప్నా బర్మన్ గురించి, నిపా వైరస్ కి గురై ప్రాణం కోల్పోయిన కేరళా నర్స్ లినీ గురించీ రాసిన కవితలు మనసుని తడిపేస్తాయి.ఎవరైనా మనుషులు మనల్ని కదిలించినపుడు, వాళ్ళ మాయలో మన ఊహలు కవితాంశాలుగా మారడం ఎంత సహజమో, అది తప్పించుకోలేకపోయిన తనం ఈ కవిలోనూ కనిపిస్తుంది. “మిత్తువ చుట్టుముడుతుందని తెలిసీ సేవకు సత్తువ నింపడం నిన్ను చూసే నేర్చుకోవాలి (చావు సరిహద్దు మీద)” అని రాసి మనల్ని ఏడిపిస్తాడు. కవి చూపు నిశితమైన జీవిత గమనం మీద ఎన్ని రకాలుగానో ఈ పుస్తకంలో ప్రతిఫలిస్తుందో చెప్పడం కష్టం. కళ్ళు లేని యాచకుడ్ని చూసి “అతని చేతి మైకు ఊతకర్ర, దేహ గాత్రం జీవగర్ర(కనులు పాటలు పాడేననీ) ” అంటాడు.” మరువం దవనం పువ్వులతో కలిపి కట్టి జీవిత సుఖదుఃఖ సారాన్ని గాలి దేహానికి సూదిమందులా గుచ్చి సమాజాన్ని  స్వస్థ పరుస్తాడు” (పూల రంగడు) అని పూలమ్మే వాణ్ణి చూసి రాస్తాడు. ఎవ్వర్నీ అతని కవితల కళ్ళు ఎవ్వర్నీ తాకకుండా ఉండవు. కర్రీ పాయింట్,  లగేజీ బాగ్, వీకెండ్ , సెల్ మోహనరాగం లాంటి కవితల్లో అతని వస్తు  సంగ్రహ శక్తి మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. “కాదేదీ కవిత కనర్హం” లైన్లు గుర్తొస్తాయి. అతని అభివ్యక్తిని తలచుకుని నవ్వొస్తుంది కూడా. కవిని ఆపతరం ఎవరితరమూ కాదు. కానీ  సబ్జెక్టుల ఎంపిక, వాటి నిర్వహణ లోనే కవి చాక చక్యత చాలా వరకూ మనకి తెలుస్తుంది. అవి సరిగా లేనప్పుడు పేజీలు తిప్పేస్తామంతే కదా ! కానీ “తండ్రీకొడుకులు మార్చి మార్చి మీద పడుతుంటే భీతావహ క్షణాలలో దేవుడి కోసం అలమటించాను” (గాడ్స్ డెత్ సర్టిఫికేట్) లాంటి కవితలున్న పేజీల్నుంచి మనస్సుని దారి మళ్ళించడం కష్టమే నేమో!

ఈ కవిత్వంలో జీవన పార్శ్వాల్ని తడిమిన సందర్భం మరొక చోట “సైజ్ జీరో” అన్న కవితలో చాలా బాగా ఆకట్టుకుంటుంది. “రెండు కాన్పులు దాటిన విజయోత్సవంలో… ఒకానొకతాళి బంధం కోసం….మరో పేగు బంధం కోసం… శృంఖలాలు అక్కర్లేని దాస్యంలో దర్జాగా దేకేస్తున్నాను” అని ఒక నిస్సహాయ స్వరాన్ని బలంగా వినిపిస్తాడు. “ప్రతీ పరగడుపున మింగుతున్న థైరోనార్మ్ ఫిఫ్టీ ఎంజీ సాక్షిగా నేనిప్పుడు సైజ్ జీరోని కలగంటున్నాను” అనేస్తాడు. హృదయం ఏంతో విల విల్లాడిపోతుంది. ఊపిరి క్కూడా ఏదో అడ్డుపడుతుంది.అలాంటిదే “థర్డ్ జండర్” కవిత. ఎంత చక్కగా రాస్తాడో కదా. “సందు చివర సగం వెలుగులో బతుకు రెక్కలిప్పే వింత సీతాకోక…. అచ్చు నీ లాగే నవ్వుతూ… నీ లాగే ఏడుస్తూ నీలాగే కదులుతూ… నీలాగే కాలుతూ తడవ తడవకీ నీలాంటి మనిషినేనని రుజువుచేస్తుంటే” అని అన్నీ బావున్న మనిషిని ఆర్తిగా నిలదీస్తాడు. మనలోని మానవత్వం కళ్ళు తెరవకుండాఊరుకోదు. అమ్మే ఆత్మ కధ, వాల్ ఆఫ్ కైండ్నెస్ కవితలు ఒక భరోసాగా సాగుతాయి.

