తెలంగాణా జనతకు జేజే

ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా, రాత్రులకు రాత్రులు ఎన్ని కోట్లు గుమ్మరించినా తమ అభీష్ఠాన్నెవరూ కొనలేరని తెలంగాణా ప్రజలు నిరూపించారు. నిర్ణయం తప్పైనా ఒప్పైనా, అది వాళ్ల కోసం వాళ్లు చేసిన నిర్ణయం. తెలంగాణా తన కోసం తాను నిలబడిన మరో సందర్భం మొన్న జరిగిన ఎన్నికలు.

ప్రజలను వాళ్ల సొంత ఆలోచన నుంచి ఎవరూ మళ్లించలేరని ఈ ఘటన రుజువు చేసింది. ఇది ప్రజాస్వామ్యానికి గొప్ప భరోసా.

ప్రజాస్వామ్యం పదిలమైతే, అన్నీ దాని వెంటే. అది ప్రలోభాల, కుయుక్తుల వరదలో కొట్టుకుపోతే, ఇంకెన్ని వున్నా, ఏమీ లేనట్టే.

చుట్టుముట్టిన శక్తులు చిన్నవి కాదు. చాల బలమైనవి. చాల ‘చాలూ’ తనం కలిగినవి. అధికార వ్యామోహం ముందు సిగ్గు ఎగ్గు ఏమీ లేనివి. నీతికి అవినీతికి మధ్య అన్ని గీతలను చెరిపేసి, ప్రజాస్వామ్య పదజాలంతోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే హీన శక్తులు. వారి ఆటలు సాగనివ్వడం కన్న, ఎంత అసంతృప్తి వున్నా, అధికార పార్టీకి మరో అవకాశమివ్వడం మేలని తెలంగాణ జనం ప్రకటించిన తీర్పు నూటికి నూరు పాళ్లు సమంజసం.

రాష్ట్ర విభజన తరువాత, కేసియార్ గారి టీఆరెస్ చేసిన వాగ్దానాలలో అతి ముఖ్యమైనవి… ఉద్యోగాలు, ఉపాధి హామీ, సొంత వనరులతో నిరంతరాయమైన విద్యుత్తు, దళితులూ, వెనుకబడిన వర్గాల ప్రాణ మానాలకు భద్రత. అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు, భూములు… ఇంకా చాలా చాలా. ఆ హామీలేవీ నెరవేరలేదు. కొలువులు ఇంకా కొట్లాటల దశలోనే వున్నాయి. పంట నష్టాలకు పరిహారం వల్ల లాభపడింది భూములున్న దొరలే. విద్యుత్తు వంటి ఒకటి రెండంశాలలో మాట నిలబెట్టుకున్నట్టు కనిపించినా (?) దానికి ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించిన మూల్యం చాల ఎక్కువని విజ్ఞుల వాక్కు. దరిమిలా ఏర్పడిన లోటు కాటు త్వరలో జన జీవితం మీద పడుతుందని వారి అంచెనా.  దళితుల మీద దాడులకు, హత్యలకు గత నాలుగేళ్ల తెలంగాణా రంగభూమి అయ్యింది. కేవలం సాయుధులైన నేరానికే శృతి, వివేక్, సాగర్ వంటి ప్రజల మనుషులు ప్రభుత్వం చేతిలో హతులయ్యారు.

టీ అరెస్ మీద ప్రజల్లో అసంతృప్తి, కోపం పెరిగిన మాట నిజం. బాహిర ప్రతీప శక్తులు దీన్ని సొంతానికి వాడుకోజూచాయి. మొదటికి మోసం చేయబోయాయి. ప్రజలకు ఛాయిస్ లేకుండా చేశాయి.

మీకు కేసీయార్‍ వొద్దా, అయితే నన్ను నెత్తిన పెట్టుకొమ్మని పాత దయ్యం ముందుకొచ్చింది. ‘మీకు హైదరాబాదు నగరం కట్టిచ్చినోన్ని నేనే తెలుసా’ అంటో గోబెల్సును తలదన్నే అబద్ధాలతో నాయుడు గోరు కాల్మోపడంతో పాలక పార్టీ మీద అసంతృప్తి కప్పడిపోయింది. తెలంగాణ ప్రజల అత్మగౌరవం అప్రమత్తమయ్యింది. ఇండియాకు స్వాతంత్ర్యం వొచ్చినా వొదలని బ్రిటీషోడిలా ‘వొదల బొమ్మాళీ’ అని నాయుడు గారొచ్చి వికటాట్ట హాసం చేసే సరికి ఆత్మాభిమానం పొంగిపొరలే తెలంగాణా సహించలేపోయింది.

