ఫ్రాన్స్ లో మళ్లీ రెక్క విప్పిన రెవల్యూషన్!

1968 ఫ్రెంచి విద్యార్థి వుద్యమ‍ం, ఒక దృశ్యం

(1968 ఫ్రాన్సులో మొదలైన‍ తిరుగుబాట్లను ఏంజిలా కాట్రోచ్చి “బిగినింగ్‍ అఫ్‍ ది ఎండ్‍’ పేరుతో గొప్ప పొయెటిక్‍ శైలిలో రికార్డు చేశారు. దాన్ని శ్రీశ్రీ ‘రెక్క విప్పిన రెవల్యూషన్‍’ పేరుతో తెలుగు చేశారు. ఈ పుస్తకం ‘విరసం’ ప్రచురణల్లో ప్రముఖమైనది. ఇప్పటికీ దొరుకుతుందనుకుంటాం___ ఎడిటర్‍)

ఫ్రాన్స్ లో విప్లవం మరోసారి రెక్క విప్పింది. రెక్క విప్పిన విప్లవ జ్వాల పొరుగుదేశాలకు వ్యాపించింది.  ఫ్యాషన్లే కాదు, విప్లవాలూ పుట్టేది ఫ్రాన్స్ లోనే. ‘’అన్నమే కాదు, గులాబీలూ కావాలంటారు’’ అక్కడి ప్రజలు. ఫ్రాన్స్ లో జరిగిన తరతరాల విప్లవ పోరాటాలను గుర్తుకు తెస్తున్నారు  ఇప్పటి “ఎల్లో వెస్ట్” నిరసన కారులు. ఆర్క్ డి ట్రియోంఫ్ (Arc-de- triomphe) మ్యూజియం గోడ మీద ఒక నినాదం ఇలా రాశారు “లూయీ 16= మాక్రోన్” అని. లూయీ 16 కి వ్యతిరేకంగా జరిగిన 1789 విప్లవం రాజ‍రిక పాలనకు చరమ గీతం పాడింది. అప్పుడు ఫ్లోర్(flour, రొట్టెల పిండి) కోసం తిరుగుబాట్లు జరిగితే, ఇప్పుడు ఫ్యూయల్  (fuel, డీజిల్,పెట్రోల్) కోసం జరుగుతున్నాయి. అప్పుడు రాజ‍రికానికి అంతం పలికెతే ఇప్పుడు గ్లోబలిస్ట్ నిరంకుశానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ఆనాడు ఆకలి అందరినీ కలిపింది. ఆకలికి కుడి, ఎడమల (రైట్, లెఫ్ట్) తేడా లేదు. ఇప్పుడూ అంతే. ఫ్యూయల్ ధరలు అంటే ఆకలే. అదే అందర్నీ కలిపింది. “నెల జీతాలు మూడో వారం రాక ముందే అయిపోతున్నాయి. ‘మేము జీవించడం లేదు, చావలేక బతుకులు ఈడుస్తున్నాం’ అంటున్నారు.

ఉద్యమకారులు 1968 తిరుగుబాటును కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఆ నాటి పోరాట విద్యార్థులు నేడు తండ్రులుగా, తాతలుగా, అమ్మలుగా, అమ్మమ్మలుగా మళ్లీ రోడ్ల మీదకు వచ్చారు, తమ పిల్లలతో,- కొడుకులు- కూతుళ్లతో, మనుమలు- మనుమరాళ్లతో కలిసి.

ఆయిల్  మీద ఎకో- పన్నులు( Eco taxs) విధించడంతో  ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, ఈ ధరలు కేవలం ఆయిల్ కే పరిమితం కావని, అన్ని వస్తువుల ధరలను ప్రభావితం చేస్తున్నాయని, ఆహారం, నిత్యావసర సరుకుల ధరలూ విపరీతంగా పెరిగాయని, ధరలను తగ్గించాలని డిమాండ్ తో  లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. నవంబర్ 17న శనివారం దేశ వ్యాప్తంగా 2 వేలకు పైగా జరిగిన నిరసన ర్యాలీల్లో లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. పారిస్ నగరంలోనే “ఎల్లో వెస్ట్స్’’ ధరించిన 3 లక్షల మందితో నిరసన ర్యాలీ జరిగింది.  చీకట్లోనైనా కనిపించే విధంగా ప్రమాదాల నుంచి సురక్షితంగా వుండడం కోసం డ్రైవర్లు ఫ్లోరిసెంట్ కలర్ వెస్ట్ ని ధరించడం ఆనవాయితీ. వాహనాలు నడిపే వారుగా, అయిల్ ధరలు తగ్గించాలనే నినాదంతో వీరు ఈ డ్రెస్ కోడ్ తో ప్రదర్శనలకు దిగారు.