బంగార్రాజు వృత్తిరీత్యా ఎక్సయిజు అధికారి. పోలీసు తనం వాసన ఉన్న ఉద్యోగం. చాలా బాసిజం ఉండే పోస్టు. అయినా కూడా బాసిజం మీద, సర్కారీ ఉద్యోగమ్మీద అతని కవిత్వం చదువుతుంటే అతను చూపిన తెగువ బాగుంటుంది. అతన్ని నమ్మాలనిపిస్తుంది. కవి సాధించేది పాఠకుల నమ్మకాన్నే కదా ? ఏకంగా “ఎన్ని జన్మల పాపమో ఇపుడు సర్కారీకొలువు రాచపుండై దహిస్తుంది” (ఎనీమియా దేహాలు) అలాగే “యస్ బాస్” కవితలో “నిధుల కోతో నీతి డొల్లో ఏదైతే నీకెందుకు

సిసిఏ రూల్స్ సాక్షిగా అంతా సాధ్యమే” అంటాడు… “అక్కడ అడుగులకు మడుగులొత్తకపోతే నెగ్లిజన్స్ ఆఫ్ డ్యూటీస్ కిందో, ఏ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కిందో సచ్చీలతని నిలువ కోతకోసి” అంటాడు. ఇవన్నీ అతను పనిజేసే డిపార్టుమెంటు లోని కధలుగానే భావించాలి. అలా చెప్పినందుకు అభినందించాలి కూడా. కవి పుస్తకం మొత్తం అన్ని రకాలైన కవితలతో మనకి విందు భోజనం పెడతాడు. ఒక సంతృప్తి కలుగుతుంది. కవి ఎంత బాధ్యతగా కవిత్వాన్ని సృజించాలో ఇతన్ని చూసి మరోసారి నేర్చుకోవాలనిపిస్తుంది. అంత గొప్పగా ఉంటాయి ఇతని సబ్జెక్టుల్లోని ఎక్స్ప్రెషన్స్. అయితే నిర్మాణ కౌశలం ఎప్పటి నుండో పరిచయమైనదిగా  ఉంటుంది. అతను తలుచుకుంటే రూపాన్ని ఇంకాస్త కొత్తగా ప్రెసెంట్ చేయడం అసాధ్యం కానే కాదు. భాషలో లేటెస్ట్ పదాలు, సాంప్రదాయ భావ చిత్రాలూ కలగలసి ఉంటాయి. సొబగ్గానే  ఉంటుంది. అలెక్జాండర్ ముఖచిత్రం ఒక నిఖార్సైన భావాన్ని కలిగి, కవిత్వానికి బాగా అతుకుతుంది.

మొదట్నుంచీ చివరిదాకా ఒక్కొక్కటీ చదువుతున్నంతసేపూ, మధ్య మధ్యలో అతని బాల్య స్మృతులూ, ఊరి చెరువు ఊసులు, మిత్రుడి విషయం లాంటి పెర్సొనలైజ్డ్ కవితలు మనల్ని సీరియస్ కవితల్నుంచి కాస్త ఊపిరి తీసుకునేట్టు చేస్తాయి. ఒక గాటన గట్టి మాట్లాడలేము గానీ “ఒక్క సారి ఓడిపోయి చూడు ప్రపంచం నీకు పరిచయమవుతుంది”అన్నప్పుడు అతని మూలాల పరిశోధనలో ఒక దేశ ప్రజ అనుభవిస్తున్న బాధ ఈ కవిత్వంలో చాలా సున్నితంగా ప్రకటిస్తాడు కవి. ఇండస్ మార్టిన్ “నినదిస్తూనే ఉండు నిష్కామ సంభోగ ఉదాత్త అనుభూతుల్నో, నిష్కార్య గుణ శీల ఔదార్యాల్నో… నీ కొండెక్కిన దీపాన్ని ఎత్తి చూపే కాగడా పట్టిన చెయ్యొకటి నా వెన్నును నిమరకా పోదు” అని చేసిన భవిష్యద్దర్శనం చప్పున కళ్ళముందు కనిపిస్తుంది. అవున్నిజమే మిగతా ముందు మాటల్నేమీ అనలేము  గానీ లక్ష్మీ నరసయ్య గారన్నట్టు “ఇది మూలాల నుంచి సగర్వంగామొలిచిన కవిత్వం”. బంగార్రాజు కవిత్వం మేలిమి బంగారం లాంటిది. నూటికి నూరుపాళ్ళూ ఇది నిజం.

(ఈ పుస్తకం కావాలంటే 8500350464, 92464 15150 నంబర్లకి చేసి వివరాలు పొందవచ్చు. దీన్ని నవ్యాంధ్ర రచయతల సంఘం వారు ప్రచురించారు)

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. ప్రస్తుతం బ్యాంకు వుద్యోగి గా రాజమండ్రిలో వుంటున్నారు. కవిత్వం కథలు చదవడం ఇష్టం. అడపాదడపా కవిత్వం రాస్తుంటారు. తమ కవితకు డాక్టర్ రాధేయ ఉత్తమ కవితా పురస్కారం పొందారు. ఇటీవల, మరో కవిత అమెరికా 'నాట్స్' బహుమతి గెల్చుకుంది.

3 comments

  • రస్తా సంపాదకీయం తరువాత ముందుగా ఇష్టంగా చదివేది శ్రీరామ్ సార్ మీ సమీక్ష మాత్రమే … ముఖ్యంగా ఒకరకంగా చెప్పాలంటే మీ వాడి వేడి మాటలకోసం, మీరు ఎంచుకున్న థీమ్ కోసం నావి ఇష్టమయిన ఎదురు చూపులు .. మూలాల్లోకి అర్జెంట్ గా వెళ్ళాలి ..తప్పకుండా పుస్తకం చదవాలి

  • బాగుందయ్యా రామం,నీ ప్రతీ సమీక్షా కవుల పుస్తకాల కోసం పరుగులు పెట్టేట్టు చేస్తుంది.నీ వ్యక్తీకరణ శైలి వాళ్ళ హృదయాన్ని అరచేతిలో తెచ్చి పెడుతుంది (ఏక వచనం అతి ప్రేమ కి ప్రతీక గా భావించగలరు)

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.