తెలంగాణ వేర్పడాలని నిన్న మొన్న వుద్యమం చేసిన అదే వూళ్లలో … ‘తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది’ … అంటో పాటలు పాడి పాడి, చివరాఖర్న సొంత అల్లుడితో, కన్న బిడ్డలతో గొంతు నులిమించుకున్న ఎన్టీవోడి బొమ్మ పెట్టి ప్రచారం చేయడంతో ప్రజలకు కూటమి మీద ఏర్పడిన వైముఖ్యాన్ని గద్దర్, కోదండ్ ల గతకాలపు ఘనకీర్తి సైతం తుడిచి పెట్టలేకపోయింది.

తక్షకునితో పాటు ఇంద్రుడు యజ్ఞ జ్వాలలకు ఆహుతి కాక తప్పదని కోదండ్ వంటి మేధావు లూహించలేక పోవడం విడ్డూరం. ఏమైనాయి వీళ్ల ‘రాజకీయ శాస్త్ర’ అధ్యయనాలు, అనుభవ జ్ఞానాలూ? హస్తినలో అలాంటి నిర్ణయం జరగ్గానే, ఫోటోలకు పోజులిచ్చి.. ‘మా పాస్ట్ సంగతి మరిచి పొండి’ అని నాయుడు, రాహుల్ బుకాయించినప్పడే వీళ్లు వైదొలగి, తమ పని తాము చేసుకోవాల్సింది. ఎన్నికలంటే కేవలం ధనబలం కాదని నిరూపించడానికి ఎంత వీలయితే అంతగా ప్రయత్నించాల్సింది.

సోదాహరణంగా చెప్పాలంటే సూరేపల్లి సుజాత, జిలుకర శ్రీనివాస్ మాదిరి తాము కూడా సీరియస్ గా బరిలో నిలబడాల్సింది. మనం బతుకుతున్నది దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం, ఇందులో ప్రజాభీష్టం నేతి బీరలో నెయ్యి అని జనావళికి తెలిసి వచ్చేలా చేయాల్సింది.

ఇలా చేయడం.. ఇపుడు గాదపుడు విప్లవమనే ప్రాణాంతక అబద్ధాన్ని సుబద్ధంగా ప్రచారం చేయడానికి కాదు. కానక్కర్లేదు. ‘ఇది పుచ్చిన సంఘమే, వయసు మళ్లిన సంఘమే’నని జనులకు చెప్పి, జనస్వామ్య పద్దతుల్లోనే దీన్ని బాగుచేసుకుందామని సమీకరించాల్సింది. ఇపుడు ఓడితే రేపు గెలుపు అనే ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని విస్తరించాల్సింది.

ఎన్నికల్ని బహిష్కరించడం కాదు, ఎన్నికలతో సహా అన్ని ప్రజాస్వామిక ప్రక్రియలను శుభ్రం చేసుకునే క్రమంలోనే ‘నేటి’ పునాది మీద ‘రేపటి’ని నిర్మించగలం.

‘తుపాకి గొట్టం’ హాం ఫట్ మంత్ర దండం కాదు.

తెలంగాణా జన సమితీ, కోదండ్ ఇప్పుడెంత అంగలార్చినా ప్రజల సానుభూతిని పొందడం కష్టం. తాము శ్రమించి జనంలో సృష్టించిన కలల సౌధాలను అనాలోచిత వ్యూహాలతో, అర్థరహిత సాహచర్యాలతో తామే కుప్ప కూల్చారు. శిథిలాల నుంచి తమదైన ప్రజా బలాన్ని పునర్నిర్మించుకోడం ఇక చాల ఓపికతో, నిష్ఠతో చేయాల్సిన పని.