పర్యావరణ పరిరక్షణ నిధుల కోసం  కార్బన్ టాక్స్ విధించింది అధికారంలో వున్న  సోషల్ డెమొక్రటిక్ పార్టీ ప్రభుత్వం. “ఫ్రాన్స్ డిక్లరేషన్” ను ప్రపంచ దేశాల ముందుకు తీసుకవచ్చి, పర్యావరణాన్ని రక్షించే ఛాంపియన్ గా నిలబడింది మాక్రోన్ ప్రభుత్వం. కొన్ని సంవత్సరాలకు రానున్న ముప్పును దృష్టిలో పెట్టుకొని ఈ పన్నులు వేస్తున్నామంటున్నారు. “నెల గడవడం గురించి ఆందోళన చెందుతున్నాం. ముందు ఆయిల్ ధరలు తగ్గించండి” అని నినాదాలు చేస్తూ ఉద్యమ కారులు రోడ్లు ఆక్రమించారు. నవంబర్ 24 శనివారం రెండో సారి జరిగిన నిరసన ప్రదర్శనలో 2 లక్షల 30 వేల మంది పాల్గొన్నారు. డిసెంబర్ 1 శనివారం మూడో ప్రదర్శన జరిగినప్పుడు లక్షన్నర మంది పాల్గొన్నప్పటికీ కొన్ని హింసాత్మాక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆర్క్ డి ట్రియోంఫ్  మ్యూజియంను ముట్టడించి కొన్ని స్మారక చిహ్నాలను ధ్వంసం చేశారు. ఖరీదైన షాపుల్లోని వస్తువుల్ని ధ్వంసం చేశారు. సంపన్నుల నివాసాల ముందున్న కార్లకు నిప్పు పెట్టారు. ఈ పనులు చేయకుండా వుండాల్సిందని అభిప్రాయాలు వెల్లడయినప్పటికీ ఈ నిరసన ప్రదర్శనలకు ఆ దేశ ప్రజలు 80%  మంది తమ మద్దతు ప్రకటించారు. “ ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. హింస లేకుండా విప్లవం సంభవించదు” అని ఉద్యమంలోని ఒక యాక్టివిస్టు అంటాడు. ఈ సంఘటనలతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రోన్ ఆయిల్ ధరలు తగ్గిస్తున్నట్టు, ఉద్యోగులకు కనీస వేతనం పెంచుతున్నట్టు ప్రకటించాడు.

కాని, మరునాడే విద్యార్థులు డిసెంబర్ 3,4 తేదీల్లో దేశ వ్యాప్తంగా వున్న హైస్కూళ్లను, యూనివర్సిటీలను బహిష్కరించారు. విద్యావిధానంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వందలాది  విద్యార్థులు అరెస్టయ్యారు. అరెస్టు సమయంలో పోలీసులు విద్యార్థులతో వ్యవహరించిన తీరుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు అరెస్టు చేసిన విద్యార్థుల చేతులు వెనక్కి విరిచి కట్టి, గోడల వైపు ముఖం పెట్టించి,  మోకాళ్లపై కూర్చునేట్టు నిర్బంధించారు. అ తరువాత జైళ్ళకు పంపారు.

