మూడంతస్తుల ఓడ

అనగనగా ఒక మారుమూల వూరు. ఆ ఊళ్లో ఇద్దరు దంపతులు. వాళ్లకొక బాబు పుట్టాడు. క్రైస్తవులు కదా, వాడికి ఒక దివ్య తండ్రిని పెడితే గాని బాప్తిజం చేయడానికి లేదాయె. వాడికి దివ్య తండ్రిగా వుంటానికి చుట్టుపక్కల ఎవరూ లేరు. దూరంగా పట్నానికి వెళ్లి చూశారు. అక్కడ కూడా వాళ్లకు తెలిసినోళ్లు ఎవరూ లేరు. చివరికి చర్చి మెట్ల మీద కూర్చుని నల్లని దుప్పటితో ఒకాయన కనిపించాడు. వీళ్లు వెళ్లి, “దయగల అయ్యా, మీరు మా పిల్లాడికి దివ్య తండ్రిగా వుంటారా?” అని అడిగారు. అందుకాయన ఒప్పుకున్నాడు. పిల్లవాడి బాప్తిజం జరిగిపోయింది.

వాళ్లు చర్చి బయటికి వొచ్చాక, ఆ కొత్తాయన ఇలా అన్నాడు. “ఇప్పుడు నేను నా దివ్య పుతృనికి కానుక ఇవ్వాలి. ఇదిగో ఈ డబ్బు సంచి తీసుకో. ఈ డబ్బుతో పిల్లవాడికి చదువు చెప్పించు. వాడికి చదవడం వొచ్చాక ఇదిగో ఈ వుత్తరం చదమని చెప్పు, సరేనా” అంటూ ఒక డబ్బు సంచి, ఉత్తరం ఇచ్చాడు. దంపతులు ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆయన పేరేమిటో అడిగే లోగా, మాయమయిపోయాడు.

బంగారు నాణాలతో సంచి నిండుగా వుంది. వాళ్లు ఆ నాణాలు పెట్టి పిల్లాడికి విద్యాబుద్దులు చెప్పించారు. వాడికి చదవడం రాగానే, ఆ ఉత్తరం ఇచ్చారు. ఉత్తరంలో ఇలా వుంది.

నా దివ్య పుతృడా!

నేను చాన్నాళ్లు దేశ బహిష్కారంలో వుండి, నా సింహాసనం మీద కూర్చోడానికి ఇప్పుడు తిరిగి వెళ్తున్నాను. నాకొక వారసుడు కావాలి. ఈ ఉత్తరం చదవగానే, నీ దివ్య తండ్రినీ, ఇంగ్లాండు రాజునూ అయిన నా దగ్గరికి వొచ్చెయ్.

తా.క. నీ దారిలో నీకు ఒక మెల్ల కంటి వాడు, ఒక కుంటి వాడు, ఒక గజ్జితల వాడు కనిపిస్తారు. వాళ్లతో మాత్రం జాగ్రత్త .’

“అమ్మా, నాన్నా, నేను నా దివ్య తండ్రిని కలుసుకోడానికి వెళ్తున్నాను” అని చెప్పి కుర్రవాడు బయల్దేరాడు. కొన్నాళ్లు ప్రయాణం చేసే సరికి వాడికి మరో ప్రయాణికుడు ఎదురయి, “చిన్నా, నువ్వెక్కడికి వెళ్తున్నావు?” అని అడిగాడు.

“ఇంగ్లాండుకు” అని కుర్రవాడు జవాబిచ్చాడు.

“నేను కూడా అక్కడికే. పద కలిసి వెళ్దాం”

అబ్బాయి అప్పుడు చూశాడు. ఆ మనిషి కళ్లలో ఒకటి తూర్పుకు చూస్తుంటే ఇంకోటి పడమటికి చూస్తోంది. ఉత్తరంలోని మెల్లకంటి వాడితడే అని మన వాడికి తెలిసిపోయింది. ఏదో సాకు చెప్పి, ప్రయాణం ఆపి, రహస్యంగా దారి మార్చి, తన ప్రయాణం కొనసాగించాడు.