అధికారం సులభంగా వొస్తే అందుకుందామనే అసహిష్ణుతను వీళ్లకు ఆపాదించలేం గాని, పునర్నిర్మాణానికి ఎంత ఓపిగ్గా పని చేయాలో అంత ఓపికను వీరి నుంచి ఆశించగలమా?

వీరు వైదొలగి కొత్త శక్తులతో మరో ఉద్యమ కెరటం వుబికి వొచ్చే వరకు జనం కూడా ఓపిగ్గా ఎదురు చూడాలేమో.

వీరు ఆశ చూపిన ప్రత్యామ్నాయం తప్పక అవసరం. లేకుంటే నిరంకుశానికి కొమ్ములొస్తాయి. ఆ పని వీళ్లు చేయలేకపోతే మరెవరో చేయాలి. చేస్తారు. సమాజం దానికదే ఒక ప్రాణి, స్వయంచాలకం. తన హీరోల్ని తాను తయారు చేసుకుంటుంది. కాలానికి నప్పని వాళ్ల స్థానంలో మరింత మెరుగైన మనుషులను ముందుకు తెస్తుంది. ఆ పరిణామానికి బాట వేయడం కోదండ్ వంటి సమనస్కుల కర్తవ్యం. అంత వరకు ఒక సంక్షోభం. పటు నిరాశ.

ఇటువంటప్పుడే ఓరిమి కోల్పోయిన యువజనం…  మార్పు కోసం డెస్పరేట్ అన్వేషణలో పడుతుంటారు. ఆత్మహత్యాసదృశ చర్యలకు దిగుతుంటారు. పోరాట చొరవను సాంతం ‘లాభం’ వినా మరో యావలేని దుర్మార్గానికి అప్పజెబుతుంటారు. వేటగాడి డప్పుల చప్పుడుకు చెదిరి, వేటగాడి ముందుకే వెళ్లి నిలబడుతుంటారు.

మరో కొసన, చెడుగును ఎదిరించి ముందుకొచ్చే క్రోధాగ్నులను తమ సైద్ధాంతిక ప్రయోగాలకు రిక్రూట్ చేసుకుని, సమాజానికి సమర శీల శక్తులు లేకుండా చేసే ‘యోధులు’ యిప్పటికీ వున్నారు. ఎప్పటికీ వుంటారు. వాళ్లు శిరస్సుకెత్తిన నిజాయితీని కాదనలేం గాని, వాళ్లు చేస్తున్నది పాలకులకు పరోక్ష సహకారమే.

కంట్రోలబుల్ వైలెన్సు వల్ల జనంలో అసంతృప్తి అగ్ని వ్యర్థంగా ఖర్చైపోతుంది. అదెప్పుడూ పాలకుల మేలుకే.

లోడొల్ల రొమాంటిసిజం నుంచి తప్పుకుని, యువజనం ఎక్కడికక్కడ జన జీవితంతో కలిసిపోవాలి. నీళ్లలో చేపల్లా, దేహంలో ప్రాణంలా ప్రజల మధ్య మెలగాలి, ప్రజలకు దూరంగా కాదు.

అలనాటి ‘రెక్క విప్పిన రెవల్యూషన్’ బాటలోనే, బహుశా మరింత సమర శీలంగా ఉత్తుంగ తరంగమౌతున్న నేటి ప్యారిస్ వీధులను ఆవాహన చేసుకోవాలి. అడవులు అయితే గియితే తాత్కాలిక బ్యారికేడ్లవుతాయి, వాస్తవిక సమర భూములు పట్టాణాలూ, నగరాలే. అనగా, అధికారపు అసలు కేంద్రాలే. ఫ్రాన్సులో అధికారాన్ని సవాలు చేస్తున్న ‘ఎల్లో వెస్ట్స్’ తరహా వీధి పోరాటాల్ని వూరూరా వాడ వాడ విస్తరించాలి. తమ జీవితాలకు నిర్ణేతలం తామేననే స్పృహ ప్రజల్లో ఎంత పెరిగితే సోషలిజం అంత చేరువ. మన లోని రాజ్య వ్యతిరేకత (అనార్కీ భావన) ఒకటి రెండు పిల్ల కాల్వల్లో, సైడు కాల్వల్లో పొంగి పొర్లి పోకుండా ఇప్పటి చిన్ని చిన్ని కాల్వలన్నీ కలిసి మాహానదిగా మారాలి.