మూడో శనివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో విద్యార్థులే కాకుండా టీచర్లు, నర్సులు,  రైతులు, అనేక రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులు వచ్చి చేరారు. ఈ ఉద్యమం ఏ యూనియన్లు, రాజకీయ గ్రూపుల ప్రమేయం లేకుండా సోషల్ మీడియా ద్వారా రాజుకుంది. దీనికి ఏ నిర్మాణమూ లేదు, నాయకులూ లేరు. ఇదో కొత్త తరహా ఉద్యమం. ప్రజలు లెఫ్ట్-రైట్ పార్టీల కింద విభజింపబడి వున్నంత కాలం ప్రభుత్వాలకు గట్టి సవాళ్ళు ఎదురు కావు. ఏ ఆటంకాలు లేకుండా తమ విధానాలను  సజావుగా కొనసాగించుకోవచ్చు. ఫ్రాన్స్ లో అధికారంలో ఉన్నది పేరుకు సోషలిస్టు పార్టీ. సోషల్ డెమొక్రటిక్ పార్టీ. కానీ ఇది సంపన్నుల కోసం పని చేసే ప్రభుత్వమని, మాక్రోన్ రాజీనామా చేయాలని  ఉద్యమకారులు నినాదాలు చేశారు. మూడో అంకంగా డిసెంబర్ 1 న జరిగిన నిరసన ర్యాలీలో హింస చోటు చేసుకోడానికి కారణం ఉద్యమంలోని అతివాద రైట్ వింగ్ శక్తులని కొందరు అంటే, కాదు కాదు మిలిటెంట్ లెఫ్ట్ వింగ్ శక్తులని కొందరు అన్నారు.  ఈ ఉద్యమంలో రైట్ వింగ్ వుందా, లెఫ్ట్ వింగ్ వుందా అని పరిశీలనలు మొదలయ్యాయి. పన్నులు తగ్గించాలనేది రైట్ వింగ్ నినాదమైతే, జీవన వ్యయం(cost of living) తక్కువగా వుండాలనేది లెఫ్ట్ వింగ్ నినాదం. ఇప్పుడు ఈ రెండూ జమిలిగా వినిపిస్తున్నాయి. ఆకలి అందర్నీ ఏకం చేస్తున్నది. ఆకలి కేకలు పేద ప్రజల నుంచే వస్తాయనుకుంటారు. మధ్య తరగతి ప్రజలు మర్యాదస్తులు. బయటికి చెప్పుకోరు అనుకుంటారు. అయితే, ఈ ఉద్యమంలో అత్యధికులు మధ్యతరగతి అనబడే ప్రజలే. ఈ మధ్యతరగతి ప్రజలు కూడా తమకు నెల గడవడం కష్టంగా వుందని, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లల్ని కనాలన్నా భయపడుతున్నామని, తమది మధ్య తరగతి అనుకోవడం అపోహ అని, తాము పేదలమే అని అనుకోవడం వల్లే ఈ ఉద్యమం చేపట్టారు. ప్రజల కొనుగోలు శక్తి విపరీతంగా పడిపోయింది.  ఇది ఫ్రాన్స్ కు మాత్రమే పరిమితం కాదు.

సంస్కరణల పేర దగా దగా:

ప్రపంచమంతటా గత ముప్పై నలబై ఏళ్లుగా సాగుతున్న నయా ఉదారవాదం లేదా గ్లోబలైజేషన్ ధనిక, పేద అసమానతలను మరింత పెంచి పోషించింది. సంస్కరణల పేర దేశాలన్నీ సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ)కు తిలోదకాలిచ్చాయి. పబ్లిక్ సరీస్వులను ఉపసంహరించుకున్నాయి. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను( ప్రభుత్వ రవాణాను) నిలిపేశాయి. పబ్లిక్ స్కూళ్ళను, యూనివర్సిటీలను నీరుగార్చి, ప్రైవేటు విద్యాసంస్ఠలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రభుత్వ వైద్యశాలల స్థానే ప్రైవేటు కాలేజీలకు, ఆసుపత్రులకు, ప్రైవేటు ఆరోగ్య భీమా పథకాలకు అనుమతులిచ్చాయి. చివరికి పెన్షన్లను కూడా రద్దు చేయడమో ప్రైవేటు సంస్థలకు అప్పగించడమో జరుగుతోంది. ప్రభుత్వాలు ప్రజల కోసం చేయాల్సిన పనులను వదిలివేస్తున్నాయి.  ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన జాతీయ ప్రభుత్వాలు వ్యాపార సంస్థలకు సేవ చేస్తున్నాయి. క్రూరమైన గ్లోబలిజానికి ప్రజలు బలవుతున్నారు. సంపన్నులు మాత్రం మరిన్ని సంపదలు పోగేసుకొని “నయా మోనార్క్” లుగా అవతారమెత్తారు.