మరి కొంత దూరం పోయాక దారిలో రాతి గుండు మీద కూర్చుని మరొక మనిషి కనిపించాడు. “నువ్వు ఇంగ్లాండుకు వెళ్తున్నావా, అయితే నేనూ వస్తా, పద” అంటూ ఆ మనిషి లేచి ఊత కర్ర తాటిస్తూ, కుంటుతూ నడవడం మొదలెట్టాడు. ఉత్తరంలోని కుంటాయన ఇతడే అని అబ్బాయి గ్రహించాడు. మళ్లీ దారి మార్చి. ఇతడిని కూడా వొదలించుకున్నాడు.

అబ్బాయికి దారిలో మూడో మనిషి కనిపించాడు. అతడి కళ్లు, కాళ్లు అన్నీ బాగున్నాయి. నెత్తిన జబ్బేమైనా వుందనుకోడానికి లేకుండా, అతడి తల మీద నల్లని శుభ్రమైన జుత్తు నిగనిగలాడుతోంది. అతడూ ఇంగ్లాండుకే వెళ్తున్నాడు. ఇద్దరు కలిసి ముందుకు సాగారు. వాళ్లు ఆ రాత్రికి ఒక పూటకూళ్ల ఇంట్లో ఆగారు. సహ ప్రయాణీకుడి మీద అనుమానంతో మన కుర్రవాడు తన డబ్బు సంచి, ఉత్తరం పూటకూళ్లింటి మనిషికి అప్పగించి నిద్రపోయాడు. అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా, సహ ప్రయాణికుడు లేచి, పూటకూళ్లింటి మనిషి దగ్గరికి వెళ్లి డబ్బు సంచి, ఉత్తరం, గుర్రం కోసం అడిగి తీసుకుని, చెక్కేశాడు. అబ్బాయి పొద్దున నిద్ర లేచే సరికి తనకున్నదంతా పోగొట్టుకున్నానని అర్థం చేసుకున్నాడు.

“రాత్రి మీరు పంపారని, మీ పని వాడు వొచ్చి అడిగితే అవన్నీ ఇచ్చేశాం” అన్నాడు పూటకూళ్లింటి మనిషి.

ఏం చేస్తాడు పాపం, చేతిలో పైసా లేకుండా, ఉత్తరం లేకుండా, కాలి నడకన తన దివ్య తండ్రి వద్దకు బయల్దేరాడు. ఒక రోడ్డు మలుపు దగ్గర అబ్బాయికి తన గుర్రం పొలంలో చెట్టుకు కట్టేసి కనిపించింది. అబ్బాయి దాన్ని విప్పబోతుండగా సహ ప్రయాణీకుడు చెట్టు వెనుక నుంచి ఉరికి వొచ్చాడు. అతడి చేతిలో పిస్తోలు. “నువ్వు నా సేవకుడిగా వుండి, నేనే రాజు గారి దివ్య పుతృడినని నటించాలి, లేకపోతే ఇక్కడే ప్రాణలొదులుతావు” అని బెదిరించాడు.  అతడు మాట్లాడుతున్నప్పుడు ఒకసారి తల మీద విగ్గు తీశాడు. అతడి తల నిండా గజ్జి.