ఇవాళ ప్రపంచం మళ్లీ ప్రజా వుద్యమాల బాట పట్టింది. లెఫ్ట్ కి రైటుకి మధ్య నిజమైన పోరు రాజుకుంటోంది. మరి, మనం ఏం చేస్తున్నాం?

ఎవరి సిద్ధాంతం గెలిచిందని కాదు, ఎవరికెన్ని వుపన్యాసావకాశాలొచ్చాయని కాదు, మన వల్ల ప్రజల చొరవ ఎంత పెరిగిందనేది ముఖ్యం. ప్రజల చొరవ అనేది కేవలం (మన) ప్రదర్శన వస్తువైందివాళ. మన ‘గొప్పతనా’న్ని శవాల సంఖ్యతో కొలుచుకుంటున్నాం. ఇలాంటి పేచీల్లో తాపీగా వ్యవహరిస్తో తమ పబ్బం తాము గడుపుకునేది ధనస్వాములే. జీవితాల్ని కోల్పోయేది… గూగుల్ శాటెలైట్లకు సైతం దొరకని మారుమూల వూళ్ల ఆదివాసులూ, నిరుపేదలే.

ఉన్న సమరశీల శక్తులతో ఎక్కడికక్కడే ‘ప్రజా సోవియట్లు’ నిర్మించలేమా?

రాజకీయంగా తమ నాయకుల్ని తామే ఎన్నుకునే కమిటీలు, పని ప్రదేశంలో తమ మేనేజర్లను తాము ఎన్నుకునే కమిటీలను తయారు చేయలేమా? ఆచరణలో స్టాలినిస్టు నిరంకుశానికి దారి తీసి విఫలమైనా, లెనిన్ కాలంలో రష్యన్లు కలలు గన్న సోవియట్ల కోసం… ‘సెకండ్ ఫ్రంట్’ తెరవాల్సిన తరుణమిది. ఎన్నికలు, ట్రేడ్ యూనియన్ల వంటి అన్ని జన సమీకరణ సాధనాల్ని ఇందుకు వాడుకోవలసిందే.

కింది నుంచి నిర్మించడం కాకుండా పైనుంచి నిబంధించే (ఇంపోజ్ చేసే) గత కాలపు ప్రయోగాల్నిక వొదిలెయ్యాల్సిందే.

ఎన్నికల్లో, తెలంగాణా ప్రజలు మరొక మంచి పని చేశారు. అసెంబ్లీకి ఒక్కరంటే ఒక్కరినైనా కమ్యూనిస్టు నామధేయులను ఎన్నిక చేయక పోవడం ప్రజలు చేసిన చారిత్రాత్మక వొప్పిదం.

కొత్తగా ఏమైనా రాయాలంటే పలక మీద రాతలను శుభ్రంగా తుడిపెయ్యాలి. వామపక్షంలో నేడు అలాంటి పనే జరగుతోంది. ఇతర పార్టీల్లోనికి పోయిన వాళ్లు వెళ్లిపోగా, నామ్ కే వాస్తే ఎర్ర జెండా పట్టుకున్న వాళ్లను జనం నిష్కర్షగా తిరస్కరించడం బాగుంది. ఈ ఖాళీని యువ శక్తులు పూరిస్తాయి. అమెరికాలో తాము సోషలిస్టులమని ప్రత్యేకించి చెప్పుకుంటున్న ‘డెమోక్రాట్ల’ నుంచి, ఫ్రెంచి ‘ఎల్లో వెస్ట్స్’ నుంచి మన యూనివర్సిటీల్లో, పల్లెల్లో కదులుతున్న కెరటాల వరకు… పోరు ఘటనల్లోంచి కొత్త ఆశలు మోసులెత్తుతున్నాయి.

ప్రిజర్వ్ అండ్ ఫైట్, డోంట్ వేస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అనేది మన సమర తంత్రం కావాలి.

మనల్ని మనం కాపాడుకుందాం, పోరాడుదాం. చేతిలో ఏమి వుంటే దానితో పోరాడుదాం. మార్చరాని రూల్సు ఏవీ లేవు, ఎలా పడితే అలా పోరాడుదాం.

ఎన్ని ఓటములెదురైనా ఆగరాని పోరు పేద ప్రజలది. ప్రజలతోనే మేం అనుకునే వాళ్లందరిదీ.