జరిగిన మోసం కనిపెట్టి మొదట తిరగబడుతున్నఫ్రాన్స్ ప్రజలు తమ విప్లవ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ప్రపంచ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయిల్ ధరలు తగ్గించి, కనీస వేతనాలు పెంచుతున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రకటించగానే నిరసనలు ఆగిపోవాలి. కాని  ఒకటి రెండు డిమాండ్లతో ఫ్రాన్స్ ప్రజలు రోడ్ల మీదకు రాలేదు. వారు ప్రకటిస్తున్న డిమాండ్లు 40 కి పైగా వున్నాయి. ముందు ముందు ఇంకా కొన్ని పుట్టుకు రావొచ్చు. ఆ డిమాండ్లలో గూగుల్, అమెజాన్ లాంటి అంతర్జాతీయ కంపెనీలపై పన్నులు పెంచాలని, సంపన్నుల సంపదను పంచాలనేవి కూడా వున్నాయి.

ఆయిల్ పై ఎకో టాక్స్ ఎత్తివేసి ధరలు తగ్గించాలనే డిమాండ్ తో మొదలైన ఈ ఉద్యమం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి వ్యతిరేకమైనదని, వాతావరణ మార్పులను ఈ ఉద్యమ కారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఒక అపవాదు బయలుదేరింది. వెంటనే, ఉద్యమకారులకు మద్దతుగా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు తమ బ్యానర్లతో వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆయిల్ వాడకాన్ని తగ్గించాలి, ఫ్రాన్స్ ప్రభుత్వం దానికి సరైన చర్యలు తీసుకోలేకపోయింది.  శ్రామికులు తమ పని ప్రదేశానికి ఉచితంగా ప్రయాణించేట్లు జర్మనీ తరహాలో పబ్లిక్ రవాణా వ్యవస్థను రూపొందించాల్సింది. ఆర్థిక, సామాజిక సమ న్యాయం జరక్కుండా పర్యావరణాన్ని కాపాడతాం అనడం అభూత కల్పన. సంపద, సాంకేతికత చాలా పెరిగింది. ఇప్పుడు దాన్ని న్యాయబద్ధంగా పంపిణీ చేసి, అసమానతల్ని తొలగించడం ద్వారా మాత్రమే మానవ వనరులను, పర్యావరణాన్ని ముందు తరాల కోసం కాపాడగలం.

పారిస్ లో జరుగుతున్న నిరసన ప్రదర్శన:

వారం చివర్లో ప్రతి శనివారం జరుగుతున్న నిరసన ప్రదర్శనలు ఇప్పటికి నాలుగైదు  జరిగాయి. ఉదయం పది గంటలకంతా మూడు రంగుల జాతీయ జెండాను పట్టుకొని ‘’మార్సిల్లయిస్” (Marseillaise) అంటూ జాతీయ గీతం ఆలపిస్తూ వేలాది మంది ఒక్కసారిగా అధ్యక్ష భవనం వుండే “ చాంప్స్ ఎలిసీస్” (Champs Elysees) ప్రాంతానికి  వస్తారు. ఇది చాలా పొడవైన, విశాలమైన కూడలి. ఇక్కడ మిలిటరీ కవాతులు మాత్రమే కాదు  పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలూ జరుగుతుంటాయి. ఉద్యమకారులకు ఎదురుగా పోలీసులు. పోలీసుల చేతుల్లో,- ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో తమ రక్షణ కోసం నిలువెత్తు ప్లాంక్, కొందరి చేతుల్లో టియర్ గ్యాస్ డబ్బీలు( టిన్స్), వారితో కలిసి వాటర్ కానన్ ముందుకు సాగుతూ ఉంటుంది. నిరసన కారుల చేతుల్లోకి ఉన్నట్టుండి తలుపు రెక్కలు, కిటికీ రెక్కలు, విరిగిన కుర్చీలు, బల్లలు, ఇనుప రేకులు,ఇంటి ముందుండే ఇనుప గేటు రెక్కలు, పార్క్ ల చుట్టూ కంచెకు వేసే రైలింగ్ లు… ఒక్క మాటలో చేతి కందిన అన్ని పాత సామాన్లతో తమ ముందు బారికేడ్లు కట్టుకుంటారు. ఈలోగా ఫుట్ పాత్ పై రాళ్లు పెళ్లగించబడతాయి. పోలీసులు దాడి చేయడానికి వస్తే చేతి కందిన రాళ్లతో రాళ్ల వర్షం కురిపిస్తారు. రాళ్ల వర్షానికి వెనక్కు పరుగులు పెడతారు పొలీసులు. వాటర్ కానన్ సహాయంతో పైపులోంచి ఫోర్స్ గా వాటర్ నిరసన కారుల మీద పడుతుంది. అదే సమయంలో పోలీసులు టియర్ గ్యాస్ డబ్బీలు  విసిరేస్తారు. అవి కూడా ప్రదర్శన కారులపై వర్షంలా కురుస్తుంటాయి. యువకులు కొందరు తమ మీద పడబోయే టియర్ గ్యాస్ డబ్బీలను ఒడుపుగా పట్టుకొని తిరిగి పోలీసుల మీదకు విసురుతుంటారు. “నిముషానికి 5 వేల టియర్ గ్యాస్ డబ్బీలు వేసినట్టు, ఇంతలా ఎప్పుడూ వేయలేద”ని ఒక పొలీస్ అధికారి చెప్పుకున్నాడు. అలుముకున్న ఆ పొగల్లో ఏం జరుగుతుందో ఒక్కోసారి చూడలేకపోతాం. జర్నలిస్టులు చుట్టుముట్టిన పొగల్లొంచి బయటికి వచ్చి కళ్లు తుడుచుకుంటూ, రొప్పుకుంటూ అక్కడి దృశ్యాలను చూపిస్తూ వ్యాఖ్యానిస్తూ వుంటారు. రోడ్ల మీద జరిగే ఈ పోరాటాలు ఉదయం ఏ పది గంటలకో మొదలయితే సాయంత్రం 5 దాకా కొనసాగుతాయి. వీధి లైట్లు వెలగడం చూస్తాం. ఆర్టీ న్యూస్ ( Rt news. Rt అక్షరాలు గ్రీన్ కలర్ లో వుంటాయి), గ్లోబల్ న్యూస్ (global news) చానల్స్ పారిస్ లో రోజంతా జరిగే ఈ పోరాటాల్ని ప్రసారం చేశాయి. ఈ చానల్స్ చేసిన ప్రసారాలు యూ ట్యూబ్ లో అప్ లోడ్ అయ్యాయి. ఇప్పటి వరకు 4,500  మంది అరెస్టు కాగా 5 వందల మంది దాకా గాయపడ్డారు. ప్రమాదాల కారణంగా 4 గురు మరణించారు. జర్నలిస్టులు, పోలీసులు, పోలీసు అధికారులు కూడా చాల మ‍ంది గాయపడ్డారు.

 

పారిస్ నగరంలోనే కాక, ఫ్రాన్స్ లోని అనేక నగరాల్లో, పట్టణాల్లో శనివార నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి.  ప్రభుత్వ భవనాల ముందు బ్యారికేడ్లు పెట్టి అడ్డగించడం, సూపర్ మార్కెట్ దారులను మూసివేయడం, జాతీయ రహదారులను, జంక్షన్లను మూసివేయడం వంటి చర్యలు చేపట్టి దేశ వ్యాప్తంగా రోడ్ల పై రాకపోకల్ని స్తంభింపజేస్తున్నారు.

ఈ పోరు జ్వాల ఫ్రాన్స్ పొరుగున ఇటలీ, బ్రెజిల్, నెదర్లాండ్స్ దేశాలకు కూడా వ్యాపించాయి. అక్కడ కూడా ఇదే నమూనాలో “ఎల్లో వెస్ట్”లు ధరించి ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈజిప్టులో ఏకంగా “ఎల్లో వెస్ట్” ల అమ్మకానికి పెట్టవద్దని ప్రభుత్వం బట్టల దుకాణాలపై ఆంక్షలు విధించింది. గ్లోబలిజం ఎక్కడెక్కడ తన కోరలు చాచిందో అక్కడంతా ఈ విప్లవ జ్వాల  ఒక దావానంలా వ్యాపించే అవకాశం వుంది. “ఎల్లో వెస్ట్” లు ఇప్పుడు ప్రభుత్వాలను, గ్లోబలిస్టులను భయపెడుతున్నాయి.