ప్రయాణం మళ్లీ మొదలైంది. అబ్బాయి కాలినడకన, వాడు గుర్రం మీద. వాళ్లు ఇంగ్లాండు చేరుకున్నారు. రాజు గజ్జితల మనిషిని తన దివ్య పుతృడనుకుని, చేతులు బార్లా చాచి రాజభవనంలోనికి ఆహ్వానించాడు. కుర్రవాడికి గుర్రపు శాలలో పనులు అప్పగించారు. గజ్జితలవాడు ఈ అబ్బాయిని ఎప్పడు ఎలా వొదిలించుకోవాలా అని చూశాడు. తొందరలోనే దానికి అవకాశం వొచ్చింది. ఒక రోజు రాజు గారు గజ్జితల వాడిని పిలిచి, “నా కూతురు మంత్ర వశమై, ఒక దీవిలో బందీగా వుంది. విడిపించి తెస్తే నీకామెను ఇచ్చి పెళ్లి చేస్తాను. కాని, అదంత సులభం కాదు. ఆ పని మీద వెళ్లిన వాడెవడూ ఇంతవరకు తిరిగి రాలేదు” అని చెప్పాడు.  గజ్జితల వాడు వెంటనే జవాబిచ్చాడు, “నా సేవకుడిని పంపించి చూద్దాం. తను రాకుమారిని విడిపించుకొస్తాడు”

రాజు తక్షణం అబ్బాయిని పిలిపించి అడిగాడు. “నువ్వు నా కూతుర్ని విడిపించుకురాగలవా?”.

“మీ అమ్మాయా, చెప్పండి ఎక్కడుంది ఆమె?”

“ సరే, నీకిదే హెచ్సరిక, నా కూతురు లేకుండా తిరిగొచ్చావో, నీ మెడకాయ మీద తలకాయ వుండదు” అన్నాడు రాజు.

అబ్బాయి ఓడ రేవుకు వెళ్లి, వొచ్చిపోయే ఓడల్ని చూస్తూ నుంచున్నాడు. రాకుమారి వున్న దీవికి ఎలా వెళ్లలో అతడికి తోచడం లేదు. ఇంతలో గడ్డం మోకాళ్ల మీదికి జీరాడుతున్న ఒక ముసలి నావికుడు కుర్రాడి దగ్గరికి వొచ్చాడు. ఆయన ఏం మాట్లాడకుండా, “నీకొక మూడంతస్తుల ఓడ కావాలని అడుగు” అని చెప్పాడు.

యువకుడు రాజును అడిగి, మాంచి మూడంతస్తుల వోడను రప్పించాడు. అది రేవుకు వొచ్చింది. “ఒక అంతస్తును జున్ను ముక్కలతో నింపెయ్‍, రెండో అంతస్తును రొట్టె ముక్కలతో, మూడో దాన్ని వాసన కొట్టే మృత జంతు కళేబరాలతో నింపెయ్” అని చెప్పాడు ముసలాయన.

కుర్రవాడు ఓడ మూడు అంతస్తులను అలాగే నింపేశాడు. “ఇప్పుడు, నీ సహ నావికులను ఎన్నుకొమ్మని రాజు అడిగితే,, నీక్కావలసింది ఒక్కరే అని చెప్పి, నన్ను ఎంపిక చేసుకో” అన్నాడు.

కుర్రాడు అలాగే చేశాడు. విచిత్రమైన సామగ్రితో, ఒకే ఒక్క సహ నావికిడితో, అదీ కాటికి కాళ్లు చాపుకున్న ముసలివాడితో వెళ్తున్న ఓడను వూరికి వూరంతా వొచ్చి విచిత్రంగా చూసింది. .

వాళ్లు ఏకధాటిగా మూడు నెలలు పయనించారు. ఒక రాత్రి దగ్గర్లో వాళ్లకొక రేవుదీప‍ం కనిపించించింది. తీరంలో వాళ్లకు కనిపించిన ఇళ్లు మరీ పొట్టిగా నేలబారుగా వున్నాయి. వాటి మధ్య జనాలు రహస్య రహస్యంగా తిరుగుతున్నారు. వాళ్ల లోంచి ఒక గొంతు అడిగింది. “ఏం సామగ్రి తెచ్చారు?”

“జున్ను ముక్కలు” ముసలి నావికుడు జవాబిచ్చాడు.

“భలే, మాక్కావలసింది అవే” ఆ గొంతు అరిచింది.