తెలంగాణా ప్రజలు ఈ ఎన్నికల్లో పాత ప్రతీప శక్తులు తిరిగి తలెత్తకుండా వెనక్కి కొట్టగలిగారు.

మరి, కొత్త ప్రతీప శక్తులతో వారెలా వ్యవహరిస్తారో, తెర మీద చూడవలసిందే.

12-12-2018

హెచ్చార్కె

6 comments

 • ఆద్యంతమూ ఆసక్తిగా సాగిన కధనం. వామపక్షాల్ని ఓడించింది ప్రజలే. టీ ఆర్ యస్ ని గెలిపించింది బలమే. అది ఏదన్నా సరే. పూర్ కోదండ్. విషవలయంలో చిక్కుకున్నాడు. జాలిపడ్డం మినహా ఏమీ చేయకూడదు కూడా. నాయకుడి తప్పిదాలంత కాస్ట్లీ మరి.

 • కూటమి గెలిస్తే పాలన అమరావతి నుంచి జరుగుతుందనే మాట ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయింది. కేసీఆర్ 2014 లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అన్న అసంతృప్తి మరుగున పడి అస్తిత్వ వాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రజలు చానా ముందుచూపుతో ఓటు వేశారు అన్నది స్పృష్టం.

 • యెర్ర జెండాల కు vision… stand…commitment…అన్ని లోపించి — వాళ్ళ పొత్తులు –విధానాలు
  (కుల -మత పట్టింపులు ) డి టూర్ కావడం తో

  కోధాండ్ రాం — కూటమి తో కలువ డ ౦ తో — వారి విలువ – దిగజారి పోయి సర్కస్ లో బ పూన్
  పాత్ర పోషిస్తూ —

  బాబు మాటలు — బాబు పాత్ర — పచ్చి మోసగాడు // మామ ను ముంచిన అల్లుడు –తెలంగాణా ద్రోహి — అని జనానికి తెలుసు

  విప్లవ కవి గద్దర్ – రాహుల్ // బాబు తో అలాయి బలాయి — రాతలు రాయడం వరకే — చేతల్లో
  నడక లో –మార్పు —(యిది వి ప్లవం — సిగ్గు చేటు )

  ప్రజలు మరొక్క అవకాశం టి ర ఎస్ కు యివ్వడం — నిజమయిన తీర్పు ????

  =====================
  బుచ్చి రెడ్డి గంగుల

 • ఈ ఎన్నికల పద్ధతి మీద నమ్మకమున్న వ్యక్తిని కాదు కాబట్టి అంతగా ఈ ఫలితాలను పట్టించుకోలేదు.

  ఒకరకంగా ఏకపక్ష నిరంకుశత్వం కొనసాగుతున్నా, వ్యవసాయ సమూహం తప్ప, ఇంకే ప్రజా ఆందోళనలూ చెప్పుకోతగ్గగా జరగటం లేదు . అలాగే కార్మిక చట్టాలలో ఎన్నో వ్యతిరేక మార్పులు వస్తున్నా ఆందోళనలు జరగటం లేదు.

  మీరు ఎప్పుడూ చెప్పే “మన ‘గొప్పతనా’న్ని శవాల సంఖ్యతో కొలుచుకుంటున్నాం. ” నాకు ఎందుకో నచ్చదు.

 • I know how money rolled .i know how the win dictated by money bundles changed from hands to hands at each stage where ever the win compulsion was at a criticism situation.It’s mere alone Telangana sentiment provocation victory.Management success is the other side coin . It’s all happened very carefully and they managed that and not given scope of loosing a every single vote.

 • ఎప్పుడు ఓడిపోయినట్టే మెజార్టీ ప్రజలు మళ్ళిఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎన్నికలంటేనే ప్రజలని ఏదో ఒక రకంగా ఓడించడమే అందులో గద్దర్ ఉన్న కోదండరాం ఉన్న ప్రత్యేకంగా ప్రజలకు జరిగే మేలేమి ఉండదు. వామపక్ష పార్టీలను మాత్రం ప్రజలు చెప్పులతో ఉన్న పళ్ళను రాలగొట్టారు
  దాసరి రాజబాబు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.