 

తాజా కలం: ఈ వ్యాసం ముగించే సమయానికి ,ఈ రోజు  5 వ శనివారం. ముందస్తుగా పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పారిస్, చాంప్స్ ఇలిసీస్ కూడలిలో 8,000 మంది పోలీసులు మోహరించారు. వారికి సహాయంగా 14 సాయుధ శకటాలు, వాటర్ కెనాన్ ఉన్నాయి. ఉద్యమకారులూ వేలాది మంది కూడలికి చేరుకొని అధ్యక్షుడు మాక్రొన్ రాజీనామా చేయాలని నినదిస్తూ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్ లోని అన్ని నగరాలలోనూ జరుగుతున్న  నిరసన ప్రదర్శనల్లో  లక్షల మంది ఉద్యమకారులు పాల్గొన్నారు.

1968 విద్యార్థి వుద్యమంలోనే మ‍రో దృశ్యం

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

10 comments

 • తిరగబడ్డ యూరప్
  యూరప్ లో తిరుగుబాట్లు జరుగుతున్నాయా? లేక యూరప్ తిరగబడిందా?
  ఇటీవల ఫ్రాన్సులో ప్రజలు వీధులకెక్కారు.చమురుధరలు తగ్గించాలన్నారు.అందుకోసం ప్రభుత్వం విధించిన గ్రీన్ సెస్ నిరద్దు చేయాలన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచదేశాల మధ్య పారిస్ ఒప్పందం జరిగింది ఈపర్యావరణ దృక్పధం లో భాగమే ఫ్రాన్సు విధించిన గ్రీన్ సెస్.ప్రజలని సౌర విద్యుత్తు వైపు మల్లించే వుద్దేశంకూడా ఉందట .కానీ ఈమొత్తం ప్రక్రియపై ఎల్లోవెస్ట్ పేరుతో ప్రజలు తిరగబడ్డారు.
  మానవ విజ్ఞానాన్ని వేగవంతం చేసి ,మానవ భౌతిక అభివృద్ధిని మతంగా మార్చింది యూరప్.అదే యూరప్ పర్యావరణ సమతూకం పాటించకపోతే ,సర్వనాశనమేనని గ్లోబల్ వార్మింగ్ అని తీతువులా కూయడం మొదలు పెట్టింది.అందుకోసం మేమెందుకు మూల్యం చెల్లించాలి,మరోదారి చూసుకొండిలేకపోతే రాజకీయనాయకుల సౌకర్యాలు తగ్గించుకోవడమో ,మరేదో చేసుకొండి.కాని ఆభారాన్ని పన్నులరూపంలోనో,ఖరీదైన సౌర విద్యుత్ పరికరాల రూపంలోనో మామీద మోపద్దు అంటున్నారు ప్రజలు.
  యూరప్ కి అమెరికా విరుగుడా? ఎల్లోవెస్ట్ ఉద్యమకారులు తన పేరు నినాదంగా మార్చుకొన్నారు అంటున్నాడు ట్రంపు. అసలు మొదటినుంచి ట్రంపు గ్లోబల్ వార్మింగ్ బోగస్ అంటున్నాడు.పారిస్ పర్యావరణ ఒప్పందాన్ని కాలదన్నాడు.
  పర్యావరణ సమతౌల్యంకోసంకూడా మళ్ళీ అసమ మార్కెట్ నిఆశ్రయించాలసిందే. దాంతో ఈ సంక్షోభాలు.[కమ్యూనిస్టు పరిష్కారం చెర్నోబిల్ లా చెడిపోయింది.]
  యింతకీ యూరప్ లో జరుగుతున్నవి తిరుగుబాటలా,తిరగబడ్డాలా, బోర్లాపడ్డాలా?

  • థాంక్స్, రాణి శివ శంకర శర్మగారూ! ఫ్రాన్స్ లో జరుగుతున్న ఉద్యమాన్ని ఫాలో అవుతున్నందుకు.