అదొక ఎలుకల దీవి. అక్కడ అంతా ఎలుకలే. “సరే, మేం మొత్తం జున్ను ముక్కలన్నీ కొనేస్తున్నాం. వాటికి చెల్లించడానికి మా దగ్గర డబ్బు లేదు. కాని, మీకు ఎప్పుడు అవసరం వొచ్చినా ‘ఎలుకలారా, మా మంచి ఎలకలారా, వొచ్చి మాకు సాయపడండి’ అనండి చాలు” అన్నాయి అవి.

యువకుడు, ముసలాయన ఓడ నిచ్చెన కిందికి దింపారు. ఎలుకలు ఒక్క క్షణంలో వొచ్చి జున్నుముక్కల అంతస్తును ఖాళీ చేసేశాయి.

అక్కడి నుంచి ఓడ మరో దీవికి చేరింది. అది కూడా రాత్రే. రేవులో అసలెవరూ కనపడలేదు. ఇక్కడ పరిస్థితి మునుపటి దీవి కన్న ఘోరం. ఒక్క ఇల్లు లేదు, ఒక్క చెట్టు లేదు. “మీ దగ్గర ఏం వుంది?” అని అడిగింది చీకట్లోంచి ఒక స్వరం.

“రొట్టె ముక్కలు” ముసలాయన జవాబు.

“భలే, మాక్కావలసింది అవే”

అది చీమల దీవి. అక్కడున్న వాళ్లంతా చీమలే. వీళ్ల దగ్గర కూడా డబ్బేం లేదు. “మేము అవసరమైనప్పుడు  ‘చీమలారా, మా మంచి చీమలారా, వొచ్చి సాయపడండి’ అనండి. మేం ఎక్కడున్నా సరే, వొచ్చేసి సాయపడతాం” అని చెప్పారు వాళ్లు.

చీమలు ఓడలో వున్న రొట్టె ముక్కలన్నీ కిందికి దింపేశాయి. ఓడ మళ్లీ బయల్దేరింది.

ఈసారి వాళ్లొక రాతి గుట్టల, కొండల దీవికి వొచ్చారు. “మీరు ఎం తెచ్చారు” అడిగాయి కొండ మీది నుంచి గొంతులు.

“కుళ్లిన జంతు కళేబరాలు”

‘భలె భలే, మాక్కావల్సింది సరిగ్గా అవే.” ఆ మాటతో పాటు ఒక పేద్ద నీడ కొండ మీంచి విసురుగా దిగినట్టయ్యంది.

అది పొంత గద్దల దీవి. అక్కడంతా ఆ ఆకలి గొన్న గద్దలే. ఓడలో వీసమెత్తు పదార్థం మిగ‍ల‍కుండా, కళేబరాలన్నిటినీ అవి మోసుకు పోయాయి. అవి కూడా వాగ్దానం చేశాయి, “గద్దలారా, మా మంచి గద్దలారా, మాకు సాయం రండి” అని తమను పిలవమన్నాయి.

మరి చాల నెలలు పయనించాక, వాళ్లు రాజకుమార్తె బందిగా వున్న దీవిని చేరారు. ఓడ దిగి, ఒక గుహ గుండా నడిచి పోతే, అక్కడొక తోట . తోటలో భవనం. ఒక మరుగుజ్జు వాళ్లకు ఎదురొచ్చాడు. “రాజు కూతురు ఇక్కడ వుందా” అడిగాడు కుర్రవాడు.

“రండి. లోపలికొచ్చి మంత్రగత్తె సబియానాని అడగండి” అన్నాడు మరుగుజ్జు, భవనంలోనికి వాళ్లకు దారి చూపిస్తూ.

భవనంలో నేల సాంతం బంగారం పరిచి వుంది. గోడలేమో స్ఫటికాలతో మెరుస్తున్నాయి.

“రాకుమార్తెను విడిపించడానికి ఎందరో రాజులు, రాకుమారులు సైన్యాలతో వొచ్చారు. అందరూ చచ్చిపోయారు” అంది వీళ్లను చూసి బంగారు, స్ఫటికాలతో చేసిన సింహాసనం మీది నుంచి మంత్రగత్తె సబియానా.

“నా దగ్గర రాజ్యాలూ అవేమీ లేవు, ఉన్నది కేవలం ధైర్యం మాత్రమే” అన్నాడు కుర్రాడు.

“సరే , అయితే నువ్వు కొన్ని పరీక్షలు నెగ్గాలి. ఓడిపోతే, ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్లవు. అదిగో ఆ పర్వతాన్ని దూశావా? అది సూర్యకాంతి ఇక్కడికి చేరకుండా అడ్డగిస్తోంది. దాన్ని నువ్వు నేలమట్టం చేయాలి. రేపుదయం నాగదిలో నేను నిద్ర లేచే సరికి, సూర్యకాంతి సూటిగా నా కళ్లలో పడాలి. సరేనా” అంది మంత్రగత్తె.

మరుగుజ్జు వాడు ఒక పీకాసి కుర్రాడి చేతికిచ్చి, అతన్ని పర్వత పాదం వద్దకు తీసుకెళ్లాడు. కుర్రాడు పీకాసి ఎత్తి ఒక వేటు వేయగానే, దాని మొన ఫట్ మని విరిగిపోయింది. “ఇప్పుడెలా తవ్వేది నేను” అని దిగులుపడ్డాడు. అంతలోనే అతడికి ఎలుకలు గుర్తుకొచ్చాయి. “ఎలుకలారా, మా మంచి ఎలుకలారా, వొచ్చి సాయపడండి” అన్నాడు.

అంతే. పర్వతం పైనుంచి కింది దాక ఎలుకలే ఎలుకలు. అవి కొండని తొలిచాయి, పళ్లతో కొరికాయి, గోళ్లతో రాపాడాయి. పర్వతం కొంచెం కొంచెం చివరికి అంతా కనుమరుగయ్యింది.

మరునాడు ఉదయం మత్రగత్తె నిద్రలేచే సరికి సూర్యకిరణాలు సూటిగా తన కళ్లలోకి ప్రవహించాయి. కుర్రాడిని చూసి, “భలే చేశావోయ్, కాని ఇంతటితో అయిపోలేదు మరి” అంటూ కుర్రవాడిని ఆ భవనం నేలమాళిగల్లోనికి తీసుకెళ్లింది. అక్కడ ఒక పెద్ద గది. దాని పైకప్పు చర్చి గోపురమంత ఎత్తుంది. అందులో బఠానీలు, వుల్లిపాయలు కలగలిసిన పెద్ధ గుట్ట వుంది. ఆ గుట్ట గది పైకప్పును తాకేట్టుంది. “నువ్వు ఈ రాత్రంతా కష్టపడి, బఠానీల్ని, వుల్లిపాయల్ని వేర్వేరు గుట్టలుగా విడదీయాలి. ఒక్క బఠానీ గింజ వుల్లిపాయల్లో కనిపించినా, ఒక్క వుల్లిపాయ ముక్క బఠానీల్లో కనిపించినా ఓడిపోయినట్టే, సరేనా” అని సవాలు విసిరి వెళ్లిపోయింది.

మరుగుజ్జు వాడు అక్కడ ఒక కొవ్వొత్తి మాత్రం వుంచి మంత్రగత్తెతో పాటు వెళ్లిపోయాడు. కొవ్వొత్తి పూర్తిగా కాలే వరకు కుర్రాడు బఠానీలు, వుల్లిపాయల గుట్ట వైపు వెర్రిగా చూస్తూ వుండిపోయాడు. మానవ మాతృడెవడైనా ఈ పని చేయగలడా అని దిగులు పడ్డాడు. ఇంతలో అతడికి చీమల దీవి గుర్తుకొచ్చింది. “చీమలారా, మా మంచి చీమలారా, వొచ్చి సాయపడండి” అన్నాడు.