 • నమస్తే మేడం…ప్రాన్స్ ప్రజల పోరాటాన్ని కీలకమైన అంశాలతో చక్కగా వివరించారు.కార్పొరేట్ గ్లోబల్ శక్తుల చేతుల్లో ప్రభుత్వం బుకీలుబొమ్మలై ప్రజల్ని దోచుకుంటున్న పరిస్థితులు దాదాపు అన్నీ దేశాల్లో పెట్రేగిపోతున్న సందర్భమిది….
  నిజంగా ప్రాన్స్ ప్రజల పోరాటం స్ఫూర్తివంతమైంది…
  మీ వ్యాసంలో చాలా విషయాలు ఇప్పుడు అందరూ చడవదగ్గవే…గొప్ప వ్యాసం…

 • ఈ వ్యాసాన్ని బట్టీ ఇది పూర్తిగా గ్లోబలైజేషన్ కి వ్యతిరేకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ దేశంలో ఆయిల్ కి సంబంధించిన ఏ అంశమైనా దానికి గ్లోబల్ వ్యతిరేకత ఉండడం అంతర్జాతీయ వ్యాపార సంక్షోభాన్ని తెలుపుతుంది.పర్యావరణానికీ, అంతర్జాతీయ వ్యాపారానికీ,
  సంపదపోగుపడడానికీ,మానవులకీ ఉన్న సంబంధంలో ఏదీ విడిగా లేదు. దీన్ని తెలుసుకుని ఆచరించి నప్పుడల్లా సమాజం ఎదుగుతుంటుంది.

  • థాంక్స్ ప్రభు గారూ! మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

 • చాలా మంచి వ్యాసం.

  ఇంకొంచెం లోతుకెల్తే మన అవగాహన బలపడుతుంది అని నా సూచన.

  (1) వాతావరణ పరిరక్షణకు వ్యతిరేకంగా ఉద్యమించడం అవుతుందా ఇది ?

  (2) వాతావరణ కాలుష్యానికి ప్రభుత్వం, కార్పోరేట్లు బాధ్యత వహిస్తున్నప్పుడు, అది పర్రిరక్షించడానికి, సామాన్య మానవుడీ పై బర్డన్ పడుతుందా ?

  (3) ఫ్రాన్స్ లాంటి కన్స్యూమర్ సొసైటీలో, ఈ మొబిలైజేషన్ ఎలా సాధ్య పడింది ? ఇలా ఎలా ఆర్గనైజ్ కాగలిగారు ?

  (4) ఇటువంటి ఉద్యమాలు – సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమాలుగా చూడవచ్చా ?

  నాకు ఈ ప్రశ్నలకు పార్షియల్ ఆన్సర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ వ్యాసం రైటర్ తన శక్తిని బట్టి ఈ ప్రశ్నల గురించి ఆలోచించి ఉంటుందనే నెను అనుకుంటున్నాను. ఏదన్నా తెలిపితే సంతోషం

  • థాంక్స్ విజయ కుమార్ గారూ!
   1. ఇది గ్లోబలిస్టులకు, వారికి అనుకూలమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం.
   2. వాతావరణ పరిరక్షణ కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. అవి అన్ని చోట్ల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి.
   3. సోషల్ మీడియా ద్వారా ఇది సాధ్యపడింది. కన్స్యూమర్ సొసైటీలు వున్న ఐరోపా, అమెరికా లోనే సమస్యలపై ప్రజలు అధికసంఖ్యలో కదులుతున్నారు. మనం కులాలుగా, మతాలుగా విడిపోయి వున్నాం. గ్లోబలిజంతో మన చుట్టూ వున్న ఆ అడ్డుగోడలు మరింత పెరిగాయి. మంచిర్యాలలో నిన్న జరిగిన దురంతం. ప్రేమ పెళ్లిని కూడా అమోదించలేని అధమస్థాయిలో సగటు కుటుంబాలు వుంటున్నాయి. ఈ అడ్డుగోడలు కూలిపోతే కదా మనం అధికసంఖ్యలో కలిసేది.
   4. మరోసారి 1968 ఉద్యమాలు తిరిగి మొదలవుతున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ లో, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ ప్రారంభించిన ఉద్యమం కొన్ని నెలల క్రితం తిరిగి మొదలైంది. ఈ ఉద్యమాలు సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమాలుగా విస్తరిస్తాయేమో? ఏమో, ప్రజలు గెలుస్తారేమో?

 • ఇలాగే భారతదేశంలోనూ వుద్యమస్ఫూర్తి బలపడేందుకు ఇంకా ఎంతకాలం పడుతుందో. మంచి వ్యాసానికి అభినందనలు.
  -విజయ్ కోగంటి

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.