మాట అతడి నోటి నుంచి బయటికొచ్చిందో లేదో, ఆ గది చీమల బారులతో నిండిపోయింది. అవి సుశిక్షిత సైనికుల్లా గుట్ట మీదికి చేరి రెండు గుంపులుగా విడిపోయాయి. ఒక గుంపు బఠానీలను, ఇంకో గుంపు వుల్లిపాయలను మోసుకెళ్లి రెండు గుట్టలుగా నీటుగా పేర్చాయి.

“అయినా నా పరీక్షలు అయిపోలేదు” అంది రెండో పని కూడా అయిపోయే సరికి మంత్రగత్తె.

“ఇక నీకు చాల క్లిష్టమైన పరీక్ష. ఇప్పుడు బయల్దేరి వెళ్లి రేపు వుదయం లోగా ఒక పీపా నిండా దీర్ఘజీవిత జలం తీసుకురావాలి”

దీర్ఘజీవిత జలం వున్న సరస్సు ఒక నిటారు కొండ శిఖరం మీద వుంటుంది. ఆ కొండ ఎక్కడమే కష్టం. సరస్సు నీళ్ల పీపా ఎత్తుకుని దిగడం ఆయ్యే పని కాదు. ఈసారి కుర్రవాడు ఇంకేం ఆలోచించకుండా “గద్దలారా, మా మంచి గద్దలారా, వొచ్చి సాయపడండి” అనేశాడు.

పొంతగద్దల రాకతో ఆకాశం ఒక్కసారిగా నల్లబడి పోయింది. మన వాడు ఒక్కొక్క గద్ద గొంతుకు ఒక చిన్న బకెట్ కట్టి వొదిలాడు. గద్దలు ఆకాశానికెగిశాయి. పర్వత శిఖరం మీది సరస్సులోంచి దీర్ఘజీవిత జలాల్ని బకెట్లలో నింపుకొచ్చాయి. మన వాడు ఆ చిన్న బకెట్లన్నిటితో పీపా నింపేశాడు.

పీపా పూర్తయ్యే సరికి, దూరంగా గుర్రపు డెక్కల చప్పుడు. అది ఏమిటో కాదు. మంత్రగత్తె సబియానా, తన మరుగుజ్జుతో పాటు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతోంది. వాళ్లలా వెళ్లగానే రాజకుమార్తె బంధనాల నుంచి విముక్తి పొంది, చేతులు బార్లా చాచి, పరిగెత్తుకు వచ్చింది.

కుర్రాడు రాజకుమార్తెను వెంటబెట్టుకుని, దీర్ఘజీవిత జలాల పీపా తీసుకుని ఓడ దగ్గరికి వచ్చాడు. ముసలాయన అక్కడ వీళ్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఓడ ఇంటికి బయలల్దేరింది.

ఇంగ్లాండు రాజు రోజూ ఓడ కోసం టెలిస్కోపుతో సమద్రంలోనికి పారజూస్తూ వుండినాడు. ఇంగ్లీషు జెండా వున్న ఓడ కనబడే సరికి ఆయన ఆనందం కట్టలు తెంచుకుంది. రేవు దగ్గరికి పరిగెత్తాడు. కుర్రాడు రాజకుమార్తెను తీసుకుని హాయిగా తిరిగి వొచ్చే సరికి గజ్జితల వాడికి ఓపిక నశించింది. కుర్రాన్ని ఎలాగైనా చంపేయాలి, లేకుంటే కుదరదు అనుకున్నాడు.

రాకుమార్తె పునరాగమన సందర్భంగా అందరూ వేడుకలు చేసుకుంటున్నారు. ఇద్దరు మనుషులు, అదో రకం చూపులతో కుర్రాడి దగ్గరికి వచ్చి, ఒక జీవన్మరణ సమస్య వుంది రమ్మని పిలుచుకెళ్లారు. నిజానికి వాళ్లు కిరాయి హంతకులు. వాళ్లు కుర్రాడిని అడివి లోనికి తీకుకెళ్లి గొంతు కోసేసి వెళ్లారు.

ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎలాగో కనిపిస్తున్న ఆ యిద్దరితో కలిసి యువకుడు వెళ్లినప్పట్నుంచి, రాజకుమార్తె మ‍నసు మనసులో లేదు. బాగా ఆందోళనకు గురయ్యంది. ఉండబట్టలేక యువకుడి కోసం వెదుకుతూ అడివికి వెళ్లింది. గాయపడి పడివున్న వాడిని చూసింది. ఆమెతో పాటు వచ్చిన ముసలి నావికుడు దీర్ఘజీవిత జలాల పీపాను తనతో పట్టుకొచ్చాడు. యువకుడి శరీరాన్ని ఆ నీళ్లలో ముంచి తీసే సరికి, అతడు మునుపటంత ఆరోగ్యంగా, మునుపటంత అందంగా తయారయిపోయాడు. రాకుమార్తె ఆనందంతో అతడి మెడ చుట్టూ చేతులు వేసింది.

గజ్జితల వాడికి చాల కోపమొచ్చింది.

“ఈ పీపా ఏంటి?” అడిగాడు.

“ఇది మరుగుతున్న నూనె” అన్నాడు ముసలాయన.

గజ్జితల వాడు ఒక పీపా నూనె బాగా మరిగించి, “ నువ్వు నన్ను ప్రేమించకపోతే పొడుచుకు చచ్చిపోతా” అని రాకుమార్తెను బెదిరించి, తనను తాను పొడుచుకుని మరుగుతున్న నూనెలోనికి దూకేశాడు. తక్షణం ఒళ్లంతా కాలిపోయి, చచ్చిపోయాడు. అప్పుడు అతడి విగ్గు చెదిరిపోయింది. అతడి తల నిండా ఎంత గజ్జి వుందో అది కూడా బయటపడిపోయింది.

“ఓహ్, గజ్జితల వాడా?” అని రాజు ఆశ్చర్యపోయాడు. “నా శతృవులందరిలోకీ క్రూరుడు వీడు. తనకు జరగాల్సిన శాస్తి జరిగింది. ఓ వీర యువకుడా, నువ్వే నా దివ్య పుతృడవు. నా కుమార్తను పెళ్లి చేసుకుని, ఈ రాజ్యానికి వారసుడివి కా” అన్నాడు.

అలాగే జరిగింది.

ఇటాలో కాల్వినో/హెచ్చార్కె

ఇటాలో కాల్వినో (1923 అక్టోబర్ 15- 1985 సెప్టెంబర్ 19): జగత్ ప్రసిద్ధ కథా, నవలా రచయిత. తన పేరూ, ఈ పుస్తకం పేరూ సూచిస్తున్నట్లే ఆయన స్వదేశం ఇటలీ. ఆయన స్వయంగా సేకరించి, తన మాటల్లో తిరిగి చెప్పిన కథల పుస్తకం “ఇటాలియన్ ఫోక్ టేల్స్'.

మాకు తెలిసి, ఆయన సొంత కథలు కొన్ని ‘ఈ మాట' వెబ్ పత్రికలో వెలువడ్డాయి.. ఇవి ఆయన సేకరించి తన చక్కని శైలిలో తిరిగి చెప్పిన ఇటాలియన్ జానపద కథలు. వీటిలోని చదివించే శైలి, ప్రగతి శీలం అబ్బురపరుస్తాయి. ఇక ముందు రస్తా సంచికల్లో ఈ కథలు ఇలాగే వరుసగా...

1 comment

  • పిల్లలు, పెద్దవాళ్ళు.. చదువుకోవచ్చు.. ఇలాంటి stories.. బాగుంటాయి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.